జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-11

0
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

షష్ఠి గ్రామ సహస్రేషు స్వామ్యం దాతుమివాత్ర సః।
తావత్సంఖ్య సహస్రాణి స్వసైన్యే సాదినోవహత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 143)

[dropcap]అ[/dropcap]ల్లకల్లోలంగా ఉన్న కశ్మీరంలో సూహదేవుడు ఓ స్థాయి శాంతిభద్రతలను నెలకొల్పాడు. సుస్థిరతను కాస్తయినా సాధించగలిగాడు. ఇంతలో ‘దుల్చా’ అనే వాడు అరవై వేల సైనికులతో కశ్మీరులోని గ్రామాలన్నిటినీ తన సైన్యపరం చేసేందుకన్నట్టు దాడికి వచ్చాడు. కశ్మీరు చరిత్రను నిర్ణయాత్మకమైన రీతిలో ప్రభావితం చేసింది ‘దుల్చా’ దాడి.

‘దుల్చా’ను తర్కిస్తాన్ నుంచి వచ్చిన తర్తార్ నాయకుడిగా భావిస్తారు. ఆ కాలంలో తుర్కిస్తాన్ పై చెంగిజ్‍ఖాన్ కొడుకు ‘చుగ్తాయ్’ రాజ్యం చేస్తుండేవాడు. అరవై వేల సైన్యంతో దండయాత్రకు బయలుదేరాడు ‘దుల్చా’. ఈయన సైన్యంలో మంగోలులు, తార్తారులు ఉండేవారు. ఇక్కడ మనం ఆగి, ఎవరీ మంగోలులు? ఎందుకని వీరు భారత్ పైకి దాడికి వచ్చారన్న విషయాలను చర్చించాల్సి ఉంటుంది. ఇందువల్ల ఆ కాలంలోని రాజకీయాలు తెలుస్తాయి. కశ్మీరు భవిష్యత్తును ప్రభావితం చేసిన పరిస్థితులు ఎలా ఆరంభమయ్యాయో, అవి ఏ రీతిలో కశ్మీరును ప్రభావితం చేశాయో సందేహాలు లేకుండా బోధపడతాయి.

మంగోలులను హూణ జాతికి చెందినవారిగా భావిస్తారు. చైనా, సైబీరియాల నడుమ ఉన్న పర్వత ప్రాంతాలకు చెందిన వారిగా పరిగణిస్తారు. వీరు పొట్టిగా, దిట్టంగా ఉంటారు. వారి నివాస స్థలంలో వాతావరణం విపరీతమైనది. పర్వత ప్రాంతం కావడంతో వ్యవసాయం కుదరదు. దాంతో బంజారాల్లా, పశువుల కాపరులుగా జీవితం వెళ్ళదీసేవారు. కొంత కాలానికి వీరు క్రూరులుగా, కర్కశమైన వీరులుగా ఎదిగారు. ఇతర ప్రాంతాలపై దాడులు చేయటం ప్రారంభించారు. అలా ప్రయాణాలు చేస్తూ, దాడులు చేస్తూ ఇతర ప్రాంతాలను గెలుచుకోవటం, దోచుకోవటం ఆరంభించారు. క్రీ.శ. రెండవ శతాబ్దాని కల్లా వీరు ‘అత్తిల్లా’ నేతృత్వంలో రోమన్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించారు. ఇతడిని రోమన్లు ‘The Scourge of God’, దేవుని శాపంగా, దేవుని కోప ఫలితంగా భావించారు. ఇంతటి క్రూరులు మంగోలులు. వీరి పేరు చెబితేనే ప్రపంచం గడగడలాడేది.

