[కాలచక్రం ముందుకు సాగుతుంది. మాష్టారు దంపతులు గర్వించేలా నాన్నలు B.Sc. 1st క్లాసులో పాసవుతాడు. అమ్మలు, S.S.L.C. 92 శాతంతో పాసయి, స్కూలు ఫస్టుగా నిలుస్తుంది. నాన్నలుని ఎం.ఎస్.సి.లోనూ, అమ్మలుని ఇంటర్ సైన్సు గ్రూపులోనూ చేర్పిస్తారు మాష్టారు. చెల్లిని ఎంబిబిస్ చదివించాలనుకుంటాడు నాన్నలు (విశ్వేశ్వర శర్మ). ఇద్దరి చదువులకయ్యే ఖర్చులను తట్టుకునేందుకు ఇంటి ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటారు మాస్టారు, కళావతి. అందులో భాగంగా సూరమ్మ గారిని మానిపిస్తారు. కాలక్రమంలో నాన్నలు ఎం.ఎస్.సి. మొదటి సంవత్సరం పరీక్ష, అమ్మలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పాసవుతారు. ఇంకొక సంవత్సరం జాగ్రత్తగా ఉంటే ఆర్థిక సమస్యలు తీరుతాయని మాష్టారు దంపతులు భావిస్తారు. శర్మ ఇంటి వద్ద ట్యూషన్స్ చెప్పడం ప్రారంభిస్తాడు. మంగమ్మ (అమ్మలు) ఇంటర్ మంచి మార్కులతో పాసవుతుంది. మెడిసిన్ చదవాలని అనుకుంది. కుటుంబ సభ్యులంతా చర్చించుకుని ఆమోదిస్తారు. శర్మ ఎం.ఎస్.సి పాసవుతాడు, మంగమ్మకి మెడికల్ కాలేజీ సీటు వస్తుంది. – ఇక చదవండి]
[dropcap]ఒ[/dropcap]క్కమారు గతంలోకి వెళదామా. అప్పటికి, సుమారు మూడు దశాబ్దాల క్రితం, మాష్టారు, విజయనగరంలోని అక్కా, బావగార్ల ఇల్లు వదలి, విశాఖపట్నం చేరుకొన్నారు. ఆ రెండు కుటుంబాలూ, తరచూ కలుస్తూ ఉండేవి. పిల్లల చదువులు, పెళ్లిళ్ల విషయంలో, మాష్టారి ఆలోచనలు, అక్కా బావగార్లను, చాలవరకూ ప్రభావితం చేసేయి. మాష్టారి ప్రోద్బలంతోనే, వారి అమ్మాయి గిరిజను, S.S.L.C. వరకూ చదివించేరు. గిరిజకు పదిహేడవ ఏట, దూరపు బంధువు, B.A. పాసయిన, 22 సంవత్సరాల లక్ష్మీనారాయణకు ఇచ్చి వివాహం జరిపించేరు. లక్ష్మీనారాయణకు చిన్నతనంలోనే తండ్రి పోయేడు. శాస్త్రిగారే వాడిని B.A. వరకూ చదివించేరు. పెళ్లి అయిన పిమ్మట, మాష్టారి సలహాతో, శాస్త్రిగారే అల్లుని B.Ed. చేయించేరు. లక్ష్మీనారాయణ హైస్కూలులో టీచరు అయ్యేడు.
శాస్త్రిగారి పెద్ద కొడుకు శంకరశాస్త్రి, 1943 లో, 21 వ ఏట, B.A. పాసయ్యేడు. మాష్టారే, పట్టుబట్టి, వాడిని విశాఖపట్నంలో తనవద్ద ఉంచుకొని లా చేయించేరు. శంకరశాస్త్రికి, విజయనగరంలోని ఒక లాయరు గారి ఏకైక కుమార్తెతో వివాహమయింది. శాస్త్రిగారి రెండవ కొడుకు విశ్వేశ్వరశాస్త్రికి చదువు మీద ఆసక్తి తక్కువగా ఉండేది. ఇంటరు చదువుతున్న రోజులలోనే, అయిదేళ్ల క్రితం, రైల్వేసులో గుమస్తాగా చేరేడు. ఖర్గపూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహమయింది.
శర్మ, ఉద్యోగపర్వం ప్రారంభించేడు. తండ్రివలె, ఉద్యోగములో చేరకమునుపే, వృత్తిలో శిక్షణ పొందేడు. ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఆ నేపథ్యంలో, లెక్చరరుగా అతి త్వరలో స్థిరబడ్డాడు. మంగమ్మ, మొదటి రోజు మెడికల్ కాలేజీలో చేరడానికి తయారు అవుతూ ఉండేది. ముందుగా, పూజామందిరం ముందర, సాష్టాంగబడి నమస్కరించింది. తరువాత, తల్లిదండ్రులకు, అన్నకు, పాదాభివందనం చేసింది. శర్మ, స్వయంగా చెల్లెలును కాలేజీకి తీసుకెళ్ళేడు. చెల్లెలు కాలేజీ ప్రవేశ కార్యక్రమంలో, సహాయబడ్డాడు. మంగమ్మ, మెడికల్ కాలేజీ విద్యార్థిని అయింది. మొదటి రోజు, ఆ విశాలమయిన కాలేజీలో, బితుకు బితుకు మంటూ ఉండేది. మూడు నాలుగు రోజులలో అలవాటు పడింది. అంతలో సీనియర్ల రేగింగు ప్రారంభమయింది. రోజూ, కాలేజీకి వెళ్లడమంటే, జంకుగా ఉండేది. హాయిగా, B.Sc. లో చేరకుండా, ఆ ఊబిలో ఎందుకు దిగేను, అనుకొంటూ ఉండేది. అన్నయ్య బోధపరచేడు. అది కొద్ది రోజులే అని ధైర్యం పలికేడు. వాళ్ళతో గొడవ పడొద్దని సలహా ఇచ్చేడు. ‘వచ్చే సంవత్సరం నీకు, ఆ ఛాన్సు దొరుకుతుంది’ అని హాస్యం చేసేడు. ఏదయితేనేమి, మంగమ్మకు, గడ్డు రోజులు గట్టెక్కేయి. చదువులో పూర్తిగా నిమగ్నమయింది.
