[dropcap]“మ[/dropcap]ళ్లా ఏం పుస్తకం పట్టుకుని కూర్చున్నారు? పుస్తకంలో తల దూర్చారంటే ఆకలి దప్పులు తెలియవు. నా మాట అసలే వినపడదుగా.”
“మరీ అలా రుసరుసలాడకు పార్వతీ. నీకేమో ఆధ్యాత్మిక పుస్తకాలంటే ప్రాణం. నాకేమో అన్ని రకాల పుస్తకాలు చదవాలన్న కోర్కె. పోస్టల్ సర్వీస్‍లో ఉండగా, ఉద్యోగమూ, పిల్లల బాధ్యతలతో ఎక్కువగా పుస్తకాలు చదవలేకపోయాను. మంచి పుస్తకం కనపడ్డప్పుడల్లా కొని దాచుకున్నాను. కొన్ని పుస్తకాలను తెరవనే లేకపోతున్నానన్న బాధతో అవి గుర్తొచ్చినప్పుడల్లా వాటిని చేత్తో నిమురుతూ ఎప్పుడు పూర్తి చేయగలనా అని తహతహలాడాను. రిటైరయ్యాకే కదా ఒక్కొక్కటీ, చదువుతున్నాను. ఇప్పుడు నేను చదివేది ఎంత మంచి పుస్తకమో తెలుసా? గొప్ప సైన్స్ ఫిక్షన్ నవల. ‘వర్చువల్ రియాల్టీ’ని ఉపయోగించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించే విధానాన్ని ఎంతో గొప్పగా వ్రాశాడు. త్వరలో మెటావర్స్ టెక్నాలజీ రూపుదిద్దుకోబోతుందట. అదే జరిగితే ఫోన్ సహయంతోనూ ఏ.ఆర్. సెట్ సహాయంతోనూ మన ఇంట్లోనే వుండి మనం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. చదవటానికి, ఊహించుకోవటానికి చాలా బాగుంది.”
“అయ్యా, విశ్వనాధంగారూ! అలాగే తమరు సమస్త విశ్వాన్ని చుట్టి వద్దురుగాని, వర్చువల్ రియాల్టీయో, ఏదో అని చెప్తున్నారుగా? దాని కోసం ఏ హెడ్ సెట్స్ కావాలో? కళ్లకు ఏఏ గ్లాసులు వాడాలో, ఫోన్లలో కంప్యూటర్లో ఏయే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలో అవన్నీ మీరే ఓపిగ్గా తెలుసుకోండి. మాయా ప్రపంచంలో విహరించి వద్దురుగాని. మాయలూ, అద్భుతాల పట్ల నాకే నమ్మకాలూ లేవు.”
“నిజం పార్వతీ. ఈ మెటావర్స్ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే మనం ఎక్కడికైనా వెళ్లి ఏ పనైనా చేసేసినా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనుభవంలోకి వస్తుంది. ఇదంతా చదువుతుంటే నాకిది త్వరలోనే సాధ్యపడుతుందనిపిస్తుంది. చూస్తూ వుండు. ఈ టెక్నాలజీ ఎంత స్పీడుగా జనాలకు అందుబాటు లోకొస్తుందో?”
“వస్తుంది. వస్తుంది. ఇదంతా వింటుంటే లోగడ ఒకసారి పబ్జీ గేమ్ సంగతి చెప్పారే? అది గుర్తొస్తుంది” అంటూ గట్టిగా నవ్వేసింది పార్వతి.
“సరే గాని. నాకు బాగా ఆకలవుతుంది. టిఫినేం చేశావు?”
“ఇంకా నేను వంటలు చేయటం, మీరు తినటం ఎందుకండీ? మీకు కుదిరితే ఆ టెక్నాలజీ యేదో ఇప్పట్నుండే వాడండి. నేను వంట చేసేశానన్నట్లుగా, మీరు తినేసినట్లుగా భావిస్తే పోలా! అప్పుడు నేను, మీరు ఎవరిక్కావలసిన పుస్తకాలు, వాళ్లం చదువుకుంటూ వుందాం. ఇంట్లో కూర్చునే చుట్టుపక్కాలింటికి వేడుకలకు వెళ్లేసి వచ్చినట్లుగా, ఊహించుకునేద్దాం. అమెరికాలో వున్న మన పిల్లల దగ్గరకు, చూడాలనిపించినప్పుడల్లా ఇట్టే వెళ్లి నిముషాల్లో తిరిగి వచ్చేద్దాం. సరేనా?”
