చీకటి కోణం
[dropcap]న[/dropcap]మ్రత మొట్ట మొదటి సారిగా, ఒంటరిగా, దిగులుగా మహానగరంలోకి అడుగు పెట్టింది.
ఆమెకు ఎవరూ లేరు. తల్లి మొన్ననే చనిపోయింది. తండ్రి ఉన్నా లేనట్లే. ఆయన్ను ఇంతవరకూ తను చూలేదు. తల్లి చనిపోయాక ఇప్పుడా తండ్రి కాని తండ్రిని వెతుక్కుంటూ ఈ మహా నగరంలోకి అడుగు పెట్టింది.
స్టేషన్ నుంచి బయటకొచ్చి ఈ సరి కొత్త ప్రపంచం వంక ఇంతలేసి కళ్లతో వింతగా చూస్తోంది. ఈ రోడ్లూ, పరుగిడుతున్న బస్సులూ, కార్లూ, మనుషులూ, వాళ్ల వేషభాషలూ అన్నీ కొత్తగానే ఉన్నాయి. తూర్పూ, పడమరా ఎటో తెలియని ఈ మహా నగరంలో ఎటు వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కావటం లేదు. లేడి పిల్లలా బెదురు చూపులు చూస్తూ, భయం భయంగా నడుస్తున్న ఆ అమ్మాయికి అంతరాంతరాలలో ఎక్కడో ఏ మూలో కొంత ధీమా ఉంది. ఏదో ఒక రోజున ఈ నగరంలో తనూ గొప్ప వ్యక్తిలా గుర్తింపు తెచ్చుకొని అందరి మన్ననలూ పొందగలనని. తల్లి ఆకాంక్ష అదే.
భయాన్ని కప్పిపుచ్చుకొని, చెదిరిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకొని సువిశాలమైన రోడ్ల మీద నడుస్తోంది. ఒక చేతిలో సూట్‌కేసూ, రెండో చేత్తో భుజానికి తగిలించుకున్న హ్యండ్ బ్యాగ్ ఉంది. ఆ హ్యాండ్ బ్యాగ్‌లో తల్లి రాసిచ్చిన లెటరుంది. అదొక్కటే ఇప్పుడు తనకున్న ఆస్తి, సర్వస్వం. దానితోనే తండ్రిని కల్సుకోవాలి. ఆయన తనను చేరదీస్తాడో లేదో తెలియదు. ఆయన నువ్వేవరో నాకు తెలియదు పొమ్మంటే, ఏం చేయాలి – అన్న ప్రశ్న గుర్తుకు వస్తే చాలు, ఆవేశం బుసలు కొడుతోంది. అలాంటి పరిస్థితి ఎదురైతే, తను మౌనంగా తలవంచుకొని వెళ్లిపోకూడదు. ఎదిరించాలి. బెదిరించాలి. పోరాడాలి.
తను అక్రమ సంతానం కావచ్చు. కానీ తనను పోషించాల్సిన బాధ్యత ఆయనకుంది. తల్లి అమాయకురాలు. అన్నింటికీ తన తలరాత ఇంతే అని తలొంచుకొని బతికే మనిషి. తను అలా కాదు. అన్యాయాన్ని ఎదిరించి, తన హక్కులు సాధించుకుంటుంది. పోరాటం తప్పదు. ఆయన గొప్పవాడు కావచ్చు. ఆయనే తన తండ్రి అని రూజువు చేయగల ఆధారాలు లేకపోవచ్చు. కాని అంతరాత్మ ఉంది గదా.
నుడుస్తుంటే ఒక హోటలు కనిపించింది. రూం తీసుకొని, స్నానం చేసి, ఉన్నంతలో మంచి డ్రెస్ వేసుకొని – తండ్రిని వెతికేందుకు బయల్దేరాలి. హోటల్లోకి వెళ్లి సింగిల్ రూం అడిగితే, వెయ్యి రూపాయలకు తక్కువ లేదన్నాడు. బయటకొచ్చింది. నడుస్తోంది.
చేతిలో సూట్‌కేస్ బరువుగా అనిపిస్తోంది. చెయ్యి నెప్పి పుడుతోంది. రెండో చెయ్యి హ్యాండ్ బ్యాగ్ లోని తల్లి రాసిన ఉత్తరాన్ని తడుముతోంది. అది ఉందా లేదా అని అయిదు నిముషాలకొకసారి చెక్ చేసుకుంటోంది.
