[dropcap]ఉ[/dropcap]ద్యోగరీత్యా చాలా పట్టణాలకు వెళ్ళాను కానీ ఎప్పుడూ కోల్‌కతా వెళ్ళలేదు. ఆ అవకాశం రాలేదు. నా పూర్వ సహోద్యోగులు (సహోద్యోగినులు అనాలి) ముగ్గురు బెంగాల్లో ఉంటున్నారు. ఒకసారి వారిని కలిసినట్టూ ఉంటుంది, కోల్‌కతా చూసినట్టూ ఉంటుందని బయల్దేరాను. అదృష్టమేమిటంటే ఒక స్నేహితురాలు శాంతినికేతన్‌లో నివాసముంటున్నారు. రవీంద్రుని విశ్వభారతి కూడా చూడవచ్చు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అని సంబరంగా ప్రయాణమయ్యాను.
చాయ్ చైనీస్ సంతతికి చెందిన ఆవిడ. కోల్‌కతా లోనే పుట్టి పెరిగారు. బెంగాలీ అనర్గళంగా మాట్లాడతారు. హిందీ, ఆంగ్లం, ఫ్రెంచ్ కూడా! నిజానికి నేను కలిసిన ముగ్గురూ ఫ్రెంచ్‌లో నిష్ణాతులే. దొలోన్, ఇషితా శాంతినికేతన్‌లో కలుస్తామన్నారు. సాయంత్రం వేళ కోల్‌కతా చేరుకున్నాను. ఎయిర్ బీఎన్బీ రూములో స్నానం చేసి చాయ్ చెప్పిన రాయల్ జేడ్ చైనీస్ రెస్టారెంట్ (అసలు ఈ పదాన్ని రెస్తరాఁ అనాలి) కి చేరుకున్నాను. ‘మూసివేయబడినది.’ కొత్త ముస్తాబులు చేయటానికి మూసివేశారట. అప్పుడే చాయ్ కూడా చేరుకున్నారు. ఇద్దరం కలసి దగ్గర్లో ఉన్న మాల్‌కి వెళ్ళి అక్కడి చైనీస్ రెస్టారెంట్‌లో భోజనం చేశాం. మర్నాడు దక్షిణేశ్వర్ ఆలయానికి వెళ్ళాలని ఆలోచన. మెట్రో రైల్లో వెళ్ళొచ్చు. నది అవతల ఉన్న బేలూర్ మఠానికి కూడా వెళ్ళొచ్చు అన్నారు చాయ్. అంతకన్నానా?
పొద్దున్నే బయల్దేరాం. కోల్‌కతా మెట్రో భారతదేశం లోనే తొలి మెట్రో. దాదాపు ముప్ఫై ఏడేళ్ళ క్రితం ప్రారంభమైంది. చాలావరకు భూగర్భంలోనే రైలు ప్రయాణిస్తుంది. కాస్త దూరం వెళ్ళాక సీట్లు దొరికాయి. దక్షిణేశ్వర్ ఆలయం బయట భోజనశాలలో కోచుడీ-దాల్ బావుంటుందని చాయ్‌కి ఎవరో చెప్పారట. ముందు అల్పాహారం చేసి దర్శనం చేసుకుందాం అన్నాను. సరే అన్నారు ఆవిడ. కోచుడీ-దాల్ చాలా బావుంది. మైదాలో ఇంగువ కలిపి మందంగా చిన్న పూరీల్లా వేశారు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయివి. పెద్దవి కూడా తర్వాత ఒకరోజు తిన్నాను. దాల్ శనగపప్పుతో చేసినది. అదీ బావుంది.
