చైతన్యవంతమైన కథల సమాహారం ‘దత్త కథాలహరి’

0
3

[16 అక్టోబరు 2022న ‘దత్త కథాలహరి’ పుస్తకావిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం.]

[dropcap]శ్రీ [/dropcap]పాణ్యం దత్తశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. పద్య కవితలు, వచన కవితలు, కథలు, నవలలు, కాలమ్స్, విమర్శ.. ఇలా వైవిధ్యభరితంగా సాగుతోంది వారి సాహితీ ప్రస్థానం.

వారు తాము వ్రాసిన 30 కథలతో ‘దత్త కథాలహరి’ అనే సంపుటం ఇటీవల వెలువరించారు. ఈ పుస్తకానికి సుప్రసిద్ధ రచయితలు శ్రీయుతులు సింహప్రసాద్, అట్టాడ అప్పల్నాయుడు, మేడా మస్తాన్ రెడ్ది గార్లు ముందుమాటలు రాశారు. ఇవి సమాజానికి ఉపకరించే కథలని వారి అభిప్రాయం. ఈ కథలను పరిచయం చేసుకుందాం.

తన జీవితంలోనూ, అక్కగారి జీవితంలోనూ జరిగిన సంఘటనల ఆధారంగా రచించిన కథ ‘మా పెద్దక్కయ్య’. 72 సంవత్సరాల వృద్ధురాలు ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా చూసి, కథానాయకుడి పాత్ర ప్రవర్తనకి గీతాసారాన్ని అన్వయించడం అబ్బురంగా అనిపిస్తుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా ఉంటూ జీవితాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే ఆవిడని ఆ రహస్యమేంటని తమ్ముడు అడిగితే – చిన్నప్పుడు చదివిన సాహిత్యమేనంటూ – మంచి సాహిత్యం విలువని చెబుతారు. అలాగే మన సంస్కృతి, సంప్రదాయాలు – మనసుకి నచ్చినట్లు హాయిగా బ్రతకాలనే పాఠం చెప్పాయంటారు. సానుకూల దృక్పథంతో ఉంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ కథ చెబుతుంది.

దేశంలోని రాజకీయ పార్టీలని, నేతలని, ఎన్నికల ప్రక్రియని ఎండగడుతూ ఒక ఉటోపియన్ వాతావరణాన్ని ‘ఎవరూ వద్దూ!’ కథ ప్రదర్శిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ప్రజలు మూకుమ్మడిగా ‘నోటా’కు ఓటు వేసి 540 స్థానాలో ఆధిక్యంలో ఉండేట్లు చేస్తారు. పోటీ చేసిన పార్టీల అభ్యర్థులను కాదని – సమాజంలోని నిస్వార్థ మేధావులు, నిష్కలంక విశ్రాంత ఐ.ఎ.ఎస్. అధికారులు, వివిధ రంగాలలో నిపుణులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. సమిష్టి నిర్ణయాలతో ప్రజా ప్రాలన కొనసాగుతుంది. వ్యవస్థలన్నీ బాగుపడతాయి. యువత సమయం వృథా చేసుకోకుండా – అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం కాకుండా, వాటి హైలైట్స్ మాత్రమే ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చివరలో ఇదంతా సామాన్యరావు కల అని తేల్చేసినా – నిజం కాని కల అని అందరికీ తెలిసినా – నిజమైతే బాగుండు అనిపించే కథ.

