[dropcap]“మా[/dropcap] అనూ బంగారం లాల పోచుకుంటుoదట.. ఎల్ల గౌను ఏచుకుని, ఆచి పోతుందట…”
అలివేలు రెండేళ్ళ మనుమరాలు అనితతో ముద్దుగా, మురిపెంగా మాటాడుతూ, స్నానం చేయించేందుకు చేంజ్ టేబుల్ పైన పడుకోబెట్టి బట్టలు తీస్తోంది.
అనిత కరుణ కడుపులో పడగానే అలివేలు తన కేరీరుకి, అభిరుచులకు మంగళం పాడేసింది. అమెరికాలో వుంటున్న కూతురు కరుణ కోసం స్వేచ్ఛగా సాఫీగా సాగిపోతున్న తన జీవితానికి స్వస్తి పలికి సప్త సముద్రాలు దాటి వచ్చేసింది.
నెలకు ఎనభై వేల జీతం వచ్చే గజెటెడ్ ర్యాంకు ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చేసింది.
ఎంత సంపాదించినా తనకు వున్న ఒక్కగానొక్క సంతానం కరుణ కోసమే అయినప్పుడు, కరుణకు తన అవసరం వున్నప్పుడు పక్కన లేకపోవటంలో అమ్మగా తన జీవితానికే అర్థం లేదనుకుంది అలివేలు.
కరుణ వేవిళ్ళతో బాధపడుతూ, తిండి సహించక, నీరసిస్తూంటే తను ఇండియాలో సదుపాయంగా ఉద్యోగం చేస్తూ కులాసాగా వుండటానికి అలివేలుకి మనస్కరించ లేదు.
పతి జోడును ఎడబాసిన తనకు ఇక జీవితంలో మిగిలిన తోడు కరుణే కదా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన కరుణ ముందు చూపుతో తల్లిని ఉద్యోగానికి పదవీ విరమణ చేసి రమ్మంది. ఇంకా పదేళ్ళ సర్వీసు వుండగా రాజీనామా చేయటం అలివేలుకి ఇష్టం లేకపోయినా మనసుకి సర్ది చెప్పుకుని రాజీనామా చేసేసింది. పదేళ్ళ తరువాతయినా చేరవలసింది కూతురి దగ్గరకే అయినప్పుడు, ఇప్పుడే కరుణ అవసరాలకు అక్కరకు రావటమే భావ్యమని భావించింది.
కరుణకు పదహారు వారాల స్కాన్ లోనే ఆడపిల్లని తెలిసింది. అది తెలిసిన అలివేలు కాలు నేల మీద ఆగలేదు. తొలి చూలు ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని మురిసి పోతూ పుట్టబోయే మనుమరాలికి వెంటనే మెడలో చిన్ని గొలుసు, చేతులకు చిట్టి కంకణాలు, చెవులకు బుజ్జి బుట్ట లాలుకులు చేయించింది.
కరుణ తరువాత తన ఇంట పుట్టే తొలి పసిబిడ్డ మరి. ఇంకా ప్రపంచంలోకి అడుగు మోపని బంగారు తల్లి ఊహ ఇండియాలో క్షణం నిలబడ నీయలేదు అలివేలుని.
కరుణ గర్భం ఆరు నెలలు నిండే సరికి ఆఫీసులో పెన్షన్ విషయాలు చక్కదిద్దుకుని, మూట ముల్లె సర్దుకుని అలివేలు అమెరికాలో వాలిపోయింది.
వచ్చింది మొదలు కూతురు కావాలన్నది, అల్లుడు గోపీకి నచ్చింది వండి పెడుతూ, ఇంటి పని, వంట పని, తోట పని సర్వం ఒంటి చేత్తో చక్కబెడుతూ తన స్వంత ఇల్లే అనే భావనలో సంతృప్తిగా వుంది.
