బ్రతుకు ధీమా..! జీవిత బీమా..!!
[dropcap]ఇ[/dropcap]న్సూరెన్స్ అనేది ఈ మధ్య కాలంలో అందరి నోళ్ళల్లోనూ నానుతున్నమాట. అయినా ఇంకా చాలామందిలో దీని గురించి సరైన అవగాహన లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. దీనికి నిరక్షరాస్యులు మాత్రమే కాదు, అక్షరాస్యులు సైతం అతీతం కాదు. అయితే వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు కూడా! పేద ప్రజల కోసం ప్రభుత్వం చేసే బీమా ఉండవచ్చు, అది వేరే విషయం. ఉద్యోగుల కోసం ప్రభుత్వపరంగా బీమా (గ్రూప్ – ఇన్సూరెన్స్) ఉండవచ్చు. అది ఉద్యోగులకు మాత్రమే పరిమితం.
అసలు ఇన్సూరెన్స్ (బీమా) అంటే ఏమిటి? ఇది ఎందుకు? అన్నవి అందరిలోనూ ఉదయించే సహేతుకమైన ప్రశ్నలు. వీటిని గురించి సరిగా అర్థం చేసుకున్నవారు ఇన్సూరెన్స్ వైపు మొగ్గే అవకాశాలు తప్పక ఉంటాయి.
మరి, ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తికి (పాలసీదారుడు), ఇన్సూరెన్స్ కంపెనీకి గల ఒప్పందం. పాలసీదారుడికి ఇన్సూరెన్స్ కంపెనీకీ మధ్య వున్న ఒప్పందం. పాలసీదారుడికి కంపెనీ ఇచ్చే భరోసా. ఇది అనేక రకాలుగా ఉండచ్చు. అవి కొన్ని పాలసీదారుడికి బాగా ఉపయోగ పడవచ్చు, మరి కొన్ని కంపెనీలకే లాభదాయకంగా వుండవచ్చు, మరి కొన్ని ఇరు పక్షాలకూ సమానంగా లాభం అందించవచ్చు.
ఒకప్పుడు చాలా మందికి కేవలం జీవిత బీమా గురించి మాత్రమే తెలిసేది. ఈ సంస్థ వాళ్ళు కూడా ఎక్కువగా ఉద్యోగస్థులనే టార్గెట్ చేసుకునేవారు. వాటికి సంబంధించిన కార్యాలయాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. దూరాభారాల దృష్ట్యా తక్కువమంది దీనికి ఆకర్షితులయ్యేవారు. అది కూడా పూర్తిగా ఏజెంట్ల మీద ఆధార పడవలసి వచ్చేది. ఇప్పటి పరిస్థితి వేరు. వీటికి సంబంధించిన కార్యాలయాలు తాలూకా (మండల) స్థాయిలో కూడా అందుబాటులోనికి వచ్చాయి. జీవిత బీమా అంటే సాధారణ ప్రజలలో సైతం చక్కని అవగాహన వచ్చిందిప్పుడు.
అయితే పోటీ ప్రపంచంలో ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా అనేక బీమా సంస్థలు అందుబాటు లోకి వచ్చాయి. ఇప్పుడు మనిషి జీవితానికే కాదు, దేనికైనా బీమా చేసుకునే అవకాశాలు వచ్చాయి. ఇళ్లు, ఇతర ఆస్తులు, నగలు, వస్తువులు, పెంపుడు జంతువులూ – అంతమాత్రమే కాదు, సెలబ్రెటీలు ముఖ్యంగా మహిళామూర్తులు తమ శరీరంలోని ముఖ్య భాగాలను సైతం బీమా చేసిన ఉదంతాలు వున్నాయి. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు మనం చేయలేని పనులను ఆర్థికంగా ఆదుకుంటాయి. పోయిన వస్తువులకు బీమా చేయించిన సొమ్ము తిరిగి వస్తుంది. గొర్రెలు, ఇతర పశువులు, పెంపుడు జంతువులూ వ్యాధిగ్రస్థమైనప్పుడు, లేదా వ్యాధిగ్రస్థమై మరణించిననాడు వాటిపై బీమా చేసిన సొమ్ము (నిబంధనలు వర్తిస్తాయి) తిరిగివస్తుంది. అలాగే పంటలు వగైరా కూడా!
