ఘనంగా ‘వాల్మీకి మొగ్గలు’ పుస్తకావిష్కరణ

0
3

[dropcap]మ[/dropcap]హబూబ్ నగర్ జిల్లా వాల్మీకి సంఘం, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో యువకవి కోలంట్ల రామకృష్ణ రచించిన ‘వాల్మీకి మొగ్గలు’ పుస్తకాన్ని రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పురావస్తు, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్  ఆవిష్కరించారు. అక్టోబర్ 9న  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవాబుపేట రోడ్డులో గల వాల్మీకి రామాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కులానికి స్థలాలనిచ్చి ప్రభుత్వపరంగా ఆదుకుంటున్నామన్నారు. వాల్మీకి కులస్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు.  వాల్మీకులకు ఎకరా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. త్వరలోనే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి మార్చే అంశం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అంతకుముందు రామాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. మొగులప్ప‌ మాట్లాడుతూ సమాజంలో వాల్మీక వంశం గొప్పదని, అందరూ ఉన్నతంగా చదువుకుని ఎదగాలని ఆభిలాషించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువు పట్ల ఆసక్తి కనబరచాలన్నారు.

ఆత్మీయ అతిథి, మొగ్గల ప్రక్రియ సృష్టికర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజంలో కులాలు అనాదిగా ఉన్నాయని, వాటి చరిత్రను భావితరాలకు అందజేయాలనే తలంపుతో కులాల గొప్పదనాన్ని చాటే విధంగా మొగ్గలు కవితా ప్రక్రియలో పుస్తకాలను వెలువరిస్తున్నామన్నారు. ఆ కోవలోనే ఈరోజు వాల్మీకి మొగ్గలు ఆవిష్కరించడమన్నారు. మొగ్గల కవితా ప్రక్రియలో ఇప్పటికీ 40 పుస్తకాలకు పైగా కవితాసంపుటాలు వెలువడ్డాయన్నారు.

పుస్తకాన్ని సమీక్ష చేసిన యువకవి బోల యాదయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొగ్గలు అనే నూతన కవితా ప్రక్రియ ప్రారంభమై ఐదు వసంతాలు పూర్తిచేసుకున్న తర్వాత ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయన్నారు. వాల్మీకి వంశచరిత్రను యువకవి రామకృష్ణ చక్కగా మొగ్గల్లో ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినా మొగ్గలు ప్రక్రియ మాత్రం నిత్యనూతనంగా విరబూస్తూనే ఉన్నదన్నారు.

సభకు అధ్యక్షత జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షులు 42వ వార్డు కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, ముడా చైర్మన్ గంజి ఎంకన్న, పుస్తక రచయిత కోలంట్ల రామకృష్ణ, పంతులు వెంకటయ్య, పంతులు సత్యన్న, దేవరకద్ర జనార్దన్, మాజీ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్, జిల్లా వాల్మీకి సంఘం ప్రధాన కార్యదర్శి వి.కృష్ణయ్య, ఎక్సైజ్ సి.ఐ.బాలకృష్ణ, మాజీ హెచ్.ఎం.వెంకటయ్య, యుగంధర్ నాయుడు, పులి జమున, ఉప్పరి తిరుమలేష్, వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here