వీరిలోనే ‘దున్‌హు’, ‘మియుంగ్ ను’ అనే తెగల వారు చైనాపై దాడులు చేశారు. వీరి దాడులను నివారించేందుకే చైనా వారు ‘The Great Wall of China’ ను నిర్మించారు. అయితే, కొంత కాలానికి అంతఃకలహాల వల్ల వీరి సామ్రాజ్యం ముక్కలైపోయింది. క్రీ.శ. 6, 7 శతాబ్దాలలో, ఈ చిన్న సామ్రాజ్యాలను కలిపి పెద్ద రాజ్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. చైనాలో ‘సూ’ వంశం పాలన ‘టాంగ్’ వంశ పాలనకు దారి సుగమం చేసింది. చైనా వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. దాంతో మధ్య ఆసియాపై ఆధిక్యం కోసం ఆ కాలంలో పలు దేశాలు పోటీ పడ్డాయి. చైనా, తుర్కిస్తాన్, టిబెట్, బాల్టిస్తాన్, లదక్, కశ్మీరు, నేపాల్ వంటి రాజ్యాల నడుమ ఆధిక్యం కోసం పోరు జరిగింది. టిబెట్‌కి చెందిన ‘సోంగ్-బెంగ్-గమ్-పో’ తిబ్బెత్తును శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇస్లాం ఆవిర్భావం ఈ పోరాటాల తీరును సంపూర్ణంగా రూపాంతరం చెందించింది. ఇస్లామీయులు సింధునది ప్రాంతాలను గెలుచుకోవటంతో పరిస్థితి జటలమయింది. మధ్య ఆసియాపై ఆధిక్యం కోసం వివిధ రాజ్యాల నడుమ జరుగుతున్న ఈ పోరాటంలో కశ్మీరు కూడా చురుకుగా పాల్గొంది. అరబ్బులకు వ్యతిరేకంగా, చైనాతో చేతులు కలిపి కశ్మీరు రాజులు పోరాడేరు. చైనీయులతో కలసి టిబెటన్ సామ్రాజ్య దూకుడుకు కళ్ళెం వేశారు. కానీ అరబ్బులు చైనీయులను ఓడించటంతో శక్తిపుంజుకునే వీలు టిబెటన్లకు చిక్కింది. విజృంభించిన టిబెట్ రాజ్యం తుర్కిస్తాన్‍ను గెలవటమే కాదు, చైనాను కాళ్ళ బేరానికి తెచ్చి శాంతి ఒప్పందం చేసుకుంది కూడా. ఇతర రాజ్యాలను గెలవటంలో తమ పురోగతికి టిబెటన్లు అడ్డుగా ఉన్నారని గ్రహించిన ‘ఖలీఫా’, చైనీయులతో చేతులు కలిపి, తుర్కిస్తాన్ నుంచి టిబెటన్లను తరిమికొట్టాడు. కొన్నాళ్ళకు చైనా, టిబెట్టు రాజ్యాలు అధికారం కోసం పోరాడిన ప్రాంతాలన్నీ చిన్న చిన్న రాజ్యాలుగా విభాజితమయ్యాయి. ఇంతలో మంగోలులను చెంగీజ్ ఖాన్ ఒక్కటి చేసి మంగోలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ‘చెంగీజ్ ఖాన్’ ఇండస్ నది దాటి రాలేదు కాని, అతని సైనికులు కొందరు దేశంలోకి చొచ్చుకువచ్చారు. లాహోర్, ముల్తాన్, పంజాబ్‍లను గెలిచారు. వారి పురోగతిని బాల్బన్ అడ్డుకున్నాడు. మళ్ళీ జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుగా ఉన్నప్పుడు మంగోలులు దాడికి వచ్చారు. పంజాబ్‍ను సర్వనాశనం చేసి, ఢిల్లీని ముట్టడించారు. అయితే ఆ సమయంలో అఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్ ప్రాంతంలో ఉన్న చెంగీజ్ ఖాన్ మనవడు ఈ సైన్యాన్ని తనకు సహాయానికి వెనక్కి పిలిచాడు. ఆ సమయంలో కొందరు మంగోలులు కశ్మీరు వచ్చారు. కానీ దాడులు చేయలేదు. మంగోలులకు కశ్మీరు గురించి తెలుసు. చెంగీజ్ ఖాన్, మూడవ మనవడు ‘ఓగాత్’, ‘హలాకు’ వంటి వారు కశ్మీరును ప్రస్తావించారు [History of Mongols, III]. కానీ సూహదేవుడు కశ్మీరాన్ని పాలిస్తున్న సమయంలో క్రీ.శ. 1320 ప్రాంతంలో ‘దుల్చా’ అనే మంగోలు వీరుడు (జోనరాజు ప్రకారం 60,000 సైన్యంతోనూ, చరిత్ర రచయితల ప్రకారం 17,000 సైన్యంతో) సైన్యంతో కశ్మీరంపై దాడి చేశాడు.

