[dropcap]సో[/dropcap]మయాజుల పల్లె గ్రామస్థులందరూ కలిసి రాముల వారి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. విగ్రహాలను ఆళ్ళగడ్డ ‘శిల్పగ్రామం’ వారు తయారు చేశారు. సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్ర ప్రభువు. నల్లరాతితో చేయబడిన విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆ మూర్తుల్లో జీవకళ తొణికిస లాడసాగింది. ధ్వజస్తంభం కూడా నిలబెట్టడం పూర్తయ్యింది. ఆ రోజు అన్నదానం జరిగింది. చిన్న దేవళం. ఊరి చివర చిన్న గుట్ట మీద కట్టారు. గర్భాలయం ముందు ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు. ఎనిమిది స్తంభాలపై నిలబెట్టిన మంటపం. గుడి చుట్టూ ఆరడుగుల ఎత్తున ప్రహరీ. లోపల బేతంచెర్ల పాలిష్ నాపబండలు పరిపించారు. ఒక మూల బోరింగ్ వేయించారు. కాల్వబుగ్గ పరిసర ప్రాంతం కాబట్టి నీళ్ళు పైనే పడ్డాయి. అంత తియ్యగా లేవు కాని తాగడానికి పనికొస్తాయి. క్రింద నుంచి గుడిలోకి వెళ్ళడానికి ఒక ముప్ఫై మెట్లు కట్టారు. ప్రహరీకి, మెట్లకు, ఎర్రమన్ను ఒక చార, సున్నం ఒక చారతో పూత పూశారు. గుడికి కరెంట్ కూడా వచ్చింది. ప్రతిష్ఠ అయినప్పటి నుండి ఆ గుట్టను ‘శ్రీరాముల గుట్ట’ అని పిలవసాగారు జనం.
సోమయాజుల పల్లెకు, పాణ్యానికి మధ్యలో ‘సుగాలిమెట్ట’ అనే గ్రామం ఉంది. అదంతా నల్లమల క్రిందకే వస్తుంది. ఒక ఐదారు కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఉంటుంది. దానిని ‘తమ్మరాజు కనుమ’ అంటారు. ఘాట్ దిగిన రెండు కిలోమీటర్లకే వస్తుంది ‘సుగాలిమెట్ట’.
ఆ ఊర్లో అందరూ షెడ్యూల్డ్ ట్రైబ్‍కు చెందిన ‘సుగాలి’ జాతి వారే ఉంటారు. వ్యవసాయం, పశుపోషణ వారి ముఖ్య వృత్తి. గొర్రెల పెంపకం కూడా. మగవాళ్లు చిన్న తలపాగాలను ధరించి, ధోవతి జుబ్బాలు వేసుకుంటారు. ఆడవారు చిన్న చిన్న అద్దాలు కుట్టిన ఎర్రని రంగు రవికెలు, ముక్కులకు, చెవులకు పెద్ద పెద్ద ముక్కెరలు, లోలాకులు వేసుకుంటారు. చేతులకు వెడల్పాటి చెక్క గాజులు రంగు రంగుల పూసలు మోచేతి వరకు ధరిస్తారు. చుట్టు పక్కల ఊర్లలో పూసల దండలు, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతారు. తల వెంట్రుకలు సేకరించి సవరాలు కట్టి అమ్ముతారు.
గత సంవత్సర కాలంగా ‘సుగాలిమెట్ట’ గ్రామస్థులు, సోమయాజుల పల్లె లోని శ్రీరాముల గుడి నిర్మాణంలో పాలుపంచుకొన్నారు. ఎద్దుల బళ్ళ మీద బేతంచెర్ల నుంచి సిమెంట్ నగర్ మీదుగా పాలిష్ బండలు తోలారు. వారి గ్రామ పెద్ద సోమ్లా నాయక్. ఆయన మొదటి నుందీ రామభక్తుడు. స్కూలుకు వెళ్ళలేదు కాని అంతో ఇంతో చదవడం వచ్చినవాడు. ఆయన ఆదేశం ఏమిటంటే ఊరి నుంచి రోజూ కొందరు వెళ్ళి గుడి కోసం పని చేయాలి. కూలీ తీసుకోకూడదు. ఆయనంటే అందరికీ గౌరవం. అలాగే చేశారు.