తర్వాత ఆలయానికి వెళ్ళాం. విశాలమైన ప్రాంగణం. ముందు రాధాకృష్ణ మందిరం వస్తుంది. తర్వాత కాళీ ఆలయం. ముందు కాళీ ఆలయానికి వెళ్ళాం. భక్తులు మరీ ఎక్కువ లేరు. దర్శనం త్వరగానే అయింది. శివుని గుండె మీద కాలు వేసిన కాళీమాత ఆగ్రహంలోనూ అనుగ్రహం కురిపిస్తూ ఒక చేత ఖడ్గం ఉన్నా ఒకచేత అభయం ప్రసాదిస్తూ ఉంటుంది. మందిరం ఎదురుగా విశాలమైన మంటపం. అక్కడ కూర్చుని లలితా సహస్రనామం పారాయణ చేశాను. తర్వాత ఉత్తరాన ఉన్న శివలింగాలను దర్శించుకున్నాం. రాధాకృష్ణ మందిరం కూడా దర్శించుకుని వాయువ్యంలో ఉన్న శ్రీరామకృష్ణ పరమహంస నహబత్‌కి వెళ్ళాం. ఒక పెద్ద మంచం, ఒక చిన్న మంచం ఉన్నాయి. శ్రీరామకృష్ణులు పెద్ద మంచం మీద విశ్రాంతి తీసుకునేవారు. చిన్నమంచం మీద కూర్చుని శిష్యులతో మాట్లాడేవారు. ఆ మహనీయుడు నివసించిన చోటు చూసి మనసు పులకించింది.
తర్వాత హూగ్లి నది దాటి బేలూర్ మఠానికి వెళ్ళాం. నదికి ఈ ఒడ్డున దక్షిణేశ్వర్, ఆ ఒడ్డున కాస్త దూరంలో బేలూర్ మఠం. ఫెర్రీలో ప్రయాణం 20 నిముషాలు సాగింది. టికెట్ కేవలం 11 రూపాయలే. “ఇదే మా రాష్ట్రంలో అయితే యాభై ఉంటుంది” అన్నాను. “ఇది కమ్యూనిస్టుల రాష్ట్రం కదా. ఎక్కువ ధరలుంటే ఊరుకోరు” అన్నారు చాయ్. బేలూర్ మఠం స్వామి వివేకానంద కట్టించినది. శిల్ప కళ చాలా బావుంది. అయితే మేం వేళ్ళేసరికి 11:30 అయింది. సరిగ్గా మూసివేత సమయం. అప్పుడే ఉపాలయాలు మూసివేశారు. ఉపాలయాలలో శారదామాత ఆలయం, స్వామీ వివేకానంద ఆలయం తదితర ఆలయాలు ఉన్నాయి. శ్రీరామకృష్ణుల ఆలయం తెరిచి ఉంది కానీ లోపలి తలుపులు మూసి ఉన్నాయి. మనసు ఉసూరుమనిపించింది. లోపల భక్తులు కూర్చుని ఉన్నారు. పక్కగా నడిచి ముందువైపుకి వెళ్ళాం. అక్కడ “11:40కి 5 నిముషాల పాటు తలుపులు తెరువబడును” అని ఒక ఫలకం మీద ఉంది. సంతోషంగా అక్కడే కూర్చున్నాం. శ్రీరామకృష్ణుల విగ్రహం దర్శించుకున్నాం. మఠం ప్రాంగణంలో దసరాకి పెద్ద మంటపం తయారు చేస్తున్నారు. శరన్నవరాత్రులని ‘దుర్గా పూజో’ అంటారు. మహావైభవంగా చేస్తారు.
