[dropcap]ఆ[/dropcap]మె దేవుని రాజ్యం కేరళలో పుట్టి బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. అమ్మమ్మ దగ్గర క్రైస్తవమత సిద్ధాంతాలను నేర్చి ఏడేళ్ళకే దేవుని సేవికగా భావించారు. ఒక పక్క భయంకర అనారోగ్యం పాలైనా, మంచంలో వుండే చదువును కొనసాగించారు. అనారోగ్యంతో సహజీవనం చేస్తూనే చదువును కొనసాగించి, ఉపాధ్యాయిని వృత్తిని చేపట్టారు. దేవుని కొలిచారు.
మరణానంతరం నలభై ఏళ్ళకి బీటిఫైడ్ చేయబడ్దారు. యాభై రెండేళ్ళకు సెయింట్‌గా ప్రకటించబడ్దారు. ఆమె సెయింట్ ఆల్ఫోన్సా.
ఈమె 1910వ పంవత్సరం ఆగష్టు 19న నాటి ట్రావెన్కూర్ (తిరువాన్కూరు) నేటి కేరళ రాష్ట్రం లోని కొట్టాయం జిల్లాలోని అర్పూకర్ ప్రాంతం కుడమల్లూర్‌లో జన్మించారు. ఈమె అసలు పేరు (అన్నకుట్టి) అన్నా ముట్టతుపడతు. ఆగష్టు 28న సైరోమలబార్ ఆచారం ప్రకారం బాప్టిజం ఇవ్వబడింది.
తల్లి మేరీ పుతుకారి. తండ్రి జోసెఫ్ ముట్టతు పదతిల్. తల్లిని బాల్యంలోనే పోగొట్టుకున్నారు. బంధువుల వద్ద పెరిగారు. వారు అమెను బాధలకు గురి చేశారు. అందువల్ల బాల్యం నుండి బాధలు పడడం అలవాటయింది. ఈ బాధా తప్త అనుభవాలే ఆమె బాధపడే వారికి సేవలు చేసేందుకు దోహదం చేశాయి.
మేనమామ జోసఫ్ ముట్టతుపడతు దగ్గర చదువుకున్నారు. మూడేళ్ళ వయస్సులో అనారోగ్యం పాలయ్యారు. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన ఎగ్జిమా ఈమెను మంచం మీదే పడేటట్లు చేసింది. అలా అనారోగ్య పరిస్థితిలో అభధ్రత భావంతో పెరిగారు.
1916లో తొన్నన్‌కుబీ ప్రాథమిక పాఠశాలలో చేరి చదివారు. 1920లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఈమె అమ్మమ్మ గారిది సాంప్రదాయక కుటుంబం. మురికన్ కుటుంబం అంటే ఆ రోజులలో గొప్ప కుటుంబం.
అమ్మమ్మ దగ్గర క్రైస్తవ ప్రార్థనలు, పాటలు నేర్చుకున్నారు. క్రైస్తవ మత విశేషాలని, గాథలను గురించి తెలుసుకున్నారు. సాధువుల జీవిత చరిత్రలను కరతలామలకం చేసుకున్నారు.
ఐదేళ్ళ వయస్సులోనే సైరో-మలబార్ ఆచారం ప్రకారం ప్రార్థన గదిలో చేరి ప్రార్థన చేయటం మొదలు పెట్టారీమె. ఏడేళ్ళ వయస్సు నుండి దైవిక జీవిత భాగస్వామికి (దేవునికి) జీవితాన్ని అంకితం చేసారు.
సాంప్రదాయక క్రైస్తవ వనితగా తయారయ్యారు. గొప్ప గొప్ప క్రైస్తవ కుటుంబాల వారు కోడలిగా చేసుకోవడానికి ముందుకు వచ్చారు. కాని అన్నా ఊహ తెలిసినప్పటి నుండి క్రైస్తవ సన్యాసిగా మారాలని ఆకాంక్షించేవారు. సన్యాసిగా మారితే పేద ప్రజలకు సేవ చెయ్యొచ్చని ఆమె అనుకునేవారు. ఏసుక్రీస్తు సేవలో ధన్యురాలిగా మారాలని ఆమె ఆశయం.
1923లో మంటలున్న గోతిలో పడిపోయారు. అసలే ఎగ్జిమాతో బలహీనమైన పాదాలు ఈ మంటలో కాలిపోయాయి. జీవితాంతం పాదాల ఇబ్బందులతో అనారోగ్యంతో సహజీవనం చేయవలసివచ్చింది. అయినా ఈమె దేవుని సేవ మానలేదు.
సెయింట్ ఫ్రాన్సిస్‌కు చెందిన థర్డ్ ఆర్డర్ మత సమ్మేళనంలో పాలుపంచుకున్నారామె. అక్కడ మాధ్యమిక విద్యను పూర్తి చేసారు.