బనగానిపల్లె నుంచి ‘కామావధాన్లు’ అన్న బ్రాహ్మణుడిని గుడి పూజారిగా తెచ్చుకొన్నారు. సోమయాజుల పల్లె కర్నూలు – కడప స్టేట్ హైవే మీద ఉంటుంది . ఇంచుమించు కర్నూలుకు నంద్యాలకు మధ్యన ఉంటుంది. అటు మద్రాసు, తిరుపతి నుండి; ఇటు కర్నూలు, హైదరాబాదు నుండి ఎక్స్‌ప్రెస్, డీలక్స్, వోల్వో బస్సులు హైవే మీద తిరుగుతుంటాయి. ఏవీ ‘పల్లె’లో ఆగవు. ఆర్.టి.సి. వాళ్ళు దాన్ని ఉచ్చారణా సౌలభ్యం కోసం యస్.పల్లెగా వ్యవహరిస్తారు. కర్నూలు – నంద్యాల ఆర్డినరీ పల్లెవెలుగు బస్సులు మాత్రం అక్కడ ఆగుతాయి. ప్రశాంతమైన తమ్మరాజు కనుమల్లో గుట్ట మిద వెలసిన రాముల వారి గుడి అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. కర్నూలు, నంద్యాల, బనగానిపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు రాసాగారు. మెయిన్ రోడ్డు నుంచి గుడి మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది. బస్ స్టాప్ వద్ద రెండు పాక హోటళ్ళుంటాయి. ఒక పెద్ద దిగుడు బావి, శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మర్రిచెట్టు, పక్కనే ఏనాడో ఎవరో ధర్మాత్ములు కట్టించిన సత్రం ఉంటాయి. ఆ కాలంలో ఎద్దుల బళ్లు అక్కడ ఆపుకొని, సత్రంలో వంటలు చేసుకొని తినేవారట. ఆ బావి చాలా లోతుగా ఉంటుంది. అన్ని కాలాల్లో నీరు ఉంటుంది. దానికి నాలుగు వైపులా మెట్లుంటాయి. బిందెల గొంతులకు కొబ్బరితాడు అమర్చి, గిలకల సాయంతో నీళ్ళు తోడుకుంటారు. సత్రంలో ఒక చివర స్తంభాల మధ్యలో ఇటుకతో గోడలు కట్టి పూజారి గారికి వసతి ఏర్పాటు చేశారు. ఆయన, ఆయన భర్య ప్రసూనాంబ మాత్రమే ఉంటారు. వారు శ్రీవైష్ణవులు. వారికి ఒక్కతే కూతురట. పెళ్ళి చేశారు. అల్లుడు కర్నూలు లోని ‘రాయలసీమ కార్బైడ్స్’ ఫాక్టరీలో షిప్ట్ అసిస్టెంట్‍గా పని చేస్తాడట.
***
“ఒరే, లఖియా! ఎద్దులకు మేత వేయి నాయనా!” అన్నాడు సోమ్లా కొడుకుతో. తల్లి కొండసానువుల నుంచి కోసుకొచ్చిన పచ్చిగడ్ది మోపు విప్పి, గాడిపాడుతో ఎద్దుల ముందు రెండు పనల గడ్డి వేశాడు లఖియా. రాత్రి ఎనిమిదయింది. అందరూ భోజనానికి కూర్చున్నరు. తల్లి కస్తూరి అందరికీ సిల్వర్ తట్టలలో జొన్నరొట్టెలు వడ్దించింది. నంచుకోవడానికి కొరివి కారం.
పెద్ద కొడుకు రాఘవ నాయక్ తమ్మునితో అన్నాడు “రేపటితో పరీక్షలు అయిపోతాయా ఛోటా?”
“ఔ అన్నా! మన ఊరి చదువు ఇంక అయిపోయినట్లే. హైస్కూలులో చేరాలంటే ఇటు నన్నూరు గాని అటు బలపనూరు గాని పోవల్సిందే” అన్నాడు తమ్ముడు. వాడు ‘సుగాలిమెట్ట’ లోని ఏకోపాధ్యాయ ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకొంటున్నాడు. క్రిస్టఫర్ సార్ అని ఒక టీచర్ రోజూ ఓర్వకల్లు నుంచి వచ్చి, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ పిల్లలకు చదువు చెబుతాడు. సుగాలీలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు కాని యస్.సి.లు క్రైస్తవం వైపు మొగ్గు చూపినంతగా యస్.టి.లు చూపలేదు. సుగాలీలంతా హిందువులే.
“ఎల్లుండి నుంచి ఎండాకాలం సెలవులు. నీవు కూడా మాతో బాటు చేనికాడికి రావాల నాయినా! రాళ్ళన్నీ ఏరిపారెయ్యాలా, చెరువు మన్ను శేనికి తోలాల. వానలు బదే తలికి శేనికి ఒక రూపుకు దీస్కరావాల. జొన్నదంట్లు నరికినాము గద, కింద మిగిలినవి గడ్డపారతో పెల్లగించి, ఒక సోట ఏసి కాల్చాల. మన మట్టి మిద్దె కారతాంది. దాని మీదికి సవిటి మన్ను తోలాల. శానా పనులుండాయి నాయినా”.
రాఘవ నాయక్ అన్నాడు “నాయినా, ఈ ఎండల్లోనే కనుమలోకి బోయి బోడె గడ్డి గోసుకొచ్చి, ఇంటి ముందున్న ఎద్దుల కొట్టం వారపాగు మింద మందంగా కప్పి తాళ్లు బిగించుకోవాల. ల్యాకపోతే వానలకు ఎద్దులు తడుస్తాయి.”
“ప్యాడ దిబ్బ బాగా కుప్పయింది. దాంట్లోని ఎరువును గూడ్క శేనికి తోలద్దూ” అన్నది కస్తూరి.
“అమ్మా ముమ్దల సెరువు మన్ను. ఒక దుక్కి ఐనంక దిబ్బలోని ఎరువు తోలదాము” అన్నాడు రాఘవ.
అట్లా ఎండాకాలంలో చేయాల్సిన పనులను ‘ప్లాన్’ చేసుకున్నారా శ్రమజీవులు.
***
పనులు అన్నీ మధ్యాహ్నం వరకే. భోజనాల వేళను ‘పైటాల’ అంటారు. ఉదయం తొమ్మిది గంటలకు రాగిముద్ద తింటారు. దాని ‘అంబటి పొద్దు’ అంటారు. రాత్రి భోజనాన్ని ‘నసుకు కూడు’ అంటారు. నసుకు అంటే చీకటి పడడం.