శర్మ, లెక్చరరుగా చేరేడు గాని, అది తన జీవితాశయం కాదు. ప్రైవేటు కాలేజీలో, తన భవిష్యత్తు ఏమిటో తెలుసు. అది కేవలము, చెల్లెలును మెడిసిను చదివించడానికి, ఆ పరిస్థితులలో రచించిన తాత్కాలిక వ్యూహం మాత్రమే. చెల్లెలి చదువుకు, ఎట్టి ఆటంకమూ కలుగకుండా, ఉన్నత శిఖరాలు అధిష్టించాలని, శర్మకు ఆశయముండేది. అట్టి అవకాశములకై, లోతుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ సంవత్సరమే, I.A.S. పరీక్షలు రాద్దామనుకొన్నాడు. తల్లిదండ్రులకు, తన అభిప్రాయం తెలియజేసేడు. ఇద్దరూ, సంతోషించి, ప్రోత్సహించేరు. మాష్టారు, పరీక్ష వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆ రోజుల్లో, ఒకే రాతపరీక్ష ఉండేది. అందులో నెగ్గినవారిని, ఇంటర్వ్యూకు పిలిచేవారు. పరీక్ష తయారీకి వీలయినంత సమయం అవసరము గనుక, కొడుకును, ట్యూషన్లు మానీమన్నారు. శర్మ, సంకోచిస్తున్నా మంగమ్మ చదువుకు ఎట్టి ఆటంకమూ ఉండదని మాష్టారు నొక్కి నొక్కి చెప్పేరు. తల్లి కూడా మాష్టారి సలహాకు, మద్దతు పలికింది. శర్మ, తల్లిదండ్రుల సలహాను పాటించేడు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, అభ్యర్థుల దరఖాస్తులను కోరుతూ, యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వారి ప్రకటన, పత్రికలలో ప్రచురణమయింది. శర్మ దానికి తగు విధముగా స్పందించేడు. అప్పటికి ముందుగానే, రాతపరీక్షలకు చదువు ప్రారంభించేడు. ఢిల్లీలోని, ఒక పేరున్న కోచింగ్ సెంటరునుండి, పోస్టల్ కోచింగు తీసుకొంటూ ఉండేవాడు. మాష్టారు, కళావతి, రోజూ పూజలో, కొడుకు ఆ పరీక్షలలో నెగ్గాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేవారు. మంగమ్మ కూడా అన్న సాఫల్యం కోరుతూ, దేముని ప్రార్థిస్తూ ఉండేది. అందరూ నిరీక్షిస్తుండెడి రోజు వచ్చింది. పరీక్షలు ప్రారంభమయ్యేయి. శర్మ పరీక్షలన్నీ రాసేడు. అన్ని పేపరులూ ఎంతో సంతృప్తికరంగా రాసేనని, నమ్మకంగా ఉండేవాడు. సమయం వృథా చేయకూడదని దలచి, వెంటనే ఇంటర్వ్యూకు, తయారు అవుతూండే వాడు. రోజూ తప్పక ఇంగ్లీషు పేపర్లు శ్రద్ధగా చదువుతూ ఉండేవాడు. రేడియోలో వార్తలు, చర్చలూ, ఆసక్తిగా వింటూ ఉండేవాడు.
మంగమ్మ చదువులో పూర్తిగా విలీనమయిపోయింది. తెలివయినదని, శ్రద్ధగా కష్టపడి చదువుకొంటున్నదని, అధ్యాపకుల దృష్టిలో ఉండేది. తెల్లని కోటు, మెడలో స్టెతస్కోపుతో ఉన్న కూతురిని చూసి, మాష్టారు దంపతులు అనుభవించుచుండెడి సంతోషం, వారిని ఊహాలోకంలో ఊయలలు ఊగించేది. మంగమ్మ కాలేజీలో చేరి, సంవత్సరంన్నర అయింది. సత్ఫలితాలతో ఫస్టు M.B.B.S. పాసయింది. సెకండు M.B.B.S. లోకి వెళ్ళింది.
సివిల్ సర్వీసెస్ రాత పరీక్షల ఫలితాలు ఢిల్లీలో వెలువడ్డాయి. రేడియోలో, ఆ విషయం మధ్యాహ్న వార్తలలో ప్రసారమయ్యేయి. అన్నా, చెల్లెలు ఇంటివద్దే ఉన్నారు. ఫలితాలు తెలుసుకోడానికి, ఆ మరుసటి ఉదయం వార్తాపత్రిక వచ్చేవరకూ, వేచి ఉండాలి. కుటుంబం అందరిలోనూ, చెప్పలేని ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో శర్మ పేరున టెలిగ్రాము వచ్చింది. ఢిల్లీలోని, కోచింగు సెంటరువారు, అభినందనలు తెలియజేస్తూ, పంపేరు. ఒక్కమారుగా ఇంట్లో వాతావరణం మారిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ పట్టరాని సంతోషం. శర్మ, నేరుగా పూజా మందిరం చేరుకొన్నాడు. ఇష్టదైవానికి, సాష్టాంగ నమస్కారం చేసేడు. మాష్టారు, కళావతీ కూడా, పూజామందిరం ముందర నిలబడి, ఇష్ట దైవాలకు, ధన్యవాదాలు సమర్పించేరు. పుత్రరత్నాన్ని, మాష్టారు బిగ్గరగా కౌగలించుకున్నారు. అభినందించేరు. కన్నతల్లి, నాన్నలును దగ్గరగా కౌగిలించుకొంది. తలపై ముద్దుల వర్షం కురిపించింది. అన్న మెడను, చేతులతో బంధించి, చెల్లెలు అభినందనలు తెలియజేసింది. మరునాడు ఉదయం, మాష్టారు, టెలిగ్రాము ద్వారా, ఆ శుభవార్త బావగారికి తెలియజేసేరు. అక్కా, బావగారూ, ఉప్పొంగిపోయేరు.
