సాఫల్యం-45

2
4

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[వసుధ కాన్పుకి పుట్టింటికి వెళ్ళిపోయాకా, ఇల్లంతా శూన్యంగా తోస్తుంది పతంజలికి. వసుధ భర్తకి ఉత్తరాలు రాస్తుంది. చిత్తూరులో వసుంధరక్కయ్య ఆమెను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళిందట, అంతా నార్మల్ అని చెప్పిందని రాస్తుంది. ట్యూషన్లు పూర్తయ్యాయి. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకి పతంజలికి ఇన్విజిలేషన్ డ్యూటీ పడుతుంది. ఆ పై వాల్యూయేషన్ డ్యుటీ ఖమ్మంలో పడుతుంది. అక్కడి వెళ్తాడు. ఉదయకుమార్ అనే లెక్చరర్‍తో పరిచయం కలుగుతుంది. సీనియర్ల సూచనలతో పేపర్ల వాల్యూయేష విజయవంతంగా పూర్తి చేస్తాడు. అక్కడ్నించి సూర్యాపేట, హైదరాబాదు మీదుగా కర్నూలు చేరి మునిని, దేవసహాయం సారుని, మేడమ్‌ని కలుస్తాడు పతంజలి. తర్వాత వెల్దుర్తి వెళతాడు. కుటుంబ సభ్యుల ఆత్మీయతానురాగాను అనుభవిస్తాడు. గణపతిని చూసి వస్తాడు. సుంకన్నను, తోకోడిని కలిసి, వారి పిల్లలకు కానుకగా చెరో 50 రూపాయాలు ఇస్తాడు. చిత్తూరులో వసుధ మగపిల్లాడ్ని ప్రసవించినట్టు టెలిగ్రామ్ వస్తుంది. చిత్తూరు వెళ్ళి భార్యని పలకరించి, బిడ్డను చూస్తాడు పతంజలి. తోడల్లుడు, వదినగారు ఆప్యాయంగా మాట్లాడుతారు. డాక్టరు గారు జాగ్రత్తలు చెప్పి వసుధని డిశ్చార్జ్ చేస్తారు. నాలుగు రోజులలో వసుధ లేచి తిరగసాగింది. – ఇక చదవండి.]

[dropcap]పి[/dropcap]ల్లవాని జనన సమయం ఖచ్చితంగా తెలియజేస్తూ తండ్రికి ఉత్తరం వ్రాశాడు పతంజలి. నామకరణానికి మంచి ముహూర్తం నిర్ణయించి తెలియజేయమనీ, దానికి రెండు మూడు రోజులు ముందే అందరూ రమ్మని కోరాడు. బస్సులో ప్రయాణం కష్టం కాబట్టి వెంకటాద్రిలో రిజర్వేషన్‌ చేసుకొని తాను వచ్చినట్లు వస్తే సరిపోతుందని తెలిపాడు.

వారం రోజుల్లో నాన్న బదులిచ్చాడు. 21వ రోజు బాగుందనీ, జాతక రీత్యా ఏ దోషాలు లేవనీ రాశాడాయన. రిజర్వేషన్‌ మల్లినాధ డోన్‌లో చేయించాడనీ, అప్పటికి చిరంజీవి పాణిని కూడ వచ్చేస్తాడనీ, అందరూ కలిసి నామకరణానికి ముందురోజు చేరుకుంటామన్నాడు.

నామకరణం బాగా జరిగింది. విజయవాడ నుంచి అక్కబావ పిల్లలు వచ్చారు. కర్నూలు నుండి ముని వచ్చాడు. ప్రొద్దుటూరు నుండి మేనత్త భర్త వైపు బంధువులు ఇద్దరు. చిత్తూరులో వీళ్లు అంతే.

పిల్లవాడికి ప్రద్యుమ్నశర్మ అని పేరు పెట్టాడు తాత. మహా విష్ణువు కేశవాది నామాల్లో అదీ ఒకటి. చిన్నోడు పతంజలిని అంటిపెట్టుకొని తిరుగుతున్నాడు. వాడిలోని చిన్నపిల్లవాడి మనస్తత్వం తగ్గి డీసెంట్‌గా ప్రవర్తిస్తున్నాడు. అన్నయ్యతో చక్కని యాక్సెంట్‌తో ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. ప్రద్యుమ్నను ‘క్యూట్‌ లిటిల్‌ ఫెలో’ అని పిలుస్తున్నాడు.

రామ్మూర్తి బావ వాళ్లు పిల్లవాడికి వెండి మొలతాడు, బంగారు ఉంగరం తెచ్చారు. మునికేం తేవాలో తోచలేదట. బుజ్జిగాని చేతిలో వంద రూపాయలు పెట్టాడు. వాడు ఆ నోటును గుప్పిట్లో గట్టిగా పట్టుకొని లాగినా వదలడం లేదు. వసుంధర వదినె ఒక తులం బంగారు గొలుసు చేయించింది. తాత, నాన్నమ్మ వెండివి ఉగ్గు గిన్నె, అన్నం గిన్నె చిన్న వెండి ప్లేటు తెచ్చారు. మల్లినాధ చిన్నాన్న వదినెకు మూడు వందలిచ్చాడు. చిన్నాడు విచారంగా పిల్లవాడి వద్ద కూర్చుని “ఒరేయ్‌ కన్నా, నాకే సంపాదనా లేదురా, నీకేమీ ఇవ్వలేనురా” అంటూంటే అందరూ నవ్వారు.

రెండు రోజుల తర్వాత అందరూ వెళ్లిపోయారు. పతంజలి మరో నాలుగు రోజులుండి వెల్దుర్తి చేరుకున్నాడు. మూడో నెలలో వసుధను బాబును వెల్దుర్తికి తెచ్చి దిగబెడతామంది వదినె.

