రామకథాసుధ

1
3

రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

[dropcap]రా[/dropcap]మాపురం చాలా చిన్న ఊరు. కేవలం రెండు సంవత్సరాలు అంటే సరిగ్గా ఇరవై నాలుగు నెలలు అక్కడ ఉద్యోగం చేశాను. ఓపిక ఉన్నప్పుడు ఇంట్లోనే వంట చేసుకున్నాను, లేనప్పుడూ అలా ఆ చిన్న రైల్వే స్టేషన్‍కు ప్రక్కగా ఉన్న చిన్న హోటల్లో దొరికింది తినేవాడిని. నాతోపాటు సహోద్యోగి అప్పుడప్పుడు ’రామయ్య వస్తావయ్యా’ అనేవాడు. అంటే ఆ హోటల్ పేరు రామయ్య. ఇద్దరం కాలక్షేపం చేసి ఎవరి రూమ్‍కి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. ఈ ఊరు వదలి వెళుతూ ఇక ఆ కాస్త సామాను సర్దుకుని స్టేషన్ వద్దకు వచ్చాను. ఎందుకో ఓసారి రామయ్య హోటల్‍కి వెళ్ళాలనిపించింది. ఆటోని అక్కడికి పదమని చెప్పి టైం చూసుకున్నాను. కనీసం రెండు గంటలు టైము ఉంది బండికి. మెల్లగా హోటల్లోకి వెళ్ళి ఎప్పుడు కూర్చునే చోట కూర్చున్నాను. పేరిగాడు వచ్చి టేబిల్ తుడిచాడు.

“నాకు తెలుసు సార్..” చెప్పాడు. “..మీరు వెళ్ళిపోతున్నారట రవ్వకేసరి చేయించాను” అన్నాడు.

“ఎందుకని?”

“భలే ఓరే! మా ఊరు స్పెషల్. డబ్బులవ్వవు. అయిదే అయిదు నిముషాలు”

కాషాయ రంగు పంచెలో, కుర్తాలో ఓ పెద్దాయన మెల్లగా వచ్చి నా ముందు కూర్చున్నాడు. ఎప్పుడూ చూడలేదు ఈయనను.

“మా ఊరు బాగుందా?” అడిగాడు.

“మీరు..”

“ఆ.. ఇక్కడే, ఆ గుడి దగ్గరుంటాను. మిమ్మల్ని చాలాసార్లు చూశాను”

“అవునా? అదేంటో, అందరూ పరిచయం ఉన్నట్లుంటారిక్కడ. గుర్తుపట్టటమే కష్టం”

“అవునా!” అన్నాడాయన.

“రామాపురం విశేషం. సంభాషిస్తే తప్ప తత్వం తెలియదు. తలుపులు తెరుచుకోవు. అవునూ ఇక్కడి రామాలయానికి ఎన్నిసార్లు వెళ్లారు?”

 “చాలాసార్లు వెళ్ళాను. భజన ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని. అవునూ భలే గుర్తు చేశారు. ఈ ఊరు వచ్చిన మొదటి రోజే ఈ టేబిల్ దగ్గరే ఒకాయన చెప్పాడు. ఇక్కడి రామాలయంలో భజన జరిగినప్పుడల్లా ఓ కొత్త వ్యక్తి వచ్చి భజనలో పాల్గొని ఎవరికీ దొరకకుండా వెళ్ళిపోతాడు అని”

“అవును”

“నేను చాలాసార్లు పరీక్షగా చూశాను కానీ నాకు అలాంటివారు ఎవరూ కనిపించలేదు.”

“మీకు అందరూ పరిచయమా? క్రొత్తవారిని కనుక్కోవటానికి?”

“దాదాపు అందరూ పరిచయమే”

“నేను?”

“ఓ! నిజమే మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు”

“అలా రామాయణంలో అన్ని పాత్రలూ తెలిసినట్లే ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నీ క్రొత్తగానే ఉంటాయి.”

