[dropcap]ఇ[/dropcap]లా పరిపరి విధాల కుమారుల దుర్గతికి శోకిస్తుండగా గాంధారికి దుర్యోధనుని మృత శరీరం పైబడి రోదిస్తున్న కోడలు భానుమతి అగుపించింది. ఆమెను కృష్ణుడికి చూపి
పద్యం:
కొడుకు చావు కంటె కోడలి యడలున I బరిగి శోకవహ్ని దరికొనంగ
నంతరంగ మిప్పు డగ్గల మెరియంగ I దొడగె దీనికేది తుది? యుపేంద్ర. (స్త్రీ. 2-44)
తాత్పర్యం:
కృష్ణా! కొడుకు చనిపోవడం వలన కంటె ఈ కోడలి దుఃఖం వలన నాలో శోకమనే అగ్ని బాగా ప్రజ్వరిల్లి హృదయాన్ని బాగా కాల్చివేయడం మొదలు పెట్టింది. ఈ బాధకు అంతం ఎక్కడ?
అంటూ శోకించింది. ఇట్లా అనేక విధాలుగా వాపోయి, ఏడ్చి ఏడ్చి తక్కిన కుమారుల మృతదేహాలవైపు చూసి కృష్ణుడితో
పద్యం:
కౌరవనృపతి తనూజశతంబు గంటె? పవనసుతు పటు భుజలీలా
ఘోరత తడబడ మేదినిమీదగూలె వికటముఖకరచరణత్వం
బేరికయిన గనుగొన్న విషాదం బెంతయు మది నొలయగ బ్రియకాంతల్
చేరి విలపనము దద్దయు నార్తం జేయగ నునికి వనట తిరిబెట్టన్. (స్త్రీ. 2-50)
తాత్పర్యం:
కృష్ణా! అదిగో! అక్కడ ధృతరాష్ట్ర మహారాజుగారి నూర్గురు సంతానాన్ని చూడుము. భీముడి బలిష్ఠమైన భుజాల విలాసానికి తలక్రిందులై నేల మీద కూలారు. వికారం పొందిన వారి ముఖాలు , కాళ్ళూ చేతులూ చూస్తే ఎవరికైనా దుఃఖం కలుగుతుంది. అట్లాంటిది ఈ కుమారుల భార్యలందరూ వారి శవాలవద్ద చేరి అతి దీనంగ విలపిస్తూ ఉండటం చూస్తుంటే దుఃఖం మరింత అధికమవుతున్నది.
తదుపరి దుశ్శాసనుడూ, దుర్ముఖుడూ, శూరశేనుడూ.. ఇలా పేరు పేరునా ప్రతి ఒక్కరినీ చూపించి తలుచుకుంటూ శోకించింది.
తన తమ్ముడు శకుని శవాన్ని చూసి, దుఃఖించలేదు సరికదా ఆయన తన కుమారులకు చేసిన కానరాని కీడును స్మరిస్తూ వేడిగా నిట్టూర్చింది. దుర్యోధనునికి మంచి చేస్తున్నట్లే నమ్మించి మోసం చేసాడనీ, అసలు పాండవులతో వైరం రావడానికి మూలకారణం కూడా ఇతడేననీ, ఈ నాటికి ఇతడి పాపకర్మ ఫలించిందనీ వగచింది.
అలానే శరీరం నిండా శస్త్రాలతో ఉన్న కళింగ దేశాధిపతినీ, మగధ దేశాధిపతినీ.. ఇలా ఇతర రాజులందరి శవాలనీ చూసి వారిపైబడి రోదిస్తున్న వనితల విలాపాన్నీ, శోకంలోనూ వారిలో ప్రస్ఫుటమవుతున్న లావణ్యాన్నీ శ్రీకృష్ణుడికి చూపించి రోదించింది.
