జ్ఞాపకాల పందిరి-133

28
3

తెలుగు కవితా..! వర్ధిల్లు..!!

[dropcap]తె[/dropcap]లుగు కవిత్వానికి వందనం. తెలుగు కవితకు స్వాగతం. ఒకప్పుడు చదువుకోవడానికి కవిత్వం పుస్తకాల్లో దొరికేది. ఆ పుస్తకాలు కూడా ప్రసిద్ధ కవులవే ఉండేవి. కవిత్వం వినాలంటే, కవిసమ్మేళనంలోనే సాధ్యం అయ్యేది. దానికి ఒక ప్రత్యేకత ఉండేది. ఆ ప్రత్యేకత తెలుగు సంవత్సరాది, ‘ఉగాది’ రోజున ఉండేది. ఇది ఉగాది పండుగకు అదనపు ఆకర్షణగా ఆనందాన్ని పంచేది. అంటే కవిసమ్మేళనం సంవత్సరానికి ఒకసారి, అదీ ఉగాది రోజున సాధారణంగా ఆహూతుల సమక్షంలో జరిగేది. అది హైద్రాబాద్ అయితే తప్పనిసరిగా రవీంద్ర భారతిలో ఉండేది. విజయవాడలో అయితే తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగేది. అది కూడా ఆకాశవాణి హైదరాబాద్/విజయవాడ కేంద్రాలు ప్రత్యక్ష ప్రసారం చేసేవి.

నేటి కవిత వారి ప్రశంస

తర్వాత దూరదర్శన్ ఆవిర్భావం నుండి, దూరదర్శన్ కూడా టెలీకాస్ట్ చేస్తూ వస్తున్నది. దిన, వార, పక్ష, మాసపత్రికల్లో కవిత్వం వచ్చేది. పత్రికలలోగానీ, రేడియోలోగానీ, ప్రముఖ కవులకే ఎక్కువగా చోటుండేది. అలా తెలుగు కవిత్వం, తెలుగు కవిత, ఏ కొందరి చేతుల్లోనో ఉండేది. పత్రికలలో, యువతీయువకుల కోసం ఒక ప్రత్యేక పేజీ, రేడియోలో ‘యువవాణి’ లో, యువతకు అవకాశాలు తర్వాత వచ్చాయి. దీనితో మామూలు కవులకు కూడా ప్రాధాన్యత, ప్రోత్సాహం లభించేవి. ఈ పధ్ధతి ప్రస్తుతం పత్రికలలో లేకపోయినా, ఆకాశవాణి కేంద్రాలు, ఇప్పటికీ ‘యువవాణి’లో, యువకవులను ప్రోత్సహిస్తున్నాయి. అయితే రేడియోలో, ఇలాంటి సదుపాయం ఉంటుందని, దానికి కొంత పారితోషికం కూడా లభిస్తుందని ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఈ వ్యాస రచయిత ద్వారా చాలామంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు/చేసుకుంటున్నారు కూడా!

నేటి కవిత ఆత్మీయ సమ్మేళనం 14.10.2018

మన ఆధునిక జీవితంలో, అత్యవసర పరికరంగా ఆవిర్భావించిన ‘మొబైల్ ఫోన్’ అన్నివిషయాలు మాదిరిగానే కవిత్వం/కవిత విషయంలో, ఫేస్‌బుక్ రూపంలో ఆధిక్యతను సాధించింది. సాహిత్యపరంగా, కవిత్వపరంగా కుక్కగొడుగుల మాదిరిగా అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ, పాట, పద్యం, గజల్, ఒకటేమిటి, అన్ని ప్రక్రియలు, అందరూ రాసుకునే వెసులుబాటు కలిగింది. వీటిని అనేకమంది చదివే అవకాశం కూడా కలిగింది. ఎవరికీ వారు స్వంత గ్రూపులు పెట్టడం, చెప్పకుండానే అందులో సభ్యుల్ని చేయడం జరుగుతున్నది. ఇందులో చాలా గ్రూపులు సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ ఖూనీ చేస్తుంటే, కొన్ని గ్రూపులు మాత్రం చక్కని సాహిత్యాన్ని, కవిత్వాన్ని, రచయితలను ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని గ్రూపులు కవితల పోటీలు పెట్టి, అక్షరదోషాలున్నా, పద దోషాలున్నా, వాటిని గుర్తించకుండా, పరిష్కరించకుండా, ప్రశంసా పత్రాలు జారీ చేయడం బాధాకరం. ఇలాంటి క్రియలు ఆయా కవులకు లేదా రచయితలకు నష్టమే గానీ, లాభం ఏమాత్రం ఉండదు.

