అద్భుతమైన ఫిలసాఫికల్ ట్రావెలాగ్ – ‘సత్యాన్వేషణ’

0
3

[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మిక జిజ్ఞాసతో విదుషీమణి సంధ్య గారు రచించిన ‘సత్యాన్వేషణ’ అనే గ్రంథం పరమాత్మ, పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరిస్తూ, తైత్తిరీయోపనిషత్తు లోని శ్లోకంతో ప్రారంభమై, ‘కావ్యార్థ సూచన’ను అర్థవంతంగా నిర్వర్తించింది. తన గ్రంథములో ఆమె స్పృశించదలచిన అంశాలను ఆమె ముందుగానే సూచించారు.

నిరాడంబరులు, అతిథి సేవాతత్పరులైన తల్లిదండ్రులకు జన్మించి, వారి సత్సంస్కారాన్ని వారసత్వంగా పొందారు రచయిత్రి. వారి అమ్మగారు ఇలా అంటారు ఒక చోట!

“వేద పండితులు బీదగా ఉంటారు గాని జ్ఞానములో ధనవంతులు.”

ఎంత గొప్ప మాట! దీనినే అలివర్ గోల్డ్‌స్మిత్ గారు తమ ‘వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్’ అన్న నవలలో

“Poor in attire, rich in wisdom” అని అన్నారు. జ్ఞానధనమే కదా నిజమైన ధనము!

తండ్రిగారి గురువు ‘దూబే’ గారు. శతాధిక వృద్ధుడు. బాల్యంలో రచయిత్రికి పెద్దగా గురుభక్తి మీద అవగాహన లేదు. ఈ విషయాన్ని ఆమే వినయంగా చెప్పుకొన్నారు. ఆ వయసులో అది సహజం.

అంత వేదాంత గ్రంథంలో కూడా ఆమె లోని హస్య ప్రవృత్తి అక్కడక్కడా తళుక్కుమంటుంది! అదే సమయంలో మానవ మనస్తత్వాన్ని ఆమె ఎంత చక్కగా శోధించారో అవగతమవుతుంది. ఈ వాక్యం చూడండి.

“ఈ సంవత్సరము ఎండలు బాగా ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం ఇదే మాట వింటాము మనము”

“జీవితాన్ని యథాతథంగా మానవులు స్వీకరించరు” అని రచయిత్రి ఇక్కడ వ్యంగ్యంగా చెప్పారు. “Accepting life as it is” అన్న సూత్రాన్ని ఆకళింపు చేసుకుంటే, మానవునికి ఈ ఆతృత ఉండదు మరి.

తండ్రి మరణం ఆ అమ్మాయికి శరాఘాతం అవుతుంది. అనాయస మరణం లభిస్తుంది ఆయనకు. అప్పుడే ఆ చిన్ని మనసులో ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది.

“ప్రాణం క్షణంలో వెళ్లిపోతుందా?”

ఈ ప్రశ్న గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు వేదాంతులందరికీ ఎదురైనది. తర్వాత మూడేళ్ళకీ తల్లి చనిపోతుంది పాపం! అప్పుడామె కృంగిపోతుంది మానసికంగా. వైద్యులు దాన్ని clinical depression గా నిర్ధారిస్తారు.

అప్పుడు రచయిత్రి ‘గీత’ను శరణుజొచ్చారు. ‘సంసారము దుఃఖహేతువు’ అని తెలుసుకొన్నారు.

‘ఏతావానేవ సంసార ఇదమస్త్వితి యన్మవః’ అంటుంది యోగవాశిష్ఠం. హేతువు తెలిసింది గాని, నివారణ తెలియదు. దాన్ని వెతికే బృహత్ ప్రయత్నమే ఈ గ్రంథం!

రచయిత్రి అసేతుహిమాచలము పర్యటించారు. పుణ్యక్షేత్రాలు దర్శించారు. రకరకాల యోగులను, పీఠాధిపతులను కలిశారు. తనకు సరియైన గురువు ఎక్కడ దొరుకుతాడని ఆర్తితో వారిని ప్రశ్నించారు. గ్రంథం మొదటి నుంచి చివరి వరకు ఈ ఆర్తి మనకు కనబడుతుంది. ఒక దశలో మనం (పాఠకులు), “తండ్రీ! విశ్వస్వరూపా! ఈమెకు ఉత్తమ గురువు లభించేలా చేయి స్వామీ” అని మొక్కుకుంటాము. ఆమెతో ప్రయాణిస్తూ, సహానుభూతి పొందుతాము. ఉత్తమ రచనలో ఉండే లక్షణమిది. అరిస్టాటిల్ మహాశయుడు చెప్పిన IMPORT (కావ్య పరమార్థం) అంటే ఇదే!