శర్మ, ఇంటర్వ్యూకు తయారీలో జోరు పెంచేడు. కోచింగు సెంటరు నుండి, అవసరమయిన విషయాల వివరాలు అందుతూ ఉండేవి. వార్తాపత్రికలు, రేడియో, ఆ రోజుల్లో, శర్మకు, నీడవలె తోడుగా ఉండేవి. అయితే, సమస్య ఏమిటంటే, ఇంటర్వ్యూలో ఏ విషయం నుండి ప్రశ్నిస్తారో, అది ప్రశ్నార్థకమే. అందుచేత ముఖ్యమని తోచిన ప్రతి విషయంలోనూ, వివరాలు తెలుసుకోడానికి శర్మ ప్రయత్నిస్తూ ఉండేవాడు. మాష్టారు కూడా, చేయగలిగిన సాయం చేస్తూ ఉండేవారు. న్యూసుపేపరు రాగానే, ముందుగా తను చదివి, ముఖ్యమని తోచిన విషయం ఎర్ర సిరాతో అండర్లైను చేసి ఉంచేవారు. సమయం కలసి వస్తుందని, తనకు తెలిసిన కొన్ని విషయాలు, భోజనసమయంలో, కొడుకుతో చర్చిస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే, విద్యా వైద్య సౌకర్యాలు లేక పల్లెటూళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, ఆయన స్వానుభవంతో తెలుసుకొన్న నిజాలు, తెలియజేసేవారు.
శర్మకు, U.P.S.C. నుండి ఉత్తరం అందింది. అందులో, ఇంటర్వ్యూ తేదీ మొదలగు వివరాలు తెలియజేసేరు. బయటకు చెప్పకపోయినా, మనసులో ఉద్రిక్తత ఉండేది, శర్మకు. తమ అభ్యర్థులకు, కోచింగుసెంటరువారు, కొందరు నిపుణలచేత మాక్ ఇంటర్వూస్ ఏర్పాటు చేసేరు. కోరిన వారు ముందుగా తెలియబరచి, ఇంటర్వ్యూ తేదీకి రెండు రోజులు ముందుగా ఢిల్లీలో, వారిని సంప్రదించవలెనని సలహా ఇచ్చేరు. వారు కోరినటులే, శర్మ ఢిల్లీ చేరుకొన్నాడు. మాక్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నిపుణల ప్రశంస పొందేడు. ఇంటర్వ్యూలో తప్పక నెగ్గుతాననే విశ్వాసం కలిగింది.
శర్మ, ఇంటర్వ్యూ హాలులో ప్రవేశిస్తూ, మనసులో సీతారాములను ప్రార్థించుకొన్నాడు. ఇంటర్వ్యూ ప్రారంభమయింది. శర్మ మదిలోని ఉద్రిక్తతను తగ్గించుటకు, ఆసీనులయి ఉండెడి మెంబర్లు, ముందుగా, శర్మ కుటుంబం, చేస్తున్న ఉద్యోగం గూర్చి సంక్షిప్తముగా అడిగి తెలుసుకొన్నారు. శర్మ ఉద్రిక్తత తగ్గింది. మెంబర్ల ప్రశ్నలు ప్రారంభమయ్యేయి. ఒక మెంబరు, ఉప్పుసత్యాగ్రహం గూర్చి అడిగేరు. శర్మ, తడుముకోకుండా, సమాధానం ఇచ్చేడు. మరొకాయన, విశ్వఖ్యాతి చెందిన, గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ కనుగొన్న, ‘రామానుజన్ సమ్మేషన్’ ఏమిటని అడిగేరు. శర్మ, తన ఫైలు నుండి, తెల్ల కాగితం, పెన్ను తీసుకొని, సమ్మేషన్ సూత్రాలు తెలియబరుస్తూ ఉండగా, మధ్యలోనే, ‘It is okay.’ అని, ఆ మెంబరు, మరో మెంబరుకు, చేతితో సంకేతమిచ్చేరు; ఇక మీరు అడగండి, అని. ఆయన, ఆ రోజుల్లో దేశం ఎదుర్కొనుచుండెడి, ప్రధాన సమస్య ఏమిటని అడిగేరు. పేదరిక నిర్మూలన, ముఖ్యముగా, గ్రామీణ ప్రాంతాలలో అని సమాధానం ఇచ్చేడు, శర్మ. సమస్య పరిష్కారంపై చర్చ జరిగింది. ఆ తరువాత మరికొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నాడు, శర్మ. ఇంటర్వ్యూ సుమారు ఒక గంట జరిగింది.
ఢిల్లీలో, శర్మ ఇంటర్వ్యూ ఎదుర్కొంటున్న సమయంలో, కొడుకు సాఫల్యం కోరుతూ, విశాఖపట్నంలో, కళావతి పూజామందిరం ముందరే కూర్చొని, దైవప్రార్ధన చేస్తూ ఉండేది. మంగమ్మ, మనసులో దైవనామ స్మరణ చేసుకొంటూ ఉండేది. మాష్టారూ అదే ఆలోచనలో ఉండేవారు. ముగ్గురూ, శర్మ రాకకై, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజు రానే వచ్చింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో, అన్నయ్య గుమ్మంలో అడుగు పెడుతూండడం, వెనక గదిలో నుండెడి, చెల్లెలు గమనించింది. “అన్నయ్య వచ్చేడు.” అని బిగ్గరగా ప్రకటన చేసింది. ఆత్రుతతో, అన్నను సమీపించింది. “ఇంటర్వ్యూ బాగా చేసేవా.” అని ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తూ, ఉంటె, దగ్గరలోనే ఉన్న మాష్టారు, “వాడిని ఇంట్లోకి రానీ అమ్మా.” అని చిరునవ్వుతో కూతురుకు సలహా ఇచ్చేరు. “ఇంటర్వ్యూ బాగానే అయింది నాన్నా.” అని చిరునవ్వుతో తండ్రికి తెలియజేసేడు, శర్మ “నాన్నా, తొందరగా స్నానం చేసి రా. భోజనం చేద్దువు గాని.” అని కొడుకుకు సలహా ఇచ్చింది, అక్కడే ఉన్న, కళావతి. శర్మ స్నానం అయింది. నలుగురూ భోజనాల దగ్గర ఇంటర్వ్యూ విశేషాలు మాట్లాడుకున్నారు.