లొద్దిపల్లె నుంచి నరసింహశాస్త్రి గారనే పౌరాణికుడు వచ్చి, నెల రోజుల పాటు రామాయణ మహాకావ్యంపై ప్రవచనాలు చేస్తాడని, రోజూ రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు కార్యక్రమం ఉంటుందనీ, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, యస్. పల్లె శ్రీరాముల గుట్ట దేవస్థానం ధర్మకర్త సరెడ్డి ధనుంజయరెడ్డి గారి పేరిట వేసిన కరపత్రాలు చుట్టు పక్కల ఊళ్లలో పంచారు. శాస్త్రి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి గురువట. అష్టావధాని అట. ఆయనకు ఆదోని టి.జి.ఎల్. వసంత గుప్త గారి ఆధ్వర్యంలో ‘ప్రవచన విరించి’ అన్న బిరుదునిచ్చారట.
సోమ్లా నాయక్ కుటుంబం ప్రతి రోజూ తమ ఎద్దుల బండిలో ప్రవచనం వినడానికి వెళ్ళసాగింది. సాయంత్రం 6 గంటలకే నసుకు తిండి ముగించి పోదామని కస్తూరి ప్రతిపాదించింది. లఖియా ఒప్పుకోలేదు. రాత్రి పొద్దుపోయింతర్వాత మళ్లీ తనకి ఆకలయితుందని మారాము చేశాడు. అన్నయ్య తమ్ముడికి సపోర్టు. రాఘవ లఖియా కంటే ఎనిమిదేళ్ళు పెద్ద. తమ్ముడంటే ప్రాణం పెడతాడు.
నరసింహశాస్త్రి గారు ఎత్తుగా, పచ్చని ఛాయలో ఉన్నారు. చెవులకు కుండలాలు. కుడిచేతికి స్వర్ణకంకణం ధరించారు. ఎర్రని పట్టు పంచె కట్టుకొని, పైన అంగవస్త్రం కప్పుకొన్నారు. ఈ నెల రోజూలూ ధర్మకర్త గారింట్లోనే మకాం. మధ్యాహ్నం సొంతంగా అన్నం, పప్పు వండుకొంటారట. పెరుగు మాత్రం రెడ్డి గారు ఇస్తారు. రాత్రి కేవలం పల్ళు, మజ్జిగలో నానబెట్టిన అటుకులు లాంటివి తీసుకుంటారట.
గుడి ప్రహరీ లోపలే నాలుగు బల్లలు వేసి శాస్త్రి గారు కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ఒక గుంజకు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను పెట్టి, దాన్ని పూలమాలతో అలంకరించారు. ఒక మైకు అమర్చారు. ప్రవచనం మధ్యలో శాస్త్రి గారు శ్రావ్యంగా పద్యాలు, శ్లోకాలు పాడుతారట. దాని కొరకు ఒక హార్మోనిస్టు కూడా ఉన్నాడు. ఆయన పేరు చలమయ్య. ఆయనది దామళ్లకోట అట.
మొదటి రోజు దాదాపు వంద మంది వచ్చారు పురాణం వినడానికి. క్రమంగా పెరిగారు జనం. ఎండాకాలం కాబట్టి క్రింద పరిచిన నాపబండలు వేడెక్కి ఉంటాయి. సాయంత్రమే బోరింగు దగ్గర నీళ్లు కొట్టి రెండు సార్లు బండలు తడుపుతున్నారు.
శాస్త్రి గారు ప్రవచనాన్ని ప్రతి రోజూ ఈ శ్లోకంతో ప్రారంభిస్తారు.
“జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే.”
తర్వాత:
“కోమలాంగమ్ విశాలాక్షమ్ ఇంద్ర నేల సమప్రభం
దక్షిణాంగే దశరథం పుత్రాపేక్షణ తత్పరం
పృష్ఠతో లక్ష్మణం దేవం సచ్ఛత్రం కనక ప్రభం
పార్శ్వే భరత శత్రఘ్నౌ తాళవృతం కరావుభౌ
అగ్రేవ్యగ్రం హనుమన్తం రామానుగ్రహ కాంక్షిణమ్”
తర్వాత:
“గోష్పదీ కృత వారాశిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్”
శాస్త్రి గారి గొంతు శ్రావ్య గంభీరం. భూపాల, మోహన, కళ్యాణి రాగాలలో ఆయన ఈ శ్లోకాలను పాడుతూ ఉంటే. హార్మోనిస్టు అనుషంగికంగా అనుసరిస్తూ ఉంటే, శ్రీరాముల గుట్ట అంతా భక్తి పరిమళం వ్యాపిస్తుంది. ఆయన ప్రతి రోజు ఎన్నో విషయాలు చెప్పారు.
“నాయనలారా! రామాయణం మన భారతీయ సనాతన ధర్మ జీవ స్రవంతి. అది దేవతల కథ కానే కాదు. అచ్చంగా మనుషుల కథ. మానవుడు తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక భర్తగా, ఒక భార్యగా సాఫల్యాన్ని ఎలా పొందాలో ఆ మహా కావ్యం వివరిస్తుంది. అందులో లేని వేదాంతం లేదు; అందులో లేని వ్యక్తిత్వ వికాస బోధన లేదు.”
