చిరుజల్లు-41

1
3

టచ్ మి నాట్

[dropcap]ప[/dropcap]ల్లవి ఇండియా గేటు దగ్గర నిలబడి తల పైకెత్తి చూసింది. ఇంత ఎత్తయిన రాతి కట్టడాన్ని ఇంత అందంగా, అంగుళమైనా తేడా రాకుండా ఇటూ అటూ ఖచ్చితమైన కొలతలతో ఎలా కట్టగలిగారా అని ఆశ్చర్యపోతూ ఎత్తిన తల దించకుండా పైదాకా చూస్తూనే ఉంది.

టూరిస్ట్ బస్సు వచ్చి ఆగింది. అందులో నుంచి కొంత మంది విదేశీయులూ, మరి కొంత మంది స్వదేశీయులూ దిగి దగ్గరకు వచ్చారు. గైడ్ ఇంగ్లీషులో వివరిస్తుంటే విదేశీయులు శ్రద్ధగా వింటుంటే, స్వదేశీయులు చిరుతిళ్లు కొనుక్కుంటున్నారు.

పల్లవి రెండో వైపుకు వెళ్లింది. ఎవరో పిలిచారు. ఆమె చేతిలో కెమేరా ఉంది. తనను ఫోటోలు తీయమని అడిగింది. తను ఎక్కడ నుంచుంటుందో కెమేరాలో ఎలా చూడాలో, వెనక దృశ్యం ఎంత వరకు ఫోటోలో రావాలో వివరంగా చెప్పింది. పల్లవి ఫోటోలు తీసింది.

 “థాంక్స్” అన్నదామె.

“ఫర్వాలేదు లెండి” అన్నది పల్లవి.

“మీరు తెలుగు వారా?” అని అడిగిందామె.

ఇద్దరికీ పరిచయాలు అయ్యాయి. ఆమె పేరు విద్యుల్లత. దగ్గర్లోనే యం.పి. క్వార్టర్స్‌లో దిగింది. యం.పి. గారు ఆమె బంధువట. పల్లవి గురించి ఆమె అడిగింది.

“నాకు ఈ మధ్యనే పెళ్లి అయింది. ఆయనకు ఇక్కడ ఉద్యోగం. వచ్చి వారం రోజులే అయింది. ఆయన ఆఫీసుకు వెళ్లాక సిటీ చూద్దామని రోజుకో చోటుకు వస్తున్నాను” అన్నది పల్లవి.

“మీరు ఇక్కడే ఉంటారు గనుక తీరికగా అన్నీ చూడవచ్చు లెండి. నేను వారం రోజులే ఉందామని వచ్చాను. ఈలోగా ఈ చుట్టు పక్కల చూడదగ్గవన్నీ చూసెయ్యాలి..” అన్నది విద్యుల్లత.

వద్దన్నా వినకుండా విద్యులత, పల్లవి ఫోటోలు తీసింది.

ఆమె యం.పి.గారి బంధువు అనగానే పల్లవికి ఏదో ఆధారం దొరికినట్లు అయింది. ఆమెతో పరిచయం పెంచుకోవాలన్న ఆశ కలిగింది. అందుకే విద్యుల్లత అడగగానే ఆమెతో షాపింగ్‌కు బయల్దేరింది. ఇద్దరూ పాలికా బజారు అంతా తిరిగారు. విద్యుల్లత హ్యేండ్ బ్యాగు, చెప్పులూ కొనుక్కున్నది. వాటిని సెలక్ట్ చేయటంలో పల్లవి సాయం చేసింది.

కూల్ డ్రింక్స్ తాగారు. తమ ఊళ్ల గురించీ, ఢిల్లీ గురించీ కబుర్లు చెప్పుకున్నారు. ఆ కొద్ది సేపట్లో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మర్నాడు ఎక్కడ కల్సుకోవాలో నిర్ణయించుకొని విడిపోయారు.

పల్లవి ఇల్లు చేరేటప్పటికి రాత్రి ఏడు గంటలు అయింది. రాజశేఖర్ గుమ్మం ముందు నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్లావని అతను అడగలేదు. ఆలస్యంగా వచ్చినందుకు ఆమె సంజాయిషీ చెప్పలేదు.