విశేషమైన విషయం ఏమిటంటే, ఆమెకు తన భర్త, తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అందించిన నైతిక మద్దతు. అది అనన్య సామాన్యం. ఆయన వృత్తి రీత్యా క్షణం తీరిక లేనివాడు. దంపతులుండేదేమో అమెరికాలో. ఆమె తన సత్యాన్వేషణను చేపట్టవలసిందేమో భారతావనిలో. అప్పుడాయన ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ఆమె పారమార్థిక యాత్రలో ఆమెకు ఉత్పన్నమయ్యే కొన్ని ఇబ్బందులకు ఆయనే పరిష్కారాలు చూపుతుంటాడు. అంటే, ఆయన ప్రత్యక్ష్యంగా ఆధ్యాత్మ మార్గంలో లేకపోయినా, దాని విలువ తెలిసినవాడు. దాని సూక్ష్మాన్ని ఎరిగిన వాడు. ఒక రకంగా రచయిత్రి జీవిత భాగస్వామి ‘కర్మయోగి’ అని నా అభిప్రాయం.

“భార్యాభర్తలలో ఆధ్యాత్మిక పరిమళం వికసించాలంటే జీవిత భాగస్వామి సహకారం ఎంతో అవసరం” అని ఈ దంపతులు నిరూపించారు.

ఈ గ్రంథాన్ని ఒక అద్భుతమైన philosophical travelogue అంటాను నేను. పరమహంస యోగానంద వ్రాసిన ‘The Autobiography of a Yogi’ అన్న గ్రంథంలో మాదిరిగా, అంత మంది కాకపోయినా, చాలా మంది జ్జానులు మనకు సంధ్య గారి పుస్తకంలో దర్శనమిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. కానీ అందరి లక్ష్యం సత్యదర్శనమే!

‘నదీనాం సాగరో గతిః’ అన్నట్లు అన్ని నదులూ సంగమించాల్సింది సాగరుని లోనే. ‘ఏకం సత్! విప్రాః బహుధా వదన్తి’ అన్న ఆర్ష వాక్యాన్ని రచయిత్రి తన రచనలో సుసంపన్నం చేశారు. హిందూ సనాతన ధర్మంలోని వైవిధ్యాన్ని చూపారు. ఎన్ని రకాలుగా, సాధకుని మానసిక స్థాయిని బట్టి, పరమాత్మను తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి, మన మతంలో వీలుందో చూపించారు. ఎక్కడా ఇతర మతాలను విమర్శించలేదు. ఒకటి రెండు చోట్ల ఆ మత విశ్వాసాలను కూడా గౌరవించారు. సర్వత్ర సమదర్శనమే కదా యోగము!

రకరకాల గురువులను రచయిత్రి దర్శించుకుంటారు ఈ గ్రంథంలో. ఆ క్రమాన్ని క్లుప్తంగా విశ్లేషిస్తాను. లేకపోతే ఈ గ్రంథంలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న వేదాంత రహస్యాలు బోధపడవు.

ఆమె తొలిదశలో బాగా ప్రభావితమైనది ‘పాల్ బ్రంటన్’ వ్రాసిన ‘శ్రీ రమణమహర్షి వారి ఉపదేశము’ అన్న గ్రంథంతో. ‘My Search in Secret India’ అంటాడు ఆ విదేశీ రచయిత. పెరియవ, శ్రీ చంద్రశేఖర యతీంద్రులను కలుస్తాడు. వారు రమణులను సూచిస్తారు.

సద్గురువుల్లోని గొప్పదనం అదే. తమను ఆశ్రయించిన వారి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి వారు వేరే గురువును సూచిస్తారు. వారిలో ‘ఇగో ప్రాబ్లమ్స్’ ఉండవు!

