కొరియానం – A Journey Through Korean Cinema-33

4
4

ఒక్కొక్క సీనూ ఖ్లైమాక్సులా ఉంఠదీ

Chapter 29

[dropcap]చ[/dropcap]దువుతున్న పుస్తకంలోనో, చూస్తున్న సినిమాలోనో ఉత్కంఠ తట్టుకోలేనంత ఉంటే, పేజీలు స్కిప్ చేసి చివరి భాగం చదివేస్తారు ఒక్కోసారి లేదా సినిమా చివరి సీను చూసేస్తారు. కానీ, ఆ చివరి సీన్ లేదా క్లైమాక్సు తెలిసిపోయాక, ఉత్కంఠ తగ్గాక, మునుపంతటి కిక్ చదువుతున్నప్పుడు రాదు. అందుకే ఉత్కంఠ ఎక్కువైతే కాసేపు ఆ కథ చదవటం ఆపేసి రిలాక్స్ కావాలి కానీ, చివర పోర్షన్ ఏమిటన్నది తెలుసుకోకూడదు.

అలా క్లైమాక్సు ట్విస్టు ఒక్కసారి రివీల్ అయ్యాక, ఆ సస్పెన్స్ పోతే ఆ సినిమాలు బాల్చీ తన్నేసిన సందర్భాలు చాలా ఎక్కువ. దీనివల్లే సిడ్ ఫీల్డ్, మన సికందర్ గారి లాంటి seasoned screenwriting experts – End Suspense సినిమాల్లో పని చేయదు అంటారు. అందుకే సీన్ బై సీన్ సస్పెన్స్ ముఖ్యం అంటారు.

కానీ, అలా అయినా, ఒకసారి అత్యంత ముఖ్యమైన సమాచారం రివీల్ అయినా చివరికంటా ఎన్నిసార్లు అయినా చూడాలంటే narration ఎంతో ఉన్నతంగా ఉండాలి.

Alfred Hitchcock సినిమా To Catch A Thief లో నాయికా నాయకులైన గ్రేస్ కెల్లీ, Cary Grant మధ్య రొమాన్టిక్ టెన్షన్‌ను పైపూతగా వాడుతూ, సమయాసమయాలను బట్టీ సీన్ బై సీన్ సస్పెన్స్ వాడాడు.

నా వరకైతే ఈ సీన్ బై సీన్ సస్పెన్స్ కంటే అద్భుత సౌందర్య రాశి గ్రేస్ కెల్లీ, ఆల్ఫా మేల్ సెక్సప్పీల్ అండర్ కరంట్‌గా చూపే కేరీ గ్రాంట్‌ల మధ్య రొమాన్టిక్ టెన్షనే బాగా నచ్చింది. ఫ్రెంచ్ రివియేరా అందాలు, ఆ వీధులలో వచ్చే చేజులు మహ గొప్పగా ఉంటాయి.

మరో మార్గం సినిమాలో ప్రతి సీనూ క్లైమాక్సులా ఉండాలి.

ఈ రెండో ఆప్షన్‌ను ఫాలో అయ్యి సక్సెస్ కొట్టటం అంత తేలికగా అయ్యే పని కాదు. రచయితలంతా గుడుగుడుగుడు గుడుంబా ష్షంకర్లు కాలేరు కదా. అయినా అంత గొప్పగా కతల్ సెప్పాలంటే అందరికీ కోవై సరళ లాంటి భార్యలు దొరకాలిగా.

సీన్ టు సీన్ సస్పెన్స్‌తో సినిమాలు తీయటం ఇంత కష్టమైతే కాదు. కానీ, అది కూడా చేతకాక దెబ్బతిన్న సినిమాలు వంద సంఖ్యలో ఈ దశాబ్దంలోనే ఉన్నాయి.

కానీ, క్లైమాక్సు మొదట్లోనే రివీల్ చేసి, సినిమాను చాలాసార్లు చూసేలా చేసిన రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో వచ్చాయి ప్రపంచ సినిమాలో. వాటిలో ఒకటి జనాలందరూ ఎంతో గొప్పగా చెప్పే మెమెంటో. మన మురుగ నోలాన్ 2006లో తీసిన గజినీని కాలంలో ఆరేళ్ళు ముందుకు ప్రయాణించి మరీ కాపీ కొట్టి తీసిన క్రిస్ నోలాన్ సినిమా.

