స్వాధీన!

17
6

రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

[dropcap]ఐ.[/dropcap]పి.యస్. అధికారి రఘురాం, ఎన్నో క్లిష్టమైన కేసులను, నిర్ణీత వ్యవధిలో, తెలివితేటలతో పరిష్కరించిన సమర్థుడైన అధికారిగా పోలీసు వర్గాలలో పేరు గడించాడు.

రఘురాం భార్య మైథిలి, ఒక ప్రవేటు కంపెనీలో ఉన్నతోద్యోగి. ఆ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు, కుసుమ, లావణ్య – కవలలు.

మహారాష్ట్రలోని చంద్రపూర్ దగ్గర గడ్చిరోలి ప్రాంత అడవులలో విలువైన టేకు చెట్ల స్మగ్లింగ్ జరుగుతున్నదనే పుకారు వార్తల నేపథ్యంలో, అందులోని నిజానిజాలను తేల్చి వ్యవహారం చక్కబెట్టడానికి, పుకారు నిజమని ఋజువైతే, ఆ అక్రమార్కుల ఆగడాలు అరికట్టడానికీ, రఘురాంని చంద్రపూర్ బదిలీ చేసింది ప్రభుత్వం.

ఒక నెల రోజులలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నందున, సెలవు రోజైనా, ఉదయమే ఫలహారం చేసి, అత్యవసర పని మీద బయటకి వెళ్ళాడు రఘురాం. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు.

వంటపని, ఇంటి పని ముగించి వేడి వేడి కాఫీ త్రాగుతున్న మైథిలి మనసులో, తాను కూడా భర్తతో వెళ్ళాలా వద్దా అనే మీమాంశతో, చిరు సంఘర్షణ!

భార్యగా తన కర్తవ్యం భర్తకి తోడుగా ఉండడం. అయితే చక్కటి ఉద్యోగం, పిల్లల చదువులూ, ఆర్థిక స్వాతంత్ర్యం ఇక్కడే ఉండమని మనసుని ఒత్తిడి చేస్తున్నాయి.

అటూ ఇటూ పెద్దలూ స్నేహితులూ “ఇప్పుడు దాదాపు అందరి పరిస్థితీ ఇలాగే ఉంది, రఘురాం ప్రభుత్వ ఉద్యోగం ప్రతి మూడేళ్ళకీ లేదా ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వం బదిలీ చేస్తే అక్కడికి వెళ్ళాలి కనుక నువ్వు ఇంత మంచి ఉద్యోగం వదులుకోవాలని చూస్తున్నావంటే వెర్రితనమే అవుతుంది బాగా ఆలోచించుకో” అని సలహా ఇస్తున్నారు.

పరిపరి విధాలపోతున్న ఆలోచనలనుంచి విరామం కోసం, చదువుతూ చదువుతూ ప్రక్కన పెట్టిన రామాయణం పుస్తకం చేతిలోకి తీసుకుంది.

అక్షరాల వెంట చూపులు పరిగెత్తాయి..

***

పధ్నాలుగు సంవత్సరాల వనవాసం ముగిసిన అనంతరం, అగ్ని పునీత సీత, భర్త శ్రీరాముడితో అయోధ్యకు మరలి వచ్చింది.

శ్రీరాముడు, భరతుడినుంచి పాలనా బాధ్యతలు స్వీకరించి జనరంజకముగా పాలిస్తున్న రోజులు.

ఒకనాడు సీత తన తోడికోడళ్ళతో చతుర సంభాషణ జరుపుతున్న సమయములో, అందరికంటే చిన్న తోటికోడలు, సీతకి చెల్లెలూ అయిన శత్రుఘ్నుడి భార్య, శృతికీర్తి “అక్కా నాదొక సందేహం. అడగమంటారా?” అంది సీతని ఉద్దేశించి.

“అడుగు చెల్లీ” చిరునవ్వుతో బదులిచ్చింది సీత.

