జననీ జన్మ భూమిశ్చ

0
3

రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

[dropcap]“ఏ[/dropcap]మిటే జానూ! ముఖం అలా వాడిపోయింది, కుంపట్లో మగ్గిన వంకాయలా?” అని ఆదుర్దాగా అడిగింది బామ్మ సుమిత్రమ్మ.

“బామ్మా! చక్కగా చదువుకున్నాను. మంచి వుద్యోగంలో వున్నాను. కాస్తోకూస్తో అందంగానే ఉంటాను. నీ మాటల్లో చెప్పాలంటే ‘నన్ను చూడగానే చిదిమి దీపం పెట్టుకోవచ్చనే ఆలోచన కలుగుతుంది అందరికి’. మరి అలాంటి నాకు తగిన పెళ్ళికొడుకును ఎంచుకునేందుకు ఈ మ్యాట్రిమోనియల్స్ తప్ప గతి లేదా?”

“ఇప్పుడొచ్చిన సంబంధం మా ఇద్దరికి నచ్చింది. అమెరికాలో ఉద్యోగం కాబట్టి లక్షల్లో జీతముంటుంది. కులబేధం లేదు. జాతకాలు కలిశాయి. నీ ఫొటో నచ్చి, మగపెళ్ళివారే ముందుకొచ్చి అడిగారు. పెళ్ళిచూపుల్లో వాళ్ళంతా మర్యాదస్థుల్లాగానే కనిపించారు. ఒక్కసారి నెక్లెస్ రోడ్డులోని ‘కాఫీడే’లో మీ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలని పెళ్ళికొడుకు అడిగాడు. ఈ రోజుల్లో అదేమీ పెద్ద తప్పుకాదుకదా” అంటూ నాన్నగారు నన్ను అతని దగ్గర దింపి రావటంతో, అతనితో మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. అతని మాటలను తలచుకుంటూంటే నాకు చాలా చికాకుగా వుంది” అంటూ బామ్మ దగ్గర తన బాధను వెళ్ళగక్కుతోంది జానకి ఉరఫ్ జాను.

“మీ ఇద్దరి అభిప్రాయాలు కలిశాయా? అని కారులో వచ్చేటప్పుడు మీ నాన్నగారు, నేను కూడా అడిగాం. ఏ విషయం సరిగా చెప్పవు! పెళ్ళిచూపులైన ప్రతిసారి నీకు మా మీద ఇవే చిరాకులు. అసలు నీ ఉద్దేశమేమిటి? కనీసం మీ బామ్మ దగ్గరన్నా నీ అభిప్రాయాన్ని చెప్పవే?” అంది అత్తగారికి కాఫీకప్పును అందిస్తూ జానకి తల్లి సరోజ.

“బామ్మా! అతను నన్ను ఏమడిగాడో చెప్పనా! ‘మీకు పబ్బులకెళ్ళే అలవాటుందా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడైనా మీ స్నేహితులతో లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళారా? వీకెండ్ పార్టీలను చేసుకుంటారా?’ అంటూ ఇంకా ఏమిటేమిటో అడిగాడు”  అని చిన్నబోయిన మోముతో ఆగింది జాను.

“అవ్వా! పెళ్ళికాని పిల్లను పట్టుకుని మొదటి పరిచయంలోనే పబ్లు, బాయ్ ఫ్రెండ్స్, పార్టీలు అని అడుగుతాడా? ఎంతగా బరితెగించారురా ఈ అమెరికా పెళ్ళికొడుకులు?. అయినా శంకరం! నాకు తెలియక అడుగుతాను మన దేశంలో ఎవరూ దొరకలేదురా, ఈపాటి సుగుణాలున్న పెళ్ళికొడుకులు. హాయిగా నీ స్నేహితులలో ఎవరికైనా మగపిల్లలుంటే వారితో మాట్లాడరాదురా?” అంది సుమిత్రమ్మ అప్పుడే అక్కడికివచ్చిన జానకి తండ్రి శంకరంతో.

“అమ్మా! నీ చాదస్తంతో మమ్మల్ని చంపేస్తున్నావు! ఈ కాలం పిల్లలు నా ఇల్లు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం అంటూ ఇక్కడే మాలాగా శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా ఉంటారనుకున్నావా? ఇప్పుడంతా హైటెక్ చదువులు, విదేశాలలో కొలువులు. ఇక్కడకన్నా విదేశాలలో అయితే సంపాదన ఎక్కువని రెక్కలుకట్టుకుని ఎగిరెళ్ళిపోవటం జరుగుతోంది. మన బంధువులలోనే ఎంతమంది అలా వెళ్ళలేదు చెప్పు. అందుకే అమ్మాయికి కూడా అక్కడి సంబంధాలనే చూస్తున్నాను” అన్నాడు శంకరం.