ఆమె తాళం తీసి, లోపలికి వెళ్లి లైటు వేసింది. అతను లోపలికి వచ్చి యాంత్రికంగా తన పనులు చేసుకోవటంలో మునిగిపోయాడు.

ఓ గంట తరువాత పల్లవి భోజనం వడ్డించింది. అతను మౌనంగా భోజనం చేశాడు.

కొత్తగా పెళ్లి అయిన వాళ్లు, చిలకా గోరింకల్లా ఉండవల్సిన వాళ్లు, అనుక్షణం ఒకరి కనుపాపలో మరొకరు కనపడవల్సిన వాళ్లు, ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారు. పగలు రేయిగా, రేయి పగలుగా ఆనందడోలికల్లో ఓలలాడాల్సిన వాళ్లు ఇద్దరూ బద్ద శతృవుల్లా ఒకే ఒరలో నున్న రెండు కత్తుల్లా ఉన్నారు.

ఇవాళ అనే కాదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ ఆమె మౌనంగానే ఉంటోంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచే కాదు, ఢిల్లీకి రైలు ఎక్కినప్పటి నుంచీ పల్లవి అలాగే ఉంటోంది. రైలు ఎక్కినప్పటి నుంచే కాదు, పెళ్లి అయినప్పటి నుంచీ అతనితో మాట్లాడటం లేదు.

తొలి రేయి రాజేశేఖర్ ఆమె భుజం మీద చెయ్యి వేస్తే మృదువుగా తొలగించింది. “నాకివాళ ఏం బాగాలేదు” అన్నది.

అతను అర్థం చేసుకున్నాడు. రెండో రోజూ, మూడో రోజూ కూడా అలాగే అనటంతో అతనికేమీ అర్థం కాలేదు. విషయం ఏమిటని తరచి తరచి అడిగితే, అంత వరకూ ఉగ్గబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది.

“పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నచ్చినట్లు మీరు చెప్పగానే మీ మీద ఎనలేని గౌరవం ఏర్పడింది. వల్లమాలిన ప్రేమ క్షణాల్లో పుట్టుకొచ్చింది. రాముడు శివధనస్సు విరిచినప్పుడు సీత మనసు ఎలా ఝల్లుమన్నదో అంతగానూ నాకు ఒళ్లు ఝల్లుమన్నది. కానీ ఆ అనందం ఎంతో కాలం నిలువలేదు. కట్నం ప్రసక్తి వచ్చింది. అది మేము దాటరాని సముద్రమే అనిపించింది. అయిదు లక్షల కట్నం ఇవ్వటానికి మా నాన్న ఒప్పుకున్నాడు. తాంబూలాలు పుచ్చుకున్నారు. నిశ్చయం చేసుకున్న తరువాత మీ సరదాలకూ, సంతోషాలకూ మేం ఇచ్చుకోవాల్సిన లాంచనాల లిస్ట్ పెరిగింది. మా నాన్న రిటైరైన బడిపంతులు. మీ విలాసాలకు ఎంతని తేగలడు? సంబంధం కాన్సిల్ చేసుకుందామని మా నాన్నతో చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. మంచి సంబంధం అమ్మా అన్నాడు. అది ఎంత మంచి సంబంధమో తెలుస్తూనే ఉంది. ఒకసారి నిశ్చయమైన సంబంధం తప్పిపోతే నీకు మళ్లీ పెళ్లి అవుతుందా? అని అడిగాడు. సంబంధం తప్పిపోతే, ఆ అవమానం అతనికీ జరిగినట్లే కదా. అతనికి మరో సంబంధం కుదిరితే నాకు మాత్రం ఎందుకు కుదరదు? – అని అడిగాను. వయసులో ఉన్న ఆడపిల్లలకు ఆవేశం ఎక్కవ. ఆలోచన తక్కువ. డబ్బు విషయం నేను ఎలాగో తంటాలు పడతాను. నువ్వు మనసు పాడు చేసుకోకు – అన్నాడు. నా పెళ్లి చేయటానికి మా నాన్న ఎన్ని అవస్థలు పడ్డాడో చూసిన కొద్దీ మీ మీద కోపం పెరిగింది. వివాహానికి ప్రేమాభిమానాలు ప్రాతిపదికలు కావాలి అన్న వాస్తవాన్ని మర్చిపోయి, దాన్నొక బిజినెస్‍గా మార్చేశారు. అందుకే నేను ప్రేమగా మీ దగ్గరకు రాలేకపోతున్నాను” అని కన్నీటి ధారలతో చెప్పింది.

