[dropcap]చి[/dropcap]టారుకొమ్మకి వ్రేల్లాడే పక్షికున్న తెగింపుని చూసి
ఆశ్చర్యపోయే అమాయకత్వానికి చెల్లుచీటీ ఇచ్చేస్తే
సహజంగా ఎగిరే విషయాలు బోధపడ్తాయి.
ఎప్పుడూ పక్షి కలలు కంటూ
ఆకాశాన్ని ఆవాసయోగ్యం అనుకోవడం
ఎంత ముప్పన్నదీ ఇప్పుడిప్పుడే తెలీదు.
ముసిరిన సంగతులు ఏవీ మబ్బుతునకలు
కానందుకు విచారపడితే, తేలికగా
వీగిపోయేప్పుడు ఆనందపడడమెలానో తెలీదు.
జీవించడం అన్నదే ఒక రహస్యం
అయిపోయినప్పుడు, జీవితకాలాన్ని ఎలా
లెక్కించాలో అని మీమాంస.
కొన్నిసార్లు, ఓడిపోయినందుకు
దుఃఖాన్ని మోయాలని
ఎవరూ సంతోషంగా సరిగా చెప్పరెందుకో.