“అత్తయ్యగారూ! నేటి పెళ్ళికొడుకులంతా తమకు కాబోయే భార్యలు పాష్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మనం అసలు జానుని ఈ కాలం పిల్లల్లాగా పెంచలేదు. మీరు మరీ గారంచేసి దాన్ని ఇలా తయారుచేసారు. మన సాంప్రదాయాలంటూ దానికి రామాయణ, మహాభారత, భాగవత కథలను నేర్పించి, శెలవురోజులలో పక్కనే కూర్చోబెట్టుకుని టివిలో ప్రముఖుల ప్రవచనాలను వినిపిస్తూంటే అది ‘ఇరవైలోనే అరవయ్యేళ్ళ’ దానిలా తయారయ్యింది” నిష్టురంగా అంది సరోజ.

“అమ్మా! బామ్మనేమనకు ప్లీజ్! ఏ తల్లిదండ్రులైనా, బామ్మా, అమ్మమ్మలైనా తమ ఆడపిల్లలు హాయిగా పిల్లాపాపలతో తమ కళ్ళముందే సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మీరేమో విదేశీ సంబంధాలను ఏరి కోరి సెలక్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళేమో ‘నేను కాలేజీలో చదివేటప్పుడు ప్రేమలో పడ్డాను. అయితే అది విఫలప్రేమ అనుకో. స్మోక్ చేస్తాను. అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో తిరుగుతాను. ఇవన్నీ నా తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. పెళ్ళికి ముందే ఈ విషయాలు మీకు తెలియాలని చెపుతున్నాను. మీకు కూడా ఏమైనా అలవాట్లుంటే చెప్పండి’ అంటున్నారు” అని ఏడుపు గొంతుతో అంది జాను.

“కలికాలం వచ్చి పడింది. ఏ ఆడపిల్లయినా తనకు రాబోయే భర్త శ్రీరామచంద్రుడుగా ఉండాలని కోరుకుంటుంది గానీ, రావణాసురునిలా అవలక్షణాలున్న వ్యక్తిని ఇష్టపడదుకదా! జాను మనస్ససలే సున్నితం. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి సంబంధాలేవీ దానికి చూడకండి. దాని తలరాత బాగుంది కనుకనే అలాంటి సంబంధాలు వచ్చినా తప్పిపోతున్నాయి.

మా కాలంలో అయితే దగ్గరి బంధువుల్లోనే సంబంధాలను కలుపుకునే వారు. మీ తరం వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళ పేరయ్యలు వచ్చారు. వాళ్ళ ద్వారా ఏ ఊరిలో సంబంధం ఉంటే అక్కడికెళ్ళి నలుగురిని మంచిచెడ్డలను విచారించి సంబంధాన్ని కలుపుకునేవాళ్ళం.

కానీ ‘జాను’కు కలికాలం, కష్టకాలం వచ్చిపడింది. ఆధునికత పెరిగి కంప్యూటర్ బాక్స్‌లో సంబంధాలను చూడవలసిరావటం తప్పని పరిస్థితి అయ్యింది. పైగా ఏ ఒక్కడికన్నా ఒక్కటంటే ఒక్కటన్నా మంచి గుణముంటున్నదా?

చదువు, ఉద్యోగం, డబ్బు, విలాసాలేనా ఆడపిల్లకు కావలసింది?. పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య బంధమేర్పడటమేగానీ ‘నాకు నువ్వు నీకు నేను’ అనే ఒడంబడిక కాదుకదా. అందుకనే నేటి వివాహ బంధాలు మూణ్ణాల ముచ్చటలవుతున్నాయి” అంటూ కొడుకుకు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది సుమిత్రమ్మ.

“అమ్మా! నీకు చాలా బంధువర్గం వుందికదా, నీ ముద్దుల మనవరాలికి ఓ ‘సకలగుణాభిరాముణ్ణి’ వెతికి చూడరాదా? ప్చ్! అన్నింటా పెద్దదానివి. ఈ కంప్యూటర్ కాలాన్ని బట్టి పోవాలని, పెళ్ళయ్యాక భర్తను తనకనువుగా మార్చుకోవాలని ‘జాను’కు హితవు చెప్పక పురాణకాలం నాటి సుద్దులను నూరిపోస్తున్నావు” అని తల్లిని విసుక్కుంటూ అన్నాడు శంకరం.

