జీన్ లూక్ గోదార్డు స్మృతికి నివాళి
[dropcap]ఫ్రా[/dropcap]న్సు దేశపు న్యూ వేవ్ సినిమా ఉద్యమ సారథి జీన్ లూక్ గోదార్డు 91వ ఏట మరణించాడనే వార్త వినగానే నెల్లూరులో మా ఫిల్మ్ సొసైటీ ప్రొఫిల్మ్ గోదార్డ్, ట్రూఫో వంటి న్యూ వేవ్ సినిమా దర్శకుల సినిమాలు ప్రదర్శించడం, ఆనాటి మా ఉత్సాహం అన్నీ మనసులో మెదిలాయి. 45 సంవత్సరాల క్రితం ఎప్పుడో మేము ప్రదర్శించిన వీకెండ్ సినిమా దృశ్యాలు కొన్ని కళ్ల ముందు నిలిచాయి.
గోదార్డ్ హాలీవుడ్ సినిమాల మీద తిరుగుబాటుగా, న్యూ వేవ్ ఉద్యమ సినిమాలు తీశాడు. అప్పటిదాకా అనగనగా ఒక రాజు అంటూ వరుస క్రమంలో కథ చెప్పే విధానాన్ని తిరస్కరించి, కొత్త కథనాన్ని చేపట్టాడు. కథకు ఒక ఆరంభం, నడిమి భాగం, ముగింపు తప్పనిసరిగా ఉండాలి, నిజమే గాని ఆ వరుసలోనే ఉండనక్కరలేదంటాడు గోదార్డ్.
యూరప్ సినిమా రంగంలో జర్మన్ ఎక్స్‌ప్రెషనిజం, ఇటాలియన్ నియోరియలిజం తర్వాత వచ్చిన నవ్య ధోరణి ఫ్రెంచి దేశపు న్యూ వేవ్ సినిమా ఉద్యమం. గోదార్డ్ మొదట్లో అమెరికా – హాలీవుడ్ గేంగ్‌స్టర్ సినిమాలు, ఆల్ఫ్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాలు అంటే పడి చచ్చేవాడు. అతనికి రెండు దేశాల పౌరసత్వం ఉంది. 1930లో ఫ్రాన్సులో జన్మించినా, స్విస్ దేశంలో పెరిగాడు, తల్లి స్విస్ దేశపు బ్యాంకర్ల కుటుంబానికి చెందినది కావడం వల్ల. పేరిస్ లోని Sorbonne విశ్వవిద్యాలయంలో ethnology లో చేరి కోర్సు పూర్తి చెయ్యకుండానే మధ్యలోనే ఆ చదువు మానుకొని పేరిస్ ఫిల్మ్ క్లబ్‍లో సభ్యుడై వివరీతంగా సినిమాలు చూచి, సినిమా కళ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1960లో తను తీసిన బ్రెత్‍లెస్ అఖండ విజయాన్ని సాధించి, న్యూ వేవ్ సినిమా ఉద్యమానికి బాటలు వేసింది. 1960-80 మధ్య, గోదార్డ్, ట్రూఫో (François Truffaut), Claude Chabrol, Jacques Rivette, Éric Rohmer వంటి ఫ్రెంచి యువ దర్శకులు గోదార్డుతో పాటు గొప్ప న్యూ వేవ్ ఉద్యమ సినిమాలు తీసి ప్రపంచ సినిమా చరిత్రలో శాశ్వత కీర్తి నార్జించారు.
గోదార్డ్ మొదటి సినిమాకు పెట్టుబడి కూడా అంతంత మాత్రమే. అధికారుల అనుజ్ఞలు, పర్మిషన్లు లేకుండానే వీధుల్లో కెమెరా చేతుల్లో పట్టుకొనే దృశ్యాలు చిత్రీకరించాడు. ట్రాలీ షాట్‍లు తీయవలసినపుడు సూపర్ బజార్‍లలో సరుకు తీసుకువెళ్ళే బండినే ఉపయోగించాల్సి వచ్చింది. తరచు అప్పటికప్పుడు స్ఫురించిన improvised పద్ధతులు అనుసరించడం కూడా ఈ ధోరణి సినిమాలలో సాధారణం. బ్రెత్‌లెస్‍లో దృశ్యాలు అపార్ట్‌మెంట్లలో, ప్యారిస్ వీధుల్లో చిత్రీకరించాడు. తను, తన సినిమాలో పని చేసే మిత్రులు సినిమా నిర్మాణంలో అనేక విధులు, బాధ్యతలు పైన వేసుకుని సహకరించేవారు. సత్యజిత్ రే తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’ సినిమా కూడా ఇలాగే తీశారు – ఈ ధోరణి సినిమా కాకపోయినా.
