[dropcap]నా[/dropcap] జీవితడైరీలో పేజీలు తగ్గిపోతున్నాయి
ఇకపై వ్రాయబోయే పదాలు బాగా కుదించాలి
అత్యంత విలువైన వాటినే ఏరి ఎంచుకోవాలి
ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలి
పైపూత స్నేహితుల్ని ఇక పెనవేసుకోలేను
గాయాలు నేర్పిన పాఠాల్నిమర్చిపోలేను
పనికోసం పలకరించే బంధువుల్నిఆదరించలేను
చేదు అనుభవాల పాతరాళ్లను మళ్ళీ తట్టుకోలేను
ప్రేమల్ని పంచిఇచ్చిన బంధువుల్ని చూడాలి
విద్యాబుద్ధులు చెప్పిన గురువుల్నికలవాలి
కష్టంలో ఆదుకున్నవారికి కృతజ్ఞత చెప్పాలి
అనుంగు మిత్రుల్ని మనసారా హత్తుకోవాలి
నిరంతరం మన ఉన్నతి కోరినవారికి మొక్కాలి
ఋణపడిపోయిన బాకీలు వరుసగా తీర్చాలి
మానవజన్మ పరమార్థం చెప్పే పండితపలుకులు వినాలి
గీత చెప్పిన అమృతవాక్కులు మననం చెయ్యాలి
ఇకనైనా మిగిలినక్షణాలు ఫలవంతం కావాలి
ఇప్పటి కైనా బ్రతుక్కి అర్థమేమిటో గుర్తెరిగి మసలాలి
జీవనగమ్యం పొడగట్టి అటువైపే నడవాలి
సమయాన్ని బహుజాగ్రత్తగా ఖర్చుపెట్టాలి
నాపై నిజమైన ప్రేమ ఉన్నవారే పలకరించండి
మొహమాట మిత్రులంతా పక్కకు తప్పుకోండి
కొన్నిఅనుభవాల సారాన్నికాస్త కాగితంపై పెట్టాలి
చదివితీరాల్సిన ఆఖరి గ్రంథం చదవనారంభించాలి