నా జీవితంలో లలితా సహస్ర నామ స్తోత్రం-3

0
3

[dropcap]శ్రీ [/dropcap]మాత్రే నమః.

దసరాల్లో ఓ రోజు మా మిల్లు యజమాని గారితో గాయత్రి పీఠం సందర్శించి అక్కడ కుంకుమ పూజ చేయించుకున్నా. గురువుగారి ఆశీస్సులు తీసుకున్నా.

“న మాతుః పరమం దైవతం – అమ్మని మించిన వేరే దైవం ఎవరూ లేరు. అమ్మని నమ్మి శ్రద్ధగా కొలవండి. మీ కోరికలు తప్పకుండా తీరతాయి” అని గురువుగారు తమ సందేశంలో చెప్పారు. అదే ఆశతో మంచి చోట ఉద్యోగం రావాలి, ఆర్థిక ఒడిదుడుకులు నుండి బయటపడాలి అని ఉభయ సంధ్యల పూజలో గాయత్రీ జపం, లలిత పారాయణం విధిగా చేస్తూ ఇక్కడ పరిస్థితి గురించి శ్రీ రెడ్డి ఉత్తరం ద్వారా తెలియచేసాను. వారు “మళ్ళీ దుబాయ్ వస్తాను, అంటే ప్రయత్నం చేస్తాను” అని అన్నారు. “వస్తే తప్పకుండా వస్తాను. మొదటిసారి అక్కడ ఉద్యోగం వల్ల సంపాదించింది ఏమి లేదు, ఈ సారి అయిన జాగ్రత్త పడతాను” అని వారికి ఉత్తరంలో వ్రాసాను.

ఇక్కడ మిల్లు పరిస్థితి ఏమి బాగా లేదు. మిల్లు యజమానికి పూర్వ అనుభవం లేదు. కొందరిని నమ్మి ‘లాభాలు వస్తాయి, ఓ పారిశ్రామికవేత్తగా పేరు వస్తుంది’ అని ఆశ పడ్డారు. కానీ మిల్లు నష్టాల బాట పడుతోంది. ఇక అమ్మ మీద భారం వేసి ఉద్యోగం చేస్తున్నా.

1992 జనవరి నెలలో రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ దుబాయ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మిల్లులో రాజీనామా చేశాను. గాయత్రి పీఠానికి వెళ్లి గురువుగారికి ఈ వార్త చెప్పి వారి ఆశీస్సులు, గాయత్రి మాత ఆశీస్సులు తీసుకుని 1992 మార్చ్ 21న దుబాయ్‌లో అడుగు పెట్టాను, మళ్ళీ నా పూజ సామాన్లతో నా పాత ఇంటికి. కానీ నా రూమ్ మారింది.

ఇప్పుడు నాకు ఒక్కడికే రూం కేటాయించారు. అందువల్ల నాకు ప్రత్యేకంగా పూజలు చేసుకునే అవకాశం దొరికింది. నా పూర్వ మిత్రులు దుబాయ్‌కి నా  పునః ఆగమనానికి ఎంతో సంతోషించారు. ముఖ్యంగా ఇద్దరు పద్మ గార్ల కుటుంబాలు.

రోజు ఉదయం పూజలో లలిత తప్పకుండా చదవడం మొదలుపెట్టాను. రెడ్డిగారికి వారి పత్నితో ఉండే అవకాశం వచ్చింది.

రోజులు గడుస్తున్నాయి. జాగ్రత్తగా డబ్బులు ఇంటికి పంపుతూ, కొంత షేర్‌లలో పెట్టుబడి పెడుతూ ఉన్నాను. మా ఆవిడ, పిల్లలు మా అత్తగారు, పెళ్లి కాని బావమరిదితో ఉంటున్నారు.

1993వ సంవత్సరంలో రెడ్డి గారు నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన సౌదీ అరేబియాకి వేరే మిల్లులో అధిక జీతం కోసం వెళ్లిపోయారు. నన్ను రమ్మన్నారు కాని అక్కడ దేముడి ఫోటోలు, బొట్టు పెట్టుకోవడం నిషేధం. దేముడి ఉంగరాలు కూడ ధరించరాదు అనే నియమాలు ఉన్నాయి. నేను “నా దేముడు రాలేని చోటకి నేను రాలేను. ఇక్కడే ఉంటాను” అని చెప్పాను.

పద్మ గారి పిల్లలకు శ్రీ సూక్తం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, ఇంక స్తోత్రాలు నేర్పుతున్నా. వారు చాలా శ్రద్ధగా నేర్చుకునేవారు. పద్మ గారు, ప్రసాద్ గారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. నాకు లలిత చెప్పిన పద్మ గారింటికి నెలకి ఓ సారి వెళ్లి మాట్లాడి వచ్చేవాడిని. ఆవిడ మహిళల చేత సామూహిక లలితా సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయించేవారు.

