నా జీవితంలో లలితా సహస్ర నామ స్తోత్రం-5

0
4

దివ్య స్తోత్ర మణి మాల

[dropcap]నే[/dropcap]ను సాయి మందిరంలో శ్రీ రామారావు గారితో కూర్చుని స్తోత్రాలు పారాయణం చేస్తున్న సమయంలో మేము వివిధ పుస్తకాల నుండి చదువుతున్న స్తోత్రాలు అన్ని ఓ పుస్తకంగా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది నాకు. రామారావు గారిని “గుడి కార్యవర్గం ఓ పుస్తకం వేయొచ్చు కదా?” అని అడిగాను.

ఆయన “అలా వేయరు బాబాకి వచ్చిన సొమ్ము ఆయనకే వినియోగించాలి. వేరే వాటికీ ఉపయోగించకూడదు.” అని అన్నారు.

నేనే ఎందుకు ఈ కార్యానికి పూనుకోకూడదని నాకు అనిపించింది.

అమ్మ దయ ఉంటే తప్పకుండా జరుగుతుంది అనే సంకల్పంతో నేను కొంత ద్రవ్యం కోసం మిల్లులో దరఖాస్తు చేసుకున్నా. నేనంటే ఇష్టం ఉన్న వ్యక్తులకు ఈ విషయం చెప్పి సాయం అర్థించాను. వారు వెంటనే నాకు అడిగిన సొమ్ము పంపారు. మిల్లు నుండి నేను కోరుకున్న ద్రవ్యం అందింది.

పుస్తకంలో స్తోత్రాలు ఓ పట్టికగా తయారు చేసుకుని ఆ స్తోత్రాలు ప్రమాణ గ్రంథాల నుండి వేయడానికి గ్రంథాలు సేకరించి సిద్ధం చేసుకున్నా.

గుడికి రోజు ఉదయం ఆరతికి ‘కామేశ్వరి’ అనే అమ్మాయి వస్తుండేది. ఆ అమ్మాయి నాన్నగారికి ప్రింటింగ్ ప్రెస్ ఉందని చెప్పింది. ఆ అమ్మాయి నాన్నగారితో మాట్లాడితే “తప్పకుండా వేద్దాం” అని అన్నారు. వారి ఇంట్లోనే కంప్యూటర్‌లో వారి అమ్మాయి ‘దుర్గ’ చక్కగా చేస్తుంది అని అన్నారు.

కార్తీక మాసంలో ఓ శుభ దినాన మా పని మొదలు పెట్టాము.

రోజు నాకు వీలు ఉన్నప్పుడు మధ్యాహ్నాలు వారి ఇంటికి వెళ్లి డీటీపీ దగ్గర ఉండి చేయించే వాడిని. అవి ప్రింట్ తీసి శ్రీ రామారావు గారికి చూపించి సవరణలు చేసి మళ్ళీ ఉంచేవాడిని. ఇంచుమించు నెల 15 రోజులు డీటీపీకి పట్టింది.. లలితా సహస్ర నామ స్తోత్రం వేయడానికి నేను మా నాన్నగారి వద్ద ఉన్న శ్రీ మల్లప్రగడ శ్రీ రామారావు గారి పుస్తకం ప్రమాణంగా ఎంచుకున్న.

వారు లలితోపాసకులు. ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. వారి చేత ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ మీద ఉపన్యాసాలు మా ఊరిలో గుడిలో ఇవ్వడానికి మా నాన్నగారు ఏర్పాటు చేశారు. వారు ఉపన్యాసాలు అద్భుతంగా చెప్పారు అని మా నాన్నగారు చెప్పారు. ఉపన్యాసం యజ్ఞఫలంగా లలితా సహస్ర నామ స్తోత్రం చదవడానికి ముందు చదవ వలసిన శ్లోకాలు వారు సూచించినవి ముద్రించి భక్తులకు ఇవ్వడం జరిగింది.

ఆ శ్లోకాలు నా పుస్తకంలో ఉంచాను. పుస్తకం డీటీపీ అయి ముద్రణ అయ్యింది. కవర్ పేజీ, బ్యాక్ పేజీ దగ్గర ఉండి తయారు చేయించాను. పుస్తకంలో మా మిల్లులో తయారు చేయబడిన అత్యంత నాణ్యమైన కాగితం కొని ఉంచడం జరిగింది. కాగితం అమ్మే డీలర్ దగ్గరికి వెళ్లి విషయం చెబితే లాభం లేకుండా వారు తీసుకున్న ధర ఖరీదు నా దగ్గర తీసుకున్నారు.