పతంజలికి వెల్దుర్తిలో ఏమీ తోచడం లేదు. చిత్తూరులో వదినా వాళ్లింట్లో అన్నిరోజులుండటం ఏం బాగుంటుంది. నాలుగు రోజులకొకసారి కర్నూలు వెళ్లి అందర్నీ కలుస్తున్నాడు.

మూడో నెలలో మంచిరోజు చూసి వసుధను బాబును తీసుకుని వచ్చారు వదినె అన్నయ్య. ప్రద్యుమ్న కొంచెం ఒళ్లుచేసి బాగున్నాడు మనుషులను గుర్తు పట్టి నవ్వుతాడు. మహిత దగ్గర ఎంతసేపైనా ఉంటాడు.

రీ ఓపనింగ్‌ డే దగ్గరపడుతూంది. జూన్‌ 16న కాలేజీలు తెరుస్తారు. ఏప్రిల్‌, మే జీతం కాలేజీలోనే ఉండిపోయింది. ఒకరోజు రాత్రి భోజనాల తర్వాత వర్ధనమ్మతో అన్నాడు.

“అమ్మా, మేం పలాసకు బయలు దేరతామే”

వర్ధనమ్మ కోపగించుకుంది కొడుకును.

“ఇంగిత జ్ఞానం లేదేమిరా నీకు? నెలలగుడ్డును తీసుకుపోయి ఆ పిల్ల నీవు ఏం అవస్థలు పడతారు? ఐదవ నెలలో వస్తారు. వెంట నేనూ వచ్చి నెల రోజులుండి వస్తాను. అప్పటికి మనమడు కొంచెం చేతికి దొరుకుతాడు” అంది.

నిస్సహాయంగా చూశాడు పతంజలి భార్యవైపు.

“అత్త చెప్పింది సమంజసంగానే ఉంది బావా! అలాగే చేద్దాం” అన్నది వసుధ.

“దానికున్న బుద్ధి నీకు లేదేమిరా?” అన్నాడు నాన్న.

జూన్‌ 13న డోన్‌లో బయలుదేరి, విజయవాడలో, అక్కయ్య వాళ్లింట్లో మరునాడుండి రాత్రి కోణార్క్‌లో పలాస చేరుకున్నాడు. దిగేసరికి ఉదయం ఐదుగంటలయింది. ఇల్లంతా దుమ్ముపట్టి ఉంది. సి.ఐ. గారి భార్య తమ పనిమనిషిని పంపి వీళ్ల పని మనిషి దాలమ్మను పిలిపించింది. దాలమ్మ ఇల్లంతా శుభ్రం చేసింది. ఆరోజు సి.ఐ. గారింట్లో భోజనం.

మర్నాటి నుండి కాలేజీకి వెళ్లసాగాడు. ఫస్టియర్‌ అడ్మిషన్లు సెలవుల నుండే జరుగుతున్నాయి. కమిటీలు వేశారు ప్రిన్సిపాల్‌గారు. వచ్చిన దరఖాస్తులన్నీ గ్రూప్‌వైజ్‌ విడదీసి యిచ్చారు ఆఫీసువారు.

యస్‌.యస్‌.సి.లో పిల్లలు పొందిన మార్కులు ఆధారంగా మెరిట్‌ లిస్టు తయారు చేశారు. రిజర్వేషన్‌ ప్రకారం కొన్ని కేటాయించారు. ముందుగా ఒక్కో సెక్షన్‌కు 88 మందిని జాయిన్‌ చేసుకొనేటందుకు బోర్డు అనుమతినిచ్చింది. అవి వారం రోజుల్లో అన్ని సెక్షన్లూ నిండిపోయాయి. జూన్‌ చివరివారంలో మళ్లీ నూటపదిమందికి పెంచింది.

అప్పుడు ప్రయివేటు కాలేజీలు ఇంచుమించు లేవు. ఎంతవారయినా గవర్నమెంటు కాలేజిలోనే చేరేవారు. ఆరు వందలకు కనీసం నాలుగు వందల ఎనభై మార్కులు దాటితే గాని ఎంపిసి, బైపిసి గ్రూపులో సీటు రాదు. తక్కువ మార్కులు వచ్చిన వారంతా సి.యిసి, హెచ్‌యిసిని ఆశ్రయించేవారు. అడ్మిషన్ల ప్రక్రియ ఎంత పకడ్బందీగా పారదర్శకంగా ఉండేదంటే లెక్చరర్ల పిల్లలు ఎవరైనా మెరిట్‌ లిస్టులో లేకుంటే సీటు రాదు. జువాలజీ మాస్టారు జోగారావు గారి అబ్బాయికి అలాగే జరిగింది. పలాసలో సీటు రాక 20 కి.మీ దూరంలో ఉన్న ‘మందస’ కాలేజిలో చేర్చాల్సి వచ్చింది.

సెకండియర్‌ పిల్లలకు ట్యూషన్లు ప్రారంభించాడు పతంజలి. జూలై మొదటి వారంలో ఫస్టియర్‌ క్లాసులు మొదలయినాయి. డిగ్రీ వాళ్లు కూడ స్పెషల్‌ ఇంగ్లీష్‌, రెగ్యులర్‌ ఇంగ్లీష్‌ సాయంత్రం రెండు బ్యాచులయ్యాయి.

వెల్దుర్తి నుండి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలకు డి.డి. తీసి తండ్రికి పంపాడు. జూలై రెండవ వారంలో ఫస్టియర్‌ ట్యూషన్లు కూడ రెండు బ్యాచ్‌లయ్యాయి. వసుధ వాళ్లొస్తే ఇల్లు చాలదని కొంచెం పెద్ద యిల్లు మూడు రూములున్నదయితే బాగుంటుందనిపించింది. మల్లితో చెప్పి ఇల్లు చూడమన్నాడు.

