(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]ము[/dropcap]స్లింల దండయాత్రల్లో మొట్ట మొదట తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయిన భారత భూభాగం ఏమిటో తెలుసా? ప్రస్తుత శకం 610లో అరేబియా, ఆ తరువాత పర్షియాలు అంతకు ముందరి తమ మూలాలను కూకటివేళ్లతో సహా పోగొట్టుకొన్నాయి. పూర్తిగా ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి. ఆ తరువాత భారత్‌పై కన్నేసిన అరబ్బులు.. సింధ్ ప్రాంతం మీదుగా దేశంలోకి చొచ్చుకొచ్చారు. కానీ.. అరేబియా, పర్షియా మాదిరిగా మతం పూర్తిగా మార్చేసిన భారత భూభాగం ఆఫ్ఘనిస్తాన్. మనలోనే చాలామందికి ఈ విషయంపై అంతగా పరిజ్ఞానం లేదు. బీజేపీ వాళ్లో.. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లో ఏదో అఖండ భారతం అంటారని తేలిగ్గా తీసుకొంటారు కానీ.. ఎవరైనా పండితులో.. ఏవో పుస్తకాల్లో మహాభారతంలో చెప్పిన గాంధార రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ అని చెప్తుంటే.. ఏదో చెప్తున్నారనుకొంటాం. కానీ.. చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్ భారత ఉప మహాఖండంలో అంతర్భాగమన్న విషయం తెలియదు. ఇస్లామ్ మతస్థుల చొరబాట్లతో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా మారిపోయింది. భారతీయుల చరిత్ర నామరూపాలు లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశం నుంచి మొట్టమొదటగా విడిపోయిన ముక్క ఆఫ్ఘనిస్తానే. పదో శతాబ్దం దాకా భారతీయ రాజులే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పరిపాలించారనే విషయం కానీ.. ఆ రాజులెవరన్న విషయం కానీ ఎవరికైనా తెలుసా? అక్కడ జీవన శైలి, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి ఏమిటన్నవి కనీసంగా కూడా తెలియదు. ఎందుకంటే.. దాన్ని మనం పూర్తిగా మరచిపోయాం. మనది కాదని వదిలేశాం. అక్కడ కూడా మన మూలాలు ఉన్నవని.. ఒకనాడు మన ప్రజలు ముఖ్యంగా మన భారత సమాజం ఉన్న విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాం. తరాలు మారిపోయాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే అది వేరే దేశం. అంతకు మించి అఖండ భారతమనో.. గాంధార దేశమనో ఎవరైనా మాట్లాడితే.. అమ్మో వీడు ఫలానా వాడని ముద్ర వచ్చి పడుతుంది.
ఆరో శతాబ్దంలోనే వరాహమిహిరుడు తన బృహత్సంహితలో అవగణ పేరుతో ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రస్తావించాడు. మన చరిత్రకారులు పష్తూన్ భాష మాట్లాడే వారు ఈ ప్రాంతంలో నివసించారని.. వారు తమను తాము ఆఫ్ఘన్‌లు అని చెప్పుకొన్నారని.. రాసుకొంటూ వచ్చారు. కానీ.. ఆఫ్ఘనిస్తాన్ అన్న పేరు ‘ఉపగణస్థాన్’ అన్న మూలం నుంచి వచ్చింది. అంటే.. అనేక రకాల జాతుల ప్రజలు ఒక్కచోట ఉన్న ప్రాంతం ఇది. ముందే చెప్పుకొన్నట్టు మహాభారతంలో పేర్కొన్న గాంధార రాజ్యం ఇదే. ఇప్పుడు కాందహార్‌గా దీన్ని పలుకుతున్నారు. వేద సంస్కృతిలో పేర్కొన్న పక్థా జాతి.. కాల పరిణామంలో ఫక్తూన్‌గా మారిందని.. వీరు అధికంగా నివసించే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ అయింది. 