మేనల్లుడు-1

0
5

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘మేనల్లుడు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]U[/dropcap]SA లో Harvard University లో Hereditary Diseases (ఆనువంశిక వ్యాధుల) మీద రీసెర్చ్ జరుగుతుంటుంది. టీమ్ లీడర్ వివేక్‌తో పాటు దివ్య, రాధిక, సునీల్, డేవిడ్ ఇంకా కొంత మంది కలసి రీసెర్చ్ చేస్తుంటారు.

ఈ రోజు ఎలాగైనా తన మనసులో మాట వివేక్‌తో చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేస్తుంది దివ్య. ఆ మాటే రాధికతో చెప్పింది.

“ఇప్పటికి చాలా సార్లు చెప్పావు ఈ మాట.. సంవత్సరాలు గడిచిపోతున్నాయి.. నువ్వంటే వివేక్‌కి లైకింగ్ ఉంది. నీకైతే చెప్పనే అక్కరలేదు.. వివేక్ అంటే ప్రాణం.. పిచ్చి మొద్దు!.. ఈ పాటికి వివేక్‌తో చెప్పేసి ఉంటే, లవర్స్‌లా బ్రహ్మాండంగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుండేవారు.. నేనైతేనా ఎప్పుడో చెప్పేసేదానిని” అంది రాధిక.

చిరు కోపంతో అంది దివ్య –

“ఏం నేనే ముందు చెప్పాలా? నేనంటే లైకింగ్ ఉన్నవాడు, నేనంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నవాడు, చిన్నమాట చెప్పలేడా?”

“O.K., వివేక్ చెప్పలేదునుకో, నీ మనసులో మాట చెప్పవా?.. ప్రేమంటే ఇద్దరు ఒకరితో ఒకరు I love you చెప్పకుంటేనే ప్రేమ అంటారనుకుంటున్నావా?

ఇద్దరిలో ఒకరికి ఇంకొకరి మీద ప్రేమ ఉన్నా దాన్ని లవ్ అనే అంటారు. నీకు వివేక్ అంటే లవ్ ఉంది. తనే I love you అని చెప్పాలని ఎదురు చూస్తావెందుకు? ఒక వేళ I love you అని వివేక్ చెప్పలేదనుకో.. డ్రాప్ అవుతావా?” అంది రాధిక.

“రాధీ!.. అసలు ఆ మాట నీకెలా అనాలనిపించింది? వివేక్ నా ప్రాణం.. తను లేని జీవితం ఊహించలేను. ఇన్నాళ్లు తన నోటితో I love you అన్న మాట వినాలని ఆశపడ్డాను.. ఈ రోజే చెప్పేస్తాను” అంది దివ్య.

“గుడ్!.. ఇలా మాటాడితే నువ్వు ఇన్నాళ్ల నుంచి వివేక్ మీద ఉన్న ప్రేమని వివేక్ ముందు ఉంచుతావని అలా అన్నాను.. పాత మాటే గాని చాలా గొప్ప మాట! ఆలశ్యం అమృతం విషం.. కత్తిలా ఉంటాడు వివేక్. ఏ అమ్మాయైనా వివేక్‌ని ఎగరవేసుకుపోవచ్చు” అంది రాధిక.

“నోరు ముయ్యవే!.. ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బ్రతికిపోయావు” అని కోపంగా చెయ్యి ఎత్తింది దివ్య.

“తరువాత నన్ను కొట్టవచ్చులే!.. అటు చూడు నీ హీరో వస్తున్నాడు.. మీరిద్దరూ వెళ్లే place నన్ను సెలక్ట్ చేయమంటావా? నువ్వు సెలక్ట్ చేస్తావా?” అంది నవ్వుతూ దివ్య.

“ఏడ్చావ్!..” అని దివ్య అంటుండగానే వివేక్ దగ్గరగా వచ్చి“హాయ్” అని అందరిని పలకరించి.. “దివ్య!.. నేను బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వచ్చాను.. సాంబారు, ఇడ్లీ తెస్తానన్నావు కదా?.. తీసుకొచ్చావా?.. మరిచిపోయావా?” అన్నాడు.