ఆత్మీయ సమ్మేళనంలో రచయిత ఉపన్యాసం

కొన్ని గ్రూపులు నిజమైన సాహిత్యసేవ చేస్తున్నాయి. ఉద్దండులైన కవుల చేత, రచయితల చేత రోజుకొక అంశం మీద వ్యాసాలు రాయిస్తున్నాయి, సమీక్షలు చేయిస్తున్నాయి. ఇవి యువకవులకు, రచయితలకు ఎన్నో మెళుకువలు, నేర్పిస్తాయి. కొన్ని గ్రూపులు కవితల పోటీలు పెట్టి బహుమతులు ప్రకటించడం ద్వారా, మంచి కవిత్వానికి బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొంత మంది తమ గ్రూపుల ద్వారా ప్రధాన పట్టణాలలో కవిసమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ అనేకమంది ప్రాంతీయులకు ప్రోత్సాహం కల్పించడం అభినందనీయం అయినప్పటికీ, ఒకే రోజు వందమందిని ఆహ్వానించి సమయం సరిపోనందున చివర, కవితలు చదవకుండానే శాలువా కప్పి సన్మానం చేయడం, ప్రశంసా పత్రాలు ఇవ్వడం తప్పుకాదా! తప్పే కాదు, నేరం కూడా కదా! సంస్థలు లేదా గ్రూపులు వాటి పేరుకోసం ఇలాంటి కవితా జాతరలు చేస్తుంటారుగాని తెలుగు కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని ఉద్దరించడానికి మాత్రం కాదు!

నేటినిజం.. పత్రిక అధిపతి శ్రీ బైస దేవదాసు (ముఖ్య అతిధి) రచయితకు సన్మానం చేస్తున్న దృశ్యం

సాహిత్యం కోసం, కవిత్వంలో పుష్టికరమైన కవిత్వం సృష్టించడం కోసం కొన్ని గ్రూపులు నిజంగా కష్టపడుతున్నాయి. అలాంటి అన్ని గ్రూపుల గురించి ఇక్కడ ప్రస్తావించలేను గానీ, నాకు తెలిసిన రెండు గ్రూపుల గురించి వారి సాహిత్య సేవ గురించి కొద్దిగా ముచ్చటిస్తాను.

సన్మాన కార్యక్రమంలో శ్రీ సేనాధిపతి (ఎడమ), శ్రీ లక్ష్మయ్య (కుడి)

నాకు రెండు గ్రూపులతో బాగా పరిచయముంది. ఆంటే.. ఆ రెండు గ్రూపుల్లోనూ నేను చురుగ్గా పాల్గొన్నాను. రెండు గ్రూపుల వల్లా ప్రయోజనం పొందాను. అందులో మొదటిది ‘నేటి కవిత’ గ్రూపు. హుస్నాబాద్‌లో ఇది 2017లో శ్రీ దాస్యం లక్ష్మయ్య అధ్యక్షుడిగా (అడ్మిన్), శ్రీ దాస్యం సేనాధిపతి ముఖ్యసలహాదారుగా ప్రారంభమయింది. మిత్రులు డా.శ్రీరంగస్వామి ద్వారా ఈ గ్రూపు నాకు పరిచయం అయింది. సాహిత్యకారుడిగా అంతకు ముందే శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు నాకు పరిచితులు. అందులో రోజుకొక అంశం శీర్షికగా ఇచ్చి కవిత రాయమనేవారు. చూచాయగా వాటిని సేనాధిపతి గారు (కవి, కథకుడు, సమీక్షకుడు, విమర్శకుడు) సమీక్ష చేసేవారు, కొన్ని అవసరమైన సూచనలు కూడా చేసేవారు. అందులో నేను రెండు వందలకు పైగా కవితలు రాసాను. ఈ గ్రూపులో నాకు పరిచయమైన వారు, ఇంకా వారి పరిచయాన్ని కొనసాగిస్తూనే వున్నారు.

