[dropcap]ఆ[/dropcap] గది చూడ్డానికి ఎవరో సైంటిస్టు ల్యాబ్‌లా వుంది. ఆ గది మొత్తం కంప్యూటర్లు, మరెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండిపోయి వుంది. రాజుకి పాతికేళ్ళ వయస్సు వుంటుంది. చాలా సీరియస్‌గా పని చేస్తున్నాడు. అక్కడ వున్న పరిస్థితులు చాలా ఆధునికంగా వున్నాయి. మామూలు సాధారణ ప్రపంచంలా లేదు. అదో సరికొత్త లోకం.
అప్పుడే రాజు మొబైల్ ఫోన్‌కి వాయిస్ మెసేజ్ వచ్చింది. “ఇట్స్ జ్యూస్ టైమ్ బడ్డీ” అంటూ అలెక్సా సందేశం. “థాంక్స్ అలెక్సా” అంటూ పక్కనే ప్లేట్‌లో వున్న జ్యూస్ అందుకున్నాడు. ఆపకుండా తాగేసాడు. “షల్ ఐ ప్లేస్ యాన్ ఆర్డర్ ఫర్ లంచ్?” అంటూ అలెక్సా మళ్ళీ కూసింది. రాజు కాసేపు ఆలోచించాడు. “అలాగే, కానీ నాకు ఒక రెండు నిమిషాలు టైమ్ ఇవ్వు. ఇప్పుడు రాస్తున్న ప్రోగ్రాం ఫినిష్ చేసి వస్తాను” అని నవ్వుతూ అన్నాడు.
తన చూపుడు వ్రేలుతో గాల్లో టచ్ చేసాడు. తన ముందు ఒక వర్చువల్ స్క్రీన్ ఓపెన్ అయ్యింది. అక్కడ చాలా ఫుడ్ యాప్స్ వున్నాయి. ఒక యాప్ లోకి వెళ్ళి, మెను చెక్ చేసి, తనకి కావల్సిన ఐటెమ్స్ ఆర్డర్ పెట్టింది. “అలెక్సా! ఈ రోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు. ఎక్కువ ఆర్డర్ చెయ్. రైస్, దాల్, రెండు రకాల వెజిటబుల్ కర్రీ, రెండ్ రకాల జ్యూస్లు” ఇలా చెప్తూ పోయాడు. “ఓకే బాస్” అంటూ అలెక్సా ఆర్డర్ చేస్తూ వెళ్లింది.
వర్చువల్ స్క్రీన్ మినిమైస్ చేసాడు. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది. అక్కడే కూర్చొని రాజ్ ఒక బటన్ నొక్కాడు. ఆ గదిలో వున్న ల్యాబ్ సెటప్ అంతా మాయం అయ్యింది. ఆ ఇళ్ళు ఒక మామూలు గృహంలా మారి పోయింది. ఫ్రెండ్స్ లోపలికి వచ్చారు. అందరూ ఆనందంగా హై ఫై లు ఇచ్చుకున్నారు.
“ఏయ్ డ్యూడ్! ఎప్పుడూ ఇంట్లోనే వుంటావా? అలా బయటకి వచ్చి ఒక్కసారి చూడు. లోకం ఎంత అడ్వాన్స్డ్‌గా వుందో!” అని అన్నాడు శ్రీను అనే ఫ్రెండ్. నడుస్తున్న టివి వైపు చూపిస్తూ “నీకు తెలుసు కదరా! నాకు క్రికెట్ అంటే పిచ్చి అందుకే మ్యాచ్ చూస్తూ వుండి పోయాను” అని సమాధానం ఇచ్చాడు.
“క్రికెట్ అంటే గుర్తొచ్చింది. మనం ఆ గిరి టీమ్‌తో మ్యాచ్ ఓడిపోయాం. యు కాంట్ బిలీవ్ ఇట్. మేము వేసిన ప్రతీ బాల్‌ని వాళ్ళు ఫోర్ కొట్టారు. అదేంటో!” అంటూ ఆశ్చర్యపోతూ చెప్పాడు వేణు అనే ఇంకో ఫ్రెండ్. “వాళ్ళు ప్రతీ బాల్ ఫోర్ కొడితే మనం ప్రతీ బాల్ సిక్స్ కొడితే పోలా” అన్నాడు రాజు. “కైసే రే” అన్నాడు అది సాధ్యం కాదు అని తల అడ్డంగా ఊపుతూ మరో ఫ్రెండ్ రహీమ్. “అవును కష్టమే! వాళ్ళ టీమ్‌లో అందరూ సూపర్ ఫాస్ట్ బౌలర్లే” అని మున్నా నిరుత్సాహ పరిచాడు.