రమణమహర్షి గురించి పాల్ బ్రంటన్ ఇలా అంటారు:

“ఆయన బాహ్యస్పందనల కతీతుడు. అతి నిరాడంబరుడు. సిద్ధులను మహిమలను ప్రదర్శించి అంతేవాసులను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడు”

ఆయన విస్తృతంగా ఏదీ చెప్పడు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’. అంతే. పరమహంస యోగానంద వారి బోధ కూడా అదే. రచయిత్రి ఈ సందర్భంలో అంటారు:

“అవును సద్గుగురువుకై వెతికే ఆత్మసంవేదన అంతా ఒకటే కదా”

“Great men think alike” అన్న మాట మనకు గుర్తొస్తుంది.

ఆత్మస్వరూపం పవిత్ర గ్రంథాలు చదవడం ద్వారా లభించదని రచయిత్రి గ్రహించారు. అవి కేవలం మార్గదర్శనం చేస్తాయి అంతే! ‘నేను’ ఎవరు? ‘కోహం’ అని ప్రశ్నిస్తుంది కేనోపనిషత్తు. అదే ‘జిజ్ఞాస’కు మూలం. ‘జ్ఞాతుమిచ్ఛా జిజ్ఞాసా’ అంటే తెలుసుకోవాలనే కోరికయే జిజ్ఞాస. ఈ శరీరం ‘నేను’ కాదు అని ఆమెకు తెలుస్తుంది. మరి ‘నేను’ ఎవరు?

దీనిని తెలుసుకోవటానికే దైవానుగ్రహం, గురుకృప కావాలి.

“మరణం దేనికి సమాధానము?” అని ప్రశ్నిస్తారు రచయిత్రి. మరణం భౌతిక శరీరం యొక్క ముగింపు మాత్రమే, ఆత్మకు ముగింపు లేదు అని తెలుసుకోవడమే జిజ్ఞాసకు తొలిమెట్టు.

సిద్ధేశ్వరీ పీఠంలోని ‘మౌనస్వామి’ గణపతికి ‘ప్రాణప్రతిష్ఠ’ చేస్తారు. మన సనాతన ధర్మశాస్త్రాలలోని అద్భుత విషయాలను రచయిత్రి గ్రంథమంతటా ప్రకటిస్తుంటారు. ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగితే, ఆ దైవం తాలూకు జీవశక్తి అందులో ప్రవేశిస్తుందని ఋజువు చేస్తారు మౌనస్వామి. బ్రిటీష్ వైద్యుడు విగ్రహానికి నాడీ పరీక్ష చేసి, నాడి కొట్టుకుంటూ ఉండడం గమనించి, దిగ్భ్రాంతి చెందుతాడు!

“షిరిడీ సాయిబాబా ఉండగా ఇంకో గురువు అవసరమా?” – సూరి నాగమ్మగారు ‘రమణాశ్రమం లేఖలు (1945-50)’ అనే గ్రంథంలో దీనికి సమాధానం ఇస్తారు. సాయి సజీవ గురువు. బయటకి సామాన్యంగా కనిపించినా లోపల వేదాంత సారాన్ని యిముడ్చుకున్నవాడు.

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో షిరిడీ సాయి మహ్మదీయుడనీ, అతన్ని ఆరాధించడం, అతని తత్వాన్ని అనుసరించడం హిందూ మత సంప్రదాయాలకు విరుద్ధమని వాదనలు వస్తున్నాయి. హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారి మాటలు అవి. అన్ని విశ్వాసాలను తనలో ఇముడ్చుకోగలిగిన అత్యంత సనాతన ధర్మం మనది. సంగీతనికి భాషతో పనిలేనట్టు, జ్ఞానులకు మతంతో పని లేదు. కబీరుది ఏ మతం?

రచయిత్రి ‘గురుచరిత్ర’ను పారాయణం చేశారని అనిపిస్తుంది. గురువంటే దత్తప్రభువులే.

“అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగ౦బరః – ఉధ్ధర్తా భవ స౦కటాత్”

“దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి భజామ్యహం”

దత్తుడు తనను తెలుసుకోవాలనుకున్న సాధకులను అత్యంత కఠిన పరీక్షలకు గురి చేస్తాడు. అవన్నీ మానసిక స్థైర్యంతో తట్టుకుని నిలబడగలిగితేనే శ్రీదత్త స్వరూపం అవగతమవుతుంది. దత్తస్వామి మహిమలను, అవతార పరమార్థాన్ని, శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారు, తమ పర్యవేక్షణలో తీసిన ‘శ్రీదత్తదర్శనము’ అన్న సినిమాలో చక్కగా చూపించారు.