ఊరంతా శిష్యులే కాబట్టి అదే కాలనీలో ఇల్లు దొరికింది. అదేమిటో ఆ జిల్లాలో అన్నీ రైలు పెట్టెల్లాంటి ఇళ్లే ఉంటాయి. ఇంటికీ ఇంటికీ మధ్య స్థలం కాపౌండు వాల్‌ సైడ్‌ బెడ్‌రూమ్స్‌ ఉండవు. పైగా దొంగల భయం ఎక్కువ. ఇప్పుడు చూసిన యిల్లు నచ్చింది పతంజలికి. ముందు గ్రిల్స్‌ ఉన్నవరండా ఉంది. అందులో ట్యూషన్లు పెట్టుకోవచ్చు మధ్యగది బెడ్‌ రూమ్‌. వెనుకది వంటిల్లు. అన్ని రూముల్లో చక్కగా షెల్ఫ్‌ లున్నాయి. విశేషమేమంటే వంటింట్లో చిన్న పూజ గది ఉంది. దానికి చిరుగంటలమర్చిన ప్లైవుడ్‌ తలుపుంది. పెరట్లో నుయ్యి, బాత్‌రూం, లావేటరీ ఉన్నాయి. అద్దె మాత్రం మూడువందలు.

ఇల్లు మారుతున్నట్లు సి.ఐ గారికెలా చెప్పాలా అని మథన పడసాగాడు పతంజలి. ఎవరో ఈ విషయం ఆయన చెవిన వేసినట్లున్నారు. ఒకరోజు దంపతులిద్దరూ పిలిచి చెప్పారు. “మాస్టారూ! ఇల్లు మారుతున్నారట. చంటి పిల్లవాడు వస్తాడు, మీకు వరండా అంతా ట్యూషన్లు, మా యింట్లో బెడ్‌రూం, ట్యూషన్లు రెండూ పెట్టుకొని ఇబ్బంది పడాలి. మీరు నిశ్చింతంగా వెళ్లండి మేమేం అనుకోం. మీరెలాంటివారో. ఆ అమ్మాయి ఎలాంటిదో మాకు తెలియదా? ఇదే కాలనీలో కాబట్టి మేం వచ్చి మా మనవడిని చూసి వస్తూంటాము”

వారి సంస్కారానికి పతంజలి ముగ్ధుడయ్యాడు. వారికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. తండ్రి నుండి జాబు వచ్చింది.

“ఆగస్టు 11న బయలుదేరీ నేనూ మీ అమ్మ కోడల్ని తీసుకొని పలాసకు వస్తున్నాము. పన్నెండవతేదీ చి॥సౌ॥ వాగ్దేవి ఇంట్లో విశ్రాంతి తీసుకుని, 13న రాత్రి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తాము. పధ్నాలుగవ తేదీ తెల్లవారు జామున పలాస చేరుకోగలము. నీవు జాబులో వ్రాసిన సూచనల మేరకు మా ప్రయాణం జరుగుతున్నది. చి॥ రామ్మూర్తి తగిన ఏర్పాట్లు చేసినాడు. ఇట్లు మా॥శ॥వ్రాలు.”

అంటే మరో పదిరోజులే ఉంది. ఆదివారం శిష్యుల సాయంతో ఇల్లు మారినాడు పతంజలి. చిన్న పిల్లవాడితో క్రిందపడుకోవడం కష్టమని ఒక మంచం కొనుక్కోవాలనుకున్నాడు. మల్లితో ప్రస్తావిస్తే, “రెడిమేడ్‌వి వద్దు. అవి ఎటువంటి కర్రతో చేస్తారో తెలియదు. మందసలో ఒక కార్పెంటర్‌ ఉన్నాడు. ‘బెహరా’ అని ఒరియావాడు. ఈ మధ్యే మన కామర్సు మాస్టారు జి.యస్‌.యన్‌. చేయించుకున్నారు. కనుక్కుందాం” అన్నాడు. ఆయన, జువాలజీ మాస్టారు నైబర్సే.

వెళ్లి చూశారు. డబుల్‌ కాట్‌, డైనింగ్‌ టేబుల్‌, టీపాయ్‌ చేయించుకున్నాడాయన. తెలిసినవారి స్కూటరు తీసుకొని మల్లి, పతంజలి మందసకు వెళ్లారు. హైవేలో హరిపురం జనసన (జంక్షన్‌) నుండి పది కి.మీ లోపలికి ఉంది ఆవూరు. హరిపురంలో రైల్వేస్టేషనుంది. కాని స్టేషను పేరు మందస. మందస బాటనీ మాస్టారు కాశీబుగ్గలోనే ఉంటారు. ఆయనపేరు శాంతిస్వరూప్‌.

మందసలోని ఆర్టిజాన్స్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ బెహరా యిల్లు కనుక్కొని వెళ్లారు. ఇల్లు, షెడ్‌ ఒకటే. బాటనీ మాస్టారు పంపారని, పలాస కామర్సు మాష్టారికి ఫర్నిచర్‌ చేసిచ్చావు కదా అని ప్రస్తావించారు.

“ఈయన ఇంగ్లీషు మాస్టారు. వీరికి ఫర్నిచర్‌ చేసివ్వాలి. నీవు నాణ్యంగా చేసిస్తావని వచ్చినాం” అన్నాడు మల్లి.