“రాముడు నీలమేఘశ్యాముడు. సంస్కృతంలో నీలం అంటే నలుపు రంగు. నల్లటి మేఘం వంటి శరీరకాంతి ఆయనది. దాన్ని నీలం అనుకొని నాటకాల్లో, సినిమాల్లో శ్రీరామునికి ఒళ్ళంతా నీలం రంగు పులిమేస్తుంటారు.” భక్తుల నవ్వులు!
“ఈనాడు తండ్రి మాట కొడుకు వినడు. అన్న మాట తమ్ముడు వినడు. అత్త మాట సరేసరి, కోడలు వినదు. మర్నాడు పట్టాభిషేకమనగా, కైకేయి చిచ్చు రగిలిస్తుంది. ‘రామా! నీవు అడవులకు వెళ్లాలని తండ్రి గారి ఆజ్ఞ, పధ్నాలుగేళ్ళు! వెంటనే బయలుదేరు’ అంటుంది.”
రాముని ముఖంలో చిరునవ్వు! “ఎందుకు నేను అరణ్యవాసం చేయాలి? అని కనీసం అడగలేదు. తండ్రి చెప్పాడు కదా! అంతే!”
“జనం తోసి తొక్కేస్తారురా. మొదటి రోజు మొదటి ఆట సినిమాకు వెళ్ళద్దని నాన్న చెబితే ఈ కాలం పిల్లలు వింటారా! అబ్బే అస్సలు వినరు”. మళ్ళీ నవ్వులు!
“సరే, ఆయన బయలుదేరాడు. సీతమ్మవారిని వెళ్ళమని చెప్పలేదుగా, ఆమెకేం అవసరం? ‘మగనితో పాటు నేను’ అని ఆమె అనుసరించింది. సోమయాజుల పల్లెలో పని చేసే ఉద్యోగులు కర్నూలు నుంచో నంద్యాల నుంచో ‘అప్ అండ్ డౌన్’ చేస్తుంటారు. వారి భార్యలు మాత్రం పట్నాలు వదిలి రారు. ‘నీవు తిరుగు, నీకు తప్పదు. ఆ పల్లె కొంపల్లో నేను ఉండలేను బాబూ’ అంటారు పైగా మన కలియుగ సీతమ్మలు!”
మగవారు ఆడవారి వైపు చూసి నవ్వడం. వారు కూడా మూతి ముడుచుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వారు. శాస్త్రి గారు మధ్యలో అలా నవ్వులు పూయించడంలో దిట్ట.
“సరే, భార్య భర్త వెంట వెళుతూంది. లక్ష్మణుడు వెంటనే తయారయ్యాడు. ‘అన్నయ్యను, వదినెను దగ్గరుండి చూసుకోవాలి నేను. అసలే అడవిలో ఉండే పని’ అన్నాడు. ఆయన భార్య ఊర్మిళ ఇంకా గొప్పది. ‘నీవు ససేమిరా వెళ్ళడానికి వీల్లేదు’ అనలేదామె”
“లక్ష్మణుని తల్లి సుమిత్ర వీళ్ళ కంటే రెండాకులు ఎక్కువే చదివింది. ‘నాయనా, రామం దశరథం విద్ది, మాం విద్ది జనకాత్మజం’ అంటూ రెండే ముక్కల్లో కొడుక్కు కర్తవ్య బోధ చేసిందా తల్లి. ‘రాముడిని మీ నాన్న దశరథుడనుకో. సీతను నీ తల్లి ఐన నేననుకో. అడవిని అయోధ్య అనుకో తండ్రీ!’ అని.”
“సెంటు స్థలం కోసం కొట్టుకొని చచ్చే అన్నదమ్ములున్నారు. అన్నదమ్ములను విడదీసే అత్తలున్నారు. మానవ సంబంధాలంటే ఎలా వుండాలి? రామాయణాన్ని విని వెళ్ళిపోడం కాదు భక్తులారా! కొంతయినా ఆ పాత్రల స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోగలిగితే మన జీవితాలు సార్థకమవుతాయి.”
లఖియా నాయక్ చిన్ని మనసు మీద శాస్త్రి గారి మాటలు చెరగని ముద్ర వేశాయి. తిరుగు ప్రయణంలో ఎద్దుల బండిలో, తండ్రి నడిగి తన అనుమానాలను తీర్చుకునేవాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్న విషయం శాస్త్రి గారు వివరించారు. ధర్మం అంటే ఏమిటి? దాన్ని రాముడు ఎలా పాటించాడు? రామాయణంలో ఆయన తీసుకొన్న ప్రతి నిర్ణయం ధర్మబద్ధమైనదే. ఈరోజు నాగరికత వెర్రిపోకడలు పోయి రామాయణాన్ని కుతర్కంతో విమర్శించే అజ్ఞానులు తయారైనారు” అన్నాడు ప్రవచనకర్త.
“ధర్మాన్ని నీవు రక్షిస్తే, అది నిన్నే కాదు, మానవ సమాజాన్నే రక్షిస్తుంది” అన్న శాస్త్రి గారి మాటలు లఖియా మనస్సులో నాటుకున్నాయి.