తదుపరి అర్జునుడి పుత్రుడైన అభిమన్యుని మృతదేహంపై రోదిస్తున్న అతని ఇల్లాలుని శ్రీకృష్ణునికి చూపుతూ
పద్యం:
ఉత్తర యిక్కుమరోత్తమ నురమున I వ్రాలి మోమున దనవదనకమల
మందంద చేర్చుచున్నది మున్ను గన్నంత I మెలగంగనేరక చెలులమాటు
గొను సిగ్గు పెంపున వనట నిట్లయ్యె ని I ప్పుడు మాటిమాటికి బొలతి ప్రియుని
గనుగొని బిగియార గౌగిలించు శిర I మూరుతలంబున నునిచి పాణి
పల్లవంబున నానన మల్లనల్ల I దొడయుచును నిన్నుజూచుచు దోడుతోడ
బొడము పెల్లున గన్నీరు దుడిచికొనుచు I నలత పెనువిల్లి దేలెడు అంబుజాక్ష! (స్త్రీ. 2-75 )
తాత్పర్యము:
కృష్ణా! ఉత్తరాదేవి తన భర్త రొమ్ము మీద వాలిపోయి ముఖంమీద ముఖం మాటిమాటికీ ఆనిస్తోంది. యుధ్ధానికి ముందు అభిమన్యుడిని చూడగానే చెలికత్తెల చాటుకు సిగ్గుతో పారిపోయేది. మరి ఇప్పటి స్థితిలో అతిదుఃఖం వలన ఇట్లా అయింది. ప్రియుని చూచి గట్టిగా కౌగలించుకుని మోకాళ్ళపై తలను వాల్చి అరచేతులతో మొగాన్ని స్పృశిస్తూ నిన్ను చూడగానే మరింత దుఃఖానికి లోనై కంటినీరు తుడుచుకుంటూ శోకమహా సముద్రంలో మునిగిపోయింది పాపం!
ఉత్తర గురించి కృష్ణునితో చెప్తుండగా, కంటికీమంటికీ ఏకధారగా శోకిస్తున్న ఉత్తరను ఆమె తల్లి మొదలగు బంధువులైన స్త్రీలు ఆ చోటునుండి లేపి దుఃఖిస్తూ పట్టుకుని తీసుకుని వెళ్ళారు.
ఇంకా, భర్త పార్థివ శరీరాన్ని కౌగలించుకుని దుఃఖిస్తున్న వృషసేనుడి తల్లిని (కర్ణుడి భార్య) శ్రీకృష్ణునికి చూపించి ఈ విధంగా తెలిపింది..
పద్యం:
పరశురాముని శాపంబు బాణశక్తి I గ్రాప బ్రాహ్మణశాపంబు రథము సిక్కు
వఱుప గాండీధరుచేతి మెఱుగుటమ్ము I మన్నిగొనియనె యో కర్ణ! మగలరాజ! (స్త్రీ. 2 – 91)
అని మఱియుం బలుదెఱంగులం బలవించి యుత్థితయై యాలోకించి (స్త్రీ. 2 – 92)
కాకులును గ్రద్దలును దిన్న గడును ద్రెస్సి I యపరపక్షచతుర్దశి యమృతకరుని
కరణి నొప్పెడు కర్ణుమొగంబుమీద I వనిత యందంద మోపెడు దన మొగంబు (స్త్రీ. 2 – 93)
తాత్పర్యం:
ఓ! మహావీరుడా! కర్ణా! పరశురాముడిచ్చిన శాపం నీ బాణాల శక్తిని నశింపజేసింది. బ్రాహ్మణుడిచ్చిన శాపం రథచక్రం భూమిలో కృంగిపోయేటట్లు చేసింది. చివరకు అర్జునుడి చేతిలోని వాడి బాణం నీ ప్రాణాలు తీసింది. నాథా! ఎంత దారుణ మిది?
ఈ విధంగా అనేక రీతులలో విలపించి విలపించి, చివరికి లేచి తన భర్త దేహాన్ని చూచి కాకులు గద్దలు తినివేయగా మిక్కిలిగా తెగి చివికిపోయిన కృష్ణపక్షంలోని చతుర్దశినాటి చంద్రుడివలె కాంతివిహీనంగా కనిపిస్తున్న కర్ణుడి ముఖంపైన తన ముఖం మాటిమాటికీ మోపుతూ వృషశేనుడి తల్లి దుఃఖిస్తున్నది..
యుధ్ధభూమిలో కరుణ రసాలంబనంగా ఉన్న కుమార్తె దుస్సలని చూపి గాంధారి దుఃఖించిన తీరు మనస్సుని ద్రవింపజేస్తుంది..