రవ్వకేసరి వచ్చింది ఇద్దరం ప్లేటును దగ్గరకు లాక్కున్నాం.

“ఇంతకీ ఇది చెప్పండి”

“ఏంటి?”

“ఆ గుడికి క్రొత్తగా వచ్చేవారున్నారా? వస్తే ఎవరు?”

ఆయన నవ్వాడు. నవ్వినప్పుడు తిరునామాలు దగ్గరై మరింత మెరిశాయి.

“కథ చిత్రంగానే ఉంటుంది. కేసరిలా తీయనిదే. దీని రంగులా అదీ సాత్వికమే. మధురమైనది ఎప్పుడూ కొత్తదే. నాకు ప్రత్యేకంగా ఈ కథ ఎన్ని సార్లు చెప్పినా, చెప్పుకున్నా, వినినా, వినిపించినా నవ కిషోరంలా నవనవలాడుతూనే ఉంటుంది!”

రవ్వకేసరి ఓ స్పూను నోట్లో పెట్టుకుని ఆలోచించాను. అలవోకగా “ఏదీ మరి యొక సారీ” అన్నాను.

***

రామాలయం కట్టాలని రాళ్ళు కొట్టడం కోసం దూరంగా ఉన్న కొండల మీదకి వెళ్లారు కొందరు. ఇది ఏ కాలంలో జరిగిందో చెప్పడం చాలా కష్టం. వాళ్ళు అలా రాళ్ళను పరిశీలిస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. ఎక్కడ ఉలిపెట్టి కొట్టబోయినా వాళ్ళకి రామనామం వినిపించేసరికి ఆగిపోయారు. ఆ శబ్దం ఆకాశంలోకి ప్రయాణం చేసి తిరిగి కొండల చాటున ప్రతిధ్వనించింది. ఏమీ తోచక క్రిందికి దిగి ఊరిలోని పెద్దలకు వినిపించారు.

వాళ్ళు ఆశ్చర్యపోయారు. తొలుత నమ్మలేదు, కానీ ప్రతిరోజూ ఆ పనివాళ్ళు ఆ మాటలు వినిపించినందుకు ఒకరోజు వాళ్ళ వెంట వెళ్ళి పరీక్షించాలనుకున్నారు. ఎంతో శ్రమకోర్చి, కొండలూ, గుట్టలూ ఎక్కారు.

“ఎక్కడ రామనామం?” అడిగాడు ఓ ఊరిపెద్ద.

కార్మికుడు ఓ చోట ఉలిని పెట్టి గట్టిగా పట్టుకుని సుత్తితో కొట్టాడు. మామూలు శబ్దం వినిపించింది.

“అదుగోండి” అన్నాడు.

“నీకేమైనా పిచ్చా?” అన్నాడు ఆయన.

“ఇది మామూలు శబ్దం. ఎక్కడైనా ఇలాగే వినిపిస్తుంది.”

అతను మరలా కొట్టాడు.

“చూడండి” అన్నాడు.

“నాకు రామనామం వినిపిస్తోంది. ఎవరో రామ్ అన్నట్లుంది”

ఆయన చుట్టూతా చూశాడు. ప్రక్కనే ఉన్న ఓ ఇద్దరు కార్మికులను అడిగాడు. “ఎవర్రా? మీకు అలాగే వినిపించిందా?”

వాళ్ళు చేతులు కట్టుకున్నారు.

“అవునండీ!” చెప్పారు.

“మేము చాలాచోట్ల పనిచేశాం. కానీ ఇలాంటి శబ్దం ఎక్కడా వినిపించలేదు. క్షమించండి. ఇక్కడి రాళ్ళలో ఏదో ఉంది”

పెద్ద మనుషులు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇంకో పెద్ద మనిషి తలగోక్కున్నాడు.

“మరి మాకు వినపడదే అలా?”