“సాంబారు, ఇడ్లీ ప్రిపేరు చేయడం కోసం 2 గంటలు ముందే లేచి తయారు చేసాను.. ముందు తిని వర్క్ స్టార్ట్ చెయ్యి వివేక్” అని దివ్య అంటుండగానే ఫోను రింగ్ కావడంతో ఫోను ఎత్తాడు వివేక్.

“అమ్మూ!.. ప్లీజ్! ఏడవకు.. నేను వచ్చేస్తున్నాను. ఫోను పెట్టేస్తున్నాను. నేను ఎయిర్‍పోర్టుకి వెళ్లినాక ఫోను చేస్తాను.. ప్లీజ్ అమ్మూ! ధైర్యంగా ఉండు.. మావయ్యకి ఏమీ కాదు” అని కంగారుగా అన్నాడు..

“దివ్యా!, రాధీ.. నేను ఇండియా వెళుతున్నాను. సునీల్!.. డీన్ ఫ్రెడ్‌మామ్‌కి చెప్పి వస్తాను” అని కంగారుగా అడుగులు వేసాడు వివేక్.

బేలగా రాధిక వైపు చూసింది దివ్య.

బాధపడ వద్దన్నట్లు కళ్లతో సైగ చేసింది రాధీ.

ఏదో ఆలోచన వచ్చిన దానిలా గభాలున బ్యాగ్ తీసుకొని “రాధీ!.. నేను వివేక్‌కి హెల్ప్ చేస్తాను. అదే ఇండియా వెళ్లడానికి, టికెట్టు బుక్ చేయడం, లగేజ్ సర్దడం, ఎయిర్‌పోర్డు దగ్గర డ్రాప్ చెయడం” అని గబగబా అడుగులు వేసింది దివ్య.

వివేక్, దివ్య ఇద్దరు కారులో బయలుదేరారు.

డ్రైవింగ్ చేస్తున్నాడే కాని, భారంగా ఊపిరి తీస్తూ, కళ్లల్లో నిండుతున్న కన్నీటిని ఆపలేకపోతున్నాడు వివేక్..

గభాలున తన చేతిని వివేక్ చెయ్యి మీద వేసి “వివేక్!.. మీ మావయ్యకి ఏం కాదు.. నేను ఫ్లయిట్ టికెట్ ఇండియాకి బుక్ చేస్తాను. 1 hour లో ఫ్లైట్ ఉంది.. లగేజ్ సర్దేస్తాను.. ఈలోగా నువ్వు breakfast చేస్తావా వివేక్” అంది దివ్య.

అప్పటికే కారు ఇంటి మందు ఆగింది.. గబగబా అడుగులు వేసాడు వివేక్..

“వివేక్!.. ముందు నువ్వు Fresh up అయిరా. ఈలోగా నేను నీ బట్టలు సర్దేస్తాను” అంది.

“థ్యాంక్స్ దివ్య!..” అని  wash room లోకి వెళ్లి మొహం కడుక్కొని రాగానే..  “హార్రిఅప్ వివేక్!.. టైమ్ లేదు.. నేను డ్రైవ్ చేస్తాను.. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి” అని డ్రైవింగ్ సీటులో కూర్చుంది దివ్య.

కారు స్టార్ట్ చేసింది. ప్రక్కకు తిరిగి చూసింది. శూన్యంలోకి చూస్తున్న వివేక్‌ని చూసి.. “ప్లీజ్! వివేక్ వర్రీ కాకు.. ముందు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి” అంది దివ్య.

“బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకపోతే చచ్చిపోతానా?.. నేను ఈ రోజు ఇక్కడ.. ఇలా ఈ స్థానంలో ఉన్నానంటే అదంతా మామయ్య వలనే.. మా నాన్న డ్రంకర్డ్!.. ఆస్తి అంతస్తు అంతా నాశనం చేసి మేము రోడ్డు మీద నిలబడితే మావయ్య ఒక చేత్తో నన్ను, మరో చేత్తో అమ్మని పట్టుకొని వాళ్ల ఇంటికి తీసుకవెళ్లాడు.. నేను వేసే ప్రతీ అడుగు వెనుక మావయ్య అభిమానం, అనురాగం, బాధ్యత అన్నీ అన్నీ ఉన్నాయి” అని గబాలున దివ్య చెయ్యి పట్టుకొని.. “మావయ్యకి ఏమీ కాదు కదా?” అన్నాడు బేలగా వివేక్.