“అరే! బంతితో అది విసిరే వాడితో సంబంధం లేదు. మన ఆడబోయే బ్యాటే ముఖ్యం. అలా టచ్ చేస్తే సిక్స్ వెళ్లిపోతుంది” అని హుషారుగా చెప్పాడు రాజు. “నీ దగ్గర ఏదో మ్యాజిక్ వుంది రా రాజు. యు ప్లీజ్ డూ సంథింగ్. వాళ్ళ ముందు తల ఎత్తుకోలేక పోతున్నాం” అని శ్రీను బ్రతిమాలాడు. “సరే ఇక్కడే వుండండి” అని చెప్పి రాజు లోపలికి వెళ్ళాడు.
లోపల ఇంకో విచిత్రమైన్ గది వుంది. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ వున్న కొన్ని బ్యాట్స్ తీసుకొని చెక్ చేసాడు. ఒక బ్యాట్ వైపు కాసేపు అలానే చూసి, పక్కన షెల్ఫ్‌లో వున్న ఆయిల్ బాటిల్ తీసి బ్యాట్ పైన పోసాడు. ఆ బ్యాట్‌ని ఆయిల్‌తో బాగా తోమాడు. పాత గుడ్డ ముక్క తీసుకొని బ్యాట్ పైన మిగిలిన ఆయిల్‌ని తుడిచాడు. ఆ బ్యాట్‌ని ఒక విచిత్రమైన ఎలక్ట్రానిక్ పరికరం పైన పెట్టాడు. లైట్లు వెలుగుతున్నాయి. ఒక షాక్ లాంటి ఎనర్జీ బ్యాట్ లోకి వెళ్లింది. రాజు గర్వంగా నవ్వుకున్నాడు. బ్యాట్ మధ్యలో వున్న ఒక చిన్న సెటప్ ఓపెన్ చేసి చిప్ పెట్టాడు. బ్యాట్‌ని చేతిలో తీసుకొని మళ్ళీ చెక్ చేసాడు. ఇప్పుడు చాలా వేగంగా స్వింగ్ అవుతోంది. ‘ఇక ప్రతీ బాల్ సిక్సర్‌యే’ అని మనస్సులో నవ్వుకున్నాడు.
హాల్‌లో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ వున్నారు. తన పక్కనే వున్న ఒక విచిత్రమైన బొమ్మని మున్నా టచ్ చేసాడు. “అరే సాలే! అమ్మాయిల్ని ఎలాగో గెలుకుతావు. బొమ్మల్ని కూడా వదలవారా” అని నవ్వుతూ అన్నాడు. “ఈ బొమ్మ అయిన పర్లేదు. మన కాలేజీ పోరీలు ఇంకా బ్యాడ్” అని తిరిగి నవ్వాడు. “అయినా ఈ వయస్సులో మన రాజు ఈ విచిత్రమైన బొమ్మతో ఏం ఆటలు ఆడుతున్నాడో” అని అనుకుంటూ అనుమానంగా ఆ బొమ్మ వైపే చూసాడు. “వాడు నీలా కాదు లే. లైట్ తీసుకో” అని రహీమ్ టీస్ చేసాడు.
“ఇది భలే మెత్తగా వుంది రా బాబు” అని దాన్ని తీసి ముడ్డి క్రింద పెట్టుకున్నాడు మున్నా. ఆ బొమ్మ ముక్కు నుంచి ఒక సూది బయటకి వచ్చింది. అది గుచ్చుకొని మున్నా కెవ్వు కేక పెట్టి లేచి నిలుచోని నొప్పికి డ్యాన్స్ చేసాడు. “చాలా మెత్తగా వుంది అన్నావు” అని రహీమ్ మళ్ళీ టీస్ చేసాడు. మున్నా బొమ్మని పట్టుకొని మొత్తం చూసాడు. గుచ్చుకొనేలా ఏం కనిపించ లేదు. అనుమానంతో మళ్ళీ చూసాడు. ఇంతలో బ్యాట్ తీసుకొని రాజు వచ్చాడు. ఫ్రెండ్స్ అందరూ రాజుని చుట్టుముట్టారు.