కాళ్ళు నొప్పిగా ఉన్నందుకు ఓ పెద్దాయన అక్కడే చతికిలపడ్డాడు.

“వింతగా ఉంది” అన్నాడాయన.

“..కాకపోతే ఈ కార్మికులు రామాలయం కోసం పనిలోకి దిగటం వలన అలా అనిపించి ఉండవచ్చు. మనం ఆ దీక్షలో లేము గదా?”

కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది. అందరూ లేచారు. మరి కొంతదూరం కొండలలోకి వెళ్ళారు. ఇక నడవలేక ఆగిపోయారు.

“ఇక్కడ కొట్టి చూడండి” అన్నారు.

ఈసారి మరో ఇద్దరు ఓ ప్రదేశాన్ని ఎంచుకుని ఉలిపెట్టి కొట్టారు.

మరింత దగ్గరగా ప్రతిధ్వనించింది. దూరంగా పిట్టలు లేచి ఆకాశంలోకి ఎగిరాయి.

“భ్రమ..” అన్నాడు ఒకాయన.

“..ఈ ధ్వని మీకు రామనామంలా ఉంది”

ఇంకో ఆయన చేయి అడ్డుపెట్టాడు.

“ఆగండి. ఇది ధ్వనియో రామనామమో అన్న సంగతి ప్రక్కన పెట్టండి. అక్కడ వినిపించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఇక్కడ వినిపిస్తోంది. అవునా కాదా?”

“మనం ఏకాంతంలో ఎక్కువదూరం ప్రయాణించాం కాబట్టి”

“కాదు ఆలోచించాలి”

“ఏమాలోచించాలి?”

“వీళ్ళకి స్పష్టంగా వినిపిస్తున్న రామనామం నాకు ఎలాగైనా వినాలనుంది!”

***

ఆ బృందం మరి కాస్త దూరంగా శ్రమ అనుకోకుండా పైకి ఎక్కుతూ వెళ్ళిపోయింది. కొద్దిసేపు విశ్రమించాలని ఆ రాళ్ళగుట్టల మీద కూర్చున్నారు. కుడివైపు జాగ్రత్తగా వంగి చూశారు. అక్కడ ఓ సన్నని జలధార పారుతోంది. అది ఎక్కడినుండి వస్తోందా అని కళ్ళమీద చెయ్యిపెట్టి చూశారు. సూర్యరశ్మి తాకటం వల్ల ఆ నీరు ఏదో వెండినేత చీరె కప్పిన సరస్సులా ఉంది. క్రమంగా దాని అంచున నడుచుకుంటూ వారు కొంతదూరం ప్రయాణించారు. అక్కడ కనిపించిన దృశ్యానికి కనులు బైర్లు కమ్మాయి.

ఒక నల్లని శిలమీదుగా తెల్లని జలపాతం అక్కడి నుండి పాలధారలా పారుతున్నది. ఆ శిలని చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో ఒకరన్నారు. “అరే! జాగ్రత్తగా చూడండి. ఆ శిలని వదలి మరో ఎనిమిది సన్నని శిలల మీదుగా జారుతున్నప్పుడూ ఆ పాలధార ఒక అందమైన స్త్రీలా కనిపిస్తోంది.”

అందరూ జాగ్రత్తగా పరిశీలించారు. నిజమే ఆలోచన చాలా బాగుంది. ఆ శిలను చేరుకోవాలంటే మధ్యలో లోతు కనిపిస్తోంది. క్రింద కూర్చున్నారు. ఓ పెద్దాయన అక్కడక్కడ ఉన్న పచ్చిక మీద నడుము వాల్చాడు. తటాలున లేచి కూర్చున్నాడు.

“ఏమైంది? ఏమైనా కుట్టిందా?” అందరూ అడిగారు.

ఆయన కళ్ళు చూసుకున్నాడు.

“కాదు” అన్నాడు.