అక్రమ సంతానం. అక్రమ తల్లి ఉండొచ్చు. అక్రమ తండ్రి ఉండొచ్చు. అక్రమ సంతానం ఎలా ఉంటారు? అక్రమాలు చేసేది వాళ్లు గదా. పిల్లల తప్పు ఏముంది? తల్లి తండ్రీ చేసే తప్పులకు పిల్లల్ని అక్రమ సంతానంగా ముద్ర వేయటం ఎంత వరకు భావ్యం? ఇదంతా నమ్రత తరుచూ పడే మథనం.
తండ్రి నీవెవరో నాకు తెలియదు ఫో – అంటాడు. తను ఘర్షణ పడుతుంది. తిడుతుంది. అరుస్తుంది.. అప్పుడాయన బయటకు గెంటేస్తాడు. తరువాత ఏం చేయాలి? తల్చుకున్న కొద్దీ కన్నీరు పొంగుతోంది. తల్లి పోయినప్పటి నుంచీ, ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ల నుంచీ బాధ స్రవిస్తూనే ఉంది.
ఇంకో హోటలు కనిపించింది. అది బాగా లేదు. కానీ చౌక, అందులో రూం తీసుకుంది. వయసులో ఉన్న ఆడపిల్ల ఒక్కతే రూం తీసుకోవటం హోటలు వాళ్లకు అదోలా అనిపించింది.
బడలిక తీర్చుకునేందుకు, మొహంలో ఏడుపు కనిపించకుండా ఉండేందుకు – స్నానం చేసి, డ్రెస్ వేసుకుని, రూంలో నుంచి బయటపడింది. చెయ్యి హ్యాండ్ బ్యాగ్ లోని లెటరును తడుముతోంది.
చాలా సేపు వెతికి చివరకు ఆయన ఆఫీసుకు చేరుకుంది. రెండు, మూడు అంచెల తరువాత ఆయన రూం దగ్గరకు వెళ్లగలిగింది. భార్గవ రూంలో లేడు. మీటింగ్‌కు వెళ్లాడు. రూం ముందు నేమ్ ప్లేట్ మీద ఆయన పేరు హోదా రాసి ఉన్నాయి. ఆ వాతావరణం చూస్తే ఆయన ఉన్నత స్థితిలో ఉన్నారని అర్థమవుతోంది. మనిషి ఎంత ఉన్నత స్థాయికి చేరినా చేసిన పాపపుణ్యాలు వెంటాడక మానవు. ఇంకా సేపట్లో ఈయన గొప్పదనం ఏమిటో, ఈయన చరిత్రలో ఎలాంటి చీకటి కోణాలున్నాయో, ఇక్కడున్న వాళ్లందరికీ తను తెలియజేస్తుంది. ఆయన పరువు తీయబోతోంది.
తన తల్లికీ, ఆయనకీ వివాహం అయిందా లేదా, అన్నది కాదు ప్రశ్న. వివాహం చేసుకోక పోగా తల్లినీ, తననూ గాలికి వదిలేసి, ఏమీ ఎరగనట్లు ఇక్కడింత నిశ్చింతగా బతకడం ద్రోహం కాదా?
‘నువ్వెవరో నాకు తెలియదు ఫో’ అంటాడు. ఆయన నుంచి వచ్చే సమాధానం అదే. తన తల్లి ఉండగానే ఈ సమస్య పరిష్కరించుకుంటే, బావుండేది. అప్పట్లో అమ్మ ఆయన నుంచి దూరంగా ఉండాలని కోరుకుంది.
భార్గవ మీటింగు నుంచి వచ్చాడు. ఆయనతో పాటే మరో ఇద్దరు ఆఫీసర్లూ వచ్చారు. వాళ్లు రూంలో మరో అరగంట సేపు ఉన్నారు.
వాళ్లు వెళ్లాక నమ్రతకు ఆయన గదిలోకి ప్రవేశించే అవకాశం దొరకింది. భార్గవ తల వంచుకుని పని చేసుకుంటూనే “ఎవరూ?” అని అడిగాడు.
“నా పేరు నమ్రత” అన్నదామె. అప్పటికే గుండెల్లో ఆవేశం రగులుతోంది. కన్న తండ్రి తనను ‘నువ్వెవరూ?’ అని అడుగుతున్నాడు.
