విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు – ప్రెస్ నోట్

0
3

[dropcap]సా[/dropcap]హిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్‌లో. ముఖ్యంగా సాంస్కృతిక రాజధాని విజయవాడలో. ఇలాంటి గడ్డకట్టిన సందర్భాల్ని, మోడువారిన సాంస్కృతిక వాతావరణాన్ని, అగాధంలా ఏర్పడిన ఒక పెద్ద శూన్యతని ‘మల్లెతీగ’ సాహిత్య సేవాసంస్థ గుర్తించింది. అందుకే విజయవాడలో రెండురోజుల పాటు కవులు, రచయితలు, కళాకారుల కోసం ఓ మెగా కార్యక్రమాన్ని రూపొందించింది.

‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ పేరుతో నవంబరు 19, 20 తేదీలు శని, ఆదివారాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. గతంలో ఇలాంటి కార్యక్రమాల నెన్నింటినో ‘మల్లెతీగ’ విజయవాడ, తిరుపతి, అవనిగడ్డలలో నిర్వహించి, విజయవంతమైంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వున్న కవులు, రచయితలు, కళాకారులు.. అలాగే తెలంగాణలో నివసిస్తున్న కవులు, రచయితల్నీ, ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారుల్ని, రచయితల్నీ ఈ వేదికపైకి తెచ్చేందుకు సిద్ధమైంది మల్లెతీగ. వారందరికీ ఈ ప్రకటన ద్వారా ఆహ్వానం పలుకుతోంది. రండి! కరోనానంతర కాలానికి కొత్త ఉత్సాహం కలిగిద్దాం. కళలతో, సాహిత్యంతో వాతావరణాన్ని సువాసన భరితంగా.

2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి.

రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాహిత్యంలో వస్తున్న మార్పులు, నేటి సాహిత్యంలో వేళ్లూనుకుపోతున్న అవాంఛిత పరిణామాలపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం లబ్ధప్రతిష్ఠులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, ఆయా రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సత్కారాలు, సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు వుంటాయి.

ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.

భోజనం, అల్పాహారం (రెండవ రోజు ఉదయం), టీ ఏర్పాట్లు వుంటాయి. పాల్గొన్న ప్రతినిధులందరికీ సర్టిఫికెట్ అందజేస్తాం. ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ ఎంపిక చేసిన కవితల్ని మాత్రమే మీరు వేదికపై చదివే అవకాశం వుంటుంది. తాజాగా అచ్చయిన మీ పుస్తకాల్ని (కథ, కవిత, ఇతర అంశాలేవైనా) ఆవిష్కరించుకునే అవకాశం వుంది.

ఈ ఉత్సవాలకు ప్రతినిధులుగా హాజరు కావాలనుకున్న కవులు, రచయితలు, కళాకారులు 92464 15150, 83329 03156 నెంబర్లకు మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, పోస్టల్ పిన్‌కోడ్ జనరల్ (టెక్స్ట్) మెసేజ్ పంపి, నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు.

కలిమిశ్రీ

FROM

KALIMISRI

(MALLETEEGA MONTHLY MAGAZINE)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here