అలనాటి అపురూపాలు-135

1
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుస్వరాల కర్త రవి:

హిందీ సినీ సంగీతంలో ఎందరో ఉద్దండుల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్వరకర్త రవి. ఆయన పూర్తి పేరు రవి శంకర్ శర్మ. ఆయన 3 మార్చ్ 1926 నాడు ఢిల్లీలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. ఇంటి వాతావరణం సంగీతానికి అనుకూలించనప్పటికీ, బాల్యం నుంచే పాటలంటే ఆసక్తి కలిగింది రవికి. ఇంటి పరిసరాలలో బుధవారాలు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన భజనలు పాడేవారు. ఆయన గానానికి ముగ్ధులైన తండ్రిగారు ఒక హార్మోనియం కొనిచ్చారట. అయితే రవి మెట్రిక్యులేషన్ పరీక్ష పాసవలేకపోయారు. దాంతో కుటుంబానికి ఆర్థికంగా సహాయంగా ఉండడం కోసం ఢిల్లీలో పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగంలో చేరారు. ఒకసారి ఢిల్లీలో ఉన్న మహమ్మద్ రఫీని రవి అనుకోకుండా కలిసారట. రఫీ ఆయనికి కొన్ని సలహాలు ఇచ్చి, నేపథ్య గాయకుడవ్వాలనే కోరికను తీర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నించమని చెప్పారట. రఫీ సలహా నచ్చిన రవి ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి బొంబాయి చేరారు. దక్షిణాదిన ఆయనను ‘బొంబాయి రవి’ అనేవారు. తొలి రోజుల్లో మలాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద నిద్రించేవారు. కొద్ది కాలానికి ఆయన కష్టాలు తీరి ఫిల్మిస్థాన్ స్టూడియోలో తబలా వాయిద్యకారుడిగా, కోరస్ గాయకుడిగా చేరారు. రవి 1952లో వచ్చిన ‘ఆనంద్‍మఠ్’ చిత్రంలో ‘వందేమాతరం’ పాటకి కోరస్‍లో తన గొంతునిచ్చారు. ఈ పాటకి హేమంత్ కుమార్ స్వరాలందించారు. కోరస్ గాయకుడిగా ఎస్.డి. బర్మన్ గారి ‘నౌజవాన్’ సినిమాకి కూడా పాడారు. రవి ప్రతిభని గుర్తించిన హేమంత్ కుమార్ తనకి సహాయకుడిగా ఉండమన్నారట. రవి ఆయన వద్ద సహాయకుడిగా చేరి సమ్రాట్, షర్త్, చంపాకలి, ఇంకా సూపర్ హిట్ సినిమా నాగిన్‍కి పని చేశారు. ఇందులో నాగిన్ కోసం రవి స్వతంత్ర్యంగా రూపొందించిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ కుటుంబంతో కలిసి కశ్మీర్‌కి వెళ్ళబోతున్న హేమంత్ కుమార్ రవిని పిలిచి “నేను కశ్మీరు నుంచి తిరిగి వచ్చాకా, నువ్వు నా దగ్గర పనిచేయబోవడం లేదు” అన్నారుట. రవికి ఏమీ అర్థం కాలేదట. “గురువుగారు, నా వల్ల ఏమయినా తప్పు జరిగిందా?” అని అడిగారట. హేమంత్ కుమార్ నవ్వేసి, “రవీ, నీలో గొప్ప ప్రతిభ ఉంది. ఇక నుంచి స్వతంత్ర్యంగా పని చేయగల సామర్థ్యం ఉంది” అన్నారు.

