[dropcap]మి[/dropcap]త్రులు వేదాంతం శ్రీపతిశర్మ గారు వ్రాసిన ‘మధుగీతం’ నవలను సమీక్షించే క్రమంలో ‘జిగీష’ అన్న పదాన్ని జత చేయడం తప్పనిసరి అయింది. జిగీష అంటే జయించాలనే కోరిక అని అర్థం. అన్ని నవలల లాంటిది కాదు ‘మధుగీతం’. దాని లోని లోతులను మధించి, పరిశీలించి, పాఠకులకు అందించడం అంటే ఇంచుమించు ఆ నవలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో జయించాలనే కోరిక ఈ సమీక్ష.
“You can not just sit back in a relaxed manner and enjoy my poetry” అన్నారు రాబర్ట్ బ్రౌనింగ్. ఆ మాటలు మన శ్రీపతిశర్మకు సరిగ్గా సరిపోతాయి.
సాధారణంగా నేను ఏ పుస్తకాన్నయినా రెండు దిళ్ళు వెనకపెట్టుకుని ఇంచుమించు పడుకున్న స్థితిలో చదువుతాను. కానీ ఈయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నవల చదవాల్సి వచ్చింది. ప్రతి పేజీలో, ప్రతి సంభాషణా, ప్రతి పరిశీలన అంత భావగర్భితాలైతే ఎలా మాస్టారూ?
‘Stream of Consciousness Technique’ అని James Joyce ప్రారంభించిన సాహితీ ప్రక్రియ చాలా వరకు ఈ నవలలో అనుసరించబడింది. దీన్ని తెలుగులో ‘చైతన్య స్రవంతి’ అంటారు. టి.యస్. ఇలియట్, వర్జీనియా వూల్ఫ్, అలెగ్జాండర్ పోప్, జాన్‌డాన్ లాంటి రచయితలు, కవులు దీనిని అద్భుతంగా పండించారు. Metaphysical poetry లో లాగా దీనిలో symbolism ఉండదు. అక్కడక్కడ రచయిత symbols ను వాడినా, అవి occult గా లేవు. self-explanatory గానే ఉన్నాయి.
ఈ నవల చదువుతున్నప్పుడు నాకు తెలుగులో వడ్డెర చండీదాస్ (అనుక్షణికం), వినుకొండ నాగరాజు (ఊబిలో దున్న), కె.యస్.వై. పతంజలి గార్లు స్ఫురణకు వచ్చారు. అంతే వారి ప్రభావం శ్రీపతిశర్మ మీద ఉందని నా అభిప్రాయం కాదు. ఆ genre లో రాశారని. Abstract గా, obscure గా కథను నడపడం, అందులో జీవితపు లోతులను దర్శింపచేయడం, వేదాంత, ఆధ్యాత్మిక భావనలను అంతర్లీనంగా స్పృశించడం, అంత సులభమైన పని కాదు. దానిని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన సాహితీ సవ్యసాచి శ్రీపతి గారు.
నవల పేరు కవితాత్మకంగా ఉన్నా కథానాయకుడు ‘మధు’, కథానాయిక ‘గీత’ల పేర్లను కలిపి, పాత పద్ధతి లోనే తన నవలకు నామకరణం చేశారు రచయిత. కానీ దానంతట అది ఒక సుందర సుమనోహర కావ్యంగా రూపుదిద్దుకొనే విధంగా రాసుకుంటూ పోయారు.
నవల లోని హీరో రచయిత. రచయితలందరూ భావుకులై ఉంటారు. కానీ ఈ ‘మధు’ భావుకుడు మాత్రమే కాదు, అంతర్ముఖుడు కూడా. ఇతనికి జీవితం పట్ల గల దృక్పథం వినూత్నంగా ఉంటుంది. అది అతని ప్రతి మాటలో, భావంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అతని లోని భావుకతకు, సౌందర్య (భౌతికం కాదు) పిపాసకు తగిన నాయిక ‘గీత’. ఆమె చక్కని గాయని. ‘మధ్యమావతి’ వారిద్దరినీ దగ్గర చేస్తుంది.
ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య దృక్పథాల్లో భేదాలను రచయిత అత్యంత సహజంగా చిత్రీకరిస్తారు. మధు చెల్లెలు నీరజ తన ప్రేమ, వివాహం విషయాల్లో స్వతంత్రించినట్లు కనబడినా, అన్నయ్యను నిరంతరం దబాయిస్తున్నట్లున్నా, అతన్ని, తల్లిని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనే తపనను ఆ అమ్మాయిలో మనం చూస్తాం. అమ్మ కూడా, మొదట stubborn గా ఉన్నట్లు అనిపించినా, తర్వాత కూతురి అభిమతానికి తల ఒగ్గుతుంది.
మిత్రుడు సుందర్ ధనవంతుడు. అతను ప్రేమించిన అమ్మాయి మధును పెళ్ళి చేసుకోమని వెంటపడుతుంది. మొదట ఆమె ఎందుకలా చేస్తోందో తెలియక మనం ఆమె మీద అపోహ పడతాం. కానీ ఆమె ఒక డ్రగ్ అడిక్ట్ అనీ, సైకలాజికల్ ఇంబాలెన్స్‌తో బాధ పడుతుందనీ తెలిసి, ఆమె మీ జాలి పడతాం. ఆమెకు జరిగే ట్రీట్‍మెంట్‍లో బాగంగా మధును ఆమె పట్ల ప్రేమ చూపమని అడుగుతాడు ఆమె తండ్రి. మధు విసుక్కోడు. ‘తామరాకు మీద నీటి బొట్టు’ లాగా ఉంటూ, ఆమెకు మానసిక ఉపశమనం కలిగించడానికి దోహదం చేస్తాడు.
కథానాయకునికి అనుకోకుండా ఒక వ్యాధి సంక్రమిస్తుంది. ఇది పాత పద్ధతే. దాని వల్ల అతడు తన ప్రేమను త్యాగం చేయడం, ఇతరుల కోసం ‘కొవ్వొత్తిగా కాలిపోవడం’ లాంటివేమైనా చేస్తాడేమో అని మనం అనుకొంటాం. అక్కడే మనతో ‘పప్పులో కాలు’ వేయిస్తాడు రచయిత. తర్వాత టెస్ట్ రిజల్ట్సులో అతనికే రోగం లేదని తేలిపోతుంది. దీని వల్ల రెండు ప్రయోజనాలు సాధించబడినాయి. డ్రగ్ అడిక్ట్ అయిన అమ్మాయి, అతనికి రోగం ఉందని తెలిసి అతని నుండి మనసు మరల్చుకుంటుంది. తెలిసినా కూడా అతని పట్ల ప్రేమలో ఏ మాత్రం తేడా చూపకుండా నిలబడుతుంది గీత.
ఇక నవలలోకి ప్రవేశిద్దాం. “ఈ లోకం ఓ విశాలమైన మరుభూమి. అందరం ఇందులో మరమనుషులమే” అంటారు రచయిత. మరుభూమిలో మరమనుషులు ఉంటారా? కేవలం శవాలే కదా? అని మనకు అనుమానం వస్తుంది. రచయిత ఉద్దేశం యాంత్రిక జీవనంలో తిరుగాడే జీవచ్ఛవాలని.
“మీరేం చేస్తూ ఉంటారు?”
“ఏమీ చేయను. చిరు లాగా నిరుని”. నిరుద్యోగి అన్నమాట.
“కాగితం మీద కలంతో చేసే ఆక్యుపంచర్ వల్ల ఏర్పడే అక్షరాలు ఈ కాగితాన్ని మారుస్తున్నాయో తెలియదు. ఒక ఆలోచనకు ఎటువంటి గుర్తు ఏర్పడిందో తెలియదు” అంటారు రచయిత ఒక చోట. అంటే perfection కోసం తపించే రచయిత తన రచనలతో ఏ మాత్రం తృప్తి చెందడని.
‘ఉపమా కాళిదాసస్య’ అన్నారు. ఈయన ఉపమలు కూడా అత్యంత మనోహరాలు.
“చక్కని వంకలు తిరిగిన ధనుస్సు అలా కొద్దిసేపు ఒక స్తంభానికి ఆనించి నిలబెడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది.”
స్త్రీ శరీరాన్ని ధనుస్సుతో పోల్చడం కవి సమయం. కథానాయిక అడుగుతుంది. “తెల్ల కాగితాన్ని శిల్పంగా మార్చగలరా?” అని. ఎంత అందమైన, భావగర్భితమైన ప్రశ్న! దానికి జవాబు; “ఏదైనా వ్రాయంటారు. అవునా?”