“నా మాటలు నాకే అప్పగిస్తున్నావు. వంట ఇంటితో మొదలు పెట్టి, అమెరికాలోని, మన పిల్లల ఇంటి దాకా వెళ్లిపోయావు. మాటల్లో నిన్నెప్పుడైనా గెలిచానా?” అని నవ్వుకుంటూ విశ్వనాధం ఒళ్లు విరుచుకుంటూ పడక్కుర్చీలో నుండి లేచాడు.
***
ఇంటెర్నెట్ వేదికపై సరికొత్త టెక్నాలజీ రూపొందించబడిందన్న విషయాన్ని టి.విలో విన్నాడు విశ్వనాధం. దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అతనికి చాలా ఉత్సాహంగా వున్నది. కూకట్‌పల్లిలోని ఒక స్టార్టప్ కంపెనీకి రెండు సార్లు చాలా ఆసక్తితో వెళ్లొచ్చాడు. ఆ కంపెనీ వారు మెటావర్స్ ప్రాజెక్టును మొదలు పెట్టారు. తమ విఆర్ సెంటర్లో, వీఆర్ హెడ్ సెట్ పెట్టి కళ్ల మందు ఊహాజనిత వాతావరణాన్ని సాక్షాత్కరింపజేస్తున్నారు. చాలా సంస్థలకు రూపకల్పన చేసి వర్చువల్ రూపంలో సృష్టిస్తున్నారు. తెలిసిన వాళ్లతో వెళ్లి అదంతా చూసి వచ్చాడు. సెంటర్ నుంచి బయటకి వచ్చేసిన తర్వాత కూడా తను చూసిన దృశ్యాలను మర్చిపోలేకపోతున్నాడు. ఇంటికి వచ్చేసినా కూడా అదే ధ్యాసలో వుండిపోయాడు.
కృష్ణదేవరాయల ఆస్థానం. భువన విజయ సభాప్రాంగణం. అష్టదిగ్గజ కవులతోనూ, సామంతులతోనూ, మంత్రులతోనూ, తక్కిన అధికారులతోనూ, కొలువు కూటం కళకళలాడుతూ వున్నది. విదేశాల నుండి వచ్చిన వ్యాపారులు రాయలవారితో ఎప్పుడు మాట్లాడే, అవకాశం దొరుకుతుందా, అని చూస్తున్నారు.
“మేం పిల్లుల్ని పెంచమన్నాం. ఎలుకల్ని నివారించమన్నాం. మన రాజ్యంలో ధాన్యాన్ని, కాపాడాలని ఆజ్ఞపించాం. అందుకోసం మా తరపు నుండే మీ కందరికీ పిల్లుల్ని అందజేశాం. వాటి పోషణ కోసం రోజూ పాలను అందించే ఏర్పాటు చేశాం. చాలా మంది మేం చెప్పినట్లే చేశారు. పిల్లుల్ని బాగానే సాకారు. అవన్నీ ఆరోగ్యంగా, పుష్టిగానే వున్నాయి. కాని రామలింగ కవీ! మీ కందజేసిన పిల్లి మాత్రమే బక్క చిక్కి వున్నది. ఎందుకో విశదీకరిస్తారా?” అన్నారు రాయలవారు.
“తప్పకుండా ప్రభూ! అందరిలాగే నేనూ పిల్లిని శ్రద్ధగానే సాకుతున్నాను. కాని పాలను చూస్తే మాత్రం నా పిల్లి అంత దూరం పారిపోతున్నది. పాలంటే ఈ పిల్లికి అస్సలిష్టం లేదు. నేను మాత్రం ఏం చేయగలను మహారాజా?” అన్నాడు నిస్సహాయంగా రామలింగ కవి.
“ఈ పిల్లికి పాలంటే ఇష్టం లేదా? ఆశ్చర్యంగా వున్నది. మేమూ చూస్తాం” అంటూ, రాయలవారే, ఒక గిన్నెలో పాలు తెప్పంచి పిల్లి ముందు పెట్టించారు. నిజంగానే, అది పాలగిన్నెను చూసి పారిపోబోయింది.