“గయ్స్! డెవిల్ ఈస్ రెడీ. దీన్ని పట్టుకొని గ్రౌండ్‌లో అడుగు పెడితే, ప్రతీ బాల్ సిక్సర్‌యే, పక్కా!” అని గొప్పగా చెప్పాడు. “ఆర్ యు షూర్?” అని శ్రీను అనుమానం. నమ్మడం కష్టంగా వుంది అని మిగతా ఫ్రెండ్స్ కూడా అన్నారు.
“అయితే ట్రై చేసి చూద్దాం. మన టీమ్‌లో బాటింగ్‌లో వీక్ ఎవరు?” అని అందరి వైపు చూసాడు. “మన మున్నానే” అందరూ తన వైపే చూపిస్తూ, నవ్వుతూ.
“ఏం బాటింగ్?” కొంచెంగా కోపంగా అడిగాడు మున్నా. మున్నా చేతిలో బ్యాట్ పెట్టారు. “బాల్‌ని జస్ట్ టచ్ చెయ్యి చాలు, బౌండరీ అవతల పడుతుంది” అని చెప్పి అందరూ బయటకి కదిలారు. మున్నా బ్యాట్ వైపే చూస్తూ వాళ్ళ వెంట కదిలాడు.
ఇంటి ముందే క్రికెట్ మొదలు పెట్టారు. రాజు బౌలింగ్ చేస్తున్నాడు. బాటింగ్‌లో వీక్ అని హేళన చేసారు అని మున్నా అలానే కదలకుండా వున్నాడు. బాల్ మిస్ అయ్యింది. “ఏరా నిజంగానే వీక్?” అని ఫ్రెండ్స్ నవ్వుతూ వున్నారు. మళ్ళీ బంతి విసిరారు. ఈసారి బ్యాట్ గట్టిగా ఊపాడు. బాల్ మిస్ అయ్యింది. అందరూ నవ్వుతున్నారు. “అరే మున్నా! జస్ట్ టచ్ చేస్తే చాలు. నో నీడ్ ఆఫ్ హార్డ్ హిట్టింగ్” అని రాజు కేక పెట్టాడు.
ఆ తర్వాత వేసిన ప్రతీ బంతి బ్యాట్‌ని అలా ముద్దాడగానే వెళ్ళి బౌండరీని దాటేసింది. బౌలర్లు మారుతున్నారు. కానీ సేమ్ సిక్సర్‌లే. మున్నా చాలా ఆనందంగా వున్నాడు. సింగల్ సరిగా తీయలేని వాడు ఈ రోజు ప్రతీ బాల్ సిక్సర్ కొడుతున్నాడు. చాలా ఆనందంగా వుంది.
“అరే మామా రాజు! నువ్వు బ్రిలియంట్‌రా. ఇక చూసుకో, ఈ మున్నా గాడు ప్రతీ మ్యాచ్‌లో ఓపెనింగ్ బాట్స్‌మ్యాన్” అని చాలా ఆనందంగా వున్నాడు. ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషంగా వున్నారు. “అరే మామా! నాకు ఇంకో చిన్ని సాయం కావాలి?” అని మెల్లగా అన్నాడు మున్నా. రాజు పక్కనే నిలబడి చిన్నగా “ఆ పిల్ల అసలు చూడ్డం లేదు. ఇలాంటిదే ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ పిల్ల నాకు పడేలా చెయ్యి రా” అని తన కోరిక రాజు ముందు వుంచాడు. అందరూ మళ్ళీ లోపలికి వెళ్లారు. రాజు మళ్ళీ అదే గదిలోకి వెళ్ళాడు. మున్నా ఆనందంగా ఎదురు చూస్తున్నాడు. “వీడు ఏంటి? ఏం అడిగినా ఆ గదిలోకి వెళ్తున్నాడు. ఏముంది ఆ గదిలో?” అని రహీమ్ ఆలోచనలో పడ్డాడు.
కాసేపటికి ఒక ఇంజెక్షన్‌తో బయటకి వచ్చాడు. మున్నాకి వేసాడు. మున్నా గెటప్ మారి పోయింది. లుక్ మొత్తం ఒక రోమియోలా మారిపోయింది. అందరూ ఆశ్చర్యంగా అలానే చూస్తున్నారు. “ఇక ఆ అమ్మాయి వెనుక పడకు” అని రాజు సీరియస్‌గా అన్నాడు. “అదేంటి మామా!” అని బాధగా చూసాడు. “ఎందుకంటే ఆ అమ్మాయే, నీ వెనుక పడుతుంది. గుడ్ లక్” అని భుజం తట్టాడు. హగ్ చేసుకొని మున్నా థాంక్స్ చెప్పాడు. అందరూ లంచ్‌కి కూర్చున్నారు. “ఇన్ని ఐటెమ్స్?” అని అందరూ ఆత్రంగా తింటున్నారు. “మన అలెక్సా ఆర్డర్ చేసింది” అన్నాడు నవ్వుతూ. “నీకు గర్ల్ ఫ్రెండ్ వుందా? అలెక్సానా? చెప్పనే లేదు” అని వేణు అమాయకంగా అడిగాడు. “కుళ్ళు జోక్లు ఆపురా బాబు” అని సరదాగా నవ్వేసాడు.
