[జయంతీ, అవధాని తాగుతూ మాట్లాడుకుంటుంటారు. తన తండ్రికి తాను బంగారు మొలతాడు చేయించి పట్టుకుని వెళ్తే, ఆయన ఏమన్నారో జయంతికి చెబుతాడు అవధాని. తాను తప్పుడు దారిలో నడిచినా తన తండ్రి మాత్రం ఎంతో నిజాయితీగా ఉండేవారని అంటాడు. తన అక్రమ సంపాదన వల్ల జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అని భయపడతాడు అవధాని. అప్పుడు చెడు మార్గంలో నడుస్తున్న తమలాంటి వాళ్ళ గురించి వివరిస్తాడు జయంతి. ఋజువులు దొరక్క న్యాయస్థానాలు తమని వదిలేసినా, సమాజం వదలదని అంటాడు. తనని బయటపడేయమని అడుగుతూ వెళ్ళిపోతాడు అవధాని. తెల్లవారాకా, శారదని పలకరించి బయటకి వెళ్తాడు జయంతి. అలా వెళ్ళినవాడు శివరాం ఇంటికి వెళ్తాడు. తమ వ్యాపారాల గురించి శివరాంతో మాట్లాడుతాడు. ఇక చదవండి.]
[dropcap]“మ[/dropcap]న మిషనరీ నాల్గు రోజులలో వస్తున్నది” అన్నాడు శివరాం.
“అలానే” అని కారు దగ్గిరికి నడిచాడు.
అప్పుడు రవి గుర్తుకొచ్చాడు.
‘రామాయణాన్ని వదలలేదు మహానుభావుడు’ అని నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసాడు.
క్లబ్బు మలుపు తిరుగుతుండగా సికిందర్ ఎదురయి ఆపాడు. కారు దిగి వెళ్లి “మూడు దినాలుగా నీ కోసం చూస్తున్నా” అని వాటేసుకున్నాడు.
“క్లబ్బులో కూర్చుందాం పద” అని కారు లోనికి మలిపాడు.
సికిందర్‌లో ఉత్చాహం కనిపించలేదు. ఏదో సమస్య అతన్ని బాధిస్తున్నట్లు అనిపించింది.
ఆపదలోనే కదా స్నేహితుని అవసరం. అందుకే అతనితో కూర్చునేందుకు వచ్చాడు. కూర్చున్న తరువాత సికిందర్ ఇంట్లో ఉన్న మొత్తం సొమ్ముతో లేచిపోయిన కన్న కూతురు ‘మీరా’ను గురించి చెప్పుకొని బావురుమన్నాడు.
ఏంటో డబ్బు కొద్దో గొప్పో ఊరటను కూడా ఇవ్వలేదనిపిస్తుంది. ఉన్న డబ్బంతా దేన్నీ ఆపలేని స్థితి. ఇవేవీ లేనప్పుడు మాత్రం అంతా అదే అనిపిస్తుంది. దాని ధైర్యంతోనే ఎట్లెట్లనో ప్రవర్తించుతారు.
సికిందర్‌ను ఓదార్చాడు. ఓదార్పు మనిషికి ఊరట కలిస్తుంది.
“భయ్యా నల్గురిలో తల ఎత్తుకొని తిరగ లేకపోతున్నాను. సిగ్గుగా ఉంది. చావడం మంచిదనిపిస్తున్నది. బ్రతుకంతా పిల్లదాన్ని ‘రాణి’ లాగా ఉంచాలని తెగబడి సంపాదించాను. ఇది నన్ను పరాయి వాణ్ణిగానో పగవానిగానో చేసి ఉడాయించాక, అసలు నేను బ్రతుకంతా చేసిన శ్రమ ఎందుకు? బ్రతుకెందుకు? తల పని చేయడం లేదు.” అని మళ్లా కంట తడి పెట్టుకున్నాడు. ఈ ఆవేదన అంత త్వరగా తీరేది కాదు.
ఎన్నో ఆశలతో పెంచిన కన్న బిడ్డ, ప్రాణంలా చూసుకున్న వారిని కాదని పోవడంతో కల్గిన shock ఇది.