బెహరాకు తెలుగు అంతగా రాదు. ప్రతి దానికీ నోరంతా తెరిచి నవ్వుతున్నాడు. అతని కళ్లు చాలా చిన్నవి. నవ్వినపుడవి మూసుకుపోయి, మరీ చిన్నగా కనిపిస్తున్నాయి.

“పలాస, సోంపేట, ఇచ్చపూరు (ఇచ్ఛాపురం), బారువలో శానా మాస్టారికి సేసిచ్చినా ఆజ్ఞా (అయ్యా), డబుల్‌ కాటు సిక్స్‌ ఇంటు ఫోర్‌ వస్తును. సైడ్సు టేకు రీపర్సు వేస్తు, ఫ్రంటు బాక్‌ ప్లయివుడ్‌ ఫ్రేము, చుట్టు రోజ్‌ వుడ్‌ బీడింగ్‌ వస్తును. పదకొండు వందలవును. డైనింగ్‌ టేబులు నాలుగు చెయర్లుది అంతా రోజ్‌వుడ్‌ చేస్తును అది పన్నెండు. ఒక టీపాయి యిస్తును. దానికి మాస్ట్రు దయ. వారం దినం తెస్తును. ట్రాన్స్‌పోర్టు పార్టీ ఇస్తును.” అని చెప్పి తనదైన శైలిలో నవ్వాడు.

“కొంచెం తగ్గించండి” అన్నాడు పతంజలి.

“ఒక వంద తగ్గిస్తును”

“రౌండ్‌ ఫిగర్‌ రెండువేలు ఇస్తాం. ఐదువందలు అడ్వాన్సిచ్చిపోతాము. మిగతాది నెలకు మూడు వందల చొప్పున ఐదు నెలల్లో తీరుస్తాం” అన్నాడు మల్లి.

బెహరా నెత్తిగోక్కున్నాడు.

“మాస్ట్రు దయ. ఇంకో వంద యిస్తురు” అన్నాడు. ఒప్పుకొని ఐదువందలు అడ్వాన్స్‌ యిచ్చి వచ్చేసారు.

మల్లి భార్య పిల్లలు ఇంకా రాలేదు. అతని మరదలు పెళ్లి ఈ మధ్యే జరిగింది. దారిలో హైవే మీద ‘పంజాబీ ధాబా’ దగ్గర ఆగారు. “ఏడున్నర దాటింది. ఏదైనా తినిపోదాం” అన్నాడు మల్లి.

ధాబా ముందు నులకమంచాలు వేసి ఉన్నాయి. కొందరు సర్దార్జీలు వాటిపై విశ్రాంతి తీసుకుంటున్నారు.

పుల్కా, ఆలు తరకారీ, మటర్‌ రామ్‌ ప్యారీ ఆర్డరిచ్చాడు మల్లి. పతంజలికి ఈ పేర్లు కూడ తెలియవు.

“వెజిటేరియనే కద!” అన్నాడు.

“హండ్రెడ్‌ పర్సెంట్‌. నిన్ను తీసుకువచ్చి అలాంటివి ఆర్డరిస్తానా? కళ్లు పోవూ?” అన్నాడు మల్లి.

పుల్కా నిప్పుల మీద కాల్చి తెచ్చాడు. పూరీల్లా పొంగి చాలా మృదువుగా ఉన్నాయి. కూరలు పొగలు కక్కుతున్నాయి. రుచి అద్భుతంగా ఉంది. పుల్కా నలభై పైసలే. కూరలు మాత్రం ఒక్కొకటి పది రూపాయలు. పతంజలి నాలుగు పుల్కాలు. రెండు కూరలు రుచి చూస్తూ తిన్నాడు. ఇంకా చాలా కూర మిగిలేలా వుంది. అదే అంటే,

“ఏం మిగలదు. చూస్తూ ఉండు” అంటూ డజను పుల్కాలు తిన్నాడు మల్లి.

“చికెనో మటనో అయివుంటే మరో డజను తినేవాడిని” అన్నాడు. భారీ శరీరం, పైగా స్పోర్ట్స్‌మన్‌. బాగా తిండి పుష్టి కలవాడు. తుంబనాధంగారు మల్లికిచ్చిన బిరుదు ‘దంతసిరి వస్తాదు’.

“నీ తిండి పుష్టి చూస్తుంటే నాకొక పద్యం గుర్తొస్తోంది పీడీ” అన్నాడు.

‘షూట్‌ యిట్‌’ అన్నాడు భీమసేనుల వారు.

“మా రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పుదున్‌

తత్కబళచాతురి తాళఫలప్రమాణమున్‌”

“మొదటిలైను అర్థమైంది. రెండో భాగం ఎక్స్‌ప్లెయిన్‌ చెయ్యి”

“రామయమంత్రి అన్నం ముద్దలు తాటిపండ్లంత సైజులో చేసుకొని మింగుతాడని”

“హ్యాట్సాఫ్‌ టు రామయమంత్రి” అన్నాడు మల్లి.

ఒకరోజు శ్రీనివాస లాడ్జి ముందున్న బజ్జీల అంగట్లో జరిగినది గుర్తుకు తెచ్చుకొని ఇద్దరూ నవ్వుకున్నారు.

ఆరోజు సాయంత్రం మామూలుగా షటిల్‌ ఆడారు. పతంజలి, మల్లి ఒకవైపు. యమ్‌.యస్‌.యన్‌ (కెమిస్త్రీ మాస్టారు), హిస్టరీ మాస్టారు ఒక వైపు. ఆయన పేరు బడబాగ్ని శివరాజు. చిత్తూరు జిల్లావాడు. సర్వీస్‌ కమీషన్‌ క్యాండిడేటే. పతంజలి చేరిన మూడు నెల్లకు జాయిన్‌ అయ్యాడు. ఎందుకోమరి రిజర్వుడుగా ఉంటాడు. పతంజలి ట్యూషన్లు చెప్పి సంపాదిస్తాడని కుళ్లు.

