జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-13

1
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ధనాంబు ప్రాప్య భౌట్టేయః కశ్మీర జన విక్రయాత్।
గుర్జన్నాశాః ప్రాధాత్సర్వస్తదా ఠిన్చన వారిదః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 158)

[dropcap]ఇ[/dropcap]క్కడ నుంచీ కశ్మీరు చరిత్ర తెలుసుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. ఆవేశం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. నిస్సహాయత వల్ల కలిగే ఆవేశం అది. ఎందుకంటే, గతాన్ని మనం మార్చలేము. కానీ గతంలో ఇతరుల స్వార్థం వల్ల కలిగిన దుష్పరిణామాల ఫలితాలు మాత్రం మనం అనుభవించక తప్పదు. అందుకు బాధ కలుగుతుంది. ఆవేదన హద్దులు దాటుతుంది. వర్తమాన కాలంలో తమ స్వార్థపు అనాలోచిత చర్యల దుష్పలితాల ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉంటుందో ఊహించని మనిషి తాత్కాలికాల కోసం శాశ్వతాలను ఎలా విస్మరిస్తాడో అర్థమయి  బాధ మరింత తీవ్రమవుతుంది. హ్రస్వదృష్టి కల నాయకులు తమ అధికార దాహంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలన్న ఆత్రంతో  ఏ రకంగా తమ గోతులు తాము తవ్వుకోవటమే కాదు, కశ్మీరు ప్రజలను పులులు, సింహాలకు వదిలేశారో తెలుస్తుంది.

‘లదఖ్’ నుంచి శత్రువులను తప్పించుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని రించనుడు ‘జోజీలా పాస్’ ద్వారా కశ్మీరు చేరాడు. ‘దురన్ నార్’ ప్రాంతం వద్ద ‘సోనామార్గ్’ లోయ దాటగానే కశ్మీరులో వచ్చే మొదటి గ్రామం ‘గంగాగిర్’. ఇక్కడ సూహదేవుడి సైన్యాధికారి రామచంద్రుడి కోట ఉంది. కోటలో ఆశ్రయం దొరికింది రించనుడికి. ఇక్కడే అతడికి ‘షాహమీర్’ పరిచయం అయ్యాడు. వీరిద్దరూ కలిసి అల్లకల్లోలంగా ఉన్న కశ్మీరుపై కన్నేశారు. ఇది భవిష్యత్తులో!

ప్రస్తుతం కశ్మీరు లోయను దుల్చా కొల్లగొడుతున్నాడు. దుల్చా అగ్నిలాగా కశ్మీరును దహించివేశాడు. కశ్మీరీ ప్రజలు పురుగుల్లా ఆ అగ్నిలో దగ్ధమై పోయారని అంటాడు జోనరాజు. అప్పటికే రించనుడు కశ్మీరంలో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కశ్మీరాన్ని పాలించే శక్తివంతమైన అధికారి లేడని గ్రహించాడు. అప్పటికే సూహదేవుడు దుల్చాకి ధనమిచ్చి కశ్మీరాన్ని రక్షించాలని విఫల ప్రయత్నం చేశాడు. దుల్చా కశ్మీరీ ప్రజలను కీటకాల్లా తన లోభాగ్నిలో దగ్ధం చేస్తున్న సమయంలొ ప్రజలను రక్షించేందుకు బదులు వారి మానాన వారిని వదిలేసి కశ్మీరు వదిలి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. దాంతో రాజ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత రామచంద్రుడి మీద పడింది. రామచంద్రుడు తన శాయశక్తులా కృషి చేశాడు. కానీ అతని శక్తి సరిపోలేదు. ఎందుకంటే, బయటి నుంచి వచ్చిన దుల్చా క్రూరుడు, పెద్ద సైన్యంతో వచ్చాడు. కానీ కశ్మీరంలో ఆశ్రయం పొందిన రించనుడు కూడా అల్లకల్లోల పరిస్థితిని గమనించి కశ్మీరును దోచుకోవటం ఆరంభించాడు.

