కొత్త చిగుళ్లు
[dropcap]ఇం[/dropcap]కా చీకటి విడిపోలేదు.
వీధి దీపాల కాంతిలో సులక్షణ నిర్మానుష్యంగా నున్న రోడ్ల మీద వేగంగా నడుస్తోంది.
తెల్లవారేలోగా ఎవరి కంటా పడకుండా, ఆ ఇంటికీ, ఆ పరిసరాలకీ దూరంగా వెళ్లిపోవాలి.
పాలవాడు సైకిలు మీద వస్తున్నాడు. సులక్షణ పైట కొంగును తల నిండా కప్పుకుంది. పక్క సందులోకి మళ్లింది.
మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. కాఫీ హోటళ్ల వాళ్లు నిద్రలేచి పనిలో నిమగ్నమవుతున్నారు. తమకు తెల్సిన శ్యామలరావు ఎదురు పడ్డాడు. అతని కంట పడుకుండా ఆగి ఉన్న ఆటో వెనక ఒక నిముషం నిలబడింది. మళ్లీ ముందుకు సాగింది.
బస్ స్టాండ్‌కు వచ్చింది. ఎక్కడికి పోవాలో తెలియదు. గమ్యం లేని ప్రయాణం. ఎదురుగా ఉన్న బస్సులోకి ఎక్కింది. ఒకటే సీటు ఖాళీగా కనిపించింది. వెళ్లి కూర్చుంది. ఎవరి కంటా పడకుండా వచ్చి బస్సులో పడినందుకు ‘అమ్మయ్య’ అనుకుంటూ నిట్టూర్చింది.
బస్సు బయల్దేరింది. సర్దుకుని కూర్చుంది.
“ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది?” అని పక్కన కూర్చున్న అతన్ని అడిగంది.
అతను విచిత్రంగా ఆమె వంక చూశాడు. ఆమె మళ్లీ అదే ప్రశ్న వేసింది. ఏ ఊరు వెళ్తున్నదో అతను చెప్పాడు. ‘థాంక్స్’ అన్నదామె.
కండక్టర్ రాగానే ఆ ఊరికి టికెట్ తీసుకుంది.
“మీకు ఆ ఊళ్లో తెల్సిన వాళ్లు ఉన్నారా?” అని అడిగాడు.
“లేరు” అన్నదామె.
“ఆ ఊళ్లో ఏదైనా పని ఉందా?”
“పనేం లేదు.”
“మరి?”
“ఊరికే.. చూద్దామని వెళ్తున్నా..”
కొద్ది సేపు మౌనంగా ఉండి, సీట్లో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుంది. బస్సు మలుపు తిరిగినట్లుంది. భుజాలు తగిలాయి. సర్దుకుని కూర్చుంది. మళ్లీ నిద్రపోయే ప్రయత్నం చేసింది. ఈసారి అతని చెయ్యి తగిలింది. చెయ్యి లాక్కుంది.
ఆలోచనలో పడింది. కాసేపటికి ఆ ఊళ్లో దిగుతుంది. కొత్త చోటు. కొత్త మనుషులు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. పాంట్లూ, షర్టులూ తగిలించుకుని పూలులూ, సింహాలూ తిరుగుతుంటయి. లేడి పిల్లను చూస్తే చెంగున ఎగిరి దూకుతుంటయి.
అతని కాళ్లు ఆమె కాళ్లకు తగులుతున్నాయి.
“సారీ” అని సర్దుకుని కూర్చున్నాడు.
బస్సు ఏదో ఊర్లో ఆగింది. కొంత మంది దిగారు. పక్క సీట్లో అతను దిగుతూ మెకాళ్లు తగిలించాడు. బాగా పక్కకు ఒరిగింది. దిగబోతూ ‘మీకేమైనా కావాలా?’ అని అడిగాడు.
“ఏమీ అక్కర్లేదు” అన్నది.
అతను కిందికి దిగి సిగరెట్టు కాల్చుకున్నాడు. అయిదు నిముషాల తరువాత అందరూ బస్సు ఎక్కుతున్నారు.
ఆమె పక్కన కూర్చున్న అతన్ని ఎవరో పలకరించారు.
“భార్గవగారూ బాగున్నారా? ఈ మధ్య కొత్త రచనలు ఏమైనా చేశారా?”