“మనం క్లాసులో సబ్జెక్ట్‌కు న్యాయం చేస్తే పిల్లలు ట్యూషన్‌ ఎందుకు కావాలంటారు?” అన్నాడొకసారి స్టాఫ్‌ రూంలో.

ఫిజిక్స్‌ మాస్టారికి ఒళ్లుమండిందా మాటకి. ఆయన లోకల్‌. ఎం.పిగారి బంధువు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయనన్నాడు.

“న్యాయం చేసినా చేయకపోయినా హిస్టరీ ట్యూషన్‌కెవరూ రారులెండి”

ఎమ్‌.ఎస్‌.ఎన్‌. అన్నాడు.

“ధూపదీపనైవేద్యాల్లేక బూజుపట్టి ఇలా ఉన్నాను గాని, నైవేద్యం పెట్టండి నా మహిమ చూపిస్తా” అన్నాట్ట వెనకటికో దేవుడు.”

ఆయన కోససీమ నియోగి బ్రాహ్మడు.

మల్లి కూడ స్టాఫ్‌ రూంలోనే ఉన్నాడప్పుడు. ఆ మధ్యే రామ్‌గోపాల్‌ వర్మ ‘శివ’ విడుదలయింది. మల్లి దాంట్లోని పాటపాడాడు.

“హిస్టరీ రొష్టు ఉంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెటరురా?”

శివరాజు ముఖం ఎర్రబడింది ఆ పాటలో బాటనీ మీద కూడ విసుర్లున్నాయి. గాని బాటనీ మాస్టారు రామారావు దాన్ని లైట్‌గా తీసుకొని ఎంజాయ్‌ చేస్తాడు.

పతంజలి అన్నాడు. “ఏ సబ్జక్టు విలువ దానికుంది. దేన్నీ తక్కువ చేయకూడదు. ఐ.ఎ.ఎస్‌ యాస్పిరెంట్స్ ఆప్షనల్‌గా హిస్టరీనే ప్రిఫర్‌ చేస్తారు.” శివరాజు గర్వంగా పి.డి. వైపు చూశాడు.

అందరూ ఇంటికి వస్తున్నారు నడుస్తూ, శ్రీనివాస లాడ్జి ముందున్న బజ్జీల దుకాణం ముందాగారు. పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీలు తింటున్నారు.

“ఇవి ఎన్ని తిన్నా కడుపు నిండదు” అన్నాడు మల్లి.

“ఎన్ని తినగలవేమిటి” అన్నాడు హిస్టరీ.

“నలభైదాకా”

“తినలేవు”

“చూస్తావా?”

“ఎంత పందెం?”

“యాభై రూపాయలు ప్లస్‌ బజ్జీల ధర”

“నాకు ఒకే”

“నాకూ ఒకే”

ఇలా ఛాలెంజ్‌ చేసుకున్నారిద్దరు. శివరాజుకు పీడీ మీద పగతీర్చుకోవాలని ఉంది. ఇద్దరూ పతంజలికి చెరీ యాభై యిచ్చారు. అతనే జడ్జి.

తీరికూర్చొని ఒక్కొక్క బజ్జీ తినసాగాడు మల్లి. నీళ్లు మధ్యలో తాగలేదు. అరగంటలో నలభై పూర్తయ్యాయి. అప్పుడు నీళ్లు తాగాడు. బజ్జీలు నలభై లెక్కపెట్టాడు పతంజలి. పీడీ సారు తింటూంటే చూడటానికి ఇంకా కొందరు గుమిగూడారు. పతంజలి పీడీ గెలిచినట్లు డిక్లేర్‌ చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. శివరాజు విసురుగా వెళ్లిపోయాడు.

ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకున్నారు.

“ఒక రోజు మా యింట్లో చేసిన పొంగణాలన్నీ మొత్తం లాగించేసిపోయావు గదా వృకోదరా?” అన్నాడు పతంజలి.

“ఆయనెవరు?”

“మీ కజినే. భీముడు”

ఒకరోజు వసుధ పొంగణాలు వేసింది. రాత్రి భోజనం లేకుండా అవే తినాలని అనుకున్నారు. గుంత పొంగణాలు ప్రొద్దుటూరులో బాగా చేస్తారు. నాలుగు వాయలు అంటే ఇరవై ఎనిమిది దిగాయి. పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బెర దంచి, కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా తరగి పిండిలో కలిపింది వసుధ.

సరిగ్గా అప్పుడొచ్చాడు పాండవ ద్వితీయుడు.

“రండన్నయ్యా!” అని ఆహ్వానించింది చెల్లెలు. “నాలుగు పొంగణాలు తింటారా?”

“పొంగణాలా? ఎన్ని రోజులైందో వాటిని చూసి! పెట్టమా, పెట్టు పెట్టు” అని కూర్చున్నాడు.

మొదట నాలుగు పెట్టింది. వసుధవైపు ఎగాదిగా చూసి “ఇవేం చాల్తాయి?” అన్నాడు.

వసుధ నొచ్చుకుంటూ, “అయ్యో! తిన్న తర్వాత వేద్దామని అనుకున్నాను” అంటూ వంటిట్లోకి వెళ్లి మరో నాలుగు వేసింది. ఎనిమిది ఎనిమిది సెకెండ్లలో గుటుక్కుమనిపించాడు రామయమంత్రి.

“అమ్మా! సూపర్‌! ఎన్నాళ్లయిందో తిని! మా అమ్మ ఇలాగే చేసేది”

“కారం సరిపోయిందా అన్నయ్యా!”