రాజేశేఖర్ నిట్టూర్చాడు “అయితే ఏం చేద్దామనుకుంటున్నావు?” అని అడిగాడు.

“పెళ్లి చేసుకున్నారు గనుక భర్తగా మీకు కొన్ని అధికారాలున్నయి. కొన్ని బాధ్యతలు కూడా ఉన్నయి. మీ అధికారాలు చెలాయించ వచ్చు. నేను కాదనలేను. టచ్ మి నాట్ అని ఒక పువ్వు ఉంది. ఎవరైనా ముట్టుకుంటే అది ముకుళించుకుపోతుంది. మీరు ముట్టుకుంటే నా మనసు కూడా ఆ పువ్వులాగే ముకుళించుకుపోతుంది” అని చెప్పింది.

“సరే మరి. జరిగినదానికి నేనేమీ చేయలేను. కానీ ఇక ముందు మాత్రం నీ మనసుకు కష్టం కలిగించే పని ఏదీ చెయ్యను. నీకు ఇష్టం ఉంటే నాతో రావచ్చు. నిన్ను పోషించాల్సిన బాధ్యత నాకు ఉంది” అన్నాడు రాజశేఖర్.

ఆమె భర్తతో ఢిల్లీకి వచ్చింది. అతని దగ్గరే ఉంటోంది. కానీ టచ్ మి నాట్ అని గుర్తు చేస్తూనే ఉంది.

“సిటీ చూస్తావా? తీసుకెళ్తాను” అన్నాడు.

“నేను వెళ్లగలను. మీరు శ్రమపడకండి” అన్నది పల్లవి.

మర్నాడు పల్లవి విద్యుల్లతను కల్సుకుంది. ఇద్దరూ రెడ్ ఫోర్ట్ చూడటానికి వెళ్లారు. రెండు గంటల సేపు తిరిగాక అలసిపోయి ఒక చోట కూర్చున్నారు.

“మీరు ఏమీ అనుకోనంటే, చిన్న విషయం..” అని ఆగిపోయింది పల్లవి.

“అడుగు. మన మధ్య మొహమాటాలెందుకు? ” అన్నది విద్యుల్లత నవ్వుతూ.

“మీరు వివాహం చేసుకోలేదా?”

“చేసుకున్నాను.”

“మరి?”

“తాళిబొట్టు తీసేశాను.”

“ఎందుకని?”

“మొగుడ్ని వదిలేశాను. ఇంక తాళిబొట్టు మాత్రం ఎందుకని!”

“సారీ, అనవసరంగా పాత విషయాలు గుర్తు చేసినట్లున్నాను.. మీరు ఏమీ అనుకోకపోతే..”

“ఏమీ అనుకోకుండా ఎలా ఉంటాను?  ఏదో ఒకటి అనుకుంటాన్లే చెప్పు..”

“యం.పి.గారు మీ బంధువు అన్నారు గదా. ఒకసారి పరిచయం చేయరా?”

“దేనికి?”

“నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తారేమో, అడుగుదామని..”

“నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది?”

“చెయ్యక తప్పదు. నా పెళ్లికి మా నాన్న తలకు మించిన అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక ఆయన అవస్థలు పడుతున్నాడు. కడుపు నిండా తింటున్నాడో, లేడో..” అంటూ పల్లవి ఏడ్చేసింది.

విద్యుల్లత ఓదార్చింది, పల్లవి కన్నీళ్లు తుడుచుకుంది.

“అంత ఎక్కవగా అప్పులు చేసి పెళ్లి చేయవద్దని నువ్వు చెప్పాల్సింది.”

“మీకు తెలియదండి. ఇది ఇద్దరు పార్టనర్స్ కల్సి చేసే వ్యాపారం అయింది. బిజినెస్ చేసేవాళ్లు ఎప్పుడూ తమ మనసులో ఏముందో పైకి చెప్పరు. చెప్పేదానికీ, చేసే దానికీ పొంతన ఉండదు” అన్నది పల్లవి.

