[dropcap]గు[/dropcap]రజాడ జీవిత సాహిత్యాలను కె.వి.ఆర్. రాక్షస పరిశ్రమ చేసి ‘మహోదయం’ పేరుతో వివరించకుండా ఉంటే మనకు గురజాడ గురించి ఇన్ని వివరాలు, విశేషాలు తెలిసేవి కావు. అలాగే ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, డా. ఏటుకూరి ప్రసాద్ కన్యాశుల్కం నాటకం మీద ఎందరెందరో విమర్శకులు రాసిన విమర్శా వ్యాసాలను సేకరించి ‘కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం’ అనే వేయి పుటల గ్రంథాన్ని తయారు చేశారు (విశాలాంధ్ర ప్రచురణ). ఈ బృహత్గ్రంథం వెనుక సంపాదకుల అనన్య సామాన్యమైన పరిశోధన, కృషి ఉన్నాయి.
వీటన్నిటి కంటే ముందే బండి గోపాలరెడ్డి (బంగొరె) మొదటి కన్యాశుల్కం నాటకం ముద్రిత ప్రతి సంపాదించి అందులో ప్రస్తావనకు వచ్చే అనేక విషయాలను పరిశోధించి, వివరంగా నోట్సుతో 1969లోనే ప్రచురించాడు. గురజాడ మీద పరిశోధనలో ఇదొక మైలురాయి.
గురజాడ అప్పారావు 150వ జయంతిని పురస్కరించుకుని మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మన్నం రాయుడు గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటాన్ని ప్రచురించ సంకల్పించి, గురజాడ మీద విశేషంగా కృషి చేసిన పెన్నేపల్లి గోపాలకృష్ణను ఆ కార్యానికి పూనుకోమని అభ్యర్థించారు. సీనియర్ జర్నలిస్టు, గ్రంథ రచయితగా పేరున్న గోపాలకృష్ణ ఈ కృషిలో నన్ను కూడా భాగస్వామిని చేశారు.
గురజాడ ఏ రచనైనా, మొదట ప్రచురించబడిన పాఠాన్ని ప్రమాణంగా గ్రహించాము. గురజాడ మొదటి కన్యాశుల్కం ప్రతులు (1897) మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య పరిశోధనాలయం – మేన్యుస్క్రిప్ట్ లైబ్రరీ లోను, హైదరాబాదు స్టేట్ ఆర్కైవ్సులోనూ లభ్యమయ్యాయి గాని, అస్థిపంజరం వంటి తన నాటకాన్ని గురజాడ పెంచి, వన్నెలు, చిన్నెలు చేర్చి కళాఖండంగా తీర్చిదిద్దిన రెండవ కన్యాశుల్యం (1907) ప్రతి మాకు ఎంత ప్రయత్నం చేసినా లభించలేదు. చివరకు డా. మన్నం రాయుడు గారి అబ్బాయి చిరంజీవి ‘జెన్’ ఆ గ్రంథాన్ని లండన్‍లో సేకరించి పంపించాడు. గురజాడ సమగ్ర రచనల సంపుటం ‘గురుజాడలు’ అచ్చు ప్రతిని బహుకరించడానికి నెల్లూరులో మా ఇంటికి మూడిళ్ళ అవతల కాపురముండే సీనియర్ న్యాయవాది, వామపక్ష భావజాల అభిమాని, సాహిత్య ప్రియులు వేములపాటి అనంతరామయ్య గారింటికి వెళ్ళాను. వారి చేతుల్లో ‘గురుజాడలు’ ఉంచగానే, ఆయన టేబుల్ సొరుగులోంచి తీసి కన్యాశుల్కం 1909 ప్రతి నాకు చూపించారు. వ్యక్తుల వద్ద అరుదైన పుస్తకాలు ఉండవచ్చు గాని, పరిశోధకులకు, అవసరమైన వారికి మాత్రం అందుబాటులో ఉండవు.
ఒక పుస్తకం గురజాడ చదివి ఉంటారా, లేదా అని మాకు సందేహం కలిగినపుడు, విజయనగరంలో ‘చాసో’ గారి కమార్తె కుమారి తులసి గురజాడ లైబ్రరీ ముద్ర ఉన్న ఆ పుస్తకం ముఖ చిత్రాన్ని జెరాక్సు చేయించి, విజయనగరం మిత్రులు ఎన్.కె. బాబు ద్వారా మాకు పంపించారు.