ఒక చిన్న దోమలాంటి ఐటెమ్ మున్నా ముఖం మీదకి పదే పదే వస్తోంది. పట్టడానికి చూస్తుంటే దొరకడం లేదు. “ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని గాల్లో చప్పట్లు కొడుతున్నావు ఏంటి?” అని శ్రీను, మున్నా వైపు చిరాకుగా చూసాడు. “దోమ రా” అని ధీనంగా అన్నాడు. ఎక్కడ అని అడిగాడు. ఇక్కడే అన్నాడు. వాళ్లెవరికీ కనిపించడం లేదు. “చుప్ చాప్ తిను సాలే! ఎప్పుడూ ఏదో ఒకటి నీ లొల్లి” అని రహీమ్ కోప్పడ్డాడు. మున్నా దిక్కులు చూస్తూ తింటున్నాడు. ఆ దోమ మళ్ళీ వచ్చింది. ఎదురుచూసి రెండు చేతులతో దాన్ని పట్టేసాడు. “దొరికింది. దొరికింది. నేను ఎంత చెప్పిన నమ్మలేదు కదా! ఇప్పుడు చూడండి” అని అందరి వైపు చూసాడు.
మెల్లగా చేతులు తెరిచాడు. అక్కడ ఏం లేదు. అందరూ కోపంగా చూసారు. “ప్రామిస్ రా! దోమనే! నా దగ్గరకే వస్తోంది” అని ఏడుస్తూ అన్నాడు. ఇదంతా జేబులో రిమోట్ పెట్టుకొని రాజు ఆడిస్తున్నాడు. అదే దోమ మళ్ళీ వచ్చింది. కనిపిస్తోంది. మళ్ళీ మాయం అవుతోంది. మున్నా అగచాట్లు చూసి రాజు నవ్వుకుంటున్నాడు. “అరే రాజు! మన స్కూల్ డేస్‌లో ఈ మున్నా గాడు నిన్ను బాగా సతాయించేవాడు కదా!” అని వేణు చిన్ననాటి జ్ణాపకాలు గుర్తు చేసాడు. రాజు నవ్వాడు. “అంటే ఈ రాజు గాడే మున్నా మీదకి ఏదో పంపిస్తున్నాడు” అని శ్రీను అనుమానంగా చూసాడు. “నా దగ్గర ఏముంది. అయినా దోమలు నేను చెప్పినట్లు వింటాయా ఏంటి?” అని రాజు తప్పుకున్నాడు. అలా అందరూ లంచ్ చేసి, కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని వెళ్లిపోతూ, “అరే మ్యాచ్‌కి నువ్వు కూడా రావాలి. వుయ్ కన్ హావ్ ఫన్” అని రహీమ్ అడిగాడు. “నాకు కొంచెం పని వుంది. కుదిరితే తప్పకుండా వస్తాను” అని రాజు మాట ఇచ్చాడు. అందరూ వెళ్ళి పోయారు.
రాజు మళ్ళీ బటన్ నోక్కాడు. ఆ రూమ్ మొత్తం ల్యాబ్ సెటప్ వచ్చేసింది. వర్చవల్ స్క్రీన్ మీద శాటిలైట్, గ్రాఫ్‌లు చెక్ చేసి చిన్నగా నవ్వుకున్నాడు. లేచి వెళ్ళి ఒక పెద్ద అద్దం ముందు నిలుచోని చిన్న చిరునవ్వు ఇచ్చాడు. మెల్లగా రాజు ముఖం ఏలియన్‌లా మారిపోయింది. “యు డర్టీ హుమన్స్” అని చిరాకు ముఖం పెట్టాడు.