“ఇవన్నీ కాచి వడపోసిన దాన్ని నేను. నాకు నువు చెప్పక్కర్లేదు” అన్నది విద్యులత.

పల్లవిని మాములు మూడ్ లోకి తీసుకురావటానికి కొంత టైం పట్టింది.

అక్కడి నుంచి కుతుబ్ మినార్ చూడటానికి వెళ్లారు. మబ్బు పట్టేసింది. వర్షం కురవబోతోంది.

“ఇవి ఇప్పుడే ఇలా ఉన్నయి గదా. ఆ రోజుల్లో ఎంత కళకళలాడుతుండేవో?” అన్నది పల్లవి.

“కాలమనే ప్రవాహంలో పడి రాజులు, రాజ్యాలు, వారి భోగభాగ్యాలూ అన్నీ తుడిచిపెట్టుకుపోయినయి. ఏం మిగిలింది? వచ్చి మీ ఆయన్ని చూడమని చెప్పు.. మనసు కొంచెమైనా చలిస్తుందేమో?” అంది విద్యుల్లత.

ఆ రోజు ఇంటికి వెళ్లాక తండ్రికి ఉత్తరం రాస్తూ కూర్చుంది. రాజశేఖర్ ఏదో చదువుకుంటున్నాడు.

ఉత్తరం రాశాక కవరులో పెట్టింది.

“నాకు ఇవ్వు పోస్ట్ చేస్తాను..” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.

“నీకు డబ్బు కావాలంటే అడుగు. ఇస్తాను” అన్నాడు.

“మీకు డబ్బు తీసుకోవటమే గానీ, ఇచ్చే అలవాటు లేదనుకుంటాను” అన్నది.

అతను మాట్లాడలేదు. ఏదో విధంగా మాటలు కలపాలని అతను ప్రయత్నించినప్పుడల్లా, ఆమె తూటాల్లాంటి మాటలతో గాయపరుస్తూనే ఉంది.

“మీరు చేసిన గాయాల ముందు ఇవి ఏపాటివి?” అన్నట్లు చూస్తోంది.

మర్నాడు అతను ఆఫీసుకు వెళ్లబోయేటప్పుడు చెప్పింది –

“ఇవాళ నేను ఆగ్రా వెళ్తున్నాను. రావటానికి లేటు అవుతుంది” అని.

అతను వినేసి మౌనంగా వెళ్లిపోయాడు. ఏమి అంటే, ఏం సమాధానం వస్తుందో తెలియదు గనుక.

విద్యులత, పల్లవి ఆగ్రా చేరారు. తాజ్ మహల్ చూశారు. ఫోటోలు తీసుకున్నారు. లాన్‌లో కూర్చున్నారు.

“నిన్న మీరు అడిగిందే, ఇవాళ నేను అడుగుతున్నాను. దీన్ని చూస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుంది?”

“దేవుడు మనకీ జీవితాన్ని ఇచ్చాడు. ఇది ఆయన మనకు ఇచ్చిన వరం. ఈ జీవిత కాలంలో మనం ఆయనకు ఏమిచ్చాం అన్నది ఆయనకు మనం చేసే ప్రత్యుపకారం..” అన్నది విద్యుల్లత.

“మీ మాటల్లో ఎంతో అనుభవం కనిపిస్తుంది.”

“నాకు ఎదురైన అనుభవాలు సామాన్యమైనవి కావు. మృత్యువును ఎదిరించి పోరాడిన దాన్ని గదా..”

“అదేమిటి? ”