మరొకటి ఇప్పటి కొరియన్ దిగ్దర్శకులలో ఒకడైన ఈ చాంగ్-డాంగ్ అందించిన అద్భుత చిత్రం పిపర్మింట్ కేండీ. Peppermint Candy.

Nolan వాడిన అత్యంత కాంప్లికేటెడ్ screenplay, non-linear narrative techniques, అప్పటికింకా కొత్తగా నడుస్తున్న వ్యవహారం కావటం వల్ల ఆ సినిమా బాగా నడిచింది. ఒకపట్టాన అర్థం కాక ఒకటికి నాలుగు సార్లు చూశారు. చూడాల్సి వచ్చింది.

మనలో మన మాట:

ఈ రివ్యూ రాయటానికి ఈ సినిమా ఐదు సార్లు చూశా. ఏమీ అర్థం కాలేదు.

విఖ్యాత ఆలీవుడ్ రిపోర్టర్ రివ్యూయర్!

నిజంగా నోలాన్ ఒక కలాకండోంమ్ తీసిపడేశాడు టెనెట్‌తో!

టెనెట్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ ను overuse చేయటం మీద పడిన ట్రోల్స్ లో ఒకటి.

కానీ, మెమంటోలో వాడింది సగం పైన Reverse Screenplay. ఈ Reverse Screenplay నే ఏదో చేయబోయి, మరేదో అయ్యి టాలీవుడ్ దర్శకుడు తేజ కేక పెట్టలేక కొన్నాళ్ళు మూగబోయాడు. ఇలాంటి Reverse Screenplay నే మరొక మెట్టు ఎక్కించి విజయం సాధించటమే కాదు, కొరియన్ సినిమాలు ఎందుకు అంత ఉన్నతంగా అనిపిస్తాయి అనే ప్రశ్నకు, అసలు ఈ ప్రశ్న పుట్టటానికి దశాబ్దం ముందే సమాధానం ఇచ్చాడు దర్శకుడు ఈ.

మొదటి పది నిముషాల స్క్రీన్ టైమ్‌లో సినిమా ముగింపు వచ్చేస్తుంది. ఏ కొంచెం కూడా సస్పెన్స్, ట్విస్టులనే పేరిట మిగల్చడు. అసలా ముగింపు అలానే ఎందుకు వచ్చింది అన్న దాన్ని ఏడు హృద్యమైన సీక్వెన్సులతో చూపిస్తాడు. ప్రతి సీక్వెన్స్‌కూ దాని బీజం దాని తరువాత రాబోయే సీక్వెన్స్‌లో చూపిస్తాడు. అలా మన మనసుల్ని హుక్ చేసి, చివరికంటా సినిమా చూసేలా చేస్తాడు.

సినిమా డ్రామా జాన్రాకు చెందింది. ఆధునిక కొరియన్ దేశ చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనల చుట్టూ మన కథానాయకుడి జీవిత ఘట్టాలను అల్లుకుంటూ, గుండెను పిండేసే ఎమోషన్లను టాపింగ్‌గా వాడుతూ, ప్రతి సన్నివేశంతో గాఢతను పెంచుతూ తీసిన పిపర్మింట్ కేండీ సినిమా పేరంత హాయిగా ఉండదు. Peppermint Candy is used as a nostalgic thread in the film to hook us. And the candies themselves were used as MacGuffin and plot moving objects.

అంత పకడ్బందీగా screenplay ని సమకూర్చుకుని, అప్పుడే ఎదుగుతున్న Sol Kyung-gu ను ప్రధాన పాత్రలో జీవింప చేసి తీశాడు. అప్పటికే మంచి పేరున్న నటి Moon So-ri కథా నాయికగా మంచి డెప్త్ ఉన్న పాత్రలో కాసేపే కనిపించినా, హృదయానికి హలో చెప్తుంది.

ఇప్పటికీ ఈ సినిమా చూడని వాళ్ళుంటే వెంటనే చూసేయండి.