అసలు రూపం తెచ్చుకున్న ఏలియన్ వేరే గది వైపు మెల్లగా వెళ్లింది. ఆ గది లో రాజుని, వాళ్ళ నాన్న స్వరూప్‌ని కూర్చీకి ఆల్రెడీ లాక్ చేసారు. “యు డర్టీ ఫన్నీ హుమన్స్” అని ఏలియన్ నవ్వాడు. “యు ఆర్ డర్టీ అండ్ అగ్లీ ఏలియన్” అని రాజు కోపంగా అన్నాడు. ఏలియన్ కోపంతో రాజు ముందుకి వచ్చి ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ “ఇప్పుడు సరిగా చూడు” అని గాల్లో చిటికే వేసింది. ఏలియన్ రాజులా మారిపోయింది. “యామ్ ఐ అగ్లీ నవ్?” అని వెకిలిగా నవ్వింది. పక్క గదిలో ఏదో చప్పుడు అయ్యింది. “మెసేజ్ ఫ్రమ్ హోం” అని అలెక్సా అరుస్తోంది. ఏలియన్ అటు వైపు వెళ్లింది. పక్క రూమ్ లోకి వెళ్ళి “కాపీయిడ్, యెస్ కాపీయిడ్” అంది ఏలియన్.
ఇక్కడ “యు మేడ్ ఏ మిస్టేక్ డాడ్. మీ ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల ప్రపంచం మొత్తం సమస్యలో ఇరుక్కుంది. అయిన ఏలియన్స్‌కి మెసేజ్‌లు పంపడం ఏంటి? అవి మన ఫ్రీక్వెన్సీని కాచ్ చేసి మనల్ని ఇలా బందించడం ఏంటి?” అని బాధ పడుతూ అన్నాడు రాజు.
కొన్ని రోజులు ముందు, స్వరూప్ చాలా సీరియస్ ఏదో పని చేస్తున్నాడు. తన ముందు వున్న మానిటర్ మీద ఒక మెసేజ్ యూనివర్స్ మొత్తం తిరుగుతూ వుంది. అప్పుడే రాజు వచ్చాడు. “ఏం చేస్తున్నారు డాడ్?” అని మానిటర్ వైపు చూసాడు. “తెలుసు కదా రాజు! మన భూమి మీద వనరులు దాదాపు అయిపోతున్నాయి. నీళ్ళు తగ్గి పోయాయి. వాయు కాలుష్యం. జల కాలుష్యం. ఆహార కాలుష్యం. మొత్తం పాడైపోయింది. మనిషి బుద్థితో సహా! మన అవసరాల కోసం ప్రకృతితో ఆటలు ఆడుతున్నాం. చెట్లు నరికేస్తున్నాం. అడవులు నాశనం అయిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నార్త్ పోల్ దగ్గర మంచు కరిగిపోతోంది. ఇంకా కొన్నాళ్లు పోతే ఈ భూమి మీద ఎవ్వరూ బ్రతకలేని పరిస్థితి వచ్చేస్తుంది” అని వివరంగా చెప్పాడు.
“యెస్ డాడ్! ఐ అండర్స్టాండ్ దట్” అని తల ఊపుతూ కూర్చున్నాడు. “ఈ యూనివర్స్‌లో మన భూమి చాలా సూక్ష్మం. అందుకే ఈ యూనివర్స్‌లో వెతుకుతున్నాను. వేరే ఏ గ్రహంలో ఏదైనా జీవరాశి వుందేమో? అక్కడ మనం వెళ్ళి వుండొచ్చా? వుండాలి అంటే ఏం కావాలి?” అని వెతుకుతున్నాను అని మళ్ళీ తానే చెప్పాడు.
“ఇట్ సౌండ్స్ క్రేజీ డాడ్! అసలు అలాంటి గ్రహం వుంటుందా? ఒకవేళ వుంది అనుకున్నా, భూమి మీదున్న ఇంతమంది జనం అక్కడకి ఎలా వెళ్తారు? ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏదైనా వింత జీవరాశి వుంటే? మనం చేస్తున్న ఈ ఎక్స్‌పెరిమెంట్స్ వల్ల వాటికి, మనం, మనుషులం, ఇక్కడ వున్నాం అని తెలిసిపోతే? అవే వచ్చి భూమిపైన ఎటాక్ చేస్తే?” అని తన అనుమానాలు ఒక్కోటి బయట పెట్టాడు.
“యెస్ మై సన్. ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌లో రిస్క్ చాలా వుంది. అందుకే నాసా వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు చేస్తున్న నన్ను జాబ్ నుంచి తీసేసారు. అందుకే నేనే స్వయంగా, సీక్రెట్‌గా వస్తున్న ఫండ్స్‌తో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాను” అని రహస్యం కొడుకుతో చెప్పాడు. “నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తోంది. ప్లీజ్ ఇదంతా ఆపేయండి” అని కోరాడు.