‘దుల్చా’ ఏ దారిలో కశ్మీరుపై దాడి చేశాడన్న విషయంలో చరిత్ర రచయితల్లో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన ఉత్తర భారతదేశం నుంచి కశ్మీరు వచ్చి చేరాడని వాదిస్తారు (ఎం. ఎం. మున్షీ). ఇంకొందరు ఈయన ఢిల్లీ నుండి కశ్మీరు చేరాడని నమ్ముతారు (బి.ఎన్. షర్గా). బారాముల్లా మార్గంలో కశ్మీరు చేరాడని ఇంకొందరు నమ్మితే, ఝీలమ్ లోయ గుండా ప్రయాణించి కశ్మీరు చేరాడని కొందరు విశ్వసిస్తారు. జోనరాజు తన రాజతరంగిణిలో ‘దుల్చా’ ఏ మార్గంలో కశ్మీరు చేరాడో చెప్పలేదు. కానీ ‘దుల్చా’ రాక వల్ల కశ్మీరులో సంభవించిన వినాశనాన్ని వర్ణించాడు.

సూహదేవుడు ధైర్యవంతుడు కాడు. గొప్ప వీరుడు కాడు. అంతకు ముందు జలాలుద్దీన్ ఖిల్జీలాగా ధనం, బంగారం సమర్పించి ‘దుల్చా’ దురాక్రమణ నుంచి, రక్తపాతం నుంచి కశ్మీరాన్ని తప్పించాలని సూహదేవుడు ఆలోచించాడు. ప్రజలపై పన్ను  అధికంగా విధించి, ధనం సంపాదించి, ఆ ధనాన్ని, బంగారాన్ని ‘దుల్చా’కి అర్పించాడు. ఏ ధనం దోచుకోవాలని ‘దుల్చా’ కశ్మీరుపై దాడికి వచ్చాడో, ఆ ధనం అప్పగించటం వల్ల, ‘దుల్చా’ వల్ల కశ్మీరులో కలిగే రక్తపాతాన్నుంచి కశ్మీరీ ప్రజలను తప్పించవచ్చనుకున్నాడు సూహదేవుడు.

సూహదేవుడు విధిస్తున్న పన్నులను బ్రాహ్మణులు వ్యతిరేకించారు. ఇలాంటి రాజు దగ్గర బహుమానాలు పుచ్చుకున్న పాపప్రక్షాళన కోసం స్వచ్ఛంద మరణం కోరారు వారు. ఉపవాస నిరసన ప్రారంభించారు. అయితే, సూహదేవుడు అందించిన ధనం, ఇచ్చిన బహుమతులు ఆనందంగా పుచ్చుకున్న ‘దుల్చా’, కశ్మీరుపై దాడి చేయకుండా వెళ్ళిపోమన్న సూహదేవుడి అభ్యర్థనలను మన్నించలేదు. ధనం కోసం దాడికి వచ్చిన వాడికి – దాడి నుంచి తప్పించుకునేందుకు ధనాన్ని అర్పిస్తే, దాని పుచ్చుకుని ‘ఇంకా దాచిన ధనం కావాల’ని దాడి కొనసాగించినట్టు, సూహదేవుడి నుంచి ధనాన్ని స్వీకరించిన తరువాత ‘దుల్చా’ కశ్మీరుపై విరుచుకుపడ్డాడు. సూహదేవుడు బెదిరిపోయాడు. సామ్రాజ్యాన్ని మంత్రి రామచంద్రుడికి అప్పగించి, ప్రాణాలు అరచేత పట్టుకుని, రాజ్యం వదిలి పారిపోయాడు. దాంతో ‘దుల్చా’ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కష్టాలు ఒంటరిగా రావంటారు. ‘దుల్చా’ సృష్టించే నరకం చాలదన్నట్టు మరో రాక్షసుడు కశ్మీరు వైపు దృష్టి సారించాడు. ‘దుల్చా’తో కలిసి కశ్మీరుకు, ప్రజలకు రౌరవాది నరకాల రుచి చూపించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here