గురుచరిత్రలోని దీపకుని కథను హృద్యంగా వివరించారు రచయిత్రి. గురువును సేవిస్తే త్రిమూర్తులను కొలిచిన దానితో సమానం అని దాని ద్వారా మనం తెలుసుకుంటాము. గురుకృప లభించడానికి ముఖ్య అవరోధాలు నిద్ర, బద్ధకం. వాటిని జయిస్తే తప్ప, గురువుకి చేరువ కాలేము.

తర్వాత రచయిత్రి ‘శ్రీ శ్యామాచరణ లాహిరి’ అనే గురువును ఆశ్రయిస్తారు. ఆయన ‘క్రియాయోగ’ రూపకర్త. ‘సాధనకు సంసారం అడ్డు కాదు, సంసారులు కూడా మోక్షానికి అర్హులే’ అని బోధిస్తారా మహనీయులు. స్వామి వివేకానందులు ప్రవచించిన రాజయోగం, కర్మయోగంలకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన non-attachment అని అన్నారు. Non-attachment వేరు, Detachment వేరు. మొదటిది ‘అతీత స్థితి’, రెండవది ‘అనాసక్తత’.

“Just like water-drop on the lotus leaf”

“తామరాకు మీద నీటి బొట్టు వలె” ఉండాలి సంసారంతో మన బంధం. దాని ‘Impression’ ఏమాత్రం మన మనసుపై పడకూడదు అంటారు వివేకానందులు. గీతలోని ‘నిమిత్త మాత్రం భవ కౌంతేయ’ అన్న మాటలకు కూడా అర్థం అదే. ‘మాఫలేషు కదాచన’ అని కూడా భగవానుడు అన్నాడు.

ఈ కాన్సెప్ట్‌కు సజీవ ఉదాహరణ మా తండ్రి గారు బ్రహ్మశ్రీ, శతావధాని, పౌరాణిక రత్న పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి గారు. మేము ఎనిమిది మంది పిల్లలము. ఆయన వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించారు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలను మథించిన వారు. కానీ ఆధ్యాత్మికతలో పరిపూర్ణత సాధించారు. మలక్‍పేట్, రాణిబాగ్ అనే ప్రాంతంలో, రేస్ కోర్సు రోడ్డు మొదట్లోనే ఎడమవైపు సందులో కొంత దూరం వెళితే, ‘శివసచ్చిదానందాశ్రమము’ అన్న బోర్డు కనబడుతుంది. మా నాన్నగారి గురువుగారు శివసచ్చిదానందులు. వారు అక్కడే సమాధి పొందినారు. అక్కడ ఒక శివాలయం, దత్తమందిరం కలిసి ఉంటాయి. ధ్యానమందిరం ఉంది. కొందరు సాధకులకు అక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.

రచయిత్రి సంధ్య గారిని చదువుతుంటే నాకు మా పెద్దక్కయ్య అవధానం లక్ష్మీదేవమ్మ గారు గుర్తొస్తారు. ఆమెకు 76 సంవత్సరాలు. కొడుకులందరూ ఉన్నత పదవుల్లో ఉన్నా, వారి దగ్గర ఉండదు ఆమె. ఈ ఆశ్రమంలో ఉంటారు. గురువు గారి సన్నిధిలో సాంత్వన పొందుతుంటారు. నిజమైన వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నారు మా అక్కయ్య.

మా నాన్నగారు అక్కడే ‘ఆత్మవిజ్ఞాన కళాశాల’ను స్థాపించారు (College of self-science). గురువు గారు జీవించి ఉన్నప్పుడు ఆయనకు అంతేవాసిగా ఉండి, ఆధ్యాత్మ రహాస్యాలను తెలుసుకొన్నారు. ‘ఆధ్యాత్మ విజ్ఞాన అభ్యాస యోగము’ అన్న వేదాంత గ్రంథాన్ని రెండు భాగాలుగా రచించారు. అందులో ‘కళ్యాణకృత్’ అన్న ప్రకరణంలో, యోగి ఏ విధంగా తన యోగాభ్యాసం ద్వారా విశ్వకళ్యాణానికి తోడ్పడుతాడో విశదం చేశారు. త్రాటకము, భ్రామరి వంటి యోగ విద్యలను ఎట్లా సాధన చేయాలో వివరించారు. ‘శ్రీ శ్యామాచరణ లాహిరి’ వారి క్రియాయోగానికి మా నాన్నగారి విధానం కొంత దగ్గరగ ఉంటుంది. ఫిజిక్స్ లోని శక్తినిత్యత్వ సూత్రానికి యోగశక్తి అన్వయించి చూపారు మా నాన్నగారు. ఆయన దయవల్లనే నాకు కొంచెం ఆధ్యాత్మిక వాసనలు సంక్రమించాయి.