దుర్గా విగ్రహాలు తయారు చేసే కుమార్ టులీ (కుమ్మరివాడ)కి వెళదామనుకున్నాం గానీ అప్పుడప్పుడూ చినుకులు పడుతుండటంతో చిత్తడిగా ఉంటుందని, మర్నాడు వెళదామని నిర్ణయించుకున్నాం. తిరిగి ఫెర్రీ ఎక్కి దక్షిణేశ్వర్ దగ్గర దిగి, మెట్రో ఎక్కాం. మెట్రో రైలు దిగాక “కాసేపు నడవగలరు కదా?” అన్నారు చాయ్. “ఓ” అన్నాను. కోల్‌కతా బిర్యానీ తినాలని కోరటంతో జీషాన్ అనే రెస్టారెంట్‌కి దారి తీశారు చాయ్. పది నిముషాలు నడిచాక చేరుకున్నాం. ‘మూసివేయబడినది’. ఇది కూడా ముస్తానుల కోసం మూసివేశారు! రెండోసారి ఇలా జరగటంతో నవ్వాలో ఏడవాలో తెలియలేదు. టాక్సీ ఎక్కి వేరే రెస్టారెంట్‌కి వెళ్ళాం. చెప్పొద్దూ.. ఏది జరిగినా మన మంచికే అంటారు. అక్కడ బిర్యాని అద్భుతం! కోల్‌కతా బిర్యానీకి రైతా, గ్రేవీ ఇవ్వరట. ఒక మటన్ వంటకం, రైతా వేరుగా తెప్పించుకున్నాం. బిర్యానీలో ఘాటు పెద్దగా లేదు. విశేషమేమిటంటే బిర్యానీలో ఒక బంగాళదుంప వేస్తారు. చాలా రుచిగా ఉంది. తర్వాత నొలిన్ గుడీ ఐస్ క్రీం తీసుకోమని చాయ్ అన్నారు. కొత్త బెల్లంతో చేసిన ఐస్ క్రీం. చాలా బావుంది. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకుని సాయంత్రం షాపింగ్‌కి మళ్ళీ కలిశాం. రాత్రి భోజనం ఒక బెంగాలీ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ మూసివేయలేదు అదృష్టవశాత్తూ! ఇంకొక స్నేహితురాలు శ్రేయ మాతో కలిసి భోజనం చేసింది. ఒకసారి ముంబయిలో ఒక శిక్షణా కార్యక్రమంలో ఆమెను కలిశాను. పెద్ద పరిచయం లేదు. చాయ్‌కి సన్నిహితురాలు. రెండురకాల చేప వంటకాలు, ఒక రొయ్యల వంటకం, బంగాళదుంప పోష్తో (గసగసాలతో చేసే వంటకం), అన్నం. కడుపు నిండిపోయింది. కుమార్ టులీ (కుమ్మరివాడ) శ్రేయ వాళ్ళ ఇంటి దగ్గరే. మర్నాడు అక్కడ కలుసుకుందామని వీడ్కోలు తీసుకున్నాం.
మర్నాడు మళ్ళే మెట్రో రైలు ఎక్కాం. శ్రేయ వాళ్ళింటి దగ్గర చిన్న అల్పాహారశాలలో కోచుడీ-ఆలూ తిన్నాం. చిన్న చిన్న చోట్ల రుచి భలే బావుంటుంది. కాస్త నడిచి కుమార్ టులీ చేరుకున్నాం. మర్నాడు విశ్వకర్మ పూజ అట. విశ్వకర్మ విగ్రహాలు కనిపించాయి. నాకు ఈ పూజ గురించి తెలియదు. విశ్వకర్మ, కార్తికేయుడు ఒకరే అని శ్రేయ అంది. కాదని తర్వాత తెలిసింది. విశ్వకర్మకి వాహనం ఏనుగు. కార్తికేయుడిది నెమలి వాహనం కదా! వాడలోకి వెళ్ళే ముందు అప్పుడే మొదలు పెట్టిన మట్టి విగ్రహాలు కనపడ్డాయి. దుర్గ, సరస్వతి, వినాయకుడు రూపాలు సిద్ధమయ్యాయి. నది ఒడ్డు నుంచి తెచ్చిన మట్టి, ఎండుగడ్డితోనే విగ్రహాలు చేస్తారు. ఎప్పటి నుంచో అదే ఆచారం. మనవాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఎందుకు చేస్తారో మరి. అలాంటి మట్టి, అతుక్కుని ఉండే మట్టి ఇక్కడ తేలికగా దొరకదేమో మరి. ఈసారి ఖైరతాబాద్ వినాయక విగ్రహం మట్టితోనే చేశారట. సంతోషం!
