అతనో పర్వర్టెడ్ అయితే నేనొక కోవర్ట్‌ని

3
3

[dropcap]చా[/dropcap]లా రోజుల తరువాత కన్నయ్య ఇంటి పట్టున పదిరోజులుంది. పిలాని నుండి గుర్గావ్‌కి మారింది. కాని “అమ్మా ఇంకా స్టూడెంట్‌గా ఉండాలనిపిస్తోంది” అంటోంది.

మేమిద్దరము షాపింగ్ నుండి వచ్చేటప్పుడు “అమ్మా నాకు పెళ్లి చేసేయమ్మా” అంది.

“ఏంటే ఆలోచన లేకుండా వాగుతున్నావ్ అప్పుడే పెళ్లి జంజాటం ఎందుకే నీకు? హాయిగా ఉండక” అన్నాను.

“నాకు తెలీదని అనుకొంటున్నావా నీ భయం?” అంది.

“ఏంటే మాట్లాడుతున్నావు?” అన్నా షాకింగా, నమ్మలేనట్లుగా తనను చూస్తూ.

“నాన్న ఎందుకు అలా చేసాడమ్మా?” అంది దిగులుగా. “నేను ఇక్కడ ఉండలేనమ్మా” అంది.

“అమ్మా నువ్వు చెప్పావని హాస్టల్లో చేరా. కాని నాకు సుతరాం ఇష్టం లేదు ఎప్పుడూ నిన్ను వదలివెళ్ళడం.. నీకు తెలుసు కదా అమ్మా హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్ అయిపోతే.. ఎంసెట్‌లో సీట్ రాదని.. నార్త్‌లో ఉద్యోగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు.

కాని నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అడిగారు నిన్ను ఇక్కడ చేర్చింది ఎవ్వరని. నేనన్నాను అమ్మని. ‘చాలా ఆశ్చర్యంగా ఉంది!!!!! ఇంట్లో చిన్నవాళ్ళ అల్లరి భరించలేక కొద్దిరోజులైనా ఉండని క్రమశిక్షణ అబ్బుతుందని చేర్పించే నాన్నలని.. చూసా. కాని ఇలా బంగారు బొమ్మలాంటి.. నిన్ను ఇక్కడ చేర్చిన అమ్మని ఇప్పుడే చూస్తున్నా’ అన్నారు.

అందరి మద్య ఉన్నా చాలా ఏడుపు వచ్చేది నిన్ను మిస్సయ్యానని.. ‘నువ్వు నా గారాలపట్టివి’ అంటూ నువ్వు చెప్పే కథలు, చెల్లెలితో.. నా ఆటలు అన్నీ బంద్ అయ్యాయి. దుఃఖంతో ఒకచోట మౌనంగా నాలో నేను ముడుచుకొని కూర్చునేదాన్ని.

అమ్మా ఆ రోజు ఫొన్లో దిగులుపడకురా కన్నయ్యా, నీ కోసమే నీ క్షేమం కోసం ఇలా చేసా, బాగా చదువుకో అన్నప్పుడు నీ కోసం పుస్తకం తీసి చదివా, నిన్ను సంతోషపెట్టాలని. నాన్న కోపంగా ‘ఏం.. ఎలా చదువుతున్నావ్, ఇక్కడ డబ్బులేమి చెట్లకు కాయట్లేదు, ఈ ఐఐటిలు అక్కర్లేదు ఆడపిల్లలకు అంటే మీ అమ్మ ఇన్లేదు కాని కనీసం సీటైనా తెచ్చుకు చావు’ అంటున్నపుడు నా గుండేమి పగల్లేదు. నాన్న కోపం నీ గారం నాకు అలవాటేగా.. అమ్మా. నువ్వు నా దగ్గర దాచినా నేను గమనించాను ఏం జరిగిందో” అంది.

నాకొక్క క్షణం అంతా గుర్తుకొచ్చింది.. ఆరోజు నాకింకా గుర్తుంది.. అమ్మనయ్యాను అనుకొన్నపుడు ఆనందంతో పొంగిపొయ్యా.

స్కానింగ్‌లో ‘ఆడపిల్ల’ అని చెప్పినపుడు మా అమ్మకి చెప్పి మురిసిపోయా. చందమామ వెన్నెలలాంటి బిడ్డ పుట్టిందని దాని చిన్నిచిన్ని పాదాలని చూసి పొంగిపోయా.. మా ఆయన కూడా ఎంతో భాగ్యంగా ఆ బిడ్డని అందుకొన్నప్పుడు దాని అదృష్టానికి ఆనందించా. మా ఇంట్లో భాగ్యంగా నా పుట్టింట్లో సౌభాగ్యంగా నా బిడ్డ పెరిగింది. అందరూ తనచుట్టూ ఎప్పుడూ అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్యా, జేజవ్వ అంటూ తను గారాలు పోయేది..