“ఇదిగో సికిందర్, వయ్ససుతో పాటు ఇంగితం ఎదగక చిన్నవాళ్లు చేసే పనులిలాగే ఉంటాయి. నిగ్రహంగా మనం వ్యవహరించి పనిని అనుకూలంగా మల్చుకోగలగాలి, బెంబేలు పడితే ఏం వస్తుంది. ఇంకా దిగజారిపోవడం, అయోమయాన పడడం తప్ప.
నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ చక్కబడతాయి” అని “పుష్ప బెహిన్ ఎలా ఉంది. నువ్వే ఇలా ఉంటే కన్నబిడ్డ కనిపడకపోవడంతో ఆవిడ ఇంకెలాగుంటారో? నువ్వు పద నేను ఇంటికి వస్తా” అని లేచాడు. కారు స్టార్ట్ చేసాడు.
కారు నడుపుతున్నాడే తప్ప సికిందర్ స్థితి జాలి అనిపించింది. ఒక్కతే కూతురు ‘మీరా’. అపురూపంగా సాదుకున్నాడు. కని పెంచిన వాళ్లకు ‘మీరా’ ఇలా చేయడం అంత బాగా అనిపించలేదు. ఆ పిల్లే తిరిగి రాకుంటే సికిందర్‌కు వారసుడెవరు?
సికిందర్ గురతులో మెదిలాడు.
ఆర్కియాలజికల్ డిపార్టమెంటులో హెడ్ డ్రాఫ్ట్‌మన్‌గా అయిదారు సంవత్సరాలు పని చేసాక ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
ఒక సంవత్సరం ఊర్కే ఉండి చిన్న బొమ్మల వ్యాపారం ప్రారంభించాడు.
దేశ దేశాల నుంచి అందమైన అరుదైన బొమ్మల్ని తెప్పించి అమ్మేవాడు.
ఈ దేశ సంస్కృతికి సంబంధించిన బొమ్మల్ని వేదేశాలకు పంపేవాడు.
No1 గా వ్యాపారం చేసాడు కానీ..
ఆడిట్‌లో ఎప్పుడూ నష్టమే చూపించేవాడు.
అయినా ఇప్పటికీ అతను చేస్తున్న వ్యాపారమదే.
సికిందర్ భార్య పుష్ప రూపసే కాక చాలా మంచిది. భక్తి ఎక్కువ. మాటాడితే తప్ప మాట్లాడే స్వభావం కాదు. ఏదో ఒకటి రెండు కుటుంబాలతో మినహా వాళ్లతోనే రాకపోకలూ, పండుగలూ పబ్బాలూ. వీరి ఏకైక సంతానం ‘మీరా’. ఆ తరువాత వీరికి సంతు కల్గలేదు. అందుకు ఆ దంపతులు బాధపడ్డదీ లేదు. ‘మీరా’ను చాలా బాగా పెంచారు. B.Sc దాకా చదివించారు. ఫస్టు క్లాసులో పాసయ్యింది. ఓ ఇంజనీరు కుర్రాణ్ణి ప్రేమించింది. వీరిద్దరి కులాలూ ఒక్కటి కాదు. ప్రేమించినతన్నే రిజిష్టరు పెళ్లి చేసుకుంది. అతనితోనే ఉంటుందిప్పుడు.
ఇలా మీరా వెళ్లిపోతుందని ఉహించని సికిందర్ దంపతులకు జరిగిన పరిణామం గుండె ఆగేంత పని చేసింది. బాధపడ్డారు. బిడ్డ కావాలని ఆరాటపడ్డారు. మీరా భర్తతో ఇంటికి రావడాన్ని ఇష్టపడనూ లేకపోయారు.
ఇది ఇట్టా ఉంటే..
సికిందర్ దుకాణం, సంపాదనా, నరుడికి అర్థం కానటువంటిది.
ఈ ఉన్నతి సికిందర్‌కు ఎలా సాధ్యమైందన్నది ప్రశ్నార్థకమే.
జరిగిందేమంటే ఇతను పని చేసింది చారిత్రక పరిశోధనా శాఖ గదా!
