విపత్కర పరిస్థితిలోనూ కర్తవ్యాన్ని నిర్వహించిన త్యాగమయి శ్రీమతి తారా రాణి శ్రీవాస్తవ

13
3

[dropcap]మ[/dropcap]న దేశ స్వాతంత్ర్య పోరాటం పేద, ధనిక. గ్రామీణ, పట్టణ స్త్రీ పురుష బేధాలు లేకుండా జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల నుండి సామాన్య ప్రజలు, అక్షరజ్ఞానం లేనివారు కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తినడానికి పూట గడవని కుటుంబాలు కూడా పోరాటం చేశాయి. చిన్న చిన్న సమూహాలు కలసికట్టుగా కదం తొక్కాయి. ఉద్యమించాయి. ప్రాణత్యాగం చేశాయి. ఆ సమూహాల నాయకుల నాయకత్వం అద్భుతం. తమ సంఘాలను నిర్భయంగా ముందుకు నడిపించారు. నాయకులు మరణించినా వారి భార్యలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అలా నడిపిన ఒక గ్రామీణ నాయకురాలిని గురించి తెలుసుకోవాలి. ఆమే శ్రీమతి తారా రాణి శ్రీవాస్తవ.

ఈమె బీహార్ (నాటి బెంగాల్ ప్రావిన్స్) లోని సరన్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కష్టపడి బతికే కుటుంబం వారిది.

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గాందీజీ 1936లో ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’లో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన “మనం అబల అని పిలుచుకునే స్త్రీ సబలగా మారినప్పుడు నిస్సహాయంగా ఉన్న వారందరూ శక్తివంతులు అవుతారు” అన్నారు. ఈ మాటలు ఆయనకు మహిళల శక్తి సామర్థ్యాల పట్ల, స్వాతంత్ర్యోద్యమంలో వారి పాత్ర పట్ల గల నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఈ పోరాటంలో మహిళల ప్రాతినిధ్యం ఎనలేనిది.

బాపూజీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలలోను పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయ స్త్రీలు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలో బొంబాయి నగరంలో జాతీయోద్యమ పతాకాన్ని ఆవిష్కరించిన అరుణా అసఫాలీ, రహస్య రేడియోని నడిపిన ఉషా మెహతా వంటి విద్యావంతులే కాదు, ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన సామాన్య మహిళలు చాలా మంది ఉన్నారు. వీరు తమ కుటుంబీకులను పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగం చేసినా మడమ తిప్పని నారీమణులున్నారు. చాలా మంది గురించి ప్రజలకు తెలియదు.

ఇక ఇప్పుడు మన పోరాటయోధురాలు, ధైర్యవంతురాలు శ్రీమతి తారా రాణి పోరాటాన్ని గమనిస్తే..!

ఆమెకి పదమూడేళ్ళ వయస్సు లోనే ఫూలేందుబాబుతో వివాహం జరిగింది. సివాన్‌కు చెందిన ఫూలేందుబాబు గారిది స్వాతంత్ర్య పోరాటయోధుల కుటుంబం గాంధీ మార్గాన్ని అనుసరించి సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు.

తమ ఊరి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వద్దకు వెళ్ళి సమావేశాలు ఏర్పాటు చేసి దేశానికి స్వాతంత్ర్యం రావలసిన అవసరాన్ని వివరించేవారు. వివాహమయిన తరువాత భార్య తారతో కలసి సమావేశాలలో ప్రసంగించేవారు. తార మహిళలను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడేవారు. ఉద్యమాలలో పాల్గొనేట్లుగా ప్రోత్సహించేవారు. నిరసన ప్రదర్శనలలో పాల్గొనమని ఈ విధంగా తమ ఐకమత్యాన్ని బ్రిటీష్ వారికి తెలియజేయొచ్చనేవారు. ఫూలేందు భార్యని ప్రోత్సహించి ఉద్యమ నాయకురాలిలా తయారు చేశారు.

ఈ దంపతుల ఉత్సాహం, మాటతీరు, స్నేహంతో మెలుగుతూ కర్తవ్యాన్ని బోధించడం ఆయా ప్రాంతాల ప్రజలను పోరాట పథం వైపు పయనించేట్లు చేశాయి.

1942 ఆగష్టులో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించారు. ప్రముఖ జాతీయ నాయకులు అందరినీ అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. మహిళా నాయకులు, స్థానిక స్థాయి నాయకులు ఉద్యమాన్ని నడిపారు. గాంధీజీ ఈ ఉద్యమం సందర్భంలో ‘DO OR DIE’ (చేయి లేదా చావు) అనే నినాదాన్ని అందించారు.

ఈ నినాదాన్ని అంది పుచ్చుకున్నారు. తారా రాణి దంపతులు, 1942 ఆగష్టు 12 వ తేదీన తమ ప్రాంత ప్రజలతో పెద్ద ప్రదర్శనను నిర్వహించారు.