[బాలీవుడ్ కోరస్ బృందంలో చిక్కుకుపోయి ఉన్న రవిని మొదట గుర్తించింది హేమంత్ కుమార్ గారే. ఇరవైలలో ఉన్న ఆ నవ యువకుడిని చూసిన హేమంత్ కుమార్ అతనిలో అపారమైన ప్రతిభ ఉందని గ్రహించారు. ఏవైనా మూడు ట్యూన్‍లను వినిపిస్తే, వాటిలో ఏది హిట్ అవుతుందో రవి సరిగ్గా చెప్పేవారట. నాగిన్ (1954) సినిమా కోసం సుమారు 30 బాణీలను కూర్చి అందులోంచి రెండింటిని ఎంచమంటే, రవి ‘మన్ డోలే మేరా తన్ డోలే’, ‘ఊంచీ ఊంచీ దీవారోం కో’ అనే రెండింటిని సూచించారట. రవి ఎంచిన ఈ పాటలు హేమంత్ కుమార్‍ని అత్యుత్తమ స్వరకర్తగా నిలపడమే కాదు, ఎవర్ గ్రీన్ పాటలుగా చిరకాలం నిలిచాయి కూడా].

రవి ప్రతిభ గురించి ఈ నోటా, ఆ నోటా విన్న దర్శకనిర్మాత దేవేంద్ర గోయల్ హేమంత్ కుమార్‍ని కలిసి, తను తీయబోయే సినిమాకి రవిని ఇవ్వమని కోరారు. హేమంత్ సంతోషంగా అంగీకరించారు. అయితే ఈ తొలి అవకాశం అందుకోవడానికి రవి కాస్త భయపడ్డారట. సినిమా ఫలితం తారుమారయితే ఉన్న ఈ అసిస్టెంట్ ఉద్యోగం కూడా పోతుందేమో అనుకున్నారట. కాస్త సంకోచిస్తునే గోయల్ గారి సినిమా ‘వచన్’ (1955)కి స్వరాలు అందించారు. ఈ సినిమా సంగీతం, ఇంకా ‘చందా మామా దూర్ కే’, ‘జబ్ లియా హాథ్ మే హాథ్’, ‘ఏక్ పైసా దే దో బాబూ’ అనే మూడు పాటలు సూపర్ హిట్‍లయి రవిని ఉన్నత స్థానానికి చేర్చారు. నౌషాద్, ఓ.పి.నయ్యర్ లాంటి దిగ్గజాల సరసన కూర్చోబెట్టాయి.

రవి సంగీతం ఢిల్లీ వీధుల్లోంచి వచ్చినది. దాని మూలాలు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోనూ, పంజాబ్ లోనూ ఉన్నాయి. జానపద శైలిలో, చెవులకు వినసొంపుగా ఉంటుంది. రవి అత్యంత నిరాడంబరుడు. ఆయన ఆర్కెస్ట్రా కొన్ని మినహాయింపులతో, చాలా చిన్నది. ఆయన సంగీతం గాయనీగాయకులనెన్నడూ అధిగమించదు. మృదువుగా, సుకుమారంగా ఉంటుంది. గాయనీగాయకులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారినే ముందుంచేవారు రవి. ఆయన సంగీతం శ్రావ్యంగా ఉంటుంది. జోహ్రా జబీన్ అనే పంజాబీ పాటని తీసుకున్నా – పంజాబీ సంగీతంలో స్వతహాగా ఉండే ఘోష లేకుండా – సున్నితంగా, గాయకుల గాత్రాన్ని డోలక్‍లు, చప్పట్లు అధిగమించకుండా చూశారు రవి. ఇది అత్యంత ఉన్నత స్థాయి కళ.

ఇతర స్వరకర్తలు వందలాది వాద్యాలతో ఆర్కెస్ట్రాని నింపేస్తే, రవి మాత్రం షెహనాయి, సంతూర్, గిటార్ మాత్రం ఉంచుకుని – రచయిత గీతానికి విలువ ఇస్తూ – minimalism పాటించి గొప్ప సంగీతం అందించారు.

