[dropcap]S[/dropcap]OUTH INDIAN PHILATELIST’S ASSOCIATION (SIPA) వారి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘SIPA AMRITPEX 2022’ శీర్షికతో జాతీయ స్థాయిలో స్టాంపుల ప్రదర్శన 2022 ఆగష్టు 13 నుండి 15 వరకు జరిగింది. ఈ ప్రదర్శనలో స్టాంపుల ప్రదర్శనలతో పాటు స్టాంపులకు సంబంధించిన సాహిత్యంలో పోటీని నిర్వహించారు.
ఈ సాహిత్య పోటీలలో ముద్రించిన గ్రంథాలలో శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘స్టాంపుల్లో మహాత్ముడు’ గ్రంధానికి కాంస్యపతకం లభించింది.
ఇంకా ఈ పోటీ స్టాంపులను అంతర్జాల పత్రికలు, ముద్రిత పత్రికలలో వ్రాసిన వ్యాసాలకు కూడా నిర్వహించారు.
ఈ పోటీలో కూడా ‘సంచిక అంతర్జాల పత్రిక’లో స్టాంపులలో మహిళలను గురించి వ్యాసాలు వ్రాసిన శ్రీమతి పుట్టి నాగలక్ష్మికి కాంస్య పతకం లభించింది.
పుట్టి నాగలక్ష్మి 1991 నుండి స్టాంపులను సేకరిస్తున్నారు. 1993 నుండి స్థానిక స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు స్టాంపుల ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ఈ పోటీ ప్రదర్శనలు జరుగుతాయి. ఈమె గాంధీ పెక్స్, అహింసా పెక్స్ పోటీలలో పాల్గొని గాంధీజీ ఆయన అనుచరుల స్టాంపును ప్రదర్శించేవారు. స్టాంపుల వివరాలు వ్రాసేటప్పుడు గాంధీజీ స్టాంపులను విశ్లేషిస్తూ ఒక పుస్తకం వ్రాస్తే అనే ఆలోచన కలిగింది. అలా వెలువరించిన గ్రంథమే ‘స్టాంపుల్లో మహాత్ముడు’.
‘స్టాంపులు – మహిళలు’ స్టాంపుల – ప్రదర్శన కోసం తయారు చేసే సమయంలో స్టాంపుల్లో మహిళలు వ్రాయాలనే ఆలోచన కలిగింది నాగలక్ష్మి గారికి.
తదనుగుణంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళల స్మారకార్ధం భారత ప్రభుత్వ తపాలాశాఖ విడుదల చేసిన స్టాంపులలోని మహిళల జీవిత విశేషాలను గురించి వివరించిన 110 వ్యాసాలను వ్రాశారు.
ఈ మహిళలలో సంఘసంస్కర్తలు, క్రీడాకారిణులు, సాహస మహిళలు, వీరనారీమణులు, మహారాణులు, స్వాతంత్ర్య పోరాట యోధురాళ్ళు, కవయిత్రులు, సంగీత సరస్వతులు, వైదురాళ్ళు, తత్వవేత్తలు, చలన చిత్ర ప్రముఖులు మొదలైన వారి జీవన చరిత్రలను లఘువ్యాసాలుగా మలిచారు.
“స్కూల్లో చదివేటప్పటి నుండి లైబ్రరీలో పుస్తకాలు చదివేదానిని. పత్రికలలో వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, మహిళలలకు సంబంధించిన వివిధ పరిశోధనాత్మక గ్రంథాలను చదివి నోట్సు వ్రాసుకోవటం నాకు అలవాటు. వీటికి తోడు అంతర్జాలంలో వివిధ అంశాలను గురించి విషయ సేకరణ చేస్తున్నాను. స్టాంపులను విడుదల చేసినప్పుడు స్టాంపుకు సంబంధించిన సమాచారాన్ని సేకరింపచేసి క్లుప్తంగా సమాచార పత్రాన్ని (బ్రోచర్)ని విడుదల చేస్తారు. ఈ సమాచారం కొంత వరకు ఉపయోగపడుతుంది” అని తెలిపారు నాగలక్ష్మి.
సంచిక టీమ్ తరఫున శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి అభినందనలు.