“నాన్నగారూ! మీరేమి నాకు సంబంధాలు చూడకండి. బామ్మ దీవనలతో మీరన్నట్లుగా ఆ ‘శ్రీరామచంద్రుని’లాంటి భర్తే నాకు దొరుకుతాడు” అంది జాను.

బామ్మ దగ్గర మనవరాలిని వదిలి, భార్యాభర్తలిద్దరు తమగదిలోకి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుని, కూతురి పెళ్ళికోసం ‘వరాన్వేషణ’ మొదలుపెట్టారు. ఇంతలో ఫోన్ మోగింది.

శంకరం రిసీవర్ తీసుకుని “హలో!” అన్నాడు.

“బాబూ! శంకరమేనా మాట్లాడేది? నేను గోపాలరావు మాష్టార్ని” అన్నది అవతలి కంఠం.

తనకు పదవతరగతి వరకు పాఠాలను నేర్పిన గురువుగారి మాట వినబడగానే గురుభక్తి నిండిన గొంతుకతో “మాష్టారూ! సిటీకు ఎప్పుడొచ్చారు? మన రవి ఇంట్లోనే ఉన్నారా? నేను సాయంత్రం వచ్చి కలుస్తాను” అన్నాడు శంకరం.

“కాదులే నాయనా! నేనో పనిమీద ఇక్కడకొచ్చాను. ఆ పని చూసుకుని రవితో కలసి నేనే మీ ఇంటికి వస్తాను. మీ తల్లిగారిని కూడా చూడాలని వుంది” అన్నారు గోపాలరావు మాష్టారు.

“సరే మాష్టారూ! తప్పకుండా రండి. రవికు మా ఇల్లు తెలుసును. మీకోసం ఎదురుచూస్తూంటాను” అంటూ ఫోను పెట్టేసిన శంకరం, మాష్టారి రాక గురించి ఇంట్లో అందరికి చెప్పాడు.

సాయంత్రం ఆరు గంటలయ్యింది. ఇంటి ముందాగిన కారు నుండి దిగిన మాష్టారికి శంకరం ఎదురెళ్ళి స్వాగతం పలికి, సాదరంగా లోపలకు తీసుకు వచ్చాడు.

“ఎన్నాళ్ళకు మాష్టారు మీరు మా ఇంటికి రావటం? ఉద్యోగం వచ్చి నేను మన ఊరువదిలాక, మా ఇంటికెప్పుడురమ్మన్నా మీకు కుదరలేదు” అంటూ తన కుటుంబ సభ్యులను పరిచయం చేసి “అమ్మను తీసుకువస్తాను. ఆమె తన గదిలో ఏవో చదువుకుంటోంది” అని లోపలకు వెళ్ళాడు శంకరం.

తల్లి చేయి పుచ్చుకుని హాల్లోకి తీసుకువస్తూ “అమ్మా! గోపాలరావు మాష్టారు నిన్ను చూడటానికి వచ్చారు” అని చెప్పాడు శంకరం.

ఆమెకు నమస్కరిస్తూ “అమ్మా! చాలా రోజులయ్యింది మిమ్మల్ని చూసి. ఆరోగ్యం ఎలా ఉంది?” అంటూ గోపాలరావుగారు కుశల ప్రశ్నలను వేసారు.

కాఫీలనందిస్తున్న ‘జాను’ను చూస్తూ “శంకరం! అమ్మాయి లక్ష్మీదేవిలా వుంది. ఏం చేస్తోంది?” అని అడిగారు.

“మాష్టారు, అమ్మాయి ‘IIT’లో చదువుకుని ‘విప్రొ’ కంపెనీలో ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్’గా పనిచేస్తోంది. పెళ్ళి ప్రయత్నాలను మొదలుపెట్టాం. ఏఒక్కటీ ముడిపడటంలేదు. బామ్మగారి పెంపకంలో పెరిగిన పిల్లకావటంతో మన సంప్రదాయాలను పుణికి పుచ్చుకుంది. అందువల్ల వచ్చిన వాళ్ళు దీనికి నచ్చటంలేదు. ఆలస్యమవుతూంటే సంబంధాలు కుదరటం చాలా కష్టం అవుతుంది” దిగులుగా అన్నాడు శంకరం.

