‘రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.
***
[dropcap]రా[/dropcap]మాయణంలో దశరథుడు పుత్రశోకంతో మరణించటం, శ్రీరాముడు తండ్రి మాట జవదాటని వాడుగా, భార్యా వియోగాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన వాడిగా మనం విన్నాం. రఘవంశ చరిత్రలో వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలుగా పరాక్రమము, తేజోవంతము, వినయశీలము లతో పాటుగా పుత్ర ప్రేమ, సతీవియోగాలను కూడా వున్నాయని గమనించినప్పుడు జన్యుపర లక్షణాలు అని ఎందుకు చెబుతారో అర్థం అవుతుంది. దశరథుని తండ్రి మరియు శ్రీరామ చంద్రుడి తాత అయిన అజుడు తన తండ్రి పట్ల ఎంతో వినయ సంపన్నుడో, తండ్రి ఎడబాటుని సహించలేని వాడు, భార్యా వియోగాన్ని భరించలేని వాడని విన్నప్పుడు ఈ విషయాలు మనకు అర్థం అవుతాయి. అజుడి నుండి దశరధుడుకి, రాముడుకి ఈ లక్షణాలు అబ్బాయని అని ఆయన కథ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగించక మానదు. కానీ రాముడు అవతారు పురుషుడు కనుక ఆ రామ కథ ముందు ఇవన్నీ అంత ప్రాధాన్యత లేని అంశాలు. కానీ మనం ఓసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం.
***
విదర్భ రాజు భోజుడు, తన చెల్లి ఇందుమతికి వివాహం చేయ నిశ్చయించి స్వయంవరం ప్రకటించి దేశ విదేశీ యువరాజులందరిని ఆహ్వానించాడు.
ఈ సంగతి తెలిసి ఇందుమతి సిగ్గులమొగ్గే అయ్యింది. దేశాధి రాజకుమాలందరి గురించి తన ప్రియ సఖి సునంద ద్వారా తెలుసుకొని ఎప్పుడు స్వయంవరం ఉంటుందా ఎప్పుడు తన మనసుకు నచ్చే యువరాజును చూస్తానా అన్నట్లు ఎదురుచూస్తూ వుంటుంది.
అందరికీ ఆహ్వానాలందినట్లే ఇక్ష్వాకు రాకుమారుడైన అజ మహారాజుకూ ఆహ్వానం అందింది. ఇందుమతి గురించి విని ఉన్నవాడై ఆ స్వయంవరానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు, కానీ తీరా బయలుదేరి వెళ్లే సమయానికి మధ్యలో శత్రువులు దండెత్తి వచ్చారు.
అక్కడ ఇందుమతి స్వయంవరం రోజు రానే వచ్చింది. ఆమెని చేపట్టేందుకు దేశ విదేశీ రాకుమారులు విదర్భ రాజ్యం చేరుకుని సభా మండపానికేగి సుఖాశీనులై ఇందుమతి రాకకోసం ఎదురుచూస్తూ ఎవరికి వారే ఇందుమతిని తమనే వరిస్తుందని ధీమాతో వున్నారు.
సరిగ్గా ఆ సమయాన అజుడు శత్రువులను ఓడించి సభా మందిరానికి వెళ్ళాడు. అలసట నిండిన దేహం, అస్తవ్యస్తమైన దుస్తులు స్వయంవరానికి వచ్చిన యువరాజు తీసుకోవలసిన జాగ్రత్త ఇసుమంతైనా లేక తన ఆసనము మీద కూర్చుని వున్నవాడై ఇందుమతి ఒక్కొక్కరినే చూస్తూ రావటం గమనించాడు.
ఇందుమతి తన ప్రియ చెలికత్తె సునంద, ఒక్కొక్క యువరాజు వద్దకు రాగానే వారిని పరిచయం చేస్తూ ముందుకేగుతుండగా చేతిలో వరమాలతో ఆమెను అనుసరిస్తూ ఒక్కొక్క రాజుని మెలి ముసుగు నుండి చూస్తున్నదై నెమ్మదిగా సునందని అనుసరించి ముందుకు కదులుతుంది. యువరాణి తమని దాటిపోగానే వారి ముఖాలు కళావిహీనంగా అవుతున్నాయి.