గోయల్ గారి సినిమా ‘వచన్’ (1955) రవి పాటలతో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో గీతా బాలి, బాల్‌రాజ్ సహానీ, రాజేంద్ర కుమార్ నటించారు. ఈ సినిమాలో అతి గొప్ప జోల పాట ‘చందా మామా దూర్ కే’ (ఆశా); చక్కని రొమాంటిక్ యుగళగీతం ‘జబ్ లియా హాథ్ మే హాథ్’ (రఫీ-ఆశా), మరువలేని భిక్షుకుడి పాట ‘ఏక్ పైసా దే దో బాబూ’ రవికి ఎంతో పేరు తెచ్చాయి. ఈ సినిమా తరువాత రవి గోయల్ గారితో పలు సినిమాలు చేశారు. వీటిలోని సంగీతానికి అందరి ప్రశంసలు దక్కాయి. ‘నర్సీ భగత్’ చిత్రంలో రవి కేదార్ రాగంలో కూర్చిన భక్తి పాట ‘దర్శన్ దో ఘన్‌శ్యామ్’ (హేమంత్ కుమార్ – మన్నా డే – సుధా మల్హోత్రా) దేశవ్యాప్తంగా జనాదరణ పొందింది. పౌరాణిక సినిమాలను భారతీయులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రభు కీ మాయా (1955), అయోధ్యాపతి (1956), నాగ పంచమి (1972) అనే భక్తి సినిమాలకి సంగీతం అందించారు రవి.

దేవేంద్ర గోయల్ గారి లానే, ఎ.ఎ. నాడియావాలా, ఎస్.డి. నారంగ్ తమ సినిమాల కోసం రవితో ఒప్పందం చేసుకున్నారు. నాడియావాలా ‘అయోధ్యాపతి’ సినిమా నిర్మించారు. నారంగ్ గారి ‘దుల్హన్’ సినిమాకి రవి హిట్ పాటలు అందించారు. ‘కైసే జావూ మై పియా’ (ఆశా), ‘జియా షర్మాయే నజర్ ఝుకీ గయీ’ (ఆశా), ‘మోరే గోరే గోరే గాల్’ (రఫీ-శంషాద్ బేగం) అత్యంత ప్రజాదరణ పొందాయి. ‘ఆద్మీ సడక్ కా’ సినిమాలో (గోయల్ గారితో రవికి 12వది) ఒక పెళ్ళి పాట ఉంది. ‘ఆజ్ మేరే యార్ కీ షాదీ హై’ (రఫీ) అనే ఈ పాటని అనేక పెళ్ళి ఊరేగింపులలో నేటికీ పాడుతున్నారు. ప్రసిద్ధ దర్శకుడు గురుదత్‍తో ఒకే ఒక చిత్రానికి పని చేశారు రవి. అదే ‘చౌదవీ కా చాంద్’. రవి సంగీతం అందించిన అత్యుత్తమ చిత్రం ఇదేనని సంగీతజ్ఞులు ప్రశంసించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయినవే. అయితే ఈ సినిమాకి గాను రవికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కకపోయినా, ఇదే సినిమాకి టైటిల్ సాంగ్ ‘చౌదవీ కా చాంద్’ రాసిన షకీల్ బదాయూనీ గారికి ఫిల్మ్‌ఫేర్ దక్కింది.