సుమిత్రమ్మగారు మధ్యలో కల్పించుకుని “బాబూ! గోపాలరావుగారూ! మీరు మావాడికి పుస్తకంలోని పాఠాలను బాగానే నేర్పించారు. కానీ వాడు జీవిత పాఠాలను వంటపట్టించుకోలేదు. సంబంధాలను చూసేటప్పుడు ఆస్తి, హోదా ఉన్నవాళ్ళయితే చాలంటాడు. నేనో పాతకాలం దాన్ని. ఆస్తిపాస్తులతో పాటు సంప్రదాయం నడవడికలను కూడా చూసుకోవాలని చెపుతాను. జాను స్నేహితురాలొకరికి ఓ అమెరికా సంబంధం చూసి పెళ్ళి చేస్తే, ఆ కుర్రాడు పెళ్ళయి నాలుగేళ్ళయినా అమ్మాయిని అమెరికా తీసుకెడతాననే ఊసే ఎత్తటంలేదు. ఇదీ ఈకాలపు పిల్లల్ల తీరు. అయినా అందరికీ ఈ విదేశీ సంబంధాల మోజేమిటో నాకు బోధపడటంలేదు. పిల్లల సంతోషం కన్నా సిరిసంపదలెక్కువా?” ఆవేశంగా అన్నారు.

“ఏరా రవీ! మీ పిన్నత్తగారి అబ్బాయి ‘రఘురాం’ పెళ్ళికి వున్నాడనుకుంటాను. వ్యవసాయ శాస్త్రంలో ‘MTech’ చదివి, గోల్డ్ మెడల్ సాధించి కూడా, గాంధీజీ ప్రభావం తనపై ఎక్కువగా ఉండటంతో గ్రామీణాభివృద్ధే దేశప్రగతికి మార్గర్శకమని నమ్మి, మన మురమ్మళ్ళ గ్రామంలోనే సర్పంచ్‌గా ఊరి అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ప్రజలందరికి తలలో నాలుకలా ఉన్నాడు. శంకరం ఆశించిన ఉన్నత స్థితి, బామ్మగారు కోరుకున్న మంచి గుణాలను అంది పుచ్చుకుని అన్నివిధాలా జానకికి సరితూగుతాడు” అని వరుని వివరాలను వెల్లడిస్తూ, “ఏమ్మా జానకి! మీ బామ్మగారు చెప్పిన గుణగణాలున్న ఈ అబ్బాయిని నీకు భర్తగా చూడమంటావా? ఈ సంబంధమైతే నీవు సిటీకు దూరంగా పల్లెటూరిలో నివసించాలి. నీ అభిప్రాయాన్ని చెప్పు” అని అడిగారు గోపాలరావుగారు.

“మరి ఇంత కాలం మాష్టారిని పిల్ల వివాహ విషయమై కలవకపోవటమేమిటిరా?” అని శంకరంపై చిరుబురులాడుతూ, ‘శుభస్యశీఘ్రం’గా ఆ అబ్బాయి పెళ్ళికుదిరిందో? లేదో? కనుక్కుని మా వాడికి చెప్పండి మాష్టారు” అంది సుమిత్రమ్మ.

“ఎలాగూ జానకి పెళ్ళి త్వరగా జరగాలని మీరు కోరుకుంటున్నారు, కాబట్టి మన మురమళ్ళలో వేంచేసిన ‘శ్రీభద్రకాళీసమేత వీరేశ్వరస్వామి’ వారికి ఓసారి కళ్యాణం చేయించి, ఆ రాత్రికి అక్కడే నిద్ర చేయండి. తల్లిదండ్రులు అలా చేస్తే తమ సంతానానికి వెంటనే ఆ కళ్యాణ శుభఘడియలు వస్తాయన్నది మీకు తెలియని విషయం కాదుకదా” అన్నారు మాష్టారు.

“భేష్! మాష్టారి మాట బంగారు కాసుల మూట” అంటూ “ఇంకేం వచ్చే శని, ఆదివారాలలో మురమళ్ళ ప్రయాణం పెట్టరా!. ఆ రాత్రికి ఊళ్ళోనే ఉంటాం, కాబట్టి పిల్లవాడి తల్లిదండ్రులను కూడా కలుసుకోవచ్చురా శంకరం” అంది సుమిత్రమ్మ.