రుదయోర్ధుల్చా రిన్చాఖ్యాం ప్రాచ్యుద్నీర్దహుర్జనః।
వసతేః పశ్చిమామాశం ప్రాగ్ర్యమూశా మధాగమత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 155)

ఓ వైపు నుంచి దుల్చా, మరో వైపు నుంచి రించనుడు. వీరిద్దరి నడుమ కశ్మీరీ ప్రజలు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోయారు. తూర్పు వైపు ప్రజలు పారిపోయే వీలు లేదు. ఎందుకంటే, అక్కడ దుల్చా సిద్ధంగా ఉన్నాడు. ఉత్తరం వైపు పర్వతాలలోకి పారిపోయే వీలు లేదు. అక్కడ రించనుడు ఎదురుచూస్తున్నాడు,  పురుగుల  కోసం ఎదురు చూసే సాలెపురుగులా! దాంతో ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు పశ్చిమం వైపు పరుగులిడారు. కానీ పశ్చిమాన దుర్భేద్యమైన కొండలు, దుర్గమారణ్యాలుండడంతో మిగిలిన ఒకే దిక్కు దక్షిణం (యముడి దిక్కు) వైపు పరుగులిడారు ప్రజలు అంటారు జోనరాజు. ‘దక్షిణం’ వైపు పరుగులిడారు అనటంలో రెండు అర్థాలు వస్తాయి. ఒక అర్థం ‘యముడి దిక్కు’. మరో అర్థం తీసుకుంటే, కశ్మీరుకు పశ్చిమాన ఉన్న భూభాగాలకు పారిపోయారు అని. కశ్మీరుకు పశ్చిమాన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‍లు ఉన్నాయి. అంటే, ప్రజలు కశ్మీరు వదిలి ఇతర రాజ్యాలకు పారిపోయారన్న మాట. ఈ వర్ణనతో ఆగలేదు జోనరాజు.

దుల్చా కశ్మీరు లోయలో ‘సుడిగుండం’లా ఉన్నాడు. రించనుడు పర్వతాలపై ‘గాలివాన’లా ఉన్నాడు. నగరాల్లోని ప్రజలంతా వీరిద్దరి నడుమ చిక్కి భయభ్రాంతులయ్యారు. ఆకాశం నుండి గ్రద్ద చెట్టుపై వాలి ఆ గూడు లోని పిట్ట పిల్లలను ఎత్తుకుపోయినట్టు, రించనుడు కొండ దిగి వచ్చి కశ్మీరీ ప్రజలను పట్టుకుపోయేవాడు. అలా బంధించి తీసుకుపోయిన కశ్మీరీ యువకులు, యువతులు, స్త్రీలు, పిల్లలను భౌట్టులకు ఇతరులకు అమ్మేయటం వలన బోలెడంత ధనం సంపాదించి ఐశ్వర్యవంతుడు, శక్తివంతుడు అయ్యాడు రించనుడు. తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది.

అడవికి వెళ్ళిన ‘కుంటాకింటే’ను ఎత్తుకుపోయి, అమెరికాలో బానిసలా అమ్మిన గాథను చదివి బాధపడతాం. ‘ఎంత అమానుషం’ అని తల్లడిల్లుతాం. కానీ మన దేశంలో, మన దేశానికి ‘శిరస్సు’ లాంటి కశ్మీరంలో ఇలా జరిగిందన్న స్పృహ మనకు లేదు. కశ్మీరంలోనే కాదు, విదేశీ దురాక్రమణదారులు అడుగు పెట్టిన ప్రతి ప్రాంతంలో నుంచి వేలు, లక్షల సంఖ్యలో భారతీయులను ఎత్తుకుపోయి బానిసలుగా అమ్మేశారు. ఇలా అమ్మి అనేకులు ధనవంతులయ్యారు. తరువాత భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవాన్ని పొందే వ్యక్తులయ్యారు. మహా పురుషులయ్యారు. రించనుడు సైతం భవిష్యత్తులో కశ్మీరు రాజయ్యాడు. ఇది ఏ దేశానికైనా అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఆ దేశ సంస్కృతి, సాంప్రదాయాలతో ఏ మాత్రం సంబంధం లేక, కనీసం గౌరవం, సానుభూతులు లేక, ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ, అభిమానాలు లేక వారిని పశువుల్లా అమ్మి సొమ్ము చేసుకునేవాడు ఆ దేశానికి రాజవటాన్ని మించిన దౌర్భాగ్యం ఏముంది? భారతదేశంలోని అన్ని ప్రాంతాలు ఇలాంటి దౌర్భాగ్యాన్ని కొన్ని వేల ఏళ్ళు అనుభవించాయి.