గోదార్డు తన ముందు వారి పద్ధతులను అనుసరించలేదు. సినిమా కళ శక్తి, బలహీనత రెండూ తెలిసిన వ్యక్తి గోదార్డ్. “Photography is truth. And cinema is truth twenty four times per second.” అని గోదార్డ్ అనేవాడు. ఏ సినిమాకైనా కర్త (Captain) డైరక్టర్ అని ఘంటాపథంగా అన్నాడు. గోదార్డ్ సినిమా ఎడిటింగ్ పద్ధతుల్లో వినూత్న విధానాలు ప్రవేశపెట్టాడు – జంప్‍కట్ వంటివి.
గోదార్డ్ స్విస్‍లో పెరిగినా, స్విస్ దేశపు సినిమా సంప్రదాయాలతో విభేదించి, radical new wave మార్గానికి దారి వేశాడు. తల్లి ధనవంతురాలైనా, అతని ప్రయోగాలకు సహకరించక పోవడంతో 1954లో ఒక నిర్మాణ సంస్థ స్విట్జర్లాండ్‌లో నిర్మిస్తున్న ఆనకట్ట నిర్మాణ పురోగతిని సెల్యూలాయిడ్ మీద రికార్డు చెయ్యడానికి గోదార్డ్ సేవలను స్వీకరించింది. అదే అతని తొలి డాక్యుమెంటరీ.
1960లో గోదార్డుకు కథాచిత్రం తీసే అవకాశం వచ్చింది. అప్పటికే తను ప్రాన్సుకు వెళ్ళి స్థిరపడ్డాడు. 1960లో నిర్మించిన బ్రెత్‌లెస్ అనూహ్యమైన విజయం సాధించింది. పాతికేళ్ళ యువకుడు మైకేల్ ఏదో నేరం చేసి పారిపోతూ హత్య కూడా చేయవలసి వస్తుంది. పోలీసులకు చిక్కకుండా పారిపోయే అతను ఒక అమెరికన్ యువతి ప్రేమలో చిక్కుకుని ఇబ్బందులు పడడమే కథాంశం. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న అతన్ని అమెరికన్ యువతి పాట్రికా అమాయకంగా తన అపార్టుమెంట్‍లో దాచుతుంది. ఆమె కూడా పేరిస్ వీధుల్లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అమ్మి ఎలాగో జీవిస్తూ ఉంటుంది. అతను ఆమెతో ప్రేమ వ్యవహారంతో పాటు ఇద్దరూ ఇటలీకి పారిపోయే పథకాలు వేస్తుంటాడు. తను అతని బిడ్డను గర్భంలో మోస్తున్నట్లు అతనికి చెప్పి, పోలీసులకు అతన్ని పట్టిస్తుంది. అతను జైలు శిక్షకు సిద్ధమవుతాడు. తప్పించుకొని పోయే ప్రయత్నంలో పోలీసుల కాల్పుల్లో ‘breathless’ అయిపోతాడు. చనిపోతూ అతను పాట్రికాతో అన్న మాటను విమర్శకులు రకరకాలుగా వ్యాఖ్యానించారు. Jeen Paul Belmondo మైకేల్ పాత్ర ధరించి పేరు పొందారు. ఈ సినిమాను దర్శకుడు స్టూడియో సెట్లు ఏవీ లేకుండా వీధుల్లో తీశాడంటారు.