బొంబాయిలో రవి వరుస హిట్ లిస్తుండగా, దక్షిణాది నిర్మాతలు కూడా రవికి ఆహ్వానం పలికారు. జెమిన్ వాసన్ తమ ‘ఘూంఘట్’ చిత్రానికి రవిని ఎంచుకున్నారు. ఈ సినిమాలోని ‘మోరీ ఛమ్ ఛమ్ బాజే పాయలియా’, ‘లాగే నా మోరా జియా’, ‘మోరీ పత్ రఖో గిరిధారి’ (లత); ‘దో నైన్ మిలే దో ఫూల్ ఖిలే’ (ఆశా-మహేంద్రకపూర్) గొప్ప హిట్‍లయ్యాయి. ‘ఘూంఘట్’ విజయవంతమయ్యాకా, రవి జెమిని వాసన్ గారితో వరుసగా – ఘరానా, గృహస్థి, ఔరత్, పైసా యా ప్యార్, సమాజ్ కో బదల్ డాలో – అనే సినిమాలకి పని చేశారు. ఈ అన్ని సినిమాల పాటలకి ప్రశంసలు లభించాయి. దక్షిణాది వారికి రవి పని చేసిన మరో సినిమా రాజ్ కపూర్ – వైజయంతి మాల నటించిన ‘నజ్‍రానా’. ఇందులోని రెండు దీపావళి పాటలు (సంతోషం, విషాదం) పేరు పొందాయి. ‘మేలే హై చిరాగోం కే రంగీన్ దీవాలీ హై’ (లత), ‘ఏక్ ఓ భీ దివాలీ థీ’ (ముకేశ్), ‘బాజీ కిసీ నే ప్యార్ కీ’ (రఫీ), ‘ఏక్ ప్యాసా తుఝే మైఖానా దియే జాతా హై’ (రఫీ) – పాటలు రవి కెరీర్‍లో మైలురాళ్ళలా నిలిచాయి. ‘రాఖీ’ అనే సినిమాలో గొప్ప పాట, ప్రతీ సంవత్సరం రాఖీ పండుగ నాడు పాడుకునే పాట. అదే ‘రాఖీ ధాగోంకా త్యోహార్’ (రఫీ).

‘భరోసా’ చిత్రంలో – యే ఝుకే ఝుకే నైనా (రఫీ), ఇస్ భారీ దునియా మే (రఫీ), ఆజ్ కీ ములాకాత్ (లత-మహేంద్రకపూర్) పాటలు అమిత ఆదరణ పొందాయి. ‘ఖాన్‌దాన్’ సినిమాకి గాను రవికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది. ఈ సినిమాలో సంగీతంతో రవి అద్భుతాలు చేశారు. రాగ్-దర్బారీ ఆధారంగా రూపొందిందిన ‘తుమ్‍హీ మేరే మందిర్’ (లత) పాట ఉర్రూతలూగించింది. ‘నీలే గగన్ పర్ ఉడ్తే బాదల్’ రఫీ-ఆశాలు పాడిన ఓ మరపురాని యుగళగీతంగా నిలిచింది. రఫీ పాడిన ‘బఢీ దేర్ భయీ నందలాలా’ గొప్ప భక్తి గీతమైంది. అలాగే ‘కల్ చమన్ థా’ (రఫీ) వీక్షకులని ఆకట్టుకుంది.

గుమ్రా సినిమాతో రవి బి.ఆర్. చోప్రా క్యాంప్‍లో చేరారు. ఆ సంస్థ కోసం తొమ్మిది సినిమాలు చేశారు. అన్నిటిలోనూ మంత్రముగ్ధులను చేసే పాటలు ఇచ్చారు. బి.ఆర్. చోప్రా కలర్‍లో తీసిన మొదటి మల్టీ-స్టారర్ ‘వక్త్’. ఇందులోని ‘మైనే ఏక్ క్వాబ్ సా దేఖా హై’ (ఆశా-మహేంద్రకపూర్), ‘దిన్ హై బహార్ కే’ (ఆశా-మహేంద్రకపూర్), ‘చెహెరే పే ఖుషీ ఛా జాతా హై’ (ఆశా), మరికొన్ని పాటలు జనరంజకమయ్యాయి.