పద్యం:
హృదయమున వగలేనియ ట్టిట్టునట్టు I దిరుగుచున్నది దుస్సల వరుని శిరము
గాన నీ కూతు నిమ్మెయి గనుట కంటె I దలప నెక్కుడు దుఃఖంబు గలదె కృష్ణ! (స్త్రీ. 2- 97)
తాత్పర్యము:
కృష్ణా! హృదయములో ఏ దుఃఖమూ లేనిదానివలే నా కూతురు దుస్సల సందడిగా అటూ ఇటూ తిరుగుతున్నది ఎందుకో తెలుసా! తన భర్త శిరస్సు దొరకక. ఇట్లా ఈ కొమర్తెను చూడటం కన్న అధిక దుఃఖం ఏముంటుంది?
అని, ఆనాడు దుస్సల సైంధవుడికి ఎన్నో విధాల నీతిబోధ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దుస్సల ఇంకా ఏమని అంటున్నదో తెలుసా……
పద్యం:
తోడబుట్టువు విధవయై తొలగి యునికి I కోర్చి చెలమున బతి దెగటార్చి సంత
సించితిరె? తండ్రులార మీరంచు బాండు I పుత్రకుల దూఱుచున్నది పొలతి వింటె! (స్త్రీ. 2- 100)
తాత్పర్యము:
‘ఓ! తండ్రులారా మీ చెల్లెలు భర్తను పోగొట్టుకుని విధవరాలై ఏ శుభకార్యానికీ పనికిరానిదిగా బయటకి నెట్టబడి ఉండటం కూడా సహించి పట్టుదలతో నా భర్తను చంపి మీరు సంతోషపడ్డారా?’ అంటూపాండవులను దుస్సల నిందిస్తున్నది వింటున్నావా?
అని కృష్ణుడిని అడిగింది గాంధారి శోకిస్తున్నదై. ఇంకా ఇటులనే శల్యుడూ, భీష్ముడూ, ద్రోణుడూ, ద్రుపదుడూ తదితరుల మృతదేహాలను కృష్ణునికి చూపించి వారి గుణగణాలను వర్ణించి, యుధ్ధ కౌశలాన్ని శ్లాఘించింది.
శరతల్ప గతుడై ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి చూస్తూ ప్రాణాలను నిలుపుకొని ఉన్న భీష్ముని చూసి దుఃఖించుటకు మారుగా నమస్కరించి..
పద్యం:
వీరశయనమున గంగకు I మారుడు కల్పక్షయమున మార్తాండుడు సం
చార మెడలి ధర బడి యొ I ప్పారెడు చందమున వెలిగె నంబురుహాక్షా! (స్త్రీ. 2- 117)
తాత్పర్యం:
కృష్ణా ఈ అంపశయ్య మీద ఉన్న భీష్ముడు కల్పాంతంలో సూర్యుడులోక సంచారం మాని, నేల మీద వాలి, విశ్రాంతి తీసికొన్న రీతిగా ప్రకాశిస్తున్నాడు.. అన్నది.
భీష్ముని పట్ల గాంధారి భక్తి గౌరవప్రదమైన శోక ప్రదర్శనమది.
గాంధారి ఇలా పరిపరి విధాల శోకిస్తూ “అసాధరణమైన పరాక్రమమున్న అతిరథ మహారథుల తాకిడికి ఎదురై కూడా నీవూ, పాండవులూ, నీ తమ్ముడు సాత్యకీ ఎటువంటి అపాయం లేకుండా ప్రాణాలతో మిగిలారు! ఆలోచిస్తే ఇంతకంటే మహాధ్భుతం ఏముంటుంది? భీష్మ ద్రోణాదులవంటి మహావీరులను యుధ్ధంలో జయించటమా? నమ్మటానికి వీలులేని విషయమే. అయినా భగవంతునికి చేత కాని పని ఏముంది? దైవం దుర్యోధనాదులైన నూరుమంది పట్లా ఇట్లా ఒకేరీతిగా అన్యాయం చేస్తుందా?” అని ప్రశ్నించింది కృష్ణుడిని.
ఇంకా ఇట్లా అంటున్నది గాంధారి…..
పద్యం:
కురురాజు మొదలైన కొడుకుల నెల్ల గోల్పోవు టిప్పుడు గోవింద! కలిగె;
నరిగితి సంధి సేయగరాకయున్న నటయప్డు నీ చెప్పుటైనది కాదె?