“బావగారు వనవాసానికి వెళ్ళేటప్పుడు మీరు తన వెంట వచ్చే తీరాలని ఆజ్ఞాపించారా?”

“చెప్పండక్కా మాకూ తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉత్సుకతగా ఉంది” మాండవి, ఊర్మిళ కూడా గళం కలిపారు.

 లిప్తపాటు ఆలోచించి “లేదు” బదులిచ్చింది సీత.

“మరి?”

“నాకూ స్వామికీ ఈ విషయమై ఎటువంటి చర్చా జరుగక మునుపే, చూచాయగా, అత్తగారు కైక వరములూ, మామగారు దశరథులు అత్తకిచ్చిన మాటా, తండ్రి ఆజ్ఞను పాలించడానికి ఉద్యుక్తులైన నా స్వామి నిర్ణయమూ తెలియవచ్చి, నేనొక నిశ్చయానికి వచ్చి, నార చీరెను ధరించి స్వామి కోసం ఎదురు చూస్తున్నాను”

సీత కనులు మూసుకుని, తనకీ శ్రీరామునికీ మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటూ, మంద్ర స్వరంలో చెప్తూంటే శ్రోతలు ఆసక్తిగా వినసాగారు..

ఇంతలో శ్రీరామచంద్రులు వచ్చి నన్ను చూసి “ప్రియ సీతా ఇదేమిటీ నీవిలా నార వస్త్రాలు ధరించావు?” అంటూ ఆశ్చర్యపోయారు.

“మీ వెంట వనవాసానికి నేనూ వస్తున్నాను”

“అదేమిటీ నీదాకా వచ్చిందా ఈ విషయం?” స్వామి ముఖంలో మళ్ళీ ఆశ్చర్యం!

“చూచాయగా విన్నాను”

“వద్దు సీతా నీవు నావెంట రావద్దు” స్వామి స్వరములో వారింపు, వెన్నంటి సుడులు తిరుగుతున్న అవ్యక్తమైన బాధ పసిగట్టింది నా మనసు.

“ఎందుకని?” నా కంఠములో కించిత్ నిరాశ.

“నీవు ఆ కష్టాలకు ఓర్చలేవు. నన్ను పెండ్లాడినందుకు, నా జీవితములో సంభవించిన ఊహించని ఈ విపత్కర పరిణామాలకు తల ఒగ్గవలసి వస్తున్న నేపథ్యంలో నిన్ను ఎలాగూ సుఖపెట్టలేను అలాగని నిన్ను కడగండ్ల పాలు చేయలేను. అయినా నీకు ఆ అవసరమూ లేదు.’

“స్వామీ మీరలా ఎన్నటికీ అనుకోవద్దు”

“నా తండ్రి ఆజ్ఞా పాలించడం నా ధర్మం అందుకు నీవు కష్టాల పాలవడం నాకు సుతరామూ అంగీకారం కాదు”

“మీ తండ్రిగారికి ఇచ్చిన మాటకు కట్టుబడాలని మీరు భావిస్తున్నట్లే, వివాహ సమయములో, అగ్నిసాక్షిగా మీతో కలిసి ఏడడుగులు నడిచి, చేసిన బాసలకు కట్టుబడి మీ వెంట రావాలని నేను నిర్ణయించుకున్నాను”

“అందుకు ఇక్కడే ఉండి, రాజ భోగములు అనుభవిస్తూ, నేను తిరిగి వచ్చేవరకూ నీ అత్తమామలకు సేవ జేసినా కూడా, నీవు ఆ బాసలు నెరవేర్చినట్లే సీతా”

“మీరు చెప్పినది సమంజసమే స్వామీ, వివాహమైన తరువాత మీ వారంతా నావారే. వారికి సేవ చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తాను. అది నాకెంతో ఆనందం కలిగించే విషయం. అయితే ఈ బంధాలన్నీ మీద్వారా ఏర్పడినవే. నా కర్తవ్యం ప్రప్రథమంగా మీ పట్ల. మీ తర్వాతే ఎవరైనా”