వాడలోకి వెళ్ళాక వివిధదశల్లో దుర్గ విగ్రహాలు కనిపించాయి. కాస్త లోపలికి వెళితే రంగులు వేస్తున్న విగ్రహాలు కూడా ఉన్నాయి. సాధారణంగా విగ్రహం తయారు చేసి చీర వేరుగా కడతారు. మట్టితోనే చీర తయారు చేసే విగ్రహాలు తక్కువ. అలాంటి ఒక విగ్రహం తటస్థపడింది. ఏ దుర్గ విగ్రహానికీ మహాలయ అమావాస్య వరకు కనులు దిద్దరట. ఆరోజు ఆమె కళ్ళు తెరచినట్టు కళ్ళు దిద్దుతారట. ఆరోజు ఆ వాడంతా కిక్కిరిసిపోతుందట. చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. పెద్ద విగ్రహం ప్రతిష్ఠించినా చిన్న విగ్రహాలని కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తారు. కాసేపు అక్కడ సంచరించి బయలుదేరాం. మధ్యాహ్నం శాంతినికేతన్‌కి రైలు ఉంది.
మెట్రో స్టేషన్‌కి చేరుకుని రైలు ఎక్కాం. రైలు కిక్కిరిసి ఉంది. ఎలాగో ఎక్కాం. ఎప్పుడో ముంబయిలో అలాంటి రద్దీ చూశాను. ఆఫీసులకి వెళ్ళే జనం. ఆఫీసులు ఎక్కువగా ఉండే ప్రాంతం రాగానే రైలు కొంచెం ఖాళీ అయింది. రూముకి వెళ్ళి స్నానం చేసి రైలు స్టేషన్‌కి బయలుదేరాను. చాయ్ టాక్సీలో వచ్చి నన్ను ఎక్కించుకున్నారు. హౌరా స్టేషన్ కి వెళ్ళే దారిలో ఈడెన్ గార్డెన్ కనిపించింది. కాసేపటికి హౌరా బ్రిడ్జి ఠీవిగా కనిపించింది. బ్రిడ్జి మీద నది దాటగానే రైలు స్టేషన్. రైల్లో భోజనముంటుందని కాస్త చాట్ తిని రైళ్ళు రాకపోకల బోర్డు చూస్తూ కూర్చున్నాము. మా రైలు తర్వాతి రైళ్ళు కూడా బోర్డు మీద చూపిస్తున్నారు కానీ మా రైలు చూపలేదు. విచారిస్తే రైలు లేటని తెలిసింది. ఉసూరుమని కూర్చున్నాము. దాదాపు రెండు గంటలు లేటుగా రైలు బయల్దేరింది. దారిలో ఇరువైపులా పచ్చని వరిపొలాలు. రైలు మరో రెండు గంటలు లేటయ్యి మొత్తానికి నాలుగు గంటలు లేటుగా శాంతినికేతన్ చేరింది. దొలోన్, ఇషితా రెండు గంటల ముందే వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం కూడా దాటిపోయింది. ఉబుసుపోక స్టేషన్‌లో తనిఖీ లాంటిది చేస్తుంటే పోలీసులు ఆపి సంగతేమిటని అడిగారట. మన రైళ్ళు ఎప్పటికి బాగుపడతాయో?