రచయిత ప్రచురించిన పుస్తకం

అమ్మే అన్నీ అయి చేసింది అనడానికి ఉదాహరణలు పుస్తకం వేయడానికి దారి చూపిన అమ్మాయి పేరు ‘కామేశ్వరి’. డీటీపీ చేసిన అమ్మాయి ‘దుర్గ’. పుస్తకం ముద్రింపబడిన సంస్థ పేరు ‘శారదా ప్రింటింగ్ ప్రెస్’. పుస్తకం కవర్ పేజీలు తయారు చేయడం బైండింగ్ చేయడం చేసిన సంస్థ పేరు ‘శ్రీ లలితాంబిక’.

పుస్తకం పేరు ‘దివ్య స్తోత్ర మణి మాల’గా ఉంచడం జరిగింది.

పుస్తకం మాఘ మాసంలో ఓ గురువారం నాడు సాయి మందిరంలో మందిర నిర్వాహకులు చేతులు మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ఆ రోజు సభకు వచ్చిన గుళ్లో పారాయణం చేసే భక్తులకు పుస్తకం ఉచితంగా ఇవ్వడం జరిగింది.

కొన్ని పుస్తకాలు నాకు ద్రవ్యం సాయం చేసిన వారికీ, కొన్ని మా నాన్నగారికి భక్తులకు పంచమని ఇవ్వడం జరిగింది.

పుస్తకం ధర 35 రూపాయలుగా నిర్ణయం చేసి అడిగిన వారికి స్వంత ఖర్చులతో పుస్తకం పంపడం జరిగింది. ఏ దుకాణంలో అమ్మకానికి ఉంచలేదు. స్థానిక దిన పత్రిక లో ప్రకటన పుస్తకం సమీక్ష ఇవ్వడం జరిగింది.

పుస్తకం కి ముందు మాట శ్రీ దూళిపాళ మహాదేవ మణి గారు పుస్తకం చూడకుండా విషయ సూచిక చూసి ఎంతో సహృదయంతో వ్రాసి ఇచ్చారు.

నా ఉద్యోగంలో దుర్ఘటన:

నాకు ఇంకా 4 ఏళ్ళు పదవీ కాలం ఉండగా నాకు పదోన్నతి జరిగి నేను ఎపుడు పని చేయని యంత్రాల విధి నిర్వహణ అధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది.

అమ్మని నమ్ముకుని ఆ బాధ్యత స్వీకరించి ఎంతో ఓర్పుతో అక్కడ పని చేస్తూ అందరి చేత పనులు చేయిస్తు అక్కడ ఉన్న యంత్రాల్లో లోపాలు, భద్రతగా పని చేయడానికి అవసరం అయిన పనులు పై అధికారులు వెంటబడి పూర్తి చేయిస్తూ ‘పని రాక్షసుడు’ గా పేరు తెచ్చుకున్నా.

అంత బాగుంది ఇక హాయిగా సంతృప్తిగా పదవీ విరమణ చేయొచ్చుఅనే ఆశతో ఉండగా నా పదవీ విరమణకి రెండు సంవత్సరముల ముందు ఓ యంత్రం దగ్గర పని చేస్తూ నేను ‘ఎంతో బాగా పని చేస్తాడు, చేయిస్తాడు’ అని నమ్మి ఆ సంవత్సరం ‘ఉత్తమ భద్రత కార్మికుడు’ అని మార్చ్ భద్రతా ఉత్సవాలలో గుర్తింపు పొందిన కార్మికుడు; సెప్టెంబర్ నెలలో ఓ సోమవారం ఉదయం 9 గంటలకు అతని దేహం యంత్రం లోకి వెళ్లి బయటకు విగత జీవుడు అయి కనురెప్పమూసే కాలంలో బయటకు వచ్చాడు.

అప్పుడు నేను జ్వర పీడితుడనై వైద్యం కోసం వైద్యశాలలో వేచి ఉన్నా. విషయం ఫోన్ ద్వారా తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ వేచి ఉన్న కార్మికులతో మాట్లాడి మిల్లు లోపల ఆ ప్రదేశం దగ్గరకి వచ్చాను.

మిల్లు రక్షణ విభాగం, పోలీస్ వారు విచారణ చేయడం జరిగింది. ఈ సంఘటనకి బాధ్యుల్ని చేస్తూ ఎవరో ఒకరికి పదవీ గండం తప్పదని తేలిపోయింది. ముఖ్యంగా అక్కడ నేనే అధికారిని కనుక నాకు పదవీ గండం ఉంటుంది అని అందరు అనుకున్నారు.

ఇక అమ్మే శరణ్యం అని రెండు వేళల ఆర్తి తో ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ చదవడం చేశాను.

నా పై అధికారిని ఆ సంఘటనకి బాధ్యుడిని చేసి పదవికి రాజీనామా చేసి వెళ్లిపొమ్మని చెప్పారు. నాకు ఆ సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్ కోత విధించారు. అమ్మ కాపాడింది అని ఉద్యోగం చేసుకుంటున్నా.