అంతకన్నా దయనీయమైన పరిస్థితి మరొకటి ఉంటుందా?
తన పేరు చెప్పినా ఆయన గుర్తు పట్టలేదు. అంతా తను అనుకున్నట్లే జరుగుతోంది.
“ఏం కావాలి?” అని అడిగాడు ఫైల్సు చదువుకుంటూ.
“మీతో పర్సనల్‌గా మాట్లాడాలి..” అన్నది.
“ఇరవై నిముషాలు ఆగు. బిజిగా ఉన్నాను..”
“ఇప్పటికే ఇరవై సంవత్సరాలు ఆగాను. ఇంకా ఆగమంటున్నారు” అన్నది నమ్రత.
ఆయన తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. “వాడ్డూ యూ మీన్?”
“నేను సుకన్య కూతుర్ని. నా పేరు నమ్రత. సుకన్యను మీరు మర్చిపోయి ఉంటారు. ఆమె ఎవరో కూడా చెబుతాను. దాదాపు ఇరవై ఏళ్ల కిందట మీరు ప్రేమించి, ప్రణయావేశంలో ముంచెత్తి, తల్లిని చేసి, ఆమె ఖర్మకు ఆమెను వదిలేసి వెళ్లారు గదా.. ఆ సుకన్య కూతుర్ని..”
భార్గవ నిశ్చేష్టుడైనాడు. ఆమె వంకే తదేకంగా చూశాడు. కుర్చీలో నుంచి లేచి నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఆమెను సమీపించాడు.
“నువ్వు సుకన్య కూతురివా? నా కన్న కూతురివా? ఎన్నాళ్లకు నిన్ను చూడగలిగాను? నువ్వు ఒక్కదానివే వచ్చావేల? మీ అమ్మ రాలేదా?” అని అడిగాడు ఆప్యాయంగా తల నిమురుతూ.
“అమ్మ రాలేనంత దూరం వెళ్లిపోయింది. ఇంక కనిపించదు” అంటున్న నమ్రతకు తల్లి గుర్తొచ్చి దుఃఖం పొంగిపొర్లింది.
“సుకన్య పోయిందా?” అంటున్నప్పుడు ఆయన గొంతులోని జీర మనసులోని బాధను వ్యక్తం చేసింది.
“నేను సుకన్య కూతుర్నే అనటానికి మా అమ్మ మీకు రాసిన ఈ లేఖ సాక్ష్యం” అంటూ నమ్రత హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఆ లెటర్ తీసి ఆయనకు ఇచ్చింది.
“భార్గవ గారికి – మీరు ఎంత దూరాన ఉన్నా మీ విషయాలు తెల్సుకుంటూనే ఉన్నాను. మన ఆస్తిపాస్తులు ఎంత దూరాన ఉన్నా వాటి గురిచి తెలుసుకుంటూనే ఉంటాం గదా. అలాగే అయిన వాళ్ల గురించీనూ. ఇరవై ఏళ్ల కిందట మిమ్మల్నే నమ్ముకుని, మీరే సర్వస్వం అనుకుని, అందర్నీ వదిలేసుకున్నాను. ప్రేమ మైకంలో ఉండి ఇంకేమీ ఆలోచించలేకపోయాను. మీ కౌగిట్లో చేరి ప్రపంచంతో సంబంధం లేకుండా బతకగలనని అనుకున్నాను. కల్సి జీవించటంలో ఉన్న ఆనందం, సంతృప్తి ఎంత గొప్పవో ఆ కొద్ది కాలంలో తెల్సుకున్నాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. మీరు మీ వాళ్లను ఎదిరించి నన్ను భార్యగా స్వీకరించాలనుకున్నారు. మీ నిజాయితీని శంకించలేకపోయానా, చివరకు పరిస్థితులు ప్రభావానికి లొంగిపోక తప్పలేదు. మనిద్దరిదీ చెరో దోవ అయింది. డబ్బు పంపిస్తాననీ, రహస్యంగానైనా సాయం చేస్తుంటాననీ అన్నారు. అది నాకు ఇష్టం లేదు. లోకాన్ని ఎదిరించి అయినా ప్రేమించుకుని, ఆలుమగలుగా బ్రతకటంలో అర్థం ఉంది. విడివిడిగా జీవిస్తూ, రహస్యంగా ప్రేమించుకోవటం – మనల్ని మనం వంచించుకుంటూ లోకం దృష్టిలో