కరుణకు మూడు నెలల పాటు చూలింత సేవ, ఆ తరువాత బాలింత సేవతో పాటు పసిదాని ఆలనా పాలనలతో ఊపిరి సలపని పని ఒత్తిడిలో క్షణం తీరిక లేకుండా అలివేలు ఎంతో అంకితభావంతో బాధ్యతగా ప్రేమతో మసులుకుంటూ శక్తికి మించి శ్రమ పడింది.
కరుణ అలివేలుకి గ్రీన్ కార్డుకి దరఖాస్తు పెడితే ఎంతో సంతోషించింది.
కరుణ స్నేహితురాళ్ళు పసిపిల్లలను చూడటానికి నానీలను, వంటకు వంటమనిషిని, ఇల్లు శుభ్రపరచటానికి వారం వారం పనివాళ్ళను పెట్టుకుని బోలెడు డబ్బు డాలర్లలో ఖర్చు పెడుతూంటే అలివేలు కూతురికి అన్ని ఖర్చులు మిగల్చటమే కాకుండా ‘ఆడపిల్ల పుట్టింది.. నాలుగు డబ్బులు వెనుక వేసుకోండి’ అని సలహా ఇచ్చేది.
అనిత తప్పటడుగుల నుండి పరుగుల దాకా పెరిగింది. కరుణా గోపీలు ఆఫీసు నుండి అనిత ఆటపాటలు చూసుకోవటానికి సీసీ టీవీ కెమెరాలు పెట్టించుకున్నారు.
అనిత పుట్టాక కరుణ బాగా ఒళ్ళు చేసింది. గోపీ కూడా బీరులు తాగి బాగా పొట్ట పెంచుకున్నాడు. ఇద్దరూ జిమ్‌కి వెళ్ళడానికి బద్ధకించేవారు.
అలివేలు కరుణను ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయమని ప్రోత్సహించేది.
గోపీ ఎవరో స్నేహితుల ద్వారా ఇండియాలో ముంబై నుండి ఒక పర్సనల్ ట్రైనర్‌ని కుదిర్చాడు. జూమ్‌లో వారానికి మూడు క్లాసులు. భార్యాభర్తలిద్దరికీ కలిపి ఫీజు నెలకు ముప్పై వేల రూపాయలు.
ఫ్రీ ట్రయల్ క్లాసు జరగటం, నచ్చటం అయ్యాయి. ఫీజు చెల్లించటానికి భార్యాభర్తలిద్దరూ ముప్పై వేల రూపాయలకు ఎన్ని డాలర్లు పంపాలి, ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలని తర్జనభర్జనలు పడ్డారు. అది విన్న అలివేలు తనకు నెలకు ముప్పై ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తోందని, ప్రతి నెలా ముప్పై వేలు ఇండియాలో వున్న తన అకౌంట్ నుండి పంపించే ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చింది. వెంటనే గోపీ బెనిఫిషియరిగా జిమ్ము మాష్టారి పేరుని అలివేలు అకౌంట్‌కి జోడించి ప్రతి నెలా ఆటో డెబిట్ పెట్టేశాడు.
అలివేలు కరుణా గోపీల జిమ్ము ఫీజులు తను కట్టగలిగినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఫీల్ అయ్యింది.
జిమ్ము మాష్టారు కరుణా గోపీలకు బరువు తగ్గటానికి ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా ప్రత్యేక ఆహారం సూచించాడు. కరుణ ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్, పచ్చ సొన తీసేసిన తెల్ల గుడ్డు ప్యాకెట్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, అవకేడో, బ్రోకిలీ, చికెన్ బ్రెస్ట్, ఫిష్ లాంటివి వారానికి సరిపడా కొని, ఫ్రిజ్జులోనూ, ఆ పక్కనే వున్న ప్యాంట్రీలోనూ స్టాక్ చేసేది.
బరువు తగ్గి అందంగా నాజూకుగా రూపు దిద్దుకుంటున్న కరుణను తృప్తిగా చూసుకుని అలివేలులో అమ్మ మురిసి పోయేది.