రామానంద్ సాగర్ గారి గోల్డెన్ జుబ్లీ హిట్ ‘ఆంఖేం’లో రవి మరికొన్ని సూపర్ హిట్ పాటలు ఇచ్చారు. మిల్తీ హై జిందగీ మే (లత), గైరోంపే కరమ్ (లత), ఉస్ ముల్క్ కీ సర్‍హద్‍ కో కోయీ ఛూ నహీ సక్తా (రఫీ), తుజ్‍ కో రఖే రామ్, తుఝ్ కో రఖే అల్లా (మన్నా డే – ఆశా) వంటి గొప్ప హిట్ పాటలు ఈ సినిమాలోవే. సాహిర్, రవి ‘హమ్‌రాజ్’ చిత్రం కోసం మాయాజాలం సృష్టించారు. ఈ సినిమాలో మహేంద్ర కపూర్ పాడిన నాలుగు పాటలు – నీల్ గగన్ కే తలే, నా మూంఛ్ ఛుపా కే జియో, కిసీ పత్థత్ కీ మూరత్ సే, తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో – అత్యంత జనాదరణ పొందాయి. నీల్ గగన్ కే తలే పాటకి నేపథ్యగాయకుడిగా మహేంద్ర కపూర్‍కి ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది.

దూంధ్, ఆద్మీ ఔర్ ఇన్సాన్ చిత్రాలలో సాహిర్ కవిత్వానికి పూర్తి న్యాయం చేశారు రవి. బి. ఆర్. చోప్రా గారి గోల్డెన్ జుబ్లీ హిట్ ‘నిఖా’ సినిమాకి రవి అద్భుతమైన సంగీతం అందించారు. రాగ్ దర్బారీలో కూర్చిన ‘దిల్ కే ఆర్మాన్ ఆశూం మే బహ్ గయే’ (సల్మా ఆగా), ‘దిల్ కీ యే ఆర్జూ థీ’ (సల్మా ఆఘా – మహేంద్ర కపూర్) సూపర్ హిట్ అయ్యాయి. అయితే – దెహ్లీజ్, అవామ్, ఆజ్ కీ ఆవాజ్, తవైఫ్ – సినిమాలు సంగీతపరంగా అంతగా రాణించలేదు. చైనా టౌన్ లోని ‘బార్ బార్ దేఖో’ (రఫీ), ‘దేఖో జీ ఏక్ బాల జోగి’ (రఫీ – మినూ పురుషోత్తమ్), ‘హమ్ సే నా పూఛో కహాఁ చలే’ (రఫీ-ఆశా), ‘బడా కాతిల్ హై మేరా యార్’ (రఫీ – ఆశా), ‘యమ్మా యమ్మా దో పర్వానే ఏక్ సామా’ (ఆశా), ‘క్యా తేరీ మెహఫిల్ హై సనమ్’ (రఫీ), ‘చైనా టౌన్, చైనా టౌన్’ (ఆశా) వంటివి గొప్ప హిట్ అయ్యాయి.

నానావతి హత్యోదంతంపై తీసిన ‘యే రాస్తే హైం ప్యార్ కే’ చిత్రంలో టైటిల్ సాంగ్ ‘యే రాస్తే హైం ప్యార్ కే’ (ఆశా) తో పాటుగా ‘ఆజ్ యే మేరీ’ అనే పాట, ఇంకా ‘యే ఖామోషియా యే తనహాయియా’ (రఫీ-ఆశా), ‘కోయి ముఝ్ సే పూఛే’, ‘తుమ్ జిస్ పర్ నజర్ డాలో’ హిట్ అయ్యాయి.

సాహిర్ రవి ‘ఆజ్ ఔర్ కల్’ కోసం మరోసారి జతకట్టి అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమాలోని ‘ఏ వాదియా హైం ఫిదాయియా’ (రఫీ), ‘ముఝే గలే సే లగా లో’ (రఫీ-ఆశా), ‘ఇతనీ హసీ ఇతనీ జవానీ రాత్’ (రఫీ), ‘మౌత్ కిత్నీ భీ సంగ్ దిల్ హో’ (ఆశా) శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘ఉస్తాదోం కే ఉస్తాద్’ సినిమాలో రఫీ పాడిన ‘సౌ బార్ జనమ్ లేంగే’ రవికి ఎంతో ఇష్టమైన పాట. తన కెరీర్‍లో రవికి ఒకే ఒక బాధ ఉంది. అది ఏంటంటే ‘చౌదవీ కా చాంద్’ తర్వాత మరోసారి గురుదత్ సినిమాకి పని చేయలేకపోవడం. గురుదత్ తదుపరి సినిమాకి తాను పనిచేయబోతుండగా గురుదత్ నిద్ర మాత్రలు మింగి చనిపోవడం దురదృష్టకరం అంటారు రవి. “నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఏకైక దర్శకనిర్మత గురుదత్ మాత్రమే. ఆయన మరణించి ఉండకపోతే నేను మా కాలంలోని అత్యున్నత సంగీత దర్శకులలో ఒకడినై ఉండేవాడిని” చెప్పారు రవి.