బ్రెత్‌లెస్, మై లైఫ్ టు లివ్ – సినిమాల గురించి మరికొంత
1960లో గోదార్డ్ బ్రెత్‍లెస్ సినిమాతో అంతర్జాతీయ సినిమా రంగంలో తన ఉనికిని ప్రకటించుకొన్నాడు. హాలీవుడ్ నటి Jean Seberg పాట్రికా పాత్రలో మొదటిసారిగా తెర మీద కనిపిస్తుంది. ప్యారిస్ వీధుల్లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అమ్ముతూ బతుకుతున్న తన కలలు, ఆశలు తనకుంటాయి. మైకేల్ అనే యువ నేరస్థుడితో పాట్రికా కొద్దికాలం ప్రేమలో పడుతుంది. ఆనాటి ఫ్రాన్సు దేశపు ఆర్థిక సంక్షోభం, ఆ సమాజంలో హాయిగా జీవించాలని కోరుకొనే యువతకు ఎదురయ్యే కష్టాలు గోదార్డ్ ఈ సినిమాలో అద్భుతంగా చూపిస్తాడు. పాట్రికా తన ప్రియుడితో తాను నవలా రచయిత్రిని కావాలని కోరుకుంటున్నట్లు అంటూ Faulkner రచన నుంచి ఆమె కొన్ని వాక్యాలు – మైకేల్‌తో సంభాషణలో అంటుంది. “Faulkner knows her more than her lover” అని విమర్శకులు ప్రశంసిస్తారు.
బ్రెత్‍లెస్ సినిమాలో గోదార్డ్ రెండో ప్రపంచ యుద్ధానంతర సమాజంలో ప్రేమను గురించి, లోతుగా అన్వేషిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో సాంస్కృతిక రంగంలో నెలకొన్న జాడ్యాలతో గోదార్డ్ రాజీ పడలేడు. ‘జంప్‍కట్స్’ అనే ఎడిటింగ్ విధానం ద్వారా అసంబద్ధంగా అనిపించే దృశ్యాలు, ఏదో అవాస్తవ జగత్తుల్గా భ్రమ కలిగిస్తాయి.
గోదార్డ్ మరో సినిమా Vivre sa Viva (అంటే నీవు చెప్పేది!). ఇందులో ప్రధాన పాత్ర నానా పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతుంది. నానా బతుకుదెరువు కోసం వేశ్యగా మారుతుంది, కాని ఆమెకు మరో దారి లేని స్థితిలో.
మనుషుల మాటల్లో అర్థమేమిటో అని సందేహం తనకు. మాటలకు, వాటిలోని సత్యానికి మధ్య వైరుధ్యం. ఆధునిక సమాజంలో భాష, సంభాషణల్లోని విచిత్ర స్వభావాన్ని గోదార్డ్ నానా పాత్ర మాధ్యమం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నానాకు, ఒక తాత్వికుడికి మధ్య జరిగిన సంభాషణలో తాత్వికుడు ఆమెను గురించి – ఆమె భావాలను గ్రహించిన దానికన్నా, నానా ఆ వేదాంతి గురించి బాగా తెలుసుకోగలుగుతుంది. కారణం ఆమె అనుభవించిన జీవితం, ఆమె జీవితంలోకి వచ్చిన వ్యక్తులు. భావాలను గ్రహించడానికి జీవితం కన్నా గొప్ప గురువెవరూ లేరని గోదార్డ్ Vivre sa Viva (ఆంగ్లంలో ‘మై లైఫ్ టు లివ్’) లో ప్రతిపాదించాడు. గోదార్డ్ సినిమాల్లో తరచూ గొప్ప రచనల నుంచి పేజీలు పేజీలు చదివి వినిపించడం ఒక లక్షణం.
దృశ్య ప్రాధాన్యాన్ని తగ్గించి, ధ్వని ప్రాధాన్యాన్ని ప్రధానం చేసే క్రమం కూడా ఇందులో కనిపిస్తుంది.