“లేడికి లేచిందే ప్రయాణం అన్న సామెత అందుకే వచ్చి వుంటుంది. ఆ పల్లెటూరి సంబంధంకొరకై ఎందుకంత వెంపర్లాట?” కాస్త వ్యగ్యం, కోపం మిళితమైన గొంతుతో అంది శంకరం భార్య సరోజ.

మాష్టారికి ఘనంగా అతిథి సత్కారం చేసి వీడ్కోలు పలికాడు శంకరం. ఆ రాత్రి భోజనాల సమయంలో “బామ్మా! అయితే ఈవారానికి పెళ్ళిచూపులు గట్రా వుండవు కదా. ప్రాణానికి హాయిగా ఉంటుంది” అంది జాను.

“ఔనే బంగారు! ఆ వీరభద్రేశ్వరుడు నిన్నేమని దీవించి పంపుతాడో మరి? ఆ స్వామికి కళ్యాణం జరిపించిన ఏడాదిలోగా ఆ దంపతుల ఇంట పెళ్ళిబాజాలు మోగుతాయని ఇప్పటికీ ప్రజల విశ్వాసం. నా కోడలికి ఇలాంటి నమ్మకాలు లేవని నాకు తెలుసు. అందువల్లే నేనెప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఈరోజు మాష్టారు కదిపారు కాబట్టి నా అభిప్రాయాన్ని చెప్పాను” అంది సుమిత్రమ్మ.

శుక్రవారం రాత్రికి బయలుదేరి, మరునాటి ఉదయానికి మురమళ్ళ జేరుకుంది శంకరం కుటుంబం. ముందుగానే చెప్పటంతో వసతి ఏర్పాట్లను చేసారు గోపాలరావు మాష్టారు. పాతకాలం మండువా లోగిలి అది. మాష్టారు వాళ్ళు రెండుగదులను ఖాళీచేసి వీరికి ఇచ్చారు.

పల్లెటూళ్ళలో ‘అతిథులు’ అంటే చాలు, చాలా మర్యాదలు చేస్తారు. అందులో గోదావరి ప్రాంతవాసులు అందుకు పెట్టిందిపేరు.

బామ్మ చెప్పిన విధంగా మంచి పట్టుచీర కట్టుకుంది జాను. పట్టుచీరలో పదహారణాల పల్లెపడుచుగా తయారైన జానును చూసిన సరోజ, కూతురికి తన దిష్టే తగిలేలా వుంది అనుకుంది.

“గుడికి బయలు దేరినట్లుగా వున్నారు. మన పెరటిలోని చేమంతులను జడలో పెట్టుకుని, మందారాలను స్వామి వారికి అలంకరణ కొరకై తీసుకెళ్ళండి” అని చెప్పింది మాష్టారి భార్య జానుతో.

తోటలోకి వెళ్ళిన జాను పూలసజ్జలో ఒక్కో పూవును తెంపి వేస్తోంది. దొడ్డి గుమ్మం వైపు వున్న సందులోకి తొంగి చూసిన జానుకు, మోటారు బైకుపై కూర్చున్న ఓ యువకునితో స్త్రీ కన్నీళ్ళతో ఏదో చెపుతోంది.

అతను “భయపడకు. రేపు పంచాయితీ మీటింగ్‌లో అతనికి సర్ది చెపుతాను నేను” అని ఆమెకు ధైర్యాని కలిగిస్తూ ముందుకు కదలబోయే ముందుగా మాష్టారి ఇంటి గుమ్మంవైపు చూసాడు. అప్పుడే అతనివైపు చూసిన జాను కళ్ళలోకి అతని చూపులు కలిసాయి. జాను కంగారుగా రెప్పలను వాల్చింది.

గుళ్ళో స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ అక్షింతలను ‘జాను’ శిరస్సుపై చల్లుతూ “శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవించారు పూజారిగారు.

ఇంతలో మాష్టారు, తనతోపాటు వచ్చిన రఘురాం తల్లిదండ్రులను శంకరానికి పరిచయం చేసారు. జానకిని చూసిన తొలి పరిచయంలోనే ఆమె అణకువకు, ప్రవర్తనకు మురిసిపోతూ వచ్చిన భార్యాభర్తలు కన్నులతోనే ఆనందాన్ని పంచుకున్నారు.

