[dropcap]పా[/dropcap]ర్వతీ దేవికి సగం తనువిచ్చి
భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక తానయ్యాడు..
అర్ధనారీశ్వరుడుగా లోక ప్రసిద్ధి గాంచాడు!
గరళాన్ని కంఠాన దాచి
లోకానికి హితాన్ని చేకూర్చిన లోక సంరక్షకుడు మహాశివుడు!
డమరుక నాదంతో నృత్య ప్రియుడు తానై
నటరాజుగా ఇలలో పూజలందుకుంటున్న ఆనందకారకుడు!
పులిచారల వస్త్రాన్ని మాత్రమే కలిగి
నిరాడంబరతకు మారురూపమై
జగత్తుకు శాంతి సౌఖ్యాలను ప్రసాదించిన మహిమాన్వితుడు!
హిమ శిఖరాలలో నిరాకారుడిగా సంచరిస్తూ
సదా మానవాళిని కాపాడే చైతన్యమూర్తి..
శుభకరుడు.. మంగళాకారుడు శివుడు!
ఆద్యంతరహితుడు.. కాలాతీతుడు.. శివుడు!
ఆగ్రహిస్తే.. రౌద్ర స్వరూపుడు!
అనుగ్రహిస్తే.. శాంతాకారుడు, సౌమ్యుడు శివుడు!
అతడే సమస్త సృష్టి లయకారుడు!
పంచాక్షరి మంత్రమైన ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని పఠిస్తే చాలు
క్షణాల్లో ప్రసన్నుడై సర్వపాపాలను సమూలంగా నాశనం చేసి..
ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే పావనమూర్తి పరమేశ్వరుడు!
శివనామ సంకీర్తన చేస్తూ..
మనోవికాసంతో సన్మార్గంలో నడుస్తుంటే..
జ్ఞానాన్ని హృదయమందు నిలుపుకున్నాట్లే!
తిమిరాల చీకట్లను పారద్రోలి
భక్తకోటికి సువిజ్ఞాన ప్రకాశాన్ని..
ఉత్తమ జీవన విధానాన్ని సూచిస్తూ..
వరాలేన్నో సిరులల్లే గుప్పిస్తూ..
కాపాడే కారుణ్యమూర్తి.. సర్వ శ్రేష్ఠుడు సర్వేశ్వరుడు!
జన్మరాహిత్యాన్ని.. మానవజన్మకు సార్థకత
కలిగించే మహోన్నతుడు మహేశ్వరుడు!