ఒకానొక కాలంలో గురువులు శిష్యులను దండించి మరీ మంచి బుద్ధులు నేర్పేవారు. అందునా నిలువెల్లా పాండిత్యం ఉన్న గురువులు బాహ్యంగా అహంకారులుగా, గర్విష్టులుగా కనిపించినప్పటికీ, అంతరంగంలో వారు ఉత్తములు, ఉత్కృష్టులు. విద్యార్థులందరినీ సమదృష్టితో చూసి వారి ఉన్నతిని కాంక్షించిన తమ గురువుగారి సహస్రచంద్ర దర్శన కార్యక్రమానికి హాజరయ్యేందుకు – ఆయన వద్ద చదువుకుని – జీవితంలో స్థిరపడి, పదవీ విరమణానంతరం ఓ కార్పోరేట్ కాలేజీలో పని చేస్తున్న ప్రొఫెసర్ కాశీనాథ్‍కు ఆహ్వానం అందుతుంది. పరుషంగా చెప్పినా, తమ జీవితాలను బాగు చేసిన మాటలను చెప్పారని గురువుగారిని తలచుకుంటూ ఆ సభకి వెడతారు కాశీనాథ్. సభానంతరం గురువుగారింట్లో జరిగిన సంఘటన కాశీనాథ్ దృక్పథాన్ని మారుస్తుంది. ఆసక్తిగా చదివిస్తుంది ‘వ్యక్తిత్వ శిల్పి!’ కథ.

నిరుపేద ముస్లిం కుటుంబపు జీవన వ్యథని అందిస్తుంది ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ కథ. డోన్ పట్టణంలో సున్నం రాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే ఫాతింబీ, షేర్ ఆటో నడుపుకునే ఖాదర్ వలీ భార్యాభర్తలు. ఆర్థికంగా ఎదుగూబొదుగూ లేని సంసారం వారిది. ఉన్నదానిలో సర్దుకుని గుట్టుగా బ్రతకాలనే స్వభావం భార్యదయితే, తిమ్మిని బమ్మి చేసయినా.. ఇంతకు ఇంత డబ్బులు సంపాదించి విలాసంగా బ్రతకాలనే తత్వం భర్తది. సజావుగా సాగిపోతున్న వారి కాపురంలోకి ఓ మాయలేడి ప్రవేశిస్తుంది. భర్తని ప్రలోభపెడుతుంది. ట్రిపుల్ తలాక్ చెల్లదని చట్టం వచ్చిందని తెలిసినా, భర్త మూడు సార్లు ‘తలాక్’ అనేసి భార్యనీ, బిడ్డనీ వదిలేసి వెళ్ళిపోతాడు. క్రుంగిపోయిన ఫాతింబీ, ధైర్యం తెచ్చుకుని, తండ్రి సాయంతో పోలీసు కేసు పెట్టి, భర్తకు శిక్ష పడేలా చేస్తుంది. చివరలో భర్త తన తప్పు తెలుసుకుని మళ్ళీ కలిసి ఉందాం అని ప్రతిపాదించినా, అతని లాంటి మగవాళ్ల తోడు తనకి అవసరం లేదని – బ్రతుకు ఇచ్చిన ధీమాతో చెబుతుంది.

కొన్నేళ్ళ క్రితం వరకు గ్రామాలలో పశువులను పెంచుకుంటూ, వాటి మీద మమకారం పెంచుకుని కుటుంబ సభ్యుల్లా సాకిన మనుషులుండేవారు. మూగ జీవాలని సైతం మనుషులతో సమానంగా ఆదరించిన అద్భుత వ్యక్తులుండేవారు. ‘సహదేవుడు’ అనే కథలో నెరేటర్ కుటుంబంలోని పెంపుడు ఆవు – దూడని కని చనిపోతే – తల్లి శవాన్ని పొలంతో పాటిపెట్టి దూడని అపురూపంగా పెంచుకుంటారు తల్లీ కొడుకులు. పేద కుటుంబమైనా తాము కష్టపడుతూ తమకు వీలైనంత వరకు దూడను జాగ్రత్తగా పెంచుతారు. కాలక్రమంలో కథకుడి తల్లి మరణిస్తుంది. దూడ ఎదిగి ఎద్దుగా మారుతుంది. దాన్ని పోషించలేని నెరేటర్ తన మావయ్య సలహా మేరకు పక్కూరి సంతంలో అమ్మేస్తాడు. అతన్ని విడిచి ఉండలేని ఆ ‘సహదేవుడ’నే ఎద్దు కట్లు తెంచుకుని పరుగెత్తుతూ అతనికి వద్దకు వచ్చేస్తుంది. అతను – కొన్నతనికి డబ్బు తిరిగి ఇచ్చేసి – ఒంటెద్దు బండి కట్టుకుని జీవిక గడుపుతాడు. పశువులకు, మనుషులకు మధ్య ఉండే పరస్పరాధారిత బంధాన్ని వ్యక్తీకరిస్తుందీ కథ.