రవి 109 సినిమాలకు సంగీతం అందించారు. బాలీవుడ్‍లో ఆయన చివరి చిత్రం ‘ఓ సుబాహ్ కభీ తో ఆయేగీ’ (1991). ఈ కాలంలో రవికి బొంబాయిలో అవకాశాలు తగ్గినా, దక్షిణాదిలో మాత్రం తగ్గలేదు. పరిణయం, సుఖరూతం అనే మలయాళ సినిమాలకు గొప్ప సంగీతం అందించారు. నఖక్షతంగల్ అనే సినిమాకి రవి సంగీతం అందించగా కె.ఎస్. చిత్రకు ఈ సినిమా పాటకి గాను జాతీయ ఉత్తమ నేపథ్య గాయని అవార్డు దక్కింది. రవికి ఖాన్‌దాన్, సర్గమ్ అనే సినిమాలకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందిన రవి తన ప్రమేయం లేకుండానే ఒక వివాదంలో చిక్కుకున్నారు. రవి సంగీత దర్శకత్వంలో ‘నర్సీ భగత్’ సినిమాలో ఆయన గురువు హేమంత్ కుమార్ పాడిన ‘దర్శన్ దో ఘన్‌శ్యామ్’ అనే పాటని రవికి తెలియకుండా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో వాడుకుని గీత రచయిత పేరుని తప్పుగా సూరదాస్ అని వేశారు. నిజానికి ఆ గీతాన్ని గోపాల్ సింగ్ నేపాలీ రాశారు.

వ్యక్తిగత జీవితం:

1946లో రవికి కాంతి గారితో వివాహం జరిగింది. ఆమె 1986లో చనిపోయారు. ఈ దంపతులకు వీణ, ఛాయ అనే కూతుర్లు, అజయ్ అనే కుమారుడు ఉన్నారు. చివరికాలంలో రవి – కొడుకు అజయ్ నుంచి, కోడలు, సినీ నటి వర్షా ఉస్గాంవకర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నారు. వీటివల్ల ఆయన అత్యంత దురదృష్టవంతులయ్యారు. ఒక ఇంటర్యూలో ఆయన స్వయంగా ఏం చెప్పారో చదువుదాం:

“ఈరోజు నన్ను నా స్వంత ఇంట్లోంచి నా కొడుకు అజయ్, కోడలు వర్షా బయటకు నెట్టేసారు. తన భార్య చెప్పుడు మాటలు విని నా కొడుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను అమెరికాలో ఉన్న సమయంలో వర్షా నా మీద ఆస్తి గురించి ఒక కేసు వేసి, నన్ను కోర్టుకి లాగింది. నేను ముంబయి వచ్చే వరకు నాకు ఈ విషయమే తెలియదు.

నా భార్య చనిపోయినప్పటి నుంచి నా కూతురు నాతోనే ఉంటూ, నా బాగోగులు చూసుకుంటోంది. మా బంగ్లాలో మొదటి అంతస్తులో, అజయ్, తన భార్య ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన తరువాత నుంచి ఆస్తి కోసం వర్షా నా కూతురుని వేధించసాగింది. సినీ పరిశ్రమకి చెందిన వారెవరినీ నా కుమారుడు పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను. కానీ మా అభిమతానికి విరుద్ధంగా సినీ నటిని పెళ్ళి చేసుకుంటాడన్నాడు. నేనూ నా భార్యా వద్దన్నాం. వినలేదు. తరువాతి కాలంలో నా భార్య ఈ బాధతోనే చనిపోయింది.