ఒక్కోసారి చెట్టు మొదలుకే గొడ్డలి వేటు వేసినట్లుండే మాటలు వాడతారు రచయిత.
“సాంఘిక దురాచారాలను ఎత్తి చూపి, ఇది తప్పు అని చెప్పటం ద్వారా, చాలామంది రచనల ద్వారా సాధించారు”
గట్టిగా నవ్వింది.
“రచన అనేదే ఒక సాంఘిక దురాచారం!”
కళ్ళు తిరిగాయి (నాక్కూడా).
ఇంకో చోట ఇలా చెబుతారు.
“పదార్థంలోని ఏ రసమైనా కేవలం యథార్థంలో ఉంటుంది.”
ఇక్కడ పదార్థం అంటే substance కాదు. పదాల కున్న అర్థం. అందులో అనేక రసాలు, వాటి స్థాయీ భావాలు ఉంటాయి. అవన్నీ ఒక యథార్థం అంటే ఒక ultimate truth ను ఆవిష్కరించాలని చెబుతున్నాడు.
‘తీరిక లేదనడం’ వింటూంటాం. నీరజ ఇలా అంటుంది అన్నయ్యను ఉద్దేశించి – “బాధ్యతల విషయంలో తీరిక అనే మాట రాదు”. ఎంత నిజం!
వివేకానందుడు తన రాజయోగంలో ప్రవచించిన non-attachment అనే సిద్ధాంతాన్ని సుందర్ ద్వారా చెప్పిస్తారు రచయిత.
“ఆలోచనను వెలుపలికి తీసి, అవతల పారేసి, త్రికాలాలు నాకొద్దు అని చెప్పి, ఒక అనుభూతితో జీవించడం ఒక కళ”.
కథానాయకుడు తరచుగా నవ్వుకుంటుంటాడు తనలో. “ఎక్కువగా ప్రతీదానికీ నవ్వకు” అంటుంది అమ్మ. అపుడు అతనిలోని చైతన్యస్రవంతి ఇలా బయటకొస్తుంది.
“సగం వింతగా, సగం చింతగా, పిచ్చి గీతల మాడర్న్ ఆర్ట్‌లా కనిపించే ఈశ్వరుని ఈ దుఃఖభరితమైన సృష్టిని చూసి గట్టిగా హాయిగా నవ్వుకున్నాకే..”
‘Accept life as it is’ అన్న సూక్తిని ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? ఈశ్వరుడు అన్న పదాన్ని చలం ఎక్కువగా వాడేవారు. ఈయన ఆయనకేం తీసిపోడు!
ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న సంభాషణల్లో ఒకే చోట stock గా flat గా ఉంటుంది.
“ఆలోచించడం ఆమె వంతయింది”. ఇది శ్రీపతి మార్క్ కాదు.
‘నిప్పులాంటి మనిషి’ అంటే నిత్యాగ్నిహోత్రుడైన పత్రికాధిపతి. ఆయన పేరేమిటో తెలియదు. మధుకు తగిన బాస్ ఆయన. చెయిన్ స్మోకర్.
సాహితీవేత్తలందరూ దీపం పురుగులంటాడు..
“వీళ్ళు వాళ్ళలోని వెలుగును చూడలేరు. ఇంకొకరి ప్రతిభనూ ఒప్పుకోలేరు”.
సమకాలీన రచయితలు కొందరు మనకు గుర్తొస్తారిక్కడ.
అలాగే ప్రస్తుత సమాజంలోని స్పందనా రాహిత్యాన్ని నిర్భయంగా చెబుతారు రచయిత.
“మనుషులు మారారు. మరమనుషులు మిగిలారు. నీళ్ళలోకి రాయి విసిరితే ఒక స్పందన కనిపించేది. ఈ రోజు మిగిలినదంతా బురదే. నీరు లేదు. క్రియలు లేవు, ప్రతిక్రియలు అంతకన్నా లేవు. సృజనకు అనుసృజన ఏది? స్పందన ఏది?”
ఆయన నిర్వేదం సహేతుకమైనది. అలాంటి జడపదార్థాలనే జగన్నాథ పండితుడు ‘కాష్టకుడ్యాశ్మసన్నిభుల’ని పరిహసించాడు (కాష్టము=ఎండకట్టె, కుడ్యము=గోడ, అస్మము=రాయి).