“ఆ, ఓ సీరియల్ రాబోతోంది” అన్నాడు భార్గవ.
“మీరు రచయితలా?” అని అడిగింది సులక్షణ.
“అవును.”
“ఫ్రొఫెషనల్?”
“కాదు. ఇంజనీరుగా పని చేస్తున్నాను.”
“ఇంజనీరింగ్.. రచన.. పొంతన లేని విషయాలు.”
“అది వృత్తి, ఇది ప్రవృత్తి.”
“మగవాళ్ల ప్రవృత్తి చాలా విచిత్రంగా ఉంటుంది.”
భార్గవ నవ్వాడు.
“మీరు రాయబోయే సీరియల్ దేని గురించో తెల్సుకోవచ్చా?”
“ఇంకా కథ ఏదీ అనుకోలేదు.”
“ఏం రాయాలో తెలియకుండానే, సీరియల్ మొదలు పెడుతున్నారా?”
“బాగా పేరున్న వాళ్లను సీరియల్ రాయమని అడుగుతారు. రాస్తుంటే, వాళ్ల అవసరాన్ని బట్టి, రెస్పాన్స్‌ను బట్టి, వారాలు పొడిగిస్తారు, దాన్ని బట్టే ముగించటం, పొడిగించటం జరుగుతుంటుంది..”
“నేనొక కథ చెబుతాను. ముగింపు మీరు ఇవ్వండి..”
“అందరికీ నేను కథలు చెబుతుంటే, మీరు నాకు కథ చెబుతారా? చెప్పండి. దాన్నొక గొప్ప సీరియల్‌గా మలుస్తాను. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.” అన్నాడు భార్గవ ఆమెకు గౌరవం ఇస్తూ కొంచెం సర్దుకుని కూర్చుని.
“అంటే డబ్బు, పేరు మీకు, నాకు ఒట్టి కృతజ్ఞతలా?”
“పోనీ డబ్బు మీకు పేరు నాకు.”
“ఈ ఏర్పాటు బాగానే ఉంది. ఎందుకంటే డబ్బు నాకు కావాలి. పేరు మీకు కావాలి” అన్నది సులక్షణ.
“కథ చెప్పండి” అన్నాడు భార్గవ.
“నేను కథ చెబుతాను. వినేసి మీ దోవన మీరు పోతారు. నాకు మళ్లీ మిమ్మల్ని కల్సే అవకాశమే లేకపోవచ్చు. అప్పుడు మన ఒప్పందం ఏం కావాలి?”
“మీరు కథ చెప్పలేదు. నేను వినలేదు. అది నచ్చుతుందో లేదో తెలియదు. అప్పుడే అంతా అయిపోయినట్లు మాట్లాడుతున్నారు.”
“ముళ్ల బాటన నడుస్తూ, కన్నీటి వానలో తడుతున్న వాళ్ల వాస్తవ గాథలు మీకు నచ్చకపోతే, మీరు మెచ్చకపోతే, మీరు ఎప్పటికీ రచయితగా నిలబడలేరు..” అన్నదామె.
ఎంతో అనుభవం ఉన్నదానిలా ఆమె చెబుతుంటే, భార్గవ ఆశ్చర్యపోతున్నాడు.
“ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడబోసిన దానిలా మాట్లాడుతున్నారు” అన్నాడు భార్గవ.
“కొంత మంది షష్టిపూర్తి అయినా, ఇంకా పసివాళ్లల్లాగా మూర్తీభవించిన అమాయకత్వంతో ఉంటారు. మరి కొందరు ఒక్కరోజులోనే అరవై ఏళ్ల జీవితాన్ని అనుభవిస్తారు” అన్నది సులక్షణ.
బస్సు సడెన్‌గా ఆగిపోయింది. ఏదో రిపేరు వచ్చింది. ఒక గంట సేపు పడుతుందని డ్రైవరు చెప్పాడు.
అందరూ బస్సు దిగి అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు.
సులక్షణ భార్గవ కూడా దిగారు. కొంచెం దూరంలో చెట్టు కింద ఎండుటాకులు తొలగించి శుభ్రం చేసుకుని కూర్చున్నారు. చెట్ల ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నయి. చల్లగాలి హాయిగా తగులుతోంది.