మెడికల్ కాలేజీలో చేరేక, మంగమ్మలో చాలా మార్పు వచ్చింది. తోటి మగ విద్యార్థులతో, జంకు లేకుండా సంభాషణలు చేస్తూ ఉండేది. తన అభిప్రాయాలను, సంకోచించకుండా వెలిబుచ్చుతూ ఉండేది. ఆసుపత్రికి వస్తూండే, సామాన్యుల పరిస్థితులు, మంగమ్మను కలవరబరచేవి. ధనికులకు అందుచుండెడి సేవ, వారికి అందడం లేదేమో అని భావించేది. ఆ విషయాలు ఇంట్లో భోజనాల సమయంలో చర్చించేది. విద్యా వైద్యసౌకర్యాలు, అందరకు సమానంగా అందుబాటులో ఉండాలని తన అభిప్రాయాలు చెపుతూ ఉండేది. చిన్న లెక్కల మాస్టారు, గురువమ్మగారు, కూతురు అభిప్రాయాలను మెచ్చుకొనేవారు. ఆ సందర్భాలలో, మాష్టారు, చిన్నతనంలో నందవలసలో తన అనుభవాలు వివరంగా చెబుతూ ఉండేవారు. ఆ ఊరు జమీందారుగారు, హృదయపూర్వకముగా చేపట్టిన సామాజిక సేవ, కృషి, కళ్ళకద్దినట్లు చెప్పేరు. అది విన్న, మంగమ్మ, జమీందారు గారు అప్పటికి ఇంకా ఉన్నారా, అని అడిగింది.
దానికి స్పందిస్తూ, “బాగా పెద్దవారయి ఉంటారు; కానీ ఉన్నారమ్మా.” అని ధృవీకరించేరు.
“మీరు ఆ ఊరు వదలి ఇన్ని సంవత్సరాలు అయింది కదా నాన్నా; మీకు ఎలా తెలుసు.” ఆశ్చర్యంతో అడిగింది, మంగమ్మ.
“తల్లీ, ప్రతీ సంవత్సరం లాగే, క్రిందటి నెల శ్రీరామనవరాత్రులకి, ఆయనకు శుభాకాంక్షలు పంపించేను. ఆయన మనందరి క్షేమం కోరుతూ జవాబు ఇచ్చేరు. మన ఇంట్లో, మంచీ చెడ్డా, ఏది జరిగినా, ఆయనకు తెలియబరుస్తూ ఉంటానమ్మా. ఆయన వెంటనే జవాబు ఇస్తారు.” కూతురు అనుమానం తీర్చేరు, మాష్టారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయని, ఆ రోజు, రేడియోలో మధ్యాహ్న వార్తలలో ప్రసారమయింది. కళావతి ఆ వార్త విన్నాది. శర్మ కాలేజీలోను, మాష్టారు స్కూలులోను, మంగమ్మ కూడా కాలేజీలోను ఉండేవారు. ఆ ముగ్గురూ ఇంటికి ఎప్పుడు వస్తారా, ఎంత వేగరం, వారికా సంగతి చెప్పీదా, అని తహతహలాడుతూ ఉండేది, కళావతి. కాలేజీలో ఆ వార్త శర్మకు తెలిసింది. మనసులో ఉద్రిక్తత ప్రారంభమయింది. వీలు చేసుకొని, వేగిరం ఇంటికి వచ్చేడు. గుమ్మంలోనే, ఆ వార్త చెప్పింది, తల్లి. ఆందోళనతో, “అమ్మా, టెలిగ్రాము ఏదయినా వచ్చిందా.” అని అడిగేడు, శర్మ.
“టెలిగ్రాము ఏదీ రాలేదు నాన్నా, ఎక్కడినుండి రావాలి.” ఎందుకు అలా అడిగేడో, కళావతికి తెలియలేదు.
“కోచింగు సెంటరు నుండి వచ్చిందేమో, అని అడిగేను.”
“క్రిందటిమారు, రాత్రి వచ్చింది కదా; ఇవాళ కూడా రాత్రి వస్తుంది నాన్నా; గాభరా పడకు; తప్పక సెలెక్టు అవుతావు. కాళ్ళూ చేతులూ కడుగుకొని రా. వేడిగా ఇడ్లీలు తిందువుగాని.” అని, ఆందోళనలో ఉన్న కొడుకుకు, ధైర్యం చెప్పింది, కళావతి.
మరికొద్దిసేపట్లో, తండ్రీ కూతుళ్లకూ తెలిసింది, ఆ వార్త. ఆ ఇద్దరూ, వీలయినంత వేగరం ఇల్లు చేరుకొన్నారు. నలుగురూ, ఆత్రుతతో టెలిగ్రాము కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. రాత్రి పదకొండు దాటింది. టెలిగ్రాము రాలేదు. శర్మకు, ఆశలు సన్నగిల్లేయి.