రచయిత్రి ధర్మశాస్త్రాలను, పురాణాలను, భగవద్గీతను, ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేశారు. గ్రంథమంతటా వాటి నుండి రిఫరెన్సులు మనకు కనబడతాయి. అవి ఆమె వివరిస్తున్న సందర్భానికి అనుగుణంగా ఉంటాయి.

జనకుడు రాజర్షి. సాక్షాత్తు శుక యోగికే జ్ఞానబోధ చేసినవాడు. సాధన – సంకల్పం – పట్టుదల అనే చెయిన్‌ను సూచించింది ఆయనే అంటారు సంధ్య గారు. అట్లే, తమ ‘మోహముద్గరం’ అనే గ్రంథంలో జగద్గురువులు ఆదిశంకరుల వారు ఒక చెయిన్‍ను వివరించారు. అది..

‘సత్సంగత్వం – నిస్సంగత్వం -నిర్మోహత్వం – నిశ్చలతత్త్వం – జీవన్ముక్తి’. దానిని రచయిత్రి ఉదహరించారు.

‘శ్రీ M’ అనే యోగిని దర్శించారు రచయిత్రి. ఆయన కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందినవారు. వారి గురువు గారు మహీశ్వరనాథ బాబాజీ. ఆయన ద్వారా నాథ సంప్రదాయాన్ని స్వీకరించి ‘మధుకరనాథ్’గా సన్యాశాస్రమ నామాన్ని పొందారు.

రచయిత్రి ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించారు. అది ఏమిటంటే, ‘భారతదేశం కర్మభూమి. ఇక్కడ జపతపాదులు ఫలించినంతగా ఇతర దేశాలలో ఫలించవు’ అనేది. అద్భుతమైన ఆలోచన! ఎందుకంటే పాశ్చాత్య దేశాలు materialistic దృక్పథాన్ని అనుసరిస్తాయి. మన దేశం spiritual path ను ఎన్నుకుంది.

రచయిత్రి ‘మంత్రం’ అనే కాన్సెప్ట్‌ను చక్కగా వివరించారు. ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ అని నిర్వచనం. ఆమె ఇలా అంటారు:

“మనసు ఇనుప ముక్క అయితే మంత్రము అయస్కాంతము”

“ఖండమైన మనస్సును చైతన్యపరిచి, అయస్కాంతం వలె దానిని ఆకర్షించి, దైవంలో లగ్నం చేసేదే మంత్రము” అన్న లోతైన భావాన్ని ఆమె ఒక చక్కని ‘రూపకం’ (metaphor) ద్వారా చెప్పారు. రమణులు ఇలా అన్నారు – “పూసలు లెక్కపెట్టడం కాదు. ‘నీవు’ అన్నది తెలుసుకో”. Ritual వల్ల దైవము తెలియదు. ఏకాగ్రత వల్లనే తెలుస్తాడు. కబీర్ దాస్ మహారాజ్ ఇలా అన్నారు కదా!

“జప్‍మాలా హాథ్‌ మే ఫిర్‌తీ హై

మన్ చారోం ఓర్ ఘూమ్‌తా రహతా హై”

“గ్రేట్ మెన్ థింక్ అలైక్” అనేది మళ్ళీ ఋజువైంది.

రచయిత్రి భర్త అనుమతితో భారతదేశానికి వస్తారు. గురుస్థానాలను దర్శిస్తారు. గంగాతీరవాసం చేస్తారు. హిమాలయాలని దర్శిస్తారు. ఆమె హైదరాబాద్ నుండి సంగారెడ్డిలోని వారి మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు, అత్త, మామ, ఆమెకు రెండు గ్రంథాలను ఇస్తారు. 1). శ్రీ భారతీ తీర్థ స్వామి అనుగ్రహభాషణములు 2) ‘నాయన’ అనే కావ్యకంఠ గణపతి ముని జీవిత చరిత్ర.