16వ శతాబ్దంలో కాబూలు దక్షిణ ప్రాంతాన్ని బాబర్‌నామా ఆఫ్ఘనిస్తాన్‌గా ప్రస్తావించింది. ఆ తరువాత మళ్లీ 19వ శతాబ్దంలో ఫ్రెడ్రిక్ ఏంగిల్స్ ఈ దేశం మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ అని పిలిచాడు. బ్రిటిష్ వాడు అన్నాడు కదా.. అదే పేరు స్థిరపడిపోయింది. పదో శతాబ్దం చివరి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో మెజార్టీ ప్రజలు హిందువులు, బౌద్ధులే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా శివుడిని పూజించేవారు. భారత్‌లో మిగతా ప్రాంతాల మాట ఎలా ఉన్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వందల కొదీ శివపార్వతుల దేవాలయాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ల ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి సర్ ఈస్టిన్ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పురాతత్వ తవ్వకాలు నిర్వహించాడు. ఈ తవ్వకాలు, వాటిలో లభించిన శాసనాలు, శిలలు, శిల్పాలు, నిర్మాణాల గురించి వివరంగా చెప్తూ నాలుగు గ్రంథాలు రచించాడు. తాను నిర్వహించిన తవ్వకాల్లో లెక్కలేనన్ని రాతి శాసనాలు, లెక్కలేనన్ని దేవతామూర్తుల విగ్రహాలు దొరికాయని వాటికి సంబంధించిన ఫొటోలతో సహా ప్రచురించాడు. ఈ ఫొటోలలో ఒక సూర్య దేవాలయం, ఒక గణేశ ప్రతిమ, బౌద్ధారామాలు, శివాలయాలు ఉన్నాయి. ఆ తరువాత ఇస్లామాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ రహమాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ పూర్వ వైభవాన్ని వివరిస్తూ రెండు గ్రంథాలు రచించాడు కూడా. అబ్దుల్ రహమాన్ రచనల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో ‘కుషాణులు’, ‘కిదారులు’ సుదీర్ఘ కాలం పరిపాలించారు. వీరి రాజరిక కాలం ఆఫ్ఘనిస్తాన్‌లో ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. 1వ శతాబ్దంలో కుషాణులు ఈ ప్రాంతంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు. వాళ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద ఎత్తున శివాలయాలను నిర్మించారు. అంతే కాదు.. పశ్చిమాసియా ప్రాంతాల్లోనే కాకుండా ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్‌లలో కూడా శివాలయాలు నిర్మించారు. తాష్కెంట్‌లో ఇప్పటికీ ప్రాచీన శివాలయాలు మనకు కనిపిస్తాయి. అంతెందుకు.. పాత సోవియట్ యూనియన్‌లో భాగమై ఇప్పుడు స్వతంత్రంగా విడిపోయిన అజర్‌బైజాన్‌లో అగ్ని దేవాలయం ఉన్న విషయం మీకు తెలుసా? ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా నిరంతరం అఖండంగా జ్వలిస్తూనే ఉన్నది. ఇది వేద సంస్కృతికి సంబంధించిన దేవాలయం. ఈ దేవాలయం గోడలపై పంజాబీ గురుముఖి లిపిలో కొన్ని మంత్రాలు చెక్కి ఉన్నాయి. దేవాలయం భూగర్భంలో అనంతమైన పెట్రోలు గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దీంతో అఖండ జ్యోతి నిరంతరం ఇక్కడ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. మన వేద సంస్కృతి ఎంత వరకు విస్తరించిందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంకా మన చరిత్రకారులు బయటోడు ఎవడో వచ్చి వేదాలు రాశాడు.. రామాయణ భారతాలు రాశాడన్న మాటలు చదువుకుంటూనే ఉందామా?