ఆధునిక ఉద్యోగ జీవితాల్లోని ఒత్తిడులను, కుటుంబ విలువలను, సంతానం పట్ల అమ్మానాన్న బాధ్యతలను, అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను అందంగా చెప్పిన కథ ‘పరధర్మో భయావహః’. కొడుకు-కోడలు, కూతురు-అల్లుడితో కలిసి ఉంటూ, మనవడు – మనవరాళ్ళతో హాయిగా ఆడుకునే మూర్తి గారి మదిలో – ఓ స్నేహితుడి కుటుంబాన్ని చూశాకా – ఓ అపోహ మెదలుతుంది. తమ పిల్లలు తమని ‘for granted’ గా తీసుకుంటున్నారేమోనని. ఆయనలో కల్గిన సంశయాన్ని ఆ మిత్రుడు తొలగిస్తాడు. తమ పిల్లలు తమ పట్ల చూపేది నిజమైన ప్రేమని, దాన్ని ఆస్వాదించాలనీ ఆయన గ్రహిస్తారు. ‘మనం బాలేం, ఎదుటివాళ్లు బావున్నారు’ అని భావించడం – అదీ వాస్తవాలు గ్రహించకుండా – ఎప్పుడూ సరి కాదని ఈ కథ చెబుతుంది.

రైతు ముఖంలో సంతోషం చూడాలంటే ఏం కావాలో చెబుతుంది ‘కర్షకుని హర్షం’ కథ. రాయలసీమ యాసలో సాగుతుంది ఈ కథ. నిమ్మతోటని ప్రాణంగా ప్రేమించే రైతు అంజనప్ప. అతన్నే నమ్ముకున్న సహాయకుడు హనుమంతు. తన నిమ్మతోటకు ఏదో తెలియని చీడ పట్టిందని గ్రహించిన అంజనప్ప ఓ వ్యవసాయాధికారిని వద్దకు వెళ్తే – ఆయన తోటకి వచ్చి చూసి, చెద ఏమిటో నిర్ధారించలేక, బెంగుళూరులోని పరిశోధనాశాలకి నమూనాలు పంపమని చెప్తారు. అంజనప్ప కొడుకు బెంగుళూరు వెళ్ళి ఆ పరీక్షలు చేయిస్తే – భూమి, నీరు మంచివేనని, వారు వేసిన ఆముదం చెక్క ఎరువు ఆ నేలకి తగదని చెప్తారు శాస్త్రవేత్తలు. ఏం చేస్తే తోట బాగుపడుతుందో చెప్తారు. ఆ సలహాలు పాటించిన కొద్ది రోజుల్లోనే తోట కళకళలాడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