గురజాడ దినచర్య రాతప్రతుల పుటలు విడిపోయి, అటు ఇటు కలిసిపోయాయి. మేము హైదరాబాదు స్టేట్ ఆర్కైవ్సులో స్కాన్ చేయించి తెచ్చుకొన్న దినచర్య పుటలను మా బుద్ధికి తట్టినట్టు క్రమపద్ధతిలో వరుసక్రమంలో ఏర్పరిచి ముద్రించాము. గురజాడ తండ్రి మరణానికి సంబంధించిన వార్త ఉన్న పుటలు, అవసరాల, సెట్టి ఈశ్వరరావు గార్లు అనువాదం చేసిన పుటలతో ‘గురుజాడలు’లోని క్రమాన్ని పోల్చి ఈ విషయాన్ని గమనించవచ్చు.
గురజాడ అప్పారావు వైద్యం కోసం 1896లో ఆరు నెలలు మద్రాసులో విశ్రాంతిగా ఉండేట్లు ఆనందగజపతి మహారాజు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గురజాడ ఎన్నెన్నో గ్రంథాలయాలకు వెళ్ళి చదివిన పుస్తకాల జాబితా దినచర్యలో రాసుకొన్నారు. ఆ జాబితాలో అమెరికన్ short story పితామహుడు Nathaniel Hawthorne పేరును గమనించి, హాథార్న్ రచించిన ‘Rappaccini’s Daughter’ కథ చదివినపుడు, ఈ కథా సంవిధానానికి గురజాడ ‘Stooping to Rise’ కథకు (అవసరాల ఈ కథను ‘సంస్కర్త హృదయ’ పేరుతో అనువదించాడు, గురజాడ ఇంగ్లీషు కథ ఏమయిందో ఎవరూ చెప్పరు) పోలికలున్నట్లు నా బుద్ధికి తట్టింది. ఈ కథ మధ్యయుగాలలో జరిగినట్టు హాథార్న్ చిత్రించాడు. రెపాచిని అనే వైద్యుడు ప్రాణంతకమైన విషపు మొక్కను తన తోటలో నాటి, దాన్ని తన కుమార్తె బియాట్రిస్ చేత ప్రవర్ధనం చేయిస్తాడు. ఈ క్రమంలో బియాట్రిస్ విషకన్యగా మారిపోతుంది. హాథార్న్ భారతీయ సాహిత్యంలో వచ్చే విషకన్య పాత్రను కూడా ఈ కథలో ప్రస్తావిస్తాడు. బియాట్రిస్‌కి పరిచయమైన ఆమెను ప్రేమించిన యువకుడు కూడా చివరికి విషకన్యలాగా మారిపోతాడు. డాక్టర్ రెపాచిని చేసిన ప్రయోగం ఇది.
గురజాడ అప్పారావు హాథార్న్ కథలోని ‘ప్రయోగం’ అంశాన్ని మాత్రం స్వీకరించి, వేశ్యలు సమాజానికి చీడపురుగులని, వేశ్యల మీద వ్యతిరేకతలో ఉద్యమం స్థాయిలో ఉపన్యాసాలిస్తున్న ‘సంస్కర్త’, కాలేజీ అధ్యాపకుడి పైన ఆయన విద్యార్థే ఒక ప్రయోగం చేస్తాడు. ఆదర్శాలు వల్లిస్తున్న ప్రొఫెసరు వాస్తవ జీవితంలో అందమైన యువతి, వేశ్య పరిచయమైతే, ఆమె ఆకర్షణకు లొంగుతాడా లొంగడా అని తేల్చుకోవాలనుకొని సరళ అనే సుందరిని, వేశ్యను, అతని మీదకు ప్రయోగిస్తాడు. సరళ ఆకర్షణ ముందు మన ప్రొఫెసరు కరిగి నీరు కారిపోతాడు. అతని దౌర్బల్యం బహిర్గతమవుతుంది. రెండు కథల్లో పాత్రలకు, సంఘటనలకు దగ్గర పోలికలుంటాయి. అయితే రచనోద్దేశాలు వేరు వేరు.