ప్రస్తుత శకం 666 నుంచి 843.. 843 నుంచి 850 వరకు ఖింగ్లా వంశస్తులు కాబూల్ రాజ్యాన్ని పరిపాలించారు. ఏడో శతాబ్దంలో హ్యుయాన్ త్సాంగ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడ ఒక హిందూ క్షత్రియుడు రాజ్యమేలుతున్నాడని రాశాడు. అతని పేరు షాహీ ఖింగల్ అని కూడా పేర్కొన్నాడు. ఇతనికి సంబంధించిన వివరాలు ఆఫ్ఘనిస్తాన్ లోని గార్డేజ్ ప్రాంతంలో దొరికిన శాసనంలో లభిస్తున్నాయి. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ మంత్రి ఉండేవాడట. ఇతను కాల్కా బ్రాహ్మణ తెగకు చెందిన వాడు. ఆ రోజుల్లో ఈ తెగకు అత్యధిక ప్రాధాన్యం ఉండేది. తరువాతి కాలంలో వాళ్లను కల్లర్‌లుగా పిలిచేవారు. వీరికి మన పంజాబ్ నుంచి ఉజ్జయిని దాకా పెద్ద ఎత్తున సంబంధ బాంధవ్యాలు ఉండేవి. పంజాబ్‌లో కల్లర్ పేరుతో ఒక టౌన్‌షిప్ కూడా ఉన్నది. ఖింగ్లా వంశస్తుల్లో సామంత్‌దేవ్, భీమ్‌దేవ్, జయపాల్‌దేవ్, ఆనంద్‌పాల్, త్రిలోచనుడు ముఖ్యమైన వాళ్లు. ఓవైపు సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకొన్న ముస్లింలు.. మరోవైపు కాబూల్ జాబుల్ ప్రాంతాలపై యుద్ధాలు చేశారు. కానీ అవి వారికి చాలా కాలంపాటు వశం కాలేదు. ముస్లింలు ముందుగా హింద్ షాహీలపై దాడులు చేశారు. హింద్ షాహీలు బుఖారా, కాబూలు, గాంధార రాజ్యాలను పరిపాలించారు. వీరికి పక్కనే ఉన్న కాశ్మీర్ రాజ కుటుంబాలతో మంచి సంబంధాలు కొనసాగాయి. మహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న తరువాత వీరు కాబూల్‌పై కన్నేసి అక్కడ యుద్ధం చేశారు. భారతీయ గొప్ప చరిత్రకారుడైన కల్హణుడు తన రాజతరంగిణిలో ఇందుకు సంబంధించిన కొన్ని ఘట్టాలను రికార్డు చేశాడు. బాగ్దాద్ కేంద్రంగా ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మమూన్ ఖలీఫా సైన్యంతో కశ్మీర్ హిందూ రాజ సైన్యం పెద్ద యుద్ధం చేసిందని రాజతరంగిణిలో పేర్కొన్నాడు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని బుఖారా ప్రాంతం ముస్లింల వశమైంది. హింద్ షాహీలకు సహకరించడం కోసం కశ్మీర్ రాజులు తమ సైన్యాన్ని తోడుగా పంపించి ఉంటారని భారతీయ చరిత్రకారులు భావిస్తారు. ఈ బుఖారాను ప్రాచీన కాలంలో షా విహార్ అని పిలిచేవారని ఇస్లామాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అబ్దుల్ రహమాన్ తన రచనల్లో పేర్కొన్నాడు. అరబ్బులు ఈ ప్రాంతంపై యుద్ధానికి తెగబడ్డప్పుడు బుఖారా రాణి కశ్మీర్ వెళ్లి.. అక్కడి రాజులను సహాయం కోరడంతో వారు తమ సైన్యాన్ని పంపించినట్టు చెప్తారు. అరబ్ గ్రంథాల్లో ఈ రాణిని ఖాతూన్ గా పేర్కొన్నారు. ఖాతూన్ అంటే మహిళ అని అర్థం. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్న రాజులకు, వారి పరివారానికి వారణాసి నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడు వైద్య చికిత్స అందించేవాడని కూడా అబ్దుల్ రహమాన్ రాశాడు. ఆరోజుల్లో భారత ఆయుర్వేద వైద్యులకు సింధ్ ప్రాంతం నుంచి ఉజ్బెకిస్తాన్ దాకా కూడా ఫుల్ డిమాండ్ ఉండేదని ఆయన ప్రస్తావించాడు.