హైస్కూలు చదువు అంతగా వంటబట్టని ఓ కొడుకు తల్లిదండ్రుల కోరిక తీర్చాలనే ఆశయంతో కష్టపడి చదివి, ఇంటర్ ఫస్టు క్లాసులో పాసయి, శ్రమించి ఇంజనీర్ అవుతాడు. అయితే జీవన పోరాటంలో అంతా అనుకున్నట్లు సాగదని గ్రహించి సర్దుకుపోవడం ముఖ్యమని తెలుసుకుంటాడు. పరిస్థితులతో పోరాడుతూనే జీవితంలో ఎదగాలని ప్రయత్నిస్తాడు. కఠిన వాస్తవాలు ముందుకు పోనీయవు. తన లానే ఎంబిబిఎస్ చేసిన మిత్రుడిదీ అదే పరిస్థితి అని తెలుసుకుని బాధపడతాడు. ఇంటర్‍లో సి.ఇ.సి. గ్రూపు చదివి, వృత్తి విద్య నేర్చుకుని జీవితంలో స్థిరపడిన మరో మిత్రుడు తారసపడినప్పుడు తమ జీవితాలలోని ‘డొల్లతనం’ అర్థమవుతుంది అతనికి. చేస్తున్న ఉద్యోగం మానుకుని మరో ఉపాధిని చూసుకుని బాగుపడడానికి ప్రయత్నం మొదలుపెడతాడు. ఉద్యోగమంటే ఉపాధి అని జనాలు ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు బాగుపడతారని ‘నల్ల కాలర్’ కథ చెబుతుంది.

నిమ్నకులాలంటే తరతరాలుగా మనుషుల్లో పేరుకుపోయిన తక్కువ భావాన్ని వదిలించుకోలేని అగ్రవర్ణ మహిళా ఉద్యోగి తన పై అధికారిని ఆయన పరోక్షంలో నానా మాటలు అంటుంది. సహజంగా శాంత స్వభావుడైన ఆ అధికారి తన ప్రవర్తనను మార్చుకుని కరకుదనం ప్రదర్శిస్తాడు. ప్రతిభని గుర్తించకుండా కులాల ఆధారంగా మనుషుల పై ముద్రలు వేసే రోజులు ఇంకా పోలేదు అని గుర్తు చేస్తుంది ‘ఒకే ఒక్క మాట’ అనే అనువాద కథ [మూల కథ వివరాలు ఇచి ఉంటే బాగుందేది అని ఓ అనువాదకుడిగా నాకు అనిపించింది].

కర్నూలుకు చెందిన ఓ పేద కుటుంబం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి బయల్దేరుతుంది. టికెట్ తీసుకుని, అతి కష్టం మీద జనరల్ బోగీలోకి ఎక్కి వాష్ బేసిన్ దగ్గర కూర్చుని ప్రయాణం చేస్తారు. అనేక ప్రయాసల కోర్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తిరుమలలో అందరికీ అనుభవయమయ్యే సమస్య వారికీ ఎదురవుతుంది. ఓ మంత్రిగారు దర్శనానికి రావడంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయ పడిన అధికారులు సాధారణ భక్తులను నిర్లక్ష్యం చేస్తారు. అయినా ఆ కుటుంబంలోని మగనికి అనిర్వచనీయమైన ఆనందం, తృప్తీ కలుగుతాయి. అవి ఆ మంత్రికి లభించవని అతనంటాడు భార్యతో. ‘సర్వత్ర సమదర్శినః’ కథ గొప్ప సత్యాన్ని చెబుతుంది.

చనిపోయిన భర్త ఆశయాలను కొనసాగించడానికి రికార్డ్ అసిస్టెంట్ జాబ్ వద్దని కానిస్టేబుల్‍గా చేరిన పద్మ అనే యువతి తన కర్తవ్య నిర్వహణలో విశేషంగా రాణించి రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ నుంచి పతకం అందుకుంటుంది. టివిలో అది చూసి ఆమెను గుర్తించిన – సుధీర్ – తన తల్లితో కలిసి ఆమెను చూడడానికి వెళ్తాడు. అక్కడ ఆమె చెప్పిన మాటలకు సిగ్గుపడతాడు. తండ్రి చనిపోయినప్పుడు తనకి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వద్దనుకుని పోటీ పరీక్షలు రాసి కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్‍గా చేరిన వైనం గుర్తొస్తుంది సుధీర్‍కి. ఏ రంగంలోనైనా స్త్రీలు తక్కువ కాదని చెబుతుంది ‘మీకేం తక్కువ’ కథ.

సరసమైన కథల పోటీలో ఎంపికైన కథ ‘రససిద్ధి’. ఆలూమలగల అనురాగాన్ని బలోపేతం చేసే కథ. ఎవరికి వారు చదువుకుని అనుభూతి చెందాల్సినదే.