గురజాడ తాను వ్యక్తపరచదలచుకొన్న అభ్యుదయకర, సంస్కరణ భావజాలాన్ని వివరించేందుకు ఎక్కడ్నించో ఏదో ఒక కథను ఎంచుకొని పూర్తిగా తను ప్రతిపాదించదలచుకొన్న భావజాలానికి అనుగుణంగా దాన్ని మలచుకొంటాడు. ఇదేమీ కొత్త కాదు. మహాకవి కాళిదాసు శాకుంతలం నాటకానికి మూల కథ మహాభారతంలోనే ఉంది. అయితే కాళిదాసు దూర్వాస మహర్షి శాప వృత్తాంతం అంగుళీయకాన్ని కొలనులోని చేప మింగడం వంటి మార్పులు చేర్పులు చేసి అభిజ్ఞాన శాకుంతలాన్ని మహాకావ్యంగా, ప్రపంచ సాహిత్యంలో ఆణిముత్యంగా తీర్చిదిద్దాడు. షేక్‌స్పియర్ నాటకాలకు మూలాలైన కథలున్నాయి. ఈ మాటలే చెప్పినందుకు స్వర్గీయ రామతీర్థ గురజాడ అభిమానుల కోపానికి గురి కావల్సి వచ్చింది.
‘లవణరాజు కల’ వాల్మీకి రచనగా చెప్పబడుతున్న ‘యోగవాశిష్ఠం’ లోంచి గురజాడ స్వీకరించి తన భావాలకు అనుగుణంగా చిత్రించారు. లవణరాజు కల కథాగేయం నాకు ఎంతో ఇష్టమైన కవిత.
లవణరాజు నిండు కొలువులో ఉండగా ఐంద్రాజాలికుడొకడు తన గారడీతో ఒక దివ్యాశ్వాన్ని అప్పటికప్పుడు సృష్టించి రాజును దాన్ని స్వారీ చేసి పరీక్షించమంటాడు. క్షణకాలం రాజు నిర్ఘాంతపోయి, ఆ అశ్వాన్నే చూస్తూ ఉండి, తేరుకొని నలుదెసల కలయ జూసి, మెలమెల్లగా పూర్వ జ్ఞానం హృదయంలో జాగృతమై
“ఐంద్రజాలికుడేడి? ఏది అశ్వం? ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి” అని తన భృత్యులతో అంటాడు. “ప్రభూ, ఏడు నిమిషాలే అయింది” అంటారు భృత్యులు.
రాజు బుద్ధి బలంలో ‘ కలదు లేదను రెండు భ్రాంతుల/కలయగూర్చుకు బుద్ది బలమున/కాలమహిమకు వెరగుజెందుచు’ భృత్యులతో అంటాడు.
‘ఏడు నిమిషము లేడులాయెనొ?
యేడు నిమిషములందు యిమిడెనొ
యేడులెన్నో? యింతలంతలు
చింత చేయునొకో!’ అని అంటాడు.
ఒక నరపతి మాయ గుర్రాన్ని ఎక్కెనట. వెంటనే అది ఎగసిపోయి విపరీతమైన వేగంతో మహారణ్యాలు, మరుభూములు దాటుకొని ‘మట్టి చనె, సంసృతిని జీవం బట్లు’ అంటూ మనిషి బ్రతుకులో జీవితంలాగా అని గురజాడ ఒక పోలిక చెప్పి ఆ అశ్వం వెళ్తున్న ప్రయాణాన్ని వివరించారు. చీకట్లు ముసురుకొనే వేళ ఆ అశ్వం ఒక గున్న వనం మధ్యలో పరుగుతీస్తోంది. గుర్రం వేగం కాస్త మందగించగానే ఆ రాజు చెట్టును అల్లుకొన్న ఒక తీగను పట్టుకొని గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఆ ఆశ్వం మాత్రం పూర్వం మాదిరే దౌడు తీస్తూ వెళ్ళిపోయింది.
