[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.
51. వెయిట్
అమ్మ: ఇదేమిటిరా, కుక్కర్ మీద పేపర్ వెయిట్ పెట్టావ్?
చిన్న: ప్రెషర్ పోతోంది, వెంటనే ‘వెయిట్’ పెట్టరా అని చెప్పింది నువ్వేగా!
52. తాగలేకపోతున్నారా!
కొండల్: తాగలేక, తాగుడు మానలేక బాధపడుతున్నారా అనే ప్రకటన చూసి వెళ్ళావుగా! ఏం ట్రీట్‍మెంట్ ఇచ్చారు?
జగన్: రెండు సీసాలు తెప్పించాడు. తాగటానికి కంపెనీ ఇచ్చాడు. అంతే!
53. మందు
పేషంట్: డాక్టర్! నాకు తిన్నది అరగటం లేదు. కడుపు నొప్పిగా ఉంటోంది. మంచి మందు ఇవ్వండి.
డాక్టర్: ముందుగా నా ఫీజు వంద రూపాయలు ఇవ్వండి. ఇకపోతే, రోజుకు రెండుసార్లు సిటీ బస్ ప్రయాణం చేయండి, అదే మందు.
54. భూరి విరాళములు
గురువు: శిష్యా, భూరి విరాళాలు అనగానేమో వివరించుము?
శిష్యుడు: మనము బూరెలు వండుకొని తిని ఇచ్చు పైకమును భూరి విరాళము అని అందురు.
55. దొంగనీతి
బాలు: అదేంటి ఆయన ఇంటికి పెద్ద కన్నం ఉంది. దొంగలు పడ్డారా ఏమిటి?
వేణు: దొంగలు పడడం కాదయ్యా బాబూ! ఆయనే పెద్ద గజదొంగ! గుమ్మంలోంచి ఇంట్లోకి వెళ్ళటం వారి వృత్తికే అవమానమని, అలా కన్నం ఏర్పాటు చేసుకున్నాడు.
56. స్పెషల్ ఆఫర్
బాపిరాజు: ఏమయ్యా! సర్వరూ మీ హోటల్లో టిపిన్లు, భోజనాలు చేస్తే మాకేంటి స్పెషల్ ఆఫర్?
సర్వర్: మీరు టిఫిన్, భోజనం చేసిన మూడు గంటల లోపు వాంతులూ, మోషన్లూ అయితే వైద్యం ఉచితంగా చేయిస్తాం.
57. అరుంధతి
పంతులుగారు: అలా ఆకాశంలోకి చూడండి దంపతులారా! అక్కడ అరుంధతి నక్షత్రం చూడండి.
పెండ్లికుమారుడు: అయ్యబాబోయ్! పంతులుగారో నాకు భయమేస్తోంది.
పంతులుగారు: ఎందుకు నాయానా?
పెండ్లికుమారుడు: ‘బొమ్మాళీ నిన్నొదల’ అంటూ భయంకరంగా నా మీదకి వస్తోంది! అందుకే నే చూడ, నే చూడ పంతులు గారూ! నే చూడ.
58. కవిత
గురువు: తెలుగు భాష నేర్చుకున్నావు కదా! ఏదీ తెలుగులో ఒక కవిత చెప్పుము.
శిష్యుడు: పచారీ కొట్టు దగ్గర సంగీత కచేరీ పెట్టే జనాలు తిట్టారనీ, కొట్టారనీ విచారించకురా నస నాంచారయ్యా!
59. కర్పూరప్రేమ
ఎడిటర్: ‘కర్పూరప్రేమ’ నవల రాసి ఇస్తానని, ఇలా తెల్లకాగితాల పుస్తకం ఇచ్చారేమిటి?
నవలశ్రీ: కర్పూరప్రేమ కదా! కరిగిపోయి ఉండచ్చు సార్!
60. మర్యాద
వేటూరి: మనం ఇచ్చినా, తీసుకున్నా కనిపించనిది ఏమిటి?
కొండూరి: ‘మర్యాద’.
(మళ్ళీ కలుద్దాం)