మధ్య తరగతి కుటుంబాలలో గృహిణి బాధ్యతలను అర్థం చేసుకోలేని కుటుంబ సభ్యుల ప్రవర్తనకి అద్దం పడుతుంది ‘అష్టావధానం’ కథ. ఇంటి పనులలో భర్తా, పిల్లలు సహకరించకపోగా – తమకు కావల్సినవి చేసి తీరాలని మంకు పట్టుపట్టడం ఇప్పటికీ కొన్ని ఇళ్ళల్లో మనం చూడవచ్చు. ఆ గృహిణి ఉద్యోగిని కూడా అయితే ఆమె చేసేది ‘అష్టావధానమే’. కుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకుంటే ఒక్కరి మీదే మొత్తం భారం పడదని ఈ కథ చెబుతుంది.

తండ్రిని ఎటిఎంలా ఉపయోగించుకున్న ఓ కొడుకు కథనీ; తన తండ్రిని గౌరవించి ఆయన బాటలో నడిచి తెలుగు పండితుడైన ఓ కొడుకు కథని చెబుతుంది ‘జీవత్ తాతపాదుండు’. పిల్లలకి చదువు చెప్పించడంతో పాటుగా, వాళ్ళల్లో స్వార్థం, వ్యక్తివాదం పెరిగిపోకుండా చూడడం కూడా ఎంతో అవసరమని చెబుతుంది ఈ కథ. ‘జీవత్ తాతపాదుండు’ అంటే ‘తండ్రి జీవించి ఉన్నవాడు’ అని అర్థం. మరణం అనేది జీవులకి సహజమే అయినా, తల్లిదండ్రులు మనతో ఉంటే బాగుండు అన్న కోరిక చాలా మందికి ఉంటుంది. నేటి కొడుకులే రేపటి తండ్రులు అనే సత్యాన్ని తెలుపుతుందీ కథ.

పిల్లలలో స్మార్ట్‌ఫోన్ ఎంత వ్యసనంగా మారుతోందో ‘స్మార్ట్ చిల్డ్రన్’ అనే కథ చెబుతుంది. స్మార్ట్ ఫోన్‌కి బానిస అయి, బాల్యంలోనే కంటి చూపుకు ఇబ్బంది తెచ్చుకుంటుంది విద్య అనే పాప. టీచర్ ఆమె ఇబ్బందిని గుర్తించి తల్లిని పిలిపించి చెబితే, తల్లి అర్థం చేసుకోకపోగా, టీచర్‍నే గదమాయిస్తుంది. ఆ పాప సమస్యని వాళ్ళ తాతయ్య పరిష్కరించిన విధానం అందరికీ ఆచరణీయం.

వంట బాగా తెలిసిన పాకశాశన్ పెళ్ళిచూపులకి వెళ్తే అక్కడ జరిగిన ప్రహసనం హాస్యంగా ఉంటుంది. ఆ సంబంధం బాగా నచ్చి ‘పాప’ని పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడ్నించి వారి సంసారంలో సరిగమలు మొదలవుతాయి. పాప చేసిన వంటలకి పేర్లు పెడతాడు, కొన్ని వంటలు ఎలా చేస్తే బాగుంటాయో చెప్పి విసిగిస్తాడు. ఒకసారి వాదోపవాదాలు బాగా పెరిగి విడాకుల కోసం అప్లయి చేస్తారిద్దరూ. జడ్జిగారు కారణం తెలుసుకుని ఇరువురినీ మందలించి, ఆరు నెలలు గడువిస్తారు. ఈ ఆరు నెలలలో ఒకరి విలువని ఒకరు తెలుసుకుంటారా దంపతులు ‘వంటొచ్చిన మొగుడు’ కథలో.