“ఎలాగూ కాలక్షేపం కావాలి గదా, మీరు కథ చెప్పండి” అన్నాడు భార్గవ.
నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది.
“గోవిందయ్య బడిపంతులు. చాలీ చాలని జీతం. పైన ఇంకేమీ రావా – అని అడిగితే, ఆ పైన వచ్చేది కన్నీళ్లే – అని చెబుతాడు. నీతిగా, ధర్మంగా, న్యాయంగా బతకాలన్నదే అయిన ఆశయం. సంపాదన పెద్దగా లేకపోయినా సంతతికి మాత్రం లోటు లేదు. నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు మగ పిల్లలు.”
“ఆయన మూడో కూతురు సుగుణ బంగారు బొమ్మ. వయసుతో పాటు వచ్చే అందాలూ ఆ బొమ్మను మరింత సర్వాంగ సుందరంగా తయారు చేశాయి. దేవుడిచ్చిన అపురూపమైన అందాలను కప్పిపుచ్చుకునేందుకు కన్న తండ్రి మంచి బట్టలైనా ఇవ్వలేకపోయాడు. శాపవశాత్తూ పేదపిల్లలాగా తిరుగుతున్న ఈ దేవకన్యను ప్రతి వాడూ ఇంత లేసి కళ్లతో చూస్తూ నోటికొచ్చిన కూత ఏదో కూసేవాడు.”
“సుగుణ మాత్రం కళ్లు మూసి, కళ్లు తెరిచీ ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. పెద్ద చదువుల చదివి, కలెక్టర్ అయిపోయి కనీసం ఒక జిల్లా అయినా ఏలాలని అనుకనేది. హీరోలాంటి కుర్రాడు వెతుక్కుంటూ వచ్చి, వలచి, వలపింపచేసుకునీ ఏలుకుంటాడనీ ఆశపడేది. కోరికల గుర్రాల మీద ఆమె విహరిస్తుంటే, వీధిలో కనిపించే ప్రతి రౌడీ వెధవా పలకరించే వాడే. ‘మీ అయ్య నీకు ఎలాగూ పెళ్లి చెయ్యలేడు. నీ యవ్వనం అడవిని కాసిన వెన్నెల అయిపోతోంది. నువ్వు ఊ అంటే నిన్ను అద్దాల మేడలో పెట్టి, పూజిస్తాను’ అంటూ వాగటం మొదలు పెట్టారు. ఆ పిల్ల వాళ్లను తిట్టిపోసింది. వాళ్లు మరీ రెచ్చిపోయారు. ఇంట్లో అక్కలూ, బావలూ ఈ పిల్ల మీదనే అక్కసు వెళ్లగక్కారు. ఇంట్లో పడి ఉండక, ఊరి మీద పడి తిరిగితే ప్రతి వాడూ ఓ రాయి వేసే వాడే. ఎంత మందితో యుద్ధం చేస్తాం అని అనేశారు. వానాకాలం చదువు కూడా ఆగిపోయింది.”
“ఆ పిల్ల గుండెల మీద కుంపటిలా తోచింది. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తేగానీ – గొడవ వదిలిపోదని – ఇంటిల్లి పాదీ రోజూ మీటింగ్‌లు పెట్టి నిర్ణయాలు చేసేస్తున్నారు.”
“వారం తిరగక ముందే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అతను పొట్టిగా, లావుగా, నల్లగా ఉన్నాడు. ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పిల్ల నచ్చిందన్నాడు. కట్నం అక్కర్లేదన్నాడు. ఇంకేం కావాలి?”
“ఆమె ‘నాకు నచ్చలేదు’ అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. లక్షలు గుమ్మరించి పెళ్లి చేయగల స్తోమత లేదు. నీ అదృష్టం బావుంది, కట్నం వద్దన్నాడు” అన్నది తల్లి.
“అదృష్టమో, దురదృష్టమో సుగుణకు ఆనందరావుతో వివాహం అయింది. పేరులో తప్ప అతని జీవితంలో ఎక్కడా ఆనందం లేదు. చొక్కా విప్పితే అచ్చు ఎలుగుబంటిలా ఉంటాడు. దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేస్తే, జడుసుకుని రెండు రోజులు జ్వరం తెచ్చుకుంది.”