“జాగ్రత్తగా వినండి. ఈ నీరు కూడా రామనామాన్ని స్మరిస్తోంది!”

అందరూ గమనించారు. ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. రామనామాన్ని వింటూనే ఆ పాలధార దాల్చిన యువతి స్వరూపాన్ని చూస్తున్నారు. అది మానవ సహజం. ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు చూస్తున్నారు. ఆశ్చర్యపోవటం అక్కడితో అయిపోలేదు. ఏదో వింతలోకంలోకి వచ్చారు వాళ్ళు. ఆ యువతి ప్రాణం పోసుకుని నడుచుకుంటూ లోయ దాటి అవలీలగా గుట్ట ఎక్కి ఇక్కడికి చేరుకుంది. వీళ్ళలో ఎవరూ రెప్ప ఆర్పలేదు. అటుచూసినా ఎటు నుండీ చూసినా అందమే. వజ్రంలా మెరిసిపోతుంది.

“ఎవరమ్మా నీవు?” ఏకకంఠంలో అడిగారు.

“వాల్మీకి గిరి సంభృతా రామసాగరానికీ, పునాది భవనం పుణ్యాన రామసాగర గామినీ”

ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు.

“అంటే?”

“ఆ శిలను చూడండి. వాల్మీకి అనే గిరిని సంభవించి ఈ భూమిని అణువణువున పవిత్రం చేసుకుంటూ శ్రీరామ తత్వం అనే సాగరంలో కలిసే శ్రీరామకథను నేను”

“……..”

“మీరా రామాలయం కడుతున్నారా?”

“అవును”

“ముందర మీలో నన్ను దర్శించాలనే నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను”

అందరూ నమస్కారం చేసుకున్నారు.

“గర్భగుడి పాముల పుట్ట ఆకారంలో ఎందుకు నిర్మిస్తారో తెలుసా?”

“తెలియదు”

“చీమలు మట్టిని సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపానికి తీసుకువచ్చి పుట్టను నిర్మిస్తాయి. తపస్సు అనే ప్రక్రియ అదే. ఆత్మ సాక్షాత్కారాన్ని ఆ విధంగా పొందిన మహర్షి అనవరతం రామనామాన్ని జపిస్తూ వాల్మీకిగా మారాడు. ఆయన తత్త్వాన్ని సూక్ష్మంలో దర్శించి ఇరవై నాలుగువేల శ్లోకాల రామాయణాన్ని చంధోబద్ధం చేశాడు. వేదమాత అయిన గాయత్రీ ఛందస్సు మూడు ఎనిమిదులైతే మరో ఎనిమిది చేరిస్తే వేదంలోని అనుష్టుప్ ఛందస్సు అవుతుంది. ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం చేస్తే అది గాయత్రి రామాయణం. ఈ శ్లోకాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలలోని ప్రతి వేయి శ్లోకాల ముందర మీకు లభిస్తాయి. ఇరవై నాలుగు గంటల కాలప్రమాణానికీ, కాల ప్రయాణానికీ గల ప్రవాహం ఇది. సూక్ష్మం నుండి స్థూలానికి చేసే ప్రయాణానికి నిదర్శనం. సృష్టి యావత్తునూ వృత్తంలో చేర్చుకున్న సందర్భం. అదే రామకథ!”

“ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఇలా దర్శనం ఇవ్వడం మా భాగ్యం. నీకు ఎక్కడైనా గుడి ఉన్నదా అమ్మా?”

