[dropcap]అ[/dropcap]మ్మ ఆ చిన్న గుట్ట ఎక్కుతోంది. అక్కడ దుంపలుంటాయి. వాటిని తెచ్చి అమ్ముకుంటే ఆ రోజుకు సరిపడే గంజినీళ్ళు తాగొచ్చు. ఆ గుట్ట మీదకెళ్ళటం అంత తేలికేమీ కాదు. అలాగని మరీ కష్టమూ కాదు. కానీ ఎక్కాలి. అక్కడి నుంచి ఊళ్ళోకి రావాలంటే గంట పైనే ప్రయాణం. గుట్టెక్కాలంటే కనీసం ఇంకో గంట. పొద్దెక్కేస్తే పెద్ద, డబ్బులెక్కువొచ్చే బేరాలు పోతాయి. అలా నాలుగైదు సార్లు జరిగి సాలినన్ని రూకలు రాక అమ్మ పస్తుండి పిల్లలకు పెట్టి తను టిపినీ చేసొచ్చానని చెప్పటం చిన్నయ్యకు ఇంకా గుర్తే. చిన్నయ్య మూడోవాడు. వాడిపైన ఇద్దరు మగ పిల్లకాయలు. పెద్దోడిని పెద్దోడు అంటారు. రెండోవాడిని మొదట చిన్నోడు అన్నారు కానీ, చిన్నయ్య పుట్టాక వాటిని నడిపోడు అవటం మొదలు పెట్టారు.
ఎందుకంటే చిన్నయ్యకు వాళ్ళ తాత పోలిక. ఆ తాత పేరు కూడా చిన్నయ్యే. మందిరం ముందు చిన్న దుకాణం పెట్టేటోడు. ఇప్పుడు లేడులే. చిన్నయ్య పుట్టటానికి 21 ఏడాదుల ముందు బకెట్ తన్నేశాడు. నిజంగానే. ఒట్టు. ఓరోజు పెద్ద చిన్నయ్య దుకాణం కట్టేసి ఇంటికొస్తున్నాడు. కరెంటు లేదు కదా అప్పుడు. కొత్తగా అదేదో సొతంత్రం ఒచ్చిన రోజులాయే. దారిలో ఏదో కాలికి తగిలి ముందుకు పడబోయి నిలదొక్కుకున్నాడు. సరిగ్గా అప్పుడే కాలికి బకెట్ తగిలింది. మళ్ళీ పడబోయి నిలదొక్కుకోలేదు. పడనే పడ్డాడు. అక్కడేదో కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది. పామేమో అన్న ఆలోచన రాగానే అంత లావు మనిషికీ గుండె ఆగిపోయింది.
పెద్ద చిన్నయ్య నిజంగానే లావుపాటోడే. అప్పటికి ఊళ్ళో ఉన్న ఐదొందల పదారు మందిలో పొడుగాటోడు కూడా. కొత్తగా ఊళ్ళోకి వచ్చిన కిరికెట్టులో బౌలింగేస్తాడు కూడా. మాంఛి వేగిష్టి అని ఊళ్ళో పంతులోరు అంటారు. ఇప్పటి కుర్రకారుకి నమ్మకం లేదు. సరే! ఎక్కడికొచ్చాం? ఆఁ, అలా తాడును పామనుకుని చిన్నయ్య చచ్చిపోయినా ఊళ్ళో ఎవుళ్ళూ నమ్మలేదు. ఎందుకంటే చిన్నయ్యంత ధైర్యవంతుడు లేనేలేడాయే! అందుకే తల బకెట్ కొక్కీకి కొట్టుకుని, కంతపడి రక్తం పోయి చచ్చిపోయాడనే నమ్ముతారు. ఎందుకంటే ఆ రక్తం మడుగులోనే జనం చూశారు మరి. అచ్చం చిన్న చిన్నయ్య మంచి బౌలరని పెద్దోడు నమ్మినంత వేరేవాళ్ళు నమ్మనట్టుగానే.