ఆ రోజున అలివేలు అనిత బట్టలు విప్పుతూ ఒక చేతి కంకణం లేకపోవటం గమనించింది. గబగబా పాప స్నానం ముగించేసి ఇల్లంతా గాలించింది. శుక్రవారం రోజున బంగారం పోవటం ఆశుభమని బాధపడుతూ అన్ని గదుల్లోనూ, సోఫాల క్రింద, మంచాల క్రింద, పాప క్రిబ్ లోనూ, ప్లే పిన్ లోనూ మొత్తం వెతికింది. ఎక్కడా దొరకక పోయే సరికి కంగారు పడి కరుణకి ఫోను చేసి విషయం చెప్పింది.
రోజూ సాయంత్రం నాలుగు గంటల వేళప్పుడు అలివేలు పాపను త్రోపుడు బండిలో వేసుకుని వాకింగ్‌కి వెళ్తుంది.
కంకణం వాకింగ్‌కి ముందు పోయిందో లేక తరువాత పోయిందో అలివేలుకి తెలియటం లేదు. ముందే పోయుంటే ఇంట్లోనే ఏ మూలో పడి వుంటుంది, తరువాత అయితే త్రోపుడు బండిలో వాకింగ్‌కి పార్కుకి వెళ్ళినప్పుడు ఎక్కడయినా పడిపోయి వుండ వచ్చును. ఎప్పుడు పోయిందీ అలివేలు గమనించలేదు. అలివేలు ఐదింటికి స్నానం చేయించేప్పుడు చేతికి లేదు. అలివేలు చాలా దిగులుపడింది. కరుణ దిగులు పడవద్దని గోపీ వచ్చాక సీసీ టీవీ కెమెరాల్లో చూస్తాడని, పాప ఎక్కడ తీసి పారేసింది తెలుస్తుందని నచ్చచెప్పింది.
అలివేలు క్షణం ఒక యుగంలా గోపీ రాక కోసం ఎదురు చూసింది.
జత కంకణాలు మూడు తులాలు. తరుగు, జిఎస్టీ, మేకింగ్, మొత్తం కలిపి దగ్గర దగ్గర రెండు లక్షల బిల్లు అయ్యింది. పోయిన కంకణం ఖరీదు దాదాపు లక్ష. అలివేలు కంకణం ఇంట్లోనే వుండాలని, దొరికిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంది.
కరుణా గోపీలు వచ్చీ రావటమే మరోసారి ఇల్లంతా జల్లెడ పట్టేశారు. ఇక ఆఖరున కరుణ గోపీని సీసీ టీవీ క్యామ్స్‌లో చెక్ చేయమంది. ఆత్రం పట్టలేని అలివేలు అల్లుడు పక్కనే కూర్చుని అతడి ఫోనులో క్యామ్స్ చూడసాగింది.
క్యామ్స్‌లో చిత్రం చూసి అలివేలు స్థాణువై పోయింది. అందులో లివింగ్ రూం, సోఫాలు, హాలులో పాప ప్లే పిన్.. ఏమీ కనిపించటం లేదు. కేవలం ఫ్రిజ్జు, ప్రక్కనే వున్న ప్యాoట్రీ, ఆ ఎదురుగా వున్న కిచెన్ సింక్ మాత్రమే కనిపిస్తున్నాయి.
అనితను భుజం మీద వేసుకుని మూతి కడగటానికి కిచెన్ సింక్ దగ్గరకు అలివేలు వెళ్ళిన రెండు సందర్భాలలో అనిత చేతికి కంకణం వున్నదీ లేనిదీ జూమ్ చేసి చూసే ప్రయత్నం చేస్తున్నారు కరుణా గోపీలు.
అసలు ఆ స్పాట్‌లో పాప కనిపించే ప్రసక్తే లేదు. మరి కెమెరా అటెందుకు ఫేస్ చేసి పెట్టినట్లు..?
ఆలోచించే కొద్దీ అలివేలు కాళ్ళ కింద భూమి కంపించినట్టయ్యింది.
