మనిషే మృగమైతే?

0
4

[dropcap]“అ[/dropcap]య్యా! ఆడ్ని వొగ్గేయండయ్యా.. మీ కాల్మొక్తా.. ఆడి నాయన సేసిన పనికి ఆడ్ని సిచ్చించకండి దొరా” పది సంవత్సరాల వయసున్న తన బిడ్డని, ఊరిజనం కుక్కని కొట్టినట్టు కొడుతూ, కిందపడేసి కాళ్లతో తన్నుతుంటే.. కరుకు గుండెల్లో కానరాని ‘జాలి’ అనే గుణం జాడ కోసం, నీరింకిన కళ్ళతో వెతుకుతూ ప్రాధేయపడుతోంది.. మూడు పదుల వయసు దాటని ఆ దీనురాలు.

చిరిగిన బట్టలతో, మురికి పట్టిపోయి ఉన్న ఆమె దేహం నుంచి వెలువడుతున్న దుర్గంధం భరించలేకనో, ఏమో.. అక్కడున్న జనంలోని ఓ బలశాలి, ఆమె జుట్టు పట్టి ఈడ్చి, నాలుగు తగిలించి, వినరాని పదజాలంతో దూషిస్తూ రోడ్డు వారకి ఈడ్చుకుపోయాడు.

ఊరకుక్కలు దాడి చేసినట్టు, ఊరిజనం తన బిడ్డపై చేస్తున్న దాష్టీకాన్ని చూస్తూ కూడా, నిస్సహాయంగా ఉండిపోయింది ఆ పిచ్చితల్లి.

చేతుల్లో పట్టు తగ్గిందో.. లేక ఆవేశం అణగారిందో తెలీదు కానీ, కాస్సేపటికి శాంతించిన జనం.. ఒక్కొక్కరే అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

శక్తినంతా కూడగట్టుకొని, ఒక్క ఉదుటన బిడ్డనుజేరి, డొక్కలేగిరిపడేలా ఏడుస్తున్న కొడుకుని గుండెలకి హత్తుకుని, ఓదార్చే ప్రయత్నం చేస్తున్న ఆ తల్లి వేదనని చూసి, నా కళ్ళు చెమర్చాయి.

కారు దిగి, వాటర్ బాటిల్ తీసుకెళ్లి, ఆమెకిచ్చి తాగమన్నట్టు సైగ చేసాను. మనుషుల మీద నమ్మకం పోయిందేమో.. ఆ పసివాడు బిత్తరచూపులు చూస్తూ, తల్లిని మరింత గట్టిగా పట్టుకున్నాడు.

నన్ను చూసి “వద్దయ్యా!” అంటూ డేకుతూ వెనక్కి జరగబోయింది ఆమె.

“భయం లేదు. తీసుకో.. ముందు కాసిని నీళ్లు తాగిoచు” బాటిల్ మూత తీసి ఆమె చేతికి అందించాను.

“ఏవండీ! టైమవుతోంది.. నాన్నగారు మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వెళ్ళాలి.. రండి” అప్పుడే కారు దిగి అక్కడికి వచ్చిన శ్రీమతి, బాధ్యతని గుర్తు చేసింది.

మావయ్యకి బైపాస్ సర్జరీ చేసి పది రోజులవుతోంది. ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నారు.

జేబులోంచి ఐదు వందలు తీసిచ్చి, “ముందు ఏదైనా కొనుక్కు తినండి” అని పిల్లాడి చేతిలో పెట్టాను.

బెరుకు బెరుగ్గానే అందుకున్నాడు.

“మా అయ్య యార్నో సంపేసి, జైలుకెళ్లినాడంట దొరా! ఆడ ఏం జరిగినాదో తెల్వదు.. జైలు గదిలోనే ఉరిపోసుకున్నాడంట.. మా యమ్మనీ, నన్నూ యారూ సేరనిస్తల్లే.. హంతకుడి కొడుకువి, నువ్వూ అట్టనే అవుతవు అంటూ తరిమేస్తున్రు..”