పరమహితంబుగ బలికిరి గంగపట్టియు విదురుండు పాటించి పెక్కు
వెరవుల నొత్తిన విననైతి నా వివేకుల చూ పేల వృథ నోవనేర్చు? (స్త్రీ. 2 – 158)
తాత్పర్యం:
‘కృష్ణా! దుర్యోధనుడూ మొదలైన కుమారులందరినీ ఈనాడు కోల్పోయాను. నీవు ఆనాడు సంధి చేయడానికి హస్తినకు వచ్చావు. సంధి కుదరదని తెలిసినప్పుడు నీవు ఏ మాటలు చెప్పావో అవన్నీ ఇప్పుడు నిజమయ్యాయిగదా! భీష్ముడూ, విదురుడూ అనేక విధాలుగా కురువంశ క్షేమాన్ని కోరి ఎంతగానో బోధించారు. పూనికతో ఎన్నో ధర్మసూక్ష్మాలూ, రాజనీతులూ, ఉపాయాలూ నొక్కి నొక్కి చెప్పారు. అయినా నేను పుత్ర వ్యామోహంతో వినకపోయాను. ఆ పుణ్యాత్ముల వివేకంతో కూడిన దూరదృష్టి తప్పవుతుందా?’
అని చెప్పి పశ్చాత్తపం వలన కలిగిన దుఃఖాతిశయంతో మూర్ఛపోయి తేరుకుని మనసులో పేరుకు పోయిన శోకం అత్యధికమైన బాధను కలిగించగా కొంతసేపు ఊరకుండి ఆ గాంధారి కృష్ణుడిని చూస్తూ కోపంతో మండిపోతూ
పద్యం:
‘ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు I తమలోన నీసున సమరమునకు
దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు I మానుషుల్ కలిగియు మాననీయ
వాక్యుండవయ్యును శక్యసమస్త కా I ర్యుండన బేర్కొనియును నుపేక్ష
చేసితి కురురాజ జెఱుపన తిరిగితి I నిఖిలరాజుల దదనీకములను
నామ మడచి తెల్ల భూములు బాడయ్యె I నంతవట్టు ఫలము ననుభవింపు
మేపడంగ నిన్ను శాపానలజ్వాల I దగ్ధమూర్తి జేయుదాన వినుము. (స్త్రీ. 2- 160)
తాత్పర్యం:
పాండవులూ కౌరవులు తమలో తాము అసూయతో యుధ్ధానికి సిద్ధపడితే నీవు వారికి అడ్డుపడకుండా పోయావు. న్యాయం తెలిసినవారు, సమర్థులు భీష్మాదులు ఉండి కూడా, నీవు సకల ధర్మవేత్త మధురభాషి అయి ఉండి కూడ, అన్ని పనులు చేతనయినవాడివని పేరుపొంది కూడ, నిర్లక్ష్యం చేసావు. దుర్యోధనుడిని నాశనం చేయడానికి నీవు రాయబారం చేసావు. రాజులను, వారి సైన్యాలను పేరు లేకుండా చేసావు. అందరూ చచ్చారు. అన్ని ప్రాంతాలూ బీడు భూములయ్యాయి. చేసిన దానికి తగిన ఫలాన్ని అనుభవించుము. నీ వైభవం సర్వ నాశనమయ్యేటట్లుగా నా శాపాగ్నిలో నిన్ను కాల్చిపారవేస్తాను వినుము.