 “మంచిప్రశ్న. ప్రతి గుడిలో నేనుంటాను. రామాయణంలో నాది అసలు పాత్ర. కుశలవులకు వేదాధ్యయనం చేయించే నిమిత్తం రామాయణాన్ని బోధించాడు మహర్షి. నేను వేదాల సమిష్టి స్వరూపాన్ని. దానిని గానం చేస్తూ శ్రీరాముని వద్దకు వెళ్ళారు. నన్ను స్మరిస్తూనే ఆయన సీతాదేవిని స్మరించుకున్నాడు. భాగవతోత్తముడైన హనుమంతుడు అశోకవనంలో సీతను చూసి రామకథ అంటే నన్ను స్మరించుకుని ఆమెను ప్రసన్నురాలను చేసుకొన్నాడు. త్రిజట నన్నే స్మరించింది. మారీచుడు నన్ను అర్థం చేసుకుని మోక్షం పొందాడు. విభీషణుడు నా వలన రామభక్తుడైనాడు. వానరులు నన్ను స్మరించుకుంటున్నప్పుడే సంపాతికి వాస్తవం అర్థమై లంకకు దారి చూపించాడు. ఇంద్రజిత్తు సంహారం తరువాత నన్ను కీర్తిస్తూ వానరవీరులు నాట్యం చేశారు. అహల్య అదృశ్యంగా రామనామాన్ని గానం చేస్తూ స్వస్వరూపాన్ని పొందినది. నేను శ్రీరామచంద్ర ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రురాలను.”

అందరి కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి.

“అమ్మా! ధన్యులం. మేము నిర్మించబోతున్న రామాలయంలో నీకు కూడా ఒక గుడి కట్టాలని అర్థమవుతున్నది!”

ఆమె చిరునవ్వు నవ్వింది.

“చూడండీ! రామకథ చెప్పుకోవటానికీ, తపస్సుకూ భేదం లేదు. అంతరాలయంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయులు స్థూలంగా దర్శనమిస్తాడు. పలువురి అంతరంగాలలో నేను ప్రతిధ్వనిస్తాను. రామకథ ద్వారా అంతఃకరణ శుద్ధులవుతారు”

“మేం ఏం చేయాలో సెలవియ్యాలి తల్లీ!”

“వాల్మీకి రామాయణం తపస్సు యొక్క ఫలితం. అనవసరమైన వ్యాఖ్యాలు చేస్తూ సృష్టిలోని ఈ అద్భుతాన్ని అపభ్రంశం చేయకుండా నిత్యం ఇందులో చెప్పిన రామకథను అనగా నన్ను అందరికీ అందించాలి. అది ప్రతి రామాలయంలో చేయవలసిన పని”

“అవశ్యం”

ఆమె వెళ్ళబోయింది. ఓ పెద్దాయనకు మరో సందేహం కలిగింది.

“అమ్మా”

“ఏంటి?” ఆమె ఇటు తిరిగినా అటు తిరిగినా నవరసాలతో, సప్తస్వరాలతో నవనవలాడుతున్న నవలా మణిలాగానే ఉన్నది.

“అమ్మా! నీవు మాలో గుడి కట్టుకోవటం కంటే మాకేం కావాలి? కానీ మా ఆచరణ అందుకు సరిపోతుందా?”

“మానవ శరీరమే అయోధ్య. అష్టాచక్రా నవద్వారా దేవానం పురయోధాన అనునది వేదవాక్కు. ఆత్మరాముని దర్శించుకోవటమే నిజమైన క్షేత్రదర్శనం.”

ఒక పెద్దాయన కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు.

“తల్లీ! జన్మ ధన్యమైనది. ఆ నల్లని శిల, దానినుండి ప్రవహిస్తున్న నీవు”

“అర్థమైంది. పరమశివుడు నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. దానికే అది ప్రతీక..”

ఆమె ఆ మాటలతో లోయలోకి దిగటానికి సిద్ధమైంది. అందరూ వెనుదిరిగారు. ఆ లోయలోంచి రామనామం ప్రతిధ్వనిస్తోంది.

అందరూ అటు తిరిగి గట్టిగా అరిచారు.

“అమ్మా! ఈ రామనామం మాకు అంతటా వినిపిస్తోంది. మరి మా రామాపురంలో కూడా వినిపిస్తోందా?”

“జాగ్రత్తగా చూడండి” ఆమె చెప్పింది.