రాజు నేల మీద వాలి చచ్చిపోయిన వాడిలాగా ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోయాడు. ఎంత సేపో అట్లా నిదుర పోయి, ఏదో జన్మాంతరంలో మాదిరి కళ్ళు తెరిచి చూస్తె, సంజె కెంజాయ కాంతుల్లో ఎదురుగా ఏదో వింత లోకం వెలిసింది. అస్తమిస్తున్న సూర్యుడి కాంతిలో ఆకాశంలో మబ్బుల అంచులన్నీ ఎర్రగా రత్నకాంతిని సంతరించుకొన్నాయి. పక్షుల గుంపులు తమ గూళ్లకు ఎగిరిఫొతున్నాయి, కొమ్మల గుబుర్లులలో కూర్చుని కోయిలలు ఒకదాన్నొకటి పలకరించుకొంటున్నాయి. పిట్టలు చెట్ల గూళ్ళలో కిచకిచలాడుతూ మాట్లాడుకొంటున్నాయి. పగలు గిరసలు తొక్కుతూ గగన రాజ్యాన్ని ఏలడానికి చంద్రుడప్పుడే బయలుదేరాడు.
తూర్పు కొండల్లో తాడివనములు గొడుగులు పట్టినట్లున్నాయి. జీలుగు చెట్ల కొమ్మలు చామరాలు వీస్తున్నట్లనిపిస్తున్నాయి. ఆకాశంలో దూరంగా నక్షత్రాల సమూహాలు మెలమెల్లగా ప్రత్యక్షమవుతున్నాయి. అలలు అలలుగా చల్లగాలులు వీస్తుంటే చెట్ల కొమ్మల నుంచి పువ్వులు జల్లులు జల్లులుగా నేలమీద రాలుతున్నాయి. ఈ దృశ్యం అప్పుడే నిదుర మేల్కొన్న రాజు హృదయాన్ని సంతోషపెట్టింది గాని, బడబాగ్ని లాగా కడుపులో ఆకలొక్కటే బాధిస్తోంది.
అప్పుడే వింతగానం తనకు మెలమెల్లగా వినిపిస్తూ దగ్గరవుతూంటే, ఏవో పూర్వ జన్మల జ్ఞాపకాలు తనను పిలుస్తున్నట్లు అనిపించింది రాజుకు. ఆకలీ, తను పడ్డ కష్టాలూ అన్నీ మరచి రాజు గానం సలాపాలానికి రాగా, పాడుతూ వస్తోన్న నల్లని యువతిని చూచాడు. ఆమె ముంగురులు బేదరి గాలికి ఆదుతున్నట్లున్నాయి. ఆమె అరమోడ్పు కన్నులతో నిర్మానుష్యమైన ఆ దారిలో నిర్భయంగా బింకంగా, సొగసుగా నడిచిపోతోంది.
కూటి కడవను భుజం మీద వాటంగా పెట్టుకొని కులుకుల నడకతో కాస్త గర్వం ముఖంలో తొణికిసలాడుతుంటే ఆ సుందరి చెట్లు చేమలు వినడానికి పాడుతున్నట్లు పాడుకొంటూ ఆ దారిన వెళ్తోంది. ఆమె పాడుతున్న పాటలో ఎవరు పేరు ధన్యమయిందో గాని, లవణుడను మాట రాజు చెవికి సోకినట్లనిపించింది..
‘మంచివలె నిది మాయమగు నని’ బాధలన్నీ మరచి, సంశయాన్ని విడిచిపెట్టి ఆమె వెంత వెళ్ళి, “ఓ కిన్నరీ, నీకు దైవం సకల శుభాలు చేకూర్చుగాక! నిన్నటి నుంచి ఆహారం లేక ఒక వంక బాధ, అంతకన్నా మీచ్మిన మరొక ‘వింత ఆకలి’ మనసును బాధిస్తుంటే, నీ వెంట వస్తున్నా!” అన్నాడు రాజు ఆ శ్యామ సుందరితో. ఆ మాట విని కన్య ఒక్కసారి విప్పారిన నేత్రాలతో వెనక్కి తిరిగి రాజు వంక చూచింది. ఆ చూపులో – రాజుకు మొత్తం విశ్వసామ్రాజ్యానికి చక్రవర్తైనంత అద్భుత భావం కలిగిందట.
ఆ కిన్నెర రాజు వంక ఒక చూపు చూసి మళ్ళీ కళ్ళు దించుకుని, ఏదో ఆలోచనతో నడిచిపోతోంది. ఆమె బింకం, ఆ పాటా అన్నీ ముగిసిపోయాయి. కలువ వనంపై పండు వెన్నెల కురుస్తున సమయంలో ఒక మబ్బు కమ్మిన నీడలాగా కళావిహీనమైన ఆమె ముఖంలో ఏదో వ్యాకులపాటు అలముకొన్నది.