ఆది శంకరులు, బౌద్ధ, జైన ఆరామాలను శైవం పేరిట దక్షణాది నుంచి వశం చేస్తూ వచ్చాడు పూర్వం. ఆరామాలూ, వాటి వాస్తూ, స్తంభాలలో వారు పొదిగిన వజ్రవైఢూర్యాలు. బంగారు నాణాలు క్షుణ్ణంగా అవగతమైన తరువాత ఏదో ఆలోచన అతని మనస్సున మెదిలి చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
ఇతనికి ఆరామాలు ఎక్కడెక్కడున్నాయో తెల్సు. వాటి వాస్తూ ఎక్కడైనా ఒక్కటేననీ తెల్సు.
ప్రభుత్వం వారు ఇంకా కాలూనేదాకా వెళ్లవీలునేని ఆరామాలూ తెల్సు. కనుక ఆ నాలుగు మ్యాపులనీ భద్రపరిచాడు.
మార్కాపురం అడవిలో ఒక పెద్ద ఆరామం ఉంది.
దాని పారు కోసం యాత్రలాగా బయలుదేరి వెతికాడు.
నాలుగోనాడు అతని మ్యాపు ప్రకారం ఓ దిబ్బ కనిపించిది. అది గుట్ట కాదు కాదు. కాకుంటే చెట్టు చేమా పెరిగి శిధిలాలపై అడవిలాగానే కనిపించుతున్నది. ఆర్కియాలజీలో అనుభవం ఉంటేనే గాని ఇది దొరకదు.
ఇంతలో వర్షాకాలం ప్రారంభమైంది.
అంటే ప్రభుత్వం వారు రెండు మూడు నెలలు తవ్వకాలు, పరిశోధనా జనరల్‌గా అపుతారు. వాళ్ల తిరిగి ఫీల్డు వర్కకు రావాలంటే నవంబరు గడవాల్సిందే.
ఆ తరువాత ఒకనాడు ఒంటరిగా వెళ్లి దిబ్బను బాగా అవగాహన చేసుకొని.. లైన్సు గీసుకున్నాడు. ఇద్దరు బావమరుదులతో మాత్రమే వెళ్లి తవ్వకం ప్రారంభించాడు.
సికిందర్ కష్టం ఫలించడానికి ఇరవై ఆరు రోజులు పట్టింది.
ఎవరైనా పొరపాటున కనిపించి అడిగితే ‘పరశువేది’ కోసం వెతుకుతున్నామన్నీ, ఆ పరిశోధనలో కొన్ని కొత్త రకం మొక్కలు దొరుకుతున్నాయనీ, అవి వైద్యం కోసం అద్భుతంగా ఉపయోగపడేవని చెప్పేవాడు. కొన్న రకాల వేళ్లనూ మొక్కలనూ కల్సిన వాళ్లకి చూపుతుండేవాడు.
పూర్వీకులు దాచిన వజ్రవైఢూర్యాలు, బంగారం దొరికింది.
అది దొరికినప్పుడే ఒక బావమరిది రక్తం కక్కుకొని చనిపోయాడు. ఆ చావడం కూడా భయంకరంగా అరుస్తూ పరుగెత్తి లోయలో పడిపోయాడు. ఆ దృశ్యం కళ్లలో మెరిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్రిందపడ్డ మనిషి, ముక్కలుగా చీలి చాలా చాలా దూరంగా ఎగిరిపోయాడు.
అయితే దీన్ని ప్రత్యక్షంగా చూసిన రెండో బావమర్దికి నోట మాట పోయింది. అతనికి నయం చేసేందుకు పెద్ద పెద్ద డాక్టర్లను కలిసాడు. ఇతను మాత్రం బజార్లెంట అరుస్తూ పరిగెడుతుండేవాడు. అతన్ని పట్టుకొని ఇంటికి తీసుకొని రావడమూ ఓ పట్టాన కుదిరేదికాదు. ఏది దొరికితే దాన్ని విసురుతూ మీదకి వచ్చేవాడు. చివరకు మెంటల్ ఆసుపత్రికి చేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు సికిందర్. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. అంతకు ముందే వస్తున్న రైలుకు ఎదురుగా పరుగెత్తి తగిలి ముక్కలైపోయాడు.