“ఒక్కొక్కప్పుడు, టెలిగ్రాములు ఆలస్యంగా వస్తాయి నాన్నా. పొద్దున్నే పేపరులో వస్తాయి. తప్పక సెలెక్టవుతావు నాన్నా. చాలా రాత్రి అయింది. పడుక్కో.” అని మాష్టారు ధైర్యం చెప్పేరు. కళావతి కూడా ఆ సలహాయే ఇచ్చింది. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. సూర్యోదయం కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు.
తెల్లవారింది. న్యూస్ పేపరు వచ్చింది. శర్మ, అతృతతో తన నంబరు వెయ్యి కళ్ళతో వెతుక్కొన్నాడు. కనిపించలేదు. నిరాశతో పేపరు నేల రాల్చేసేడు. మాష్టారు, అది అందుకొని, తనూ సావధానంగా వెతికేరు. ఫలితం శూన్యమయింది. అందరి మనసులోనూ, దుఃఖం చేరుకొంది.
అన్న ఒక్కడూ గదిలో ఉండడం, మంగమ్మ చూసింది. అక్కడకు వెళ్ళింది. అన్న ప్రక్కన కూర్చొంది.
“I am sorry, అన్నా.” అని అన్నయ్య అరచెయ్యి పట్టుకొంది.
“దేనికోసం, సారీ.” అని అడిగేడు, శర్మ.
“నా చదువు కోసం, నువ్వు లెక్చరరుగా చేరేవు. లేకపొతే, ఆ సమయంలో కూడా I.A.S. కి చదువుకొని ఉండేవాడివి. తప్పక సెలెక్ట్ అయిఉండేవాడివి.” తను, సారీ అని ఎందుకు ఆందో అన్నకు చెప్పింది చెల్లెలు.
“అదేదీ కాదమ్మా. అలా అయి ఉంటే, రిటెన్లో ఫెయిలు అయి ఉందును. అంచేత అలా అనుక్కోకు. ఎంత బాగా ప్రిపేరయినా, ఇంటర్వ్యూలో ఏమిటి అడుగుతారో చెప్పలేమమ్మా. సరే, Past is past. I want to forget about it. ఫార్చునేటుగా, నాకు ఈ ఏడాది, ఇరవై నాలుగు ఏళ్ళు నిండవు. So, I have one more chance. Let me try again.” అని తన తదుపరి ప్రణాళిక, చెల్లికి చెప్పేడు.
“Definitely try again. ఈ మారు తప్పక సెలెక్టవుతావు.” అని తన కోరిక అన్నకు చెప్పింది, మంగమ్మ.
అప్పటివరకూ, ఎప్పుడూ లేనిది; ఉదయం పలహారాల వేళ, నిశ్శబ్దత నెలకొంది. దానిని మాష్టారు ఛేదిస్తూ, “అంతగా disappoint అవ్వకు నాన్నా. శాయశక్తులా కష్టబడ్డావు. ఫలితాలు మన చేతిలో ఉండవు కదా. నీకేమీ ఉద్యోగం లేకపోలేదు. కాలేజీలో లెక్చరరుగా ఉన్నావు. చిన్న వాడివి. ఇంకా ఇలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి.” అని దిగాలుతో నున్న కొడుకుకు, ఆశా కిరణాలు చూపేరు.
ప్రక్కనే ఉన్న మంగమ్మ, “నాన్నా, అన్నకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు. I.A.S. కు ఇంకా ఒక చాన్సు ఉందండీ. మళ్ళీ ఎపియరు అయితే, ఈ మారు తప్పక సెలెక్ట్ అవుతాడండీ.” అని అనగానే, మాష్టారు, “అవునా నాన్నా; మరో ఛాన్స్ ఉందా.” అని సంశయం తీర్చుకోబోయేరు. అవునన్నట్లు, బుర్ర ఊపేడు, శర్మ.
ఉత్సాహంతో మాష్టారు, “నాకు ఆ సంగతి తెలీదు.. నాన్నా, రేపు పంచమి. రేపే చదువు ప్రారంభించు. ఈ మారు తప్పక సెలెక్ట్ అవుతావు అని ప్రోత్సహించేరు.
తల్లీ, చెల్లెలు కూడా ప్రోత్సహించేరు. రాత్రి పడకగదిలో, మాష్టారు దంపతులు ఆ విషయం మాట్లాడుకున్నారు. ఆ మారు, దేమునికి ముడుపు కట్టడం మరచిపోయేనని, ఈ మారు వెంటనే కడతానని, కళావతి, మాష్టరుకు చెప్పింది. మాష్టారు కూడా, గతమారు మరచిపోయేనని ఈ మారు తప్పక ఆంజనేయుని మెడలో వడమాల వేస్తానని, మొక్కుకున్నారు.
శర్మ,I.A.S. రాతపరీక్షలకు తయారీ ముమ్మరం చేసేడు. తత్సంబంధిత, U.P.S.C. వారి ప్రకటన వచ్చింది. శర్మ ఎప్లై చేసేడు. పరీక్షల ముందు, రెండు వారాలు శలవు పెట్టి, పుస్తకాలకు అంకితమయిపోయేడు. పరీక్షలు ప్రారంభమయ్యేయి. అన్ని పేపర్లు బాగా రాసేననే నమ్మకంతో ఉండేవాడు. ఫలితాల కొరకు ఎదురు చూడకుండా, ఇంటర్వ్యూకు ప్రేపరేషను మొదలుపెట్టేడు.
మంగమ్మకు హాస్పిటలులో షిఫ్ట్ డ్యూటీసు ప్రారంభమయ్యేయి. ఒక ప్రక్క, కాలేజీ క్లాసులు, మరో ప్రక్క, హాస్పిటల్ డ్యూటీసుతో, ఊపిరి పీల్చుకోడానికి కూడా టైము దొరక్కుండా అయింది.
శర్మ, రాత పరీక్షా ఫలితాలు, ఢిల్లీలో వెలువడ్డాయి. మరునాడు పేపరులో శర్మ ఫలితాలు చూసుకున్నాడు. శర్మ పాసయ్యేడు. ఇంటందరూ సంతోషించేరు.