గౌరవంగా బ్రతకాలనుకోవడం నాకు నచ్చలేదు. అందుకనే మిమ్మల్ని కల్సుకునే ప్రయత్నం చేయలేదు. పిల్లను గురించిన వివారాలూ తెలియనివ్వలేదు. మగవాడి అండ లేకుండానే స్వయంకృషితోనే నా కూతుర్ని ప్రయోజికురాలిని చేయాలన్న తపన, ఆరాటం ఉండేవి. అవే ఇంతకాలం నేను ఒంటరిగా బ్రతికేందుకు తగిన ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. అలా జరిగితే మనుషులంతా దేవుళ్లూ అయిపోయే వాళ్లు. నయం కాని రోగం నన్ను రోజు రోజుకూ కృంగదీసింది. శరీరం కృశించిపోతున్నా నా కూతుర్ని నేనే పెంచి పెద్ద చేయాలన్న పట్టుదల సడలలేదు. ఇంతకాలం ఆ పట్టుదలతోనే ఉన్నా, వ్వాధి నన్ను శారీరకంగానూ, మానసికంగానూ దుర్భరురాలిని చేసింది. మానవ రూపాల్లో నరరూప రాక్షసులు తిరిగే ఈ లోకంలో పిల్లను ఒంటరిదాన్ని చేసిపోతున్నానన్న భయం, బాధ ఆవరించి, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో మీకీ ఉత్తరం రాస్తున్నాను. పిల్లను పెంచి ప్రయోజకురాలిని చేసే విషయంలో నాకు ఎంత బాధ్యత ఉందో, మీకూ అంతే బాధ్యత ఉంది – సుకన్య .”
ఆ ఉత్తరం చదివి భార్గవ క్షణకాలం కళ్లు మూసుకున్నాడు. ఇంత సేపూ నమ్రత ఆయన ఎదురుగా నిలబడే ఉంది. ఆమెను కుర్చోమన్నాడు. స్వయంగా మంచి నీళ్లు అందించాడు. కాఫీ తెప్పించాడు.
“నేను మీ అమ్మను దూరం చేసుకున్నందుకు, ఇన్నాళ్లూ నీ గురించి పట్టించుకోనందుకు నా మీద నీకు కోపం ఉండటం సహజమే. ఇటు ప్రేమించిన అమ్మాయిని, అటు తల్లిదండ్రులనీ ఎవరినీ ఒప్పించలేక అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయాను. సుకన్య కొంచెం ఓపిక పడితే, ఒకింత సహనం చూపితే, పరిస్థితులు మరో రకంగా ఉండేవి. మీ అమ్మకు కోపం, మొండి పట్టుదల ఎక్కువ. లౌక్యం తెలియదు. పట్టువిడుపులు అసలే లేవు. ఆదర్శాలూ, సిద్ధాంతాలూ చెప్పటానికి బాగానే ఉంటాయి. కొన్ని సార్లు రాజీపడక తప్పదు. ఇంటికి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బరువు బాధ్యతలున్నాయి. వాళ్లు సహజంగానే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్లను ఒప్పించి నా దారికి మళ్లించుకునేందుకు కొంచెం టైం పడుతుందని అన్నాను. ఆ మాత్రం దానికే పౌరుషానికి పోయి, తెగతెంపులు చేసుకుంది. బతిమిలాడే కొద్దీ విసిరి కొట్టింది. జన్మలో మళ్లీ తన మొహం చూడొద్దని శాసిచింది. జీవితం అంటే, అడుగడుగునా పరిస్థితులతో రాజీ పడటమేనన్న పరమ సత్యాన్ని తెల్సుకోలేకపోయంది. కోరి కష్టాలను కొనితెచ్చుకుంది. నాకూ ఆరని దావాగ్నిని మిగిల్చింది. ఇప్పుటికైనా నిన్ను నా దగ్గరకు పంపించింది. ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను.. భోం చేశావా అమ్మా..” అని ఆయన అడిగినప్పుడు నమ్రతకు ఆకలి గుర్తుకొచ్చి లేదని తలూపింది.