ఒక్క క్షణం ఆగి ఆ కాలంలో ప్రజల మానసిక పరిస్థితిని ఊహించాలంటేనే భయం వేస్తుంది. దుఃఖం ముంచుకు వస్తుంది. ప్రపంచ నాగరికతలన్నిటిలోకి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం అధికంగా కలవారు భారతీయులు.  ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తి అయినా తన గురించి తెలుసుకోవాలంటే భారతదేశం రాక తప్పదని గర్వంగా, విశ్వాసంగా ప్రకటించినది భారతదేశం. ఇది దేవభూమి. ఋషులు నడయాడే పవిత్రభూమి. ఆధ్యాత్మిక భూమి. మోక్షం లభించే అతి పవిత్ర భూమి అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించినవారు భారతీయులు. ఇతరులు భౌతికతకు పరిమితమయితే, తాము భౌతిక పరిధి దాటి ఆధ్యాత్మిక లోతులు, అంతరిక్షపు లోలోతులపై దృష్టి పెట్టి పరిశోధించేవారమని విశ్వానికి చాటిచెప్పినవారు భారతీయులు. అలాంటి అభిమానం, ఆత్మగౌరవం కలవారు, కళ్ళు మూసి తెరిచేలోగా సర్వ స్వతంత్రాన్ని కోల్పోయి, ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి స్వీయ వ్యక్తిత్వమన్నది లేని బానిసలుగా మారటం ఎంతగా మానసికంగా వారిని కృంగదీసి ఉంటుందో, ఊహించాలంటేనే సుళ్ళు తిరిగే బాధ ఆలోచింపనీయదు. ఈనాడు బానిస చదువులు చదివి, నెల జీతం కోసం స్వీయ వ్యక్తిత్వాన్ని అణచి పెట్టుకుని బానిస బ్రతుకులు వెళ్ళదీస్తున్న మనకు ఆ కాలం నాటి వారి మానసిక వ్యవస్థను ఊహించటం కూడా కుదరదు. అత్యంత స్వతంత్రులు వారు. ఆఫ్రికా వారిపై జరిగిన అత్యాచారాలను కళ్ళకు కట్టినట్టు మనసును కదిలించేట్టు చిత్రించిన రచనలెన్నో. రచయితలు ఎంతోమంది. వారంతా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ స్థాయి రచయితలుగా మన్ననలందుకుంటున్నారు.