తన వాళ్ళనుకుని తన సర్వస్వాన్ని ధారపోసిన వాళ్ళ దృష్టిలో తన విలువెంతో, తన బ్రతుకు ఎంత హీనమై పోయిందో తెలిసాక అలివేలును నైరాశ్యం, నిర్లిప్తత, వైరాగ్యం, విరక్తి ఆవహించేసాయి. తన గురించి అంత నీచంగా ఆలోచిస్తున్నారని తెలిసాక ఇంత అవమానాన్ని భరిస్తూ బ్రతకటం ఎలా..?
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎవ్వరికీ చెప్పుకునే విషయం కాదు. అలివేలు మనసు మూగబోయి మౌనమై పోయింది. ఆఖరుకి పేగు బంధం కూడా అవసరార్థ స్వార్థమేనన్న నిజం జీర్ణం కావటం లేదు.
బిడ్డల కోసం తమ ఆకలిని, రుచులను, అభిరుచులను, ఉనికినే మరిచి ప్రేమతో ప్రయాస పడే తల్లుల పైన నిఘా పెట్టే బిడ్డలుంటారా..?
అలివేలుకు ఏమీ ఆలోచించటానికి మనస్కరించ లేదు.
గుండెకి గండి పడి దుఃఖం వెల్లువై పొంగి పొర్లింది.
కాళ్ళ కింద భూమి నిజంగా బ్రద్దలయి తాను అందులో కూరుకుపోతే ఎంత బావుండును.
గబగబా తన బెడ్రూంలోకి వెళ్ళి చెక్కలయిన మనసు ముక్కలను పొదివి పట్టుకుని భోరున ఏడవ సాగింది.
వెనుకే వచ్చిన కరుణ “ఇప్పుడేమయ్యిందని అంత పెట్టున శోకండాలు పెట్టి ఏడుస్తున్నావు” అంది.
అలివేలు నిస్త్రాణంగా చూసింది కూతురి వంక.
ఈ తరం పిల్లలు సున్నితమైన భావాలు అర్ధం కాని యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డారో లేక అసలు సున్నితత్వమే కోల్పోయారో అర్ధం కాలేదు అలివేలుకి.
“నా మనసు ఎంత మమకారపు మబ్బులు పట్టి మసక బారినా పరిస్థితిని అర్ధం చేసుకోలేనంతగా గుడ్డిది కాదమ్మా. అసలు దేని గురించి కెమెరాలు ఆ దిశగా మొహం చేసి వున్నాయో నాకు ఇప్పటికీ అంతు పట్టటం లేదు. ఆలోచించే కొద్దీ మతి పోతోంది. దురుద్దేశమేనని మాత్రం అర్ధం అవుతోంది..”
అలివేలు దుఃఖం అంతకంతకూ ఉధృతం అవుతోంది.
దిక్కు తోచని కరుణ బయటకు వెళ్ళి గోపీని పంపింది.
“అత్తయ్యా, ఇటు చూడండి.. వారం క్రితం కెమెరాలు చూడండి.. అనూ ప్లే పిన్ ను చూపిస్తున్నాయి.. ఒక రోజున అనూ హాలులో ఎక్కడా కనిపించక పోయే సరికి అను ఫ్రిడ్జు దగ్గర వుందేమోనని కెమెరాలు అటు తిప్పి మరిచిపోయాను..”
గోపీ అలివేలు మనస్తాపం తగ్గించేందుకు పక్కనే కూర్చుని మొబైల్‌లో పాత సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఏవేవో చెబుతున్నాడు.
ఇంట్లో నుండి కెమెరా పోజిషన్ స్వయంగా మార్చాల్సిందే తప్ప బయటి నుండి తన మొబైల్లో చేయలేడు. ఇంట్లో వుండగా అనూని ప్రత్యక్షంగా చూస్తూ కెమెరాల పొజిషన్ అమర్చటంలో అర్థం లేదు.
తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అలివేలుకి అర్థం అవుతోంది.
ఉద్వేగంలో అలివేలుకి సెంట్రల్ ఏసీ వున్న గదిలోనూ ఉక్కపోతగా అనిపించింది. శరీరానికి కలిగే ఉక్కపోత కాదది మనసుకి కలుగుతున్న ఊపిరి ఆడనితనం. నలత బారిన మనసు కుదేలవుతున్న భావం.
“గోపీబాబూ, నాకు ఏకాంతం కావాలి. దయచేసి నన్ను కాసేపు వంటరిగా వదిలేయండి.. ప్లీజ్..” మనసు గాభరాని తట్టుకోలేని అలివేలు అల్లుడిని ప్రాధేయపడింది.
గోపీ చిన్నబుచ్చుకుని అలివేలు బెడ్రూములో నుండి వెళ్ళిపోయాడు.
* * *
మరుసటి రెండు రోజులు శని ఆదివారాలు కూతురు అల్లుడు ఇంట్లోనే వున్నారు. అలివేలుకి వాళ్ళ మధ్య తిరగటం కూడా ఇబ్బందిగా అనిపించింది.
అను ‘అమ్మమ్మమ్మ…’ అంటూ వాటేసుకుంటున్నా మనసు రాయి చేసుకుని నిర్వికారంగా వుండి పోయింది. మనశ్శాంతి కోసం ఏవేవో పుస్తకాలు తిరగేసింది.
ఆ రెండు రోజులూ నిద్ర లేవగానే ఆరింటికల్లా అలవాటు లేని వాకింగ్‌కి వెళ్ళి ప్రకృతి ఒడిలో స్వాంతన పొంది తొమ్మిది వరకూ ఇంటికి రాలేదు.
శని ఆదివారాలు కరుణే వంట చేసింది. అలివేలుకి అడిగి అడిగి వడ్డిస్తూ, మౌనంగా వున్న అమ్మతో కరుణ మాట కలిపే ప్రయత్నం చేసింది.
అనూ పసి నవ్వుల్లో అలివేలు కరిగి కరుణిస్తుందని అనూని అమ్మమ్మ దగ్గరకి వెళ్ళమని ప్రేరేపించింది కరుణ.
ఏ సైతాను తల మీదకెక్కి ఆ కెమెరాలను అలా పెట్టించిందో కాని కరుణా గోపీలు పశ్చాత్తాపంతో బాధపడని క్షణం లేదు.
రెండు రోజుల్లో అలివేలు పది లంఖణాలు చేసినట్టు అయిపోయింది. మనోవ్యథతో ఆమెకు తిండి సహించటం లేదు.
తను తన కన్నా కూడా అమితంగా ప్రేమించిన తన కూతురి నుండి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక పోతోంది. ఎంత సర్ది చెప్పుకున్నా మరిచి పోలేక పోతోంది. నిత్యం తన ప్రేమ చమరింతతో తడిపిన ఆ పూల వనం ఇప్పుడు ముళ్ళ కంపలా వుంది అలివేలుకి.
సోమవారం ఉదయం కరుణా గోపీలు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇదివరకు అలివేలు చకచకా ప్రొద్దునే లేచి వంట చేసేసి, ఇద్దరికీ లంచ్ ప్యాక్ చేసేది. అలవాటుగా లేచినా ఆ రోజు మంచం దిగలేదు.
అనూ గొంతు విని లేచి వెళ్ళింది. పాపకి పాలు పట్టి, న్యాపీ మార్చి స్నానం చేయించింది. యథావిధిగా అల్పాహారం చేసి తినిపించింది.
అమ్మమ్మకి ఊరటనిచ్చిన పాప కాసేపటికి మళ్ళీ పడుకుంది.
ప్రేమ పాశం ఒక వైపు.. వైరాగ్యం మరో వైపు..
ప్రేగు బంధం ఒక వైపు.. అనుబంధ విరక్తి మరో వైపు..