దొలోన్ కారులో వాళ్ళింటికి బయల్దేరాం. దారిలో విశ్వభారతి ప్రాంగణం, వసతి గృహాలు, ఠాగూర్ ఇల్లు చూశాం. రైల్లో లేటుగా మధ్యాహ్న (సాయంత్ర?) భోజనం చేయటంతో ఇంటికి చేరాక లేటుగా రాత్రి భోజనం చేద్దామని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. చాయ్‌కి మధ్యాహ్నం తిన్న చాట్ పడలేదు. వాంతులు మొదలయ్యాయి. పాపం గదిలోకి వెళ్ళి పడుకున్నారు. భోజనంలో బైగోన్ ఫోడా (కాల్చిన వంకాయ వంటకం), మటన్, చపాతీలు, అన్నం. రుచి అమోఘం. చాయ్ మాత్రం కాస్త మరమరాలు తిని పడుకున్నారు. దొలోన్, ఇషితా నన్ను నా రూము దాకా దిగబెట్టడానికి వచ్చారు. మర్నాడు దొలోన్ ఇంటికి వెళ్ళటానికి దారి తెలిసింది. పది నిముషాలు నడక. తిరిగి వెళ్ళేటపుడు “మీకు తిరిగి వెళ్ళటానికి ఏం పర్వాలేదా?” అంటే “ఇక్కడేం పర్వాలేదు” అన్నారు. మన దేశం కొన్ని చోట్లైనా సురక్షితంగా ఉన్నందుకు సంతోషించాను. కోల్‌కతా కూడా మిగతా నగరాల కంటే సురక్షితమేనట.
మర్నాడు ఉదయం దొలోన్ ఇంట్లో లుచీలతో అల్పాహారం. చిన్నప్పుడు ఆంగ్ల పాఠ్యపుస్తకంలో ఠాగూర్ వ్రాసిన పాఠంలో లుచీల ప్రస్తావన ఉంది. లుచీలంటే మైదాతో చేసిన పూరీలు. బంగాళదుంప కూర. చాయ్‌కి లుచీలు దాల్‌తో తినాలని కోరిక ఉంది కానీ తినలేని పరిస్థితి. నేను పూతరేకులు తీసుకుని వెళ్ళాను. వారికి అవి తయారు చేస్తారో చెప్పాను. ఇష్టంగా తిన్నారు. అజ్జరం నుంచి తీసుకెళ్ళిన ఇత్తడి ఎడ్లబండి బొమ్మలు బహుమతిగా ఉచ్చాను. పదకొండింటికి చాయ్ పడుకుని ఉండగా ఆమెకి ఒక సంక్షిప్త సందేశం పంపి మేము విశ్వభారతి చూడటానికి బయల్దేరాం. పసుపు, తెలుగు రంగుల ఏకరూప దుస్తుల్లో విద్యార్థులు ముచ్చటగా ఉన్నారు. అక్కడ చెట్ల కింద పాఠాలు చెబుతారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. చెట్ల కింద వృత్తాకారంలో రాతితో చేసిన స్థానాలు, బల్లలు. మధ్యలో రాతితో చేసిన నల్లబల్ల. ఒక్కో తరగతిలో ఇరవై మంది కూర్చోవచ్చు. వర్షాకాలం కావటం వల్లనేమో తరగతులు బయట జరగటం లేదు. దొలోన్ 11, 12 తరగతులు విశ్వభారతి లోనే చదివారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. చీర తప్ప వేరే దుస్తులు అనుమతించరట. రవికె కూడా చేతులు లేనిది వేసుకోకూడదట. తరగతి మధ్యలో అధ్యాపకుడికి తెలియకుండా బయటకు జారుకుని క్యాంటీన్‌కి వెళ్ళటం కూడా గుర్తుచేసుకున్నారు. విశ్వభారతిలో అన్నిరకాల విద్యలూ బోధిస్తారు. అదీ ఇదీ అని లేదు. అయితే లలితకళల విద్యకి పెట్టింది పేరు. ఠాగూర్ గురించి మాట్లాడుకుంటూ కలియతిరిగాం. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఠాగూర్ బ్రిటిష్ విద్యకి భిన్నంగా విద్యను బోధించటానికి శాంతినికేతన్ వచ్చి విశ్వభారతిని స్థాపించారు. 1910లో ప్రచురించిన ‘గీతాంజలి’ కవితాసంపుటికి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. శాంతినికేతన్‌లో అమర్త్యసేన్ ఇల్లు కూడా ఉంది. ఒక హస్తకళల దుకాణంలో షాపింగ్ చేసి తిరిగి ఇంటికి బయలుదేరి వస్తుంటే డ్రైవర్ ‘కాష్ ఫూల్’ చూద్దామని కాలువ ఒడ్డుకి తీసుకెళ్ళాడు. ఇవి ఒక రకం గడ్డిపూలు. పొడుగ్గా ఉంటాయి. తెలంగాణాలో బతుకమ్మ పండుగకి తంగేడు పూలు పూసినట్టే ఇవి కూడా దసరా సమయానికి పూస్తాయి. డోలు వాయిద్యాలకి వీటిని అలంకరిస్తారట.