1746లో ‘లూసీ టెర్రీ’ అనే ఆవిడ బానిసగా అనుభవాలను, తమ ప్రాంతంపై జరిగిన దాడిని వర్ణించిన గాథని తొలి బానిసల గాథను ప్రకటించిన రచనగా పరిగణిస్తారు. ఏడేళ్ళ వయసులో బానిస అయిన ఫిలిస్ వీట్లే కవితలు అమెరికాలో తొలి ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్య రచనగా పరిగణిస్తారు. అంటే, 1746 నుంచీ ఏదో ఓ రకంగా అమెరికాలో బానిసలుగా బ్రతుకుతున్న నల్లవారు తమ కథలను వినిపిస్తూ వస్తున్నారన్న మాట. తమ బాధలను ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారు. తమ అణచివేతను ప్రకటిస్తున్నారు. దాదాపుగా క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచీ బానిసలుగా లక్షల సంఖ్యలో మారుతున్న భారతీయుల గాథలు ఏ చరిత్రలో కనిపించవు. రాజులు, అంతఃపురాలలో అత్యంత గౌరవంగా బ్రతికిన రాణులు, ఎలాంటి దుర్భర పరిస్థితులను అనుభవించారో, వారి మానసిక వ్యవస్థ ఎంతగా అల్లకల్లోలమయిందో ఏ రచన ప్రకటించదు. శీలానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే భారతనారిని నడివీధుల్లో నగ్నంగా ప్రదర్శించి, కొన్నవాడి ‘ఆస్తి’గా పరిగణించటంతో, వారి ఆత్మ ఎంతగా క్షోభించిందో ఏ రచన ప్రదర్శించదు. అంతెందుకు, అత్యంత ఆత్మగౌరవం, విశ్వాసం కల ఓ రాజపుత్ర స్త్రీ రాజకీయాలలో బలిపశువులా ఓ మొఘల్ చక్రవర్తిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తే, ఆమె ఎంతగా క్షోభపడి ఉంటుందో కూడా, ఏ రచన ప్రకటించదు. ఎందుకని, ఆ కాలంలో భారతీయ స్త్రీలు తురకల పాలపడే కన్నా నిప్పులను కౌగిలించుకునేందుకు ముందుకు దూకారో, ఏ మానసిక సామాజిక విశ్లేషణ శాస్త్రం వివరించదు. కానీ ఏమీ తెలియని, ఊహకు కూడా అందని ఈ విషయాల గురించి ఆధునిక మేధావులు చులకనగా వ్యాఖ్యానిస్తారు. కొట్టి పడేస్తారు. అలా, కశ్మీరీయులను అమ్మి ధనవంతుడయ్యాడు రించనుడు.

రించనుడు కశ్మీరీయులను అమ్మేస్తూ ధనవంతుడవుతున్న సమయంలో కశ్మీరు లోయలో దుల్చా మారణకాండ కొనసాగించాడు. దేవాలయాలను ధ్వంసం చేశాడు.  విగ్రహాలను ముక్కలు ముక్కలు చేశాడు. అందినది అందినట్టు దోచుకున్నాడు. అయితే కశ్మీరులో చలికాలం తెల్లపులి లాంటిది. దాని బారిన పడటం నుంచి తప్పించుకునేందుకు ఎనిమిది నెలలుగా కశ్మీరులో దోచుకున్న వాటినన్నింటినీ మూటలు కట్టుకుని, బానిసలను వెంట తీసుకుని కశ్మీరం వదిలి ఇంటికి ప్రయాణమయ్యాడు దుల్చా. అయితే, దారిలోనే మంచు తుపానులో చిక్కుకుని దుల్చా, అతని సైనికులు, వెంట ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. దుల్చాతో పాటు అతడు ఎత్తుకెళ్తున్న 50,000 మంది కశ్మీరీయులు కూడా మరణించారు. అదృష్టవంతులు, బానిస బ్రతుకులు తప్పించుకున్నారు. బహ్రిస్తాన్-ఇ-షాహి, తారిఖ్-ఇ-హైదర్ మాలిక్‍ల ప్రకారం దార్వాభిసార వద్ద మంచులో చిక్కుకుని దుల్చా, అతని వెంట ఉన్నవారంతా మరణించారు. కౌంచార్ నాగ్ శిఖరం నుండి బణహల్ పర్వతం నడుమ  పీర్ పంజాల్ పర్వత శ్రేణులలో ఉన్న ప్రాంతం ఇది అని చరిత్ర రచయితల అభిప్రాయం.

దుల్చా వెళ్లిపోయాడు. ఇప్పుడు అసలు కథ ఆరంభమయింది. రాక్షసుడు వచ్చి ఇళ్ళూ, ఊళ్ళూ దోచుకున్న తరువాత, ఇక్కడ మిగిలిన వాళ్ళను దోచుకునేందుకు రాబందుల్లా సింహాసనంపై కళ్ళున్న వాళ్ళు తయారయ్యారు. సూహదేవుడు, రామచంద్రుడు, షాహమీర్, రించన్‌లు నలుగురు కశ్మీరుపై ఆధిపత్యం కోసం పోరు ఆరంభించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here