“నా మెడలో ఉన్న ఈ రత్నం పలుకుతోంది ఆ నామాన్ని! ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మీ అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చేందుకు అనిలాత్మజుడు గట్టిగా పలుకుతున్న రామనామమిది!”

ఆమె అంతర్థానమైనది. అక్కడి నుండి తిరిగి ఊరికి చేరుకునేలోపల ఎన్నిసార్లో, వారెన్ని చోట్లనో చెవులు ఆన్చి విన్నా రామనామం వారికి వినిపించలేదు. కొందరికి బాధ కలిగింది. కొందరికి తిరిగి ఆ లోయ వద్దకు వెళ్ళాలనిపించింది. ఏమీ చేయలేక ఆ కొండప్రాంతం దాటి క్రిందికి వచ్చారు. అలసటకు కొద్దిసేపు ఎవరికి నచ్చిన చోట వారు కూర్చున్నారు. ఒక గుట్ట వెనుకనుండి ఓ కార్మికుడు ఆట పట్టించేందుకు ‘రామ్’ అన్నాడు. అందరూ అటు తిరిగారు. మరో కుర్రాడు ఎక్కడినుండో ‘రామ్’ అన్నాడు. కొద్దిసేపు నవ్వుకున్నారు. అంతా నిశ్శబ్దంగా వుంది. దూరంగా సూర్యాస్తమయం అవుతోంది.

ఆత్మానుభూతిలోంచి ఇవతలి గట్టుకు వచ్చేస్తున్న ఒకాయన మెల్లగా పలికాడు. “శ్రీరామ నీ నామమెంత రుచిరా!”

అంతే! ఆ ప్రాంతమంతా భజన మారుమ్రోగింది. సూర్యాస్తమయం అయింది. చల్లని గాలి వీస్తోంది. అందరూ లేచారు. జట్టులో అందరూ ఉన్నారా లేదా అని చూసుకున్నారు. ఒక కార్మికుడు కొద్దిగా వెనుకగా ఆగియున్నాడు.

“ఒకసారి ఇటురండి” అన్నాడతను. అందరూ ఉరికారు. అక్కడ ఎక్కడినుండో ‘రామ్ రామ్ రామ్’ అని ప్రతిధ్వనిస్తున్నది. అందరి మొహాలు వెలిగిపోయాయి.

“ఎక్కడ రామకథ ఉంటుందో అక్కడ నేనుంటాను” సన్నగా వినిపించింది.

“మీ ఊరి రామాలయంలో రామకథ వినిపించినప్పుడల్లా నేనూ ఓ క్రొత్తభక్తుని రూపంలో అక్కడ దర్శనమిస్తాను.”

అందరూ నమస్కారం చేసుకున్నారు.

మరల వినిపించింది. “మీరంతా శ్రీరామ కథా సుథను దర్శించారు. నేను చిరంజీవిని. నేను నిత్యం రామనామ స్మరణలో ఉంటాను. ఈ భూమిమీద శ్రీరామనామం కూడా చిరంజీవిగా మారు మ్రోగుతూ ఉంటుంది.”

అందరూ చిందులేస్తూ రామాపురం చేరుకున్నారు.

***

రవ్వకేసరి పూర్తయింది. కథ వినిపించినాయన సంచి సర్దుకుని లేచాడు.

నా రైలుకి సమయం అయి నేనూ లేచాను. రామయ్య హోటల్ కాష్ కౌంటర్ దగ్గర అడిగాను.

“ఆయనెవరండీ?”

“తెలియదండీ? మొదటిసారి చూస్తున్నాను!”

ఆశ్చర్యంగా ఉంది. స్టేషనుకి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాను. రైలు రానున్నది. నాకు అటువైపు కూర్చున్న ఓ మహిళ మొబైల్ లోంచి వినిపిస్తోంది.

“రామకథాసుధా.. రస పానమో.. రాజ్యము చేయునై..”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here