***
లఖియా నన్నూరు లోని జెడ్.పి. హైస్కూల్‍లో చేరాడు. రోజూ పల్లెవెలుగు బస్సులో స్టూడెంట్ పాస్ తీసుకొని స్కూలుకి వెళ్ళి వచ్చేవాడు. ‘తాను బాగా చదువుకోలేకపోయాడు, తమ్ముడిని బాగా చదివించాల’ని రాఘవ నాయక్ పట్టుదల. రోజూ సత్తు క్యారియర్‍లో జొన్నరొట్టెలో, రాగి ముద్దో పెట్టి ఇచ్చేది తల్లి. రాఘవ తండ్రితో బాటు చేనిలో కష్టపడేవాడు. వర్షాధార పంట. ఒక సంవత్సరం పండితే, మరో సంవత్సరం ఎండేది. లఖియా ఎనిమిదో తరగతిలో ఉండగా రాఘవకు పెళ్లి చేశారు. వదినెకు పదిహేనేళ్ళు. ఆమె పేరు లకుమ. లఖియాను ఆదరంగా చూసేది.
స్వతహాగా తెలివితేటలు గల లఖియా, చదువులో బాగా రాణించేవాడు. టెంత్‌లో 87 శాతం వచ్చింది. ఆ రోజు వదినె సగ్గుబియ్యం పాయసం చేసి పూరీలు చేసింది. ఆమెకు కట్నంగా పుట్టింటి వారు పది మేకలు ఇచ్చారు. వాటిని ఆమె కాచుకునేది. మంద పెరిగి ముప్ఫై జీవాలు అయినాయి. కుటుంబానికి మరో ఆదాయ వనరు చేరింది.
“జూనియర్ కాలేజీలో చేరాలంటే పాణ్యం పోవాల్సిందే నాయినా, ఇటు లొద్దిపల్లెలో ఉంది కాని, మెయిన్ రోడ్దు మీద లేదు ఆ ఊరు. మా నేస్తులందరూ పాణ్యంలోనే చేరతారంట” అన్నాడు లఖియా.
“కాలేజీ సదువులు మనతోన యాడ అయితాయిరా ఛోటా” అన్నాడు తండ్రి.
“నాయినా, అట్లనగాకు, తమ్ముడు తప్పకుండా కాలేజీలో చేరాల్సిందే. వాని సదువు ఆపనీకే కుదరదు. మనం యావో పాట్లు పడదాములే” అన్నాడు రాఘవ.
“రెండు మ్యాక లమ్ముకుంటే పాయ. మరిది పీజులకి, పుస్తకాలకు సరిపోదూ” అన్నది వదినె.
“గవర్నమెంటు కాలేజీ కాబట్టి పెద్దగా ఫీజులుండవు. నన్నూరికి బోయినట్లే పాణ్యానికి గూడా బస్సులో పోయి రావచ్చు వదినే” అన్నాడు మరిది.
వ్యవసాయం అప్పటికే వారికి ఫలసాయం సరిగ్గా ఇవ్వడం లేదు. కస్తూరి చుట్టుపక్కల సంతల్లో పూసల దండలు, సవరాలు, తిలకం సీసాలు, కాటుక డబ్బీలు అమ్ముతూ కొంత సంపాదిస్తూంది. ఎప్పుడూ మూడు నాలుగు మేకలు ఈని ఉంటాయి కాబట్టి పాలకూ, మజ్జిగకు కొదువలేదు. కానీ మేకపాలు గేదె పాల లాగా, ఆవుపాల లాగా అమ్మడానికి కుదరదు.
పాణ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సి.యి.సి.లో చేరాడు లఖియా. తన కుటుంబం ఎంత కష్టపడుతోందో తెలుసు. బస్ పాస్ ఉండనే ఉంటుంది. సత్తు క్యారియర్‍లో అమ్మో, వదినో పెట్టి ఇచ్చిందే తప్ప, కనీసం టీ కూడా తాగేవాడు కాదా పిల్లవాడు.
పాణ్యం హైవే మీద ఉంటుంది. మండల కేంద్రం. మేజర్ పంచాయితీ. అది ఒక కూడలి. నేరుగా వెళితే నంద్యాల, ఎడం వైపు పాణ్యం ఊరు. కుడి వైపు రోడ్డు బనగానిపల్లెకు వెళుతుంది. ఇటు వైపు కర్నూలు. జంక్షన్‍లో హోటళ్లు, దుకాణాలతో సందడిగా ఉంటుంది. బస్సులు, వ్యాన్లు, రిక్షాలు, జట్కాలు కిటకిటలాడుతుంటాయి. వదినె అతనికి రోజూ రెండు రూపాయలిస్తుంది, ఏమయినా తినమని. అతడు దాన్ని అసలు ఖర్చు చేయడు. అలా అతని వద్ద రెండు మూడు వందలు దాకా పోగయింది. అన్నయ్య పుట్టిన రోజుకు ధోవతి, జుబ్బా తీసుకున్నాడు. ఆ రోజు రాఘవ తమ్ముడిని బాగా కోప్పడ్డాడు.
“నోరు కట్టుకుని నాకు గుడ్దలు తెచ్చావా? మరో మూడు నెలల్లో ఇంటర్ అయిపోతుంది. డిగ్రీలో చేరాల. ఆ డబ్బులుంటే పనికి వచ్చేవి కదా? ఇంత పనికిమాలిన వానివనుకోలేదు. నాకొద్దీ గుడ్డలు!” అని అరిచాడు.