ముందుగా మగధరాజుని, తర్వాత అంగదేశరాజు, అవంతినాథుడు, కార్తవీర్యార్జునడు ఇలా యువరాజులను పరిచయం చేస్తూ వుండగా ఆసక్తి లేనిదై తలొంచుకుని ముందుకు కదులు అన్నట్లుగా సూచన చేసింది. తర్వాత అజ మహారాజు వద్దకు రాగానే అతని వంశ చరిత్రను వర్ణిస్తూ రఘువంశమున జన్మించిన అతని తాత తొంబై తొమ్మిది యాగములు చేసి ఇంద్రుడికి అసూయ కలగకూడదని భావించి నూరవ యాగం మానుకొనినవాడని, అలాగే రఘు మహారాజు విశ్వజిత్ అనే యాగం చేసి ఐశ్వర్యం మొత్తం వ్యయపర్చి మట్టి పాత్రలతో అతిథులను గౌరవించిన ఆ కుల వంశ రాజసుతుడు.. కీర్తివంతుడు, యవ్వనవంతుడు, రూపము, వినయము, మంచి స్వభావము గూర్చి చెప్పుతూ ఇతను నీకు తగిన వాడిని సూచించినది.
అజ మహారాజుని చూసిన ఇందుమతి తన శరీరం రోమాంచిత మవ్వటం గమనించింది. అజుడు కూడా ఇందుమతి దగ్గరగా రాగానే మిగిలిన రాజులవలే ఈమె నన్ను వరించునా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయాన తన కుడి భుజం అందరటం గమనించి అప్పుడు స్థిమితపడినాడు.
సునంద ఇరువురి పరిస్థితి గమనించినదైనప్పటికీ మరి కాస్త ముందుకు వెళ్దామా అంటూ గుసగుసలాడింది. తన మానసిక పరిస్థితిని గమనించి ఆటలాడుతున్నదని గ్రహించినదై చిరుకోపం ప్రదర్శించి ఏమాత్రం తన కాళ్ళు ముందుకు కదలటంలేదన్నట్లు నిలబడి పోయింది.
సునంద నవ్వుతూ “ఇతనితో నీ వివాహం బంగారంలో పొదిగిన రత్నంలా వుంటుంది” అంటూ ఆమె హస్తాలను పైకి ఎత్తి వరమాలను అజ మహారాజు మెడలో అలంకరించేందుకు సహాయం చేసింది.
సభికులంతా హర్షధ్వనులతో ఆ జంటను మెచ్చుకున్నా, కొందరికి ఈ వివాహం కంటకంగానే మారింది.
***
ఇందుమతిని పరిణయమాడింది మొదలు ఎంతో అన్యోన్యంగా సాగింది వారి దాంపత్యం. అజ మహారాజ తండ్రి రాజ్యభారం అంతా కుమారుని అప్పగించి సన్యసించి వనవాసానికి పోదామనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసి అజుడు ఒప్పకోలేదు. అది వారి వంశంలో ఆచరిస్తున్న నియమం అని చెప్పినా తండ్రి వియోగము భరించనివాడై ప్రాధేయపడగా కుమారుని ప్రేమ వాత్యాల్యాలకు లొంగి సన్యాసించినప్పటికీ రాజ్యము వెలుపలనే వుంటూ వచ్చాడు. తర్వాత విశిష్ఠ మహర్షి ఆశీస్సులతో అజుడు రాజ్య భారము చేపట్టిన వాడై ప్రజలకు ఏ లోటు లేకుండా పరిపాలన సాగించి రఘుమహారాజుని మరపించాడు. మరికొంత కాలానికి తండ్రి వనవాసముకేగి ఆత్మత్యాగము చేసుకొన్నప్పుడు తండ్రి వియోగము భరించనివాడై వుండెను. ఎందరో తత్వజ్ఞుల ఉపదేశంతో క్రమంగా మనోవ్యథ నుండి శాంతి పొందాడు. తర్వాత తండ్రిని మించిన వాడుగా రాజ్యపాలన చేసి ప్రజల మన్ననలు పొందాడు.