డబ్బు పొదుపు చేసే లక్షణమున్న తండ్రికీ, అమితంగా ధనం వ్యయం చేసే అలవాటున్న కొడుకుల మధ్య జరిగే సంఘర్షణని వెల్లడిస్తుంది ‘మన్నించు నాన్నా’ కథ. ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉండాలంటే ప్రణాళికా బద్ధమైన పొదుపు, మదుపు ఎంత అవసరమో ఈ కథ చెబుతుంది.

‘కథల్లో అలాగే జరుగుతుంది మరి’ అని ఒక వాక్యముంది ‘నీలవంశీ మోహనం’ అనే కథలో. అనేక కథల్లో జరిగినట్టే నాయికానాయకులకి రైల్లో పరిచయం ఏర్పడి దంపతులవడం జరుగుతుంది. అయితే రైల్లో నాయకుడు ఏ పాత తరం రచయిత పుస్తకాన్నో చదువుతున్నట్లు కాకుండా – వర్తమాన సాహితీవేత్త కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘సౌశీల్య ద్రౌపది’ చదువుతున్నట్లు రచయిత రాయడం అభినందనీయం! దాంపత్య బంధానికి అసలైన అర్థం చెబుతుంది నాయిక. ఇది కూడా సరసమైన కథల పోటీలో ఎంపికైన కథే.

సరసమైన పోటీకి ఎంపికైన మరో కథ ‘పూర్వానుభవం’. రాచరికం నేపథ్యంలో అల్లిన కథ ఇది.

పాతకాలపు ఆచారాలలో నేడు సమర్థించలేని, విసర్జించవలసి ఉన్నప్పుడు సమాజానికి ఎదురెళ్ళి అయినా విడనాడాలనీ, లేకపోతే కొన్ని ఆత్మీయానుబంధాలని కోల్పోయే ప్రమాదం ఉంటుందని ‘పూర్వసువాసినీ దర్శనం’  కథ చెబుతుంది.

తనకి నిత్యం ఎదురయ్యే ఇబ్బందులకి, సమస్యలకి రగిలిపోయే ఓ సామాన్యరావు కథ ‘జ్వలితుడు!’ ఎదుటివారిని వీలైనంత దోచుకునే వ్యక్తులు తారసపడి మొత్తం సమాజం కళ్లముందు మెదలుతుంది. ఈ కథని కన్నడంలోకి అనువదించారు శ్రీ కల్లూరి జానకిరామారావు (ఈయనా సంచిక రచయితే).

ప్రతివాళ్లని నెగటివ్ కామెంట్స్ చేసి హర్ట్ చేసే ఓ పెద్దాయనకి 60 ఏళ్ళు నిండుతాయి. కానీ బందువులలో చాలామంది ఆయన షష్టిపూర్తి వేడుకకి వెళ్ళమంటారు. కానీ కొందరు తప్పక హాజరవుతారు. ఆ వేడుకలో ఆయన తానెందుకు నకారాత్మకంగా మాట్లాడుతాడో అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాడు. ‘దోషైక దృక్కు’ కథ ఆలోచింపజేస్తుంది.

‘మాజీ! ముఝే మాఫ్ కీజీయె’ నాటకీయమైన కథ. నగర శివార్లలో ఓ ఇంటికి దొంగతనానికి వచ్చి, ఆ గృహిణిని పాడు చేయాలనుకున్న ఓ దొంగకి ఎదురైన అనుభవాన్ని చెబుతుందీ కథ.

ప్రతీదానికి భార్యని సాధించే ఓ భర్త కథ ‘ఆత్మసఖుడు’. భార్యని మాటలతో హించించే ఆ భర్త – భార్యకి బ్రెస్ట్ కాన్సర్ అని తెలిసాకా – ఆమెతో మసలుకొన్న వైనం కాస్త విస్తుగొలిపినా, చదివిస్తుంది. ప్రేమని ప్రదర్శించడం తనకి రాదన్న భర్త – భార్యకి చేసిన సేవలలోనే తన ప్రేమని చూపిస్తాడు. అవసరమైనప్పుడు మనుషులు తమ స్వభావాలను మార్చుకుంటారని చెప్తుంది ఈ కథ.