సికిందర్ అత్తగారింట ఈ ఇద్దరూ పోవడంతో నిర్వేదం కలిగింది. వారు ఎంతో కాలం ఆ తరువాత బ్రతకలేదు.
వాళ్లు పోయాక వారిల్లూ, ఆస్తిపాస్తులు కూడా పుష్పకే సంక్రమించినయి.
వాటిని అమ్మేసిన తరువాత కొట్టు ప్రారంభించాడు సికిందర్.
ఆ డబ్బు ఆసరా తోనే వ్యాపారం చేస్తున్నాడని లోకులు అనుకునేవారు.
అతను అందకుండా ఎదిగిపోతుంటే అదృష్టజాతకుడు, పట్టుకుంటే బంగారమే మౌతున్నది అనుకున్నారు.
అతి తక్కువ కాలంలో ఆ టౌన్‌లో ఓ బిజినెస్ మ్యాగ్నెట్‌గా ఎదిగాడు.
బొమ్మల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారమూ తోడు చేసాడు.
బొమ్మల వ్యాపారం పేరిట ఇక్కడ దొరికిన అమూల్యమైన వస్తువులనూ వజ్రాలనూ దేశ విదేశాలకు చేర్చుతుండేవాడు. దాంతో ఊహించనంత పైకం పోగైంది. దానితో పాటు ఫ్లాట్స్ కట్టే వ్యాపారమూ ప్రారంభించాడు, ఓ ఇంజనీరును పార్ట్‌నరుగా చేసుకొని.
ఇప్పుడు సికిందర్‌కు ఇండియాలో ఉన్న ప్రతి అనువైన సిటీలో స్వంత ఇళ్ళు ఉన్నయి.
అతను చేసింది దానంగా, అతను మాటాడింది వేదంగా వ్యాపారంలో నిలిచాడు.
చౌరస్తాలో లైను దొరక్కపోవడంతో కారుకు బ్రేక్ వేసాడు.
అప్పుడు గాని సికందర్ దయ్యం జయంతి మెదడును వదలలేదు.
సికిందర్ ఇంటికే మలిపాడు.
బెహన్‌తో అనునయంగా మాటాడి ఓదార్చాడు.
పట్టుదలలు మానుకొని బిడ్డనూ అల్లుడ్నీ ఇంటికి రమ్మనమని, అది వాళ్లకు సంతోషాన్నిస్తుందనీ, వాళ్ల సంతోషం కన్నా మీకు కావాల్సిందేముందనీ అన్నాడు. ఆవిడ ఇంకా ఏదో చెప్పబోతే వారించి “అదే బెహన్ వాళ్లు తప్పేమీ చేయలేదు. ఒకర్నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు నౌకరీ చేసుకుంటున్నారు. చిలకా గోరింకలా కాపురం చేసుకుంటున్నారు. వారికున్న విచారమంతా మీ గురించే. కని పెంచిన వాళ్లకు మనస్తాపం పోగొట్టాలనే. కాలం మారింది. మారుతూనే ఉంటుంది. మార్పుని మనం అంగీకరించినా అంగీకరించకున్నా ఆగదు. మనం వేసే ఆనకట్ట ఆ వరద తాకిడికి నిలవదు. నేను పిల్చుకొని వస్తాను. భేషజాలకు పోవద్దు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. బిడ్డ సుఖం కంటే తల్లిదండ్రులకు ఏం కావాలి?” అని నచ్చ చెప్పి సికిందర్‌ని తల ఊపేలా చేసి కారెక్కాడు.
కారు జనరల్ హాస్పటల్ దాపుకు చేరింది. అక్కడేం గుర్తులోకొచ్చిందో లోపలికి మలిపాడు. కారు దిగి రిసెప్షన్ వైపు మళ్ళి, దగ్గర కెళ్లి “I want Dr. Pande, M.D.” అని అడిగాడు.
ఉన్నాడని చెప్పి దోవ చూపింది.
డా. పాండే కనిపించగానే సాదరంగా లేచి ఎదురొచ్చి జయంతిని లోనికి తీసుకెళ్లాడు.
మంచి కాఫీ త్రాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. చివరన ‘భద్ర’ ఎలా ఉన్నాడని అనడిగాడు.