మమకారం ఒక వైపు.. నిర్వికారం మరో వైపు..
అలివేలు మనసులో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
కుటుంబ ప్రేమ ఎరలో ఎప్పుడూ చిక్కడి వుండే సాధు జీవి అలివేలు. అలాంటి తను మైనం లాంటి మనసును రాయి చేసుకుని చేతి లోకి ఫోను తీసుకుంది.
గూగుల్ చేసి కొన్ని నంబర్లు రాసుకుంది. రెండు మూడు నంబర్లకు ఫోను కలిపింది. ఇద్దరు ముగ్గురితో మాటాడింది. చాలా ఎంక్వయిరీలు చేసింది. బ్యాగులో నుండి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు తీసుకుంది. కార్డు వివరాలన్నీ ఫోనులో ఇచ్చిన తరువాత తన మెయిల్ చెక్ చేసుకుంది. మెయిల్ అందినట్లు అవతలివారికి చెప్పి ఫోను పెట్టేసింది.
అలివేలు గుండె భారం తేలికయ్యింది.
ఆ సాయంత్రం కరుణా గోపీలు ఆఫీసు నుండి రాగానే అదే రాత్రి పదకొండు గంటల ఫ్లైట్ కి తను ఇండియా వెళ్తున్నట్టు మరో అరగంటలో క్యాబు బుక్ చేయమని గోపీకి చెప్పింది.
“అనూ ఎలా అమ్మా”
ఊహించని సంఘటనకి కరుణ నిలువునా కుప్పకూలి పోయింది.
అమ్మ లేని తన ఇంటిని ఊహించే కొద్దీ భయకంపితురాలయ్యింది కరుణ.
దిమ్మెరపోయిన గోపీ అవాక్కయిపోయాడు.
“పొరపాటు జరిగిపోయిందమ్మా.. ఈ ఒక్క తప్పిదాన్ని మన్నించు.. కనీసం అనూ కోసమైనా నీ నిర్ణయం మార్చుకో..” కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కరుణ ప్రాధేయపడింది.
బయటకు పొంగకుండా శాసించిన కన్నీళ్ళు భయంతో అలివేలు కళ్ళలోనే ఇంకిపోయాయి.
“ఉద్యోగానికి కూడా రాజీనామా చేసావు.. ఇండియాలో ఏం చేస్తావమ్మా.. ప్లీజ్, నన్ను క్షమించమ్మా”
కరుణ అలివేలు కాళ్ళ మీద పడిపోయింది.
కూతురి కన్నీటికి తనలోని అమ్మతనం ఎక్కడ కరిగి పోతుందోనని ఆందోళన పడింది అలివేలు.
కాఠిన్యాన్ని కొంత అరువు తెచ్చుకుని “లేదమ్మా.. నాకు ఇప్పుడు అర్జంటుగా వాతావరణ మార్పు కావాలి. కొంత కాలమాగి మళ్ళీ వస్తానులే..” అంది అభావంగా.
అత్తగారి నిర్ణయానికి తిరుగు లేదని గ్రహించిన గోపీ ఆమె సర్దుకున్న సూట్ కేసులను కారులో పెట్టాడు.
అనూని ఓసారి గుండెలకు హత్తుకుని, నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళి నిర్లిప్తంగా కారులో కూర్చుoది అలివేలు.
* * *
శూన్యంలోకి ఎగురుతున్న విమానంలో శూన్యమైన మనసుతో నిర్వికారంగా అనుకుంది అలివేలు…
“తల్లి ప్రేమ ఎంత అన్-కండిషనల్ అయినా, తమ ఉనికిని కోల్పోయేoత, తమ అస్తిత్వాన్ని సైతం సమాధి చేసుకునేంత వుండకూడదు. బిడ్డలను ఎంత బేషరతుగా ప్రేమించినా, తమ బ్రతుకు కడతేరి పోయే వరకూ తమదంటూ కొంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని వుంచుకోవాలి.. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.”