ఆటోల వెనక వ్రాసిన వ్రాతలను కూడా వేదాంతం వారు వదలరు. తమ కథ కణుగుణంగా నాయకుడికి అవి కనబడతాయి! ‘చెరపకురా చెడేవు’.
బార్‍లో పని చేసే బేరర్ కూడా రచయితకు spokesman గా పని చేస్తాడు. అతడూ భావుకుడే. అతని మెచ్యూరిటీ చూసి మనం ఆశ్చర్యపోతాం. అతనిలా అంటాడు –
“నాకు తెలిసి ఒకరి జీవితం స్టేటస్ మీద కాదు, స్టేట్ ఆఫ్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది”.
“అమృతం పంచుతారు, తాగరు!”
రచనల గురించి, రచయితల గురించి శ్రీపతి గారు చెప్పిన మాటలు నిగూఢమైనవి.
“రచన ఎప్పుడూ నవ యౌవనంతో కూడినది. రచయిత వయసుకు దూరంగా ఉండి రచనలోని సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఇద్దరికీ వార్ధక్యం లేదు, మరణం అంతకంటే లేదు”.
సాహిత్యం, జర్నలిజం పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి ఎలా నిస్తేజమవుతాయో చూడండని ఆక్రోశిస్తాడు రచయిత. ‘నిరంకుశాః కవయః’ అంటే కవులు నియంతలని కాదు అర్థం. అంకుశం అంటే ఏనుగును అదుపు చేసేది. ఏ అదుపూ లేని వారుగా సృజనశీలురు ఉండాలి. తమ పత్రిక కోవిద అనే investor చేతుల్లోకి వెళ్ళబోతుందని మధు చెబితే సుందర్ అన్న మాటలు media monopoly ని నగ్నంగా మనముందు నిలబెడతాయి.
“గీయబోయే బొమ్మ ఎలా ఉంటుందో, ఎలా వుండాలో, తీయగా నిర్ణయిస్తారు. రేయ్, ఇది పెద్ద వ్యభిచారం! చాలా పెద్దది. నీకు చేతనైన విద్యను అంగడిలో పెట్టి, నీతిగా, నిజాయితీగా అరుస్తూ, అవతల ప్రక్కకు అమ్మేస్తారు. మీ విలువలకు కాళ్ళొస్తాయి”.
సుందర్ – “లిక్కర్‍లో, కూల్ డ్రింకుల్లో బ్రాండ్ లున్నాయి. కాని దాహం మటుకు మంచినీళ్ళు తాగితేనే కదా తీరేది?” అంటాడు. మంచినీళ్ళకు కూడా బ్రాండ్ లున్నాయి ఈ మధ్య. మినరల్ బాటిళ్ళ ప్రహసనం మీద చురక!
మధు, గీత, ఏకాంతంగా సాగర సంగమ స్థలంలో విహరిస్తారు. ఎక్కడా అశ్లీలత ఉండదు. అమలిన శృంగారాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. అక్కడ ప్రకృతి వర్ణనలు ఎంతో బాగుంటాయి.
“నీటి మీద స్వర్ణరేఖలు దిద్దుతున్నాడట సూర్యుడు”.
జలపాత దృశ్యాన్ని ఇలా వర్ణిస్తాడు.
“అద్భుతమైన శివలింగం మీదుగా అభిషేకం జరుగుతున్నట్లుంది. అమ్మవారు పాలరంగులోని వస్త్రంగా మారి స్వామిని కప్పేసుకుంటున్నట్లుంది..”
అర్ధనారీశ్వర తత్త్వానికి అందమైన నిర్వచనం!
సుందర్, భగవాన్‍తో మధు గురించి అన్న మాటలు, మధు లోని అంతర్ముఖత్వానికి అద్దం పడతాయి.
“వీడున్నాడే, అదో టైప్. లోపల దూరి కూర్చుండి పోతాడు”.
నాకెందుకో శ్రీపతి కూడా అదే టైపేనేమో అని అనుమానం. “No writer can escape from his life” అన్నాడు కదా Charles Dickens!
