స్ఫూర్తిదాయక మహిళలు-3

0
3

(పిల్లల కోసం స్ఫూర్తిదాయక మహిళల కథలను అందిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.)

ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్

[dropcap]అ[/dropcap]మ్మమ్మ చెబుతున్న ఇన్‌స్పిరేషనల్ విమెన్ స్టోరీస్ వినటం కోసం సాత్విక ఎదురుచూస్తోంది.

అమ్మమ్మ కథ వినాలంటే ఏమి చేయాలో తెలుసు. తొందరగా నిద్ర లేచి, రెడీ అయ్యి, బ్రేక్‌ఫాస్ట్ తినేసి స్కూల్లో చెప్పిన పాఠాలు మరోసారి revise చేసుకోవాలి. ఈవెనింగ్ క్లాస్ వర్క్, ఇంకా అమ్మకి ఇంటి పనిలో సాయం చేసి తీరిగ్గా అప్పుడు అమ్మమ్మ చెప్పే కథ వింటూ డిన్నర్ చెయ్యాలి.

డిన్నర్ టేబుల్ దగ్గర సాత్విక అమ్మమ్మ చెప్పే స్టోరీ కోసం ఎదురుచూస్తోంది.

“Good evening Ammamma! I am ready” అంది.

“గుడ్ ఈవెనింగ్ నా బంగారు. తింటూ విందూగాని. టీవీ చూస్తూ అన్నం తినద్దు. కథలు వింటూ తినాలి. సరేనా?”

“ఓకే అమ్మమ్మా!”

సాత్విక అమ్మ వండిన రుచికరమైన వంటకాలు తింటూ కథ వింటోంది. మీరు వినండి.

“సాత్వికా! నీకు అర్థం అయింది కదా? 100+ ఏళ్ళ క్రితం ఆడపిల్లలు, స్త్రీల జీవితాలలో ఎన్ని ఆంక్షలు (రెస్ట్రిక్షన్స్) ఉండేవో. అంటే అది వద్దు, ఇది వద్దు, అలా  కాదు ఇలా. స్కూల్ వద్దు . ఇంట్లోనే ఉండాలి. ఒక వయసు వచ్చాక ఇంట్లో మగపిల్లలతో కూడా కలవకూడదు లాంటివి ఎన్నో.”

“ఎందుకు అమ్మమ్మా. సో బాడ్”

“అవును, బాడ్. ఇంకో సంగతి తెలుసా? చిన్నప్పుడే పెళ్లి చేసేవారు కదా. ఆ ఆచారాన్ని ఎంతో కష్టం మీద నిలుపు చేసేలా ప్రభుత్వ నియమాలు తెచ్చి ఆపారు. అలాగే ఆ రోజుల్లో ఇంకో చెడ్డ విషయం దేవదాసి వ్యవస్థ” అంది.

“అంటే ఏమిటీ అమ్మమ్మ?”

“అంటే నీకు ఎలా చెప్పాలి? ఐ విల్ ట్రై బంగారు! ఆ రోజుల్లో  సమాజంలో..”

“అమ్మమ్మా! సమాజం అంటే?”

“సమాజం అంటే  మనం, మన చుట్టూ ఉండే ప్రజలు. సరే విను. అప్పుడు కొంత మంది స్వార్థపరుల వల్ల  కొన్ని ఊర్లలో ఒక చెత్త ఆచారం ఉండేది. ఊర్లో ఉన్న కొన్ని కుటుంబాలలోని అమ్మాయిలను దేవుడికి భార్య అని చెప్పి వాళ్ళని చాలా బాధపెట్టే వాళ్ళు. పాపం.”

“అయ్యో. పాపం. అప్పుడు ఏమైంది?”

“అలా చాలా చెడ్డ ఆచారాలు సమాజంలో ఉండేవి. అన్నిట్లో స్త్రీలు, ఆడపిల్లలు బాధపడేవారు. సో కొంతమంది అమ్మాయిలు చాలా ధైర్యంతో  చెడు ఆచారాలు వద్దని వ్యతిరేకించారు. అలాంటి స్త్రీల కథలే వింటున్నావు. సాత్వికా! అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనకి సమస్య వస్తే అమ్మో! అని భయపడకూడదు. ఎలా సాల్వ్ చెయ్యాలి? అని ఆలోచించి, ప్రయత్నం చేయాలి. ఎవరి కోసం ఎదురు చూడవద్దు. మనం ప్రయత్నిస్తే సాయం అదే వస్తుంది. ఆడపిల్లలను అడుగు బయట పెట్టవద్దు అనే రోజుల్లో ఆమె దేశంలో ఫస్ట్ సర్జన్. మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? మన స్టోరీ హీరోయిన్ ముత్తు లక్ష్మి రెడ్డి.

‘ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్’ అంటే ముత్తులక్ష్మి రెడ్డి.

‘‘అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు. మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మీ రెడ్డి.’’

“ఓ దేవదాసి కుటుంబంలో 1886 జులై 30న ముత్తులక్ష్మి రెడ్డి జన్మించారు. ఆమెది మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై అనే ప్లేస్. అమ్మాయిలు బైటకి వెళ్లొద్దు అనే రోజుల్లో ఆవిడ కో-ఎడ్ స్కూల్‌కి వెళ్లారు. మీలాగే బాయ్స్ గర్ల్స్ కలిసి చదివే స్కూల్‌కి. హై స్కూల్ చదువులు ఇంట్లో ఉండే వాళ్ళ నాన్న గారు చెప్తే చదివి మంచి మార్కులతో పాస్ అయ్యారట. అప్పుడు అదొక పెద్ద వింత విషయం. అంటే కాదు ఊర్లో ప్రజలు, చుట్టాలు అందరూ వద్దన్నా భయపడకుండా పుదుక్కోటై లోని మహారాజ కాలేజీలో చేరారు. అది అబ్బాయిల కాలేజి. ఆమె తండ్రి మహారాజా కళాశాలకు ప్రిన్సిపాల్. తల్లిది ఇసాయివెలలార్ (దేవదాసి) సముదాయం. బాలిక అనే కారణంతో మహారాజా కళాశాలలో ఆమెకు ప్రవేశం నిరాకరించారు.

ఆమె ప్రతిభను గుర్తించిన పుడుకొట్టాయి రాజా ఆమెకు ఆ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఆమె చదువు కోసం ఆయన స్కాలర్షిప్ కూడా ఇచ్చారట.

ఇంకో విషయం తెలుసా సాత్వికా? ముత్తు లక్ష్మి 1907లో మెడికల్ కాలేజీలో చేరిన మొదటి అమ్మాయి. అలాగే అబ్బాయిలతో పాటుగా ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్‌లో హౌస్ సర్జెన్సీ చేసిన ఫస్ట్ గర్ల్.”

“వావ్! గ్రేట్! ఎంత ధైర్యం కదా?” అంది సాత్విక.

“అవును. మద్రాస్ మెడికల్ కళాశాలలో తొలి మహిళా హౌజ్ సర్జన్‌గా అడుగుపెట్టింది కూడా ఆమెనే బ్రిటిష్ ఇండియాలో.

తల్లి చంద్రమ్మాళ్ దేవదాసిగా పడిన కష్టాలను చూసిన ముత్తులక్ష్మిరెడ్డికి ఎలాగైనా ఈ చెడు ఆచారాన్ని ఆపాలని అనిపించింది. వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. 1912లో మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసి దేశంలోనే తొలి హౌజ్ సర్జన్‌గా నిలిచారు.

కాలేజీ రోజుల్లో సరోజిని నాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు ముత్తులక్ష్మి రెడ్డి హాజరయ్యేవారు. అక్కడ మహిళల హక్కులు, వారి సమస్యలపై చర్చించేవారు.

అలాగే.. గాంధీ, అనీబిసెంట్‌ల ప్రభావం ముత్తులక్ష్మిపై ఎక్కువగా ఉండేది. హౌజ్ సర్జన్‌గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అదే సమయంలో విమెన్స్ ఇండియా అసోసియేషన్ (డబ్య్లూఐఏ) అభ్యర్థన మేరకు మళ్లీ భారత్ వచ్చి రాజకీయాల్లో చేరారు.

1926లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అవడంతో దేశంలోనే తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మద్రాస్ శాసన మండలిలో ముత్తులక్ష్మీ రెడ్డి మాట్లాడారు. మండలిలో దేవదాసి రద్దు బిల్లును ఆమె ప్రతిపాదించారు. మద్రాస్ శాసన మండలి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె.

ఆ సమయంలోనే మహిళలు, చిన్నారులు, అనాథల సంక్షేమం కోసం కృషి చేశారు.

ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థ రద్దు కోసం పోరాడారు. చట్టం తీసుకరావడంలో కీలక పాత్ర వహించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అనైతిక ఆచారం నుంచి ఎంతో మంది మహిళలు స్వేచ్ఛ పొందేందుకు అది తోడ్పడింది. దేవదాసీలను, వారి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఆమె అవ్వాయి హోంను ప్రారంభించారు.

వేశ్యా గృహాలను, అనైతికంగా సాగే మహిళ, బాలల రవాణాను అడ్డుకునే చట్టం తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేశారు.

ఆమె 1954లో అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పటికీ దేశ నలుమూలల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తోంది.

ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మి 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేశారు.

ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

సాత్వికా! అన్ని అడ్డంకులు ఉన్న ముత్తు లక్ష్మి లాంటి వాళ్ళు  ధైర్యంగా  నిలబడి అనుకున్నది సాధించారు. తరువాత వాళ్ళని ఆపు చెయ్యాలని అనుకున్న ప్రజలే మెచ్చుకున్నారు. అంతే కాదు ఆవిడ లాంటి వాళ్ళు ఎందరికో రోల్ మోడల్ అయ్యారు.

మరి ఇవ్వాల్టి స్వేచ్ఛా సమాజంలో పుట్టిన మీరు మీకున్న వందల, వేలాది అవకాశాలతో ఎంత బాగా చదివి జీవితంలో గొప్పవాళ్ళు అవచ్చో కదా?

సో వర్క్ హార్డ్, స్మార్ట్. మంచి విలువలు నేర్చుకో. అవసరంలో ఉన్న వాళ్లకి సాయంగా ఉండు.” అన్నారు అమ్మమ్మ.

“ఓ! సరే అమ్మమ్మా. లవ్ యు. Thank you” అంటూ అమ్మమ్మని హత్తుకుని ముద్దు పెట్టింది సాత్విక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here