“సరిపోయింది ఇంకా త్యాపో”

ఆమె తెస్తూనే ఉంది. భీమసేన మహారాజు తింటూనే ఉన్నాడు. చివరకు నాలుగో మూడో మిగిలాయి.

“మీకున్నాయి కదమ్మా” అన్నాడు.

“ఉన్నాయి లెండయన్నయ్యా” అంది వసుధ. మంచినీళ్లు తాగి పెద్ద గ్లాసుతో టీ తాగాడు.

“ఇంగ్లీషు మాస్టారు! హెవీ అయింది. రాత్రి అన్నం తగ్గించాలి” అన్నాడు.

“రాత్రి మళ్లీ అన్నం తింటావా మహానుభావా!” అన్నాడు పతంజలి ఆశ్చర్యంగా.

“మరి! కొద్దిగా పెరుగన్నం తినకపోతే వేడి చేయదూ!” అన్నాడు. “ఈసారి పొంగణాలు చేసినప్పుడు నన్ను పిలవడం మర్చిపోకండి” అని చెప్పి వెళ్లిపోయాడు.

మిగిలినవి తినేశారు. రాత్రికి బన్సీ రవ్వతో ఉప్మా చేసుకున్నారు.

“బకాసురుడికి తమ్ముడే మీ అన్నయ్య” అని పతంజలి అంటే, “తప్పు అలా అనకండి. తృప్తిగా తినగలగడం ఒక వరమే. మన దిష్టే తగలకూడదు. మనం ఇద్దరం కలిసినా తినలేం. ఆయన తింటూంటే నాకెంత సంతోషం అనిపించిందో తెలుసా బావా” అంది వసుధ.

‘ఆడవాళ్లంతే. ఎదుటివాడికి కడుపు నింపటంలో ఆనందం పొందుతారు’ అనుకున్నాడు.

“గమ్మత్తైన మనిషి వసుధా మన పీడీ. ఏదీ మనసులో దాచుకోడు మొగమాటం అస్సలు లేదు. నీకు ఇంకోటి తెలుసా. అతడు మన యింటికి వచ్చినంత స్వతంత్రంగా ఎవరింటికీ వెళ్లడు”

ఈ సంఘటన గుర్తొచ్చి నవ్వుకున్నారు.

“మా చెల్లెలు వచ్చింతర్వాత మళ్లీ పొంగణాలు చేయించుకోవాల” అన్నాడు మల్లి.

“సిగ్గులేని జీవితం!” అన్నాడు పతంజలి. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?” అన్నాడులే వెనకటికో కవి!”

“ఆయన కూడ నాలాంటి తిండిపోతేమో!”

“తిండిపోతు అనకూడదు మల్లీ, భోజన ప్రియుడు అనాల”

“అవ్వ పేరే ముసలమ్మ”

***

వారం రోజుల్లోనే అనుకున్నట్లగా ఫర్నిచర్‌ తెచ్చేశాడు బెహరా. రోజ్‌వుడ్‌, పాలిష్‌ చేశాడేమో నల్లగా నిగనిగ మెరుస్తూంది. డైనింగ్‌ టేబుల్‌ మీద లేత గోధుమరంగు డెకొలం (వాళ్లు సన్‌ మైకా అంటారు) షీటు అతికించాడు. మంచానికి తలవైపున మూడడుగుల ఎత్తులో రోజ్‌వుడ్‌ను నగిషీలుగా చెక్కాడు. కాళ్ల వైపు ప్లెయిన్‌గా వదిలేశాడు. టేబుల్‌ సర్ఫేస్‌, కుర్చీల రంగుతో మ్యాచ్‌ అయింది. మధ్య రూంలో గోడకానుకొని మంచం వేయించి తమ దగ్గరున్న దూది పరుపుపైన వేశారు. బెడ్‌షీట్స్‌ పిల్లో కవర్లు ఇంకో సెట్‌ తెచ్చుకోవాలి. వంటింట్లోనే డైనింగ్‌ టేబులు పట్టింది. ఇంకా తగినంత స్థలం మిగిలింది. టీపాయ్‌ వరండాలో పెట్టించాడు.

మందస నుండి ట్రాలీ రిక్షాలో వేసుకొచ్చారు. వంద రూపాయలిమ్మన్నాడు బెహరా రిక్షావాడికి. మరో ఇరవై ఎక్కువిచ్చాడు. ఇంటికి కొత్త అందం వచ్చింది. సాయంత్రం వెళ్లి డైనింగ్‌ టేబుల్‌ మీద గిన్నెల క్రింద పెట్టుకొనే మ్యాట్లు తెచ్చాడు. మరుసటి రోజు మల్లిని తీసుకొని వెళ్లి తెలిసిన ఎలక్ట్రికల్‌ స్టోర్సుకు వెళ్లాడు. ఆ యింట్లో మధ్యగదిలో ఒక్క ఫ్యానే ఉంది ఇంటివాళ్లది. ట్యూషన్స్‌ చెప్పే ముందు వరండాలో ఒకటి, వంట గదిలోకి ఒకటి తీసుకున్నాడు. క్రాంప్టన్‌ కంపెనీవి. ఒక్కొక్కటి మూడు వందలు. షాపు యజమాని కొడుకు, కూతురు పతంజలి దగ్గరకి ట్యూషన్‌కు వస్తారట. అతను చెప్పాడు.