“ఏమీ కాదు వివేక్! అంత మంచి మనిషిని భగవంతడు ఎందుకు తీసుకువెళతాడు.. మీ మావయ్య అవసరం ఎంతో మందికి ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు” అంది.

నిర్లిప్తంగా నవ్వాడు.

“అలా అయితే.. సమాజాన్ని చీడపురుగుల్లా పట్టి పీడిస్తున్న ఎంతో మంది పెద్ద మననషుల ముసుగులో చలామణి అవుతూ happy గా ఉన్నారు.”

 ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనం వహించి, ఏదో గుర్తు వచ్చిన దానిలా… “వివే ! 10 నిముషాల్లో ఎయిర్‌పోర్టు వచ్చేస్తుంది.. breakfast చేసేయ్..” అంది.

“దివ్యా!.. ఇప్పటికి breakfast తిను అని పదిసార్లయినా చెప్పి ఉంటావు. ప్లీజ్!.. ఇంకోసారి అనకు..” అన్నాడు.

“నీకు.. సాంబారు,ఇడ్లీ ఇష్టం అని, అదీగాక ఫ్లైట్‌లో ఏమీ తినవు కూడా, 24 గంటలు జర్నీ..” అని నసిగింది దివ్య..

“ఇష్టం!.. నీకు తెలియదు ఏమో!.. ప్రపంచంలో ఎవరైనా నీకిష్టమైనది ఏమిటో చెప్పు అంటే మామయ్య అని చెప్పి, తరువాత తక్కినవి ఏవైనా చెబుతాను” అన్నాడు.

“సారీ!.. వివేక్” అంది.

“విధి!.. చాలా బలీయమైనది. మానవుడు, సైన్స్‌లో ఎంత ఉన్నత శిఖరాలు ఎక్కుతున్నా, మరు నిమిషంలో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేకపోతున్నాడు.”

వివేక్‍ని సముదాయించాలని అలా అంది కాని.. తనకి భయంగానే ఉంది.. ఎన్నో సార్లు అమృత గురించి, మావయ్య గురించి, అత్తయ్య గురించి చెప్పాడు.. వివేక్ మావయ్యకి ఏం కాకూడదు.. వివేక్ తట్టుకోలేడు..

“దివ్యా!.. ఎయిర్‍పోర్టు వచ్చేసింది. ముందుకు వెళ్లిపోయావు.” అని అనగానే గభాలున ఆపి, కంగారుగా వెనక్కి తీసుకు వెళ్లి కారు ఆపింది.

ఎందుకో తెలియదు, బ్యాగ్ తీసుకొని నడవబోతున్న వివేక్‌ని చూస్తుంటే దివ్య కళ్లల్లో నీళ్లు నిండాయి. తన సొంతం అనుకున్నది ఎవరో బలవంతంగా లాక్కొని తీసుకు వెళుతున్నట్లనిపించింది. వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని గబాలున వివేక్ చెయ్యి గట్టిగా పట్టుకుంది.

వెనక్కి తిరిగి చూసి.. “సారీ!.. నీకు చెప్పకుండానే వెళ్లి పోతున్నాను.. సారీ!.. నువ్వు ఇక వెళ్లు.. చాలా హెల్ప్ చేసావు.. నువ్వు లేకపోతే.. నేను టైమ్‌కి రాగలిగేవాడిని కాదు ఏమో!.. Once again thank you Divya” అన్నాడు.

కంగారుగా “మనిద్దరి మధ్యా థాంక్స్ ఏమిటి వివేక్” అంది.

“ఉండు ఒక్క నిమిషం” అని గబగబా కారు దగ్గరకు వెళ్లి దివ్య తెచ్చిన హ్యాట్‍ప్యాక్‍ని తీసుకొని, గబగబా దివ్య దగ్గరకు వచ్చి“సారీ దివ్యా నిన్ను చాలా బాధపెట్టాను.. నా కోసం కాకపోయినా నీ కోసం టిఫిన్ తింటాను” అన్నాడు.

జవాబుగా దివ్య కళ్లల్లో నీళ్లు నిండాయి.

గభాలున దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని “నువ్వు నా ప్రక్కన ఉంటే.. నాకు కొండంత ధైర్యంగా ఉండేది. మావయ్యకి ఏమైనా జరిగితే నేను..” అని వివేక్ అంటుండగానే.. “ప్లీజ్.. వివేక్! నువ్వలా డీలా పడిపోవద్దు.. టైమ్ అయింది. వెళ్లగానే నాకు ఫోను చెయ్యి వివేక్” అంది.

