[dropcap]త[/dropcap]న వాన చెంగుతో నిండా కమ్మేసి
మబ్బుపడుచు బిగిస్తున్న వర్ష కౌగిలికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న
సముద్రుణ్ణి చూస్తూ ఓ సాయంత్రం వేళ సంభ్రమాశ్చర్యాల ప్రేక్షకుణ్ణయ్యాను..!
భయపెడుతున్నట్లే హోరెత్తుతూ వస్తాడు
ఎంత ఉధృతంగా వస్తాడో అంతే ఉల్లాసంగా చక్కిలిగింతలు
పెడుతూ కాళ్ళ కింద మెత్తమెత్తగా జారిపోతాడు..
ఏం మాయచేస్తాడో గానీ..
పెద్దవాళ్ళను కూడా తమ వయసుల్ని ఇసుకలో
కట్టుకున్న గూళ్ళల్లో దాచుకునే పసిప్రాయం లోకి నెట్టేస్తాడు..
చినుకు సంగీతానికి
అలల కేరింతలు కొడుతూ చిన్నపిల్లాడిలా తడిసి ముద్దవుతూ
సముద్రుడు ఆలపిస్తున్న పరవశ గీతానికి తన్మయత్వంలో శ్రోతనయ్యాను..!
మాటి మాటికీ కెరటాల రాయబారాలంపి
తీరాన్ని బతిమాలుకుంటున్న సాగరుడిలో
నిజాయితీ ప్రేమికుణ్ణి చూశాను..!
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలపై
ఆశల వలలు విసురుకుంటున్న ఆకలి పడవల్ని
ఉయ్యాలలూపుతున్న కడలి కళ్ళల్లో అమ్మ ప్రేమను
చూసి చప్పట్లు కొడుతున్న పసి ప్రాయాన్నయ్యాను..!
తనలో ఏమీ దాచుకోని బోళాతనంతో
చెప్పలేని ప్రేమనంతా గుండె ఆల్చిప్పల్లో భద్రపరచి
తీరానికి ప్రేమకానుకలుగా మాటి మాటికీ అందించే
ఆ రత్నగర్భుడి లో దాగున్న గొప్ప ప్రేమికుణ్ణి చూశాను..!
మనో గతాన్ని విభిన్న సంకేతాలుగాచేసి గవ్వలతోనూ
శంఖాలతోనూ ఒడ్డుకి పంపిస్తున్న సాగరుడి హృదయ భాషకు తర్జుమా కనుగొనాలి..!
తీరంతో సంద్రం కొనసాగించే అలల సంభాషణలకు వ్యాఖ్యానాన్ని లిఖించాలి..!
యుగాలుగా అతడు చేస్తున్న అలల ఘోషకు
కొత్త వ్యాకరణాన్ని కనిపెట్టాలి..
ఆ అంతర్మథనం కోసం దుబాసి గా మారాలి..!!!