“మాస్టారూ, రెండు ఫ్యాన్లకూ ఐదువందలివ్వండి చాలు. మా పిల్లలకు గురువు మీరు. మేము ఒక స్కీము పెట్టాము. నెలకు వంద రూపాయలు కడుతూండాలి, ప్రతి నెలా లాటరీ తీస్తాము. ఒకవేళ మీకు పేలితే (తగిలితే) మీరు కట్టనక్కరలేదు. స్కీము సంవత్సరం. అంటే పన్నెండు వందలు కడతారు. మధ్యలో తగలకపోయినా ఫరవాలేదు. స్కీము చివర్లో అంత విలువ గల వస్తువులు మీరు మా షాపులో తీసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం వందరూ. కట్టి స్కీంలో చేరండి. మెంబర్‌ షిప్‌ కార్డు యిస్తాము”

ఇదేదీ బాగుందనిపించి సరే అన్నాడు ఇంగ్లీషు మాస్టారు. ఎలక్ట్రీషియన్‌ వచ్చి రెండు ఫ్యాన్లూ బిగించి వెళ్లాడు.

వసుధా వాళ్లు వచ్చేది ఎల్లుండే.

ఉదయాన నాలుగున్నరకే లేచి సైకిలు మీద రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు పతంజలి. డబుల్‌ కాట్‌, డైనింగ్‌ టేబుల్‌ కొన్నట్టు వసుధకు లెటర్లో వ్రాయలేదు. సర్‌ప్రైజ్‌ ఇద్దామని ట్యూషన్లు చెప్పేటపుడు విశ్రాంతిగా కూర్చోడానికి వీలుగా కూషన్‌ గల ఒక రిక్లైనింగ్‌ కుర్చీ కూడ కొన్నాడు.

ఐదున్నరకు ట్రెయిన్‌ వచ్చింది. కోచ్‌ నంబరు ముందే వసుధ జాబులో రాసింది. సామాన్లు దింపుకున్నారు. బుజ్జిగాడు కళ్లు విప్పార్చుకొని స్టేషన్‌ లోని లైట్లను జనాల హడావుడి గమనిస్తున్నాడు. వాడి నాన్న పిలిస్తే వెళ్లలేదు. అనుమానంగా చూసి, ఏడుపు మొదలెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కళ్లతోనే సందేశాలు పంపుకున్నారు. వసుధ పరిపూర్ణ స్త్రీత్వానికి ప్రతీకలా ఉంది.

“ప్రయాణం బాగా జరిగిందా నాన్నా” అనడిగాడు.

“నాకు నిద్ర పట్టి చావలేదురా” అన్నాడాయన.

“శ్రీకాకుళం తర్వాత పలాసలోనే ఆగేది అని మామ శ్రీకాకుళం దాటినప్పటినుండి సామాన్లన్నీ తలుపు దగ్గర చేర్చి నిలబడి ఉన్నాడు బావా!” అన్నది వసుధ.

“ఆయనొక్కడే కాకుండా మమ్మల్ని కూడ నిలబెట్టారు గంటసేపు” అంది వర్ధనమ్మ.

“నాకేం తెలుసు. తర్వాత స్టేషను రావడానికి అంతసేపు పడుతుందని!” అన్నాడాయన. విజయవాడలో అక్కయ్య చపాతీలు, వేరుశనగపొడి, కట్టిచ్చిందట. అందరికీ. కూర ‘అంట్లు’ అని అమ్మనాన్న తినరని, పొడిలో నెయ్యి వేసి కలిపి యిచ్చిందట.

“ఇంకా రెండు మిగిలినాయి” అన్నది అమ్మ.

“నేను తింటాను లేవే అమ్మా” అన్నాడు పుత్రరత్నం.

రెండు రిక్షాల్లో ఇంటికి చేరుకున్నారు. అంత పొద్దున్నే కొంతమంది పతంజలికి వినయంగా నమస్కారాలు పెట్టడం గమనించాడు శర్మ.

తల్లిని పిల్లవాడినీ తలుపుదగ్గరే నిలబెట్టి, వర్ధనమ్మ కొడుకుతోబాటు ఇంట్లోకి వెళ్లి ఎర్రనీళ్లు కలిపి ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి రానిచ్చింది. పిల్లవాడిని పడుకోబెట్టే గుడ్డలాలి వేలాడదీసే ఇనుపకడ్డీ, రెండు వైపులా వంపున్నది, వెల్దుర్తినుండి తెచ్చారు.

మంచం, డైనింగ్‌ టేబుల్‌ చూసి వసుధ కళ్లలో మెరుపు. “కొంటున్నట్లు ఒక మాటయినా వ్రాయలేదేం బావా!” అన్నది భర్తను మురిపెంగా చూస్తూ.

“నీకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని”

ప్రద్యుమ్న అమ్మ దగ్గర పాలు తాగి బజ్జున్నాడు. బెడ్‌ రూంలోనే ఒక మూలనున్న రూఫ్‌లో అమర్చిన రింగుకు ఉయ్యాల వేలాడదీశారు. ప్యాన్‌ గాలి కూడ చక్కగా తగులుతూంది బుజ్జికన్నకు.

ఆ రోజు నుండి లీటరున్నర పాలు పోయమని ముందే చెప్పాడు పాలమెకు. పాలు వచ్చాయి. అందరూ ముఖాలు కడుక్కొని కాఫీ తాగారు. నాన్న పెరట్లోకి వెళ్ళి “నీళ్ళు పోసి పెట్టుకొనేందుకు గోలెమో, తొట్టో లేదేమిరా!” అన్నాడు.

“అవసరం లేదునాన్నా. నీళ్లు బాగా పైకి ఉంటాయి. ఎప్పటికప్పుడు తోడుకోవచ్చు” ఆయన నూతిలోకి తొంగి చూశాడు. ప్లాస్టిక్‌ చేద కూడ నచ్చిందాయనకు. వేడినీళ్ల అవసరమే లేదు. చలికాలం రెండు మూడు నెలలు తప్ప. ఆయన ఎర్రది కాశీ సన్నపంచె కట్టుకొని నూతి దగ్గరే నిలబడి తనివి తీరా శిరస్నానం చేశాడు. నీళ్లు తియ్యగా ఉన్నాయి.