కాబూల్‌పైనా, గాంధారంపైనా ముస్లింలు దాడులు చేసినప్పటికీ.. ఆ ప్రాంతాలు పూర్తిగా ముస్లింల వశం కానేలేదు. దాదాపు పదోశతాబ్దం చివరి వరకూ కూడా హిందువులు, బౌద్ధుల చేతుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. 964 సంవత్సరం నుంచి 1001 సంవత్సరం దాకా రాజా జయపాల్‌దేవ్ ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించాడు. 980 సంవత్సరంలో జయపాలుడు ఘజ్నవిద్‌లపై దాడిచేశాడు. సెబుక్తిజిన్ అతని కుమారుడు మహమూద్‌ల కాలంలో వారి రాజధానిని ఆక్రమించుకొన్నాడు. ఇది ముస్లిం ఘజ్నవిద్‌లు, హింద్ షాహీల మధ్య పోరాటాలకు దారితీసింది. దాదాపు ఇరవై ఏండ్ల పాటు ఈ యుద్ధాలు కొనసాగాయి. ముస్లిం ఘజ్నవిద్‌ల సైన్యంతో పోలిస్తే.. హింద్ షాహీల సైన్యం చాలా తక్కువ. పంజాబ్ రాజుల సహాయంతో తన సైన్యాన్ని పదివేల మందికి పెంచుకొన్నాడు. అయినప్పటికీ ఘజ్నవిద్‌ల సైన్యంతో ఏ మాత్రం సరిపోకపోవడంతో తన సైన్యాన్ని ప్రతి ఐదు వందల మందితో ఒక స్క్వాడ్రన్ ఏర్పాటు చేశాడు. ముస్లిం సైనిక దళాల్లో ఒక నిర్దిష్ట బృందాన్ని లక్ష్యం చేసుకొని ఒక్కో స్క్వాడ్రన్ దాడి చేసింది. సెబుక్తిజిన్ అనంతరం 1001లో సుల్తాన్ మహమ్మద్ (మహ్మద్ ఘజ్ని అంటే ఇతనే) అధికారంలోకి వచ్చాక హింద్‌ఖుష్‌కు ఉత్తరాన ఉన్న ఖరాఖనిద్‌ను ఆక్రమించడంతో జయపాల్ పతనం ప్రారంభమైంది. ప్రస్తుత పెషావర్ దాకా మహమ్మద్ చొచ్చుకువచ్చి జయపాల్‌ను ఓడించాడు. పెషావర్ యుద్ధంలో జయపాల్ పట్టుబడ్డాడు. కానీ 50 ఏనుగులను జరిమానాగా తీసుకొని విడిచిపెట్టాడు. కానీ ఈ ఓటమిని తట్టుకోలేక జయపాల్ ఆత్మహత్య చేసుకొన్నాడు. జయపాల్ యుద్ధం కారణంగా మహమ్మద్ ఘజ్‌నీ భారతదేశంపైకి దాడి చేయడానికి అవకాశమిచ్చినట్టయింది.
దీంతో ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ రాజుల పరిపాలన అంతమైంది. జయపాల్‌పై విజయానికి గుర్తుగా మహమ్మద్ ఘజ్‌నీ కాబూల్‌లోని శివాలయాన్ని ధ్వంసంచేసి ఆ శిథిలాలపై మసీదును నిర్మించాడు. కాబూల్‌లో ఇవాళ మనకు కనిపించే ప్రధాన మసీదు ఇదే. ఈ ఓటమి తరువాత హింద్ షాహీలు ఉద్బంధపుర (ప్రస్తుతం పాకిస్తాన్‌లో నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ లోని ఉండ్) కు తమ రాజధానిని మార్చుకొన్నారు. కానీ ఘజ్‌నీ సహించలేదు. అక్కడా దాడి చేసి ఆ ప్రాంతాన్నీ స్వాధీనం చేసుకొన్నాడు. హింద్‌షాహీలు ఒక చోటి నుంచి మరొకచోటికి వలస పోతూనే ఉన్నారు. ఉండ్ నుంచి లాహోర్‌కు.. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతానికి వలసపోయారు.