టివిలలో అవకాశాలు కల్పించి నా కెరీర్‍ని పునరుద్ధరించానని నా కుమారుడు చెప్తాడు. కానీ అదంతా నా కష్టార్జితం. అలా ఎలా నేను ప్రతీది వదిలేసుకుంటాను? ఇప్పుడు నేను వాళ్ళిద్దరి మీదా కేసు వేశాను. అజయ్ మాటలు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. ఈ పరిశ్రమలో నాకంటూ గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. నా జీవితమంతా కష్టపడి ఈ ఇల్లు కట్టాను. దీని కోసమే ఇప్పుడు నా పోరాటం! ముంబయిలో ఒక కెరీర్ సాధించుకోవటం అంత సులువు కాదు. నాకంటూ ఒక పేరు సంపాదించుకునే ముందు నేను ఫుట్‌పాత్ మీద, రేకుల ఇళ్లలో నిద్రించాను.

మాది ఢిల్లీ. నేను అక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పుటి నుంచి నాకు సినిమా పాటలంటే ఇష్టం. గాలిపటాలు ఎగురవేస్తూ, ఆటలాడుతూ పరీక్షలలో తప్పుతూండేవాడిని. అయితే నాలోని అసలైన శక్తిని నేను 11వ ఏట గ్రహించాను. మా నాన్నగారు కల్కి భగవాన్ భక్త బృందంలో సభ్యులు. వాళ్ళు ప్రతి సాయంత్రం భజనలు పాడేవారు. ఒకరోజు మా నాన్నగారు నన్నో పాట పాడమన్నారు. పాడాను. అందరూ మెచ్చుకున్నారు. నాకన్నా  ముందు పాడిన కుర్రాడు అసూయపడ్డాడు. మర్నాడు మళ్ళీ నన్ను పాడమని అడిగినప్పుడు అతను తప్పుగా వాయించాడు, నాకు సంగీతం రాకపోయేసరికి నేను పాడలేకపోయాను. అందరూ నవ్వారు.

ఆ రోజే నిర్ణయించుకున్నాను, గొప్ప గాయకుడిని కావాలని. ఇంటికి వెళ్ళి నేను హార్మోనియం నేర్చుకుంటానని మా నాన్నగారికి చెప్పాను. ఒకొక్కటిగా అన్ని వాయిద్యాలు నేర్చుకున్నాను. ఇదిలా ఉండగా 1943లో నాకు కంటోన్‍మెంట్‍లో ఎలెక్ట్రీషియన్‍గా 196/- రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. అది మా ఇంటి నుండి 13 కిలోమీటర్ల దూరం. పొద్దున్నే ఆరు గంటలకి బయల్దేరి వెడితే తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. కొన్నాళ్ళు ఆ ఉద్యోగం చేసి మానేశాను. ఆ తర్వాత చిన్న చితకా పనులు చేశాను. 1946లో నాకు పెళ్ళయింది. 1950లో ముంబయి వచ్చి గాయకుడిగా నా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాను. అక్కడ నాకు ఎవరూ తెలియదు. ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు. రాత్రుళ్ళు మలాద్ స్టేషన్‍లో పడుకునేవాడిని. ఒక్కోసారి వీధుల్లో షాపుల ముందు నిద్రించేవాడిని. తరువాత మా నాన్నగారు నా కోసం కల్బాదేవిలో ఓ చిన్న చోటు ఏర్పర్చారు. ఎన్నో రోజుల పాటు ఒక గ్లాసు టీ, యాభై అణాలకి ఒక పూట భోజనంతో సర్దుకునేవాడిని.