“ఆహా! దివ్యః! ఎంత హాయిగా ఉందిరా పెద్దవాడా! సద్యోజాతం ఈ నీళ్లుఁ” ఆమె మెచ్చుకున్నాడు. రాగి చెంబుతో పూజకు, స్టీలు బిందెతో వంటకు ఆయనే నీళ్లు తోడి వంటింట్లో పెట్టాడు. పతంజలి బక్కెట్‌ నిండా నీరు తోడి బాత్‌ రూంలో పెడితే వర్ధనమ్మ కూడ స్నానం చేసింది.

తండ్రి నిత్యపూజకు చిన్న స్ఫటిక లింగం, వెండిది లక్ష్మీనరసింహస్వామి విగ్రహం, గణపతి ప్రతిమ తెచ్చాడు. దత్తాత్రేయ స్వామి, గాయత్రీదేవి పటాలు కూడ తెచ్చాడు. ఆయన పూజ ప్రారంభించే లోగా పతంజలి సి.ఐ. గారింటికి వెళ్లి నందివర్ధనాలు, చేమంతులు, రెండు మందారాలు అడిగి కోసుకొని వచ్చాడు. కొబ్బరి కాయ ఇంట్లోనే ఉంది.

తండ్రి పటాలన్నీ తుడిచి, గంధం, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించాడు. ఏకవార రుద్రాభిషేకం చేశాడు.

వినాయకుడికీ గణపతికీ అష్టోత్తర శతనామావళి పూజ కుంకుమతో చేసి, హారతిచ్చాడు. దీపారాధనలు పూజ గదినంతా ప్రకాశింపచేస్తున్నాయి. పూజ గదిలో ఒక మూలనున్న హోల్డరుకు పతంజలి చిన్న నీలిరంగు జీరోవాట్‌ బల్బు పెట్టాడు.

వర్ధనమ్మ రంగంలోకి దిగింది. బుట్టలో కూరగాయలేమున్నాయో చూసింది. ఐదారు వంకాయలు కొంత వడలిపోయినవి ఉన్నాయి. నాలుగు మునక్కాయలున్నాయి. అంతే. పలాసా ప్రాంతం మునగ పంటకు, పనస పంటకు ప్రసిద్ధి. అక్కడి నుండి లారీలతో ఒరిస్సా, బెంగాల్‌లకు ఎగుమతి చేస్తారు.

“కూరగాయలు సాయంత్రం తెస్తానమ్మా” అన్నాడు సుపుత్రుడు.

“ఏం పరవాలేదులే నాన్నా, ఈ వంకాయలు పచ్చడి చేసి, ఈ మునక్కాయలు పులుసు చేసేస్తాలే” అన్నదామె.

పచ్చడి మిక్సీలో వేస్తానని కోడలంటే ఒప్పుకోలేదామె. వాళ్లు మిక్సీ కొనకముందు వాడిన చిన్నరోలులోనే పచ్చడి నూరింది. సాంబారు పొడి, చారుపొడి, నువ్వుల పొడి ఇంటినుండి తెచ్చింది. విజయవాడ నుండి అక్కయ్య పతంజలికిష్టమని పొదీనా పొడి కూడ పంపింది.

ఆరోజు ఉదయం ట్యూషన్లకు సెలవిచ్చాడు పతంజలి. పదిన్నరకు అందరూ భోజనాలు చేశారు. ఇద్దర్నీ మంచంమీద పడుకోమంటే వాళ్లు వినలేదు. వరండాలో చాప బొంత వేసుకొని పడుకున్నారు. పదకొండుకు ప్రద్యుమ్న కుమారుడు లేచాడు. లేస్తూనే ఉయ్యాల్లోంచే ఉచ్చపోశాడు. బడలిక తీరిందేమో చిరునవ్వులు చిందిస్తున్నాడు. పతంజలి ఎత్తుకుంటే ఏడవలేదు. గిన్నెతో వేడినీళ్లు కాచి, అత్త కోడలు వాడికి స్నానం చేయించారు. అస్సలు ఏడుపనేదే లేదు బంగారు సామికి.

ఒళ్లంతా పౌడరు పూసి, నుదుట చంద్రవంక బొట్టు పెట్టి, బుగ్గన దిష్టి చుక్క పెట్టింది వసుధ. మెత్తని డ్రస్‌ వేసింది. బోరలగిడి పడి పొట్టతో ఇల్లంతా పాకుతున్నాడు. మంచంకిందికి వెళ్లిపోయాడు.

పన్నెండు గంటలకు పతంజలి కాలేజీకి వెళ్లిపోయాడు. సాయంత్రం ప్రిన్సిపాల్‌ గారి పర్మిషన్‌ అడిగి నాలుగు కల్లా వచ్చాడు. వచ్చేటపుడే కూరగాయలన్నీ తెచ్చాడు. కాశీబుగ్గలో అన్నీ ధరలు ఎక్కువే. అందుకే దానికి “కాస్ట్లీ బుగ్గ” అని పేరు పెట్టాడు పతంజలి.

సాయంత్రం మల్లి కుటుంబం, లైబ్రేరియన్‌, తుంబనాధం దంపతులు, సి.ఐ.గారి కుటుంబం అంతా వచ్చి బాబును చూసి వెళ్లారు. బాబుకు డ్రెస్‌లు, బొమ్మలు, బోలెడొచ్చాయి. వాళ్లందరికీ బొట్టుపెట్టి తాంబూలామిచ్చి మర్యాద చేశారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here