“బువ్వ తిని శానా దినాలైతాంది. అడుక్కు తెచ్చిన సొమ్ముల్తో రొట్టె కొన సూస్తిని. యాడకి బోయినా ఎవ్వొరూ రానిస్తల్లే.. తరిమి తరిమి కొడుతున్రు.. యాడ బతకాల?” ఛీ.. కొడుతున్న లోకం మీద ద్వేషం పెంచుకున్న ఆ పసివాడు, ఎక్కిళ్ళ మధ్య తాము పడుతున్న అవస్థని వివరించి చెప్పాడు.

‘వీడు మరో హంతకుడు కాకూడదు’ మనసులో దృఢంగా అనుకున్నాను.

“ఏమ్మా! నాతో వస్తారా? పని ఇప్పిస్తాను” నమ్మబలుకుతూ అడిగాను.

“నీ బిడ్డకి చదువు చెప్పించి, పెద్ద వాడిని చేస్తాను. నన్ను నమ్ము” చెబుతున్నప్పుడు.. కాంతి విహీనంగా ఉన్న ఆమె కళ్ళల్లో ఒక మెరుపు గమనించాను.

“రేపు ఇదే సమయానికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను. ఇక్కడే ఉంటారుగా…” సరేనన్నట్టు తలాడిస్తూ, నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ఆ తల్లీ-కొడుకుల్ని చూసి, తృప్తిగా ముందుకి కదిలాను.

“ఏవండీ! ఏమిటీ నిర్ణయం? రోడ్డు పక్కన అనాథల్ని చేరదియ్యడానికి ఎన్నో ఆశ్రమాలున్నాయి. ఇదంతా తలకెత్తుకోవడం అవసరమా? మరోసారి ఆలోచించండి” కారు స్టార్ట్ చేస్తున్న నాకు నచ్చచెప్పబోయింది రాధ.

“హు! ఒకప్పుడు మీ నాన్న, అనాథగా ఉన్న నన్ను చేరదీసి, చదువు చెప్పించబట్టే కదా.. ఈరోజు ఇంత వాణ్ణయ్యాను. బంగారం లాంటి కుటుంబాన్నీ, నీ ప్రేమనీ పొందగలిగాను..” రాధ కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

మౌనంగా తల దించుకున్న ఆమె చిరునవ్వులో నాకు సమాధానం దొరికింది. మర్నాడు ఇద్దరం తిరిగి అదే చోటుకి వెళ్ళాం.

సంధ్యవేళ.. చీకట్లు ముసురుకుంటున్నాయి. వీధిలైట్ల వెలుగులో ఫుట్ పాత్ మీద ఆ తల్లీ, కొడుకుల ఆచూకీ కోసం ఆత్రంగా వెతికాయి నా కళ్ళు.

మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని, ఒంటరిగా కూర్చుని రోదిస్తున్న బాబుని చూడగానే, నా మనసేదో కీడు శంకించింది.

“ఏమైంది బాబూ? మీ అమ్మెక్కడ?” దగ్గరగా వెళ్లి, తల మీద చెయ్యివేసి అడిగాను.

“దొరా! రేతిరి.. ఈడ పండుకున్న మాయమ్మని యారో ‘మానవ మృగాలంట’.. ఎత్తుకపోయిన్రు. పొద్దు సూపగానే మునిసిపాలిటీ ఓళ్ళు వొచ్చి.. సెత్త కుప్పల కాడ దొరికిన మాయమ్మ శవాన్ని లారీకెత్తి తీస్కపోయిన్రు. పోలీసోళ్లని సూసి, బయమేసి దాక్కున్న.. యాడ బోవాలో తెలీకుంది దొరా..” దిక్కుతోచక, తోటి మనుషుల్ని చూసి, భయంతో వణికిపోతున్న ఆ పసివాడిని, రాధ ప్రేమగా దగ్గరకి తీసుకుంది. ముగ్గురం ఇంటివైపు అడుగులు వేశాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here