“ఆకొన్నవారికి అన్నం పెట్టడం పెద్ద పుణ్యకార్యమని వినలేదా? నీ రూపానికి దాసుణ్ణయ్యాను, ఓ సుందరీ, నీ దాసుణ్ణవుతాను. మృత్యు ముఖంలో ఉన్న నాకు అన్నం పెట్టవా?” అంటూ రాజు ఆమె వెంట నడిచాడు.
“చన్న బ్రతుకుల కొలిచి కుడిచిన
తెన్ను మనసుకు కొంత తోచెడి;
నిన్న యన్నదె, నేడు రేపులు
అన్యు నెట్లగుదున్?
మౌనమూనిన, మరల గలనని
మది దలంపకు”
అని రాజు ఆమెతో అంటాడు. ఆమె కాస్త నడక వేగాన్ని తగ్గిస్తూ, తలవంచుకొని రాజుతో –
“గొప్ప దేహకాంతితో, కన్నుల పండువుగా రత్నకాంతితో ఉన్న నీవు నా మీద ఆశ పడుతున్నావు. అయ్యో! నేను మాలెతనయ్యా” అన్నది.
“మా అయ్య కోసం కూడు తీసుకొని పోతున్నా. నీకు పెట్టలేనని చెప్పడానికి హృదయం వ్రయ్యలవుతోంది. ఇంతే సౌభాగ్యం!” అన్నది.
ఆమె మాటలు విషపు బల్లెం గుండెల్లో గ్రుచ్చుకొన్నట్లై, రాజు హృదయాన్ని ముక్కలు చేసింది. ఆమె కళ్ళల్లో కమ్ముకొన్న కన్నీళ్లను చూచేటప్పటికి రాజుకు దుఃఖం కలిగింది. కొన్ని క్షణాల్లో మనసులో తను కన్నవి, విన్నవి ధర్మాలన్నీ వితర్కించుకుని ‘పరమధర్మాన్ని అపుడు కనుగొని’ మలిన వృత్తులలో ఉన్నవారిని మాలవారని ఒక దేశంలో కొందరు బలవంతులు వెలివేశారు. ‘మలినమే మాల’.
కులము లేదట వొక్క వేటున
పసరముల హింసించు వారికి;
కులము కలదట నరుల వ్రేచెడి
క్రూర కర్ములకున్.
మలినదేహుల మాల లనుచును,
మలినచిత్తుల కధిక కులముల
నెల వొసంగిన వర్ణధర్మమ
ధర్మ ధర్మంబే!
అని రాజుకు ఆత్మలో స్ఫురిస్తుంది. అప్పుడు కన్నియకు రాజు ఎదురు నిలిచి అంటాడు – “అజ్ఞానుల మాటలకు వగవద్దు.
మంచి చెడ్డలు మనుజు లందున,
యెంచి చూడగ, రెండె కులములు;
మంచి యన్నది, మాలయైతే,
మాల నే అగుదున్!
నీ తెలివంతా స్ఫురింపజేసే తేటకన్నులు, సౌందర్యాన్ని వ్యక్తం చేసే ముద్దు మోమూ, కిన్నెర వన్నెలు కూడా నేర్వని నీ గాన మాధురి, ఎంత అందమైన చిత్రాల్లో కూడా చూడని నీ అపూర్వ సౌందర్యం, సౌష్టవ, మాటల్లో నేర్పు నన్ను ఆకర్షించాయి. తమలో లేని లోపాలున్నాయని తమను మాలలనుకొనేవారి మందబుద్ధికి వగచాలే తప్ప లేని కొరతలున్నాయని వగవడం ఎందుకు? భయాన్ని విడిచి నా మాటలు విశ్వసించు. కూడు పెట్టి సపత్నులు లేని నా హృదయ సామ్రాజ్యాన్ని చేపట్టు!” అన్నాడు.
కళ్ళల్లో సిగ్గు, ఆశ్చర్యం రెండు భావాలు వ్యక్తం అవుతూంటే, కళ్ళు తెరిచి చూస్తూ, కళ్ళు దించుతూ ఆ యువతి రాజుతో ఇట్లా అన్నది.
తాను ‘మాలెత’నని,
“తండ్రి కోసము తెచ్చు కూటిని
తిండికై యొరు కెట్టు లిత్తును?