వీరందరూ కలసి సివాన్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ జెండాని ఆవిష్కరించడం కోసం బయలుదేరారు. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కానీ అదుపు చేయలేక పోయారు. భారీ ఎత్తున లారీఛార్జి జరిపారు. అయినా ఫలితం లేదు. ఎవరూ వెనుదిరగడం లేదు. ఈ భారీ ప్రదర్శనను ఆపడం కోసం పోలీసులు కాల్పులు జరిపారు.

ప్రదర్శనకు నాయకత్వం వహించి ముందు వరుసలో నిలబడ్డారు తారా రాణి, ఫూలేందుబాబు దంపతులు. వారిచ్చే నినాదాలకు ప్రతినినాదం చేస్తున్నారు నిరసనకారులు.

ఈ సమయంలో జరిగిన పోలీసుల కాల్పులలో ముందుగా ఫూలేందుబాబు గాయపడ్డాడు. బుల్లెట్లు అతని శరీరంలోకి చొచ్చుకు పోయి నేలమీద పడిపోయాడు. భర్త బుల్లెట్లు గాయాలతో నేలకొరిగినా తారా రాణి భయపడలేదు. తన చీరను చింపి భర్త గాయాలకు కట్టు కట్టింది.

తను వెనుకంజ వేస్తే ప్రదర్శన మొత్తం ఆగిపోతుంది. తనే ధైర్యంగా లేకపోతే ఎలా అని యోచించారు ఆమె. ధైర్యాన్ని కూడదీసుకుని జాతీయ పతాకాన్నందుకుని పోలీసు స్టేషన్‍కి ప్రదర్శనను కొనసాగించారు. పోలీసు స్టేషన్‌లో పతాకాన్ని ఎగరేసి, ప్రదర్శనను ముగించి తిరిగి వచ్చేసరికి భర్త మరణించారు. ఆమె బాధ పడ్డారు కాని క్రుంగిపోలేదు. తమ ఆశయం స్వాతంత్ర్య సాధనే అన్న విషయాన్ని ఆమె మరచిపోలేదు. ఆశయం నెరవేరేవరకు పోరాటం కొనసాగించాలని ధృఢంగా నిశ్చయించుకున్నారు.

ఫూలేందుబాబు ప్రాణత్యాగానికి నివాళి అర్పించేటందుకు 1942 ఆగష్టు 15వ తేదీన ఛప్రాలో ప్రార్థనా సమావేశం జరిగింది. వందలాది మంది అనుచరులు పాల్గొని నివాళిని అర్పించారు. ఫూలేందుబాబు పట్ల తమ అభిమానాన్ని చాటారు.

అప్పటి ఆచారాల ప్రకారం ఒక పదమూడేళ్ళ బాల వితంతువు భయంకర మూఢాచారాలు, సంప్రదాయాలు, కష్టాలకు బలి అయ్యే పరిస్థితులు ఉండేవి, నాలుగు గోడల మధ్య బందీగా ఉండే పరిస్థితులు అయినా ఆమె వాటిల్లో కూరుకుపోయి కునారిల్లలేదు. ధైర్యంతో బయటకు వచ్చి స్వాతంత్ర్యం వచ్చేవరకు జరిగిన పోరాటాలలో పాల్గొన్నారు.

బాపూజీ తొలి సత్యాగ్రహం బీహార్ లోని చంపారన్‌లో మొదలయిన విషయం మనకి తెలిసిందే! అందువల్లనే బీహార్ ప్రాంతీయులు గాంధీ మార్గాన్ని అనుసరించడంలో ముందున్నారనడానికి తారా రాణి దంపతుల త్యాగం ఒక ఉదాహరణ.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొంతమంది పోరాట యోధులను గురించి విస్తృత ప్రచారం జరిగింది. వారిని కొనియాడారు. పాఠ్యాంశాలలో ప్రాధాన్యతను కల్పించారు. కాని తారా రాణి శ్రీవాస్తవ వంటి త్యాగశీలురను గురించి ప్రజలకు తెలియజేయలేదు. ఇటువంటి జాతీయ పోరాట నారీమణులను గురించి తెలియజేయవలసిన అవసరం చాలా ఉంది.

13-10-2021 న విడుదలయిన ప్రత్యేక తపాలా కవర్

ఈమె జ్ఞాపకార్థం 13-10-2021వ తేదీన ఒక ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. కవర్ మీద, క్యాన్సిలేషన్ ముద్రలో కూడా జాతీయపతాకాన్ని చేతపట్టుకున్న తారా రాణి కనిపిస్తారు. ఆగష్టు 12వ తేదీన ఆమె భర్త ఫూలేందుబాబు ప్రాణత్యాగానికి 80 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here