కంపెనీ ఏదైనా, మనదేశంలో నాలుగు ముఖ్యమైన బీమా పథకాలు అందుబాటులో వున్నాయి.
- లైఫ్ ఇన్సూరెన్స్
- హెల్త్ ఇన్సూరెన్స్
- మోటార్ ఇన్సూరెన్స్
- హోమ్ ఇన్సూరెన్స్
ఇంచు మించు అందరికీ ఇవి ఉపయోగపడే పథకాలే. అందరూ వీటిని ఉపయోగించుకుంటున్నారా? లేదా? అన్నది వేరే విషయం.
మోటారు సైకిల్, కారు, ట్రాక్టర్, ఆటో, లారీ వంటి ఎలాంటి వాహనం వున్నా ఎలాగూ బీమా చేయడం తప్పనిసరి. హోమ్ ఇన్సూరెన్స్ తమ ఇష్టాన్ని బట్టి, ఇంటి విలువను బట్టి బీమా చేయించుకుంటారు. ఇక జీవిత బీమా తరువాత అందరికీ అత్యంత ఉపయోగ పడేదీ ప్రస్తుతం అందరి నోళ్ళల్లోనూ (ముఖ్యంగా ఉద్యోగులు) నానేది హెల్త్ ఇన్సూరెన్స్, అదే ఆరోగ్య బీమా. ఈ బీమా విషయంలో అనేకమంది ఆసక్తి చూపడానికి ముఖ్య విషయం రెండు అంశాలపై ఆధార పడివుంది. మొదటిది అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకోవడం, రెండవది ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో దీని ద్వారా కొన్ని రాయితీలు ఉండడం. ప్రధానంగా ఈ వ్యాసం ముఖ్యోద్దేశం కూడా ఆరోగ్య బీమా గురించే. ఇందులో ప్రతి సంవత్సరం ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండడం, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో (ఆసుపత్రి అడ్మిషన్-చికిత్స) ఆర్థికంగా చాలా మటుకు ఆదుకునే పరిస్థితి ఉండడం, ఆదాయపు పన్ను చెల్లింపులో ప్రత్యేకమైన వెసులుబాటు ఉండడం. అయితే మనం కట్టవలసిన వార్షిక ప్రీమియం, మనం చేసిన బీమా సొమ్ముమీద, వయసు మీద, ఆరోగ్య పరిస్థితి వంటి కొన్ని ముఖ్యాంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ఆదాయపు పన్నుకు సంబంధించి:
- సెక్షన్ 80.సి – క్రింద,లక్షా యాభై వేల వరకూ పన్ను వర్తించే ఆదాయం నుండి తీసివేయగల వెసులుబాటు వుంది.
- సెక్షన్ డి – క్రింద కట్టిన ప్రీమియం మొత్తం, కట్టవలసిన ఆదాయపు పన్ను నుండి తీసివేయవచ్చును.
- సెక్షన్ 10(10డి) – క్రింద తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని బట్టి, ఆదిలోనే, మొత్తం ఆదాయపు పన్నునుండి విముక్తి పొందవచ్చును.
అందుచేత ఇది అందరికీ ముఖ్యంగా ఉద్యోగస్థులకు అనుకూలమైన బీమా పథకం అని నా అభిప్రాయం.
ఇక నా విషయానికొస్తే, నేను 1982లో ఉద్యోగంలో చేరిన తర్వాత కొద్దీ నెలలలోనే ఒక ఎల్.ఐ.సి. ఏజెంట్ మిత్రుడు (మహబూబాబాద్) కలిసి పరిచయం చేసుకున్నాడు. పాలసీ గురించి సుదీర్ఘంగా వివరించి నన్ను ఒక పాలసీ తీసుకోమన్నారు. అప్పటికి నాకు జీవితబీమా పథకాల మీద అంతగా అవగాహన లేదు. పైగా ఉద్యోగంలో చేరిన మొదటి రోజులు, తక్కువ జీతం, అవసరాలు ఎక్కువ. అందుచేత పాలసీ చేయడానికి కాస్త సందేహించాను. అయితే ఆ ఏజెంట్ మిత్రుడు ఎక్కడ కనపడితే అక్కడ ఆగి, పాలసీ తీసుకోమని తొందర చేసేవాడు. తర్వాత.. తర్వాత ఇది నాకు ఇబ్బందిగా తయారయింది. ఆయన బాధ భరించలేక కొద్దీ మొత్తంలో ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకుని ఊపిరి పీల్చుకున్నాను.