వదినె కల్పించుకుంది. “ఆ పిల్లోడు ప్రేమతో పుట్టిన దినం నాడు అన్నయ్యకి కొనిస్తే అట్ల అరుస్తావెందుకు.. ముకం ఎంత సిన్నబుచ్చుకున్నాడో సూడు” అని భర్తని మందలించింది. బిక్కమొగం వేసుకుని నిలబడిన తమ్ముడిని చూసి రాఘవ మనస్సు కరిగింది. కళ్ళ నిండా నీళ్ళతో వాడిని సందిట్లోకి తీసుకున్నాడు. ఇలా అన్నాడు
“నీవు బాగా సదవాల. పెద్ద ఉద్యోగం చెయ్యాల. అంతవరకు దూబరా ఖర్చులు చెయ్యవాకు” అతని గొంతు బొంగురుపోయింది.
ఇంటర్‍లో లఖియాకు డెబ్భై శాతం వచ్చిండి. డిగ్రీలో చేరాలి. కర్నూలు లేదా నంద్యాల. బస్సులో వెళ్ళి రావడానికి కుదరరు. ఇంతలో ఎవరో అతనికి చెప్పారు – కర్నూలు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ వారి వసతి గృహం ఉందని, కాలేజీలో అడ్మిషన్ దొరికిన వారికి అందులో బస, భోజనం లభిస్తాయని. కానీ గవర్నమెంటు కాలేజీలో చదివేవారికే అవి పరిమితమని.
కర్నూల్లో రెండే డిగ్రీ కాలేజీలుండేవి గవర్నమెంటువి. ఒకటి మామూలుది. రెండవది సిల్వర్ జుబ్లీ కాలేజి. అదైతే రెసిడెన్షియల్ కాలేజీ. యస్.టి. హాస్టల్ కూడా అవసరం లేదు. కాని దానికి అడ్మిషన్ అంత సులభం కాదు. ఎంట్రన్స్ వ్రాయాలి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పేరెన్నిక గన్న కాలేజీలలో అది ఒకటి. రెండోది నాగార్జున సాగర్‍లో ఉండేది.
ఎంట్రన్స్‌కు ప్రిపేరయ్యాడు లఖియా. రిజర్వేషన్ పుణ్యమా అని అతనికి సీటు వచ్చింది. విశాలమైన భవన సముదాయం, చక్కని తరగతి గదులు, మంచి హాస్టల్. పై ఖర్చులకు అన్నయ్య నెలకు వంద రూపాయలు ఇచ్చేవాడు. ప్రతి నెలా సుగాలిమెట్టకు వెళ్ళి అందర్నీ చూసి వచ్చేవాడు. రాఘవకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు శశాంక నాయక్.
సోమ్లా నాయక్, కస్తూరి కాలధర్మం ప్రకారం చనిపోయారు. చేను అసలు గిట్టుబాటు కావడం లేదు. వరుసకు చిన్నాన్న అయిన భీమ్లానాయక్‍కు దాన్ని గుత్తకిచ్చారు. లకుమ జీవాలనమ్మేశారు. బుగ్గానిపల్లె దగ్గర ఉన్న సిమెంట్ నగర్ ఫ్యాక్టరీలో లేబర్‍గా చేరాడు రాఘవ. లకుమ రెండు ఎనుములు (గేదెలు) కొనుక్కుని పాలు పోయడం ప్రారంభించింది నాలుగిళ్ళకు. మధ్యాహ్నం మసాల వడలు, మిర్చీ బజ్జీలు, పకోడీలు పెట్టుకొని, సిమెంట్ నగర్ లోని హైస్కూలు వద్ద ఇంటర్వెల్‍లో అమ్ముకునేది.
లఖియా డిగ్రీ పూర్తయింది. సిమెంట్ నగర్ వెళ్ళాడు. అన్నయ్య కూడా సిమెంట్ దుమ్ము వల్ల ఉబ్బసంతో బాధ పడుతున్నాడని తెలిసి వేదన చెందుతాడు. అప్పుడు నంద్యాలలో బ్యాంకింగ్ సర్వీస్ కమీషన్ పరీక్షలకి కోచింగ్ యిచ్చే ప్రసిద్ధ సంస్థ ఒకటుండేది.
రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు కోచింగ్‍కు అక్కడ చేరేవారు. అక్కడ ఫీజులో రాయితీ ఉండదు. హాస్టల్ ఉంది కాని భరించలేరు వీళ్లు. మూడు నెలలు కోచింగ్. రెండు వేలు ఫీజు. ఒక ఎనుముని అమ్మి ఆ డబ్బు సర్దింది వదినె. అన్నావదినెలు తన భవిష్యత్ కోసం చేస్తున్న త్యాగాలు లఖియాను కలచివేశాయి.
నంద్యాల సుంకులమ్మ గుడి వీధిలో ఒక గది తీసుకొన్నాడు. ఒక కిరసిన్ స్టవ్, నాలుగు వంట పాత్రలు కొనుక్కున్నాడు. అన్నం, ఒక కూర లేదా చారు వండుకునేవాడు. టిఫిన్స్ చేయడానికి స్తోమత లేదు. మూడు నెలలు ఒక తపస్సు మాదిరి కష్టపడినాడు.