రాయలవారికేదో అనుమాన మనిపించింది. పిల్లిని తన దగ్గరకు తెప్పించి చూశారు. దాని మూతి చుట్టూ కాలిన గాయపు తాలుకూ మచ్చ కనబడింది.
“రామలింగ కవీ! నిజం చెప్పండి. పిల్లి మూతికి ఆ మచ్చ ఏమిటి?”
“ఏలినవారు నన్ను క్షమించాలి. మరిగిన పాలను వేడి వేడిగా గిన్నెలో పోసి పిల్లి ముందు పెట్టాను. ఆత్రంగా పాలలో మూతి ముంచింది. బాగా కాలింది. అది భయంతో అరుచుకుంటూ పారిపోయింది. అప్పట్నుంచీ పాల జోలికి రాదు. ఎలుకల్ని పట్టి తింటూ కడుపు నింపుకుంటున్నది. మన రాజ్యంలో ఎంతోమంది బీదవారున్నారు. వారికి కడుపు నిండా తిండి లేదు. అటువంటి వారికి ఆహారం అందించాలి గాని పిల్లులకు, పొట్టనిండా పాలు పోసి వాటిని మేపి, అవి ఎలుకల్ని వేటాడే శక్తిని కోల్పోయేటట్లు చేయటం ఎంత వరకు సబబు, సాహీతీ సమరాంగణ సార్వభౌమా?” అన్నాడు, రామలింగ కవి చేతులు కైమోడ్చి.
అదే నిజం అన్నట్లుగా సభ్యులందరి హవభావాలు చెప్తున్నాయి.
“మీరు చెప్పిందే నిజం రామలింగ కవీ. పిల్లుల్నీ సహజంగానే ఎలుకల్ని పట్టి తిననిద్దాం” అన్నారు రాయలవారు.
మరలా ఆ రోజులు, ఆ బంగారు కాలం తిరిగి వస్తే ఎంత బాగుండును?
***
మండే అగ్నికణం వాడు నేతాజీ సుభాష్ చంద్రబోసు. ఆ రోజుల్లో ఇంగ్లండ్ వెళ్లి ఐసీయస్ పరీక్షలు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. భారతదేశానికి తిరిగి వచ్చి ఆ ఐసీయస్ హోదాను వదిలి వేసిన గొప్ప దేశభక్తుడు, నేతాజీ. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎంతోమంది అతివాద వైఖరున్న యువత గుండెల్లో కొలువై వున్న నేతాజీ ఈ నాటికీ విశ్వనాధం లాంటి ఎంతో మందికి ఆరాధ్యదైవమయ్యాడు. నేతాజీ కొన్నాళ్ళపాటు కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి పార్టీని పటిష్టంగా నడిపించాడు. ఆనాడే కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను గురించి ప్రచారం చేశాడు. ఎన్నో సార్లు, జైలుకెళ్లి తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చాలా క్లిష్ట పరిస్థితులలో బెర్లిన్ చేరుకుని హిట్లర్‌ను కలిశాడు. అతని సహకారంతో 1943 మే లో జపాన్ చేరుకున్నాడు. 13000 మంది సైనికులను, కొంతమంది అధికారులను కూడగట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీని బలోపేతం చేశాడు. ఆ ఆర్మీని నడిపించి 1943లోనే అండమాన్, నికోబార్ దీవులను ఆర్మీ వశమయ్యేటట్లు చేశాడు. భారతీయ జెండాను ఆ దీవులపై రెపరెపలాడించాడు. తన సైన్యంలో ఎవరైనా సాధారణ సైనికుడు మరణించినా ఎంతో శ్రద్ధతో తన సమక్షంలోనే వారి అంత్యక్రియలు జరిగేటట్లు చూసిన మానవతామూర్తి నేతాజీ. తన స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ముమ్మురం చేయటానికి రష్యా సహాయం అవసరమని భావించాడు. ఆ సహాయం అడగటానికి జపాన్ యుద్ధ విమానంలో 1945, ఆగస్టు 18న రష్యా బయలుదేరాడు. కాని, దురదృష్టవశాత్తూ దారిలోనే ఆ విమానం కూలిపోయింది. అలా కాకుండా నేతాజీ ప్రయత్నాలు సఫలీకృతం అయివుంటే ఆయన సారధ్యంలో స్వతంత్ర భారతదేశం తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వుండేదేమో! అనాది నుండీ ఈ దేశంలో, దేశభక్తికీ, విజ్ఞాన సంపదకూ, ఆర్థిక పరిపుష్టికీ లోటు లేదు. ‘యత్ర విశ్వం భవతి ఏకనీడం’ అని ప్రాచీనులు కోరుకున్నారు. నిజంగా ఎప్పటికైనా అలాగే ప్రపంచమంతా ఒకే కప్పు కిందకు రావాలని, వస్తుందని విశ్వనాధానికి గట్టి నమ్మకం. మన దేశభక్తులైన నాయకుల సారధ్యంలో భారతదేశం, మిగతా ప్రపంచానికి దిక్సూచి లాగా వున్నది. ఇక మందు కూడా వుంటుంది.