అజ మహారాజుకి క్షితిజ అనే మరో భార్య, శరభుడుతో పాటు మరి కొందరు కుమారుడు వున్నారు. అయినా తన ప్రియ భార్య ఇందుమతి అన్న అతనికి మిక్కిలి ప్రేమ. ఆమె ఏకైక కుమారుడే దశరథుడు.
ప్రజా సంరక్షణలో ఏమాత్రం ఏమరుపాటు చూపని ఆ రాజు ఒకరోజు హాయిగా ఇందుమతితో కలిసి వనములో వ్యాహ్యాళికి వెళతాడు.
అదే సమయంలో దక్షిణ తీరం లోని గోకర్ణ క్షేత్రాన్ని అధిష్టించి పరమశివుని చెంత వీణాగానం చేయటానికై నారదుడు ఆకాశమార్గాన పయనించాడు. ఆ దేవముని వీణా శిరస్సు నందు అలంకరించి వున్న దివ్వె కుసుమమాల పరిమళాలు విరజిమ్ముతూ వుంది. ఆ వాసన మీద అభిలాషతో కాబోలు అతివేగంగా వీస్తూ వచ్చిన గాలి ఆ విరిదండను కాస్తా అపహరించుకుని పోయింది. అది నేరుగా వచ్చి ఇందుమతి ఎదపై పడింది. వెంటనే ఇందుమతితో పాటు అజుడు కూడా మూర్ఛిల్లిరి.
పరిజనుల ఆక్రందనలు, శుశ్రూషల మధ్య అజుడు మేలుకున్నాడు కానీ ఇందుమతి ప్రాణాలు వదిలింది. ఇది తెలిసి మహారాజు తల్లడిల్లాడు. పూలేమిటి ప్రాణాలు తీయటమేమిటి? అని పిచ్చివాడిగా రోదించాడు.
“పేరుకి క్షితిజ పతినే కానీ నిన్ను ఎంతగా ప్రేమించానో తెలియదా? నా పంచప్రాణాలు నీవే కదా? మనసులో కూడా నీకు ఎప్పుడూ అప్రియం చేసి ఎరుగను కదా?” అంటూ పరి పరి విధాల దుఃఖ పూరితుడై రోదిస్తూ వుండగా వశిష్ఠ మహర్షి వచ్చి ‘ఇందుమతి పూర్వజన్మమున హరిణి అనే దివ్యాంగన అని, తృణబిందుడు చేస్తున్న తపస్సు భంగపర్చటానికి ఇంద్రుడు పంపగా ఋషిశాపం వల్ల మనిషిగా పుట్టినదని, ఆమెకు ఈ సుర పుష్పమాల వల్ల విముక్తి లభించింద’ని ఊరడిస్తాడు.
అయినప్పటికీ ఇందుమతి వియోగాన్ని భరింపనివాడై ఎనిమిదేళ్ళు పాటు అతి కష్టం మీద పాలన సాగించి, తన కుమారుడు రాజ్యభారాన్ని అప్పగించి గంగాసరయూ నదీసంగమంలో దేహత్యాగం చేసుకుని స్వర్గంలో వున్న తన దేవేరిని చేరుకుంటాడు. ఈ వృత్తాంతం మంతా కాళిదాసు మహాకవి రమణీయమైన వర్ణలతో అద్భుతంగా చెబుతారు.
ఇక్కడ అజుడు తండ్రి ఎడబాటుని, భార్యావియోగాన్ని భరింలేనివాడుగా మనకు గోచరిస్తాడు. అవే లక్షణాలు ధశరథుడు పుత్రశోకంతో, రాముడు సతీ వియోగంతో తల్లడిల్లటం మనం ఎరుగుదుము. రఘు వంశీయులు యుద్ధ రంగంలో ఎంత పరాక్రమవంతులో కుటుంబ బాంధవ్యాల ముందు అంత సున్నిత హృదయం కలవారని అనిపించ మానదు.