యస్.టి. రిజర్వేషన్ 7 శాతం కోటాలో అతనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగం వచ్చింది. నందికొట్కూరు బ్రాంచికి పోస్టింగ్ ఇచ్చారు. అన్నయ్యను, వదినెల్ను ఫ్యాక్టరీలో ఉద్యోగం మానేసి తన దగ్గరకు రమ్మని అడిగాడు. “నీవు జీవితంలో ఇంకా స్థిరపడాల, పెండ్లి చేసుకోవాల” అన్నారు. అప్పుడు లఖియా జీతం ఆరు వందల యాభై. ప్రతి నెల సిమెంట్ నగర్‍కు వెళ్లి రెండు వందలు బలవంతంగా వదినెకిచ్చి వచ్చేవాడు. శశాంక నాయక్‍ను మంచి కాన్వెంటులో చేర్పించాడు.
ఒకసారి రాఘవ నాయక్ చెప్పులు ఎవరో ఎత్తుకుపోయారు. అప్పుడు లఖియా అక్కడే ఉన్నాడు. అన్నయ్యకు కొత్త చెప్పులు కొనిపెట్టాడు. వదినె చేసిచ్చిన వాముకారాలు తీసుకుని నందికొట్కూరుకు వెళ్లిపోయాడు.
ఏడెనిమిదేండ్లు గడిచాయి. ఆఫీసరుగా ప్రమోషన్‍లు వస్తాయని అందరూ అనుకొంటున్నారు. ఒక రోజు మేనేజర్ పిలిచి అతనితో ఇలా చెప్పాడు. ఆయన పేరు మహీధర్.
“లఖియా! కంగ్రాట్స్! ప్రమోషన్ లిస్టులో నీ పేరుంది. ఎంతయినా అదృష్టవంతులాయ్యా మీరు! నాకు ఆఫీసరుగా ప్రమోషన్ రావడానికి పదిహేనేళ్ళు పట్టింది. నీకు చూడు, ఎనిమిదేళ్ళకే..”
లఖియా అమోయమంగా చూశాడు. “సార్, ఒక డౌట్. నియామకాల్లో రిజర్వేషన్ సరే, వెనుకబడిన జాతిలో పుట్టాము కాబట్టి. మరి ప్రమోషన్‍లలో కూడా రిజర్వేషన్ ఉంటుదా?”
“ఉండబట్టే కదా నీకు అవకాశం వస్తూంది!” అన్నాడాయన. ఆయన గొంతులో దాచుకుందామన్నా దాగని అక్కసు! అసూయ!
ఇంటికి వెళ్ళాడు లఖియా. మెస్‍లో భోజనం చేసి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు శాస్త్రి గారు చెప్పిన ప్రవచనం గుర్తుకు రాసాగింది. ‘రామో విగ్రహవాన్ ధర్మః. ప్రతి నిర్ణయంలోను ఆయన ధర్మం పాటించాడు. ధర్మాన్ని నీవు రక్షిస్తే అది నిన్నే కాదు, మొత్తం సమాజాన్నే రక్షిస్తుంది.’
‘పదిహేనేళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు తన సీనియర్స్. తనకు మాత్రం ముందే.. ఇది చట్టం కావొచ్చు కాని ధర్మం మాత్రం కాదు. ఎంట్రీ లెవెల్‍లో తన వెనుకబడిన తనం వల్ల తనకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అది ధర్మం. ఉద్యోగంలో చేరిన తరువాత తాను వెనుకబడినవాడు ఎలా అవుతాడు? ప్రమోషన్‍లలో రిజర్వేషన్ తనకు వద్దు. అది అధర్మం. అంతే కాదు, రేపు పిల్లలకు కూడా రిజర్వేషన్ వద్దు’ అలా అనుకున్నాక అతని మనసు తేలికై నిద్రపోయాడు. ‘రామాయణాన్ని వినడం కాదు. కొంతవరకైనా ఆచరింగలిగితే, మన జీవితాలను సార్థకం చేసుకొంటాము.’
మర్నాడు మేనేజర్‌కు ఒక అండర్‌టేకింగ్ వ్రాసి ఇచ్చాడు – ‘తనకు ప్రమోషన్ వద్దనీ, సీనియారిటీ ప్రకారం వచ్చినప్పుడే తీసుకొంటాన’నీ. డిపార్ట్‌మెంటంతా ముక్కున వేలేసుకున్నారు. ఇది అమాయకత్వమా, లేక అహంకారమా, అని చర్చించుకొన్నారు.
లఖియాకు పెళ్ళయింది. ప్రేమ వివాహం. కులాంతరం కూడా. ఆ అమ్మాయి పేరు ప్రతిమ. అగ్రకులానికి చెందినది. లఖియా సంస్కారానికి ముగ్ధురాలై అతన్ని ప్రేమించింది. అదే బ్యాంకులో గోనెగండ్ల బ్రాంచిలో పనిచేస్తుందామె. వాళ్లది వెలుగోడు. వారిద్దరి వివాహం నిరాడంబరంగా, కర్నూలు నగరేశ్వరస్వామి వారి దేవాలయంలో జరిగింది.
పెళ్లికి రాఘవ, లకుమ, శశాంక్ వచ్చారు. వాళ్ళకు బట్టలు పెట్టాడు లఖియా! ఉద్యోగం మానేసి తన దగ్గరకు వచ్చేయమని ప్రాధేయపడ్డాడు కన్నీళ్ళతో! ప్రతిమకు కూడా వాళ్ళ త్యాగం, లఖియాను వాళ్లు ఎన్ని కష్టాలు పడి చదివించారో తెలుసు. ఆమె కూడా వారిని ఎంతో వినయంగా, అభిమానంగా బ్రతిమిలాడింది. చివరికి వారు ఒప్పుకున్నారు.