“He is all right. త్వరలో పూర్తిగా కోలుకుంటాడు. Fast progress కనిపిస్తున్నది” అన్నాడు.
“మీరు బాధ్యత తీసుకన్నాకే నాకు ధైర్యంగా ఉంది. ఇక వెళ్తాను” అని లేచాడు.
డా. పాండే కారు దాకా వచ్చి సాగనంపాడు జయంతిని.
అక్కడ కదిలిన కారు శంకర శాస్రి ఇంటి ముందాగింది. ఇల్లు చాలా పాతది. కాని విశాలంగా శుభ్రంగా ఉంది. నడిమి హాలులో వాలు కుర్చీన పట్టు వస్త్రాలు ధరించి విభూతి రేఖలు పెట్టుకొని అదిశంకరునిలా కనిపించాడు. ఆ ప్రక్కన సిరిచాపల పైన పది పన్నెండు మంది బ్రాహ్మలు పిచ్చాపాటీలో ఉన్నారు.
జయంతి రాకను గమనించిన శంకర శాస్త్రి ఎదురొచ్చి లోనికి తీసుకుకెళ్లాడు.
“ఊరక రారు మహానుభావులు” అన్నాడు కూర్చున్న తరువాత జయంతితో.
“ఊరికే రాకూడదంటారు” అని నవ్వాడు జయంతి.
“అలా మిమ్మల్ని అనగలనా?”
అన్నదాని అర్థమేమిటా అని నవ్వి “మీకు గత వారంలో వచ్చిన పెళ్లిళ్ళు ఎన్ని” అడిగాడు.
కాగితాలు చూసి “మూడు వందల నలభై ఒక్కటి” అన్నాడు.
“పూర్తి చేయాల్సినవి?”
“నూటా ఆరు.”
“కాన్సిల్ అయినవి ఇందులో ఉన్నవా?”
“లేవు. నాల్గు ఆగినవి.”
“ఎందుకు?”
“ముగ్గురు పెళ్లి పిల్లలు పారిపాయారు. ఒకటి అకాల మరణం.”
“నే చెప్పినది పూర్తయిందా?”
“ఇవ్వాళ చేసి చెపుదామనుకున్నాను.”
“చల్ల కదలకుండా కూర్చున్నాక చాలా గుర్తు రావు. ఎన్ని పస్తుల తరువాత భోంచేసే వాడివో ఒక్కసారి వెనక్కి చూసుకో..”
“అదేం లేదు, మాట పూర్తి చేస్తాను.”
“రాజన్ వస్తాడు, అతడి వెంట వెళ్లు. పొరపాటు పూనరావృతం కాకుడదు” అని నవ్వుతూ లేచి కారు దగ్గరకొచ్చి కారెక్కాడు. కారు కదిలింది. కింగ్ దర్బార్ హోటలు దగ్గర శాలిని కనిపించింది. ప్రక్కనే ఆపి “ఎటు?” అనడిగాడు.
“ఇంటికే”
“రా”
ఎక్కి కూర్చుంది Thanks అంటూ.
“ఇంత చిన్న విషయానికి thanks చెప్పాలా?”
“నన్ను మీరు ఇంకా మరచిపోనందుకు” అంది నవ్వి.
“శాలినీ, నాకు నీనుంచి కావాల్సిన పని కాలేదు. దానికి నువ్వు చెప్పిన సమాధానం న్యాయంగానే ఉంది. అయితే నువ్వు న్యాయంగా ఈ సమాజాన మనగలవా?” అని కళ్ళలోకి సూటిగా చూసి, “నాకు ఏ నియమమూ లేదు. వ్యాపారిని. అవసరాన్ని బట్టి ఖరీదు మారుతుందే తప్ప కొనగలను. ఇక నా పద్ధతిన ఏ తప్పు జరిగినా దానికో శిక్ష ఉంటుంది. ఇంతెందుకు? నా శరీర భాగాలలో అలాటిదేం జరిగినా ఊర్కోలేను. ఇక నువు చేయలేని దానికి నీ తండ్రి ఇవాళ నుంచీ నీకు కనిపించడు” అన్నాడు..
(ఇంకా ఉంది)