***
1971లో గోదార్డు మోటార్ సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ తర్వాత సినిమా విమర్శలు కొంత కాలం రాశాడు. ప్రమాదం జరిగిన తర్వాత తన సినిమాకు ఫొటోగ్రాఫర్‍గా చేసిన ఆని మేరితో కొంతకాలం సహజీవనం సాగించాడు. దంపతులు ఒక వీడియో స్టూడియో ఏర్పాటు చేసుకుని కొంతకాలం జరిపారు. తర్వాత ఇద్దరూ స్వీడన్ వెళ్ళారు. 1980వ దశకంలో గోదార్డ్ ప్రపంచ సినిమా చరిత్రను 8 భాగాలుగా నిర్మించి విమర్శకుల గౌరవానికి పాత్రుడయ్యాడు. 1988కి ఈ ప్రాజెక్టు ముగిసింది. గోదార్డు మల్టీమీడియా కళాకారుడిగా, ఆ రంగంలో మార్గదర్శిగా పేరు తెచ్చుకొన్నాడు. గోదార్డు మేధావే గాని అందరి కన్నా విభిన్నంగా వ్యవహరించేవాడు. హాలీవుడ్ చిత్రాలను తీవ్రంగా విమర్శించేవాడు. 2010లో గౌరవ ఆస్కార్ పురస్కారం అతనికి ఇచ్చినా, పురస్కారాన్ని అందుకోకుండా స్వీడన్‍లోనే ఉండిపోయాడు.
గోదార్డ్ వామపక్ష భావాలు, పాలస్తీనా ప్రజల కష్టాల పట్ల సానుభూతిని ఇజ్రేల్ ప్రజలకు వ్యతిరేకి అని యాంటి-సెమెటిక్ అని ముద్ర పడింది కాని అది వాస్తవం కాదు. 1970లలో ఫ్రాన్సు దేశంలో కొనసాగిన విద్యార్థి ఉద్యమాల ప్రభావం గోదార్డ్ సినిమాలలో తరచూ కనిపిస్తుంది.
సంప్రదాయ సినిమా పద్ధతులను తిరస్కరించి, కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాడు గోదార్డు. సినిమా దృశ్య ప్రభావం, సంభాషణ అప్రధానం తరచూ. తరచూ దృశ్యాలు మారిపోతాయి. కానీ వీకెండ్‌లో ప్రధాన పాత్రల ముఖాలు చీకటిలో స్పష్టాతిస్పష్టంగా కన్పిస్తుంటాయి. వారి సంభాషణ పది నిమిషాలు సాగుతుంది. పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. అస్తిత్వవాద ప్రభావమున్న వ్యక్తులు. చాలా భాగం అతని సినిమాలలో రాజకీయాల స్పర్శ, ప్రస్తావనలు, అనార్కిస్టు భావాలు, శృంగారం కాని శృంగార దృశ్యాలు, హింస ఉంటుంది. 1968లో Claude Lelouch అనే సినిమా దర్శకునితో కలిసి అసమ్మతివాదులైన కార్మికుల సహాయ సహాకారాలలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనీయకుండా రద్దు చేయించాడు. ఆ ఏడే గోదార్డు మార్క్సిజాన్ని ఆమోదించి Marxist Cinema Collective సంస్థను ఏర్పాటు చేసి అరడజను సినిమాలు తీశాడు. 1970లో ఈ సంస్థ రద్దయిపోయింది.
సినిమా కళ శక్తి, బలహీనతా అన్నీ బాగా తెలిసిన దర్శకుడు గోదార్డు. న్యూ వేవ్ సినిమా ఉద్యమం 1960 దశాబ్దంలో సినిమా కళ మీద గొప్ప ప్రభావం చూపింది. ఈ కాలంలో 16 సినిమాలు తీశాడు. 1968లో నిర్మించిన One Plus One చాలా పేరు తెచ్చుకొంది. ఈ సినిమాలలో ఆనాటి సామాజిక, సాంఘిక విషయాలను సవిమర్శకంగా ప్రదర్శించాడు. గోదార్డ్ విభిన్నమైన అంశాల మీద సినిమాలు తీశాడు, కొన్ని లఘు చిత్రాలు, కొన్ని డాక్యుమెంటరీలు, కొన్ని పూర్తి నిడివి కథా చిత్రాలు. అతని చివరి సినిమా Adieu au Language (2014)కు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ పురస్కారం లభించింది.
గోదార్డ్ మొన్న సెప్టెంబరు 13న స్విట్జర్లాండులో 91వ ఏట కాలధర్మం చెందాడు. కాని అతను సినిమా కళకు చేసిన దోహదం చరిత్రలో నిలిచిపోతుంది.
(September 14, Frontline పత్రికకు కృతజ్ఞతలతో).
Photos Courtesy: Internet
(మళ్ళీ కలుద్దాం)