“రాముడిని వివాహమాడి సీత దుర్భర కష్టాలు అనుభవించిందనే లోకనిందకు నన్ను గురికమ్మంటావా”

“స్వామీ మీరు చెంత లేకుండా ఈ అయోధ్యలో ఉండి నేను సుఖాలు అనుభవించగలనని అనుకోవడం లేదు. నేను కష్టపడాలన్నది విధాత నిర్ణయమే అయినట్లయితే ఆ కష్టాలేవో మీతోనే ఉండి అనుభవిస్తాను. అప్పుడు మిమ్మల్ని వెన్నంటి నడిచానన్న కనీస తృప్తైనా నాకు మిగులుతుంది”

“మరొక్కసారి ఆలోచించు సీతా”

“బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అయినా మీరు నన్ను రావద్దనే అంటున్నారు కదా! అటువంటప్పుడు ఈ విషయములో కష్టనష్టాలు అన్నీ స్వయంకృతమే అవుతాయి. ఇక లోకమంటారా, ఎన్నడూ ఎవరికీ కలలోనైనా అపకారం తలపెట్టని, మిమ్మల్నే అర్థం చేసుకోలేని లోకం నన్ను మాత్రం అర్థం చేసుకుంటుందని ఏమిటి నమ్మకం. సీతను ఎవరూ శాసించలేరనీ, సీత పరాధీన కాదు తన నిర్ణయాలు స్వయంగా తాను తీసుకోగల అధికారం కలిగిన స్వాధీన అనీ, తన అభీష్టానుసారమే భర్తతో వనవాసానికి తరలి వెళ్ళిందనీ, లోకం ఒకనాడు కాకపోతే ఒకనాడైనా అర్థం చేసుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. కనుక నాకు సంబంధించినంతవరకూ, గతములో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే, ఏ విషయానికీ మీరు బాధ్యులని ఇకపై ఎన్నడూ అనుకోవద్దు”

“ఈ క్షణం నాకెంత ఆనందంగా ఉన్నదో మాటలలో తెలుపలేను. నీవు కష్టాలు పడుతుంటే చూడలేననే నావెంట రావద్దని అన్నానేగానీ నిన్ను విడిచి నేను మాత్రం సుఖముగా బ్రతుకగలనా ప్రియా” అంటూ నన్ను, తన గాఢ పరిష్వంగములో బంధించారు నా స్వామి.

అక్క, సీత, ముఖకవళికలనే నిశితంగా గమనిస్తూ, ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్న చెల్లెళ్ళు, ఆమె చెప్పిన, ఇన్నాళ్ళూ తమకు తెలియని ఒక క్రొత్త సత్యం గురించి విని ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. అంతలోనే అక్క కంటి వెంట అశ్రు ధార గమనించి ముఖాముఖాలు చూసుకుని “అక్కా అక్కా” ఆందోళనగా భుజం తట్టి పిలిచారు.

ఉలిక్కిపడింది సీత..

***

దూరంనుంచి ఎవరివో స్వరాలు, దగ్గరగా బలంగా కుదుపుతున్న చేతులు.. ఒక్కసారి ఉలిక్కిపడి కనులు తెరిచిన మైథిలికి, తననే కలవరంగా చూస్తున్న పిల్లలు కనిపించారు.

“అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?” ఆత్రుతగా అడిగారు.

“ఏడుస్తున్నానా?” ఆశ్చర్యపోయింది.

“అవును చాలా సేపటినుంచీ” ముక్తస్వరంతో అన్నారు.

‘’పుస్తకం చదువుతుంటే ఎప్పుడు కనులు మూతపడ్డాయో తెలియనే లేదు సుమా! అయితే అదంతా ఒక కల అన్నమాట. ఎంత చక్కటి కల. ఊ.. ఇప్పుడు నేనేమి చేయాలో నాకు, అరటిపండు ఒలిచి పెట్టినట్లు, బాగా అర్థమైంది’ గబగబా కళ్ళు తుడుచుకుంది.