***
ఏలూరు.
1983 జనవరి, 8
“ఏరా విశ్వనాధం! ఎంత పోస్టల్ సర్వీసులో పని చేస్తుంటే మాత్రం మా అందర్నీ ఉత్తరాలు వ్రాయమంటావేంటిరా? ఫోన్ చేసుకుని నిముషాల మీద విషయాలు తెలుసుకునే రోజులు ఇవి. ఈ నాలుగు పంక్తులూ రాయటానికి అరగంట పట్టింది. రిప్లై కార్డు అడ్రస్‌తో సహా పంపిస్తివి. ఓసారి మన ఊరూ రారా. సరదాగా కోవెలలో వెన్నెట్లో, ధ్వజస్తంభం మందు కూర్చుని మాట్లాడుకుందాం. గాలి విసురుకు పున్నాగ పూలు వచ్చి మీద రాల్తాయి. దేముడి ఆశీర్వాదమనుకుందాం. మా చెల్లెలుకు, పిల్లలకు నా ఆశీస్సులు. వుంటా.
నీ బాల్య మిత్రుడు, సుధాకర్. ”
ఆ పోస్టు కార్డు చదివి నవ్వుకుంటూ మరో మిత్రుడికి కూడా వ్రాయటం మొదలు పెట్టాడు విశ్వనాధం.
“ఒరేయ్ సుబ్బారావు! పోయిన సారి ఉత్తరంలో పోస్టు కార్డుగాని నీ కలలో వచ్చి తనను ఉపయోగించమని చెప్పిందా ఏమిట్రా? ఇన్‌లాండ్ లెటర్లూ, ఎన్వలప్‌లు వదిలేసి కార్డుల్ని పట్టుకున్నావు అని అన్నావు. అదేం లేదు. అవీ వాడతాను. మన సుధాకర్ ఒకసారి మనూరికి రమ్మంటున్నాడు. పోదోం. నువ్వు రా. తేదీ తర్వాత రాస్తాను. పోస్టు కార్డు చరిత్ర మీకేవ్వరికీ తెలియదుగా. మరో ఇన్‌లాండ్ లెటర్లో ఆ వివరాలు చేప్తాను. వుంటా?”
నీ
విశ్వనాధం.
అది చదువుతూ సుబ్బారావు నవ్వుకున్నాడు. అన్నట్లుగానే త్వరలో విశ్వనాధం నుంచి ఒక ఇన్‌లాండ్ లెటరొచ్చింది.
“రేయ్ సుబ్బారావ్!
ఫోన్లో మాట్లాడితే ఇన్ని అందమైన భావాలు రావురా. కాగితం కలం తీసుకుని వ్రాస్తుంటే పదాలు తన్నుకుంటూ వస్తాయి. భాషను మర్చిపోకుండా ఇలా వ్రాయటం ఒక కళరా. మనం దాన్ని మర్చిపోకూడదు. సరే పోస్టు కార్డు విషయానికొస్తే మొదటగా 1852లో కరాచీ నగరంలో ఈస్టిండియా కంపెనీ తపాలా బిళ్లని ముద్రించింది. 1879 నుండీ కార్డును గురించిన ప్రచారం మొదలయ్యింది. మన భారతదేశంలో 1964 లోనే తపాలా బిళ్లలు ముద్రించారు. మొదట్లో కార్డును ఒక వైపునే వ్రాయాల్సి వచ్చేది. 1902 నుండి కార్డు రెండో పక్క అడ్రసు పోను మిగతా ఖాళీలో కూడా వ్రాయటానికి వీలయ్యింది. 1951లో దీని మీద గాంధీజీ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వీటి వాడకం తగ్గిందిగాని అప్పట్లో రోజుకు 15 లక్షలకు పైగా కార్డుల్ని కొని వ్రాసేవారు. ఇప్పటికీ అప్పటికీ కార్డు రేటు చాలా తక్కువ. ఉపయోగం ఎక్కువ.