అక్కడ నుంచి వెళ్ళి మాణిక్యప్రభు మహరాజ్ దర్శనం చేసుకుంటారు. అక్కడి వారు మన బొరుగుల (మరమరాల) పులిహోరను ‘సుశీల’ అంటారని తెలుస్తుంది. రాయలసీమలో దాన్ని ‘ఉగ్గాని’ అంటారు. ఈ విషయానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఏమిటి? ‘సుశీల’ అనే పేరులో ఆధాత్మికత ఆమెకు గోచరించింది!

అక్కడ నుంచి ఆమె గొప్ప దత్తక్షేత్రమైన ‘గాణుగాపురం’ చేరుకుని, శంకరమఠంలో బస చేస్తారు. తర్వాత అక్కల్‍కోట్ స్వామిని దర్శిస్తారు. శరీరం అశాశ్వతమని, అందం నిరర్ధకమని, అంతర్గత సౌందర్యమే గొప్పదని బోధించారు అక్కల్‍కోట్ మహరాజ్. ఈ సందర్భంలో శేషప్ప కవి వరేణ్యుడు రచించిన ‘నరసింహ శతకము’ నుండి ఒక చక్కని పద్యాన్ని ఉదహరిస్తారు రచయిత్రి.

సీ:

పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు –

లోపల నంతట రోయ రోత

నరములు శల్యముల్‌ నవరంధ్రములు రక్త

మాంసంబు కండలు మైల తిత్తి

బలువైన యెండ వానల కోర్వ దింతైన

దాళలే దాకలి దాహములకు

సకల రోగములకు సంస్థానమై యుండు

నిలువ దస్థిరమైన నీటి బుగ్గ

తే:

బొందిలో నుండు ప్రాణముల్‌ పోయినంత

కాటికే గాని; కొరగాదు గవ్వకైన

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

అక్కడ ధనుంజయ పూజారి వారి సత్రంలో బస చేస్తారు ఆమె. ‘అన్నపూర్ణ సిద్ధి’ అంటే ఏమిటో తెలుసుకుంటారు. స్వామి ‘అత్యాశ్రమి’ కల్ట్‌కు చెందినవారు. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలకు అతీతులు. ఏడడుగుల ఎత్తు ఉండేవారు. నిరంతర బ్రహ్మానందావస్థలో ఉండేవారు. దీనినే ఇంగ్లీషులో ‘Bliss’ అంటాము.

అక్కడ నుంది కొల్హాపురం మీదుగా షిరిడీకి వెళతారు రచయిత్రి. కొల్హాపురం ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన శక్తిపీఠం. ఆమెను మహారాష్ట్రులు ‘అంబాబాయి’ అంటారు. మహాలక్ష్మి తన యోగశక్తితో అక్కడ నిలిచి ఉన్నది. అమ్మవారిని, తనకు సద్గురువును ప్రసాదించమని ఆవేదనతో ప్రార్థిస్తారు సంధ్యాదేవి.

శ్లో:

సరసిజనయనే సరోజహస్తే

ధవళతమాంశుకగంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతికరి! ప్రసీద మహ్యమ్

షిరిడీలో ‘కరివెన’ సత్రంలో బస చేస్తారు. ఎందుకోమరి దానిని ‘కరివేలు’ సత్రమని ప్రస్తావించారు ఆమె. సాయి దర్శనాంతరం హిమాలయాలకు బయలుదేరి వెళతారు. గంగానదిని దర్శించి, అందులో తీర్థస్నానం చేసి పులకించిపోతారు. అక్కడ జీయరు మఠంలో బస. జగన్నాథ పండితుని ‘గంగాలహరి’లోని గంగా స్తోత్రంతో మందాకినిని ప్రార్థిస్తారు ఆమె

శ్లో:

సమృద్ధం సౌభాగ్యం సకల వసుధాయః

కిమపితం మహేశ్వరం లీలాజనిత జగతః

ఖండపరుశో! శృతీనాం సర్వస్వం, సుకృత మధుమూర్తం

సుమనసాం, సుధాసోదర్యంతే

సలిలవశివం నః శమయతు

ఒక చోట ఆధ్యాత్మికతను గురించి సంధ్య గారు వ్యక్తపరిచిన అభిప్రాయం మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది!

“ఆధ్యాత్మికత, పదునైన కత్తి! అది మనలోని అహంకారాన్ని రకరకాలుగా, అన్ని వైపుల నుండి తెగ నరుకుతుంది!”