“ఇద్దరం కల్సి భోం చేద్దాం. రా..” అంటూ కారియర్ విప్పాడు. ముద్దలు కలిపి నోటికి అందిస్తూంటే, తండ్రి ప్రేమను తొలిసారిగా రుచి చూస్తున్న ఆనందంతో నమ్రతకు ముద్ద దిగటం లేదు.
ఏం చదువుకుంటున్నదీ అడిగాడు. కూతురు తెలివి తేటలు తెల్సుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేశాడు.
నమ్రత ఇంతకు ముందు ఊహించుకున్న దానికీ, ఇప్పడు చూస్తున్న దానికీ పోలికే లేదు.
“అందరికీ తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిస్తారు. కొండంత అండగా నిలబడతారు నాకు..” అని ఏదో చెప్పబోయింది.
“జరిగిపోయిన దాని గురించి బాధపడకు. ఈ క్షణం నుంచీ నీ బాధ్యత నాది. నీవు ఎంత వరకు చదువుకుంటావో, అంత వరకు చదువుకో. డబ్బు గురించి దిగులు పడొద్దు. నేనున్నాను..”
“కానీ నన్ను ఎక్కడుంచుతారు?”
“నువ్వు ఎక్కడ ఉంటానంటే అక్కడ ఉంచుతాను.”
“నేను మీ కూతుర్ని. మీ ఇంట్లో ఉండాలని నాకు ఉంటుంది.”
“నా ఇంట్లోనే ఉందువుగాని..”
“మీ భార్యా పిల్లలు, అందుకు ఒప్పుకుంటారా?”
“ఇంతవరకూ వాళ్లెవరూ నా మాట కాదనలేదు. అక్కడే మీ అమ్మకీ, శాంతికీ తేడా. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లి, నిన్ను పరిచయం చేసి, నాతో పాటే ఉంటుందని అంటే, వాళ్లెవరూ ఎదురు చెప్పరు. సిద్ధాంతాల రాద్ధాంతాలు లేవదీయరు. వాద ప్రతివాదనలు చేయరు. అలగడాలు, అన్నాలు మానడాలూ ఉండవు. కాకపోతే పెళ్లికి ముందే మరో స్త్రీతో సంబంధం ఉందనీ, ఆమెకో కూతురు ఉందనీ, ఇన్నేళ్ల తరువాత తెలిస్తే మనసులో బాధపడతారు. నా మీద ఇప్పటి దాకా ఉన్న గౌరవం తగ్గిపోతుంది. అందుకని నిన్ను నా స్నేహితుడి కూతురిగా పరిచయం చేస్తాను. దీన్నే మీ అమ్మ మరో రకంగా వ్యాఖ్యానిస్తుంది. వంచించుకుంటూనైనా మంచివాళ్లుగా బ్రతకాలని తాపత్రయ పడుతున్నానని – దాన్ని వంచన అన్నా, లౌక్యం అన్నా, పరిస్థితుల ప్రబావం అన్నా – కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకోకూడదన్నదే నా అభిప్రాయం..” అన్నాడు భార్గవ.
ఇప్పటి వరకూ తండ్రి మీద ఉన్న కోపం తగ్గిపోయింది. సమస్యను మరో కోణం నుంచీ కూడా చూడటం నేర్చుకుంటోంది. ప్రతి సమస్యకూ ఎలాంటి సామరస్యమైన పరిష్కారం ఉంటుందో తెల్సుకుంటోంది.
ఆఫీసు నుంచి వెళ్తూ, ఆ లాడ్జికి వెళ్లి, సూట్‌కేస్ తీసుకొని నమ్రతను ఇంటికి తీసుకెళ్లాడు.
భార్యనూ, ఇద్దరు కొడుకులనూ పరిచయం చేశాడు.
“నా స్నేహితుడి కూతురు. తల్లి లేదు. తండ్రి దూరంగా ఉన్నాడు. తన కూతుర్ని నా కూతురిలాగానే చూసుకోమని కోరాడు. మనింట్లోనే ఉంటుంది. శాంతీ, ఇవాళ్టి నుంచి ఈ అమ్మాయి నా కూతురే. రాం, శ్యాం మీ ఇధ్దరికీ నమ్రత సొంత అక్కయ్య లాంటిది..” అని చెప్పాడు.
శాంతి నమ్రతను చిరునవ్వుతో ఆహ్వానించింది.
తల్లి లేని కొరత తీరినట్లు అనిపించింది నమ్రతకు.