ఓ నాటి రాత్రి, మాష్టారు దంపతులు, పిల్లల పెళ్లిళ్ల విషయం, ఆలోచించుకొంటూ ఉండేవారు.
“ఏమండీ, మన పిల్లల పెళ్లిళ్ల విషయం, ఏమిటి చెయ్యడమో నాకు బోధపడడం లేదండీ. మీరు ఏమయినా ఆలోచించేరా.” అని తనను కలవరపరుస్తున్న విషయంలో, భర్త అభిప్రాయం కోరింది, కళావతి.
“నేనూ, కొన్నాళ్ళయి అదే ఆలోచిస్తున్నాను, కళావతీ. ఆడపిల్ల పెళ్లి చెయ్యకుండా, మగపిల్లడి పెళ్లి చెయ్యకూడదు అంటారు, మన వాళ్ళు. నాన్నలు చదువు అయిపొయింది. మంచి ఉద్యోగంలో స్థిరబడ్డాడు. ఇంకా పెద్దది, కలెక్టరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచిదే. ఈ మారు కూడా రాత పరీక్షల్లో పాసయ్యేడు. సీతారాములు అనుగ్రహిస్తే, ఇంటర్వ్యూలో సెలెక్టవుతాడు. ఏదయినాగాని, మరో ఏడాది రెండేళ్లలో, వాడి పెళ్లి చేసీస్తే, మనకో బాధ్యత తీరుతుంది. కానీ, అప్పటికి అమ్మలు చదువు పూర్తవ్వదు; అదే ఆలోచిస్తున్నాను, కళావతీ.” సమస్యను విడదీసి చెప్పేరు, మాష్టారు.
“దాని చదువు ఇంకా ఎన్నాళ్ళు ఉందండీ. ఈ మధ్య, ఓ మారు అడిగితే, ఏదో, ఫస్టు M.B. సెకండు M.B. అని చెప్పింది. ఏమిటో ఆ గందరగోళం. నాకేమీ బోధపడలేదు. సరే, ఏదో చదువుతోంది కదా అని దాన్ని మరి అడగలేదు.”
“కళావతీ, గందరగోళం ఏదీ లేదు. మొత్తం M.B.B.S. చదువు, నాలుగున్నర సంవత్సరాలు. దాన్ని, ఒక్కొక్కటి ఏడాదిన్నర చొప్పున మూడు భాగాలు చేసేరు. వాటిలో అమ్మలుది మొదటి భాగం, ఫస్టు M.B.B.S. అయిపొయింది. ఇప్పుడు రెండో భాగంలో ఉంది. ఇదయితే, మరో భాగం ఉంటుంది. ఆ తరువాత మరో ఏడాది శిక్షణ పొందితే, డాక్టరు పట్టా ఇస్తారు. బోధపడిందా.” వివరంగా, కూతురు చదువు విషయంలో, లెక్కలు బోధపరిచేరు, లెక్కల మాష్టారు.
“డాక్టరు చదువంటే, ఆంజనేయుడి తోకలాగ, ఇన్నాళ్లు ఉంటుందనుకోలేదండీ. సరేలెండి, ఆ లెక్కలన్నీ అటు ఉంచి, దాని చదువు ఎప్పటికి అవుతుందో చెప్పండి.” బిట్ క్వెస్చను వేసింది, గురువమ్మగారు.
“సుమారు, మరో మూడున్నర సంవత్సరాలు అనుకో.” మాష్టారు ఆన్సర్ టు ద పోయింట్. చెప్పేరు.
“మరో మూడున్నర సంవత్సరాలే… అప్పటిదాకా, నాన్నలుకు పెళ్లి చెయ్యకుండా ఎలా ఉంచుతామండీ. ఆ లోపే, అమ్మలు చదువు పూర్తయినదాకా చూడకుండా, దాని పెళ్లి చేసీయాలండీ.”
“నువ్వన్నది బాగానే ఉంది, కళావతీ. కానీ, ఇవి మన రోజులు కావు; పెళ్లంటే ఏమీ తెలియనిదాన్ని, పెళ్లిపీటలమీద కూర్చోబెట్టి, మెడవంచి మూడు ముళ్ళూ వేయించడానికి. కాలం మారింది. ఆడపిల్లలు కూడా చదువుకొంటున్నారు. వాళ్ళని అడగకుండా పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. మొదట అమ్మలుని అడగాలి. ఏమిటంటుందో కనుక్కోవాలి.”
“అవునండీ, మొదట అమ్మలుని అడుగుదాం. మీరన్నట్లు, కాలం మారింది.”
“అదే కళావతీ, కాలంతోబాటు మనమూ మారాలి. సరే, కాని, ఇప్పట్లో పిల్లలతో ఆ విషయాలు మాట్లాడ వద్దు. నాన్నలు ఇంటర్వ్యూ కూడా అయిపోయి, దాని ఫలితాలు కూడా వచ్చేక మాట్లాడొచ్చు.” అని సంభాషణ ముగిస్తూ, నిద్ర వస్తోందని, మాష్టారు పక్కమీద వాలేరు. వంటింట్లో పనులున్నాయని, కళావతి వంటింటికి వెళ్ళింది.