రచయిత్రికి తెలియని ఆధ్యాత్మిక విషయం లేదు. ఏవో పేర్లు చెప్పి వదిలేయరు ఆమె. సవివరంగా ప్రతి యోగ ప్రక్రియ గురించి చెప్పగలరు. ఫిలిప్పైన్స్‌కు చెందిన ‘చోవా కోక్ సూయి’ అనే, వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్ అయిన జ్ఞాని సూత్రీకరించిన ప్రాణిక్ హీలింగ్ నుంచి ఆదిశంకరుల సౌందర్యలహరి లోని ‘కుండలినీ శక్తి పైపైకి ఎగబాకి సహస్రారంలో కలిసేంత’ వరకు, దాని అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడనీ, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా అనే షట్ చక్రాలను, వశిష్ఠ జనక సంవాదాన్ని, ఆమె అరటిపండు వలచి చేతిలో పెట్టి మనతో తినిపించగలరు.

మహాభారతంలోని శాంతిపర్వంలో వచ్చే వశిష్ఠ-జనక సంవాదం యోగాన్ని ధ్యానంగా నిశ్చయిస్తుంది. అది రెండు రకాలు. మనసులో చేసేది, ఏకాగ్రవృత్తితో చేసేది. ధ్యానాన్ని సగుణ భావంతో చేస్తే ప్రాణాయామం ఫలవంతవుతుందని, నిర్గుణ భావంతో చేస్తే ఏకాగ్రత సిద్ధిస్తుందనీ జనకుడు చెబుతాడు. మన సనాతన ధర్మం లోని గొప్పదనమే అది. సగుణ, నిర్గుణ ఉపాసనలను రెండింటినీ అది అక్కున చేర్చుకున్నది.

తర్వాత, సముద్ర మట్టానికి 6158 అడుగుల ఎత్తులో ఉన్న జోషిమఠ్ చేరుకుని, శంకరుడు తపస్సు చేసిన కల్పవృక్షాన్ని, యోగనారసింహ ఆలయాన్ని దర్శిస్తారు రచయిత్రి. అంత high altitude లో ఆమెకు చెమటలు పడతాయి. శ్వాస ఆడదు. అప్పుడు అనుకుంటారు ఆమె –

“కారులో వస్తేనే ఇలా ఉందే. కేరళ నుండి కేవలం పావుకోళ్ళు ధరించి, నడుస్తూ, ఇంత దూరం శంకర భగవత్పాదులు ఎట్లా వచ్చారో కదా!”

“యోగులకు అసాధ్యమేముంది” అని ఆమె భావన.

అక్కడ నుంచి, భర్తతో సహా అరుణాచలం చేరుకుంటారు. తన 16వ ఏటనే రమణులకు ‘మరణానుభవం’ కలిగిందని తెలుస్తుంది. తర్వాత వారణాసి. విమానాశ్రయంలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి కలుసుకుంటారు. ఆయన ఆంధ్రాశ్రమంలో తనను కలవమంటారు. లక్ష జపం చేసినట్టు తెలుసుకొని “దానితో గురుదర్శనం కాదు తల్లీ, త్యాగరాజస్వామి వారికి 98 లక్షల జపం చేస్తే గాని శ్రీరామ చంద్ర ప్రభువు దర్శనం కాలేదు. నీకు కేవలం గురు దర్శనార్హత వస్తుంది” అని చెబుతారు స్వామి.

కాశీలో, శివరాత్రి పర్వదినాన, గురుకృపతో విశ్వేశ్వరునికి అభిషేకం, విశాలక్షి దర్శనం చేసుకుంటారు.

తర్వాత గుంటూరు చేరుకుని ‘విశ్వంజీ’ గురువుగారిని దర్శించుకుంటారు. వారిదీ దత్త సంప్రదాయమే. ఇక్కడ నేను వ్రాసిన ‘శ్రీ గురు దత్త పంచరత్నమాలా’ అనే స్తోత్రం నుండి ఒక శ్లోకం మీకు అందిస్తాను.

శ్లో.

అత్రిపుత్ర! గురుదత్త ప్రభో! మహాత్మా!