ఇక ఇంకో ఏడాది నాకు పదవీ విరమణకు సమయం ఉండగా ఆ సంవత్సరం కూడా నాకు రావలసిన ఇంక్రిమెంట్ మళ్ళీ కోత విధించారు. ఇది సహించడం నా వల్ల కాలేదు. ఒక నేరానికి ఒకేసారి శిక్ష రెండు సార్లు వేయడం సబబేనా అని పై అధికారులు అందరిని అడిగాను. ఇది మిల్లు నియమావళి ప్రకారం పై నుంచి వచ్చిన ఉత్తర్వు ప్రకారం తీసుకోబడ్డ చర్య అని చెప్పారు. ఎందుకో ఆ సమాధానం వారి ప్రవర్తన నాకు బాధ కలిగించింది.

నా ఉద్యోగానికి ఇంకా 6 నెలలు వ్యవధి ఉండగా ముందే రాజీనామా చేసి బయటకు వచ్చాను.

నా ఆధ్యాత్మిక గురువు:

నేను ఎక్కువగా అందరి ప్రవచనాలు వింటాను.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాలు ప్రత్యక్షంగా విని ఎంతో ప్రభావితుడనై వారిని నా ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకున్నా. ముఖ్యంగా వారు వారి ప్రవచనం ఆరంభంలో – శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అనే మహా వాక్యాలు సభలో అందరి చేత అనిపించి ప్రవచనం ఆరంభం చేయడం అనే పద్ధతికి ఎంతో ఆకర్షితుడనైయ్యాను.

రాజమండ్రిలో జరిగిన అన్ని ప్రవచనాలకు వీలు అయినన్ని రోజులు వెళ్లి వినడం వారు చెప్పిన విషయాలు ఓ పుస్తకంలో వ్రాసుకోవడం చేసే వాడిని.

నా ఉద్యోగ విరమణ అనంతరం వారి సంకల్పం ‘సంస్కృతి పాఠశాల’ని సాకారం చేయడానికి వారి శిష్యురాలు కుమారి పద్మావతి గారు ఓ వసతి గృహంలో 2019లో ఆరంభం చేయగా అందులో కార్యకర్తగా పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడం, మన పురాణాలు, ఇతిహాసాలలో విషయాలు కథలుగా చెప్పడం చేస్తున్నా. పాఠశాలల విస్తరణలో భాగంగా చరవాణి ద్వారా పరోక్షంగా పాఠాలు వివిధ నగరాల్లో ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి, నిబద్ధత ఉన్న కార్యకర్తలకు పంపుతూ పాఠశాలల వారి సహకారంతో నిర్వహణ చేస్తున్నా. ప్రస్తుతం 8 నగరాల్లో పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి.

40 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలుగా ముందుకు వచ్చిన వారిలో అధిక భాగం విశ్రాంత మహిళలే కావడం ఆ శ్రీ మాత అనుగ్రహంగా భావిస్తాను.

ఈ పాఠశాలలు మరిన్ని శాఖలుగా విస్తరించి ఇంకా అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలల ద్వారా ‘భావి భారత హిందూ ధర్మ పరి రక్షకులు’గా తయారు కావాలి అని నా ఆకాంక్ష.

నా పుస్తకం ‘దివ్య స్తోత్ర మణి మాల’లో లలితా సహస్ర నామ స్తోత్రం చదివే ముందు చదవ వలసిన శ్లోకాలు ఇక్కడ ఇస్తున్నా.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము

(పారాయణకు ముందుగా చదువదగిన శ్లోకాలు)

అకారాది క్షకా రాంతామ్ ఆధ్యామానందరూపిణీమ్,

అఖిలార్ధ ప్రదాం దేవీం నమామి జగదంబికాం//

కామేశ్వరీం పరామీడే కాది హాది స్వరూపిణీం,

మాతృకా వర్ణలిప్తాంగీం

మహా శ్రీ చక్ర మధ్యగాం//

శ్రీ చక్ర రాజనిలయాం శ్రీమన్నగరనాయి కాం,

శ్యామావారాహి సంసేవ్యాం లలితాంబాం నమామ్యహం//

ప్రకాశమానే ప్రథమే ప్రయాణే

ప్రతి ప్రయాణేప్య మృతాయమానమ్

అంతః పదవ్యా మనుసంచరంతీమ్

ఆనందరూపాం లలితాం ప్రపద్యే//

చిత్కళామ్ చిన్మయిం శాన్తాం

చిద్రు పాం పరదేవతాం,

సచ్చిదానంద రూపాం తాం లలితాంబాం నమామ్యహం

యా దేవీ సర్వభూతేషు,

శక్తి రూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై,

పరాశక్యై నమో నమ: |

అనన్యాం ఆదిశక్తిం త్వా మాగమాన్త విహారిణీం,

అండపిండాండ జననీం

 వందే శ్రీ లలితాంబికాం//

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే,

శరణ్యే త్ర్యంబకే దేవి /నారాయణి/ నమోస్తుతే //

లలితా సహస్ర నామ స్తోత్రం చదవడానికి ముందు చదవ వలసిన శ్లోకాలు

================

: దేవీ దశ నామ స్త్రోత్రం :

“గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతీ!

 రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ!!”

(ఈ పది నామాలు ఒకసారి పలికితే లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేసినట్టుగా పెద్దలు చెబుతారు)

===============

ముగింపు

  • అమ్మని ఆర్తితో శ్రద్ధగా కొలిస్తే, స్తోత్ర నామ పారాయణం చేస్తే తప్పకుండా మనకు జీవితంలో కలిగిన కష్టాలు, బాధలు నివారిస్తుంది అనడానికి ఏ సందేహం లేదు ఎందుకంటే ఆవిడ ‘సర్వ బాధా ప్రశమని.’
  • అమ్మని కొలవాలి అన్న – ఆవిడ మనల్ని ఎంచుకుని తన కరుణా రస తరంగాలు మన మీద ప్రసరిస్తేనే మనం ఆవిడని కొలిచే అర్హత పొందగలం.
  • ఎలా కొలవాలి అనేది ఆవిడ గురు రూపంలో ఆవిడ ఆపాదించిన వారు మనకు తటస్థ పడేలా అమ్మ చేస్తుంది. ఎలాగంటే నా జీవితంలో నా 32వ ఏట శ్రీ మతి పద్మ గారు ఓ ముస్లిం దేశంలో నాకు ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ చదవమని చెప్పడం, ఆవిడ నాకు నేర్పి నా చేత చదివించేలా చేసి ఇక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు అన్నింటికీ అమ్మే దిక్కు అనేలా ప్రభావితం చేశారు.
  • ముస్లిం దేశంలో పూజలో ఆసనంగా ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు ఉపయోగించే గుడ్డని నేను నా పూజలో ఆసనంగా వేసుకుని పూజలు చేసిన అమ్మ నన్ను అనుగ్రహించడం, ఇక అదే సంప్రదాయం కొనసాగించాలి అని నేను భారత దేశానికి వచ్చినప్పుడు ఓ కొత్తది కొనుక్కుని వచ్చి 1996 నుండి ఇప్పటికి అది ఆసనంగా (అందులో దర్భాసనం) ఉంచి వాడుతున్నా.
1996 నుండి పూజలో ఆసనంగా వాడుతున్న వస్త్రం
  • దుబాయ్‌లో పూజలో ప్రసాదంగా, దీపారాధన కోసం జెర్సీ ఆవు సంబంధ ఆవు నెయ్యి, ఆవు పాలు వాడినా అమ్మ నన్ను అనుగ్రహించడం.
  • భారతదేశానికి వచ్చిన సాయి మందిరంలో శ్రీ రామారావు గారి రూపంలో నన్ను సామూహిక పారాయణాలు, దేవి నవరాత్రులు పూజలలో పాల్గొనేలా చేయడం ఇదంతా ఆ జగదాంబ కృపే అని భావిస్తాను.
  • నా సంసార జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా ఆ జగదాంబ మమ్మల్ని కలిపి ఉంచింది. మా సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చి దిద్ది వారి ఉద్యోగంలో జీవితంలో స్థిరపడేలా చేస్తూ సదా మా పై తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింప చేస్తూ మమ్మల్ని కాపాడుతుంది చల్లగా చూస్తుంది అని గాఢంగా నమ్ముతాను. ఎందుకంటే నాకు ప్రత్యేక సంకల్పం అమ్మ జ్యోతిష్కుని రూపంలో చెప్పించి అనుదినము నా చేత పలికించుకుంటుంది.

నా జీవితంలో మున్ముందు కూడ అమ్మని యథాశక్తి ఆరాధిస్తూ అమ్మ సేవలో కాలం గడిపేలా అనుగ్రహం ప్రసాదించమని ఆ అమ్మని సవినయంగా, సభక్తికంగా కోరుకుంటూ

ఇలా నా చేత నా అనుభవాలను వెన్నంటి అక్షర బద్ధం చేయించిన ‘శ్రీ లలితా పరా భట్టారిక’ కు శత సహస్ర వందనాలు అర్పిస్తున్నా.

సర్వం శ్రీ మాతృ చరణార విందార్పణ మస్తు.

🙏🙏🙏🙏🙏

లోకా సమస్తా సుఖినో భవంతు

🙏🙏🙏🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here