1994లో మా ఆవిడ “పిల్లలు మాట వినడం లేదు, వారిని చూసుకోవడం కష్టం అవుతుంది. ఇండియాలో ఉద్యోగం ప్రయత్నం చేసి వచ్చేయండి” అని తరచూ ఉత్తరాల్లో వ్రాసేది. సెలవులకి ఇండియా వెళ్ళినప్పుడు నేను పని చేసిన రాజమండ్రి పేపర్ మిల్‌కి వెళ్లి అక్కడ అధిపతిని కలిసి “ఉద్యోగం కావాలి” అని అడిగాను. వారు “మిల్లు వదిలి వెళ్లిన వారికీ మళ్ళీ మిల్లులో ఉద్యోగం లోకి తీసుకోరాదు అనే నియమం వల్ల మిమ్మల్ని తీసుకోలేము” అని చెప్పారు. నిరాశ చెంది మరల దుబాయ్‌కి సెలవల అనంతరం చేరుకొని ఉద్యోగం చేస్తున్నాను. ఇండియాలో జ్యోతిష్కులకు నా జాతకం పరిశీలన చేయమని మా నాన్నగారు ఇచ్చారు. వారు “అబ్బాయి జాతకంలో ప్రస్తుతం రాహు దశ నడుస్తుంది, కావున మీ అబ్బాయి అమ్మ ఉపాసన చెయ్యాలి. ఆవిడ దయ వల్ల మార్పు వచ్చి శుభం జరుగుతుంది” అని చెప్పారు. ఆయనే లలితా సహస్ర నామ స్తోత్రం మండలం రోజులు రోజుకి 11 సార్లు చదవాలి, తరువాత కనీసం 12మంది ముత్తయిదువులకి జాకెట్ ముక్కలూ, తాంబూలం ఇవ్వాలి” అని ఓ సంకల్పం లలిత చదివే ముందు చదవాలి, అని వ్రాసి ఇవ్వగా దాన్ని మా నాన్నగారు పోస్ట్‌లో పంపారు. నేను పద్మ గారికి ఈ విషయం, అయన సంకల్పం చూపించగా “తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయి. చదవడం ఆరంభించండి” అని అన్నారు.

ఆవిడనే మంచి ముహూర్తం చూసి చెప్పమన్నాను.

ఆవిడ చెప్పిన ముహూర్తంలో నేను నా పూజ మందిరంలో లలితా సహస్ర నామ స్తోత్రం రోజుకి 11 సార్లు పారాయణం మొదలు పెట్టాను. ఉదయం 5 సార్లు, సాయంత్రం 6 సార్లు చదవడం ఆరంభించాను. రాత్రిళ్ళు నైవేద్యంగా ఎర్ర నూక, ఆవు పాలు, అవు నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, పంచదార లతో రవ్వ కేసరి ప్రసాదం చేసి నివేదన చేసి అదే కొంత తినే వాడిని.

అమ్మకి పూజ లోకి పూలు లేవు. అక్కడ పుష్ప జాతి చెట్లు అరుదు. అమ్మ అలంకార ప్రియ అయినా, శ్రద్దతో చేసే నమస్కారాలే పుష్పాలుగా సమర్పించాను.

ఈ 40 రోజులు మిల్లుకి డ్యూటీకి, కొన్ని నిత్యావసరాలు కొనడానికి దగ్గర నున్న సూపర్ మార్కెట్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు.

ఏ అవాంతరం రాకుండా ఈ కార్యక్రమం జరిగి నా మనోరథం ఇడేరాలని ఆ అమ్మని నిత్యం కోరుకుంటూనే ఉన్నాను. అమ్మ దయ వల్ల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయ్యింది.

పద్మ గారు ఓ శుక్రవారం వారం సాయంత్రం తాంబూలం తీసుకునే మహిళలు మరియు అందరికీ మడితో వంట చేసి ఆ కార్యక్రమం కూడ సఫలం కావడానికి సహాయం చేసారు. నేను అరటిపళ్ళు, రవికలగుడ్డ తాంబూలంలో ఉంచి 12 మందికి ఇవ్వడం జరిగింది.

దసరాలు, దీపావళి అయ్యాక ఈసారి ఇండియా ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నా. ఈలోగా దుబాయ్‌లో ఉంటున్నాం, పూజ మందిరంలో లక్ష్మి దేవి చిన్న నాణెం ఉంచి దీపావళి నాడు పూజ చేస్తే బాగుంటుంది అనే కోరికతో గోల్డ్ మార్కెట్‌కి వెళ్లి కూర్చున్న లక్ష్మి రెండు పక్కల ఏనుగులు ఉన్న నాణాలు రెండు తీసుకున్నా. ఒకటి నాకు పూజ లోకి, ఇంకోటి నాకు జన్మ నిచ్చి నా ఆలనా పాలనా చూసిన నా మాతృమూర్తికి.

చక్కగా దీపావళి సాయంత్రం లక్ష్మి పూజ చేసి రవ్వకేసరి ప్రసాదం జగదాంబకి నైవేద్యంగా ఉంచి 3 సార్లు లలిత, 3 సార్లు మహాలక్ష్మి అష్టకం చదివాను.

కార్తీక మాసంలో భారతదేశానికి – కోరిక తీరాలి అనే కొండంత ఆశతో – దుబాయ్ నుండి బయలుదేరాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here