“ఆనందరావుకి ఉండవల్సిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆఫీసు డబ్బులు తీసుకెళ్లి రేసులు ఆడతాడు. డబ్బు పోయిందని, దుఃఖాన్ని దిగమింగటానికి తాగుతాడు. తాగిన తరువాత కనిపించిన ప్రతివాడినీ తిడతాడు. ఇంటి కొచ్చి పెళ్లాం మీద తన ప్రతాపం అంతా చూపిస్తాడు. నిష్కారణంగా కొడతాడు, పెళ్లాన్ని అనుమానిస్తాడు. పెళ్లి కాక ముందు ఎవర్ని ప్రేమించావు, ఎంత మందితో తిరిగావో చెప్పమంటాడు. నిజం చెబితే నమ్మడు. అబద్దం చెబితే ఒంటికాలి మీద లేస్తాడు.”
“ఈ నరకం భరించలేక పుట్టంటికి వెళ్తే, అక్కడ తనను పరాయి దాన్ని చూసినట్లు చూశారు. పెళ్లి అయ్యాక ఇంక నీకు పుట్టింటితో సంబంధం లేదన్నారు. చావయినా, బ్రతుకయినా మొగుడితోనే అని తెచ్చి భద్రంగా భర్తకు అప్పచెప్పి వెళ్లారు. ఇప్పుడింక మొగుడికి మరింత చులకన అయింది. పుట్టింటి అండ కూడా లేనందున, అడిగేవాడు లేనందున, ఆనందరావు వికృత చేష్టలు మరీ ఎక్కువ అయినయి. భరించలేని నరకంగా మారిన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి.. దీనికి ముగింపు మీరు చెప్పాలి” అన్నది సులక్షణ.
అతను నిట్టూర్చాడు.
బస్ రిపేరు చేయటం అయిపోయింది. అందరూ బస్సు ఎక్కారు, బస్సు బయల్దేరింది.
ఒక గంట తరువాత బస్సు గమ్యం చేరింది. అందరూ దిగారు.
సులక్షణ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చింది. కొత్త ఊరు. ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్లలేదు.
అతను ఆటో పిల్చాడు.
“ఫర్లేదు.. నేను వెళ్తాను” అన్నది బింకంగా.
“మీరు వెళ్లటానికి వీల్లేదు, మీ కథను నేను సీరియల్‌గా రాయబోతున్నాను. ప్రతి చిన్న విషయం మీతో డిస్కస్ చేయాలి. మీరు నా గెస్ట్‌గా ఉండాలి.” అని అతను ఆమెను తనతో తీసుకెళ్ళాడు.
ఆ సీరియల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె చెప్పిన ప్రతి సంఘటనా, ప్రతి డైలాగ్ ఎంతో సహజంగా అనిపించాయి. అవే రాశాడు. మంచి స్పందన వచ్చింది.
“ముగింపు ఏం చేయదల్చుకున్నారు?” అని అడిగింది.
“నేనొక ప్రశ్న అడుగుతాను. ఇదంతా నీ కథేనని నాకు తెల్సు. బస్సులో నేను గాక మరొకరు తగిలి ఉంటే ఏమయ్యేది?” అని అడిగాడు.
“ఆ ముగింపు మరో రకంగా ఉండేది. రచయిత గదా. మీరే ఊహించండి. మంచి ముగింపు ఇవ్వండి.”
“రచయితే ఆమెను పెళ్లి చేసుకుంటే?”
“ఆమెకు ఇది వరకే పెళ్లి అయింది.”
“ఆ వివాహాన్ని వదులుకొని వచ్చేసింది గదా.”
“ఇందులో కొత్తదనం ఏముంది?”
“జీవితంలో ప్రతి రోజూ కొత్తదే.. రచయితలూ, వక్తలూ, ప్రయోక్తలూ, మేధావులూ, పండితులూ నిత్యం ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటారు. కానీ వాటిని ఆచరించే వాళ్లు ఎంత మంది ఉంటారు? ఇందులో రచయిత తన మాటలకు అర్థం, పరమార్థం తానే అయినాడు.”
భార్గవ ఆమె వంక చూశాడు. ఆమె కిటికీ బయట ఉన్న చెట్టు వంక చూస్తోంది.
చెట్టు కొత్త చిగుళ్లు తొడుగుతోంది.