“అదొక పెద్ద కథ. మామూలు కథే. మంచి సంబంధం అనీ, పెద్ద కుటుంబం అనీ పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. ఎవరెన్ని నీతులు చెప్పినా కట్నాలు గుమ్మరించనిదే ఆడపిల్ల పెళ్లి కాదు. అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు, పిల్ల సుఖపడుతుంది గదా అన్న ఆశతో. పని పాటల విషయంలో పడే కష్టం కష్టమే కాదు. కట్నాలు కానుకలు పేరుతో మెడకు బిగించే ఉరి ఊపిరాడనివ్వదు. రోజుకో లిస్ట్ ఇచ్చి పుట్టింటి నుంచి పట్టుకు రమ్మన్నారు. నేను ‘నథింగ్ డూయింగ్’ అని చెప్పాను. వాళ్లు నన్నొక బద్ధ శత్రువును చూసినట్లు చూడటం మొదలు పెట్టారు. రోజూ గొడవలు సృష్టించేవారు. కిరసనాయిల్ పోసి తగల పెట్టబోయ్యారు. ఒక్క దాన్నీ పది మందితో పోట్లాడి, రోడ్డెక్కి గొడవ చేసి, పోలీసు కేసు పెట్టి, నేను ప్రతిఘటించి చేయాల్సినదంతా చేశాను. అదంతా ఒక భయంకరమైన పీడకల. చదువుకుని, కొద్దో గొప్పో ఆస్తిపాస్తులు, అండదండలూ ఉన్న ఆడపిల్లలు పెళ్లికి ముందు ఏవేవో ఊహించుకుని అందమైన కలలు కంటూ పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇంక అక్కడి నుండీ అన్నీ పీడకలలే.. పట్టపగలే ఉలిక్కి పడి లేస్తుంటారు.. ఉన్న వాళ్లకే ఈ కాపీనం మరీ ఎక్కవ.”

“నా కన్నా దారుణమైన అనుభవం మీది..”

“సజీవ దహానానికి గురి అయిన వాళ్లూ ఉన్నారు.. నేను తృటిలో తప్పించుకున్నాను..”

“ఈ కథలన్నీ ఇంతేనా మరి?”

“పీడింపబడే వాడు ఉన్నంత వరకూ పీడించే వాడు ఉంటాడు. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న ఏ పాడు బడిన కోటగోడను అడిగినా, ఈ సత్యాన్నే వల్లిస్తుంది..”

పల్లవి ఇల్లు చేరేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది.

ఇంట్లోకి వెళ్లేటప్పటికి కంచం దగ్గర భోజనం రెడీగా ఉంది. ఆమె ఆశ్చర్యంగా భర్త వంక చూసింది. అతనేమీ మాట్లాడలేదు.

పల్లవి మర్నాడు యం.పి. గారిని కల్సుకుంది. తన అవసరం ఎలాంటిదో ఆయనకు క్లుప్తంగా చెప్పుకుంది. ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.

నాలుగు రోజుల తరువాత అపాయింట్‌మెంట్ లెటరు తీసుకొని ఇంటికెళ్లింది.

టేబుల్ మీద తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కనిపించింది. ఆత్రంగా కవరు చించి చదువుకుంది.

“చి. పల్లవికి ఆశీస్సులు,

అక్కడ, నువ్వు అల్లుడుగారూ కులాసాగా ఉన్నారని తలుస్తాను. మీరిద్దరూ అన్యోన్యంగా, ఆనందంగా ఉంటడమే నాకు ఈ చివరి దశలో మిగిలిన ఏకైక జీవితాశయం. నాకున్న అప్పుల గురించి నువు బాధపడొద్దని ఎన్నో సార్లు చెప్పాను. నాకు నువ్వు ఎంతో, అల్లుడూ అంతే. మీరిద్దరూ నా పిల్లలే. నిన్ను ఇంతదాన్ని చేసేందుకు, ఎంత ఖర్చు చేశానో ఎప్పుడన్నా లెక్కలు చూసుకున్నానా? ఇప్పుడు మాత్రం ఎందుకీ లెక్కలు?”

అల్లుడు పంపిన అయిదు లక్షల రూపాయల చెక్కూ అందింది. అతని మనసు నొప్పించి ఉంటావు. అందుకే చెక్కు పంపించాడు. అతనెంత బాధపడి ఉంటాడో. మీ ఇద్దర్లో ఎవరు బాధ పడినా..”

అక్షరాల మీద కన్నీటి బొట్లు జారిపడినయి. కన్నీటి ధారల మధ్య పల్లవికి అక్షరాలు చెదిరిపోయినట్లు కనిపించాయి. కన్నీరు తుడుచుకుంటుంటే, రాజశేఖర్ భుజం మీద చెయ్యి వేశాడు.

‘టచ్ మి నాట్’ అని ఆమె చెప్పలేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here