సరే! అమ్మనేడ వదిలేశాం? ఆ రోజు రాత్రి ఇంటికొచ్చింది అమ్మ. డబ్బులు బాగనే వచ్చాయి. కానీ చాలా నల్తగా ఉన్నట్టు కనిపించింది అమ్మ. అమ్మ రెండేళ్ళ క్రితం వాళ్ళూరి నుంచీ పుట్టింటికి వచ్చేసింది. నాన్నొదిలెయ్యలేదు. చిన్నయ్య రెండేళ్ళ పసోడుగా ఉన్నప్పుడు దూరంగా ఉన్న పట్నం వెళ్ళాడు. సంపాదించుకొద్దాం అని. మొదట నెలకోసారి అన్నీ పట్టుకొచ్చేవాడు. తరువాత్తరువాత రెండు నెలలకోసారి, ఆ పైన మూడు నెలలకోసారి వచ్చేటోడు. చిన్నయ్యకు ఆరెళ్ళి ఏడొచ్చేసరికి రావటం మానేసినాడు. మధ్యలో అమ్మ పసిదాన్ని తీసుకుని వెళ్తే బాగనే చూశాడు. అన్నీ కొనిపెట్టి పంపాడు కూడా. కానీ పట్నంలో ఎవుర్నో పెళ్ళి చేసుకున్నాడని చెప్తుండగా వినటమే కానీ, చిన్నయ్యకు ఋజువుగా తెలీదు. కానీ ఇంటికొచ్చే రోజుల్లో చాలా మంచిగా దగ్గరకు తీసేవాడు పిల్లల్ని. అందుకే ఐదుగురు సంతానం అయ్య మంచోడే అన్ని నమ్ముతారు.
ఏదైనా వాళ్ళ ఊళ్ళో ఉండలేక అమ్మ పుట్టింటికి వచ్చేసింది. నిజానికి ఈ ఊరి నుంచే ఆ పట్నం చాలా దూరం. సరిగ్గా ఆరోజే చిన్నయ్య ఆరు నిండి ఏడెక్కాడు. అందుకే అమ్మమ్మ వాడికి తాత ఎండి కంకణం ఇచ్చింది. తనకివ్వలేదని పెద్దోడు ఏమనుకోలేదు. కష్టం సుఖం తెలిసిన మనషాయే. వస్తున్న ప్రాయపు గొడవ తప్ప మిగతా యవ్వారాల్లో నికఖార్సైన మనిషి. నడి రాత్రి అందరూ నిద్రపోయాక ఏవో సినిమా పోస్టర్లు పట్టుకుని ఇంటెనక దొడ్లోకి దూరంగా పోవటం తప్ప. అమ్మ చూసింది కానీ ఊరుకుంది. ఏమనదు. మిగతా వాళ్ళకు తెలియదు. మరే! చెప్పటం మరిచాను. అమ్మ అమ్మమ్మకు ఒక్కతే సంతానం.
సరే! ఇవాళ్ళి రోజుకి అమ్మమ్మ పోయి ఏణ్ణర్థం కావొస్తోంది. చిన్నయ్యకి తాతయ్య ఎండి కంకణం అంటే ప్రాణం. అమ్మమ్మ ఇస్తూ చెప్పింది, “నా మొగుడంటే ఊళ్ళో అందరికీ బొగ అబిమానం. నువ్వు గుడక ఊళ్ళో అంత గొప్పోడివి కావల్ల.” ఇవాళ అమ్మకు నల్తగా ఉంది కదా. ఆ కొండ పైనే ఏదో అయ్యే ఉంటుంది. ఏవైందాని చిన్నయ్య ఆలోచిస్తున్నాడు. ఎందుకో ఆరోజు చిన్నయ్యకు తిండి సహించలేదు. అమ్మ సరిగ్గా చేయలేదా? లేకపోతే అమ్మ అంత కష్టపడి చేస్తుంటే మేము ఏ సాయం చేయకుండా కూచున్నామని బాధా? ఏదేదో ఇంకా తెలియని వయసే చిన్నయ్యకి. ఏదో తిన్నాననిపించి వెళ్ళి అరుగు మీద కూచున్నాడు. ఎదురుగ్గా ఒక పిల్లి పసి కూనను నోటకరిచి తీసుకు వెళ్తోంది. దాన్ని పరికించి చూశాడు చిన్నయ్య.
“అమ్మ ఇట్ల దుంపలేరుకొచ్చి అమ్ముకున్నే బదులు తాతమాదిరి యాపారం పెట్టుకోచ్చు కద సిన్నా?” పెద్దోడు వచ్చి చిన్నయ్య పక్కన చేరగిల పడ్డాడు. పిల్లిని చూస్తూ ఉన్న చిన్నయ్య తల తిప్పకుండా ఊఁ అన్నట్టు తలూపాడు. కాసేపటికి పిల్లి వీధి దాటి కనుమరుగయ్యాక సాలోచనగా “డబ్బులుండాయా అమ్మ కాడ?” అడిగాడు. “అయ్యే ఉంటే బెమ్మానంగుండు కదూ?” చిన్నయ్యన్నాడు. వాడి మాటను మరోలా అర్థం చేసుకున్న పెద్దోడు, “యాడొస్తాడురా? ఆ పోయింది పోయింది రావటానికారా?” వీళ్ళిద్దరికీ తెలీని విషయం అయ్య రావటం లేదు కానీ, ఊరయ్యోరి చేత ఒక ఉత్తరమ్ముక్క రాయిస్తే అప్పుడప్పుడూ కాస్తో కూస్తో పంపుతూనే ఉన్నాడు. తనకేదైనా అయితే పిల్లలు కష్టపడకూడదని అమ్మ ఆ డబ్బు విషయం పిల్లలకు చెప్పకుండా దాస్తోంది. గుట్టమీదకెళ్ళేప్పుడు నాలుగైదు సార్లు పాములు కరిచాయి. ఎట్టా బతికిందో బతికింది. ఊళ్ళో పాములెక్కువే.
తనన్నది, పెద్దోడు విన్నది ఒకటి కాదు అని చిన్నోడికి కాసేపయ్యాక వెలిగింది. ఇంతలో అమ్మ కేక. “అయ్యా! చంటిది బట్టలు పాడు సేసుకుంది. పెద్దదానికి సాయం పట్టు.” అమ్మ గొంతులో ఏదో బాధను అణిచిపెడుతున్న ప్రయత్నం. లేకపోతే చంటిదాని పని ఎవరికీ వదలదు. లోపలకెళ్ళాడు చిన్నయ్య. ఎందుకో అమ్మ బైట పనులు పెద్దోడికీ, ఇట్టాంటి పన్లు చిన్నయ్యకి చెప్తుంది. తన నాయన పేరే పెట్టారని చిన్నయ్యను అయ్యా అనే పిలుస్తుంది. నడిపోడు ఏరోజూ తను సాయంత్రం వచ్చాక ఇంట్లో కనపడడు. ఎక్కడెక్కడ తిరిగి ఏ రాత్రికో వస్తాడు. వాడితో పెద్ద బాధ. ఏ పనీ చేయడు. చంటిదాన్నెత్తుకుని దొడ్లోకి వెళ్ళాడు చిన్నయ్య. వెనకాలే వెళ్ళింది అమ్మ నాలుగో సంతానం పెద్దది. పేరు మాత్రం చిన్నమ్మి. “ఇంట్లో పెద్దమ్మున్నా కనీసం పేర్లలోఅయినా చిన్నమ్మ ఉండాలే!” అనేది అమ్మమ్మ. చెయ్యాల్సిన సేవ చేశాక పాలు కావాలని అమ్మకు మాత్రం అర్థమయ్యేలా రాగం తీసింది చంటిది. పేరు కూడా చంటి అనే. ఇది మాత్రం అయ్య పెట్టాట్ట. ఇది పుట్టాక ఆర్నెల్లకి అమ్మమ్మ వెళ్ళిపోయింది. “అయ్యా, చంటిదానికి ఇయ్యాల్టికి ఆ గట్టుకింద గిలాసులో ఉన్న పాలు పట్టు” అమ్మ అరిచింది చిన్నయ్య దాన్ని ఇంట్లో దింపుతూంటే. గబాగబా వెళ్ళి ఆ పాల గ్లాసు తెచ్చిచ్చింది చిన్నమ్మి. చెప్పకుండానే అందుకుని పన్లు చేయటం ఐదున్నరేళ్ళ చిన్నమ్మి అలవాటు. “అచ్చు లచ్చిందేయేనే,” అంటుంది వీధి చివరిల్లు ముప్పైయ్యేళ్ళ సాంబవ్వ.
ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు పట్టాడు చిన్నయ్య. అవ్వగానే ఒళ్ళోకి తీసుకుని జోలపాట మొదలెట్టింది చిన్నమ్మి. అవటానికి పసిదే కానీ, పిల్ల మాత్రం పసిడి. ఆ గొంతులో అమృతం ఉందేమో అనిపిస్తుంది వినే వాళ్ళకి. అమ్మకు చంటిదాన్ని చూసుకునే ఓపిక లేదని ఆ పిల్లకు అర్థం అయింది. చిన్నయ్యా ఇవాళ దానితో గొంతు కలిపాడు. మంద్రంగా సాగే వాడి పాటలో ఏదో మహత్తు. పెద్దోడి దృష్టి మాత్రం ఊరవతల ఎండు పొలంలో రేపు ఊరుత్తరపిల్లు ఆసామి గారి పిలకాయల జట్టుతో జరిగే కిరికెట్టు ఆట మీద ఉంది. ఈసారి ఆసామి గారి పిలకాయల జట్టుతో గెలిస్తే మందిరం కిందూరోళ్ళ జట్టుకు ప్ఫది త్తళత్థళలాడే పది రూపాయల నోట్లిస్తా అన్నాడు పక్కూరి మున్సబు. నికార్సైన మనిషి.
“అవిగాని రావల్ల.. నీయవ్వ మా అమ్మచేత అంగడి పెట్టిచ్చ,” అన్నాడు పెద్దోడు తన నేస్తు సుబ్బడితో మొన్న. సుబ్బడు ఫాస్టు బౌలరు. ఎండు పొలంలో పిచ్చి మీద వాడు తప్ప బంతిని అంత వేగంగా వేయలేరు. చిన్నయ్య వేయగలడని పెద్దోడి నమ్మకం. కానీ వాడికి ఆ ఆట మీద పెద్దాసక్తి లేదు. ఎప్పుడు రమ్మన్నా ఏదో సాకుజెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ రేపు వాడు రావాల్సిందే. ఆసామి గారి పెద్దబ్బాయి బ్యాటువాపాలంటే సుబ్బడు వల్లే అవుతుంది. కానీ అనుకోకుండా వాడి కాలు విరిగింది. ఎండు పొలంలో పిచ్చి చూశాక ఒంటి చెట్టు మీద కూర్చున్నాడు! యనకాల్నుండీ ఏదో కుట్టినట్టనిపించి గభాల్న దూకబోయి కాలు విరగ్గొట్టుకున్నాడట. ఆ కుట్టింది ఆసామి గారి పెద్ద కొడుకు నేస్తు భవేశం అని ఎవరికీ తెలీదు. మందిరం కిందూరోళ్ళు గెలవకూడదని ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద పాలేరు (కుడి భుజం లాంటోడు) భవేశానికి ఒక కొత్త ఐదు నోటిచ్చాడు.
ఏతావాతా సుబ్బడు తప్ప ఉూరుత్తరపిల్లు ఆసామి గారి పెద్ద కొడుకుని కానీ, భవేశం గాడిని కానీ పరుగులు చేయకుండా ఆపాలంటే ఇంక చిన్నయ్యే దిక్కు, మందిరం కిందూరు జట్టు కెప్టెన్ పెద్దోడికి. ఈలోపల పాట పాడుతూనే అమ్మ దగ్గరకెళ్ళి చెయ్యి పట్టుకు చూశాడు చిన్నయ్య. రోజూకన్నా వెచ్చగా ఉంది. భవేశం గాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ అయ్య దగ్గర టాబిలెట్టు తేవాలని అనుకున్నాడు. కదలబోతే ఒద్దురా అన్నట్టు ఆపింది అమ్మ చేత్తో. సరే అన్నట్టు తలాడించి అరుగు మీదకు చేరాడు చిన్నయ్య.
“అమ్మకేం బాలేదురా,” అన్నాడు పెద్దోడు. “భవేశం గాడి నాన దగ్గర మందు తెస్తా అంటే వద్దన్నాది అమ్మ. రేపటికి తగ్గుతాదేమోలే.”
చాలాసేపు తర్జనభర్జన పడి రేపటి కిరికెట్టు ఆట గురించి ఎత్తాడు. చిన్నయ్యంటే పెద్దోడికి చాలా ప్రేమ. నడిపోడన్నా కూడా. కానీ, మాలోకంలా ఉండే నడిపోడికన్నా దిట్టంగా ఉండి కాస్త తెలివీ, బలం ఉన్న చిన్నయ్య అంటే కాస్తెక్కువ ప్రేమ. దూరం నుంచీ పరిగెత్తుకొచ్చి వాడు బంతేస్తుంటే మీ తాతే గుర్తొస్తాడని ఊరయ్యోరి మాట చెవిని పడ్డప్పటి నుంచీ పెద్దోడికి ఎలా అయినా చిన్నయ్యను కిరికెట్టాడించాలని పెద్దోడికి య్యిది. ఆడను గాక ఆడనన్నాడు చిన్నయ్య ఇవాళ. అమ్మకు బాలేదు. ఇద్దరం వెళ్తే చూసేదెవరు అని ప్రశ్న. సాంబవ్వను రమ్మందాం. సర్ది చెప్పాలని పెద్దోడి ఆరాటం. వంద రూపాయలే వాడి కళ్ళ ముందు ఆడుతున్నాయి. అదే కాదు. గెలుస్తే మున్సబుని దగ్గర చేసుకుని తను కూడా ఏదో పని చేసుకోవచ్చు. అప్పుడు చిన్నయ్య చదువుకు ఢోకా ఉండదని దూరాలోచన. రాత్రి వాళ్ళ వాదులాట తేలలేదు.
తెల్లారాక అమ్మ మరింత ఇబ్బంది పడుతోంది. భవేశం ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ట్యూషను పిల్లలను, క్రోటను మొక్కలను తప్పించుకుని వాడి నాన్న శంకరాన్ని కలిశాడు. లక్షణాలు చెప్పి టాబ్లెటడిగాడు. నాలుగు ఎర్ర గోళీలు చేతిలో పెట్టి ఏదైనా తాగాక పొద్దున రెండు, సాయంత్రం రెండు వేసుకోమన్నాడు.
“అయ్యా, వొల్లు సలసలా కాగిపోతాంది. రేతిరి బాండాది కానీ, ఇప్పుడేంటికో బయమేచ్చాంది,” అన్నాడు చిన్నయ్య. “పొద్దున ఇవి వాడి చూడు. సాయంకాలానికి తగ్గకపోతే రేపు పక్కూరాసుపత్రికి సాంబవ్వతో పంపిద్దాం,” అన్నాడు భవేశం నాన్న శంకరం. మొక్కలను, ట్యూషను పిల్లలను తప్పించుకుంటూ వెళ్తుంటే భవేశం గాడు మెరిసిపోతున్న ఐదు నోటు చూపిస్తూ తన చుట్టూ మూగిన పిలకాయలకేదో చెప్తున్నాడు. చిన్నయ్య అదేమీ పట్టించుకోకుండా ఇంటికి పరిగెత్తాడు. అమ్మ చేత గంజి తాగించి మాత్రలేశాడు. ఇంతలో పెద్దోడు చిన్నయ్య చెయ్యిపట్టుకుని వీధిలోకి తీసుకెళ్ళాడు. చిన్నయ్య ఆసుపత్రి సంగతి చెప్పి డబ్బులేవన్నా ఉన్నాయా అనడిగాడు. పెద్దోడి దగ్గర చిల్లర తప్ప ఆసుపత్రికి పంపేంత డబ్బుల్లేవు. ఈరోజు గడిచి రేపు అమ్మ గుట్ట మీదకు వెళితే తప్ప ఆ మర్నాటికి తిండి కూడా రాదు. ఎలా?
“సిన్నా ఈపూట ఆడుకోపో! మనం గెలిచ్చే అమ్మను ఆస్పత్రికి పంపీచ్చు.. అంగడీ పెట్టీచ్చు.”
చిన్నయ్య ఆలోచనలో పడ్డాడు. “అరేయ్! సిన్నా, సాంబవ్వ అమ్మ దగ్గర ఉంటానంటేనే ఆడుదువు. గెలిస్తే మున్సబుకి దగ్గర కావచ్చురా. ఆసామికన్నా మున్సబు మంచోడు. నిన్ను బా సదివిస్తాడు. నన్ను పనికి కుదిరిస్తాడు.”
రెండు నిముషాలు పూర్తిగా ఆలోచించాక చిన్నయ్య ఒప్పుకున్నాడు. పెద్దోడి సంబరం అంతా ఇంతా కాదు. ఇద్దరూ అమ్మకు చెప్పేందుకు లోపలికెళ్ళారు. అప్పటికే చిన్నమ్మి అమ్మకు తల మీద పట్టీ వేసింది. ఏదో కూనిరాగం తీస్తూ జోకొడుతోంది. చిన్నయ్య మంద్రంగా తనూ పాటందుకున్నాడు. ఎంత సేపు గడిచిందో.
ఆట సమయానికి పెద్దోడు తన నేస్తులను, జట్టు సభ్యులను వీధి చివర సమావేశ పరిచాడు. ఎట్టైనా ఇవాళ గెలవాలి. ఊరుత్తరపిల్లు ఆసామి గారి పిలకాయల జట్టు మీద గెలవాలి. ప్ఫది త్తళత్థళలాడే పది రూపాయల నోట్లు మున్సబు చేతి మీద అందుకోవాలి. మిగతా వాళ్ళకు సగం. పెద్దోడికి సగం అని సాంబవ్వ ముందు తీర్మానించారు. సాంబవ్వ చెయ్యి పట్టుకుని ఇంటి దగ్గర దిగబెట్టాడు చిన్నయ్య. బయమొద్దు. సూస్తుంటా అని అమ్మ పక్కనే కూర్చుంది ముప్పైయ్యేళ్ళ సాంబవ్వ. ఆటగాళ్ళందరూ ఎండుపొలం బాట పట్టారు. ఎనిమిది మంది ఒక్కో జట్టులో. అదేదో వన్సైడు బ్యాటింగుంది అన్నాడు ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయి. మున్సబు సరే అనిపించాడు అందరి చేతా. భవేశం గాడి నాన్న శంకరం అంపైర్. పదహారు ఓవర్లు. ఎవడూ ఐదు మించి వేయకూడదు. బ్యాట్సుమను మూడు ఓవర్లయ్యాక రిటైరవ్వాలి. వికెట్లు పడితే మళ్ళా రావచ్చు. ఏ వైపు బౌండరీలో, ఎటు పడితే ఔటో నిర్ణయించుకున్నారు. హాఫ్ సైడు (ఆఫ్ సైడ్) పరుగులు ఉండవు. మూడు సార్లు అటు కొడితే ఔటే. పెద్దోడు మొదటే చిన్నయ్యకి ఇవ్వలా బంతి. వాడిని దాచాడు.
ఆట మొదలైంది. ఊరయ్యోరి రంగడు ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయికి మొదటి బంతి వేశాడు. సరిగ్గా ప్రస్తుతపు మన భాషలో గుడ్ లెంత్‌లో పడి సరిగ్గా బ్యాట్ మీదకు వెళ్ళింది. ఊరయ్యోరి రంగడు వేగంగా పరిగెత్తినా చిన్నగానే వదిలాడు బంతి. అనుకున్నంత వేగంగా బంతి రాకపోవడంతో గాల్లోనే తేలింది బ్యాటు. పుసుక్కున నవ్వాడు విక్కీ కర్రోడు. ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయికి మండింది. కొడతా అన్నట్లు బ్యాట్ చూపాడు. పెద్దోడు ఆట మీదే దృష్టి పెట్టమని సైగ చేయటంతో షమించన్నా అని లెంపలేసుకున్నాడు కర్రోడు మోకాళ్ళ మీద కూచుని. ఆట సాగింది. నాలుగు ఓవర్లకు 19. వికెట్ పడలా. ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయి రిటైరయ్యాడు. భవేశం దిగాడు.
