[dropcap]ఆ[/dropcap]మె ట్రావెన్కూర్ పద్మనాభస్వామి ఆలయ ధర్మకర్త మరియు ప్రభువు శ్రీ పద్మనాభదాస చితిర తిరునాళ్ బలరామవర్మకు, బ్రిటిష్ వారికి అనుకులంగా పని చేస్తున్న ఆ సంస్థాన దివాన్ సి.పి. రామస్వామి అయ్యర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ట్రావెన్కూర్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 20,000 మందితో తిరుగుబాటు ఊరేగింపు జరిపి, ముందుగా తననే కాల్చమని తుపాకీ గుళ్ళకి ఎదురు వెళ్ళారు.
బాపూజీ అభిమానాన్ని చూరగొని, ఆయన అభీష్టమైన దేశ సేవికా సంఘాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శాసన సభ్యురాలిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీని వదిలి పెట్టినా, ఆ తరువాత మళ్ళీ పార్టీ తరుపున ఎన్నికలలో పోటీ చేసి బలపడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన ఆమే ట్రావెన్కూర్ ఝాన్సీరాణిగా పేరుపొందిన అచ్చమ్మ చెరియన్.
ఈమె 1909 ఫిబ్రవరి 14వ తేదీన నాటి తిరువాన్కూర్ (ట్రావెన్‌కోర్) సంస్థానం (నేటి కేరళలోని) కంజిరాపల్లి అనే కుగ్రామంలో జన్మించారు. అన్నమ్మ, తొమ్మన్ చెరియన్ ఈమె తల్లిదండ్రులు. ఆడపిల్లలను బాగా చదివించాలని వీరి ఉద్దేశం. తమ కుమార్తెలను అలాగే చదివించారు.
ఈమె కంజిరాపల్లి లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, చంగనచెరిలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను చదివారు. ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాలలో బి.ఎ. చదివారు. ఉపాధ్యాయ శిక్షణలో యల్.టి. డిగ్రీని పొందారు.
ఎడక్కరలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేశారు. అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని గానూ విధులను నిర్వహించారు.
విద్యార్థినిగా, ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడే భారతదేశ స్వాతంత్ర్యోద్యమ పోకడను అవగాహన చేసుకున్నారు.
తిరువాన్కూరు సంస్థానం మహారాజా శ్రీ పద్మనాభదాస చితిర తిరునాళ్ బలరామవర్మ పరిపాలనలో ఉంది. బలరామవరర్మకు బ్రిటిష్ ప్రభుత్వంతో సత్సంబంధాలుడేవి. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీతో అనుబంధం ఉండేది. ప్రజలకు సంస్కరణలతో కూడిన సుపరిపాలన దిశగా ఈ పరిపాలన కొనసాగింది. కాని బలరామవర్మ దివాన్ (ప్రధానమంత్రి) సి.పీ. రామస్వామి అయ్యర్ నియంతృత్వ పోకడతో ప్రజలకు రాజుకు మధ్య అగాధం ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితులలో ట్రావెన్కూర్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించబడింది. ఈ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరువాన్కూరు సంస్థాన ప్రాంతాలలో స్వాతంత్రోద్యమం కొత్తపుంతలు తొక్కింది. అచ్చమ్మ ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్టేట్ కాంగ్రెస్‌లో సభ్యురాలయ్యారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు శాసనోల్లంఘ నోద్యమంలో పాల్గొన్నారు.
(ప్రధానమంత్రి) దివాన్ రామస్వామి 1938 ఆగష్టు 26 వ తేదీన ట్రావెన్కూర్ స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధాజ్ఞలను విధించారు. అధ్యక్షుడు పి.ఎ. థాను పిళ్ళై, T.M. వర్గీస్ వంటి నాయకులను పిళ్ళైతో సహా వరుసగా 11 మంది అధ్యక్షులను అరెస్టు చేసి జైలులో బంధించారు. 11వ అధ్యక్షుడు కె. ఆర్. పిళ్ళై అచ్చమ్మ చెరియన్‌ను స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షురాలినిగా ప్రకటించారు. తరువాత ఆయనా అరెస్టయి జైలుకి వెళ్ళారు.
స్టేట్ కాంగ్రెస్ కార్యకలాపాలకు సంబంధించిన వార్తలను గురించి, స్వాతంత్ర్యోమ వివరాలను గురించి విపులంగా వ్రాసి పాఠకులకు చేర్చే ప్రజా పత్రికలు ‘మళయాళ మనోరమ’, ‘కేరళ కౌముది’.. పత్రికల లైసెన్సులను రద్దు చేయించారు దివాన్. స్టేట్ కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన ‘ఆల్ ట్రావెన్కూర్ యూత్ లీగ్’ను విధ్వంసక విప్లవాత్మక సంస్థగా నిషేధించారు ఈ చర్యలనన్నింటినీ బాపూజీకి తెలియజేశారు స్టేట్ కాంగ్రెస్ నాయకులు.