“మనం చేసే ప్రతీ పనిలో పాజిటివ్ వుంటుంది. నెగెటివ్ వుంటుంది. నెగెటివ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ముందుకు పోలేము మై సన్. లెట్ మి ట్రై” అని చిన్నగా నవ్వాడు. ఇంతలో ఏదో బీప్ సౌండ్ వచ్చింది మానిటర్‌లో. “వావ్! అమేజింగ్! మన మెసేజ్‌ని యూనివర్స్‌లో ఎవరో డీకోడ్ చేసారు” అని ఆనందంతో చెప్పాడు. రాజు కూడా ఇంటరెస్టింగ్‌గా మానిటర్ వైపు చూస్తున్నాడు. “డాడ్! మనకి ఏదో మెసేజ్ వచ్చింది” అని మానిటర్ కార్నర్‌లో పాపప్ చూపించాడు. మెసేజ్‌ని డికోడ్ చేస్తే “సెండ్ యువర్ లొకేషన్” అని వుంది. స్వరూప్ అడ్రెస్ టైప్ చేస్తున్నాడు. “ప్లీజ్ డోంట్ డూ దిస్ డాడ్. ప్లీజ్ ప్లీజ్ థింక్ వన్స్ అగైన్” అని రాజు వేడుకున్నాడు. టైప్ చెయ్యడం ఆపేసి స్వరూప్ కూడా బాగా ఆలోచించాడు. కానీ చివరికి లొకేషన్ సెండ్ చేసేసాడు.
అలా ఇద్దరూ గతం నుంచి బయటకి వచ్చారు. “చూడండి డాడ్! నా మాట వినకుండా లొకేషన్ సెండ్ చేసారు. ఆ ఏలియన్స్ వచ్చి మనల్ని ఈ సిట్యుయేషన్‌లో పెట్టాయి” అని బాధగా అన్నాడు. “గుడ్ థింగ్ ఈస్ అవి మన కన్నా టెక్నికల్‌గా చాలా ముందున్నాయి” అని స్వరూప్ అన్నాడు.
“అది గుడ్ థింగ్ ఎలా అవుతుంది? అంతా బ్యాడ్‌నే! అదే పెద్ద ప్రాబ్లం. మొత్తం మనిషి జాతిని సర్వనాశనం చేసేస్తాయి. భూమిని ఆక్రమించుకుంటాయి. ఇది వాటికి ఒక పిక్నిక్ స్పాట్ అయిపోతుంది” అని వాపోయాడు రాజు. “హవ్ డూ యు నో?” అని స్వరూప్ రాజు వైపు చూసాడు. “నేను కూడా ఒక చిన్న రిసర్చ్ చేసాను. వాళ్ళ మెసేజ్‌లు డికోడ్ చేసాను” అని రాజు అన్నాడు. “ఓహ్ దేవుడా! అయితే మనం చాలా పెద్ద రిస్క్‌లో వున్నాం. ఇక్కడకి వచ్చిన ఈ ఏలియన్ మన ఇన్ఫర్మేషన్‌తో తిరిగి వాళ్ళ గ్రహానికి వెళ్లింది అంటే, మన మీద అటాక్ చేస్తారు. అప్పుడు భూమి మీద ఎవ్వరూ మిగలరు” అని భయపడ్డాడు. “యు ఆర్ రైట్ డాడ్! వాట్ టు డూ నవ్ డాడ్?” అని తన వైపే చూసాడు. “ఐ యామ్ సారీ మై సన్” అని ముఖం దాటేసాడు.
ఇంతలో ఏలియన్ మళ్ళీ వచ్చింది. ఒక సిరంజ్ తీసుకొని వచ్చి రాజు నుంచి స్వరూప్ నుంచి బ్లడ్ శ్యాంపిల్ తీసుకుంది. బ్లడ్ తీసుకొని వెళ్తూ వెళ్తూ రాజు వైపు చూసి “యు డర్టీ హుమన్స్” అని నవ్వుతూ వెళ్లింది. “డాడ్! నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. ఆ ఏలియన్ ఎందుకు నాలా బిహేవ్ చేస్తోంది? ఎందుకు అలా?” అని అనుమానంగా అడిగాడు. “అది నీ బ్రెయిన్‌ని స్కాన్ చేసింది. నీ బ్రెయిన్‌లో వున్న పాత మెమరీస్ అన్నీ తనకి తెలుసు. ఎందుకంటే? మనుషుల్ని బాగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటోంది. అందుకే అది నిన్ను స్టడీ చేస్తోంది” అని వివరంగా చెప్పాడు.
“అంటే అది మళ్ళీ స్కాన్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అన్నీ తెలిసి పోతాయి” అని అన్నాడు రాజు, “అవును. అది మళ్ళీ స్కాన్ చేసే లోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి” అని స్వరూప్ అన్నాడు. ఇంతలో ఏలియన్ మళ్ళీ వచ్చింది. ఈ సారి స్వరూప్‌కి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. “ఐ థింక్ మై టైమ్ ఈస్ ఓవర్ సన్. నేను చేసిన ఈ మిస్టేక్ నుంచి నువ్వే అందరినీ కాపాడాలి” అని చెప్పి కళ్ళు మూసాడు. “డాడ్! డాడ్!” అంటూ ఏడుస్తున్నాడు.
తనకి స్పృహ పోయింది. తనని బాక్స్‌లో పెట్టి ఒక బటన్ నోక్కింది ఏలియన్. “మీ డాడ్ బాడీ! మా గ్రహంలో డాక్టర్లకి రిసర్చ్‌కి యూస్ అవుతుంది” అని నవ్వుతూ రాజు వైపు చూసింది. రాజుని స్కాన్ చెయ్యడానికి దగ్గరకి వస్తూ వుంది. రాజు మెడిటేషన్ చేస్తూ తన బ్రెయిన్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. తన బ్రెయిన్‌లో ఒక పాయింట్ హైలైట్ అయ్యేలా చేసాడు. అదేంటి అంటే “ఈ గదిలో మూల వున్న పసుపు రంగు బాక్స్ ఓపెన్ చేస్తే భూమి మీద సీక్రెట్‌లు మొత్తం తెలిసి పోతాయి. ఈ విషయం ఈ ఏలియన్‌కి తెలియొద్దు ప్లీజ్ ప్లీజ్”.
ఏలియన్ రాజు బ్రెయిన్‌ని స్కాన్ చేయగానే పైన పాయింట్ చాలా సార్లు హైలైట్ అయ్యింది. “పసుపు రంగు బాక్స్‌లో భూమి సీక్రెట్లు వున్నాయి”. స్కాన్ మధ్యలోనే ఆపేసి ఆ బాక్స్ వెతుకుతుంది ఏలియన్. ఆ మూల బాక్స్ దొరికింది. ఆ బాక్స్ తీసుకొని రాజు దగ్గరకి వచ్చి తెరుస్తున్నట్టు నటించి ఒక్కసారిగా నవ్వుతూ “డర్టీ హుమన్స్‌లో నీలాంటి ఇంటెలిజెంట్ హుమన్స్ కూడా వున్నారు. బ్రెయిన్‌ని కంట్రోల్ చేసి ఈ బాక్స్‌ని తెరిచేలా చేసావు. దాదాపు ఓపెన్ చేద్దాం అనుకున్నాను. కానీ బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు చివర లైన్‌లో “ఈ మాటర్ ఏలియన్ కనిపెట్టేస్తుందా?” అనే లైన్ కూడా చూసాను అంది నవ్వుతూ. “యు ఆర్ ఏ గ్రేట్ హ్యూమన్. నన్ను చంపడానికి నువ్వు చావడానికి కూడా సిద్ధం అయ్యావు. కానీ నీ మాటలు నమ్మి ఈ బాక్స్ ఓపెన్ చెయ్యడానికి నేను పిచ్చ హ్యూమన్‌ని కాదు. ఏలియన్‌ని. సూపర్ పవర్ ఏలియన్ అని” అని సీరియస్‌గా చూసింది. “హ్యూమన్‌లే బెస్ట్” అని రాజు కసిగా అన్నాడు. కొంచెం అటుఇటుగా కదిలి ఆ బాక్స్‌ని గట్టిగా లెగ్‌తో తన్నాడు. ఆ ప్లేస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. “యెస్ ఐ డిడ్ ఇట్ డాడ్. నేను అందరినీ కాపాడాను” అని అరుస్తూ కలలోంచి లేచాడు.