పార్క్ చాన్-వుక్ కథలోని ఎమోషన్లను ఫాలో అయేలా చేస్తాడు. అదే సినిమా చూడాల్సిన విధానం అంటాడు. పాత్రల మీద మన భావోద్వేగాలను invest చేయవద్దంటాడు. కానీ దర్శకుడు ఈ మాత్రం పాత్రల భావోద్వేగాలే మనవనేలా మనను ఒప్పిస్తాడు. అలా మనల్ని తన సినిమాలకు హుక్ చేస్తాడు.

అటు పార్క్ కానీ, ఇటు ఈ కానీ, మొదట కొన్ని సినిమాలు తీసి పెద్ద పేరు తెచ్చుకోలేదు. సరిగ్గా కొత్త మిలీనియమ్ అయిన 2000లో వచ్చిన తమ తమ సినిమాలతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా కొరియన్ సినిమాకు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చారు.

చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కనుక ప్రస్తుతానికి ఇక్కడ వదిలేద్దాం. చూడని వాళ్ళు చూసేయండి. ఇప్పటికే ఈ సినిమా గుర్తొచ్చి నా మనసు మనసులో లేదు. పూర్తిగా గుర్తుతెచ్చుకుంటే ఇక నేను ఈ ఎపిసోడ్‌ను క్రీస్తు శకం 3576లో పూర్తి చేస్తాను, ఎంత టైమ్ ట్రావెల్ చేసినా ఎడిటర్ గారికి ఈ వారంలో పబ్లిష్ చేసే సమయం దొరకదు.

అసలే కొరియానం చదివేది మొత్తం ముగ్గురు. రాస్తున్నాను కనుక ఇనీవిటబుల్‌గా భవదీయుడు గీతాచార్య. నాతో ఉన్న obligation వల్ల స్పెలింగ్ ఎర్రర్లు లేకుండా సహాయం చేసే నా పర్సనల్ ఎడిటర్ గారు, ఇక సంచిక ఎడిటర్ గారు (చదువుతున్నారని ఎలా నమ్మకమంటే text మధ్యలో images పెట్టిస్తున్నా కదా, అవి కరక్ట్ ప్లేస్‌లో పెట్టాలంటే చదవక తప్పదు. పైగా అచ్చులో తప్పులు ఉండకూడదు కనుకా).

నేను కనుక ఆ పైన చెప్పిన క్రీశ 3576లో పూర్తి చేస్తే మిగిలేది నేనొక్కడినే. ఉన్న ఇద్దరు ఇనీవిటబుల్ రీడర్లు కూడా లేకుండా పోతారు. ఇన్ని ప్రమాదాలు తప్పాలంటే మీరు సినిమా చూస్కోండి. నేను చివరి ఎపిసోడ్ రాశాక దాని ముందరి ఎపిసోడ్ల కోసం ముందుగానే ఒక రివ్యూ ఇస్తాను. ఎందుకంటే చాలా విశ్లేషించాల్సిన సినిమా ఇది.

Cinema as art అన్నదానికి సరైన నిర్వచనాలలో ఇదొకటి.

Chapter 30

ఎంత గొప్ప సినిమాలైనా తీయండి. వాటిలో కాస్తో కూస్తో కమర్షియల్ ఎలిమెంట్లు లేనిదే జనాన్ని రీచ్ కావు. పూర్తి ఆర్టు ముక్కలుగా తీసిన సినిమాల వల్ల అవార్డులు రావచ్చు కానీ, ఇతర దేశాలలో వేవ్‌లు సృష్టించబడవు. అందుకే మహా మహా సత్యజిత్ రాయ్ తీసిన అపూ ట్రైలాజీ వల్ల ఆయనకు గొప్ప పేరు వచ్చి ఉండవచ్చుగాక. Indian Cinema never became a pop cultural phenomenon in the West. Nor even in the oriental countries. It was Rajinikanth’s Muthu which rose the craze for Indian Cinema in Japan.

అదే బాహుబలి, RRR ల వల్ల మన సినిమాలను వేలం వెర్రిగా చూసే phenomena మొదలౌతోంది. RRR గొప్ప కళాఖండం కాకపోవచ్చు. కానీ, సామాన్య పాశ్చాత్య సినీ ప్రేమికుల మెదళ్ళలో ‘నాటు’కుని పోయేంత క్లాసీ మాస్ సినిమా. అందుకే ఆ సినిమా ఆస్కారం గురించి ఇంత చర్చ జరిగింది.