“పదండి ఏదైనా తిందురుగాని” పిల్లలతో వంట గదివైపు నడిచింది.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.

“నాన్న వచ్చారు” ఉత్సాహంగా పరిగెత్తి తలుపు తీసి తండ్రిని ఆనందంగా చుట్టేసారు.

కూతుర్లను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రఘురాం.

“మైథిలీ నా బట్టలు సర్దుకోవాలి ఇవాళ. మళ్ళీ రేపటినుంచీ ఆఫీసూ పనీ.. ఆ గొడవలో పడ్డానంటే క్షణం తీరుబడి దొరకదు” గదిలోకి వెళుతూ అన్నాడు.

“మీవి కాదు మనందరి బట్టలూ సర్దాలి” వెనకనుంచి అంది.

“అదేమిటీ! ఎందుకూ? అక్కడ మీరు ఉండలేరు. అయినా పని పూర్తవగానే నేను వెనక్కి వచ్చేస్తానుగా”

“అది ఎప్పుడవుతుందో తెలియదు. అప్పుడు మేమూ మీతో వచ్చేస్తాము. ఇప్పుడు మాత్రం అందరం కలిసే వెళుతున్నాము. ఒకవేళ అక్కడికి వెళ్ళాక, పరిస్థితుల ప్రాబల్యంవల్ల, ఈనాడు నేను తీసుకున్న నిర్ణయం మార్చుకోవలసి వస్తే, మరొక సమయోచిత నిర్ణయం అప్పుడే తీసుకుంటాను. అందుకు మీ సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను” ధృఢంగా పలికింది.

“నా గురించి బెంగపడుతున్నావా?” చిలిపిగా కన్ను గీటాడు.

“కాదు నా గురించి నేనే బెంగపడుతున్నాను మిమ్మల్ని వదిలి ఉండలేనేమోనని” అంతే చిలిపిగా తానూ సమాధామిచ్చి నవ్వింది.

“మరొక్క సారి ఆలోచించవోయ్! నేను బాగానే ఉంటాను. అఫ్‌కోర్స్ మీరు లేక పోతే నాకూ తోచదనుకో అందుకోసం నువ్వు నీ ఉద్యోగం ఇక్కడి పనులూ వదులుకోవక్కరలేదు మైథిలీ” అనునయంగా భార్యను దగ్గరికి తీసుకున్నాడు.

“నేనేమీ త్యాగం చేయడం లేదు. సంతోషంగానే మీవెంట వస్తున్నాను”

“మీవాళ్ళంతా మళ్ళీ నన్ను ఆడిపోసుకుంటారోయ్. నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటానని.. అదీ ఇదీ.. అంటూ” నసిగాడు.

“వినే వాళ్ళుంటే సరి అనే వాళ్ళు అంటూనే ఉంటారు. ఎవరేమనుకున్నా నాకు ఫరవాలేదు. మీరూ పట్టించుకోవద్దు. అయినా మీతో నేను వచ్చి తీరాల్సిందేనని మీరేమీ నన్ను ఒత్తిడి చేయడం లేదుగ”

“అంతేనంటావా?”

“అవును. ఇప్పుడు ఎప్పుడూ నేను స్వాధీననే! ఇది నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. భోజనాల వేళైంది వడ్డిస్తాను త్వరగా రండి” డైనింగ్ హాలు వైపు అడుగులు వేస్తూ అంది.

“స్వాధీన! భలే క్రొత్త పదం, విన సొంపుగా ఉంది, ఎక్కడ దొరికిందోయ్?”

వెళుతూన్నదల్లా వెనక్కి తిరిగి, తమాషాగా కనుబొమలు ఎగురవేసి, నవ్వి “కలలో” అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here