తప్పుడు వాగ్దానాలతో ఎందరో నన్ను మోసం చేశారు. నా దగ్గర అప్పు చేసి, ఎప్పటికీ తీర్చేవారు కాదు. ఆ సమయంలోనే సంగీత దర్శకులు హుస్న్‌లాల్ భగత్‌రామ్ గార్లు తమ కోరస్ బృందంలో పాడమని పిలిచారు. యాభై రూపాయలు జీతం అని చెప్పారు. చిరిగిన బట్టలతోను, విరిగిన చెప్పులతోను వెళ్ళి పాడాను. రిహార్సల్స్ అయ్యాకా, నన్ను తిరస్కరించారు. వాళ్ళని బ్రతిమాలుకున్నాను, కానీ ఉపయోగం లేకపోయింది. మా నాన్న తాను సంపాదించే ఎనభై రూపాయలలో సగం నాకు పంపేవారు. జీవితం ఎంత కఠినంగా ఉన్నా, గొప్ప గాయకుడిని అవ్వాలన్న నా కలను నేను విడిచిపెట్టలేదు.

ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నేను నా ఎలెక్ట్రికల్ టూల్ కిట్‍ని వెంట తెచ్చుకున్నాను. అదనపు సంపాదన కోసం ఎలెక్ట్రికల్ పరికరాల రిపేర్ చేసేవాడిని. 1951లో నా భార్యా పిల్లలు ముంబయి వచ్చారు. ఒక రోజు నేను సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ గారిని కలిసాను. ఆయన తన కోరస్ బృందంలో అవకాశం ఇచ్చారు. 1952లో వచ్చిన ‘ఆనంద్‍మఠ్’ చిత్రంలో ‘వందేమాతరం’ పాటకి కోరస్‍లో ఒకరిగా నాతో పాడించారు. ఆ వచ్చిన డబ్బుతో నేను ఖండీవాలీలో ఒక రేకుల ఇల్లు కొన్నాను. అప్పట్లో అక్కడ కరెంటు, నీళ్ళు ఉండేవి కావు. ఎనిమిది కామన్ టాయిలెట్లు ఉండేవి. బావి నీరు తోడుకుని నిలవ చేసుకోవాల్సి వచ్చేది. దూరంగా ఒక పెద్ద బంగళా కనిపిస్తూ ఉండేది.

ఇదిలా ఉండగా, నేను హేమంత్ కుమార్ గారి సహాయకుడిని అయ్యాను. ఆయన బృందంలో తబలా వాయించేవాడిని. ఆయనకి ఉర్దూ అంత బాగా రాకపోవడంతో, నేను సాయం చేసేవాడిని. అక్కడ్నించి నేను వెనుతిరిగి చూసుకోలేదు. నేను బాణీలు కూర్చడం, పాటలు రాయడం మొదలుపెట్టాను. మెల్లిగా పని పెరిగింది. ‘చందా మామా దూర్ కే’ పాట హిట్ అయ్యింది. ఎన్నో సినిమాలకు బాణీలు కట్టాను. తరువాత నన్ను సినిమాలకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా చేయమన్నారు హేమంత్ కుమార్. మళ్ళీ పోరాటం చేయాలని కాస్త భయపడ్డాను. అయితే అప్పుడు గురుదత్ నాకు ‘చౌదవీ కా చాంద్’ సినిమాకి సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. దాని తర్వాతే 1962లో ఈ ఇల్లు కట్టాను. ఈనాడు 200 కి పైగా హిట్ పాటలు నా ఖాతాలో ఉన్నాయి. నా జీవితం అంతంలోని పోరాటంలా సాగుతుంది. ఒక్కోసారి, సొంత వాళ్ళే మిమ్మల్ని నిరాశపరుస్తారు.”

***

86 ఏళ్ళ వయసులో 7 మార్చ్ 2012 నాడు ముంబయిలో కన్నుమూశారు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here