“గోపాలరావుగారి ద్వారా మీ విషయాలు కొన్ని తెలిసాయి. ఇంతదూరం వచ్చిన మీరు మా అతిథ్యాన్ని కూడా స్వీకరించి వెళ్ళండి” అంటూ శంకరం కుటుంబాన్ని గుడిపక్క సందులోనే ఉన్న తమ ఇంటికి తీసుకెళ్ళారు.

ఇంటి ముందున్న జనాలతో మాట్లాడుతున్న యువకుడు “ఏమిటి పనులు మానేసి ఈవేళప్పుడు ఇక్కడికొచ్చారు?” అని ప్రశ్నిస్తున్నాడు. రఘురాం తండ్రి “అబ్బాయ్! వీళ్ళు మాష్టారికి బాగా కావలసిన వారురా. నీ పనయిపోయాక ఒకసారి నీతో మాట్లాడతారు. లోపలికి రా” అంటూ శంకరాన్ని ఇంటిలోకి తీసుకెళ్ళారు. తాను ఉదయాన చూసిన యువకుడేనా రఘురాం? అనుకుంటూ తత్తరపాడుతూ తండ్రిని అనుసరించింది జాను.

ఇంటిలో కూర్చున్నా బయిట రఘురాం మాటలు జాను చెవులను సోకుతూనే ఉన్నాయి.

“ఏమిటి బాబూ ఈ అన్యాయం? మన ప్రక్క ఊరివారికి మన బోర్లనుండి కాలువల ద్వారా నీళ్ళు పంపటం? ఆ ఊరి సర్పంచ్ గారు గతంలో ఓసారి మనకు నీటివసరం వస్తే మీరెంతగా ప్రాధేయపడినా మన పంటలకు కాలువ నీళ్ళను వదలలేదు. మీరా విషయం మరచిపోయారా? ఇప్పుడు మాత్రం వాళ్ళడగగానే మన నీటిని కరెంట్ ఖర్చుకు కూడా వెరవకుండా మీరిచ్చేస్తానని అంటున్నారు” అని గదమాయిస్తున్నారు.

వాళ్ళని సమాధాన పరుస్తూ రఘురాం, “ఒరే సాంబయ్యా! అదృష్టవశాత్తు మనకు ఎక్కడ తవ్వితే అక్కడ పాతాళ గంగమ్మ పైకి ఉబికివచ్చి మన నీటి అవసరాలను తీరుస్తోంది. మన పక్క ఊరివారికి ఎంత లోతుగా బోర్లను వేసినా చుక్క నీరు కూడా రాదు. కాలువ నీటి పై అధారపడిన వారి వ్యవసాయం, ఆ నీరు రాకపోతే దెబ్బతింటుంది. ప్రతిసారీ వారికి ఈ ఇబ్బంది వస్తూనే ఉంది. ఈ సమయంలో మనం చేయూతనివ్వకపోతే వారికి పెట్టుబడులు కూడా రావు. అందుకే మనం ఇలా ఒకరికొకరం సాయం చేసుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.

మీకో విషయం చెప్పనా? మన గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో, గ్రామ ఆదాయం తగ్గుతుందని తెలిసినా మద్యపాన కేంద్రాలను మూయించివేసి, గ్రామంలో ఎవరైనా మద్యం సేవించినట్లయితే వారిని ఊరినుండి వెలివేస్తానని దండోరా వేయించాను.

మొదట్లో ఈ విషయంపై ఎంత విముఖత వచ్చిందో మీకు తెలియదా? అయితే గత అయిదేళ్ళుగా అమలవుతున్న ఈ మద్యపాన నిషేధం మన గ్రామంలో ఎన్నో సత్ఫలితాలనిచ్చింది. అందుకే మన చుట్టు ప్రక్కల గ్రామాలవారు కూడా దీని అనుసరించటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ సాగునీటి వ్యవహారం కూడా మనందరి బాగుకొరకే అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. మీరు ఆందోళనలు వదిలి మీ పనుల్లోకి వెళ్ళండి” అంటూ వాళ్ళను పంపేసాడు.

అతని ఆశయాలను, ఆలోచనలను అతని మాటలద్వారానే వింటున్న జాను మనసును రఘురాం గెలుచుకున్నాడు.

లోపలికి వచ్చిన రఘురాం అతిథులకు నమస్కారం చెప్పి, కాసేపు కూర్చుని తనకు ఆఫీసులో పనిఉందని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆనందాతిశయంతో అరవిరిసిన కలువమోముతో ఉన్న జానకిని చూస్తూ రఘురాం తల్లి, “అమ్మాయి ఏం చదువుకుంది? ఉద్యోగం చేస్తోందా?” అని సరోజను అడిగింది.