“ష్యూర్ దివ్యా!.. అన్నట్లు ఈ టిఫిను తింటాను.. Don’t worry..” అని గబగబా అడుగులు వేసాడు.

వివేక్ కనబడేంతవరకు నిలబడి, ఆ తరువాత కారు దగ్గరకు నడిచింది. కారు డ్రైవ్ చేస్తుందే కాని.. వివేక్ తన కోసం హాట్ ప్యాక్ తీసుకు వెళ్లడం గుర్తు వచ్చింది.

ప్రేమ వ్యక్తపరచడానికి ఇన్నాళ్లు భాష ఉండాలి, I love you చెప్పుకోవాలి అని అనుకుంది.. కాని అక్కరలేదని తెలిసింది.. నా కోసం కాకపోయినా నీ కోసం టిఫిను తింటానన్న వివేక్ మనసులో తన స్థానం ఏమిటో అర్థమయిపోయింది. తను వివేక్ ప్రక్కన ఉంటే ధైర్యం అన్న మాటల ముందు I love you చిన్న మాట మాత్రమే!..

ఒక మనిషి మీద ఉన్న ప్రేమని, ఇష్టాన్ని తెలియజేయడానికి వివేక్ ఈ రోజు తనతో ప్రవర్తించిన తీరు, నువ్వు నా ప్రక్కన ఉంటే కొండంత ధైర్యంగా ఉండేదన్న మాట ముందు I love you చాల చిన్న మాటలా దివ్యకు అనిపించిది.

ఫ్లైట్‌లో ఎక్కన వెంటనే, జోబులో నుండి సెల్ తీసి ఫోను చేసాడు..

“వీవీ.. వస్తున్నావా?.. త్వరగా వచ్చేయ్!.. నారాయణకి ఏం బాగుండలేదు.. ప్లీజ్ వచ్చేయ్!.. నీ ఒళ్లో తల పెట్టుకుని ఏడవాలని ఉంది వచ్చేయ్!..” అంది ఏడుస్తూ అమృత.

“వచ్చేస్తున్నాను.. చిన్నపిల్లలా నువ్విలా ఏడిస్తే ఎలా? ఫ్లైట్‌లో ఉన్నాను. మావయ్యను ఎంత తొందరగా చూస్తానా అని నేనూ తొందరపడుతున్నాను.. నిజం చెప్పాలంటే నాకేగాని రెక్కలుంటే ఎగిరి ఫ్లైట్ కన్నా ముందు రావాలని ఉంది అమ్మూ, ఏం చేయను చెప్పు” అన్నాడు బాధగా వివేక్.

ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.. ఏడుస్తున్నట్లు వెక్కిళ్ల శబ్దం మధ్యలో గట్టిగా ముక్కును పిలిచి.. “త్వరగా వచ్చేయ్!.. రాజమండ్రి ఎయిర్‌పోర్డుకి రంగడు కారు తీసుకొని వస్తాడు” అని ఫోను పెట్టేసింది అమృత.

బాధగా కళ్లు మూసుకున్నాడు వివేక్..

మళ్లీ రింగ్ కావడంతో కంగారుగా ఫోను ఎత్తాడు.

“వీవీ! నేను చెప్పడం మరిచిపోయాను.. చిన్నప్పుడు Alcot gardens లో ఉన్న లక్ష్మి నరసింహస్వామి టెంపుల్‌కి, కోరుకొండ వెళ్లేవాళ్లం.. నాకు మార్కులు తక్కువ వచ్చినప్పుడలా ఈసారి మార్కులు ఎక్కువ రావాలని ఆ గుడిలో దణ్ణం పెట్టుకునే దానిని. ఒక సారి నిన్ను బాగా సతాయించి, ముందు స్కూలుకి కాదు గుడికి తీసుకువెళ్లమంటే రంగడిని గుడికి తీసుకువెళ్ళమని చెబితే తీసుకువెళ్లాడు.. అప్పుడు నాకు 100కి 100 మార్కులు వచ్చాయి. గుర్తుందా? ఇప్పుడు నారాయణ ఆరోగ్యం బాగుంటే 101 కొబ్బరికాయలు కొడతానని దణ్ణం పెట్టుకొనిరా..” అలా పిచ్చిదానిలా ఏవేవో చెబుతుంది అమృత.