నా బిడ్దకి తొమ్మిది నెలలు నిండగానే నాకు ఎప్పుడో రాసిన గ్రూప్ – వన్‌లో ఒక పెద్ద కార్పోరేషన్‌లో పోస్టింగ్ వచ్చింది. ఇక మా కాపురం మారింది అక్కడకి. మా ఆయన అంతా నా బిడ్డ అదృష్టమంటూ దాన్ని ఊరంతా తన మోటార్ బండిలో తిప్పేటోడు. బజార్లోకి పొయ్యే పనిలేదు. ఒక గుడ్డ కావాలన్న ఏ సరుకు కావాలన్నా ఆయనే తెచ్చేటోడు. నా చేతిలో పైసా పెట్టెటోడు కాదు, నీకేం ఖర్చులంటూ. ఆటో చార్జి ఇచ్చెటోడు అత్యవసరమైనప్పుడు. మిగిలనప్పుడు ఆఫీస్ నుండి వెహికల్ ఎలాగో ఉందిగా..

నా శాలరీ పాస్‌బుక్, ఏటిఎం తన దగ్గరే. శాలరి ఒకటో తేదీనే మొత్తం డ్రా చేసేవాడు. పైనాన్స్.. రియల్ ఎస్టేట్ వీటివే ఇప్పుడు కాలమంటూ అందులో దిగాడు. మీరు బాగున్నారంటూ పుట్టింటోళ్ళ రాకపోక లాగిపొయ్యాయి చిన్నగా.

నా కడుపులో మరో బిడ్డ. అమ్మ మౌనంగా రెండు నెల్లు ఉంచుకొని సారెతో నన్ను మా ఆయన వస్తే ఆయన వెంట పంపించింది.. “మేము మీకు పెట్టేటోల్లమే కాని మీదగ్గర తినేటోల్లం కామంటూ????”

ఆయనకి ఎప్పుడు మా ద్యాసే. ఊరునుండి మా అత్తింటోళ్ళు వచ్చినా ‘ఒకపూటుండి వెళ్ళేటోళ్ళము మేము’ అని ఊరంతా బయళ్ళు తిరిగేటోళ్ళు. ఒక పని అందుకోరు కాకపోయినా బిడ్డని ఆడించమన్నా, బిడ్డల్ని నీ అత్తకు ఎత్తుకోను రాదులే అని మా మామ అనేటోడు. ఎవళ్ళో తరుముకొస్తున్నట్లు పది దినాలు అయ్యాక వెళ్ళిపొయ్యెటోళ్ళు.

ఎప్పుడైనా ఏదైనా లెక్క మా ఆయన్ని నేనడిగితే నేను తాగుతానా బయట ఎక్కడైనా తిరుగుతానా అని తప్పించుకొనేవాడు. అయ్యినా నీకు లెక్కలెందుకు మీకు కావాల్సినవ్వన్ని తెచ్చి పడేస్తున్నగా అనేవాడు. మా చుట్టుపక్కల ఇల్లాళ్ళు అనేవాళ్ళు నీవు చాలా అదృష్టవంతురాలివి.. చక్కటి పిల్లలు, చేతినిండా డబ్బులు, పెద్ద ఉద్యోగం, బంగారం లాంటి భర్త అంటూ పొగిడేవాళ్ళు.

ఆదివారం నాడు తీరికగా ఇంట్లో ఉన్నా కూడా చేతి నిండా పని.. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనుకొంటూ ఆ రోజు పిల్లలవి పట్టకుండాపోయినా బిగుతైపోయిన బట్టలని బయట పడేస్తున్నా.

పెద్దమ్మాయి స్నానం అయ్యిందేమోనని చూద్దామని కేకలెయ్యకుండా అటెళ్ళా. అక్కడ మా ఆయన తను స్నానం చేస్తుంటే తనని తలుపుకున్న కంతలో నుండి చూస్తూ..!!! ఒక్క క్షణం విబ్రాంతికి గురయ్యా. ఇదేమిటని ఆయన్ని అడిగితే పిల్లకి ఎలా స్నానం చేయాలో నేర్పుతున్నానని చెప్తూ నన్ను కేకలు వేస్తూ గది బయటకు నడిచాడు కోపంగా. టీనేజ్‌లో ఉన్న నా కూతురు మొహం ఆ రోజంతా చూడలేకపోయా!!! అతనో పనికిమాలినవాడు. కన్న ప్రతి ఆడది తల్లి కాలేదు, పెంచినా మొగోడు తండ్రి కాదు.

తన మేలు కోరి ఎక్కడో దూరంగా చేర్పించా. ఇప్పుడు చిన్నదాన్ని గుండెలపై పెంచుతున్నా. నేను నిర్ణయించుకొన్నా నా పిల్లలకి నేనే గార్డ్ నని ఎప్పటికి.

నాకనిపించింది అతనొక పర్వర్టెడ్ అయితే నేనొక కోవర్ట్‌నని!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here