మధ్యాహ్న భోజనంలో పులస వడ్డించారు దొలోన్. వేపుడు ఒకటి, ఆవపెట్టిన వంటకం ఒకటి. చేప వేయించిన నూనె అన్నంలో కలుపుకుని, చేప అందులో నంజుకుని తినాలట. చాలా బావుంది. ఆవపెట్టిన చేప కూడా అద్భుతం. పులుపు వేయరట. బాగానే లాగించాను. ఇంకోరకం సన్న చేప వేపుడు కూడా ఉంది. బెంగాల్ చేపలకే కాక మిఠాయిలకు కూడా ప్రసిద్ధి. సందేశ్ అని పాలతో చేసిన మిఠాయిలో పలురకాలు. మెత్తనివి, మధ్య రకంవి, గట్టివి ఎన్ని రకాలో. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నాక కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఎన్నో విషయాలు. ముఖ్యంగా సాహిత్యం, సినిమాల గురించి. సాయంత్రం లఖ్నవూ వారి సంగీత కచేరీ ఉంది. ప్రవేశం ఉచితం. అయినా చాయ్‌ని వదిలి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయాం. చాయ్‌కి హోమియోపతి మందులు ఇస్తూనే ఉన్నారు దొలోన్. చాయ్ కోసం చేసిన చికెన్ స్టూ తోనే అందరం భోజనం చేశాం.
మర్నాడు ఉదయానికి చాయ్ కోలుకున్నారు. ఆమెకి పక్షిశాస్త్రం అంటే అభిరుచి. తన పెద్ద కెమెరా పట్టుకుని పక్షుల ఫొటోలు తీస్తూ వాకింగ్ చేసి వచ్చారు. మధ్యాహ్నం కోల్‌కతా తిరుగు ప్రయాణం. ఇంట్లోనే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం. దొలోన్ ‘ఇన్‌సైడ్ ఔట్’ అనే ఒక పుస్తకం వ్రాశారు. దానితో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు బహూకరించారు. పన్నెండవుతుంటే వీడ్కోలు తీసుకుని చాయ్, నేను స్టేషన్‌కి బయలుదేరాం. ఈసారి రైలు సమయానికి వచ్చింది. సమయానికి కోల్‌కతా చేరింది. ఆరోజు మా ఊరికి తిరుగుప్రయాణం చేయటం ఇష్టం లేక మర్నాడు ప్రయాణం పెట్టుకున్నాను. రూముకి వెళుతుంటే దారిలో విక్టోరియా మెమోరియల్ కనిపించింది రాజసంగా. చాయ్ నన్ను రూము దగ్గర దింపి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు చాయ్ ఆఫీసుకి వెళ్ళాలి కాబట్టి ఇంక వేరే కార్యక్రమాలేం పెట్టుకోలేదు. పైగా ఆరోగ్యం కుదుటపడాలి. నేను భోజనం చేసి మిష్టి దోయ్ తినటానికి చాయ్ చెప్పిన దుకాణానికి వెళ్ళాను. మిష్టి దోయ్ అంటే తీపి పెరుగు. పాలల్లో బెల్లంగానీ, పంచదార కానీ వేసి తోడుపెట్టి చేస్తారు. చాలా ప్రసిద్ధి. భలే బావుంది. మర్నాడు ఉదయం తిరుగుప్రయాణమయ్యాను చక్కని జ్ఞాపకాలను మూటకట్టుకుని.