ఫ్లైట్ బయలుదేరడానికి సిద్ధం కావడంతో కంగారుగా “ష్యూర్!.. అమ్మూ.. గుడికి వెళ్లి మొక్కుకొని వస్తాను.. ఫోను పెట్టేస్తున్నాను. త్వరగా వ్చచేస్తా అమ్మూ..” అని ఫోను పెట్టేసాడు వివేక్. బాధగా కళ్లు మూసుకున్నాడు.

‘ఏ మనిషైనా ఆపదలో ఉన్నప్పుడు నిజాన్ని ఆలోచించలేడు. గతి తప్పతుంది మనసు.. తనకి అనుకూలంగా పరిస్థితి ఉంటే బాగుండును అనే ఆలోచిస్తుంది మనసు.. ఇప్పుడు అదే స్థితిలో ఉంది అమృత.. తనే కాదు.. తను కూడ మావయ్యకి ఏం జరగకూడదనే మనసు ఆరాటపడుతుంది. ఇది సహజం!.. దీనికి ఎవరూ అతీతులు కాదు.’

“ఏమంటీ!.. మా అమ్మకేం కాదుగా.. నిన్న మాట్లాడిందండి. కనీసం.. ఒంట్లో బాగుండలేదని కూడ చెప్పలేదు. మీదు మిక్కిలి pickles అయిపోతే చెప్పు.. కొరియర్ చేస్తానంది.. ఇంతలో సీరియస్ అయి ICUలో పెట్టడం ఏమిటి? చెప్పండి! అమ్మకే కాదుగా?” అంది ఏడుస్తున్న ఒక అమ్మాయి.

“ఏం కాదు!.. నేను చెబుతున్నానుగా!.. మనిషన్నాక ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. మళ్లీ తగ్గుతుంది..” అన్నాడు అమ్మాయి ప్రక్కనే ఉన్న వ్యక్తి.

“అన్నట్లు లక్ష్మి నరసింహస్వామికి మొక్కుకున్నాను.. అభిషేకం చేయిస్తానని.. అమ్మను చూసిన వెంటనే.. అదేనండి అమ్మ క్షేమంగా ఉంటే, అక్కడ నుండే గుడికి వెళదాం!.. మొక్కు తీర్చాలి కదా?”

మనిషి great అని తెలుసు కాని దేవునికి కూడా మొక్కు పేరుతో లంచం ఇవ్వగలడు.

వివేక్‌కి మనసంతా పిచ్చిగా ఉంది.

‘అమ్మూ! ఎలా ఉందో?.. అసలు ఏమైనా తింటుందో? లేదో? తినదు.. తనకు తెలుసు.. నేను, తప్పితే మావయ్య మాట మాత్రమే వింటుంది. మావయ్య హస్పటల్‌లో ఉన్నాడు. తను అక్కడ లేడు.. అమ్మ, అత్తయ్య మాట వినదు.. అమ్మూ ఎలా ఉందో?.. అసలు.. ఇలా వాళ్లందరిని వదిలేసి.. ఇలా USA రాకుండా ఉండవలసింది.. చాలా తప్పు చేసాడు. మావయ్య వాళ్లకి ఏమిచ్చినా ఋణం తీరదు. కనీసం ఇండియాలోనే ఉండి వాళ్లకి చేదోడు, వాదోడుగా ఉండవలసింది.’

ఎయిర్ హోస్టెస్ స్నాక్స్, జ్యూస్ తీసుకురావడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చాడు వివేక్. ప్లేటులో స్నాక్స్ చూడగానే అమ్మూ గుర్తు వచ్చింది.. మూడు పూటల టిఫిన్, అన్నం బదులు స్నాక్స్ తినమంటే తింటుంది.. అత్తయ్య, అమ్మ వల్ల కాక పప్పు నెయ్యి కలిపిన అన్నం గిన్ని తన చేతికిచ్చి, “కాస్త అమ్ముకి తినిపించు నీ కబుర్లు వింటూ తింటుంది” అనేవారు.. తనని మూడు చెరువుల నీళ్లు తాగించి అన్నం తినేది.. గతం గిర్రున కళ్ల ముందు మెదిలింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here