గీత తన నిష్క్రమణను వివరించే పెన్ డ్రైవ్ తెరుచుకోవడానికి, ‘పెద్దగా ఆలోచించకుండా’ పాస్‍వర్డ్ ‘మధుగీతం’ అని కొడతాడు. క్షేమేంద్రుని ‘ఔచిత్య’ సిద్ధాంతం ఇందులో చక్కగా ఇమిడిపోయింది. ‘మధుగీతం’ పుస్తకాన్ని గోదావరిలో వదిలేస్తాడు, రైల్లో నుంచి. అప్పుడిలా అనుకుంటాడు.
‘గీత చెప్పిన పరమార్థం వైపు ప్రకృతితో పాటు ఆ నీటి మీదుగా ఈ మధుగీతం సూర్యుని వైపు వెళ్ళిపోతుంది’.
‘మనోరథం మరో రథంలా సాగుతూంది’.
Unconditional love వారిది. ఆమె తననింత దాన్ని చేసిన సంస్థ కోసం తన ప్రేమను త్యాగం చేసింది. మధు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆమె వెళ్ళిపోయినందుకు విరాగిగా మారడు. ఎందుకంటే అతడు
“అసలు ఈ శరీరమే, ఈ మనస్సే ఒక మణిద్వీపం, నిజాయితీ గలవారికి ఒక మణికొండ” అని నమ్మినవాడు కాబట్టి.
‘ఇద్దరూ కలిసి, రెండు వత్తులుగా, జ్యోతిగా వెలిగారు’. ఏ వత్తి ఎంత కాంతి ఇస్తుందో చెప్పలేం కదా!. ‘త్వమేవాహం’ అన్న మాటకు ప్రతిరూపం మధు, గీతలు. ఇద్దరూ తమ అంతఃకరణలనే నమ్మారు. జార్జ్ ప్రీస్ట్లీ అన్నట్టుగా నిప్పులంటి మనిషి ఒక మాటంటాడు.
“నా అంతరంగం నన్ను కేక వేసినపుడు నేను నా బంధుత్వాలన్నీ మరచిపోతాను. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ధిక్కరిస్తాను.”
సరిగ్గ ఇవే మాటలు మహాకవి కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో దుష్యంత మహారాజు చేత అనిపిస్తాడు.
“సతాం హి సందేహ పదేషు వస్తుషు
ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః”
ఉత్తములకు, ఏ విషయంలోనైనా సందేహం కలిగినపుడు, దాన్ని తీర్చేది, ప్రమాణంగా నిలబడేది, వారి అంతఃకరణమే.
అలా మధు, గీతలు, తమ ప్రేమను ఒక మధురగీతంలా మార్చుకున్నారు. వారిని సృష్టించిన శ్రీపతి ధన్యులు. ఈ నవలను విశ్లేషించే ప్రయత్నంలో నేను కూదా ధన్యుడనే అనుకుంటున్నాను.
కాళిదాసాది మహాకవులు ప్రపంచానికి సులభంగా అర్థం కావడానికి, మల్లినాథ సూరి వారి దీపశిఖ వ్యాఖ్య ఎంతో దోహదం చేసింది. ఈ నవలలో శోధించాల్సింది చాలా ఉంది. ‘గ్రంథ విస్తర భీతి’తో ఇక ముగిస్తున్నాను.
కవిసమ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, శ్రీమాన్ విశ్వనాథ వారు ‘రామాయణ కల్పవృక్షం’ వ్రాసి, మరల ఆయనే ‘రామాయణ కల్పవృక్ష రహస్యములు’ అని ప్రతి కాండకూ ఒక వ్యాఖ్యానం వ్రాసుకున్నారు. మా మిత్రుడు వేదాంతం శ్రీపతిశర్మకు ఆ అవసరం రానివ్వకుండా, సాధ్యమైనంత ఈ నిగూఢమైన రచనలోని లోతులను పాఠకులకు అందించాలని ప్రయత్నించాను. శ్రీపతి నాకంటే చాలా చిన్నవాడు. అతనికి నా ఆశీస్సులు!
‘రసోవైసః’
‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్’.
***
మధుగీతం (నవల)
రచన: వేదాంతం శ్రీపతిశర్మ
ప్రచురణ: Notion Press
పుటలు: 251
వెల: ₹ 240
ప్రతులకు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/MADHUGEETAM-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%82-VEDANTAM-SRIPATISARMA/dp/168509791X