చదువు విలువ, ముఖ్యంగా స్త్రీల చదువు విలువని తెలుసుకుంటే సమాజానికి ఎంత మంచిదో ఈ కథ చెబుతుంది. ఆడపిల్ల చదువుకుంటే తన జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్నే వెలుగుల మయం చేయగలదని చెప్పే కథ ‘విజ్ఞాన జ్యోతి’.

వ్యక్తుల లోని మానసిక బలహీనలతో ఆడుకునే వారి గురించి చెప్పిన కథ ‘డేటింగ్ యాప్!’. యువకులైనా, రిటైరయిన వారైనా – ప్రలోభాలకి గురయితే – పతనం తప్పదని హెచ్చరిస్తుందీ కథ.

‘అమ్మా! ఆశ!’ అనేది మరో ఆదర్శవాద కథ. ప్రస్తుత సమాజంలో సాధ్యం కాని, వస్తే బాగుండనని అనిపించే కథ. ఎన్నికలు ముగిసాకా, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పాలక ప్రతిపక్ష పార్టీలు సమన్వయంగా పనిచేయడం, రైతులకు, బలహీన వర్గాలకు నిజంగా ఉపయోగపడే పథకాలు తేవడం, మంచి పలాను అందించడం కథలో కాబట్టి సాధ్యమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజజీవితంలో సాధ్యం కాకపోవచ్చు. అందుకే కథకి ఈ శీర్షిక పెట్టినట్లున్నారు రచయిత.

టీవీలలో జరిగే చర్చావేదికలపై గొప్ప సెటైర్ ‘చూస్తూనే ఉండండి’ కథ. అన్నీ టీవీల్లోనూ ఇదే తంతు! చిన్న కథే అయినా వాస్తవాన్ని కళ్ళముందు ఉంచింది.

‘భోక్తలు’ కథలో చెప్పినది ఆచరణీయం! ఇండ్లలో జరిగే ఆబ్దికాల సందర్భంగా (వర్ధంతుల రోజున) పేదవారికి, నిర్భాగ్యులకి అన్నం పెట్టడం మంచి ఆలోచన. కథలో చెప్పినట్టు అందరు బ్రాహ్మణులు లేకపోయినా, చాలామంది అలాంటి వారేనన్నది చేదు వాస్తవం! మంచి కథ.

నేర్పేవాళ్ళు బాగుంటే సర్కారు బడి అయినా బాగుంటుందనీ; అదే విద్య నేర్పలేని వాళ్ళున్న ఇంగ్లీషు కాన్వెంటయినా నిరుపయోగమనీ ఓ పిల్లవాడు తెలుసుకుని ‘ఈ బడి నాకొద్దు!’ అంటాడు. ఆంగ్ల విద్య పై మోజుతో పిల్లల్ని వేధించే ఎందరో తల్లిదండ్రులని ప్రశ్నిస్తుంది ఈ కథ.

ఈ కథలన్నీ వ్యక్తులలోనూ, సమాజంలోను మార్పును కోరుకుంటాయి. నేటి కాలానికి హితవైన ఆచారాలను కొనసాగిస్తూనే, నప్పని వాటిని విడనాడాలంటాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం; భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి. సరళంగా ఉండి మదిని తాకే కథలివి. చైతన్యం కలిగించే కథలు. హాయిగా చదివించే కథలు. రాయలసీమ మాండలికంలో కొన్ని కథలకు సొబగులు అద్దారు రచయిత. దత్తశర్మగారికి అభినందనలు.

***

దత్త కథాలహరి (కథాసంపుటి)
రచన: పాణ్యం దత్తశర్మ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 200
వెల: ₹ 125/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత 9550214912 నెంబరుకు ₹ 125/- Gpay చేస్తే, పుస్తకం రిజిస్టర్ పోస్టు ద్వారా పంపబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here