ఈ విధంగా ట్రావెన్‌కూర్ స్టేట్ కాంగ్రెస్ అష్ట దిగ్బంధన చేయబడింది. ఈ కీలక సమయంలో అచ్చమ్మ తన సమర్థతను నిరూపించుకున్నారు.
మహారాజు బలరామవర్మ పుట్టిన రోజు నాడు స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రదర్శనను నిర్వహించే కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకున్నారు ఈమె. ఈమె నాయకత్వంలో 20,000 మంది ప్రతినిధులు ఖద్దరు బట్టలు, గాంధీ టోపిని ధరించి తంపనూర్ నుండి రాజభవనం కొవడియార్‌కు బయలుదేరారు. బ్రిటిష్ పోలీస్ ఛీఫ్ పోలీస్ కాల్పులకు ఆదేశించాడు.
అచ్చమ్మ ముందుకురికి “ఈ సమూహానికి నేనే నాయకురాలిని. నన్ను కాల్చిచంపిన తరువాతే నా ఖాదీ సైన్యం మీద దాడి చేయండి” అని ఆగ్రహావేశంగా పోలీసులతో అన్నారు. ఆమె ధైర్యము వారిని ఆశ్చర్యచకితులను చేసింది. పోలీసు కాల్పులను ఆపేశారు. కాని నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు ఆమెను అరెస్టు చేశారు. జైలులో బంధించారు. జైలులో ఈమె పలురకాలుగా అవమానాలకు గురయ్యారు.
ఈమె ధైర్యాన్ని గురించి తెలుసుకున్న గాంధీజీ ఆమెను ‘ది ఝాన్సిరాణి ఆఫ్ ట్రావెన్కూర్’ అని కితాబునిచ్చారు. దేశమంతటా అచ్చమ్మ ధైర్యాన్ని దేశభక్తిని కొనియాడారు.
జైలు నుండి విడుదలయిన తరువాత ఉద్యమంలో తిరిగి పాల్గొన్నారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశ సేవికా సంఘ్‌ను ఏర్పాటు చేయమని ఈమెను కోరారు. దేశ సేవికా సంఘాలంటే మహిళా వాలంటీర్ల సమూహాలు. ఈ సమూహాలు కాంగ్రెస్ ఆశయాలను ముఖ్యంగా బాపూజీ సిద్ధాంతాలను అమలు పరుస్తాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి రామేశ్వరి నెహ్రూ కూడా దేశమంతా తిరిగి ఈ సంఘాల ఆవిర్భావానికి కృషి చేశారు. అచ్చమ్మకు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభించింది.
1942లో క్విట్ ఇండియా తీర్మానం చేసిన సమయంలో అచ్చమ్మ ట్రావెన్కూర్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఈమె ఈ తీర్మానానికి అనుకూలంగా స్పందించినందుకు రెండవసారి అరెస్టు చేసి జైలు శిక్షను విధించారు.
ఈమెతో పాటు సోదరి రోసమ్మ పున్నోస్, సోదరుడు కె.సి. వర్కీ కరిప్పపరంబిలు కూడా స్వాతంత్ర్య పోరాట యోధులే!
స్వాతంత్ర్యం లభించిన తరువాత కంజిరాపల్లి నియోజకవర్గం నుండి ట్రావెన్కూర్ శాసనసభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకి పోటీ చేశారు. 1967లో శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
1951లో ట్రావెన్కూర్ శాసనసభ్యుడైన వి.వి. వర్కీ మన్నంప్లాకల్‌తో ఈమె వివాహం జరిగింది. శ్రీ వర్కీ 1952-1954 వరకు కేరళ రాష్ట్ర శాసనసభ సభ్యులుగా పని చేశారు. ఈమె కుమారుడు జార్జ్ వి.వర్కీ. ఈమె 1982 లో మే 5వ తేదీన మరణించారు.
ఈమె తన ఆత్మకథను ‘జీవితం – ఒరు సమరం’ (LIFE; A STRUGGLE) పేరుతో అందించారు. శ్రీ బాల కె. మీనన్ ఈమెను గురించి ఒక లఘు చిత్రాన్ని నిర్మించారు.
కల్నల్ వాట్సన్ ఆమె తనని కాల్చి ఆ తరువాత తన అనుచరులను కాల్చమని ఆగ్రహోద్రేకంతో గర్జించిన అనుపమాన ధైర్యస్థయిర్యాలను మరచిపోలేనని చెప్పారు.
ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ది 13-10-2021వ తేదీన ఒక ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది. కవర్ ఎడమ వైపున ఈమె ముఖచిత్రం ముద్రించబడింది. క్యాన్సిలేషన్ ముద్రలో కూడా ఈమె చిత్రం కనిపిస్తుంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet