[dropcap]ఆ [/dropcap]రోజు శుక్రవారం. సుధీర్ పుట్టిన రోజు. సుధీర్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని సిలికాన్ వాలీలో ఉన్న ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆరోజు సాయింత్రం తన స్నేహితులు, సన్నిహితులు, కలసి ఎల్ కామినొ రియల్‌లో ఉన్న ఒక గుజరాతీ రెస్టారెంట్‌కి భోజనానికి వచ్చేరు. ఆ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే కాష్ కౌంటర్‌లో ఉన్న దేవకిని చూసి షాక్ అయ్యాడు. ‘అవునా కాదా’ అని తెలిసీ తెలియని అయోమయం లో పడ్డాడు. స్నేహితులకు, సన్నిహితులకు ఏమేమి కావాలో చెప్పారు. ఆర్డర్ చేయడానికి క్యూలో నిలబడ్డాడు.
దేవకి కూడా అతనిని చూడగానే అశ్చర్యపోయింది, కొంచెం తడబడింది, నిగ్రహించుకొని “బాగున్నారా” అనడిగి “ఏమిటి కావాలి” అని అడిగింది.
అందరికి కావలసినవి ఆర్డర్ చేసాడు. బిల్ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి చెల్లించి, తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి “మీకు వీలయినప్పుడు ఫోన్ చేయండి.” అని వచ్చేసాడు.
మిగతా కస్టమర్స్‌కి కావలసినవి బిల్ చేస్తూ, ఆ విజిటింగ్ కార్డ్‌ని తన మనీ పర్స్‌లో పెట్టుకుంది.
సుధీర్ భోజనం చేస్తున్నప్పటికి గతస్మృతులు మెదలసాగాయి, స్నేహుతులు సన్నిహితులతో సరదాగ గడపి కూపిర్టినోలో ఉన్న తన అపార్ట్మెంట్‌కి వచ్చేడు. సుధీర్ తల్లితండ్రులు ముప్ఫై సంవత్సరాల క్రితమే అమెరికా వచ్చి స్థిరపడిపోయేరు. సుధీర్ తండ్రి బలరామమూర్తిగారు జనరల్ మోటార్స్‌లో మెకానికల్ ఇంజనీర్. తల్లి బి.ఎస్.సి చదివి ఎం.ఏ. సంగీతం చేసి వీణావాదనంలో ఆరితేరిన వ్యక్తి. సుధీర్‌కి ఇంజనీర్ నిపుణత, సంగీత జ్ఞానం వినికిడి, పరిశీలన, పరిశోధన ద్వారా సంపాయించేడు. తాతగారు ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో శస్త్ర చికిత్స ప్రొఫెసర్‌గా చేసి రిటైర్ అయ్యారు. దూరదర్శన్ కోలనీలో ఉంటున్నారు. సుధీర్ మిషిగన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేసేడు. ఆరు ఎడుగులు ఎత్తు, స్ఫురద్రూపి. స్విమ్మింగ్, టెన్నిస్ ఆడడం హాబీస్. బే ఏరియాలో సంగీత కచేరీలు ఏర్పాటు చెయడంలో కార్యనిర్వాహకులకు సహాయం చేస్తుంటాడు. ధనాన్ని ఎలా పొదుపు చెయాలో, ఏవి చేస్తే అభివృధ్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అతని సన్నిహితులు స్నేహితులకి అతనంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం.
***
ఆ క్రిందటి సంవత్సరం క్రిస్మస్ సెలవులకి హైదరాబాద్ వచ్చేడు. తాతగారి కోరికని గౌరవిస్తూ తాతగారి స్నేహితుడు సత్యనారాయణ గారి మనవరాలు దేవకిని ‘పెళ్లిచూపులు’ పేరిట చూడడానికి బంజారా హిల్స్ వచ్చేడు. దేవకి తండ్రి రామచంద్రరావుగారు మసబ్ టాంక్ దగ్గర ఒక ప్రభుత్వ సంస్థలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. దేవకి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్‌లో ‘ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్’ చదివి కర్ణాటక శైలి శాస్త్రీయ సంగీతం ఒక ప్రముఖ విద్వాంసురాలి దగ్గర నేర్చుకుంటుంది. శ్రావ్యమైన గొంతుక, శృతిలయబద్ధంగా పాడుతుంది.
సుధీర్ వెళ్లి పరిచయం చేసుకున్నాడు, ఇరువరి కుటుంబాలు బాగానే తెలుసు కాబట్టి ఫార్మాలిటీస్ తక్కువగానే జరిగేయి. రామలక్ష్మి బిస్కట్స్, మిక్సర్, కాఫీ తీసుకు వచ్చింది.
“వద్దండి. ఇప్పుడే బామ్మ చేసిన ఇడ్లీ, వడ శుభ్రంగా తిని వచ్చేను”, నిర్మొహమాటంగా అన్నాడు. “మా ఇంట్లో మీ హాట్ డ్రింక్స్ ఉండవు” అని అంది రామలక్ష్మి
“మా ఇంట్లోను ఉండవు. మా ఇంట్లో కూడా ఎవరు త్రాగరు. అంతేకాకుండా నేను వేగన్. ఆవు, గేదె పాలతో చేసినవి కూడా తినను, త్రాగను.” అని చెప్పేడు సుధీర్.
“దేవకి, నీకు కారు డ్రైవింగ్ వచ్చునా” అని అడిగేడు.
రాదని తల ఊఉపింది.
“డ్రైవింగ్ రాకపోతే అమెరికాలో చాల కష్టం, నేర్చుకో’ అని సలహా ఇచ్చేడు.
మరల “నీకు బాంక్ ఎకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్ద్ ఉన్నాయా” అని అడిగేడు.
లేవని చెప్పింది దేవకి. “అవి కూడా చాలా అవసరం” అని అన్నాడు.
రామలక్ష్మి కలుగచేసుకొని. “దేవకి, సంగీతం బాగా పాడుతుంది. నీకు చాలా ఇష్టమని మీ తాతగారు చెప్పేరు. ఒక పాట పాడమంటావా?” అని అంది.
తంబుర శృతి చేసి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అపూర్వ రాగమాలిక; “హరియే గతి సకల చరాచరములకు, హరియే గతి విరించి రుద్రాదులకైనా” శృతి, లయబద్ధంగా పాడింది.
“ఏ ఏ రాగాలో చెప్పగలవా? అని అడిగేడు.
“పల్లవి, అనుపల్లవి బౌళి, మొదటి చరణం కాంభోజి, రెండవ చరణం శుద్ఢధన్యాసి, మూడవ చరణం హంసానంది రాగాలలో అపురూపంగా విరచించేరు”, అంది దేవకి
“శుద్ధధన్యాసి రాగములో చరణం మరల పాడుతారా!” అని అన్నాడు సుధీర్.
దేవకి అతనివైపు వింతగా చూసింది.
“ఆయా యుగమున ధర్మము నిలుపక అవతారములను గాచిన దైవము; హయవాహనుడై కలియుగమందున అలమేలుమంగా పతివై వెలసిన”; అని పాడి వినిపించింది.
‘ఏమి తప్పులు పాడుతున్నారో మీకు తెలయలేదా” అని ఆశ్చర్యంగా రామలక్ష్మిగారి వైపు చూసాడు సుధీర్.
“ఆయా యుగముల ధర్మము నిలుపగ అవతారములను దాల్చిన దైవము హయవాహనుడై కలియుగమందున అలమేలుమంగా పతివై వెలసిన” అని సవరించేడు. మీరు ఊపిరి తీసుకోవడంకోసం మంగా వేరు పతి వేరు పాడుతున్నావు, అలమేలుమంగాపతివై ఒకటే సమాసం. నిలుపక కి నిలుపగ కి అర్థం మారిపోతుంది,” అని కొంచెం నిష్టూరంగానే అన్నాడు.
దేవకి ఏమనుకోలేదు కాని రామలక్ష్మి కొంచెం చిరాకుగా చూసింది . “అలాగే అన్ని రాగాలు, చరణాలు ఒకే రీతిలో పాడారు. బాలమురళీకృష్ణ గారు ఆ కీర్తనలో ఎంత వైవిధ్యం చూపిస్తారో, హయవాహనుడు అంటే గుర్రమ్మీద స్వారీ చేసే వ్యక్తి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాడతారూ” అని తన ఐఫోన్‌లో చూపించేడు, దేవకి ఉత్సాహంగా చూసింది.
రామలక్ష్మి ఉద్వేగం ఆపుకోలేక “దేవకి నీకు నచ్చినట్టేనా!” అని అడిగింది.
“మీ అమ్మాయికేమిటండి, బంగారు బొమ్మ. మీరు నన్ను ఇంకేమైనా అడుగుతారా?” అని వారి వైపు చూసాడు సుధీర్.
“నీకు గర్ల్ ఫ్రెండ్స్, డేటింగ్” అని సంశయంగా అడిగింది రామలక్ష్మి.
“అంత సమయం, డబ్బులు నా దగ్గర లేవండి” అని చిన్న నవ్వు నవ్వేసాడు సుధీర్. దేవకి టి వి రూం లో ఉన్న తాతగారిని, అమ్మమ్మని తమ్ముడుని సుధీర్‌కి పరిచయం చేసింది.
సుధీర్ పెద్ద వాళ్లకి వంగి కాళ్లకి దండం పెట్టేడు.
సత్యనారాయణగారు సుధీర్ తాతగారితో స్నేహం, అనుబంధం, ఆత్మీయత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పేరు. దేవకి తమ్ముడు వంశీ ఈటివి సినెమా చానల్‌లో ప్రసారమవుతున్న ‘మాయాబజార్’ సినెమాలో ‘వివాహ భోజనంబు’ పాటను చూస్తూ పరవశించిపోతున్నాడు.
“నాకు కూడా ఈ సినెమా అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చూసాను. “ అన్నాడు సుధీర్”నీవు తెలుగు సినెమాలు చూస్తావా!” అశ్చర్యంగా అడిగింది రామలక్ష్మి.
“నాకు బి ఎన్ రెడ్డి, కె వి రెడ్డీ, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినెమాలు అంటే చాలా ఇష్టం” అన్నాడు సుధీర్.
“నేను వాళ్ల పేర్లు ఎప్పుడూ వినలేదు” అంది దేవకి.
“ఈ సినెమాలో కె వి రెడ్డిగారు ఒక పొరపాటు చేసారు” అంది రామలక్ష్మి
ఆమె గొంతుక కొంచెం వెటకారంగా అనిపించింది సుధీర్.
“ఈ సినెమాలో బుద్ఢుడు విగ్రహం చూపించేరు. బుద్ఢుడు ఆ కాలం వాడు కాదు కదా” అని మరల అనవసర ప్రసంగం చేసింది.
“ఎక్కడ” అని కుతూహలంగా అడిగేడు సుధీర్.
“బొమ్మల కొలువులో” అని చెప్పింది రామలక్ష్మి.
“అది ఒక బొమ్మ. మీరు దానిని బుద్ఢుడు అని అన్వయించుకొని కె వి రెడ్డి వంటి ప్రతిభా దర్శకుడిని విమర్శించడం సబబు కాదు. అది ఒక అద్భుతమైన కల్పనాగాథ, మీరు చదువుకున్న పురాణాలలో శశిరేఖ పాత్ర లేనేలేదు. అది ఒక సినెమాగానే చూడాలి.” అని కంచెం మందలించిన తీరులో విమర్శించేడు సుధీర్.
రామలక్ష్మి అహం, అతిశయం కొంచెం దెబ్బ తిన్నట్టు అనిపించి అక్కడనుండి వెళ్లిపోయింది. అలా సాగింది దేవకితో సుధీర్ తొలి పరిచయం. ఇద్దరి జాతకాలు నప్పలేదని అందుకు కారణంగా పెళ్లిసంబంధం కుదరలేదని జయలక్ష్మి బలరామమూర్తిగారితో చెపుతే తెలుసుకుని నవ్వుకున్నాడు సుధీర్.
దేవకి అమెరికా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఏవేవో ప్రశ్నలతో ఆలోచిస్తూ ఎప్పుడో తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.
***
ఆరోజు ఆదివారం. దేవకిని రెస్టారెంట్‌లో కలసి రెండు వారాలు పైగా అయింది. సుధీర్ వింబల్డన్ పురుషల ఫైనల్ చూస్తున్నాడు. దేవకి ఫోన్ చేసింది.
“ఎలా ఉన్నారు!” అనడిగేడు.
“బాగానే ఉన్నాను, ఎందుకో ఫోన్ చెయమన్నారు” అంది దేవకి.
“మీతో ఒక విషయం మాట్లాదాలి. నా అపార్టమెంట్ కి రాగలరా” అని చెప్పేడు.
“ఎడ్రస్ చెపుతారా, టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారా!” అని అడిగింది.
ఎడ్రస్ టెక్స్ట్ మెసేజ్ పంపించేడు. సుధీర్ స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. ఇల్లంతా సర్దేసాడు. ముందు రోజు వండుకొని తినగా మిగిలిన స్వీట్ కార్న్ సూప్, వెజిటబిల్ ఫ్రైడ్ రైస్, మైక్రోవొవన్ లో వేడి చేసాడు. రెఫ్రిజిరేటర్ లోదీ కోల్డ్ స్టోన్ బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం ఉందని సంతోషించేడు. తన అపార్టమెంట్ దగ్గర ఉన్న బస్ స్టాప్ కి రాగానే దేవకి ఫోన్ చేసింది. సుధీర్ వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. దేవిక సలక్షణంగా చీరె కట్టుకొని ఉంది, తలకి స్నానం చేసి తడి ఆరని కురులనుండి షాంపూ వాసన సుధీర్‌కి వింతగా అనిపించింది.
డైనింగ్ టేబిల్ మీద ఉన్నవి చూపిస్తూ “తిని మాట్లాడుకుందామా, మాట్లాడుకొని తిందామా! అనడిగేడు,
“మీ ఇష్టం” అని చిరు నవ్వు నవ్వింది దేవకి. “చల్లారి పోతాయి. తిందాం రండి.” అని డైనింగ్ టేబిల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు.
దేవకి నాజూకుగా తినసాగింది.
“అమెరికా ఎప్పుడు వచ్చేరు! ఎందుకు వచ్చేరు. ఎక్కడ వుంటున్నారు?” అని ప్రశ్నల వర్షం కురిపించేడు సుధీర్.
“అమ్మ జాతకాల నమ్మకం వల్ల మరొక మూడు నాలుగు సంబంధాలు తప్పిపోయేయి. ఒకటి అమ్మకి నచ్చింది కాని నాన్నగారు అతను ఒక బార్ నుండి రావడం చూసి వద్దనెసారు. ఇక్కడి స్టేట్ యూనివర్సిటీలో ఎం.ఎస్.సీట్ వచ్చింది. వచ్చేముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, బాంక్ ఎకౌంట్, ఒక అంతర్జాతీయ బాంక్ దెబిట్, క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాను. అప్పు కూడా చేసాను.” అని ఫక్కుమని నవ్వింది.
“ఇక్కడ నా సీనియర్స్ కొంతమందితో ఒక రూంలో షేర్ చేసుకుంటున్నాను. అమ్మకి ఇష్టం లేకపొయిన నాన్నగారి ప్రోత్సాహంతో వచ్చేను. కూటికోసం ఆ గుజరాతీ రెస్టారెంట్‌లో పార్ట్ టైం పనిచేస్తున్నాను” అని చెప్పింది.
భోజనం చేసిన తరువాత ఇద్దరూ నడచుకుంటూ దగ్గరలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ కి వచ్చేరు.
సుధీర్ అక్కడకి ఎందుకు తీసుకు వచ్చేడో దేవకికి అర్థం కాలేదు.
ఒక ఖాళీ షాప్ లోకి వచ్చేరు. ఒక గది, ప్రక్కనె ఎటాచెడ్ బాత్రూం ఉన్నాయి.
“ఇక్కడ ‘సంగీత శిక్షణ’ అన్న సంస్థ పెడదామని నేను, నా స్నేహితులు; ఒక ఎన్.జి.ఓ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము. మేము ఇచ్చే విరాళాలకి మాచింగ్ గ్రాంట్స్ మేము పనిచేస్తున్న సంస్థలు ఇస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా కెనడా, అమెరికా దేశాలలో ఉన్న పిల్లలకి ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కర్ణాటక శైలి సంగీతాన్ని నేర్పించాలని ఒక చిన్న ప్రయత్నం. మీరు అధ్యాపకురాలిగా పనిచేయాలి. సాంకేతిక సహాయం మేము చూసుకుంటాము. ఒక డాక్టర్ గారి మనవరాలు, ఒక జనరల్ మేనేజర్ గారి అమ్మాయి, ప్రొఫెసర్ గారి అమ్మాయి, అంత ప్రతిభ ఉండి ఇలా గాలికి ధూళికి తిరగడం నాకు బాధనిపించింది.” అని వివరించేడు సుధీర్.
ఏమి చెప్పాలో తెలిసీ తెలియని అయోమయం అనిపించింది దేవకికి,
“స్టూడియో తయారవడానికి ఒక నెలరోజులు సమయం పడుతుంది. ఈలోగా మీ నిర్ణయం చెప్పండి.,” అని “మిమ్మల్ని మీ రూం దగ్గర డ్రాప్ చేస్తాను” అని తన ఆడి కారులో బయల్దేరాడు.
దేవకి కృతజ్ఞతా భావముతో ధన్యవాదం తెలిపి చేయి చాపి కరచాలనం చేసింది. ఆ కరచాలనం ఏదో తెలియని ఆనందం. ఒక నెల రోజులపాటు, చాలా రోజుల తరువాత శృతి సాధన చేసి; మరల సరళీ స్వరాలు, జంట స్వరాలు కార్య ప్రణాళికతో అభ్యసించింది. తనతో ఉంటున్న రూం మేట్స్ ఊకదంపుడు పుకార్లు, అసూయతో కూడిన సంభాషణలతో విసిగిపోయిన తనకి ఇది ఒక మంచి అవకాశం అనుకొని ఒప్పుకుంది.
మొదటి నెలలో ఇరవైమంది పిల్లలు చేరారు. దేవకికి సంతోషం వేసింది. రెండో నెలలు పదిమంది మానేసారు. కొంచెం బాధ కలిగింది. సుధీర్ ఓదార్చి ధైర్యం చెప్పేడు. మూడవ నెలలో వివిధ దేశాలనుండి ఏభైమంది చేరారు. ప్రతి నెల ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది; ఆరు నెలలలో రెండు వందలమంది చేరారు. అంతే కాకుండా ఆరు ఉత్సాహంగా ఉల్లాసంగా నేర్చులోవడం సుధీర్ దేవకికి ఉత్సాహాన్ని పెంపుచేసింది. వివిధ దేశాలు కాలమానం, తమిళం, మలయాళం భాషల మీద పట్టులేకపోవడంవలన చాలా కష్టాలు ఎదుర్కోవలసివచ్చింది. అయినా పట్టుదలతో నెగ్గుకొచ్చింది.
ఆరోజు లాంగ్ వీక్ ఎండ్ సెలవు దినం.
సుధీర్ ఫోన్ చేసి “పోయంట్ బోనిట లైట్ హౌస్ చూడడానికి వెళ్తున్నాను, వస్తారా?”అనడిగేడు.
“ఎక్కడ ఉంది, ఎంత దూరం” అని అడిగింది దేవకి.
“సాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. చాలా పురతనమైనది. అక్కడనుండి పసిఫిక్ మహాసముద్రం అందముగా గోచరిస్తుంది. అక్కడ తినడానికి ఏనీ దొరకకపోవచ్చును. ఏదైనా లంచ్‌కి ప్యాక్ చేసుకుని తీసుకురండి. నేను మంచినీళ్లు, స్నాక్స్ తెస్తాను. మరొక అరగంటలో మీరు రెడీ అయితే నేను వచ్చి తీసుకు వెళ్తాను.” అని అది నిర్ణయం అన్నట్టు చెప్పేడు సుధీర్.
***
ప్రొద్దున్నే లేచి కేరట్స్ తురుము చేసి, వేరు సెనగ పలుకులు వేయించి, లెమన్ రైస్ చేసింది, దేవకికి, సుధీర్‌కి వేరే వేరే స్టీల్ డబ్బాలలో ప్యాక్ చేసింది దేవకి. పేపర్ న్యాప్ కిన్స్ అరటి పళ్ళు, మంచి నీళ్ల బాటిల్స్ బాగ్‌లో సర్దింది. అరగంటలో సుధీర్ ఆడీ కారులో వచ్చాడు.
“కాబోయే శ్రీవారికి ప్రేమవిందా!” అని రూం మేట్స్ హేళన చేసారు.
“ట్రోజన్, డ్యూరెక్స్ పట్టికెళ్తున్నావా, లేక పిల్స్ వేసుకుంటావా” అని అసభ్యంగా విసిగించేరు.
దేవకి కొంచెం బాధపడింది. కారులోనుండి బయట ప్రకృతి అందాలు చూస్తుంటే “నూతిలో కప్ప జీవితం నుండి మహాసముద్రంలో తిమింగిలంలా విహరిస్తున్నట్టు అనిపించింది”; దేవకికి.
కారులో కూర్చొని కాగితం మీద ఏదో వ్రాయసాగింది
“ఎలా ఉన్నారు మీ సంగీత శిష్యులు!” అని అడిగేడు సుధీర్.
“ఒక చిలిపి అమ్మాయి ఒక చిక్కు ప్రశ్న వేసింది, నిన్న క్లాస్ అయిన తరువాత” అంది దేవకి
“ఏమిటి” అనడిగేడు సుధీర్.
“మేము ముగ్గురు అక్కచెళ్లెళ్లం. మా ముగ్గురు వయస్సులు గుణిస్తే 36. మా ముగ్గురు వయస్సులు కలిపితే 13. మా వయస్సులెంత!” అని వివరించింది దేవకి.
సుధీర్ గట్టిగా నవ్వుతూ “దీనికి కాగితం కలం అక్కర్లేదు. వీటిని మెంటల్ మేథమెటిక్స్ అంటారు.” అని “ఆ అమ్మాయి వయసు సుమారు ఆరు నుండి పది ఉంటుంది అనుకోండి. 36ని ఆరు చేతగాని, తొమ్మిది చేతగాని భాగించవచ్చును. ఆరు చేత భాగిస్తే మిగతా ఇద్దరి వయసు గుణిస్తే ఆరు అవుతుంది. తొమ్మిది చేత భాగిస్తే వారి మిగత ఇద్దరి వయసు 4 అవుతుంది. కలిపితే 13 సరిపోతుంది. “వారి వయసు 6,6,1 లేక 9,2,2 అవ్వాలి. ఆమె అక్క కాబట్టి 9, 2,2 కరెక్ట్ సమాధానం”.
అంచేత పెద్ద అమ్మాయి వయసు 9. మిగతా ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ వయసులు 2,2” అని క్లుప్తంగా సునాయాసంగా సుధీర్ పరిష్కరించాడు.
“మీరు సూపర్ అండి” అని సుధీర్‌ని మెచ్చుకుంది దేవకి. కారులో సిడి ప్లేయర్ నుండి ఈమని శంకరశాస్త్రిగారి వీణావాదనం “ఆరభి” రాగంలో “నాదసుధారసంబిలను” వీనులవిందుగా వినిపిస్తోంది.
“ఏ రాగమో చెప్పగలరా!’ అని అడిగేడు సుధీర్
పరాకుగా ఆలోచిస్తూ “శుద్ధసావేరి” అని నోరు జారేసింది.
“జాగ్రత్తగా వినండి” అని “దాని కవల రాగమే” అని చిరునవ్వు నవ్వేడు సుధీర్.
“సారీ, ఆరభి రాగం” అని దేవకి సరిదిద్దుకుంది.
“కర్ణాటక సంగీత శైలిలో ఇలా పొరపాటు జరిగే కవల రాగాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు సంగీతం నేర్చుకున్న మా అమ్మగారే సంశయంలో పొరపాటు పడతారు. ఉదాహరణకి “పంతువరాళి, పూర్వీకల్యాణి; వలజి, మలయమారుతం; అభోగి, శ్రీరంజని; బౌళి, రేవగుప్తి, ఆనందభైరవి, రీతిగౌళ; కల్యాని, లతాంగి, అమృతవర్షిణి, మందారి, దర్బార్, నాయకి” అని సుధీర్ వివరించేడు.
“మీరు చెన్నై లో ఉండవలసిన వ్యక్తి.”
“నాకు ఘటం వాయించాలిని కుతూహలంగా ఉండేది. ఇక్కడేవరూ నేర్పేవారు ఎవరు దొరకలేదు. టరువాత అలా రోజులు గడచిపోయాయి; ప్రాధాన్యతలు మారిపోయాయి.”; అని నిట్టూర్చాడు సుధీర్.
“ఆ అమ్మాయికి సమాధానం చెప్పి, ఒక లెక్క చెపుతాను ఆ అమ్మాయిని చేయమని చెప్పండి. కరెక్ట్‌గా చెపితే పది డాలర్లు బహుమానమని చెప్పండి” అన్నాడు సుధీర్.
“ఏమిటి ఆ లెక్క” అనడిగింది దేవకి.
“పమగని+ సరిదమ= సరిగమలు; ఒక్కొక్క స్వరాక్షరం ఒక సంఖ్య. అవి ఏమిటో చెప్పలి” అని అన్నాడు సుధీర్.
“ఏమిటి ఈ విచిత్రమైన వ్యక్తి; ఆ స్పష్టత, ఆ చనువు, ఆ అధికారం తనకి పరిచయమున్న ఏ వ్యక్తిలోనూ చూడలేదు” అని అనుకుంది దేవకి. లైట్ హౌస్ చూసి కార్ పార్కింగ్ దగ్గర ఉన్న చెట్టుకొమ్మమీద కూర్చిని భోజనం చేసారు.
“లెమన్ రైస్ చాలా బాగుంది” అని సుధీర్ మెచ్చుకున్నాడు.
మరి కొంచెం ఎక్కువ తేవలసిందని దేవకి బాధపడింది. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద అటూ ఇటూ రెండు ప్రక్కల నడచి; దగ్గరలో ఉన్న గిరాడిలీ చాక్లేట్ షాప్‌లో ఐస్ క్రేం తిని జపానీస్ గార్డెన్‌లో చీకటి పడేవరకు విహరించేరు. రాత్రి ‘ఉలవచారు’ తెలుగువారి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఆమె రూం దగ్గర డ్రాప్ చేసాడు. తన అపార్ట్మెంట్ కి వచ్చేసరికిరాత్రి పదకొండు అయింది. అర్ధరాత్రి పన్నెండు అయింది. సెల్ ఫోన్ లో మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాడు.
స=1, రి= 0, గ= 6, మ= 5, ప= 9, ద= 8, ని= 7, లు = 2; 9567+1085= 10652 అని దేవకి మెసేజ్ చేసింది.
“సూపర్” అని సుధీర్ సమాధానం పంపించేడు.
దేవకి ఫోన్ చేసి “ఇంకా పడుకోలేదా!” అని అడిగింది.
“సఖ్య సంఖ్యలతో ప్రణయం అన్న కథ చదువుతున్నాను” అని చిరునవ్వు నవ్వేడు సుధీర్.
“నాకు కూడా ఆ కథ లింక్ పంపిస్తారా!” అని అడిగింది దేవకి.
“రేపు ప్రొద్దుట పంపిస్తాను. గుడ్ నైట్” అని ఆమె నిద్ర పాడుచేయడం ఇష్టం లేక ఫోన్ కట్ చేసాడు సుధీర్.
“ఒక సంఖ్య “విభాజకాలు”, కలిపితే వచ్చే సంఖ్యయొక్క విభాజకాలు కలిపితే ఆ మొదట సంఖ్య వస్తే ఆ జంట సంఖ్యలని “సఖ్యసంఖ్యలు” అంటారు. ఉదాహరణకి సంఖ్య 220 తీసుకుంటే దాని విభాజకాలు 1, 2,4,5,10,11,20,22,44,55 మరియు 110. వీటిని కలిపితే 284 వస్తుంది. అలాగే 284 విభాజకాలు 1,2,4,71,142; వీటిని కలిపితే వచ్చే సంఖ్య 220.
మధ్యధరా సముద్రప్రాంతములో, ప్రాచీన కాలములో ఒక నమ్మకం ఉండేది. పళ్లమీద ఇటువంటి సంఖ్యలు చెరొక ముక్కమీద వ్రాసి ప్రేమికులు తింటే వారి ప్రేమ సఫలీకృతం అవుతుంది అని ఆ ప్రేమికులా విశ్వాసం. సుధీర్ పంపించిన కథలో జాన్. అలెక్స్ ప్రేమికులు. కొన్ని కారణాల వలన విడిపోదామనుకుంటారు. అలెక్స్ ఈ సఖ్య సంఖ్యల విషయం ఒక రోజు జాన్‌కి వివరిస్తుంది. కంప్యూటర్, అతని పరిజ్ఞానంతో తెలిసిన గరిష్ట సఖ్య సంఖ్యలు, (100,485; ఒక వైపు, 124155 మరొక వైపు ఒక రుమాలుమీద అల్లి అమెకు బహుకరిస్తాడు. వాడిన పూవు వికసించినట్లు, వారి ప్రేమ మరల చిగురించి వాళ్లు ఏకమవుతారు.
కాలం ఎవరికోసం ఆగదు. వర్ష ఋతువు, శరదృతువు, హేమంతఋతువు వెళ్లిపోయాయి.
ఫిబ్రవరి నెలలో ఒక వారం రోజులు సెలవు తీసుకుని; లాస్ వేగస్, యూనివర్సల్ స్టూడియో, గ్రాండ్ కాన్యన్, యొసిమిటి నేషనల్ పార్క్, సకొయా నేషనల్ పార్క్, వెళ్లడానికి సుధీర్ నిశ్చయించుకున్నాడు.
ఫోన్ చేసి “మీరు కూడ వస్తారా!’ అని దేవకిని అడిగేడు సుధీర్.
“తనంతట తాను ఈ ప్రదేశాలు మరల చూడలేదు. ఇంతకంటే మంచి అవకాశం మరల రాదు. తండ్రిని సంప్రదించి చెపుతాను” అని సమాధానం చెప్పింది.
“మీ ఇద్దరిమీద నాకు నమ్మకం ఉంది. చదువుకి, నీ సంగీత శిక్షణ కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా చుసుకో” అని దేవకి తండ్రి అభిప్రాయం వ్యక్తంచేసారు.
దేవకి తల్లి దేవకి వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దేవకి మరల తండ్రికి ఫోన్ చేసింది.
“నీ ఇష్టం తల్లి. నీ అంతట నీవు ఎంఎస్ సీట్ తెచ్చుకున్నావు. బాంక్ లోన్, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నావు. నీవు ఇప్పుడు మేజర్. నీ మంచి, బాగోగులు నీవే చూసుకోవాలి” అని ప్రొత్సాహకరంగా, అభిమానంగా చెప్పేరు దేవకి తండ్రి.
***
“పెళ్లికి ముందే శోభనయాత్ర” అని రూం మేట్స్ హేళన చేసారు. దేవకి వాళ్ల మాటలు పట్టించుకోవడం మానేసింది. ఐఫోన్ లో యియర్ ఫోను పెట్టుకొని బయటకు వచ్చి సుధీర్ కారులో కూర్చుంది. స్టార్ బక్స్ కఫీ షాప్ కి వచ్చేరు ఇద్దరూ.
“ఏమిటి తీసుకుంటారు?’ అని అడిగేడు సుధీర్.
కుకీస్, హాట్ చాక్లేట్. అంది
సుధీర్ కుకీస్, కాఫి లాటే తీసుకున్నాడు.
“కథ నచ్చిందా” అని అడిగేడు సుధీర్.
“చాలా బాగుంది. అంత సున్నితంగా, అంత తెలివిగా ఒక కథ అల్లడం చాలా గొప్ప విశేషం, మీరు సంఖ్యల ప్రణయభావాన్ని నమ్ముతారా!” అని చిన్న నవ్వు నవ్వుతూ అడిగింది.
ఏమీ తడుముకోకుండా “కథని కథగా ఆస్వాదిద్దం. నమ్మకం ఇతరులని మోసం చేయడానికి, ఇతరులు మోసపోడానికి కాకూడదు. ఎవరి నమ్మకం వారిది” .
కారులో కుర్చున్నాక దేవకి యియర్ ఫోన్స్ పెట్టుకుని ఐఫోన్ నుండి ఏ ఆర్ రహమాన్ పాటలు వింటోంది.
“నేను కూడ వినవచ్చునా” అని అడిగేడు సుధీర్.
ఒక యియర్ ఫోన్ సుధీర్ చెవిలో పెట్టింది. “ఒకే ఒక్కడు” చిత్రంలో పాట “అందాల రాక్షసివె” వింటూ ఇయర్ ఫోన్ తిరిగి ఇచ్చేసాడు సుధీర్.
“పాట నచ్చలేదా” అనడిగింది.
“వచనంలాగ ఉంది. సాహిత్యం కిట్టించినట్టుంది. పోనీ ఆ పాట ఏరాగమో చెప్పగలరా” అనడిగేడు.
“తెలీదు” అన్నట్లు తల అడ్డంగా ఊపింది.
తన ఐఫోన్ లో ఉత్తర ఉన్నిక్రిష్ణన్ పాడిన సుబ్బరాయశాస్త్రి కీర్తన “జనని నినునినా” వీడియో ప్లే చేసాడు.
“రీతిగౌళ రాగం” అని చెప్పింది.
“ఆ సినెమా పాటకూడా ఇదే రాగం. ఈ అమ్మాయి మలయాళం అమ్మాయి. ఈ అమ్మాయి తప్పులు పాడింది అంటే అథం ఉంది. ఒక్క బాలమురళీకృష్ణగారు తప్పిస్తే మిగతా పెద్ద పెద్ద విద్వాంసులు కూడా తప్పు పాడి అర్థం లేకుండా పాడుతున్నారు. చిట్టస్వర సాహిత్యం పాడుతున్నప్పుడు “తరుణమిది కృఅసలుపుదువిలలో” కి “తరుణమిది కృపసలుపుదురుసుగా” అని అర్థం మార్చేసి పాడుతున్నారు. ఎంత బాధ వస్తుందో” అని సుధీర్ ఆవేదన వ్యక్తం చెసాడు. .
“మీకు డాక్టర్ బాలమురళీకృష్ణగారంటే చాలా ఇష్టం అనుకుంటాను,” అంది దేవకి
“మా అమ్మగారికి బాలమురళీకృష్ణగారన్న సాలూరి రాజేశ్వరరావుగారన్న చాల ఇష్టం. మా నాన్నగారు అమ్మని చీరలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే వాళ్లిద్దరి కేసట్స్, సిడిలు కొనుక్కొనేవారు. ఇవన్ని ఆమె కలెక్షన్ “అని కారు సీట్ ప్రక్కన ఉన్న బాక్స్ చూపించేడు సుధీర్.
సుధీర్వైపు దేవకి వింతగా చూసింది.
ప్రకృతి సౌందర్యం, యూనివర్సల్ స్టూడియో ఎంతో ఆకర్షణీయంగా అనిపించేయి. పరిశుభ్రమైన రెస్ట్ రూంస్, వివిధరకాల రెస్టారెంట్స్; అడుగడుగునా తన సౌకర్యం, చూసుకున్న సుధీర్ ఒక విన్నూతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చవి చూపించేడు. ఆ వారం రోజులు, దేవకి స్నానం చేసి తయారవుతున్నప్పుడు, సుధీర్ హొటల్ డైనింగ్ హాల్లో ఎదురు చూడడం, ఒకే గదిలో పడుకున్న అతని సభ్యత, సంస్కారానికి, నిగ్రహానికి మనస్సులోనే నమస్కరించింది. అయిన ఖర్చు అంతా సుధీరే భరించేడు. ఇవ్వడానికి తన దగ్గర నిజానికి డబ్బు చాలదు.
ఆరోజు లాస్ ఏంజిలిస్ నుండి తిరుగు ప్రయాణం. అంతేకాకుండా దేవకి ఆంగ్ల తేదీలు ప్రకారం పుట్టిన రోజు. బయిల్దేరినప్పుడు ఒక గంటసేపు ఆమె ఫోన్ సంభాషణ అంత ఆమె బంధువులు, తల్లితండ్రులు, స్నేహితుల శుభాకాంక్షలుతో గడచిపోయింది. దారిలో ఒక థాయ్ రెస్టారెంట్‌కి వెళ్లి, వెజ్ ఫ్రైడ్ రైస్ టోఫు కర్రీ తిన్నారు. అక్కడనుండి ఒక ప్రముఖ జూయెలర్ షాప్ కి వెళ్లారు.
షాప్ లో ఉన్న కస్టమర్ ఎసోసియేట్ తో ఏదో మాట్లాడాడు సుధీర్.
ఒక్క నిమిషం లో వెయ్యి డాలర్లు ఖరీదైన ఎమరాల్డ్స్, డైమండ్ కలిసి ఉన్న అందమైన ఒక నెక్లేస్ కొన్నాడు.
“మేము అయిదు వందల రుపాయిలు చీర, చుడీదార్ కొనడానికి ఒక గంటసేపు ఆలోచిస్తాము. మీరు ఒక్క నిమిషములో వెయ్యి డాలర్లు ఖర్చుచేసి ఎలా కొనేసారు” అని అడిగింది దేవకి.
సుధీర్ చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు.
షాప్ నుండి బయటకి వచ్చి దేవకి కారు ఎక్కుతుంటుంటే; సుధీర్ ఆ నెక్లెస్ అందిస్తూ “పుట్టీనరోజు శుభాకాంక్షలు” అని అభినందించేడు. దేవకి వద్దని తిరస్కరించింది.
“నామీద ఏమాత్రం అభిమానమున్నా మీరు తీసుకోవాలి” అని అభ్యర్ధన చేసాడు.
“తరువాత తీసుకుంటాను. మా రూం లో భద్రతలేదు. కాలేజ్ కి వేసుకుని వెళ్లలేను” దేవకి బ్రతిమాలింది.
“ఈ ఒక్కరోజుకి వేసుకోండి. మిమ్మ్మలని రూం దగ్గర్ డ్రాప్ చేస్తున్నప్పుడు నేను తీసుకుంటాన్” అని ఇది నా నిర్ణయం అన్నట్టు ఆమెకి అందచెసాడు.
మొహపాటు పదుతూ మెడలో వేసుకుంది.
“కాస్త నవ్వండి”, అని బ్రతిమాలాడు సుధీర్. దేవకి నవ్వు ఆపుకోలేకపోయింది.
శ్రద్ధతో ఎంఎస్ సఫలీకృతమై పూర్తిచేసి, యూనివర్సిటీలో మంచి పేరు తెచ్చుకుంది. ఒక స్టార్ట్ అప్ కంపెనీలో ఇంటెర్న్ ఉద్యోగం సంపాయించుకుంది.
దేవకి కృతజ్ఞతగా సుధీర్ ని మద్రాస్ కేఫ్‌కి లంచ్ కి అహ్వానించింది.
భోజనం చేస్తుంటే “మీరు నిజంగా జాతకాలు నమ్ముతారా!” అనడిగేడు సుధీర్.
“నాకు ఐడియా లేదు కాని అమ్మని ఒప్పించలేను. ఆమెకి ఎదురు చెప్పలేను” అని తన నిస్సహాయతను చాటిచెప్పింది.
“భూమి బల్లపరుపుగా ఉండి, సూర్యుడు, చంద్రుడు గ్రహాలు అని అపోహలుగా ఆలోచనలు ఆధారంగా తయారు చెసైన ఫలిత జ్యోతిష్యం నేటికి ప్రజలలో వదలి వ్యాపారం చేసుకొన్న వాళ్లని నమ్మే మీ అమ్మగారిని చుస్తే జాలివేస్తోంది. సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, ప్లూటో డ్వార్ఫ్ గ్రహం. ఇప్పుడు మనకి అనేక పాలపుంతలు, నక్షత్రాలు.” అని అన్నాడు సుధీర్.
దేవకి మౌనం వహించింది. సుధీర్ తన ఐఫోన్‌లో ఒక వీడియో చూపించేడు.
‘ఈ అమ్మాయి మా కజిన్ సుభద్ర. తనకంటే ఒక సంవత్సరం చిన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ఆ అమ్మాయి 3 నెలలు ప్రెగ్నంట్. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఒక కోవెలలో సంప్రదాయ పెళ్లి చెసారు. అరవై ఏళ్ళు దాటిన మామయ్యలు 60 కేజిలు బరువున్న ఆమెను బుట్టలో మోసి ఒక మామయ్య నడుము విరిగినంత పని అయ్యింది. మిట్ట మధ్యాహ్నం అరుంధతి నక్షత్రం చూపించేరు. మాకు ముందు చెప్పలేదని నాదస్వరం వాయించిన వాళ్లు మరొక 500 డాలర్లు ఇస్తేకాని వధూవరులని లోపలికి వెళ్లనివ్వలేదు. కాలం మారుతోంది. ఏది నిజం ఏది అవసరం అనే మనమే ప్రశ్నించుకుని మన నిర్ణయం మనమే తెలుసుకొని కట్టుబడితో ఉండాలి. ఇది నా అభిమతం ఆపైన నీ ఇష్టం” అని వివరించేడు
దేవకి కొంచెం ఇబ్బందిగా అంది. “ఒకసారి మా అమ్మ, నాన్నగారితో మాట్లాడి ఏ సంగతి వారం రోజులలో చెబుతాను” అంది.
“మీకు రాజేశ్వరరావుగారి సమయస్ఫూర్తి గురించి చెప్పాలి” అని
“ఒక కొంటె విలేఖరి అతనిని “రైలు కూత ఏ రాగం అని అడిగేడు. రాజేశ్వరరావుగారు తడుముకోకుండా “చిత్తరంజని” అని సమాధానం ఇచ్చేరు. చిత్తరంజన్ అనే ఊరిలో రైల్ ఇంజన్లు తయారయ్యేవి. ఇంకో విలేఖరి ‘మీ కల్యాణి రాగం పాటలన్ని ఒకేరీతిలో ఉంటాయి అని విమర్శిస్తే “మీరు ఏమిటి తింటారో నాకు తెలియదు కాని నేను రోజూ అన్నమే తింటాను” అని అనేసరికి ఆ విలేఖరులు మెల్లగా జారుకున్నరట”
దేవకి నవ్వకుండా ఉండలేకపోయింది. దేవకి ఆలోచించసాగింది. అమ్మది మూఢ నమ్మకం అని అనిపించింది. తండ్రికి ఫోన్ చేసింది.
“నాకేమి అభ్యంతరం లేదమ్మ. మీ అమ్మని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను” అని హామీ ఇచ్చాడు.
రామలక్ష్మి ససేమిరా ఒప్పుకోలేదు. దేవకి తాతగారు, అమ్మమ్మ రామలక్ష్మికి నచ్చచెప్పడానికి ప్రయత్నించేరు. ఈ పెళ్లి జరిపితే తాను కాశీ వెళ్లిపోతానని బెదిరించింది. గబగబా వెళ్లి సూట్ కేస్‌లో బట్టలు సర్దుకొని అన్నయ్య శ్రీనివాస్ ఇంటికి కారులో డ్రైవర్ సహాయంతో విజయవాడ వెళ్లిపోయింది. రామలక్ష్మిని చూసి శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. జరిగిన సంగతి అంతా వివరించింది.
ఆమె మంకుతనం తెలిసిన శ్రీనివాస్ వదిన అరుణ ఏమీ అనలేదు.
“సుధీర్ మీద ఏదైనా కేస్ పెట్టి దేవకిని ఈ పెళ్లి జరగకుండా చేయగలమా” అని అడిగింది,
“రేపు చర్చించుకుందాం” అని మాట తప్పించేడు శ్రీనివాస్.
మర్నాడు వారి కుటుంబ పూజారి ప్రభాకరశాస్త్రి ఏదో పనిమీద వారి ఇంటికి వచ్చాడు,
రామలక్ష్మిగారిని చూసి “అమ్మా సుధీర్ విషయంలో ఒక పొరపాటు జరిగిందమ్మా. సుధీర్ జాతకంలో నెలకు తేదీ తేదికి నెల చూసానమ్మ. అమెరికాలో నెల ముందు, తేదీ తరవాత రాస్తారుట. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇద్దరి జాతకాలు బాగ కుదిరేయి” అని తన పొరపాటుని వివరించేడు.
శ్రీనివాస్ అరుణ ఊపిరి పీల్చుకున్నారు. భోజనం చేసి మారు మాట్లాడకుండా రామలక్ష్మి తిరుగు ప్రయాణం సాగించింది.
వారం రోజులు దాక రానన్న రామలక్ష్మి రెండు రోజులకే తిరిగి రావడం అందరిని అశ్చర్యపరచింది.
తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకున్న సంగతి దేవకి సుధీర్‌కి ఫోన్ చేసి చెప్పింది.
“నా అపార్ట్మెంట్ కి రాగలవా!” అని అడిగేడు సుధీర్.
సంగీతశిక్షణ క్లాసెస్ పూర్తి చేసుకొని వెళ్లింది. వచ్చిన దేవకికి వేడి కఫీ ఇచ్చాడు సుధీర్.
“జీవితంలో మీ ధ్యేయమేమిటి” అనడిగేడు.
“ఎవ్వరిని నొప్పించిక జీవితాన్ని గడపడం” అంది సంశయంగా.
“మరి మీ ధ్యేయం” అని అతనిని ప్రశ్నించింది.
“నైతికంగా, ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని అనుభవించడం” అని కాఫీ త్రాగి;
“మన పెళ్లి మతరహిత చట్టం క్రింద రెజిస్టర్ ఆఫీస్ లో జరుగుతుంది. మా అమ్మ నాన్నగారు, మీ తల్లితండ్రులు, నా స్నేహితులు సాక్షి సంతకం చేస్తారు. ఆ రోజు సాయింత్రం మొరెర్గన్ పార్క్‌లో సన్నిహితులకి డిన్నర్. హానీమూన్‌కి మీ తల్లితండ్రులు, మా తల్లితండ్రులు మనమిద్దరము హవాయి ఐలాండ్స్ కి క్రూయిజ్ లో వారం రోజులు వెళతాము.” అని ఒక ప్రణాళిక వివరించేడు.
సుధీర్ ప్రణాళక ప్రకారం వారిద్దరి వివాహం రెజిస్టర్ ఆఫీస్‌లో నిరాడంబరంగా జరిగింది. ఇరువరి తల్లితండ్రులు, సన్నిహితులు, స్నేహితులు సాక్షి సంతకాలు చేసారు.
ఆరోజు సాయింత్రం మొర్గన్ పార్క్‌లో డిన్నర్ ఏర్పాటుచేసాడు సుధీర్. కేవలం సాఫ్ట్ డ్రింక్స్, వేగన్ ఫుడ్ ఐటెమ్స్: సమోసాలు, పనీర్ టిక్కాలు, పులిహోర, వెజిటేరియన్ బిరియాని, బేబీ కార్న్ మంచూరియా, వెజిటేరియన్ గొబీ పిజ్జాలు, గులాబ్ జామున్, బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం రుచికరంగా తయారు చేయించి అందరూ సంతోషంగా తృప్తిగా తినేటట్టూ చూసుకున్నాడు. రామలక్ష్మిగారు తప్పిస్తే అందరూ చాలా సంతోషించేరు. సుధీర్ అందరూ చూస్తుండగ అతను కొన్న నెక్లేస్ ఆమె మెడలో అలంకరించేడు. దేవకి ఒక ఖరీదైన రోలెక్స్ వాచ్ అతని చేతికి తొడిగింది,
స్వయంగా అల్లిన ఖరీదైన ఊలెన్ స్వెట్టర్ అతనిని వేసుకోమని ఇచ్చింది. ఆ స్వెట్టర్ ఒక మీద వైపు 220 సంఖ్య, మరొక వైపు 284 సంఖ్య అల్లిఉన్నాయి. ఆనందంతో సుధీర్ దేవకిని హత్తుకుని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సంఖ్యలేమిటో వాళ్లిద్దరకే అర్థమయ్యాయి. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు. డిన్నర్ అవగానే అథిధులందరూ వెల్లిపోయాక ఇంటికి వచ్చారు.
“హవాయి నేను రాను. మీరు వెళ్లండి” అని రామలక్ష్మి అంది
“అత్తయ్యగారు మీ మాయాబజార్‌లో కృష్ణుడు, రుక్మిణి; బలరాముడు, రేవతి కూడా నౌకావిహారయాత్రకి వెళ్ళారు. రసపట్టులో తర్కం మొండితనం పనికిరాదు.
చాల రోజుల తరువాత మనస్ఫూర్తిగా నవ్వింది రామలక్ష్మి, దేవకి కళ్లలో ఆనందభాష్పాలు రాలేయి. సుధీర్ ఆమె ఆనందం చూసి పరవశించిపోయాడు. ఇద్దరూ వారి తల్లిదండ్రులకు ఆశీర్వాదాలకు వంగి నమస్కరించేరు.