అప్పుడు చిన్న గతం కళ్ల ముందు కదిలింది. వాళ్ళ డాడ్ స్వరూప్ వరండాలో కూర్చొని వున్నాడు. తన ముందు కొంతమంది పిల్లలు వున్నారు. “సర్ సర్! అసలు ఏలియన్స్ వున్నాయా?” అని ఒక పిల్లాడు అడిగాడు. “అవి నిజంగా భూమి మీదకి ఎప్పుడైనా వచ్చాయా?” అని ఒక పాప అడిగింది. “అమెరికా వాళ్ళు ఏలియన్స్‌ని చూసారా? నిజమేనా?” అని ఇంకో పిల్లాడు. “మా నాన్న చెప్పాడు. నాసా సైంటిస్టులు ఏలియన్స్‌తో మాట్లాడుతారు” అని ఇంకో పాప. వీళ్ళందరి అనుమానాలు విని స్వరూప్ చిన్నగా నవ్వాడు.
“అసలు ఏలియన్స్ వున్నాయో లేదో ఎవ్వరికీ తెలియదు. అదంతా ఒక ఫాంటసీ. ఎవరి వాహనం నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుందో, ఎవరు తమ చుట్టుపక్కల ప్రదేశాల్ని మంచిగా ఉంచుకోరో, ఎవరు అయితే పబ్లిక్ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేస్తారో, పబ్లిక్ ప్లేస్‌లో స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తారో, నీళ్ళు వృథా చేస్తారో, ఇంకా అవినీతి చేసే నాయకులు, లంచం తీసుకొనే ఉద్యోగులు, వీళ్ళందరూ ఏలియన్స్. భూమి మీద బ్రతికే హక్కు లేదు వీళ్ళకి. ఎవరైతే మన నివసించే భూమిని గౌరవిస్తారో, ప్రేమిస్తారో, బాగా చూసుకుంటారో వాళ్ళే హ్యూమన్‌లు. ఇక్కడ హ్యాపీ గా వుండొచ్చు” అని నవ్వుతూ పిల్లలకి చెప్పాడు.
పక్కనే నిలబడి ఇదంతా వింటున్న రాజు క్లాప్స్ కొట్టాడు. “ఇంకా వెళ్ళ లేదా? క్రికెట్ మ్యాచ్ వుంది అన్నావు” అని స్వరూప్ టైమ్ చూస్తూ అడిగాడు. “మీ ఏలియన్ నిర్వచనం వింటూ ఆగిపోయాను. ఈ భూమి మీద అడ్డదిడ్డంగా బ్రతికే ప్రతీ వెధవ ఏలియన్‌యే! వాళ్ళకి ఇక్కడ బ్రతికే హక్కు లేదు. బాగుంది డాడ్! బ్రిలియంట్!” అని నవ్వుతూ నిలబడ్డాడు.
ఇంతలో రాజు ఫ్రెండ్స్ వచ్చారు. చేతిలో క్రికెట్ బ్యాట్, స్టంప్స్ వున్నాయి. “మామా ఆ గణేశ్ గాడు ప్రతీ బాల్ ఫోర్ కొడుతున్నాడు” అని మున్నా బాధ పడుతూ చెప్పాడు. “అయితే మనం ప్రతీ బాల్ సిక్స్ కొడుదాం పద!” అంటూ అందరూ గ్రౌండ్ కి వెళ్లారు.
కళ్ళు తుడుచుకొని కల నుంచి గతం నుంచి బయటకి వచ్చాడు. అప్పుడే ఫ్రెండ్ ఫోన్ కాల్ వచ్చింది. “ఆరే రాజు! ఈ సారి మనం టాస్ గెలిచాం. బాటింగ్ మనదే. త్వరగా రా” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
అందరూ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ వున్నారు. రాజు బాటింగ్ చేస్తున్నాడు. బాల్‌ని గట్టిగా కొట్టాడు. అది సిక్సర్. బాల్ గాల్లో వెళ్తూ వుంది. అదే టైమ్‌లో ఆకాశంలో దూరంగా ఏదో ఒక వింత ఆబ్జెక్ట్ భూమి వైపు వస్తూ వుంది. ఒకేసారి బంతి, ఆ ఆబ్జెక్ట్ క్రింద పడుతాయి. ఆ ప్లేస్‌లో ఒక పెద్ద గుంత పడింది. ఆ గుంత లోనే బాల్ పడింది. “ఏంటి నువ్వు కొట్టిన సిక్సర్‌తో ఇంత పెద్ద గుంత పడింది” అని మున్నా నవ్వాడు. రాజు ఆకాశం వైపు అనుమానంగా చూసాడు.