కవి మిత్రులు జయపాల్ రెడ్డి గారితో

వారిలో, దొండపాటి నాగజ్యోతి శేఖర్ (కాకినాడ), శ్రీమతి అఫ్సర వలీషా (ద్వారపూడి), శ్రీ జి. శ్రీనివాసా చారి (ఖాజీ పేట), శ్రీమతి కట్ల (బాలబోయిన) రమాదేవి తదితరులు. 2018లో నేటి కవిత గ్రూప్ వారు, హన్మకొండలో (శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంధాలయంలో) గ్రూపు సభ్యుల కోసం ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. దానికి వేదికను నేనే స్పాన్సర్ చేసాను. వివిధ ప్రాంతాలనుంచి అనేకమంది కవయిత్రులు, కవులూ వచ్చారు. అందరికీ సన్మానాలు జరిగాయి. అందులో నేనూ ఒక సన్మానితుడ్ని. ఈ గ్రూప్ ద్వారా నేను కవిత్వం రాయడం గురించి చాలా నేర్చుకున్నాను. కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్వయంగా గ్రూపు నుండి వైదొలగడం జరిగింది. కానీ ఈ గ్రూప్ ఇప్పటికీ చక్కని సాహిత్య సేవ చేస్తున్నది. చాలామంది వర్ధమాన కవులు/కవయిత్రుల నుండి, సీనియర్ కవులు సైతం ఇప్పటికీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ‘నేటి కవిత’ను ఈ నాటికీ చక్కగా నడిపిస్తున్న లక్ష్మయ్య గారూ, సేనాధిపతి గారూ అభినందనీయులు.

కొందరు కవయిత్రులతో
కొందరు కవయిత్రులతో
నేటి కవిత.. ముఖ్య సలహాదారు శ్రీ దాస్యం సేనాధిపతి
నేటి కవిత గ్రూప్ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య

నాకు పరిచయం వున్న మరొక పుష్టికరమైన గ్రూపు ‘ప్రియమైన రచయితలు’ (సింహాచలం). దీనికి అడ్మిన్‌లు చాలామంది ఉన్నప్పటికీ ప్రధాన అడ్మిన్ శ్రీ ఇందూ రమణ గారు. ఇందులో చాలా సీనియర్ కవులూ కవయిత్రులూ వున్నారు. ‘నానీలు’ అనే కవితా ప్రక్రియను ఈ గ్రూపు ద్వారానే నేర్చుకున్నాను. అందుకు ఈ గ్రూపుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. శ్రీ ఇందూ రమణ గారు, ‘సాహో’ అనే మాసపత్రికను నిర్వహిస్తూ, ‘ప్రియమైన రచయితలు’ గ్రూపు సభ్యులకు పత్రికలో అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. కొన్ని కారణాలవల్ల ఈ గ్రూపులోకూడా ఎక్కువ కాలం నా సభ్యత్వాన్ని కొనసాగించలేకపోయాను. ఇలాంటి గ్రూపులు మంచి మంచి కవులను తయారుచేస్తాయి. కొన్ని గ్రూపులు సభ్యుల బలహీనతలను తెలుసుకుని వారిని వక్రమార్గంలో నడిపిస్తున్నాయి. వర్ధమాన కవయిత్రులూ/కవులూ, సన్మానాలకూ, ప్రశంసా పత్రాలకూ ఆకర్షితులు కాక, వాటికి ప్రాధాన్యం ఇవ్వక, సాహిత్యపరంగా/కవిత్వం పరంగా ఎదగడానికి ప్రయత్నించాలి. పొగడ్తలను పక్కన పెట్టి, మార్గదర్శనం చేసే పెద్దల విమర్శకు ప్రాధాన్యత నివ్వాలి. అప్పుడే కవి – కవిత్వపరంగా ఎదగగలుగుతాడు. అలాగే, గ్రూపులు లేదా సంస్థలు ప్రతిరోజూ ఎక్కడోచోట కవిసమ్మేళనం పెట్టడంవల్ల ప్రయోజనం ఉండదు. కొంతకాలానికి ‘కవిసమ్మేళనాలు’ అంటేనే రోత పుట్టే పరిస్థితి వస్తుంది.

ప్రియమైన రచయితలు.. గ్రూప్ ప్రధాన అడ్మిన్ శ్రీ ఇందూ రమణ గారు

మంచి కవిత్వం రాసి, పత్రికలలో చోటుచేసుకోవాలి. రేడియో/దూరదర్శన్ లను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన కవిత్వం నలుగురూ చదివేట్టు, వినేట్టు వుండాలి గాని, జనం పారిపోయేట్టు వుండకూడదు. కవులు/కవయిత్రులు సమాజంలో అత్యంత బాధ్యతగల పౌరులని గుర్తుంచుకోవాలి!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here