అదృష్టవశాత్తు అది నేను బ్రతికి ఉండగానే పాలసీ గడువు పూర్తయి ఆ డబ్బును నేను అనుభవించే అవకాశం కలిగింది.
తర్వాత, మిత్రులు ఉమాశంకర్ (అప్పుడు డెవెలప్‍మెంట్ ఆఫీసర్) సలహాతో, రెండు మనీ బ్యాక్ పాలసీలు తీసుకున్నాను. అవి రెండూ కూడా గడువు దాటిపోవడంతో డబ్బు నా చేతికి వచ్చి కొన్ని మంచి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కలిగింది. వీటితో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఎలాంటి మధ్యవర్తి లేకుండా పాలసీ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయిన విషయాలు. అన్నీ నా మంచికోసం జరిగినవే!
ఒకప్పుడు నాకు స్కూటర్ ఉండేది. దానికి ఇన్సూరెన్స్ అవసరం కనుక తీసుకోక తప్పలేదు. ఇప్పుడు కారు వుంది. దానికి ఇన్సూరెన్స్ తప్పని సరి, అత్యవసరం కూడా. ఇప్పటికే అది నన్ను రెండుసార్లు ఆదుకుంది.
ఒక మిత్రుడి సలహాతో హన్మకొండలో వున్న ఇంటికి కూడా బీమా చేసాను కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కేవలం నా నిర్లక్ష్యం వల్ల అది ఆగిపోయింది.
ఇప్పుడు వయసు మళ్లింది. ఎప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, పెన్షన్ కూడా గణనీయంగా పెరిగింది, దానికి తగ్గట్టుగానే ఆదాయపు పన్ను కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో, ఇన్సూరెన్స్‌లో పని చేసి పదవీ విరమణ చేసిన నా మిత్రుడికి చెప్పాను, నాకు సరిపడా ఒక మంచి కంపెనీ నుండి, హెల్త్ ఇన్సూరెన్స్ సూచించమని. ఏదేదో సమాచారం పంపించాడు. అది చదివే ఓపికా, అర్థం చేసుకునే మెదడూ నాకు లేవు. అందుకే నాయకులలానే అతను కూడా పెద్ద శ్రద్ధ చూపలేదు.
ఒక శుభోదయాన ఫేస్‍బుక్‌లో నాకు సరిపడా పాలసీ అందించే కంపెనీ వివరాలు కనిపించాయి. వాళ్ళతో మా అమ్మాయి కాంటాక్ట్ చేసి నా కోసం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ బుక్ చేసింది. ఆ పాలసీ అందించే ముందస్తు వైద్య పరీక్షల పథకం ఆధారంగా ఈమధ్యే (22-09-2022) హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ లోని ‘విజయ డయాగ్నోస్టిక్స్’లో పరీక్షలు చేయించుకున్నాను. వచ్చే ఏడాది ఆదాయపు పన్నుపై రాయితీ ఉపయోగించుకుంటాను. అనారోగ్యం వచ్చినప్పుడు అదొక భరోసా, ఆరోగ్యంగా ఉండవచ్చుననే ఒక ధీమా! బీమా పథకాలు సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి రూపురేఖలు మారుతుంటాయి,అది మనం గమనిస్తూ ఉండాలి.
ఇన్సురెన్స్ కంపెనీలు కూడా ప్రజల అవసరాలు గమనిస్తూ కొత్త కొత్త పథకాలు రూపకల్పన చేస్తూ ఇన్సూరెన్స్ రంగంలో పెను మార్పులు తీసుకొస్తుంటాయి, వ్యాపార పరంగా లాభ పడుతుంటాయి కూడా! ఇలా ప్రత్యక్షంగా మన అవసరాలు, పరోక్షంగా కంపెనీ అవసరాలు, ప్రజల సొమ్ముతోనే తీరుతుంటాయి!
అవసరమైన బీమా పథకాలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అత్యవసరం. ఇది నా జీవితమే కాదు, అనేక జీవితాలు నిరూపిస్తున్నాయి.
(మళ్ళీ కలుద్దాం)