[dropcap]ఆ[/dropcap] రోజు..
ఇచ్చిన మాట తప్పకుండా నువ్వొస్తావని
నా కలల సెలయేటిలో ఈదులాడుతూ..
రేయంతా ఎదురు చూశా!
నులివెచ్చని కౌగిలిని కానుకగా ఇచ్చి
విరహాన్ని తరిమేస్తావని
గుండె నిండా ఆశలు నింపుకొని..
కనురెప్పలు మూయకుండా
చందమామతో కబుర్లు చెబుతూ
రేయి కురిసిన వెన్నల జలపాతంలో
నిలువెల్లా తడిశాను ప్రేయసీ!
నా చుట్టూ వున్న ప్రపంచం
నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటోంది!
కలలోనైనా కనిపించని
వసంతం రాక కోసం
పిచ్చివాడిలా ఎదురుచూస్తున్నానని..
ఈ లోకం నన్ను గేలి చేస్తోంది!
కానీ..
నువ్వొస్తావని..
నన్ను గెలిపిస్తావని..
ఆకాశమంత నమ్మకంతో
నా మనసంతా నీ రాక కోసం
వేచి చూస్తునే వున్నా…
నీ వలపు సాక్షిగా!
నీవు లేని శూన్యంలో
పట్టరాని విరహం తాపానికి..
ఎండి బీటలు వారిన
నా హృదయ నందనంలో..
వాన చినుకువై పలకరించి
సొగసు వాగులా ప్రవహించి
నన్ను నీ ఎదలో దాచుకో!