వయం సముద్ధర! కిల్బిష ఘోర కూపాత్

ఖండ ఖండయ! జ్ఞాన ఖడ్గేన తిమిరమ్

విషయ బంధన మోహారాగేణ జనితమ్

రచయిత్రి, ఆధ్యాత్మికతతో మానవతను కూడా మేళవించిన humanist. ఒకసారి ఆమె తన డ్రైవరు కోసం ఇడ్లీలు చేసి తీసుకువస్తారు. ఆమె ఇడ్లీలు తినరు. కాని డ్రైవరు అక్కడ ప్రసాదం తినడు. తింటే జీవితాంతం మాంసాహారం మానుకోవాలి. కాబట్టి ఈ ఇడ్లీలు అతని కోసం. అదీ మానవత్వం అంటే. అది లేని ఆధ్యాత్మికత వ్యర్థం.

‘దేవీదాసు’ అనే యోగి రచయిత్రికి ‘సత్యం’ అంటే ఏమిటో వివరిస్తారు. “ప్రమాణాలతో ఋజువై హృదయానికి దగ్గరయేది సత్యం. ప్రమాణం జ్ఞానం. వేదాలు ప్రమాణం. ఎందుకంటే అవి అపౌరుషేయాలు కాబట్టి”. ఆయన ద్వారా ‘మాయ’ను కూడా తెలుసుకుంటారు ఆమె. “జీవుడు పరమాత్మ వేరు కాకపోయినా, వేరు అని అనిపించడమే మాయ”.

చివరికి, సామవేదం షణ్ముఖ శర్మ గారిని దర్శిస్తారు. వారి గురువులు శ్రీ పినపాటి వీరభద్ర మహాదేవు గారు, శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వారిద్దరి ప్రభావం సామవేదం వారి మీద చాలా ఎక్కువ. ఆయన రచయిత్రికి స్పష్టం చేస్తారు – “ఆత్మకు లింగ వివక్ష లేదు”.

“గురువులు శిష్యుల జిజ్ఞాస మీద, ఓపిక మీద కఠిన పరీక్ష పెడతారు” అని తెలుస్తుంది ఆమెకు. ఆమె నిరీక్షణ, సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం ముగుస్తాయి. అంటే, ఆమెకు సద్గురువు లభించాడా? ఆమె సత్యాన్వేషణ ఫలిస్తుందా? ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుందా? ఇటువంటి ప్రశ్నలు చివర్లో మనకు ఎదురవుతాయి. ఆమె వాచ్యంగా సామవేదం షణ్ముఖ శర్మ గారే తన సద్గురువుగా లభించారని చెప్పరు. కానీ మనకు అర్థం అవుతుంది.

ఇక్కడ ఒక సందేహం వస్తుంది.

ఇంతమంది గురువులను, జ్ఞానులను, యోగులను, రచయిత్రి దర్శించుకున్నారు కదా! వారందరూ కాకుండా, ఈయనే ఎందుకు ఆమెకు గురుస్థానంలో నిలిచారు? అని. గురుశిష్యుల మధ్య ఒక Wavelength కలిసినపుడే గురువు లభిస్తాడు. శిష్యుని ఆధ్యాత్మిక స్థాయి, గురువు అనుగ్రహ స్థాయి కలవాలి. అందుకే ఏ గురువు ఏ శిష్యుడిని అనుగ్రహిస్తాడనేది అనూహ్యం. సంధ్య గారి విషయంలో అదే జరిగింది. ఆమె ధన్యురాలు!

చివరగా, నేను వ్రాసిన ఖండకావ్యములోని ‘నగురోరధికమ్’ అను ఖండికలోని ఒక పద్యంతో ఈ సుదీర్ఘ విశ్లేషణను ముగిస్తాను.

సీ:

సూక్ష్మమ్ము నైనట్తి శుద్ధ రూపము దాల్చి

యెవ్వండు వెలుగొందు దివ్వెవోలె

భావమాత్రము చేత భవమెల్ల సృష్టించు

నెవ్వండు నేర్పించు నియమపథము

లేనిదానిని నమ్మి లేమి గ్రుండెడివారి

నెవ్వండు నభయమ్మునిచ్చి బ్రోచు

పరమార్థమును దెల్పి, పరమాత్మ తత్త్వంబు

నెవ్వండు బోధించు నేర్పుగాను

తే:

మహిత గురువర్యుడతడె పో మర్మవిదుడు

కనగ వేదాంతి; నిత్యమౌ కాంతిపథము

మోక్షపథదర్శి; యాతడే రక్షకుండు

గురుని నమ్మిన బాయు దా గున్న వెతలు!

~

శివాస్తే పంథానః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here