కనీసం మన తరంవాళ్లమైనా ఇలా ఉత్తరాలు వ్రాసుకుందాంరా. నాకు తెలిసిన విషయాలు నీకు వ్రాశాను. ఓపిగ్గా చదువు. వుంటా.
నీ
విశ్వనాధం.
***
“మళ్లీ సుభిక్షమైన, పరిపూర్ణమైన భారతదేశం తప్పకుండా ఆవిష్కరింపబడుతుంది పార్వతీ.”
“అంతకంటే కావల్సింది ఏముంటుందండీ?”
“అవును పార్వతీ. మనం విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. కాని మన మందు తరాల వారిని మర్చిపోకూడదు. వర్చువల్ రియాలిటీని గురించి నువ్వు ఆసక్తి పెంచుకోవాలి పార్వతీ. ఇలా రా కూర్చో. వివరంగా చెప్తాను. ‘ఆగ్యుమెంట్ రియాల్టీ’తో పాటు ‘మిక్స్‌డ్ రియాలిటీ’ లతోనే ఇది సాధ్యపడుతుంది పార్వతీ. ఏదైనా కానీ, దేన్ని చూసినా రియాలిటీ వుండాలి. అలా రియాలిటీ వుంటేనే మనకది నిజమైనన్న భావం కలుగుతుంది. అంతా రియాల్టీ.. రియాల్టీయే.”
“ఏమండోయ్ విశ్వనాధంగారూ! మీ రియాలిటీ గోల ఆపి మెలుకువ తెచ్చుకోండి. బారెడు పొద్దెక్కింది. రాత్రి పొద్దుపోయిన దాకా ఆ సైన్సు ఫిక్షన్ పుస్తకాలు చదివుంటారు. పైగా ఆ కంపెనీకెళ్లి ఏవేవో చూశానన్నారు. అద్భుతం అన్నరు. ఇంకేవేవో అద్భుతాలను ఊహించుకుని పడుకుని వుంటారు. అవే కలలోకి వచ్చాయి” అన్నది పార్వతి.
“అవును పార్వతీ. కలలే వచ్చాయి. మంచి కలలు. నిజంగా వర్చువల్ రియాలిటీలోనే, రాయలవారి రాజసాన్ని చూశాను. నేతాజీ గంభీరత్వాన్ని గాంచాను. నా చుట్టూ ఇన్‌లాండ్ లెటర్సు, ఎన్వలప్‌లూ ఉపయోగించే జనాల్ని వీక్షించాను. నాకిదో ఊహించని మధురానుభూతి పార్వతీ.”
“ఇలా నాకిష్టమైన వన్నీ చూడగలిగాను. ఈ టెక్నాలజీ ఆచరణలో కొస్తే ఎంత బావుటుంది?”
“వేరే పనేం లేనట్లు ఏంటండీ ఆ పలవరింతలు? ఏ కాలంలో వున్నారు మీరు? ఇప్పటి వర్తమాన కాలాన్ని చూడండి చాలు. గడిచిపోయిన సంగతులన్నీ ఆ వీ.ఆర్. సెంటర్లో కూర్చుని చూశానని కలలు గంటున్నారు. మీ వర్చువల్ రియాలిటీ పిచ్చి ఎటు నుండి ఎటు పోతుందో నాకర్థం కావటం లేదు.”
“మన పునాదుల్ని మనమెప్పుడూ మర్చిపోగూడదు పార్వతీ.”
“సరే మహానుభావా! మర్చిపోను. అస్సలు మర్చిపోను. ముందు బాత్ రూమ్‌కు నడవండి. బారెడు పొద్దెక్కింది” అంటూ పార్వతి వంటింట్లోకి నడిచింది.