పద్యం:
పూని పాతివ్రత్య పుణ్యఫలంబున I సంపాదితంబైన సారతపము
బలిమి సాధనముగా బలికెద నుత్తమ I జ్ఞాతుల తమలోని సంగరమున
బొలియ జేసితిగాన పొలియుదు రన్యోన్య I ఘాతుకులై భవద్ జ్ఞాతిజనులు
నీవును దప్పక నే డాదిగా ముప్ప I దాఱగు నేడైన యద్దినమున
నరయ దిక్కెవ్వురును లేని యగ్గలంపు I గుత్సితంబున దెఱంగున గూలువాడ
విట్లు మీ వధూజనములు నేడ్చువారు I పతుల సుతులను బంధుల బనవి పనవి’ (స్త్రీ. 2 – 161)
తాత్పర్యం:
‘ఎంతో దీక్షతోపతివ్రతగా ఇంత సుదీర్ఘ జీవితమును గడిపిన పుణ్యానికి ఫలంగా అబ్బిన తపశ్శక్తితో చెప్పుతున్నాను. మంచి దాయాదులను తమలో తాము పోరాడుకుని ఒకరినొకరు చంపుకుని నశించేటట్లు చేసావు. నీ దాయాదులు కూడా ఇట్లాగే ఒకరినొకరు కొట్టుకుని చస్తారు చూడుము! నీవు కూడా ఈనాటికి ముప్పదియారు సంవత్సరములు పూర్తైన రోజున చూడటానికి దిక్కు ఎవరూ లేని రీతిలో అతిక్రూరంగా చావబోతావు. నా మాట తప్పదు. ఈవాళ వీళ్ళందరూ ఎట్లా ఏడుస్తున్నారో ,అట్లాగే మీ యాదవ కాంతలు కూడా భర్తలనూ, కొడుకులనూ, బంధువులనూ పేరు పేరునా తలచుకుని కుమిలి కుమిలి ఏడుస్తారు పొమ్ము’
అని గాంధారి అతిఘోరంగా శాపమివ్వగా విని విశాల హృదయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ముఖం విరాజిల్లగా గాంధారీదేవితో మర్యాదను పాటిస్తూ ‘’గాంధారీదేవీ మీ తప్పులవలన వచ్చిన చేటుకు బాధ్యుడిని నేనని నన్ను నొప్పించేటట్లు ఇట్లా మాట్లాడటం న్యాయమా? ఇకనైనా ధైర్యం అవలంబించి శోక తగ్గించుకో’ అని పలుకగా ఆమెకు నచ్చకపోయినా బదులివ్వక ఊరకుండిపోయింది. ఆ విధంగా ధృతరాష్ట్రుడు గాంధారీల దుఃఖ క్రోధావేశాలను శాంతింపజేసాడు శ్రీకృష్ణుడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు, మరణించినవారికి క్రియాకర్మల విషయంలో సందేహాలను వెలిబుచ్చగా ధర్మరాజు వాటికి సందేహ నివృత్తి చేసాడు. తదుపరి భరత వంశీయులకు పాండవులు, ధృతరాష్ట్ర సహితంగా ఉత్తర క్రియలు జరిపారు.
అంతట కుంతి వచ్చి కర్ణుడు రాధేయుడు కాదనీ కౌంతేయుడనీ తెలిపింది ధర్మరాజుకి. ఆ మాట విని కర్ణుడి వంటి మహావీరుడి జన్మ రహస్యం ఇన్నాళ్ళూ తమకు తెలుపనందుకు దుఃఖించాడు. అటువంటి అద్వితీయ పరాక్రమవంతుడు తమ అన్న అని ముందరే తెలిసుంటే యుధ్ధనీతి వేరుగా ఉండేదని వాపోయాడు.
తల్లి అభ్యర్థన మేరకు వణుకుతున్న చేతులతో కర్ణుడికి తిలోదకాలిచ్చాడు. తదుపరి శోక భారంతో భీమార్జున నకుల సహదేవులూ అవ్విధంగానే చేసారు.
ధృతరాష్ట్రుడు గాంధారి, కురుకుమారుల భార్యలూ తర్పణాలు వదిలారు. కర్ణుడిపై సోదర భావంతో, ధర్మరాజు, అతడి భార్యలనూ పరిచారిక జనాలనూ పిలిచి సముచిత రీతిన గౌరవించి, పుణ్యదానాలను చేసి, విధివిధానంగా అపరకర్మలు చేసి బంధుజనులతో కలిసి గంగానదిని దాటివెళ్ళాడు.
స్త్రీ పర్వం ద్వితీయాశ్వాసం, కొడుకులని సరిదిద్దుకోలేక నూర్గురు కొడుకులను పోగొట్టుకున్న ఒక తల్లి గాంధారీ, కన్నెప్రాయంలోనే కన్న ఒక బిడ్డను తన కొడుకుగా చివరివరకూ చెప్పుకోలేక ఆతడిని తన స్వార్థానికి బలిచేసిన మరొక తల్లి కుంతీ.. ఈ ఇరువురు మహారాజ్ఞుల నిర్వాకమే కురుకుల నాశనానికీ, అంతఃపుర వనితల రోదనానికీ, వీరపత్నుల వేదనకూ మూలకారణమని శ్రీకృష్ణుడి సాక్షిగా ప్రదర్శించబడిన విధిరూప విశ్వదర్శనం అని అవగతమవుతుంది.