పెండ్లియాడిన- పెనిమిటొకనికి
పెట్ట ధర్మంబౌ!
ఆలస్యం అవుతోంది, నా తండ్రి నా కోసం యెదురు చూస్తూంటాడు” అంటూ లవణరాజును తప్పుకొని వెళ్ళే ప్రయత్నంలో ఉందని గ్రహించి
అతడు ఆమె చేయి పట్టుకొని ‘యురంబు యురమున జేర్చి, కురులు లాలిస్తుంటే’ తాళవనంలో చంద్రుడు ఫక్కున నవ్వాడట!
“ఆడబోయిన తీర్థం ఎదురైట్లు, వేడబోయిన వరం లభించినట్లు” పెండ్లి యాడెద చంద్రు సాక్షిగ పెట్టు కూడ”న్నాడు లవణరాజు.
ఇంతలో అక్కడికి ‘మాలెత’ తండ్రి ‘వచ్చితివ అల్లుడు’ అంటూ, “నీ కోసం ఇంతకాలం వేచి వున్నాను. నా ప్రాణమైన కూతుర్ని చేపట్టు” అంటాడు.
“ఎక్కడ్నుంచో వచ్చాము, ఇహ లోకం విడిచి వెళ్ళాలన్న ఇచ్ఛ మనములో ఉన్నా నా బిడ్డ పసిడి గొలుసులతో కట్టి పడేసింది. ఇది ముక్తికాంత తుదకు నీకిది ముందుగతి చూపుతుంది. కోటి తపముల పుణ్యఫలం ఈ కన్య. దీన్ని స్వీకరించు” అంటూ ఆమెను లవణరాజు చేతుల్లో పెడతాడు.
తర్వాత భాగంలో గురజాడ ఆ వృద్ధిని ద్వారా అతని కథ చెప్పిస్తాడు. తన వారి చేత మలిన వృత్తులు మాన్పించి, ఈ వనంతానికి తీసుకొని వచ్చి, అహింసా మార్గంలో పాడి పంటలతో జీవనం గడిపేట్లు అతడు పాటు పడతాడు.
“కాని మనుజుని బుద్ది లోపల
కలవు, తన మే లొరుల కీడును
తలచు వృత్తులు; కానబోయిన
కలచు నెవ్వారిన్.”
అంటూ తనతో వచ్చిన సమూహానికి మంచి నడవడి నేర్పుతాడు. తన అల్లుడికి, కూతురికి ‘ఒరుల మేలు ఎల్లప్పుడూ పాటుపడమ’ని హితవు చెప్తాడు.
గురజాడ ‘మాలెత’ తండ్రిని ‘పండు గెడ్డము, కన్నులలో శాంతరసం, పలుకుల్లో గాంభీర్యం, దేహంలో దివ్యతేజస్సు’తో రాజర్షి లాగా తోచినట్లు వర్ణిస్తాడు.
లవణరాజు భార్యతో అక్కడే స్వర్గసౌఖ్యాలనుభవిస్తూ, చక్రవర్తుల వంటి కుమారులను కని కొంత కాలం ఉంటాడు. మామ నివృత్తి మార్గంలో, యోగంతో దేహాన్ని విడిచిపెడతాడు. తర్వాత ఆ పల్లెలో అనైకమత్యం, దొమ్మిలాటలు, సాగు మీద ధ్యాస తగ్గి, ఉన్నదెల్ల తిని, చివరకు పశుసంపదను చంపి తిని చెట్టుకొకరు పుట్టకొకరవుతారా పల్లీయులు.
ఆ పరిస్థితుల్లో లవణరాజు దంపతులు పిల్లలని విధికి వదిలి, అగ్నిప్రవేశం చేస్తారు.
లవణరాజు స్వప్నగాథ వివరిస్తుంటే ‘కలగ వలదిది మాయ సర్వం’ అని ఆస్థానంలో శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. అప్పుడు లవణుడంటాడు:
“కలగ వలదట! కల్ల యిది యట!
కలిగి నది లేదన్న యంతనె
తొలగునట వేధల్!”
“పుస్తకంబులలోని మాటలు
విస్తరించుచు, ననుభవమ్ముల
తత్వమెరగక, శుకములగుదురు
వొట్టి శాస్త్రజ్ఞుల్!”