నిర్ణీత తేదీన, శర్మ, ఇంటర్వ్యూ కొరకు ఢిల్లీలోని U.P.S.C. ఆఫీసు చేరుకొన్నాడు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మున్నగు ఫార్మేలిటీస్ పూర్తి అయ్యేయి. ఇంటర్వ్యూ కొరకు హాలులో ప్రవేశించేడు. కమిటీ మెంబర్ల ముందు ఆసీనుడయ్యేడు. ఇంటర్వ్యూ ప్రారంభమయింది. ఒక మెంబరు, ప్రశ్నలతో, శర్మలోని ఆందోళన తగ్గించేరు. మరొకాయన, అప్పటి విద్యావిధానం మీద శర్మ అభిప్రాయాలు అడిగేరు. శర్మ అప్పటి విద్యావిధానాన్ని విశ్లేషించి చెబుతూ, ‘విద్యావిధానం విద్యార్థుల కొరకు ఉండాలి గాని, విద్యార్థులు విద్యావిధానం కొరకు ఉండరాదు.’ అని తన నిశ్చితాభిప్రాయాన్ని వినయంగా చెప్పేడు. తరువాత, మరో మెంబరు, మిక్సిడు ఎకానమీ మీద శర్మ అభిప్రాయాలను అడిగేరు. అప్పటి మన దేశ ఆర్థిక పరిస్థితులలో, మిక్సిడు ఎకానమీయే సరయినదని, విశదీకరించి తన అభిప్రాయాన్ని చెప్పేడు, శర్మ. తరువాత మరో మెంబరు, ‘నీ అప్లికేషనులో క్రికెట్ ఆడుతూంటావని రాసేవు. నీ ఉద్దేశంలో, క్రికెట్ చరిత్రలో సాటిలేని క్రికెటరు ఎవరు’ అని అడిగేరు. శర్మ, సంకోచించకుండా ఠక్కున సమాధానమిచ్చేడు; ఆస్ట్రేలియాకు చెందిన, డాన్ బ్రాడ్మన్ అని. ఆ మెంబరే, చిరునవ్వుతో, ‘బ్రాడ్మన్ ఆఖరి మేచిలో ప్రత్యేకత ఏమిటి.’ అని, అడిగేరు. శర్మ కూడా చిరునవ్వుతో, ‘బ్రాడ్మన్ తన ఆఖరి మేచిలో డక్ అవుట్ అయిపోయేడు. పరుగులేమీ చెయ్యలేకపోయేడు. ఆ మేచిలో ఆయన కనీసం నాలుగు పరుగులు చేసి ఉంటే, టెస్ట్ మేచిలలో ఆయన ఏవరేజ్ స్కోరు, నూరు అయిఉండేది.’ అని గడగడా చెప్పేడు. అందరి ముఖాన్న చిరునవ్వు వచ్చింది.
‘నీ జీవితంలో నిన్ను ఎవరు ఎక్కువగా ప్రభావితం చేసేరు.’ అని ఒక మెంబరు, శర్మను ప్రశ్నించేరు. శర్మ కొద్ది క్షణాలు, నేల వైపు దృష్టి సారించేడు. ఏదో ఆలోచించుకొన్నాడు. ‘నా జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వారు,(ఒక్క క్షణం ఆగి) మా నాన్నగారు, అని సమాధానం ఇస్తూ, నాన్నగారు పదాన్ని కొద్దిగా నొక్కి చెప్పేడు. మరో మెంబరు, ‘ఆయన ఎలా ప్రభావితం చేసేరు’ అని, వివరణ కోరేరు. శర్మ, క్లుప్తంగా, తండ్రి రెండవ తరగతిలో ఉన్నప్పుడే, చదువుకొని ఉద్యోగం చేయాలని ధృడ సంకల్పం చేసుకొన్నారని చెబుతూ, ‘ఆ ఉద్దేశంతో, వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడవ తరగతినుండే, తల్లిదండ్రులను విడిచి, పై ఊరిలో విద్యనభ్యసించేరు. S.S.l.C. తరువాత, కాలేజీ చదువుకు అవకాశమున్నా, పరిస్థితులను అవగాహన చేసుకొని, కుటుంబ బాధ్యత వహించి, ఉద్యోగంలో చేరేరు. తమ సుఖసంతోషాలు త్యాగం చేసి, పిల్లలిద్దరకు ఉన్నత విద్య అందించేరు. ఆ విషయంలో మా తల్లి పోషించిన పాత్ర కూడా చాలా ప్రశంసనీయము. అవన్నీ, మా నాన్నగారు, కాలంతోబాటు మారడం వలెనే జరిగేయి. మా నాన్నగారు, కాలంతోబాటు మారిఉండకపోతే, ఈ రోజు, నేను, వంశపారంపర్యంగా, గుడిలో పూజారిగా ఉండేవాడిని.’ అని వివరంగా చెబుతూ ఉంటే, శర్మకు కళ్ళు చెమ్మగిల్లేయి. అది గమనించిన ఒక మెంబరు, ఎదురుగా టేబుల్ మీద ఉన్న గ్లాసులో మంచినీళ్లు త్రాగమని సలహా ఇచ్చేరు. శర్మ ఇంటర్వ్యూ ముగిసింది.
శర్మ ఇల్లు చేరుకొన్నాడు. ఆతృతగా నుండెడి, తల్లిదండ్రులు, చెల్లెలితో, ఇంటర్వ్యూ వివరాలు పంచుకున్నాడు. ఆ మారు తప్పక సెలెక్ట్ అవుతాడని, ముగ్గురూ ఆశించేరు. శర్మ, చిరునవ్వుతో, ‘let us hope so.’ అన్నాడు. తన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకో దలిచేడు. మళ్ళీ ట్యూషన్సు చెప్పడానికి సన్నాహాలు చేసేడు. ఆ రంగంలో పేరుపొందిన శర్మకు, అతి త్వరలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ పరిణామంతో, తండ్రిని ట్యూషన్సు మానీమన్నాడు. మాష్టారు, మనసులో అమ్మలు పెళ్లి దృష్ట్యా, ఆదాయం తగ్గించుకోడానికి సుముఖంగా లేకపోయేరు. శర్మ, తల్లి చేత కూడా చెప్పించేడు. తుదకు, శని ఆదివారాల ట్యూషన్లకు స్వస్తి చెప్పేరు.
సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెలువడే రోజులు సమీపిస్తూ ఉండేవి. ఓ రోజు మధ్యాహ్న వార్తలలో, సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలు వెలువడినట్లు ప్రసారమయింది. ఆ వార్త, ఇంట్లో కళావతి విన్నాది. భర్త, పిల్లలకు, ఆ వార్త ఎలా తెలియజేయాలని ఆతృతలో ఉండేది. శర్మ, ఆ సమయంలో, కాలేజీకి ఎదురుగా ఉండెడి హోటలులో కాఫీ త్రాగుతూ ఉండేవాడు. హోటల్ కౌంటరులోని రేడియో నుండి వార్తలు ప్రసారమవుతూ ఉండేవి. శర్మ పరాకుగా వింటూ ఉండేవాడు. సివిల్ సర్వీసెస్ అన్న రెండు పదాలు, శర్మ చెవిలో బడ్డాయి. తత్క్షణం, త్రాగుతున్న కాఫీ కప్పును టేబులుపై ఉంచి, కౌంటరువైపు వడిగా అడుగులు వేసేడు. ఫలితాలలో ఎందరు ఆడవారు సెలెక్ట్ అయ్యేరో మున్నగు వివరాలు ప్రసారమవుతూ ఉండేవి. ఫలితాలు వెలువడ్డాయని, శర్మకు రూఢి అయింది. ఆందోళన మొదలయింది. అప్పుడే, స్కూలు ప్రక్కనే ఉండెడి హోటలులో రవదోశ తిని, కాఫీ త్రాగి వచ్చిన, పెద్ద లెక్కలు మాష్టారు, వార్తలలో విన్నానని చెప్పగా, మాష్టరుకు తెలిసింది.
మాష్టారు, శర్మ, చేరిన గంటకు, మంగమ్మ ఇల్లు చేరుకొంది. నలుగురకు ఒకే ఆందోళన. కాని, ఉదయం న్యూసుపేపరు వచ్చేవరకూ, వేచి ఉండవలసిందే. శర్మ, తన ఇంటర్వ్యూ నెమరు వేసుకొన్నాడు. సెలెక్ట్ అవుతాననే నమ్మకంతో ఉండేవాడు. ఏ కారణం చేత I.A.S. కాకపోయినా, I.P.S. కు తప్పక సెలెక్ట్ అవుతానని అనుకొన్నాడు. ఆందోళన కారణంగా, ఆ రాత్రి నలుగురికీ కలతనిద్రే అయింది. తెల్లవారింది. నలుగురి ఎదురు చూపులూ, న్యూసుపేపరు కోసం. అన్న, చెల్లెలు, గుమ్మం దగ్గర, రోడ్డుమీదే నిలబడి, న్యూసుపేపరు కుర్రాడు కోసం, ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉండేవారు. ముందుగదిలో మాష్టారు దంపతులు వేచి యుండేవారు. ఆమడ దూరంలో ఉండెడి న్యూసుపేపరు కుర్రాడిని చూసి, పరుగున వాడిని చేరి, పేపరు పట్టుకొని, అదే వేగంతో వచ్చి, కళ్ళకు అద్దుకొని, పేపరును అన్నకు అందజేసింది, మంగమ్మ. నలుగురి దృష్టీ పేపరు మీదే. అన్నా చెల్లెలు, ఒకరి ముఖం ప్రక్కనే ఒకరి ముఖం పెట్టుకొని, నంబరు కొరకు చూస్తూ ఉండేవారు. మంగమ్మ, ఒక్కమారుగా, “అన్నా, ఇదిగో నీ నంబరు.” అని అన్నకు చూపించి, “అన్న సెలెక్ట్ అయ్యేడు.” అని బిగ్గరగా ప్రకటించింది. అన్న మెడను చేతులతో బిగించి, “కంగ్రాట్స్ అన్నా, యు ఆర్ గ్రేట్.” అని అభినందించింది. ఆ సమయంలో, శర్మ తన నంబరు ఏ స్థానంలో ఉన్నదో లెక్క చూసుకొంటూ ఉండేవాడు. లెక్క పూర్తి అయింది. పట్టరాని సంతోషంతో, “I am at 32. I am selected for I.A.S.” అని రెండు చేతులూ మీదకు ఎత్తి, ప్రకటించేడు. మాష్టారు పుత్రరత్నాన్ని బిగ్గరగా కౌగలించుకొని అభినందించేరు. కన్నతల్లి తనయుని కౌగలించుకొని, తలపై ముద్దుల వర్ధం కురిపించింది. నలుగురి కళ్ళలోనూ ఆనంద భాష్పాలు. చిన్న లెక్కల మాష్టారు, గురువమ్మల బిడ్డడు, దేశంలో అగ్రస్థానానికి చెందిన ఉద్యోగాలలో నొకదానికి అర్హుడయ్యేడు. ఆ శుభ వార్త నలుప్రక్కలా వాయువేగంలో వ్యాపించింది.
వీధిలో తెలిసినవారు స్వయంగా వచ్చి, శర్మను, మాష్టారు దంపతులను, అభినందించేరు. ప్రక్క ఇంట్లో ఉండెడి, తాతగారు మామ్మలకు, శర్మను చిన్నప్పటినుండి తెలుసు. ఉభయులూ స్వయంగా వచ్చి, శర్మను, మాష్టారు దంపతులను అభినందించేరు. శర్మ ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసేడు. “శర్మా, మన వీధి కుర్రాడివి; కలెక్టరు అయ్యేవు. నువ్వయినా మన రోడ్డు బాగు చేయించు నాయనా.” అని కాబోయే కలెక్టరుగారికి తొలి విన్నపం వినిపించేరు. మామ్మగారు. అందరూ ఘొల్లున నవ్వేరు. పోష్టాఫీసు తెరవగానే, మాష్టారు బావగారికి టెలిగ్రాము ఇచ్చేరు. మాష్టారుకు స్కూలులోనూ, శర్మకు కాలేజీలోనూ, అభినందనలు అందేయి. ఆ రోజు మాష్టారి కుటుంబం పండుగగా జరుపుకున్నారు.
(సశేషం)