వీరి వారసుడిగా వేక దేవ్ వచ్చినట్టు క్వాయిద్ ఏ ఆజమ్ యూనివర్సిటీ ఆఫ్ ఇస్లామాబాద్‌లో జరిగిన హిస్టరీ కాంగ్రెస్‌లో ప్రొఫెసర్ అహ్మద్ హుస్సేన్ సమర్పించిన పరిశోధన పత్రంలో వేక దేవ్ ప్రస్తావన ఉన్నది. ఇతను శివుడి భక్తుడని కూడా హుస్సేన్ పేర్కొన్నాడు. మజర్- ఏ- షరీఫ్ శాసనం పేరుతో సమర్పించిన ఈ పరిశోధన పత్రంలో ఈ శాసనం వివరాలను పొందుపరిచారు. హింద్‌షాహీ పరిపాలనాకాలం 138 వ సంవత్సరం అన్న తేదీ ప్రస్తుత శకం 959తో సరిపోలుతున్నదని పేర్కొన్నాడు. ఈ శాసనం మొత్తం 11 లైన్లు ఉన్నదని.. ఇది పశ్చిమ శారద శైలిలోని సంస్కృత లిపిలో రాసి ఉన్నదని కూడా వెల్లడించాడు. ఈ శాసన శిల పైభాగంలో ఎడమవైపు కొంత విరిగి పోవడం వల్ల మొదటి అక్షరమైన ‘ఓం’ మిస్ అయిందని తెలియజేశాడు. ఈ శాసనం ప్రకారం వేక దేవుడు ఎనిమిది అంచెల సైన్యాన్ని కలిగి ఉన్నాడు. ఇతని హయాంలో తనకు తన కుమారుడి క్షేమం కాంక్షిస్తూ.. ఉమామహేశ్వరుల దేవాలయాన్ని మైత్యస్యలో నిర్మించాడు. వేక రాజు తనను తాను ‘ఇర్యతుమతు క్షంగినాక’ అని బిరుదు చెప్పుకొన్నాడట. దీని అర్థం తెలియరాలేదు. ఇతని కాలంలోని నాణాలు ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తవ్వకాల్లో చాలా లభించాయి. ఇతని గురించి అరబ్బు రాజు యాఖూబి కూడా ప్రస్తావించాడు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ కు స్వతంత్ర రాజుగా ఉన్నాడని పేర్కొన్నాడు.
హింద్ షాహీలు అంతమైన తరువాత ఆఫ్ఘనిస్తాన్ తన ఉనికిని క్రమంగా కోల్పోతూ వచ్చింది. ఘజ్‌నీ తరువాత సెల్జుకిద్‌లు, ఘురిద్‌లు, ఆ తరువాత తైమూర్‌లంగ్.. అనంతరం బాబర్ ఈ ప్రాంతంలో కాలుమోపాడు. 16వ శతాబ్దంలో మొఘలుల తొలి పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్ మీదుగానే మొఘలులు భారత్‌లోపలికి చొచ్చుకువచ్చి.. సంపూర్ణంగా ఆక్రమించుకొన్నారు. 19వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వచ్చింది. దాదాపు శతాబ్దం పాటు బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని కొంతకాలం పెత్తనం చెలాయించారు. 1919లో ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్రదేశమైంది. కానీ అప్పటికే భారతీయ మూలాలు సమూల విచ్ఛేదనమైపోయాయి. కొద్దో గొప్పో ఉన్న బౌద్ధ ప్రతీకలను గత రెండు దశాబ్దాలలో తాలిబన్లు విధ్వంసం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ముస్లింల చేతికి పూర్తిగా చిక్కిన భారత తొలి భూభాగం.
(సశేషం)