ఇక్కడో మాట చెప్పుకోవాలి. As usual గా మన సత్యజిత్ రాయ్‌ను మనమే జనానికి చేరకుండా చేసేసుకున్నాం. ఆర్టు డైరక్టర్ అని. ఆర్టు డైరక్టర్ అంటే ఆ.. ఆర్టు డైరెక్టరని కాదు. ఆర్టు సినిమాలు తీసే దర్శకుడని. ముద్ర కొట్టేశాం. జనాలకు దూరమయ్యాడు. సామాన్య ప్రజలను చేరలేదు. అదృష్టవశాత్తూ తెలుగూఫ్ కాదు కనుకా, బంగ దేశానికి చెందిన వాడు కనుకా అక్కడ ఈ నాటికీ ఈ తరానికీ తెలుస్తూనే ఉన్నాడు.

నిజానికి అపూ ట్రైలాజీతో సహా ఏ ఒక్క రాయ్ సినిమా పరిశీలించి చూసినా అవి కమర్షియల్ సినిమాలే. రాయ్ అంత కమర్షియల్ దర్శకుడు మన దేశ సినిమా చరిత్రలో ఇంకొకరు లేరు. జక్కన్నలు, ప్రశాంత్ నీల్‌లు ఆగరు. కానీ, దురదృష్టవశాత్తూ రాయ్ మొదట పేరు తెచ్చుకున్న సినిమా ఆర్టు సినిమాగా misrepresent చేయబడటం వల్ల ఆయన దేశవ్యాప్తంగా సామాన్య జనాలకు అంత చేరువ కాలేకపోయారు. ముద్ర ముద్రే ముద్రే.

కావాలంటే ఏ చిరియాఖానా నో, సోనార్ కెల్లానో చూడండి. ఎంత కమర్షియల్ సినిమాలో అవి అనే విషయం తెలుస్తుంది. అదృష్టవశాత్తు, కొరియన్ నిజమైన ఆర్టు సినిమాలు క్రమంగా ప్రపంచ సినిమా హాళ్ళలోకి వెళ్ళక ముందే పార్క్, ఈ లాంటి గొప్ప దర్శకుల రిపీట్ వేల్యూ ఉన్న high quality commercial films విదేశీ జనావళిలోకి చొచ్చుకుని పోవటం వల్ల, మరికొన్ని ఇతరేతర కారణాల వల్ల కొరియన్ వేవ్ మొదలై పోయింది.

రాయ్ విషయంలో జరిగిన పొరబాటు వల్ల ఆరున్నర దశాబ్దాలు పట్టింది మన దేశపు సినిమా పాశ్చాత్య దేశాలలో pop cultural phenomenon గా మారటానికి. అదే పొరబాటు జరుగకపోవటం వల్ల ఇరవై మూడేళ్ళ క్రితం కొరియన్ వేవ్‌కు బీజాలు పడ్డాయి.

కానీ, మన వాళ్ళ ఔట్పుట్ నిలకడగా ఉండదు. వేవ్‌ను విపరీతంగా exploit చేయబూనుతారు. అందుకే ఇప్పటికైనా మన సినిమా కొరియా స్థాయిలో ప్రభావం చూపుతుందా అంటే అనుమానంగా వేచి చూడాలి. ఆ సమస్య ఉండదు కనుక, మూలాలను మరువరు కనుక కొరియన్ వేవ్ సిల్వర్ జూబిలీ జరుపుకుంటోంది.

అలా కొరియన్ వేవ్ మొదలు కాబోయే ముందు జనసామాన్యం లోకి చొచ్చుకుని పోయిన బిగ్ బజట్ కమర్షియల్ కొరియన్ సినిమా..

వచ్చేవారం చూద్దాం! (సినిమా పేరది కాదు)

అంత వరకూ పొన్నియన్ సెల్వన్‌ను చూసి కల్కి కృష్ణమూర్తిని పొగుడుకోండమ్మా! మన కొవ్వలి భయంకర్‌ను మరచి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here