ఇప్పుడు దించాడు పెద్దోడు చిన్నయ్యను. ఆరు బారల దూరం నుంచీ పరిగెత్తాడు చిన్నయ్య. నాగు పాములా పరిగెత్తాడు. మహ వేగంగా పరిగెత్తాడు. అయినా చప్పుడు లేదు. హుప్పంటూ బంతి వేశాడు. మన కాలం భాషలో షార్ట్ ఆఫ్ ఏ గుడ్ లెంత్‌లో పడ్డ బంతి భవేశం గాడు ముక్కుకు మూడు అంగుళాల దూరం నుంచీ వెళ్ళింది. తగిలితే ఏమయ్యేదో. భయం, బెట్టు కలిసి కసిగా మారాయి. చిన్నయ్య రెండో బంతి. క్రీజు దగ్గర గాల్లోకి ఎగిరాడు. అప్పటికే వాడు ఐదడుగులు తాకుతున్నాడు. వాడి తాతలా ఊళ్ళోకల్లా పొడుగవుతాడని అందరూ చెవులు కొరుక్కుంటున్నారప్పటికే. బంతి ఆకాశంలోంచీ పడుతోందా అనిపించింది భవేశానికి. ఎందుకో చిన్నయ్య ఆ వేళ కసితో ఉన్నట్లు అనిపిస్తోంది. బంతి పడేలోపు వెనక్కి తగ్గాడు. అంపైర్ బంతి లేదన్నట్టు సైగ చేశాడు. ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయిని పిలిచాడు భవేశం గాడు. ఏం చెప్పాడో ఏమో! వాడు అంపైర్ దగ్గరకొచ్చి చిన్నయ్య వెండి కంకణం చేతికి తీసేసి బౌలింగ్ చేయమని చెప్పమన్నాడు. పెద చిన్నయ్య, కంకణం కథలు విన్న భవేశానికి పెద చిన్నయ్య ఈ చిన్నయ్యకు పూనాడని భయం వేసింది మొదటి బంతి చూడగానే. అలా చెప్తే అవమానమనిపించి ఆ కంకణం మీద పడ్డ వెలుతురు తన కళ్ళలో పడుతోందని బొంకాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు. ఊరుత్తరపిల్లు ఆసామి గారి పెద్దబ్బాయి నోరు, చేతి వాటం తెలిసిన వాళ్ళు చిన్నయ్యను బలవంతాన ఒప్పించబూనారు. తగ్గను గాక తగ్గనన్నాడు. పెద్దోడు అడ్డం పడ్డాడు. ఆట ఆగకుండా జరిగితే గెలవవచ్చు. డబ్బులొస్తే అమ్మనాసుపత్రికి పంపొచ్చు. ఈ మాటలతో ఒప్పించాడు. చిన్నయ్యకి రేగి పోతోంది. కంకణం తీసి నిక్కరు జేబులో వేసుకుని మళ్ళా ఆరు బారల దూరం నుంచీ పరుగందుకున్నాడు. వాడి చూపు భవేశం గాడి చిన్నోడి మీదే ఉంది. క్రీజు దగ్గర గాల్లోకి ఎగిరాడు. బంతి వదలకుండా కూలబడ్డాడు.
భవేశం గాడి నాన్న మంచోడు. అంపైర్‌గా నికార్సుగా చేస్తాడు. వైద్యానికి డబ్బులు తక్కువ పడ్డా ఊరుకుంటాడు. చిన్నయ్య తను పడినందుకు నవ్వుతున్న వాళ్ళను పట్టించుకోలేదు. శంకరం మంచితనం మీద తన ఆలోచన ఉంచాడు. తన క్రోధాన్ని భవేశాన్ని భయపెట్టాటానికే వాడాడు.
***
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.
1993.
వరల్డ్ సిరీస్ కప్ మొదటి ఫైనల్.
బ్యాట్సుమన్ బౌలర్ చేతి తెల్లటి స్వెట్ బ్యాండ్ తన ఏకాగ్రతను దెబ్బతీస్తోందని, అది తీయించమని అంపైర్ ను అడిగాడు. చిన్నయ్య కెప్టెన్ మాట మీదకు ఆ బ్యాండ్ తీసేశాడు. పదిహేనేళ్ళ క్రితం జరిగింది భవేశం గాడికి ఎలా జీవితాంతం గుర్తుండి పోయేలా చేశాడో, చిన్నయ్య ఆస్ట్రేలియన్ బ్యాట్సుమన్ డీన్ జోన్స్‌కు అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. చిన్నయ్య ఉరఫ్ కర్ట్లీ ఆంబ్రోస్!
ద కర్ట్లీ ఆంబ్రోస్.
ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఇంకో ఏడాదికి డీన్ జోన్స్ కెరియర్ ముగిసింది. ఆంబ్రోస్ పీక్ మొదలైంది. అమ్మ, అన్నల కల ఫలించింది.