[dropcap]గూ[/dropcap]ని కాదు గానీ
కొంచం వంగి నడుస్తాడు.
వయోభారం కదా.
జుత్తు నల్లగా ఉంటుంది
రంగు వేస్తాడు కాబోలు.
నాలాగే అడ్డపంచె కట్టుకుంటాడు.
పొట్టి చేతుల తెల్లచొక్కా ధరిస్తాడు.
ఎప్పుడు పీలుస్తాడో చూడలేదు గాని,
ముట్టించిన సిగరెట్టు ఒక చేత్తో,
కుక్కపిల్ల మెడలో గొలుసు మరో చేత్తో.
ఎంత ముద్దొస్తుందో బుజ్జిముండ! .
రోజూ ఎండ ముదరకుండానే
ఇద్దరూ మా ఇంటి ముందునుంచి
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు.
సాగరతీరం వేపనుకుంటాను.
మా ఇంటి ముందున్న
సన్నజాజిమెక్క పూలు కోసుకుంటూనో,
చదువుకుంటున్న
దినపత్రిక నుండి ముఖం పైకెత్తినప్పుడో
చూపుల్తోనే పలకరించుకుంటాం.
ఎప్పుడైనా
క్షౌరశాలలో తారసపడినప్పుడు
మందస్మితాలు పంచుకుంటాం.
ఇంకేముంది చెప్పడానికి!
ఇవాళ
బుజ్జిముండ మెడలో గొలుసు పట్టుకొని
అంటించిన సిగరెట్ నోట్లో పెట్టుకోని
పెద్దాయన ఎవరూ
మా ఇంటి మీదుగా వెళ్లలేదు.
దూరంగా ఘంటసాల మాస్టారు
భగవద్గీత శ్లోకాలు వినిపిస్తున్నారు.