***
స్త్రీ పర్వం సమీక్ష:
స్త్రీ పర్వం లోని సంఘటనలను, విశేషాలను నిశితంగా పరిశీలిస్తే:
గాంధారి భర్త కొరకు అంధవ్రత దీక్ష బూనిన పరమ పతివ్రతా శిరోమణిగా, విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన, ధైర్యవంతురాలైన స్త్రీగా కీర్తించబడింది. కురుక్షేత్ర సంగ్రామ సూత్రధారియైన శ్రీకృష్ణుని శపించగలిగేటంత అప్రతిహత సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీ కనుకనే స్త్రీ పర్వంలో ఇతర కౌరవ పాండవ స్త్రీల కంటే అధికంగా గాంధారి గురించి ప్రస్తావించి, ప్రధానంగా ఆమె శోక వర్ణనకే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
మాతృ హృదయానికి కష్టం కలిగించిన వ్యక్తి సాక్షాత్ భగవత్స్వరూపుడైనా సరే ఆమె క్షమించలేదు, తల్లి ప్రేమకూ, బాధకూ, భావనలకూ అంత శక్తి ఉన్నది కనుకనే శ్రీ కృష్ణుడంతటివాడు సైతం గాంధారి శాపం నుంచి తప్పించుకొనలేకపోయాడు.
ఎప్పుడైనా ఏ కారణాల వల్లనైనా ఏ రెండు పక్షాల మధ్యనైనా వైరం సంభవిస్తే ఆనాడే వారి మధ్యన బంధం బలహీనమవుతుంది. వారిరువురినీ నాశనం చేద్దామనుకుని ఎదురు చూస్తున్న వారు ఆ అవకాశాన్ని జారవిడువక అగ్నిలో ఆజ్యం పోసి వైరాన్ని పెంచుతారే తప్ప సంధి పొసగనివ్వరు.
ఇదే కౌరవ పాండవుల మధ్య జరిగింది. దుర్యోధనుడు శకునిని ఆత్మీయుడిగా తలచి చెప్పుడు మాటలు విని తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. వినాశనం ఆతడొక్కడితోనే ఆగక సమస్త కురు వంశాన్నీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేసింది. తత్ఫలితంగా ఆతడి తల్లితో సహా ఎందరో స్త్రీలు గర్భ శోకాన్ని పొందారు, మరెందరో స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కోల్పోయారు. కోట్లల్లో పశు, మానవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కురుక్షేత్ర యుధ్ధం వలన ఇటు కౌరవులకు చేటు జరిగితే అటు పుత్ర పౌత్ర ప్రియజనాన్ని కోల్పోయిన పాండవులకూ రాజ్యం తప్ప దక్కిందేమీలేదు.
యుధ్ధంవల్ల జన, ధన, జనధన నష్టాలు అపారం కనుకనే యుధ్ధం అనివార్యం కాదు, ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కూడా కారాదు. యుధ్ధాలలో సాధారణంగా పురుషులే అధికంగా పాల్గొనడం జరుగుతుంది కనుక, వారు మరణించడం సంభవిస్తే వారి ఆప్తులకు అనగా వారపై ఆధారపడిన తల్లులకూ, భార్యాబిడ్డలకూ మిగిలేది భరింపరాని జీవితకాల శోకం మాత్రమే. యుధ్ధ కారణలు ఎటువంటి వైనప్పటికీ, ఎంత బలీయమైనవైనప్పటికి పర్యవసానం మాత్రం వినాశనమే అనడానికి కురుక్షేత్ర మహా సంగ్రామమే సాక్ష్యం.
*****సమాప్తం*****
సేకరణ: స్త్రీ పర్వంలో పొందుపరిచిన విషయములు, విశేషములూ 1) తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రచురించబడిన సంపూర్ణాంధ్ర మహాభారత గ్రంధమునుంచీ 2) అంతర్జాలమునుంచీ, సేకరించబడినవి.