“యెప్పటికి అనుభూత నెద్దియొ
అప్పటికి యది నిక్కువంబే-
యెప్పుడో లోకంబు కల్లగు
ననుట యిపుడెట్లో?”
అని తన అనుభవం వాస్తవమేనంటూ, హృదయంలో మండే ఖేదాన్నిచ్చే తలపులను వివరించే ప్రాజ్ఞులే లేరా అని అంటూ శోకభారాన్ని మానుకొను శక్యం కాక, చింతామగ్నుడై కళ్ళు మూసుకొంటాడు.
అప్పుడు దుర్గ ద్వార ప్రాంతంలో ఏదో కలకలం రేగుతుంది. ఒక ద్వారపాలకుడు లవణరాజు వద్దకు వచ్చి “ఒక ముని, వారువంపై వొక కన్య ద్వార సీమ వద్ద నిలిచి ఉన్నారు” అని కబురు తెస్తాడు. వెంటనే వాళ్ళను ప్రవేశపెట్టమంటాడు రాజు.
ఆస్థానంలోకి అప్సర వంటి రూపంలో ఒక కన్య, ఉత్తమాశ్వం, ఒక తాపసుడూ ప్రవేశించారు. తాపసుడు రాజును ఆశీర్వదిస్తూ “సింధు దేశాధిపతి, యవనుడు – మీ తండ్రి గారి సఖుడూ తన గారాల పట్టిని కానుకగా పంపాడు. ఈయమ వినయ విద్యా సద్గుణాన్విత, నీ గుణ సంపదను ఇష్టపడి నీకీ సుందరిని కానుకగా పంపించాదు. అరుదైన ఈ అశ్వరాజాన్ని కూడా నీ కోసం పంపాడు” ముని మాటలు ముగించే లోపలే లవణుడు ఆ కన్యను చూడగానే అతని ఆత్మలో విస్మయ, హర్షాతిరేకాలు పెనగొన్నాయి. “వచ్చితివ నా ప్రాణసఖి” యని, “ఆమెను గద్దియన్ చేర్చెన్” అంటాడు (ఆమెను తన సింహాసనం మీద చేర్చుకొన్నాడు).
జీవితం భ్రాంతి, స్వప్న సదృశ్యం అని యోగవాశిష్ఠం ప్రతిపాదిస్తుంది. ఆ కథనే తీసుకొని గురజాడ పూర్తిగా అందుకు భిన్నంగా స్వప్నానుభవమైనా భౌతిక సంబంధమైనదే గనక, వాస్తవమేనని లవణరాజు కథాగేయంలో ప్రతిపాదిస్తాడు.
యోగవాశిష్ఠంలో ఆకలితో అలమటిస్తున్న రాజుకు కన్పించిన మాలెత ఘోరాకృతిలో, రాక్షసిలాగా అతనికి అనిపిస్తుంది. కేవలం క్షుదార్తిని బాపుకోడానికి ఆ కథలో విధి లేని పరిస్థితిలో ఆమెతో వివాహానికి అంగీకరిస్తాడు. ఒక మామూలు పౌరాణిక కథను గురజాడ గొప్ప ప్రణయ కావ్యంగా, అస్పృస్యతను నిరసించేందుకు కూడా ఉపయోగించాడు. జీవితం క్షణభంగురం, అశాశ్వతం అన్న తత్త్వాన్ని తిరస్కరిస్తూ జీవితంమీద ప్రేమ కలిగిస్తాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు కె.వి. నరసింహం 1937 ప్రాంతాల్లో రాసిన వ్యాసంలో వారు లవణరాజు కల తత్వాన్ని గొప్పగా విశ్లేషించారు. ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాను.
లవణరాజు కల గేయం సినిమా స్క్రిప్టులాగా అనిపిస్తుంది. క్లోజప్‍లో బిడియం, ఆశ్చర్యం లోగొన్న మాలెత ముఖాన్ని, అందులో కనిపించె భావాన్ని వివరిస్తాడు. ప్రకృతిని సందర్భోచితంగా మానవీకరిస్తూ, లవణరాజు, మాలెతల కదలికలను కూడా వర్ణిస్తూ, వారి కలయికకు అనుకూలమైన ప్రకృతిని వర్ణన చేస్తాడు. చదివిన ప్రతిసారి ఈ కవిత నన్నెందుకో ఆలోచింపజేస్తుంది.