నందికొట్కూరులో ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాడు లఖియా. ఒకనాడు వదినె ఎందుకో మరిది వాళ్ళ గదిలోనికి వెళ్ళింది. ప్రతిమ గదిలో ఉంది. బీరువాలోని చీరలు తోడికోడళ్లిద్దరూ సర్ది పెడుతున్నారు. బీరువా ప్రక్కన ఉన్న గోడకు బిగించిన ఫ్రేము వదిన కంట పడింది! ఆమె నిశ్చేష్టురాలై ఆ ఫ్రేమునే చూడసాగింది.
“ఇది.. ఇది.. ఎట్లా..” అంటూ తడబడుతూ ఉంటే చిరునవ్వుతో ప్రతిమ అన్నది
“అక్కా, బావగారి పట్ల తనకున్న భక్తిని నీ మరిది అలా చాటుకున్నారు. అందులో తప్పేముంది?”
లకుమ భర్తను కేక వేసింది. గుమ్మం దగ్గర నిలుచున్న అతన్ని చేయి పట్టుకుని లాక్కొచ్చి, బీరువా పక్కన గోడకున్న ఆ ఫ్రేమును చూపించింది!
అది చూచిన తని కళ్ళ నిండా నీళు! పెదవులు అదురుతుండగా అతనిలా అన్నాడు
“లఖియా, నీవు భరతునిగా మారి నన్ను రామున్ని చేసినావా నాయనా!”
ఆ ఫ్రేములో రాఘవ నాయక్ ఎవరో ఎత్తుకుపోయారనుకొంటున్న తన చెప్పులు అందంగా అమరి ఉన్నాయి. దానికి ఒక చెమ్కీల, ముత్యాల దండ వేసి ఉంది.
హాల్లో ఉన్న భరతుడు లోపలికి వచ్చాడు. రాముడు అతన్ని కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళు చెలిమలైనాయి. భార్యతో అన్నాడు లఖియా – “ప్రతీమా వదినె నాకు వదినె కాదు, తల్లి! మా అన్న సాక్షాత్తు మా నాన్నే.” ‘రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం!’
‘జ్యేష్ఠ భ్రాతా పితృ సమః’
మరో నాలుగేళ్ల తరువాత లఖియా దంపతులిద్దరికీ ఆఫీసర్లుగా ప్రమోషన్లు వచ్చాయి. వారికొక ఆడపిల్ల. దానికి మూడేళ్ళు. దాని పేరు అనఘ. ఆ పిల్లకు బర్త్ సర్టిఫికెట్‍లో ‘ST’ అని రాయించలేదు. ‘OC’ అని తల్లి కులం రాయించారు.
రాఘవ నాయక్, లకుమ విశ్రాంతిగా తమ్ముడు, మరదలి దగ్గర ఉంటున్నారు. లఖియాకు, ప్రతిమకు అనంతపురం ట్రాన్స్‌ఫర్ అయింది. Spouce case మీద ఒకే ఊర్లో, వేర్వేరు బ్రాంచీలకు అలాట్ చేశారు. శశాంక్ నాయక్‌ను మంచి పేరున్న స్కూల్లో చేర్చారు.
మరో అయిదేళ్ళు గడిచాయి. భార్యాభర్తలిద్దరూ మరో ప్రమోషన్ పొందారు. కర్నూలు-కడప హైవేను ఫోర్ లేన్స్‌గా విస్తరించారు. ఓర్వకల్లు వద్ద కర్నూలు విమానాశ్రయం వచ్చింది. ఆ ప్రాంతమంతా కర్నూలు – నంద్యాల మధ్య రియల్ ఎస్టేట్ బూమ్! పొలాల ధరలకు రెక్కలొచ్చాయి. సుగాలిమెట్టలోని వీరి చేను ఎకరా ముప్పై లక్షలుందిపుడు!
కర్నూల్లో సి. క్యామ్పులో రెండు వందల గజాల స్థలం కొని, ఇండివిడ్యుయల్ హౌస్ కన్‍స్ట్రక్షన్ ప్రారంభించారు. సుగాలిమెట్ట లో భూమిని అమ్మేద్దామన్నాదు రాముడు. భరతుడు ఒప్పుకోలేదు.
“అన్నయ్యా! మా ఇద్దరికీ మంచి ఉద్యోగాలున్నాయి. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది నీవు పెట్టిన భిక్షే. ఆ చేను మీద మనిద్దరికీ చట్టం ప్రకారం హక్కు ఉన్న మాట నిజమే. మన ఊర్లో ఉన్న యింటిని, చేనును అమ్మితే డెబ్భై లక్షల వరకు వస్తుంది. దానిని మన శశాంక పేర వేస్తాను బ్యాంకులో. వాడి చదువుకు, మీకు పనికి వస్తుంది. అదే ధర్మం! దయ చేసి కాదనకండి!”
“అదేందిరా! అంత డబ్బు..”
“నీవేం మాట్టాడొద్దు.. అదంతే..!”
సీత, మాండవి నవ్వుతూ చూస్తున్నారు! అదేనండి! లకుమ, ప్రతిమ!
యతోధర్మస్తతోజయః.