“జానకి ఉద్యోగం చేస్తొంది” అన్న సరోజ సమాధానంతో, “మా రఘురాం ఈ తరం పిల్లల్లా ఆలోచించడు. తన ఇల్లు మాత్రమే బాగుండాలనే తత్వంకాక, తన ఊరువాడ, ప్రజలు బాగుండాలని, తద్వారా దేశం అభివృద్ధి చెందాలని కోరుకునే స్వభావం ఉన్నవాడు. అందుకే కన్నతల్లిని, పుట్టిన ఊరును, తన మాతృభూమిని వదిలి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. నా భావాలను గౌరవించే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని వాళ్ళ నాన్నగారితో చెప్పాడు. మీ సంబంధం విషయం మాష్టారి ద్వారా తెలిసింది. మరి మీ అమ్మాయి మా రాముణ్ణి పెళ్ళాడితే, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వాడి ఆదర్శాలకు, ఆశయాలకు బాసటగా నిలబడగలుగుతుందా?” అని సరోజను అడిగింది.

పక్కనే ఉన్న బామ్మతో జానకి “బామ్మా! నువ్వు ఏ ముహూర్తంలో నాకు రాముడిలాంటి భర్త లభిస్తాడని దీవించావోగాని ఆ దీవెన ఫలించే రోజు దగ్గరలోకి వచ్చింది” అని రఘురాం తల్లికి కూడా వినిపించేలా చెప్పింది. ఆమాటలను విన్న రఘురాం తల్లిదండ్రులు, బామ్మగారు, శంకరంగారు ఆనందపడితే, సరోజ మాత్రం ముభావంగా ఉండిపోయింది.

ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో రఘురాంతో జానకి విషయం అడిగింది తల్లి.

“అమ్మా! ఆ అమ్మయి పట్టణ వాతావరణంలో పుట్టి పెరిగింది. పెళ్ళయితే ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. ఇక్కడ పల్లెటూరిలో వుంటూ, నా పనులకు చేదోడువాదోడుగా ఉండాలి. ఇద్దరం ఒకే మాటగా, బాటగా నడవాలి. ఇక్కడి పరిస్థితులకు తాను ఇమడగలదో? లేదో? అడగమ్మా! వారికి, మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే” అన్నాడు రఘురాం.

“అమ్మా జానకి! అబ్బాయి అభిప్రాయాన్ని విన్నావుగా! నీవేమయినా మా వాణ్ణి అడుగుతావా?” అని రఘురాం తల్లి అడిగింది.

“అవసరం లేదండి. వారి మాటలలో వారి వ్యక్తిత్వం, చేతలలో కుటుంబం పట్ల, దేశంపట్ల వారి బాధ్యత, సేవాతత్వం నాకు అవగతమైనాయి. ఇక మిగిలిన విషయాలను మా నాన్నగారు మాట్లాడతారు” అంటూ అక్కడినుండి పెరటిలోకి నడిచింది జానకి.

అక్కడి తిన్నెపై కూర్చున్న బామ్మతో “నాకు ఉద్యోగం వదిలేయాలన్న చింత లేదు. నా చదువును ఈ ఊళ్ళోని నిరక్షరాస్యతను తరిమి కొట్టటానికి ఉపయోగిస్తాను. రఘురాంగారి ఆశయసాధనకు ఆలంబనగా మారతాను” అని చెప్పింది.

అదే సమయానికి అక్కడకు వచ్చిన రఘురాం “నాకు తోడునీడగా ఉండే అమ్మాయి దొరికింది” అని బామ్మకు నమస్కరించి పనుందని వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు.

ఆవిధంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలా వీరిరువురి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ, అనురాగం అనే ముత్యాలతో, దయ, కరుణ అనే రత్నాలను కలిపి ఆశయాలు, ఆదర్శాలు అనే పగడాలను జతచేర్చిన తలంబ్రాలను ఒకరి పై ఒకరు పోసుకుంటూ దంపతులుగా మారిన ఆ జంటను చూస్తూ ముసిముసి నవ్వులతో “కళ్యాణం చూతము రారండి! మా జానకిరాముల కళ్యాణం చూతము రారండి” అని కూనిరాగాలు పాడుతున్నారు సుమిత్రమ్మగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here