హాస్యరంజని-1

4
4

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

1. కవితా బాణాలు

అవినాష్: వీడెవడయ్యా? అందరి మీదా కాగితాల బాణాలు వేస్తున్నాడు?

కుమార్: అతనొక కవి. తన కవిత్వాన్ని సమాజంపై సంధించమని మొన్ననే వాళ్ళ గురువు చెప్పాడట!

2. వెర్రిగా పిచ్చిగా

అనూరాధ: ఆవిడ పేరు పోపుల పాపాయమ్మ అంటున్నావు కదా! వాళ్ళింటి పేరు పోపులా ఏంటి?

జయశ్రీ: ఆవిడ పోపు పెట్టిందంటే ఈ వీధిలో వాళ్ళంతా, ఘాటుతో వెర్రిగా, పిచ్చిగా తుమ్ముతుంటారులే!

3. లైపో

కమల్: నీకు ఈ మధ్యన ‘లైపో’ ఎక్కువైయ్యిందిరా!

శ్రవణ్: అసలు లైపో అంటే ఏంటిరా?

కమల్: లైపో అంటే కొవ్వు అని అర్థం. తెలిసిందా.

శ్రవణ్: ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందిరా.

కమల్: ఏమర్థమైయ్యింది?

శ్రవణ్: నాకు కాదు గానీ, నీకే కొవ్వు ఎక్కువైయ్యిందని!

4. లేబర్ పెయిన్స్

డాక్టర్: అసలు లేబర్ పెయిన్స్ అంటే ఏమిటో నీకు తెలుసా?

కాంపౌండర్: నాకు తెలుసులే సార్!

డాక్టర్: మరి చెప్పవయ్య.

కాంపౌండర్: లేబర్‍కి కడుపులో పెయిన్స్ వస్తాయి డాక్టర్! వాటినే లేబర్ పెయిన్స్ అంటారు.

5. తడకల నివాస్

రాజేందర్: అదేమిటి? ఆయన చాలా గొప్పవాడు కదా! అలా తడకలతో ఇల్లు కట్టాడేమిటి?

సురేందర్: తప్పుల తడకలతోనే తను గొప్పవాడైనానని సమాజానికి చెప్పడానికేనట!

6. గొర్రె-కసాయి

మూర్తి: గొర్రె కసాయినే నమ్ముతుంది అని నీవు ఎలా చెప్పగలవ్?

రాము: ఈ మాత్రం దానికి ఋజువులు కావాలా! నేను మా ఆవిడ చెప్పిన మాటలు చచ్చినట్లు వింటూనే వున్నానుగా!

7. చెకింగ్

పోలీస్: (చెకింగ్‍లో) మీ హ్యాండ్ బాగ్‍లో వల పెట్టుకొని తిరుగుతున్నారెందుకు?

మాధవి: అందమైన అబ్బాయిని వల్లో వేసుకుందామని!

8. కాలర్

ఆది: నువ్వు ఎక్కువగా కాలర్ లేని చొక్కాలే వేసుకుంటున్నావేమిటీ? ఇది కొత్త ఫ్యాషనా?

హరి: అప్పిచ్చిన వాళ్ళు కాలర్ పట్టుకుని మరీ వసూలు చేస్తామంటున్నారు, అందుకనే!

9. డోళ్లు – గోల్డ్

గురువు: శిష్యా! ఆధునిక స్త్రీ పురుషులను చమత్కారంగా నిర్వచించుము.

శిష్యుడు: ఆ‘డోళ్లు’ – మ‘గోల్డ్’.

10. అమీ తుమీ

యాంకర్: మీరు తీయబోయే సంచలనాత్మక సినిమా పేరు ఏమిటి?

డైరక్టర్: అమీ తుమీ – బాహా బాహీ

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here