ఫ్రాన్సిస్కాన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్లో చేరారు. 1927 నాటికి కొట్టాయం జిల్లాలోని చంగనాచెరి దగ్గరికి చేరారు. అక్కడ అల్పోన్సస్ లిగుయోరి పట్ల గౌరవం చూపించారు. తన పేరును ఆల్ఫోన్సాగా మార్చుకున్నారు. 1932లో వాకక్కాడ్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా నియమితులయ్యారు. ఒక వైపు ఉపాధ్యాయినిగా పాఠాలు చెపుతూనే పై చదువు కొనసాగించారు. ఇలా చదువుతూ, ఉద్యోగం చేస్తూనే మతపరమైన ప్రమాణాలను పూర్తిచేశారు. తరువాత భరణాంగణం అనే ఊరిలోని సెయింట్ ఆల్ఫోన్సా బాలికా పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరారు. రోజు రోజుకీ ఆరోగ్యం మరింత క్షీణించింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో 1936లో కురియాకోస్ ఎలియాస్ చవరా అనే మతాధికారి ఈమెకు బీటిఫై చేశారు. ఈ కారణంగా ఈమె జబ్బులు నయమవుతున్నాయని చెపుతారు. అయినా బలహీనమయిపోయారు.1939 నాటికి న్యుమోనియాకి గురయ్యారు.
1945 నాటికి కాలేయ సమస్యలు ఎక్కువయ్యాయి. వాంతులు ఆమె నీరసాన్ని పెంచాయి. ఆరోగ్యసమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. చివరకు 1946 జూలై 28వ తేదీన భరణాంగనంలో మరణించారు. ఈమెకు నివాళిని అర్పించడానికి చాలా మంది విద్యార్థులు, సహోపాధ్యాయులతో పాటు క్రైస్తవ మతాధిపతులు కూడా హాజరయ్యారు. భరణాంగనంలోని సెయింట్ మేరీస్ ఫోరేన్ చర్చిలో ఖననం చేశారు.
1953 డిసెంబర్ 2వ తేదిన ఈమె బీటిఫికేషన్ కోసం డియోసెసస్ ప్రక్రియ ప్రారంభమైంది.
పోప్ జాన్ ఆమె బీటిఫికేషన్‌ను ఆమోదించారు.1985 జూలై9వ తేదిన దేవుని సేవకురాలిగా ప్రకటించారు.1986 ఫిబ్రవరి 8వ తేదీన బీటిఫైడ్ ప్రక్రియను పూర్తిచేశారు.
పోప్ భారతదేశ సందర్శనలో భాగంగా 1986 ఫిబ్రవరి 8వ తేదీన కొట్టయాన్ లోని నెహ్రూ స్టేడియంలో ఈ విధంగా ఆమెను ప్రశంసించారు. “ఆమె జీవితంలో మొదటి నుండి చాలా బాధలను అనుభవించింది. ఆమె శారీరకంగా, మానసికంగా కూడా బాధలను అనుభవించింది. తన బాధలన్నింటినీ ప్రశాంతతతో మరియు దేవుని పై నమ్మకంతో నిరంతరం అంగీకరించింది. అవి తన ఉద్దేశాలను శుద్ధి చేస్తాయని, అన్ని స్వార్ధాలను అధిగమించడానికి సహాయపడతాయని నమ్మింది”.
ఆమె “ప్రియమైన తండ్రీ, నా మంచి ప్రభువైన యేసు నన్ను చాలా ప్రేమిస్తున్నందున, నేను జబ్బుతో మంచం మీద ఉన్నాను. దేవుడు నా జీవితాన్ని అర్పణగా, బాధల త్యాగంగా భావించాడని నేను భావిస్తున్నాను.” అని వ్రాసుకున్నారు.
2007 జూన్ 1వ తేదీన సిస్టర్ ఆల్ఫోన్సా పేరును కాననైజ్ చేయడానికి (సెయింట్‌గా ప్రకటించడానికి) పోప్ బెనెడిక్ట్ ఆమోదించారు. చివరకు 2008 అక్టోబర్ 12వ తేదీన బెనెడిక్ట్ ఆమెను సెయింట్‌గా ప్రకటించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో వెలుగుతున్న కొవ్వొత్తులను పట్టుకుని ప్రముఖులు గౌరవాన్ని ప్రకటించారు. బెనెడిక్ట్ ఆమె జీవిత చరిత్రను అందరికీ వినిపించారు.
సుమారు 25,000 మంది భారతీయులు, ఆనాటి కార్మిక మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో పదిహేను మంది సభ్యులతో అధికారుల బృందం హాజరయి ఆమెపట్ల గౌరవాన్ని ప్రకటించారు.
ఆమెను ఖననం చేసిన భరణాంగనంలోని ‘సెయింట్ మేరీస్ ఫోరేన్ చర్చి’ని సెయింట్ ఆల్ఫోన్సా ప్రార్థనామందిరంగా మార్చారు. ప్రతి సంవత్సరం జూలై 19-28 వరకు ఈమె విందును జరుపుకొనే ఉత్సవంలో వేలాదిమంది యాత్రికులు భరణాంగనాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు.
భారత ప్రభుత్వ తపాలాశాఖ ఈమె జ్ఞాపకార్థం రెండు స్టాంపులను విడుదల చేసింది. మొదటి స్టాంపు 1996 జూలై 19వ తేదీన 1-00 రూపాయి విలువతో విడుదలయింది. ఈ స్టాంపు మీద నవ్వుతూ సన్యాసిగా కన్పిస్తారీమె.
2008 నవంబర్ 16 వ తేదీ 5 రూపాయల విలువతో ఒక స్టాంపు, ఒక మినియేచర్‌షీటు విడుదలయ్యాయి. ఈమెకి సెయింట్ హుడ్ లభించిన సందర్భముగా వీటిని విడుదల చేసి గౌరవించింది భారత తపాలా శాఖ.
అక్టోబర్ 12వ తేదీ ఈమెని సెయింట్‌గా ప్రకటించిన వార్షికోత్సవ సందర్భంగా ఈ వ్యాసం.
***
Image Courtesy: Internet